సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 852వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తెలుగు ఉపాధ్యాయ వృత్తిని అనుగ్రహించిన సాయి
2. మనస్ఫూర్తిగా బాబాను నమ్మితే చాలు, ఆయన అన్నీ చేస్తారు

తెలుగు ఉపాధ్యాయ వృత్తిని అనుగ్రహించిన సాయి


ఈ సాయిబాబా బ్లాగును ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న సాయిబృందానికి మరియు ఎంతో ప్రేమతో తమ అనుభవాలను పంచుకుంటున్న సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు.


బాబా అంటారు కదా, "నా వద్దకు మొదట అందరూ లౌకికమైన కోర్కెలతోనే వస్తారు. కష్టాలు, కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ననుసరించి సన్మార్గానికి వస్తారు" అని. అదే విధంగా బాబా నన్ను అనుగ్రహిస్తున్నారని నాకనిపిస్తుంది. నా పేరు దేవి. మాది గజపతినగరం. పిల్లలకు నైతిక విలువలను బోధించి, వాళ్ళను ఉన్నత భావిపౌరులుగా తీర్చిదిద్దే తెలుగు ఉపాధ్యాయ వృత్తిని అనుగ్రహించడంలో బాబా అడుగడుగునా నాకు ఎలా అండగా నిలిచి సహాయం అందించారో నేనిప్పుడు కాస్త వివరంగా పంచుకుంటాను.


బి.కామ్ డిగ్రీ పూర్తి చేశాక ఆగిన నా చదువుని, వివాహమైన ఏడు సంవత్సరాలకి మా బంధువులలో వరుసకి తమ్ముడి సహాయంతో కొనసాగించి నేను ఎమ్.ఏ.(తెలుగు) చదివేలా, ఒకవైపు అది చదువుతూనే మా ఆడపడుచు ప్రోద్బలంతో ఆమె సేకరించిన పుస్తకాల ఆధారంగా బి.ఎడ్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేలా అనుగ్రహించారు బాబా. అంతేకాదు, వారిద్దరి రూపంలో నన్ను నడిపించింది తామేనని నాకు తెలియజేయటానికి తమ పేరుతో ఉన్న (సాయి సిద్ధార్థ) కాలేజీలో నాకు సీటు వచ్చేటట్టు చేశారు బాబా. ఇలా బాబా తమ అస్థిత్వాన్ని ఋజువుపరచడమే కాకుండా, తమ భక్తులైన మాధవి, పావనిల రూపంలో నాతోనే ఉంటూ, వాళ్ళ విశేష ప్రవర్తన ద్వారా తమ బోధనలను తెలియపరుస్తూ నన్ను తమ మార్గంలోకి నడిపించారు.


నేను నా గత అనుభవంలో, నా స్నేహితురాలు మాధవి నాకు ఒక సాయి విగ్రహాన్ని, సాయిలీలామృతం పుస్తకాన్ని ఇచ్చినట్లు చెప్పాను. ఇక అప్పటినుండి నేను బాబాను నిత్యం పూజిస్తూ, సాయిలీలామృతం పారాయణ చేస్తూ, మా ఇంటికి అతి చేరువలో ఉన్న సద్గురు సాయినాథుని కోవెలకు తరచూ వెళ్తూ, బుద్ధి పుట్టినప్పుడల్లా అక్కడ 108 ప్రదక్షిణలు చేస్తుండేదాన్ని. అప్పుడప్పుడు బాబా కోవెల తుడవడం, కడగడం, గురుపౌర్ణమి పర్వదినాన కోవెలలో జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరికీ అన్నప్రసాదాల వడ్డన చేయడం వంటివి చేస్తుండేదాన్ని. ఆ విధంగా తమను సేవించుకునే అవకాశాన్ని బాబా నాకు ప్రసాదించారు. క్షణం కూడా తీరిక లేకుండా బాబా సేవలోనే గడిపిన మరచిపోలేని రోజులవి. అలా బాబా సేవ చేసుకుంటూనే ఒకప్రక్క ఇంట్లో పనులు చూసుకుంటూ, మరోప్రక్క చదువుకుంటూ ఉండేదాన్ని. అటువంటి సమయంలో నా బి.ఈడి పరీక్షలు దగ్గర పడ్డాయి. పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేదని బాధపడుతున్న తరుణంలో ఆ పరీక్షలను 3 నెలలు వాయిదాపడేలా చేసి బాబా నన్ను ఆశ్చర్యపరిచారు. 'ఇది నేను నీకు ఇస్తున్న సమయం, బాగా చదువుకో!' అనేలా చదువుకోవడానికి నాకొక మంచి అవకాశాన్ని కల్పించి పరీక్షలు బాగా వ్రాసేలా ఆశీర్వదించారు బాబా.


