సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 655వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని కృపవలన ఆరోగ్యం
  2. బాబానే బాబుని కాపాడారు

సాయినాథుని కృపవలన ఆరోగ్యం


సాయి భక్తురాలు రూప ఇటీవల బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:


ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సాయి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. ఇటీవల జరిగిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య మా తమ్ముడికి జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. ఈ రోజుల్లో ఇవంటేనే చాలా భయమేస్తోంది. తరువాత తనకు జ్వరం తగ్గిందిగానీ జలుబు, దగ్గు తగ్గలేదు. పైగా దగ్గు చాలా ఎక్కువగా వస్తోంది. అదే తగ్గిపోతుందిలే అని ఒక వారం రోజులు వేచిచూశాము. కానీ దగ్గు తగ్గలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, ‘మా తమ్ముడికి దగ్గు త్వరగా తగ్గిపోయేలా అనుగ్రహించమ’ని వేడుకున్నాను. దగ్గు చాలా ఎక్కువగా వస్తుండటంతో మా తమ్ముడు డాక్టరుకి చూపించుకుందామని హాస్పిటల్‌కి వెళ్ళాడు. డాక్టర్ దగ్గు తగ్గటానికి మందులిచ్చి రెండు రోజులు వాడమన్నారు. మందులు వాడినప్పటికీ దగ్గు తగ్గకపోవటంతో మా తమ్ముడు మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాడు. డాక్టర్ మా తమ్ముడిని ఎక్స్-రే తీయించుకోమన్నారు. దాంతో నాకు చాలా భయమేసి, “బాబా! ఇది మామూలు దగ్గు అయివుండాలి. ఎలాంటి వైరస్ ఉండకూడదు” అని బాబాను వేడుకున్నాను. తరువాత మా తమ్ముడు హాస్పిటల్ నుంచి వచ్చేవరకు నేను ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉన్నాను. ఆ మంత్రాన్ని నేను ‘సాయిసర్వస్వం’ యూట్యూబ్ ఛానల్లో చూశాను. రిపోర్ట్ వచ్చింది. “సమస్యేమీ లేదు, ఇది మామూలు దగ్గే” అని చెప్పారు డాక్టర్.  అది విని మేమంతా చాలా సంతోషించాము. ఇదంతా ఆ సాయినాథుని కృపవల్లనే జరిగిందని నా ప్రగాఢ విశ్వాసం. ఆ సాయినాథుడే మా తమ్ముడిని వైరస్ నుంచి కాపాడారు. “సాయినాథా! నీకు శతకోటి వందనాలు తండ్రీ!”


మరొక అనుభవం:


మా తమ్ముడికి జ్వరం వచ్చినప్పుడే మా అమ్మకి కూడా జ్వరం వచ్చింది. మా అమ్మ యూరాలజీ సమస్యతో బాధపడుతోంది. తనకి జ్వరం రాకుండా జాగ్రత్తలు తీసుకోమని తనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ చెప్పారు. తను ఎదుర్కొంటున్న యూరాలజీ సమస్యకు తోడు జ్వరం వస్తే తనకు ఇన్ఫెక్షన్ ఉన్నట్లని చెప్పారు. ఇప్పుడిలా అమ్మకు జ్వరం రావటంతో నాకు భయమేసి బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఏమిటయ్యా మాకీ పరీక్ష? అమ్మకు త్వరగా జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించు తండ్రీ!” అని వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో అమ్మకు త్వరగానే జ్వరం తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “బాబా! అమ్మకి ఉన్న యూరాలజీ సమస్యను కూడా పరిష్కరించు తండ్రీ! ఆ సమస్య తీరిన తర్వాత ఆ అనుభవాన్ని కూడా నా తోటి సాయిబంధువులతో పంచుకుంటాను. తొందరగా ఆ కోరిక తీర్చు సాయిదేవా! నా అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించు బాబా! తప్పులేమైనా ఉంటే క్షమించు తండ్రీ! అందరినీ రక్షించు బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ!” బాబా ఆశీస్సులతో త్వరలోనే నా అనుభవంతో మరోసారి మీ ముందుకు వస్తాను.


ఓం సాయిరామ్!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబానే బాబుని కాపాడారు


ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మా చిన్నబాబు విషయంలో బాబా చేసిన ఒక మిరాకిల్ గురించి మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. 


నా పేరు అరుణదేవి. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నబాబు LKG లో ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం తనను స్కూల్ నుండి తీసుకుని రావడానికి నేను వెళ్ళాను. బాబుని తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు వేగంగా వస్తున్న ఒక బైక్ బాబుని ఢీ కొట్టి, కొంతదూరం ఈడ్చుకొని వెళ్ళింది. మా బాబు రెండు కాళ్ళ మీద బైక్ ముందు చక్రం ఎక్కింది. బాబు చనిపోయాడనే అనుకున్నాను. కాసేపు నాకు ఏమీ అర్థం కాలేదు. అంతలోనే తేరుకుని వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాను. “బాబా! మీరే మా బాబుని కాపాడాలి” అంటూ ఎంతో ఆర్తిగా బాబాను ప్రార్థించాను. కొంతసేపటికి బాబు స్పృహలోకి వచ్చాడు. బాబుని పరీక్షించిన డాక్టర్, “కంగారుపడాల్సింది ఏమీ లేదు, అంతా నార్మల్‌గానే ఉంది” అని చెప్పారు. బాబు రెండు కాళ్ళ మీద బైక్ ముందు చక్రం ఎక్కడం నేను నా కళ్ళారా చూశాను. బాబు కాళ్ళు విరిగిపోయాయనే అనుకున్నాను. బాబానే మా బాబుని కాపాడారు. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా జీవితంలో నేనెన్నటికీ మర్చిపోలేని సంఘటన ఇది. బాబాకు శతకోటి వందనాలు.



3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo