సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 670వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఊదీ మహిమతోనూ, బాబా నామజపంతోనూ త్వరగా తగ్గిన నొప్పి
  2. బాబా మాట సత్యం - ఆయన ఉనికి నిత్యం

బాబా ఊదీ మహిమతోనూ, బాబా నామజపంతోనూ త్వరగా తగ్గిన నొప్పి


హైదరాబాద్ నుండి సాయిభక్తుడు రవి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు రవి. నేను హైదరాబాద్ వాసిని. నేను ఎల్లప్పుడూ బాబా నామజపం చేస్తాను. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఒకరోజు అకస్మాత్తుగా నాకు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఛాతీలో నొప్పి మొదలైంది. అది గుండెనొప్పో లేక గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చిన నొప్పో నాకు అర్థం కాలేదు. నేను బాబాను తలచుకుని మంచినీళ్ళల్లో బాబా ఊదీని కలుపుకుని త్రాగాను. తరువాత బాబా నామజపం చేశాను. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గడానికి జెలుసిల్ కూడా వేసుకున్నాను. “బాబా! మీ దయవల్ల ఈ నొప్పి తగ్గితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన”ని బాబాను ప్రార్థించాను. బాబా చల్లని దయవల్ల కాసేపటికే నొప్పి తగ్గింది. అంతకుముందు ఇలాగే నొప్పి వచ్చినప్పుడు జెలుసిల్ వేసుకున్నా తగ్గేది కాదు. ఇప్పుడు బాబా ఊదీ మహిమతోనూ, బాబా నామజపంతోనూ నొప్పి త్వరగా తగ్గిపోయింది. నాకున్న మిగిలిన ఆరోగ్య సమస్యలు కూడా వీలైనంత త్వరగా తగ్గేలా అనుగ్రహించమని బాబాను మనసారా వేడుకుంటున్నాను. నాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. బాబా దయవలన అవి తీరితే ఆ అనుభవాలు పంచుకోవడానికి మరోసారి మీ ముందుకు వస్తాను. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. 


ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః

బాబా మాట సత్యం - ఆయన ఉనికి నిత్యం


జర్మనీ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:

తోటి భక్తులకు జై సాయినాథ్!

మొదటి అనుభవం:

నేను గత 10 సంవత్సరాలుగా జర్మనీలో నివాసముంటున్నాను. నేను మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు సుమారు 5 సంవత్సరాల పాటు కెరీర్(వృత్తిజీవితం)లో విరామం తీసుకోవలసి వచ్చింది. తరువాత నేను నా కెరీర్ మొదలుపెడదామనుకున్నాను. అయితే డబల్ గ్రాడ్యుయేట్‌గా నాకు మంచి అర్హతలు ఉన్నప్పటికీ 5 సంవత్సరాలలో వచ్చిన సాంకేతిక మరియు వ్యక్తిగత నైపుణ్యాలలో మార్పుల కారణంగా ఉద్యోగం సంపాదించడం నాకొక పెద్ద సవాలుగా కనిపించింది. అందువల్ల నేను నిరాశ చెందినప్పటికీ నా బయోడేటాను ఇంటర్నెట్లో పెట్టాను. కానీ ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. అప్పుడు నేను సాయి సచ్చరిత్ర చదవడం ప్రారంభించాను. అప్పుడు మొదటి అద్భుతం జరిగింది. మరుసటి గురువారం నేను చివరి అధ్యాయాన్ని పూర్తిచేసిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది. అయితే అది తాత్కాలిక (పార్ట్ టైమ్) కాంట్రాక్ట్ ఉద్యోగం. అయినప్పటికీ, నాకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి బాబా ఇచ్చిన అవకాశంగా భావించి నేను చాలా సంతోషించాను. తరువాత నెలలు గడిచినప్పటికీ తాత్కాలిక ఉద్యోగిగానే కొనసాగుతున్నందున, "శాశ్వత ఉద్యోగ అవకాశాన్ని ప్రసాదించమ"ని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకసారి నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో "ఎప్పుడు నాకు శాశ్వత ఉద్యోగం లభిస్తుంది?" అని బాబాను అడిగినపుడు, "నీ తల్లి నీతో ఉన్నప్పుడు నువ్వు అనుకున్న దాంట్లో నీకు విజయం సిద్ధిస్తుంది" అని వచ్చింది. ఆ సమాధానం నాకు ఏమీ అర్థం కాలేదు.