ఆ వెంటనే టెట్ పరీక్షలు ఉంటాయని పేపరులో వెలువడింది. అయితే టెట్‌కి ఎలా చదవాలో, ఏమేమి ప్రిపేర్ కావాలో ఏ మాత్రమూ అవగాహన లేని నాకు అండగా నేనున్నానంటూ 2012, సెప్టెంబరులో జరగాల్సిన పరీక్షలను దఫదఫాలుగా వాయిదా పడేలా చేస్తూ 2013, మార్చిలో జరిగేలా చేశారు బాబా. ఆలోగా నేను టెట్‌లో భాగమైన తెలుగు, ఆంగ్ల వ్యాకరణాంశాలను సునాయాసంగా బోధించగలిగే ఇద్దరు ఉపాధ్యాయులను నాకు పరిచయం చేసి, వాళ్ళ ద్వారా ఎన్నో మెళకువలు నేర్పించారు బాబా. ‘బాబానే వారి రూపంలో సహాయమందించారు’ అని నేను ఇంత దృఢంగా చెప్పడానికి కారణం, వారిలో ఒకరు సత్యసాయి భక్తులు కావడమే. ఇంకొకరు అతని బంధువు. అలాగే, మిగిలిన సబ్జెక్టులను కూడా చక్కగా నేర్చుకునేలా అనుగ్రహించారు. ఇంతలో నా బి.ఈడి ఫలితాలు వెలువడ్డాయి. నా జీవితంలోనే అప్పటివరకు నేనెన్నడూ సాధించని విజయాన్ని బాబా నాకు అందించారు. కాలేజీకే ఫస్ట్ వచ్చాను నేను. ఆ విజయానికి ఎనలేని ఆనందాన్ని పొందిన నేను బాబా పాదాల వద్ద మ్రోకరిల్లి ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


బాబా ఆశీస్సులతో ఇంకా నా చదువు కొనసాగుతోంది. నా ముఖ్య లక్ష్యమైన డి.ఎస్.సి పరీక్షల స్థాయికి చేరుకోవాలంటే ముందుగా టెట్ క్వాలిఫై అవ్వడం అత్యంత ఆవశ్యకం. కానీ మేము OC కేటగిరీకి చెందినందువల్ల తప్పనిసరిగా 150 మార్కులకు 90 మార్కులు తెచ్చుకోవలసిందే. అప్పుడే నేను నా లక్ష్యం చేరుకుంటాను. అటువంటి కఠిన పరిస్థితుల్లో నేను బాగా కష్టపడి 118 మార్కులు తెచ్చుకునేలా బాబా అనుగ్రహించారు. ఆ క్షణాన నా ఆనందం మిన్నంటింది అంటే అతిశయోక్తి కాదేమో! బాబాపై నాకున్న భక్తిని, చదువుపై నాకున్న శ్రద్ధను చూసి, మా ఎదురింటిలో ఉండే 'సాయి ఆంటీ' నాకు 'సాయి స్తవనమంజరి' పుస్తకాన్ని సంవత్సరంపాటు పారాయణ చేయమని ఇచ్చింది. అప్పటినుండి నేను దాన్ని కూడా ప్రతిరోజూ ఇతర సాయి గ్రంథాలతోపాటు పారాయణ చేయడం మొదలుపెట్టాను.


అంతలో డి.ఎస్.సి నోటిఫికేషన్ వెలువడటానికి సిద్ధంగా ఉందనీ, నోటిఫికేషన్ వెలువడిన మూడు నెలల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తారనీ తెలిసింది. హఠాత్తుగా ఆ విషయం తెలిసేసరికి చదవవలసిన సిలబస్ ఎంతో ఉందని టెన్షన్ మొదలైంది. బాబా ఉన్నారని తెలిసినా నా మీద నాకే ఒక రకమైన అపనమ్మకం. అయితే, దీనికి కూడా బాబా ఏదో ఒక దారి చూపించక మానరనుకున్నాను. అలాగే చూపించారు కూడా! ప్రతిరోజూ బాబాను తలచుకుని, న్యూస్ పేపరులో నా దృష్టి పడిన చోట ఉన్న వాక్యాన్ని బాబా సందేశంగా తీసుకోవడం నాకు అలవాటు. అలాగే ఆరోజు కూడా బాబాను బాగా ప్రార్థించిన తరువాత నా దృష్టి ఈనాడు పేపరులోని 'హాయ్ బుజ్జీ' ఎడిషన్లో 'Guarantee' అనే ఆంగ్ల పదానికి 'అభయం' అనే తెలుగు అర్థం ఉన్న చోట పడింది. నా ఆలోచనలకి, లక్ష్యానికి తగ్గ సమాధానం కనిపించేసరికి నాకు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. సరిగ్గా అదే సమయంలో నేను ఎప్పటినుండో కలలుగంటున్న శిరిడీ ప్రయాణానికి సంబంధించిన రిజర్వేషన్ టికెట్లు తీసుకొచ్చి అకస్మాత్తుగా మా అన్నయ్య నా చేతిలో పెట్టాడు. ఆ టిక్కెట్లను తనివితీరా చూసుకుని త్వరలో బాబా దర్శనం కలుగబోతున్నందుకు ఎంతో మురిసిపోయాను. ఆ టికెట్ల ద్వారా బాబా మరోసారి తమ అభయహస్తాన్ని అందిస్తున్న అనుభూతి పొందాను. సాయి కృపతో మునుపటిలాగే ఈ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. అది బాబా నాకిచ్చిన  సువర్ణావకాశంగా భావించాను. నా కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారంతో మంచి కోచింగ్ సెంటరును ఎంపిక చేసుకుని, చదవడం మొదలుపెట్టాను. ఇక్కడ ఒక విషయం గూర్చి చెప్పుకోవాలి. అదేమిటంటే, ఏ అత్తవారింటిలోనూ ఏ కోడలికీ అందని ఆప్యాయతను, సహకారాన్ని మా అత్తగారు నాకు అందించారు. ఇది అన్నిటికంటే గొప్ప అదృష్టంగా నేను భావించాను. ఇంకా, మా ఆడపడుచు, మా ప్రక్కింటివాళ్ళ సూచనలు, సలహాలతో పరీక్షలకు సిద్ధమయ్యాను. అంతలో పరీక్షలు జరిగే తేదీ కూడా నిర్ధారణ అయింది. అప్పటినుండీ ఒకటే కంగారు. యితే, నా హాల్ టికెట్లో 'BESIDE SAIBABA TEMPLE' అనే వాక్యంతో బాబా నాపై అపారమైన అనుగ్రహాన్ని చూపి నాలో ధైర్యాన్ని నింపారు. వారి అశీస్సులతో నేను పరీక్షలు బాగా వ్రాశాను. "నా చరిత్రను చదవండి. మిమ్ము చరితార్థులను చేస్తాను" అని చెప్పినట్టుగానే బాబా నా జీవితంలో నేనెన్నడూ ఊహించని విధంగా నాకు జిల్లాలోనే 4వ స్థానాన్ని ప్రసాదించి (జిల్లా మొత్తంలో OC కేటగిరీకి ఉన్నవి కేవలం 7 పోస్టులు) తన అనుగ్రహాన్ని నాపై కురిపించారు. వ్రాసిన మూడు పరీక్షల్లో నేను ఊహించని అధిక గ్రేడ్ ఉన్న ఉద్యోగాన్ని నాకు బాబా ప్రసాదించారు. తుప్పుపట్టిన మా జీవితాలను బంగారుమయం చేయడంలో బాబా మాపై చూపిన ప్రేమను తలచుకుంటుంటే నాకు కన్నీళ్లు ఆగట్లేదు. ఆ కరుణాంతరంగునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

