- భక్తులకోసం సిద్ధంగా వేచివున్న బాబా
- మనస్ఫూర్తిగా అడిగితే, నెరవేరుస్తారు నా సాయితండ్రి
భక్తులకోసం సిద్ధంగా వేచివున్న బాబా
సాయిరామ్! నా పేరు మాధవి. నేను భువనేశ్వర్ నివాసిని. నేను ఇదివరకు బాబా ప్రసాదించిన చాలా అనుభవాలను మీతో పంచుకున్నాను. 2021, క్రొత్త సంవత్సరం తొలిరోజే బాబా నాకొక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చారు. దాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
మా ఇంటిలో ఒక చిన్న బాబా విగ్రహం ఉంది. ఆ మూర్తికే నేను ప్రతిరోజూ పూజ చేస్తాను. సంబల్పూరులో నాకు తెలిసిన ఒక సాయిభక్తురాలికి ఆ బాబా విగ్రహం ఎంతగానో నచ్చి, "నాకు ఆ బాబా కావాలి" అని ప్రతిరోజూ నన్ను అడుగుతుండేది. ‘నేను పూజించుకునే బాబాని ఎలా ఇస్తాన’ని చెప్పినప్పటికీ తను, "మేడం, నాకు ఆ బాబానే కావాలి" అంటుండేది. తను కొనుక్కోవాలంటే బాబా విగ్రహాలు దొరుకుతాయి. కానీ, తనకు నా చేతుల మీదుగా బాబా కావాలి, అది కూడా మా ఇంటిలోని బాబానే కావాలి. ఎందుకంటే, మా బాబా తనను అంతగా ఆకర్షించారు. తను చాలా మంచి భక్తురాలు. తనకు బాబాపట్ల చాలా ప్రేమ. ఆ ప్రేమను చూసే చివరికి ఒకరోజు నేను తనతో, "సరే, మా ఇంట్లో ఉండే బాబా విగ్రహం నీకు ఇస్తాను. కానీ, శిరిడీ నుంచి క్రొత్త బాబా విగ్రహం నాకు వచ్చేవరకు ఇవ్వను. వచ్చాక మాత్రం తప్పకుండా ఇస్తాను" అని చెప్పాను. అందుకు తను అంగీకరించి, ప్రతి నిత్యం బాబాను త్వరగా రమ్మని ప్రార్థిస్తుండేది. ఇలా రోజులు గడుస్తుండగా 2020, డిసెంబరు 28న భువనేశ్వర్ నుండి నాకు తెలిసిన ఒక కుటుంబం శిరిడీ వెళ్తుంటే, "నాకోసం ఒక బాబా విగ్రహం తెస్తారా?" అని అడిగాను. వాళ్ళు ‘సరే, ప్రయత్నిస్తామ’న్నారు. వాళ్ళు డిసెంబరు 29న శిరిడీ చేరుకున్నారు. మూడురోజులు గడిచినా వాళ్ళనుండి నాకు ఏ ఫోనూ రాలేదు. ఆలోగా సంబల్పూరు భక్తురాలు తన ఆరాటం కొద్దీ, "శిరిడీ వెళ్లినవాళ్ళు బాబా విగ్రహం తీసుకున్నారా?" అని పదేపదే అడుగుతుండేది. నేను తనతో, "ఏమో తెలియదు. బాబా ఇష్టం, ఆయన రాదలుచుకుంటే వస్తారు" అని చెప్పాను.
2021, జనవరి ఒకటి, క్రొత్త సంవత్సరం ప్రారంభమైన తొలిరోజు సాయంత్రం భువనేశ్వర్ నుంచి వెళ్లినవాళ్ళు బాబా దర్శనం చేసుకున్న తరువాత ఒక షాపుకు వెళ్లారు. ఆ షాపతను, "మీకోసం ఒక బాబా విగ్రహం సిద్ధంగా ఉంచాము, తీసుకోండి" అంటూ వాళ్ళను ఆహ్వానించాడు. అది విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెళ్లి చూస్తే, ఆ బాబా మూర్తి ఎంతో అందంగా ఉంది. వెంటనే అతను నాకు వీడియో కాల్ చేసి విషయం చెప్పి, బాబాను చూపించారు. నిజంగానే బాబా ఎంతో బాగున్నారు. వాళ్ళు ఆ బాబాను నాకోసం తీసుకున్నారు.
తరువాత అతని భార్య, "అందరికోసం బాబా విగ్రహం తీసుకుంటారుగానీ మనకోసం మాత్రం ఎప్పుడూ తీసుకోరు. మనకోసం ఒక బాబా విగ్రహం తీసుకోండి" అని అతన్ని అడిగింది. అంతలోనే అతనికొక ఫోన్ వచ్చింది. అతను ఫోన్ లిఫ్ట్ చేస్తే, "మీకోసం మేము ఒక బాబా విగ్రహం సిద్ధంగా ఉంచాము, వచ్చి తీసుకెళ్లండి" అని అవతలివ్యక్తి చెప్పాడట. ఇతను ఆశ్చర్యపోతూనే, "అసలు మీరెవరు? మాకోసం బాబా విగ్రహం సిద్ధంగా ఉండటమేంటి?" అని అడిగాడు. అవతలి వ్యక్తి "నేను ఎవరో మీకు తెలియదుగానీ, నేను మీ ఫోన్ నెంబరు హోటల్లో తీసుకుని మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు సంస్థాన్ 4వ నెంబరు గేటుకి దగ్గరగా ఉండే మా ఇంటికి రండి" అని చెప్పాడు. సరేనని విషయమేంటో తెలుసుకుందామని వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళను వివరాలడిగితే, అతనిలా చెప్పాడు: "మా అమ్మగారు గత 50 సంవత్సరాలుగా సంస్థాన్‌లో పనిచేస్తున్నారు. ఆమె సేవకు గుర్తింపుగా 2018 శతాబ్ది ఉత్సవాలలో ఒక బాబా మూర్తిని సంస్థాన్ వాళ్ళు మా అమ్మకు కానుకగా ఇచ్చారు. అది మీకివ్వాలని అమ్మ చెబితే, మీకు ఫోన్ చేసి రమ్మన్నాను" అని. అది విన్న వీళ్ళు, "అసలు మీరు బాబా విగ్రహాన్ని మాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు?" అని అడిగారు. అందుకు ఆ పెద్దావిడ, "రాత్రంతా బాబా, 'ఈ విగ్రహాన్ని మీకు ఇవ్వమని, నేను అక్కడికి వెళ్తాన'ని చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని పిలిపించమని మా అబ్బాయితో చెప్పాను. అందుకు మా అబ్బాయి, 'ఇన్నాళ్ళ నీ సాయిసేవకు గుర్తింపుగా నీకు ఇచ్చిన విగ్రహాన్ని, పైగా నువ్వు పూజిస్తున్న విగ్రహాన్ని ఇచ్చేస్తావా అమ్మా?' అని అడిగాడు. నేను, 'బాబా ఇవ్వమని, అక్కడికి వెళ్తానని చెప్తున్నారు', అందుకే వాళ్ళకి ఈ బాబాని ఇస్తున్నానని అన్నాను" అని చెప్పారు. అది విన్న వీళ్ళు ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. తరువాత ఆ విగ్రహాన్ని తీసుకుని మరుసటిరోజు భువనేశ్వర్ చేరుకున్నారు.
ఇంటికి చేరుకున్నాక నాకోసం తెచ్చిన బాబా విగ్రహాన్ని నాకు ఇచ్చారు. సంకష్ట చతుర్థి రోజు బాబా నా ఇంటిలో అడుగుపెట్టారు. ఇక నా కష్టాలన్నీ బాబా తీరుస్తారని విశ్వసిస్తున్నాను. ఇకపోతే సంబల్పూరు వాళ్ళు మా ఇంటికి వచ్చి బాబా విగ్రహాన్ని తీసుకొని వెళ్లడానికి మూడురోజుల ముందు ఆ భక్తురాలకి బాబా కలలో కనిపించి, "నేను మీ ఇంటికి వస్తున్నాను" అని చెప్పారు. ఈవిధంగా సంబల్పూరులోని భక్తురాలికి ఇష్టమైన మా ఇంటిలోని బాబా అక్కడికి వెళ్లారు. క్రొత్తది, పెద్దది అయిన మూర్తి రూపంలో బాబా నాకోసం శిరిడీ నుండి వచ్చారు. ఆ బాబాను తెచ్చిన వాళ్లకు బాబా స్వయంగా వచ్చారు. ఎంత లీల చూడండి. అందుకే బాబా లీలలు వర్ణించనలవికానివి.
