- గర్భం దాల్చినప్పటినుండి మా పాపపై వర్షిస్తున్న బాబా అనుగ్రహం
- సమయానికి పెన్షన్ డబ్బు అందేలా చేసి ఆదుకున్న బాబా
గర్భం దాల్చినప్పటినుండి మా పాపపై వర్షిస్తున్న బాబా అనుగ్రహం
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రేవతి. 2013 నుండి నేను బాబాకు అంకిత భక్తురాలిగా మారాను. చిన్నప్పటినుండి అందరి దేవుళ్ళతో పాటు బాబాను పూజించినప్పటికీ, పూర్తి సాయిభక్తురాలిగా మారింది మాత్రం 2013లోనే. 2013లో నేను గర్భవతిగా ఉన్నప్పుడు ప్రారంభదశలోనే కొన్ని సమస్యలు వచ్చాయి. డాక్టర్ వద్దకు వెళ్ళి చూపించుకుంటే, “నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ఇంజక్షన్స్ చేయించుకుంటేనే గర్భం నిలుస్తుంది” అన్నారు. మొదటి ఇంజక్షన్ హాస్పిటల్లోనే వేశారు. అది చర్మానికి వేసే ఇంజక్షన్. నొప్పి భరించలేకపోయాను. నా బాధను చూసిన నా భర్త, “ఒక్క ఇంజక్షన్‌కే ఇలా ఉంటే నెలరోజుల పాటు రెండు పూటలా ఇలా ఇంజక్షన్స్ వేస్తే, నువ్వు భరించలేవు. ఎలా జరిగితే అలా జరగనీ, భగవంతునిదే భారం” అన్నారు. నేను బాబా వద్దకు వెళ్ళి, “బాబా! నేను ఇంజక్షన్ వేయించుకోలేను. ఇంజక్షన్ బదులు రెండుపూటలా మీ ఊదీతీర్థాన్ని త్రాగుతాను. మీదే భారం తండ్రీ!” అని చెప్పుకుని, నెలరోజులపాటు రెండుపూటలా బాబా ఊదీ కలిపిన నీళ్ళు త్రాగాను. నెలరోజుల తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టరుకి చూపించుకుంటే, ‘బేబీ నార్మల్‌గా ఉందనీ, ఇక ఆ ఇంజక్షన్ చేయాల్సిన అవసరం లేద’నీ చెప్పారు. ఇదంతా సాయి కృప కాక మరేంటి? నా బాబానే నా బిడ్డను కాపాడారు. అప్పటినుండి డెలివరీ అయ్యేవరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాబా ఊదీ కలిపిన నీళ్ళు త్రాగుతూ ఉండేదాన్ని. మధ్యమధ్యలో నాకు ఆరోగ్య సమస్యలు వచ్చినా బేబీ మాత్రం నార్మల్‌గా ఉందనే రిపోర్టు వచ్చేది.
డాక్టర్ నాకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయినిని. అందువల్ల నేను సెలవుల గురించి భయపడితే బాబా సెలవులు కూడా మంజూరయ్యేలా చేశారు. ఎలక్షన్ డ్యూటీని కూడా రద్దయ్యేలా చేశారు. ఈ విధంగా నేను గర్భవతిగా ఉన్నప్పుడు నాకు ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా వచ్చిన అన్ని సమస్యలనూ బాబా పరిష్కరించారు. డాక్టరు సీజేరియన్ తప్పనిసరని 2014, మే 30, శుక్రవారం చేయడానికి నిశ్చయించారు. అయితే బాబా దయవల్ల ఒకరోజు ముందే మే 29, గురువారంనాడు తెల్లవారుజామూన నొప్పులు మొదలై ఉదయం 9:10కి చక్కటి పాప పుట్టింది. తనకి బాబా పేరు కలిసొచ్చేలా ‘విద్యాసాయిశ్రీ’ అని పేరు పెట్టుకున్నాము. మా పాప కూడా బాబాను బాగా నమ్ముతుంది. తనకు 2 సంవత్సరాల వయస్సున్నప్పుడు మేము మొదటిసారి శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాము. మా పాప టీవీలో ప్రసారమయ్యే ‘సద్గురు సాయి’ సీరియల్ చూసి, “మమ్మీ! మనం శిరిడీ వెళదామా? ద్వారకామాయిలో కూర్చుందామా? ఎప్పుడు వెళ్ళి బాబాని చూద్దాం?” అని అడుగుతుంటుంది. “బాబా పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు శిరిడీ వెళ్ళగలమ”ని తనకు చెప్తాను. పాప పుట్టినప్పటినుండి తనకు ఎక్కిళ్ళు బాగా వస్తుండేవి. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అది చిన్న సమస్యే కదా అని మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకసారి నేను బాబా ముందు కూర్చుని, “బాబా! మా పాప ఎక్కిళ్ళ సమస్య తీరిపోవాల"ని వేడుకున్నాను. అలా నేను వేడుకున్న పదినిమిషాల నుండి బాబా దయవల్ల పాప ఎక్కిళ్ళ సమస్య పూర్తిగా తీరిపోయింది. ఇప్పటివరకు ఆ సమస్య మళ్ళీ రాలేదు. అలాగే మా పాపకి వచ్చిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలని బాబానే పరిష్కరించారు. “ధన్యవాదాలు బాబా! మీ కృప అందరిపై ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను”.