- మీ భక్తురాలు.


జై బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


మనస్ఫూర్తిగా బాబాను నమ్మితే చాలు, ఆయన అన్నీ చేస్తారు


అందరికీ నమస్తే! ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు.  ఈ కార్యాన్ని ముందుకు తీసుకువెళుతున్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నా అనుభవాన్ని పంచుకుంటాను.


నా పేరు అరుణ. ఒక సంవత్సరం క్రిందట మా నాన్నగారు మాకున్న ఒక భూమిని అమ్మారు. అయితే, డాక్యుమెంటేషన్‌లో లోటుపాట్లు ఉండటం వల్ల మాకు రావాల్సిన డబ్బులు మాకు రాకుండా ఆగిపోయాయి. అది ఎంతో పెద్ద మొత్తం. దానివల్ల మా నాన్నగారు తీవ్ర ఒత్తిడికి లోనై చాలా ఆందోళనపడుతూ ఉండేవారు. మేమంతా ఒక సంవత్సరం రోజులుగా ఆ పని ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నాము. 2021, జూన్ 24 ఉదయం నిద్రలేవగానే మా అమ్మ ఆ విషయం గురించే మాట్లాడుతూ, "మీ నాన్నగారు అదే పనిమీద తిరుగుతున్నారు. సాయిబాబా ఎప్పుడు కరుణిస్తారో!" అంది. అది వింటూనే, 'ఈరోజు గురువారం కదా! పూజ చేసేటప్పుడు ఈ విషయం గురించి మనస్ఫూర్తిగా బాబాకు విన్నవించుకుని, ఈ పని ఈరోజే పూర్తయితే వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని చెప్పుకుందామ'ని అనుకున్నాను. అనుకున్నట్లే బాబాకు పూజ చేసేటప్పుడు ఎంతో ఆర్తిగా వేడుకున్నాను. తరువాత సుమారు గం.11:30ని.లకి నాన్న ఫోన్ చేసి, "రిజిస్టర్ ఆఫీసులో ఉన్నానమ్మా. దాదాపు పని పూర్తయినట్లే" అని అన్నారు. ఇక చూడండి, నా ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందంలో, "బాబా! నాన్న మాకోసం ఈ విషయంలో ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టాన్ని మీరు అర్థం చేసుకుని పని పూర్తిచేయించారు. నేను మీకు సదా కృతజ్ఞురాలినై ఉంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. 'బాబాను ప్రార్థించిన నాలుగు గంటల్లోనే మీ పని జరిగిపోయిందా?' అని మీకు అనిపించవచ్చు. అయితే, నేను ఎప్పుడూ ఆ విషయం గురించి బాబాను మామూలుగా ప్రార్థించేదాన్ని. కానీ, ఆరోజు పూజలో కూర్చున్నప్పుడు, "బాబా! మీరు ఉన్నారని నాతోపాటు నాన్నకి కూడా అర్థం అయ్యేటట్టు ఈరోజు పని పూర్తి అయిపోవాలి" అని కోరుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టారు బాబా. ప్రతి సాయిభక్తుడు పూర్తి నమ్మకంతో బాబాను అడగాలి. బాబా  తప్పకుండా నెరవేరుస్తారు. 2020, నవంబరులో నేను ఈ గ్రూపులో చేరాను. ఎన్నో అనుభవాలు పంచుకున్నాను. బాబాతో నాకు ఉన్న అనుబంధం ఎంతో పెరిగింది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, 'బాబా లేకపోతే నేను ఎలా ఉండేదాన్నో!' అని. "బాబా! నా ప్రతి చిన్న విషయంలో కూడా మీ జోక్యం ఉండాలి. మీ ఆశీస్సులు సదా నాపై ఉండాలి బాబా".