ఓం సాయిరాం!
శిరిడీ నుండి మా ఇంటికి వచ్చిన బాబా మూర్తి
మనస్ఫూర్తిగా అడిగితే, నెరవేరుస్తారు నా సాయితండ్రి
సాయిభక్తురాలు శ్రీమతి ఉమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకోవాలనుకుంటున్నారు.
ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉమ. నేను బాబా భక్తురాలిని. మేము దుబాయిలో నివసిస్తున్నాము. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో చిన్న అనుభవాన్ని పంచుకుంటాను. మా పెద్ద కొడుకు, కోడలు వాంకోవర్ సిటీలో ఉంటారు. 2021, జనవరి తొలివారాల్లో మా కోడలికి ప్రసవ సమయం ఉందనగా అందుకు కొద్దిరోజుల ముందు ఇండియా నుండి వాళ్ళ అమ్మగారు పుట్టబోయే పాప కోసం బట్టలు, మా కోడలి కోసం చీరలు, పచ్చళ్ళు, కొన్ని తినుబండారాలు కొరియరులో పంపించారు. 2020, డిసెంబరు 29న పార్సెల్ డెలివరీ చేయడానికి కొరియర్ బాయ్ మా కోడలికి ఫోన్ చేశాడు. అయితే, ఏదో కారణం చేత మా కోడలు ఆ సమయంలో ఫోన్ చూసుకోలేదు. తరువాత చూసుకుని తను ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా కోడలు మరోసారి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు, "మీ పార్సెల్ గోడౌన్లో ఉంది, చూస్తామ"ని చెప్పారు. మా కోడలు రోజూ కొరియర్ వాళ్లకు ఫోన్ చేస్తుంటే వాళ్లు అదే సమాధానం చెప్తూ ఉండేవారు. ఇలా 2021, జనవరి 5వ తారీఖు వరకు జరిగింది. ఆరోజు మా కోడలు నాకు ఫోన్ చేసి, "అత్తమ్మా! అమ్మ పంపించిన పార్సెల్ ఇంకా నాకు అందలేదు. అందులో, పుట్టబోయే పాపకోసం బట్టలు, నాకోసం చీరలు పంపింది అమ్మ. నావి లేకున్నా పరవాలేదుగానీ, పాపవి మిస్ అవుతున్నాయని దిగులుగా ఉంది" అని చెప్పి చాలా బాధపడింది. అప్పుడు నేను తనతో, "అలా ఏమీ జరగదు, రేపటికల్లా పార్సెల్ తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఆందోళనచెందకు" అని తనను ఓదార్చాను. తరువాత నా సాయితండ్రిని మనసులో తలచుకుని, "బాబా! ఆ పార్సెల్ ఎక్కడున్నా మాకు అందించవయ్యా. పార్సెల్ మా కోడలికి చేరితే ఈ అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా మీ బిడ్డలందరితో పంచుకుంటాను మేరే బాబా" అని మ్రొక్కుకున్నాను. అదేరోజు రాత్రి మా కోడలు, "అత్తమ్మా, పార్సెల్ వచ్చింద"ని మెసేజ్ పెట్టింది. అది చూసి నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రతి విషయంలోనూ నేను బాబాను తలచుకుని మనస్ఫూర్తిగా అడిగితే నా సాయితండ్రి నెరవేరుస్తున్నారు. "మేరే బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. కృపతో ఎల్లప్పుడూ నాతో ఉండండి. ఏ విషయంలో అయినా మీరే ముందుండి నడిపించండి. మేరే బాబా! నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. మీరే మాకు దిక్కు తండ్రీ!"
ఓం సాయిరామ్!
Baba miracle cheppalinivi antha అద్భుతంగా ఉంటాయి. నా లైఫ్ అంతా కూడా miracles. Epudu konni rojulone inkoka miracle chudali anukuntuna.na leg pain baga vastundhi.
ReplyDeleteOm sairam
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
620 days
ReplyDeletesairam
ఓం సాయి రామ్🙏🙏🙏🙏🙏
ReplyDeleteom sai baba
ReplyDeleteOm sai ram baba nenne manasupoorthiga namukunanu daya chupinchu thandri
ReplyDelete