సమయానికి పెన్షన్ డబ్బు అందేలా చేసి ఆదుకున్న బాబా
నేను బాబాకు అంకిత భక్తురాలిని. 2019 నుండి నేను మహాపారాయణలో సభ్యురాలిని. ముందుగా బాబాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తీవ్రమైన ఆర్థిక సమస్యల నుండి బాబా మమ్మల్ని కాపాడారు. ఆ అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. నా భర్త ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి పెన్షన్‌కి సంబంధించి కొన్ని బకాయిలు రావాల్సి ఉన్నాయి. అందుకోసం ఆయన అన్నివిధాలా లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అనుకున్న సమయంలో ఎటువంటి ఫలితమూ కనిపించలేదు. అందుకు కరోనా మహమ్మారి కూడా ఒక కారణం. ఒకప్రక్క మేము ఈ బాధలో ఉంటే, మరోప్రక్క వృత్తిరీత్యా డాక్టరైన మా అమ్మాయి కరోనా మహమ్మారి కారణంగా ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అవి చాలదన్నట్టు మావారు కరోనా బారినపడ్డారు. తరువాత 3 రోజులకి నాకు కూడా కరోనా రావడంతో ఇద్దరమూ హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అసలే పెన్షన్ బకాయలు చేతికందక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మేము హాస్పిటల్ బిల్లులు ఎలా కట్టాలా అని చాలా ఆందోళన చెందాము. బాబా కృపతో మా దగ్గరి బంధువులు మా హాస్పిటల్ బిల్లులు కట్టడానికి ముందుకొచ్చారు.
కానీ, ఎప్పటికప్పుడు ఆఫీసువాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ రావాల్సిన పెన్షన్ బకాయిలు రాకపోవడంతో మావారి మనసంతా దిగులుగా ఉంటుండేది. బాబాకు అంకిత భక్తురాలినైన నేను మాత్రం ఆశ వదులుకోకుండా విశ్వాసంతో బాబాను సదా ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 2020, డిసెంబరు 24, గురువారంనాడు నేను మహాపారాయణలో భాగంగా సచ్చరిత్రలో నాకు కేటాయించిన 28, 29 అధ్యాయాలు పారాయణ చేస్తూ, "బాబా! ఈ క్లిష్ట సమయంలో నేను మిమ్మల్నే గట్టిగా పట్టుకున్నాను. మీరు కూడా నన్ను గట్టిగా పట్టుకోండి. కరోనా కారణంగా ఈ హాస్పిటల్ మంచంపై పడివుండి కూడా నేను మీ పారాయణ చేస్తుండటం మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి మాకు సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా అద్భుతం చేశారు. అదేరోజు మావారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. మధ్యాహ్నం గం.2.30ని.లకి, 'మీకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారమైంద'ని ఆఫీసు నుండి, ‘అకౌంటులో డబ్బు జమ అయింద’ని బ్యాంకు నుండి మావారికి మెసేజ్లు వచ్చాయి. వెంటనే మావారు నాతో, "రావాల్సిన డబ్బంతా నేరుగా బ్యాంకు అకౌంటులో జమ అయ్యింద"ని చెప్పి, అకౌంటు నాకు చూపించారు. ఇంకా ఆయన నాతో, "ఏ చింతా పెట్టుకోకు. ఎప్పటినుండో రావాల్సిన డబ్బంతా మనకి వచ్చేసింది. కాబట్టి నువ్వు డిశ్చార్జ్ అయ్యే సమయానికి నీ హాస్పిటల్ బిల్లు నేను చెల్లించగలను" అని ఆనందంగా చెప్పారు. అంత క్లిష్ట పరిస్థితిలో బాబా ఈ విధంగా మమ్మల్ని ఆదుకున్నారు. బాబాకు కృతజ్ఞతలు తెలపడానికి నా వద్ద పదాలు లేవు. ఇదంతా స్థిరమైన విశ్వాసంతో అవిశ్రాంతంగా నేను బాబాకు చేసిన ప్రార్థనల వల్లనే సాధ్యమైంది.
Jai sairam
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteశ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
622 days
ReplyDeletesairam
Om sai ram
ReplyDeleteOm sai ram baba maku pariksha pettaku ayya thandri rakshinchu kapadu sai
ReplyDelete