మా బాబుకి ఇప్పుడు మూడు నెలల వయస్సు. పుట్టినప్పటినుంచి వాడికి విరేచనానికి సంబంధించిన సమస్య ఉంది. రోజూ కొంచెంగా విరేచనానికి వెళ్తుంటాడు. దానివల్ల వాడికి రాషెస్ వచ్చి విపరీతంగా ఏడుస్తూ ఉండేవాడు. ఈ మూడు నెలల్లో తనను చాలాసార్లు డాక్టరుకి చూపించి, ఎన్నో మందులు వాడాము. కానీ తనకు నయం కాలేదు. ఈ విషయం గురించి నేను ఎప్పుడూ బాబాను అడగలేదుగానీ, రోజూ బాబా ఊదీని వాడికి పెడుతూ ఉండేదాన్ని. అయితే 2021, జూన్ మూడవ వారంలో అనుకోకుండా బాబా ఊదీని బాబు నాలుకపై అంటించడం మొదలుపెట్టాను. ఒక్క నాలుగు రోజుల్లో వాడి విరేచనం సమస్య పూర్తిగా నయమైపోయింది. ఎన్నో మందులకు తగ్గని సమస్య బాబా ఊదీ వలన తగ్గింది. మనం మనస్ఫూర్తిగా బాబాను నమ్మితే చాలు, ఆయన అన్నీ చేస్తారు. ఇలాంటి ఎన్నో ఎన్నో అనుభవాలతో మళ్ళీ మళ్ళీ నేను మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 851వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా గైడెన్స్ - కుటుంబానికి ఆరోగ్యం
2. బాబా నాకు ప్రసాదించిన ఆధ్యాత్మిక స్థితి
3. తలనొప్పి తగ్గించిన బాబా

బాబా గైడెన్స్ - కుటుంబానికి ఆరోగ్యం


నేను దుబాయిలో నివాసముంటున్న సాయి బిడ్డని. బాబా నాకు ప్రసాదించిన ఒక గొప్ప అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, మే నెల మధ్యలో ముందుగా మా నాన్నగారికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చాయి. తర్వాత రెండురోజులకి అమ్మ జ్వరం, తలనొప్పి సమస్యలతో బాధపడింది. వెంటనే మా అన్నయ్య వాళ్ళకి రాపిడ్ టెస్ట్ చేయిస్తే, వాళ్ళిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మా అన్నయ్య, వదిన కూడా టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయవలన వాళ్ళిద్దరికీ నెగిటివ్ వచ్చింది. కానీ ఆరోజు మధ్యాహ్నానికి మా అన్నయ్యకి కూడా ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. ఇంక మరుసటిరోజు ఉదయం మా వదిన, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్లారు. అన్నయ్య మళ్లీ టెస్ట్ చేయించుకుంటే, రిపోర్టు మర్నాడు వస్తుందని చెప్పారు. అంతలో మా వదినకి కడుపులో మంట, వాళ్ళ చిన్నపాపకి జ్వరం వచ్చాయి. పాపని హాస్పిటల్‌కి తీసుకుని వెళితే, డాక్టరు మందులిచ్చి, ‘మళ్ళీ జ్వరం వస్తే రక్తపరీక్షలు చేయాలి’ అన్నారు. ఆలోగా అన్నయ్యకి కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దాంతో అక్కడ వదిన మళ్ళీ కోవిడ్ టెస్టు చేయించుకుంది. అంతలో చిన్నపాపకు మళ్ళీ జ్వరం వచ్చింది. వీటన్నిటితో మేము పడ్డ టెన్షన్ బాబాకే తెలుసు. నేను భయంతో బాబా దగ్గరకు వెళ్లి, "బాబా! మేము ఇంతదూరంలో ఉన్నాము. అమ్మానాన్నలకి, అన్నయ్యకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అక్కడ చిన్నపాపకి జ్వరం, వదినకి కడుపులో మంట, ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలున్నాయి. అవి చాలక తనకు కోవిడ్ వచ్చిందేమోనని వదిన భయపడుతోంది. నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది బాబా. దయచేసి మావాళ్ళని కాపాడు. చంటిదానికి రక్తపరీక్షల రిపోర్టులు నార్మల్ వచ్చేలా, వదినకి నెగిటివ్ వచ్చేలా చూడండి. లేదంటే, వదిన వల్ల ఆ కుటుంబం కూడా బాధపడుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. అమ్మానాన్నలకు, అన్నయ్యకు ధైర్యాన్ని ప్రసాదించండి బాబా. మీరు ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుగా ఉండి, తొందరగా కోలుకునేలా అనుగ్రహించండి బాబా" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. అంతేకాదు, "బాబా! నేను ఇక్కడ నుండి వాళ్ళకోసం ఏదైనా చేయగలిగేది ఉంటే నాకు తెలియజేయండి. ప్లీజ్ బాబా! అది ఏదైనా నేను చేస్తాను" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం నేనున్న ఒక భక్తి గ్రూపులో, 'ఈరోజు పాడ్యమి. ఈరోజు మొదలుకుని హనుమాన్ జయంతి లోపు 108 సార్లు హనుమాన్ చాలీసా చదివితే మంచిది' అని ఒక సందేశం వచ్చింది. అది బాబా నాకు ఇస్తున్న సలహాగా భావించి, వెంటనే నేను హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాను. అది జరుగుతూ ఉండగా మధ్యలో బాబా దయవల్ల చంటిదానికి రక్తపరీక్షల రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. ఇంకా వదినకి కరోనా నెగిటివ్ అని వచ్చింది. అది తెలిసి చాలా చాలా సంతోషించాము. ఇకపోతే, నేను హనుమాన్ జయంతి లోపు 108 సార్లు హనుమాన్ చాలీసా పూర్తిచేశాను. బాబా దయవల్ల అమ్మ, నాన్న, అన్నయ్య బాగానే కోలుకున్నారు