తరువాత నేను నా ఉద్యోగ విధులలో సాధారణంగా కొనసాగుతున్నాను. ఈలోగా నాన్న క్యాన్సర్‌ వ్యాధికి గురై ఎప్పటికప్పుడు అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతుండేవారు. ఆయన మృత్యువుతో చాలా పోరాడిన తరువాత దురదృష్టవశాత్తు కన్నుమూశారు. ఆ తరువాత మా అమ్మ కొన్ని నెలలపాటు మాతో కలిసి ఉండటానికి జర్మనీకి వచ్చింది. ఆమె మా ఇంటికి వచ్చిన మొదటిరోజున నా హెచ్.ఆర్. నుండి 'నాకు శాశ్వత స్థాయి ఉద్యోగం ఇవ్వబోతున్నామ'ని ఇ-మెయిల్ వచ్చింది! నా ఆనందానికి అవధులు లేవు, అప్పుడు నేను బాబా ఇచ్చిన సమాధానాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాను. ఆ విధంగా బాబా తన భక్తులకోసం ప్రణాళికలు కలిగి ఉంటారనీ, భక్తులందరినీ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటారనీ నాకు భరోసా ఇచ్చారు.

ఇటీవలి అనుభవం:

ప్రస్తుతం కోవిడ్ కారణంగా, పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఆఫీస్ వర్క్ చేసుకోవడం పెద్ద సవాలైంది. ఇంట్లో ఎన్నో బాధ్యతలు నెరవేర్చే క్రమంలో ప్రార్థన చేయడానికి లేదా బాబాతో కనెక్ట్ అవ్వడానికి సమయం దొరికేది కాదు. ఆ పరిస్థితి నా మనసుకు ఏ మాత్రం నచ్చేది కాదు. దానికి తోడు బాబా ఉనికిని తెలియజేసే సంకేతాలు కూడా చాలాకాలం పాటు నాకు లభించలేదు. దాంతో బాబాతో అనుబంధాన్ని కోల్పోతున్నానేమోనని భయపడ్డాను. అటువంటి సమయంలో బాబా తన ఉనికిని ఆధునిక పద్ధతిలో చూపించారు. ఒకరోజు నేను నా మేనేజరుతో ఒక సమావేశంలో ఉన్నాను. ఆ సమయంలో నా కూతురు వచ్చి నా ఫోన్‌ అడిగితే ఇచ్చాను. సాధారణంగా తను సెల్ఫ్ వీడియోలు తీసుకోవడానికి మాత్రమే ఫోన్ ఉపయోగిస్తుంది. కానీ ఆరోజు తను వాట్సాప్ తెరిచి నా సోదరుడితో చాట్ చేయడం ప్రారంభించింది. నా సమావేశం ముగిసిన తరువాత నేను తన వద్ద నుండి ఫోన్ తీసుకుని తను ఏమి వ్రాసిందా అని చూస్తూ నా సోదరునితో చేసిన చాటింగు‌లో సాయిబాబా స్టికర్ చూసి ఆశ్చర్యపోయాను. నా కూతురు ఆ స్టిక్కర్‌ను నా సోదరునికి పంపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ స్టికర్ ఎక్కడ నుండి వచ్చిందో నాకు తెలియదు! నేనెప్పుడూ నా ఫోనులో దాన్ని చూడలేదు. అది చూసి నేను, "నువ్వు చింతించకు, నేను నీతోనే ఉన్నాను" అని బాబా నాకు సంకేతం ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. "బాబా మీ ఆధునిక సూచనకు నా ధన్యవాదాలు".

ఓం సాయినాథ్!



8 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Unknown Om sai ram baba gives messages don't worry

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri kapadu thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo