- సదా బాబా రక్షణలో
సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
గురుమాలామంత్రం:
“ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ
సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ఠ వినాశాయ
సర్వమంత్రచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా”
భావం: పరమపురుషుడును, సమస్త దేవతలను స్వాధీనముగా గలవాడును, సమస్త అమంగళములను పోగొట్టేవాడును, సమస్త మంత్రములను ఖండించెడివాడునగు సద్గురువునకు నమస్కారము. అట్టి పరమపురుషుండవగు ఓ సద్గురూ! నాకు సమస్త లోకములను స్వాధీనము చేయుము.
ఓం సాయీశ్వరాయ నమః. నా పేరు సంధ్య. ముందుగా సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తూ నా అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకుంటాను. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు.
మొదటి అనుభవం:
2021, జనవరి 6వ తేదీ సాయంత్రం మావారు ఒక ప్లేటులో స్నాక్స్ తెచ్చుకుని తింటూ టీవీ చూస్తున్నారు. నేను కూడా తనతో కలిసి టీవీ చూస్తున్నాను. కొన్ని నిమిషాలలో ఊహించనిరీతిలో మావారి చేతినుండి ప్లేట్ క్రింద పడి శబ్దం వచ్చింది. నేను మావారి వైపు చూశాను. ఆయన కుర్చీలోనే స్పృహతప్పి పడివున్నారు. దగ్గరకెళ్ళి చూస్తే తల ప్రక్కకు వాలిపోయివుంది. చేయి కూడా స్పర్శ లేకుండా పడిపోయివుంది. “సాయీ, సాయీ, రక్షించు తండ్రీ!” అని గట్టిగా అరుస్తున్నాను. ‘సాయిరాం, సాయిరాం’ అంటూనే పిల్లలను పిలుస్తున్నాను. పిల్లలు కూడా పరిగెత్తుకుని వచ్చి, బాబా ఊదీని, ఊదీతీర్థాన్ని మావారికి ఇచ్చారు. అందరం కలిసి మావారిని తీసుకెళ్ళి మంచంపై పడుకోబెట్టాము. నేను గురుమాలామంత్రాన్ని జపిస్తూ, “సాయీ! మీరే మాకు దిక్కు. నా భర్తను రక్షించండి” అని ఆర్తిగా బాబాను ప్రార్థిస్తున్నాను. అలా సాయిబాబాను పదేపదే ప్రార్థిస్తూ, బాబా ఊదీని మావారి కుడిచేతికి, తలకి వ్రాస్తూ ఉన్నాను. బాబా దయవల్ల కొద్దిసేపటికి మావారు స్పృహలోకి వచ్చారు. తను స్పృహలోకి రాగానే సాయినామాన్ని పలకమని తనతో చెప్పాను. తను బలవంతంగా సాయినామాన్ని స్మరిస్తూ ఉన్నారు. సాయినామాన్ని స్మరిస్తూ ఉండమని చెప్పి, “బాబా! నాకు మీరే దిక్కు, సర్వం మీరే బాబా!” అంటూ బాబాకు చేతులు జోడించి నమస్కరించి, “మావారికి నయంచేయండి బాబా! ఆయన ఎప్పటిలాగా ఆరోగ్యంగా తిరిగేలా మీ కృప చూపండి తండ్రీ!” అని వేడుకుని, “మీరు మాకు ప్రసాదించిన కృపను, మాపై చూపిన ప్రేమను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు ద్వారా సాటి సాయిబంధువులతో పంచుకుంటాను తండ్రీ!” అని బాబాకు చెప్పుకున్నాను. వెంటనే మవారు చక్కగా లేచి కూర్చుని, “నాకు ఏమైందో తెలియదు, ఏదో మైకం వచ్చినట్లు అయింది” అని చెప్పారు. రెండు గంటల తరువాత మా పిల్లలు, నేను, మావారు కలిసి భోజనం చేశాము. “సాయీ!” అని ప్రార్థించిన వెంటనే బాబా కరుణించి నా భర్తకు ప్రాణభిక్ష పెట్టి నా కుటుంబాన్ని రక్షించారు. “సాయీ! మీకు వేవేల కృతజ్ఞతలు. మీరు లేని మా జీవితాలు శూన్యం. మీ పాదాలు విడువకుండా మీ నామస్మరణతో మా జీవితాలు ప్రశాంతంగా సాగనీ తండ్రీ!” ఓం సాయిరాం!