కానీ అప్పటివరకు బాగానే ఉన్న అమ్మ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయి, తనకు ఏదో అయిపోతుందని ఒక రకమైన భయాన్ని పెట్టుకుంది. దాంతో అమ్మ చాలా నీరసించిపోయింది. ఒకరోజు రాత్రి నిద్రపట్టలేదని చెప్పి ఇంకాస్త డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. చివరికి, తెలిసి చేసిందో, తెలియక చేసిందో గానీ అమ్మ మా ఇంట్లో ఉన్న బావిలో దూకింది. అదృష్టం! నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల అమ్మకి ఏమీ కాలేదు. అన్నయ్య, నాన్న కలిసి అమ్మని బయటికి తీశారు. నాన్న నాతో, "మీ అమ్మని బాబానే కాపాడారమ్మా, తనకు ఎటువంటి దెబ్బలు తగలలేదు" అని చెప్పారు. మరుసటిరోజు ముగ్గురూ వెళ్లి టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయవల్ల ముగ్గురికీ కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ మా అమ్మ పరిస్థితిలో మార్పులేదు. ఇదివరకటిలా తనలో చురుకుతనం లేదు. అప్పుడు నేను, "బాబా! అమ్మ త్వరగా నార్మల్ అయ్యేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తరువాత అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. డాక్టరిచ్చిన మందులు వాడుతూ కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం కాస్త కుదుటపడింది. తనకి మరపు ఏమీలేదు, అన్నీ గుర్తున్నాయి. కానీ అమ్మలో ఒక రకమైన భయం అలుముకుంది. మేము ఎవరమైనా ఇంటికి వస్తామంటే, ‘వద్ద’ని మొదలుపెడుతుంది. ఈరోజు నేను, "మేము ఇండియా వస్తున్నాం అమ్మా" అని చెపితే, అందుకు అమ్మ, "నేను ఎందుకు చెప్తున్నానో విను. వస్తే నా మీద ఒట్టే" అంది. అప్పుడు నేను, "బాబా! మా అమ్మ పెట్టిన ఒట్టు మీ పాదాల దగ్గర పెడుతున్నాను. తనిప్పుడు వద్దంటున్నా తరువాత అమ్మే రమ్మని పిలిచేలా ఆమెలో మార్పు మీరు తీసుకుని రావాలి. ప్లీజ్ బాబా. ఆమెలో ఆ మార్పు వచ్చి, మేము ఇండియా వెళ్లి, తిరిగి క్షేమంగా వచ్చాక మళ్లీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా".


బాబా నాకు ప్రసాదించిన ఆధ్యాత్మిక స్థితి


నా పేరు అనూరాధ. నేను వృత్తిరీత్యా టీచర్ని. మాది హైదరాబాద్. నా జీవితంలో వచ్చిన ఎన్నో సమస్యలలో నాకు తోడుగా నిలిచిన కరుణాసముద్రుడు శ్రీసాయి. సమస్యలలో తోడుగా నిలిచి రక్షణనివ్వడమే కాకుండా దివ్యానుభూతిని ప్రసాదించిన సర్వాంతర్యామి బాబా. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానై నిలిచారు ఆ సాయినాథుడు. వారి కృపతో 2021, జూన్ 3న ఈ బ్లాగును చూడగానే నేను కూడా నా సాయితో నాకున్న అనుబంధాన్ని పంచుకోవాలని మనసు ఆరాటపడింది. అయితే ఆరోగ్య సమస్య కారణంగా కొంచెం ఆలస్యం అయింది. ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు.  ఇకపోతే, మొట్టమొదటగా నేను మీ అందరితో బాబా నాకు ప్రేమతో ప్రసాదించిన దివ్యానుభూతిని పంచుకోవాలనుకుంటున్నాను.


సాయినాథునితో నా ప్రథమ దివ్యానుభూతి: 2014వ సంవత్సరంలో నేను ఎక్కిరాల భరద్వాజ మాస్టర్‌గారు రచించిన 'సాయిలీలామృతం' పారాయణ చేస్తున్న రోజులవి. అందులో, బాబా స్పర్శతో ఒక భక్తునిలో వచ్చిన ఆధ్యాత్మిక ఉన్నతిని గురించిన లీలను చదివిన నేను, "నాకూ అలాంటి దివ్యానుభూతిని అనుగ్రహించమ"ని బాబాను వేడుకున్నాను. పారాయణ చేస్తున్న క్రమంలో ఒకరోజు సాయినాథుని దేవాలయానికి వెళ్లాను. ఎప్పటిలాగే బాబా దివ్యపాదాలను స్పృశించి తల పైకెత్తుతున్న సమయంలో బాబా రెండవ పాదం నా తలకు గట్టిగా తగిలింది. అలా మునుపెన్నడూ జరగలేదు. ఆ మరుసటిరోజునుండి సుమారు రెండు నెలల పాటు నేను అలౌకికమైన ఆనందాన్ని అనుభూతి చెందాను. దివ్యమైన బాబా స్వప్నదర్శనం జరిగింది. అందులో బాబా విఘ్నేశ్వరునిలా, విష్ణుమూర్తిలా, అనేక దేవతామూర్తులుగా సాక్షాత్కరించారు. ఆ రెండు నెలలు నిరంతరం బాబా స్మరణ చేయాలనిపించడం, ఎక్కడ చూసినా బాబా రూపం కళ్ళముందు కనిపించడం.. ఇలా నా మనసంతా బాబాపైనే ఉండేది. బాబా నాకు ఇచ్చిన లౌకికమైన బాధ్యత తప్ప నా మనసు ఎలాంటి ప్రతికూల ఆలోచనలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండేది. అలా ఆ సర్వాంతర్యామి నన్ను అలౌకికము, దివ్యము అయిన అనుభూతిలో ముంచెత్తారు. బాబా ప్రసాదించిన ఆ అనుభూతి ఆధారంగా నాకు అర్థమైంది ఏమిటంటే.. 'బాబా కోర్కెలు తీర్చి, సమస్యల నుండి రక్షణ కల్పించే దైవం మాత్రమే కాదు, మనం బాబాను నిత్యం ప్రేమతో ధ్యానం చేస్తే, ఉన్నతమైన, ఆనందకరమైన దివ్యస్థితికి తీసుకువెళ్తారు' అని. జటిలమైన సమస్య నుండి బాబా నాకు ఎలా రక్షణ కల్పించారనే అనుభవంతోపాటు ఇంకా కొన్ని అనుభవాలు ముందు ముందు మీతో పంచుకుంటాను.


- మీలాంటి ఓ సాయిబంధువు.


ఓం శ్రీ సాయినాథాయ నమః


తలనొప్పి తగ్గించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


నేను సాయిభక్తురాలిని. 'సాయీ' అని స్మరించినంతనే బాబా ఎన్నోసార్లు నాకు కష్టం నుండి విముక్తి కలిగించారు. ఇటీవల బాబా ప్రసాదించిన అలాంటి ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, జూన్ మూడవవారం చివరిలో నాకు తలనొప్పి వచ్చింది. నాకు మామూలుగానే మైగ్రేన్ సమస్య ఉంది. ఎప్పుడైనా ఆ తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. కానీ ఈసారి రెండు టాబ్లెట్లు వేసుకున్నా తలనొప్పి తగ్గలేదు. దాంతో నాకు భయం వేసి, "బాబా! నాకు తలనొప్పి తగ్గేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను ప్రార్థించి, డోలో-650 టాబ్లెట్ వేసుకున్నాను. రాత్రి పడుకునేముందు, "బాబా! రేపు తెల్లవారేసరికల్లా తలనొప్పి తగ్గితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుని, బాబా ఊదీని తలకు పెట్టుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజు తెల్లవారేసరికి తలనొప్పి లేదు. పూర్తిగా తగ్గిపోయింది. రోజూ చేసుకునే దానికన్నా ఎక్కువ పని ఆరోజు చేసుకున్నాను. "ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని కాపాడు తండ్రీ. నీవే మాకు అన్నీ సాయీ".


ఓంసాయి ఓంసాయి ఓంసాయి.


సాయిభక్తుల అనుభవమాలిక 850వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నాతోనే ఉన్నట్లుగా నిరూపణ ఇచ్చిన బాబా
2. మేలు చేసే కోరికలన్నీ తీరుస్తున్న బాబా
3. బాబాను ప్రార్థించడం ద్వారా తీరిన ఇబ్బందులు

నాతోనే ఉన్నట్లుగా నిరూపణ ఇచ్చిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. మనం ప్రారబ్ధరీత్యా ఏదైనా కర్మను అనుభవించాల్సి ఉన్నప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా భగవంతుడు ముందే చేస్తారని నేను నమ్ముతాను. అందులో భాగంగానే రెండు, మూడు నెలల ముందు వరకు ఈ బ్లాగ్ గురించి తెలియని నాకు, బ్లాగ్ గురించి తెలిసేలా చేసి రోజూ చదివేలా చేశారు బాబా. అంతేకాదు, రెండవసారి నా అనుభవాన్ని బ్లాగులో పంచుకునే అవకాశం కూడా ఇచ్చారు బాబా. ఇక నా అనుభవానికి వస్తే ... 


2021, మే నెల అంతా మా కుటుంబానికి ఒక భయానక పీడకలలా గడిచింది. మా అమ్మావాళ్ళ కుటుంబంలో అందరూ, అంటే అమ్మ, నాన్న, తమ్ముళ్లు, మరదలు, వాళ్ళ పిల్లలు కోవిడ్ బారినపడి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు జీవితంలో ఎప్పుడూ అంతటి మానసిక ఆందోళనను అనుభవించలేదు. అయితే బాబా దయవల్ల 'ఎవరికి ఏది మంచిదో అది అనుగ్రహించమ'ని ప్రార్థించే పరిణతి కలిగివున్న నేను అదేవిధంగా బాబాను ప్రార్థించాను. ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడూ ఉండని, ఉండలేని ఆదర్శదంపతులైన నా తల్లిదండ్రులను 70 సంవత్సరాల వయసులో బాబా తమలో ఐక్యం చేసుకున్నప్పటికీ, ఎంతో సీరియస్ కండిషన్‌లో ఉన్న ఒక తమ్ముడిని మరియు ఇంకో తమ్ముడిని, వాళ్ళ భార్యాబిడ్డలను (బాబా దయవల్ల వీళ్ళ పరిస్థితి అంత సీరియస్ కాలేదు) కాపాడి మాపై కృప చూపారు. "బాబా! అమ్మానాన్నలిద్దరూ ఇప్పుడు నీతోనే ఉన్నారనీ, వారి ఆశీస్సులు మాపై ఇంకా ఎక్కువగా వర్షిస్తాయనీ నమ్ముతున్నాను. తమ్ముళ్లను కాపాడినందుకు ధన్యవాదాలు బాబా".


బాబా దయతో మా తమ్ముడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన తరువాత ఒక రాత్రి ఖాళీగా ఉన్న బంధువుల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆరోజు ఏసీ ఆన్ చేసిన తరువాత కాసేపటికి ఆఫ్ చేద్దామని చూస్తే, ఎంత వెతికినా అప్పుడే తీసిన రిమోట్ కనిపించలేదు. అంతటా వెతికి చివరికి నేను బాబాపై భారం వేశాను. రిమోట్ గురించి కాదుగానీ, అప్పటివరకు జరిగిన చెడు పరిణామాల వల్ల బాబా దయ మాపై ఉందో, లేదోనని మనసులో చిన్న అనుమాన బీజం మొలకెత్తినందువల్ల నేను నా మనసులో ఇలా అనుకున్నాను: "ఏం జరుగుతున్నా గానీ, నీవు మాతోనే ఉన్నట్లయితే గనక ఇప్పుడు రిమోట్ దొరికేలా చేయండి. లేదంటే, అది దొరక్కుండా చేయండి బాబా" అని. బాబా అనుగ్రహాన్ని ఒక రకంగా ఆ రిమోట్ వంకగా పెట్టి పరీక్షించాను. కాసేపట్లోనే రిమోట్ దొరికేలా చేసి నాతోనే ఉన్నానని బాబా సందేశమిచ్చారు. "సాయీ! మీరు తప్ప మాకు వేరే దిక్కులేదు. మిగిలిన సమస్యల నుంచి కూడా మమ్మల్ని బయటపడేయండి స్వామీ. మేము ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వు తండ్రీ. నీ మాట ప్రకారమే నడచుకునే స్థిరత్వాన్ని మాకు ప్రసాదించండి బాబా".


ఇలా అనుభవాలు వ్రాసుకుంటూ వెళితే, అన్నీ వ్రాయడం మనవల్ల కాదు. ఎందుకంటే, ప్రతిరోజూ బాబా ఎన్నో సందేశాలు, అనుభవాలు ప్రసాదిస్తూనే ఉన్నారు. అందులో కొన్ని మాత్రమే వ్రాసి పంచుకోగలం. ఈరోజు (జూన్ 24న) కూడా నా ముందు ఒక సమస్య ఉంది. ఆ విషయంలో బాబా చూపిన అనుగ్రహాన్ని చూడండి. ఇది మా అమ్మాయికి సంబంధించినది. ఈరోజు తెల్లవారుఝామునుండి తనకు బాగా విరోచనాలు అవుతున్నందువల్ల ఉదయం 10 గంటలయ్యేసరికి తను బాగా నీరసించిపోయింది. దానికి తోడు కొద్దిపాటి దగ్గు కూడా ఉంది. అప్పటివరకు మా కుటుంబంలో జరిగిన అనుభవాల దృష్ట్యా నేను బాగా కంగారుపడ్డాను. భయమేసి కోవిడ్ టెస్ట్ చెయ్యడానికి రమ్మని పిలిస్తే, వాళ్ళు ఒంటిగంటకి వస్తామని అన్నారు. నేను బాబాను, "రిపోర్టు నెగెటివ్ రావాలి" అని గట్టిగా ప్రార్థిస్తూ బాబా ఊదీని అమ్మాయి నుదుటన పెట్టి, మరికొంత తన నోట్లో వేసి టెన్షన్‌గా టెస్టు చేసేవాళ్ళ కోసం ఎదురుచూడసాగాను. బాబా దయవల్ల సరిగ్గా ఒంటిగంటకి టెస్ట్ చేసే అబ్బాయి వచ్చి, టెస్ట్ చేసి, నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చాడు. "థాంక్యూ వెరీ మచ్ సాయీ. నువ్వు నాతోనే ఉన్నావు".


మేలు చేసే కోరికలన్నీ తీరుస్తున్న బాబా


నా పేరు శ్రీనివాస్. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. బాబాకు మాటిచ్చిన ప్రకారం ఈరోజు నేను నా అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను. నేనొక ఉపాధ్యాయుడిని. ఈ ఉద్యోగం నాకు బాబా కృపవలనే వచ్చింది. నిరంతరం చేసిన ఆయన నామస్మరణ వల్లనే నేను ఆ ఉద్యోగాన్ని పొందగలిగాను. నిజానికి 'ఉద్యోగం వస్తే చాలు, ఏమీ అడగను' అని బాబాతో అన్నాను. కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. అయినా బాబా నాకు మేలు చేసే అన్ని కోరికలూ తీరుస్తున్నారు. అందుకు బాబాకు శతకోటి నమస్కారాలు. 


ఒకసారి నేనొక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా బాబాను వేడుకున్నంతనే అదేరోజు నాకు ఆ బాధ నుండి ఉపశమనం కలిగించారు బాబా. ఇప్పటికీ బాబా చూపిన కృపను నేను మరచిపోలేకున్నాను.


ఇటీవల మా అక్క, బావ కరోనా బారినపడి ఆర్థిక భారాన్ని భరించే స్థోమతలేక హాస్పిటల్లో చేరకపోతే, నేను బాబా మీద భారం వేసి, వాళ్ళను మా ఇంట్లో ఉంచుకుని కేవలం టాబ్లెట్స్ ఇచ్చి చికిత్స అందించాను. బాబా దయవలన కేవలం వారం రోజుల్లో వాళ్ళకు కరోనా నెగటివ్ వచ్చి కోలుకున్నారు. అంత త్వరగా తమ ఇంటికి వెళ్లడాన్ని వాళ్లే నమ్మలేకపోయారు. సాయికి అసాధ్యమైనదేదీ లేదు.