మరుసటిరోజు నిద్రలేచాక “మీరు రాత్రి సరిగా నిద్రపోయారా?” అని మావారిని అడిగాను. “అవును, బాగా నిద్రపోయాను. రాత్రంతా సాయిబాబా కర్ర పట్టుకుని నా ప్రక్కనే ఉన్నారు. సాయి ఉండగా నాకు భయమెందుకు? సాయే నన్ను రక్షించారు” అని చెప్పారు. ఆ మాట వినగానే ఎంతో ఆనందంగా బాబాకు మనఃపూర్వకంగా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 3 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా సాయినామాన్ని, గురుమాలామంత్రాన్ని జపిస్తూ తనను రక్షించమని మన సద్గురువును వేడుకున్నాను. సాయి మా వెంటే ఉండి మమ్మల్ని ఎన్నో ఆపదల నుండి, సమస్యలనుండి రక్షించి తమ పాదాల వద్దకు తీసుకున్నారు. ఓం సాయీశ్వరాయ నమః.
రెండవ అనుభవం:
నేను కొంతకాలం క్రితం, ‘మహాపారాయణ గ్రూపులో ఎలా చేరాలా?’ అని అనుకునేదాన్ని. నా మనసునెరిగిన బాబా నా కోరికను నెరవేర్చారు. మహాపారాయణ గ్రూపులో (MP-8192NI) ప్రతి గురువారం రెండు అధ్యాయాలు పారాయణ చేసే భాగ్యాన్ని బాబా నాకు ప్రసాదించారు. “బాబా! మీకు శతకోటి ప్రణామాలు”. ఒకరోజు, ‘గురువారం అన్నదానం చేయాల’ని ఆ గ్రూపులో మెసేజ్ పెట్టారు. బాబా గుడికి వెళ్ళి బాబాకు నైవేద్యం సమర్పించి, శక్తికొలదీ అన్నదానం చేయాలనుకున్నాను. కానీ ఈ కరోనా సమయంలో భక్తులు ప్రసాదం తీసుకుంటారో లేదోనని సంకోచించాను. మావారు కూడా, ‘గుడికి ప్రసాదం తీసుకెళ్ళి భక్తులను ఇబ్బందిపెట్టకు’ అని చెప్పారు. “సకల జీవకోటిలో ఏ ప్రాణికి పెట్టినా అన్నదానమే, ఇంటి దగ్గరే భోజనం పెట్టు” అని నాతో చెబుతూ, “ఎవరికి తెలుసు? బాబా ఎవరినైనా పంపించవచ్చు” అన్నారు. సరేనని ఇంట్లోనే బాబాకు పూజ చేసి, మహాపారాయణలో 2 అధ్యాయాలు చదివి, భోజనం చేసే ముందు బయట కొంత ఆహారం పెడదామని బయటకు వచ్చాను. అద్భుతం! ఆశ్చర్యం! ఒక గోమాత మా ఇంటి ముందు నిల్చుని ఉంది. ఆ గోమాతను సాయిమాతగా అనుకొని ప్రార్థించి కొంత ఆహారం విస్తరిలో తీసుకెళ్ళి పెట్టాను. అంతలో ఒక దూడ కూడా వచ్చింది. ఆవు, ఆవుదూడ కలిసి భోజనాన్ని ఆరగించాయి. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. “ఎవరికి తెలుసు, బాబా ఎవరినైనా పంపించవచ్చు” అని మావారు అన్నమాట గుర్తొచ్చి సాయికి ఆనందంతో మనఃపూర్వకంగా నమస్కరించాను. మా ఇంటిముందుకు గోమాత రావడం అదే మొదటిసారి. ఆ గోమాత ఆరెంజ్ (ఎరుపు) రంగులో అందంగానూ, తన బిడ్డ చక్కని తెలుపురంగులోనూ ఆరోగ్యంగా, దృఢంగా, పుష్టిగా ఉన్నాయి. అలాంటి గోమాతను మా ఇంటిముందు చూడటం అదే మొదటిసారి. “భక్తుల మనసునెరిగిన బాబా! మీకు సాష్టాంగ దండప్రణామాలు తండ్రీ, సాయీశ్వరా!”
మరో అనుభవం:
2020, అక్టోబరు 1వ తేదీ గురువారం, పూర్ణిమరోజున నేను నవగురువారవ్రతం ప్రారంభించాను. డిసెంబరు 17వ తారీఖున నవగురువారవ్రతం ఉద్యాపన చేశాను. బాబా గుడికి వెళ్ళి, సాయి దయతో అయిదుగురికి నవగురువార పుస్తక ప్రసాదంతో తాంబూలం ఇచ్చి, శక్తికొలదీ అయిదుగురు బీదలకు అన్నదానం చేయగలిగాను. ఆరోజు రాత్రి 7 గంటల సమయంలో మావారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. నేను సాయిని ప్రార్థించి, “ఏమిటి తండ్రీ, ఎప్పుడూ ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా ఎందుకిలా జరుగుతోంది? మాపై దయవుంచండి బాబా! మావారు శ్వాస చక్కగా తీసుకునేలా చేయండి బాబా! మాకు మీరు తప్ప దిక్కెవరు?” అని ప్రార్థించి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే నామాన్ని స్మరిస్తూ బాబా ఊదీని, ఊదీ తీర్థాన్ని మావారికి ఇచ్చాను. బాబా అనుగ్రహంతో కొద్ది క్షణాల్లోనే ఆయన మామూలుగా శ్వాస తీసుకోగలిగారు. తను శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న సమయంలో నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. సదా బాబా తమ రక్షణలో మా కుటుంబాన్ని ఉంచారు. మేము అనుభవిస్తున్న ఈ జీవితం బాబా భిక్ష. ఆయన కృపతోనే జీవిస్తున్నాము. గతంలో మమ్మల్ని ఎన్నో సమస్యలనుండి రక్షించి తమ పాదాల వద్ద మాకు చోటిచ్చారు బాబా. “బాబా సాయీ! దయగల తండ్రీ! మీరే మాకు దిక్కు. నేను మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే. మమ్మల్ని ఈ భూమి మీదకు తీసుకొచ్చావు, ఏదో ఒకరోజు తీసుకెళ్తావు. ఈ మధ్యలో జరిగే జీవితమనే సంసార నౌకను సులువుగా దాటించు తండ్రీ! మీదే భారం సాయీశ్వరా!” ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి. సద్గురు చరణం భవభయ హరణం.
మరో చిన్ని అనుభవం:
“నేను పంచుకునే అనుభవాలు అదనంగా వ్రాస్తున్నానా? ఎక్కువ వ్రాసి భక్తులను ఇబ్బందిపెడుతున్నానా?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మావారు కూడా, “అనుభవాన్ని వీలైనంత చిన్నదిగా వ్రాయి” అని చెబుతుంటారు. అంతేకాదు, ఒకసారి నా అనుభవాన్ని బ్లాగులో ప్రచురించినప్పుడు ఒక సాయిబంధువు బ్లాగులోని కామెంట్ సెక్షన్లో, “మీరు అనుభవాన్ని కొంత కుదించి వ్రాస్తే బాగుంటుంది, ఇది కేవలం ఒక సలహా మాత్రమే” అని చెప్పారు. బాబా ప్రసాదించిన లీలలను (అనుభవాలను) వ్రాస్తున్నప్పుడు భావోద్వేగంతో, ఆనందాశ్రువులతో, వేవేల కృతజ్ఞతలతో బాబా మనపై చూపిన ప్రేమను వ్యక్తపరుస్తాము. ఒక్కోసారి ‘అనుభవం వ్రాస్తున్నామా? లేక బాబాతో మాట్లాడుతున్నామా?’ అనే భావన కలుగుతుంది. మనకు తెలియకుండానే బాబాతో మాట్లాడుతూఉంటాము. ఆయన ప్రేమను వర్ణిస్తూ, కష్టసమయంలో తండ్రివలె, తల్లివలె ఆదరించిన ఆయన ప్రేమకు మన ‘అహంకారం’ తొలగిపోయి, ‘సర్వం సాయే’ అనే ధ్యాసలో మనసు నిలిచిపోతుంది. “నీ అహంకారాన్ని నా పాదాల దగ్గర ఉంచు, నా చరిత్ర నేనే వ్రాసుకుంటాను” అని సచ్చరిత్ర రచన ప్రారంభించే ముందు హేమాద్పంతుతో బాబా అంటారు కదా! ఒకసారి నేను అదనంగా వ్రాసిన ‘సాయి కష్టనివారణస్తోత్రం’ మరో సాయిబంధువుకు ఉపయోగపడింది. ఆ సాయిబంధువు కూడా, “కష్టనివారణస్తోత్రం గురించి వెతికే సమయంలో సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో మొదటి అనుభవంలోనే ‘సాయి కష్టనివారణస్తోత్రం’ పబ్లిష్ అయింద”నే తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ కష్టనివారణస్తోత్రం నా చేత బాబానే వ్రాయించడం మరో సాయిబంధువు కోసమేనని తెలియజేయడం ద్వారా, అనుభవాలను వ్రాసేది నేను కాననీ, నా మనసునెరిగిన బాబా తమ లీలలను తామే వ్రాయించుకుంటున్నారని మరోసారి ఋజువైంది. ఇప్పుడు కూడా గురుమాలామంత్రాన్ని అక్షరదోషాలు లేకుండా వ్రాయాలని భావించి ‘గురుగీత’ గ్రంథంలో ఆ మంత్రాన్ని చూద్దామని ఆ గ్రంథాన్ని తెరిచాను. గ్రంథాన్ని తెరిచే సమయంలో, “ఆ మంత్రం ఏ పేజీలో ఉందో, ఎక్కడ వెతకాలో” అనుకుంటూ ఉండగా గురుగీత తెరవగానే గురుమాలామంత్రం ఉన్న పేజీనే తెరుచుకుంది. అంతా బాబా లీల, బాబా దయ. మనం నిమిత్తమాత్రులం. “దయగల తండ్రీ! నా అనుభవాలను చక్కగా వ్రాసే శక్తిని దయతో, కరుణతో నాకు ప్రసాదించండి సాయీశ్వరా!”
సద్గురు చరణం భవభయ హరణం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఓం శ్రీ సాయినాధాయ నమః. గురుమాలా మంత్రం సాయి అనుగ్రహం వల్ల మాకు మీ ద్వారా లభించటం సంతోషం సంధ్య గారు🙏🙏
ReplyDelete🙏💐🙏నమో సాయినాథాయ నమః🙏💐🙏
ReplyDeleteSandya garu, sai kadtanivarana manthanni daya chesi pampandi
ReplyDeleteSaisyama2000@gmail.com idi na mail id
Om sairam
Plz send sai kasta nivarana mant8
ReplyDeleteSandya garu thank you for your Guru Mala Mantra.
ReplyDeleteOm sai ram baba naku help cheyandi baba pleaseeee sai
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDelete🕉🌺🌼Om Sri Sairam 🌼🌺🙏🙏🙏
ReplyDelete