ఇక చివరగా, నాకు ఉన్న ఆర్థిక సమస్యలెన్నింటినో బాబా తీరుస్తున్నారు. మనం మన తాహతుకు మించి అప్పులు చేస్తే, దాని ఫలితం అనుభవించి తీరాలి. సాయి చెప్పేది కూడా అదే. ఈ విషయం మరచి మనం అప్పులు చేసి, వాటిని తీర్చలేక సాయిని వేడుకుంటాం. అయితే మన తప్పును తెలుసుకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే సాయి తప్పక సహాయం చేస్తారు. సాయి మాట వింటే మనం అడగకపోయినా సాయి మన కోరికలు తప్పక తీరుస్తారు. ఇది నా అనుభవం. దయచేసి ఈ విషయం గుర్తుంచుకుని ‘అనవసరమైన అప్పులు చెయ్యవద్దు’ అని సాయి మాటగా చెబుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్లాగువారికి నా ధన్యవాదాలు. శ్రీ సాయినాథునికి నమస్కారాలు.


బాబాను ప్రార్థించడం ద్వారా తీరిన ఇబ్బందులు


నేను సాయిభక్తురాలిని. సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలు చదువుతూ, తమ భక్తులపై బాబా చూపించే ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాను. తమను నమ్ముకున్నవారి వెంట బాబా ఎల్లప్పుడూ ఉంటారు, వాళ్ళకు ఏ కష్టం వచ్చినా తొందరగానే దాన్ని తొలగిస్తారు. ఒకరోజు సాయంత్రం నాకు విపరీతమైన తలనొప్పి వచ్చి, తల తిరుగుతున్నట్లు అనిపించింది. అప్పుడు నేను, "సాయీ! నా తలనొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. సాయిపై నమ్మకంతో టాబ్లెట్ కూడా వేసుకోకుండా పడుకున్నాను. ఉదయానికల్లా నా తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బాబా కరుణాకటాక్షాలు మనపై ఉంటే మనం దేన్నైనా జయించగలం. "థాంక్యూ బాబా. తొందరగా ఈ కరోనా మహమ్మారిని ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి ప్రజలందరినీ కాపాడు తండ్రీ!"


ఇంకోరోజు రాత్రి గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నా కడుపు కండరాలు పట్టేసినట్టుగా అయి చాలా ఇబ్బందిపడ్డాను. వెంటనే నేను బాబాను ప్రార్థించి, "నా సమస్య తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నా ఇబ్బంది తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు శతకోటి వందనాలు తండ్రీ సాయినాథా!"


సాయిభక్తుల అనుభవమాలిక 849వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోవిడ్ కష్టం నుండి కాపాడిన బాబా
2. కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా
3. ఏళ్లనాటి తలనొప్పి బాబాను ప్రార్థించినంతనే అదృశ్యం

కోవిడ్ కష్టం నుండి కాపాడిన బాబా


ముందుగా ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. సాయిభక్తకోటికి నా నమస్కారాలు. నా పేరు అరుణదేవి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


2021, మే నెలలో మా అమ్మకు కంటి ఆపరేషన్ చేసి, "ఒక 15 రోజులు ఏ పనీ చేయకూడదు" అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఐదు రోజుల వరకు అందరం బాగానే ఉన్నాము. తర్వాత మా అమ్మకు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలవడంతో టాబ్లెట్స్ వేసుకోసాగింది. మూడు రోజుల తర్వాత నాకు తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. నా తర్వాత మా నాన్నగారికి  జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. ఆ స్థితిలో పనిచేసే ఓపిక లేక నేను ఇద్దరు పిల్లలను తీసుకుని మా ఇంటికి వచ్చేశాను. తలనొప్పి, ఒళ్లునొప్పులు, జలుబు బాగా ఉండటం చూసి మావారు నాకు రాపిడ్ టెస్ట్ చేయిస్తే, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే నేను అమ్మావాళ్లకు ఫోన్ చేసి, "నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మీరు కూడా టెస్ట్ చేయించుకోండి" అని చెప్పాను. అయితే వాళ్ళు ముందు భయపడి టెస్ట్ చేయించుకోలేదు. 4 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అమ్మకి, నాన్నకి, మా అక్కావాళ్ళ బాబుకి పాజిటివ్ వచ్చింది. మా నాన్నగారిని పరీక్షించిన డాక్టర్లు, "లంగ్స్ 45% ఇన్ఫెక్ట్ అయ్యాయ"ని కూడా చెప్పారు. నాన్నకి బీపీ, షుగర్ ఉన్నందువల్ల మాకు చాలా భయం వేసింది. దానికి తోడు నాన్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోసాగాయి. హాస్పిటల్లో చేరమంటే నాన్న భయపడుతుండేవారు. అదలా ఉంచితే హాస్పిటల్లో బెడ్స్ కూడా దొరకలేదు. అటువంటి స్థితిలో మేము సహాయం కోసం బాబాను ప్రార్థించాము. బాబా దయవలన ఆక్సిజన్ అమర్చివున్న బెడ్ దొరికింది. వెంటనే నాన్నని హాస్పిటల్లో చేర్చారు. బాబా దయవలన నాన్నకి రెమిడీసీవర్ ఇంజెక్షన్ ఉచితంగానే వేశారు. అయితే నాన్నకి బీపీ, షుగర్ అధికమవడంతో పరిస్థితి సీరియస్ అయింది. అప్పుడు నేను బాబా పటం ముందు కూర్చుని, 'సాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు వ్రాసి, "బాబా! నాన్న క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. దయామయుడైన బాబా మనల్ని బాధపడనిస్తారా? మరుసటిరోజు ఉదయం, 'నాన్న ఆక్సిజన్ లెవెల్స్ 97 ఉందనీ, ఇప్పుడు ఆయన బాగున్నార'నీ తెలిసి ఎంతో సంతోషించాను. ఎంతో ఆనందంతో మనసారా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు మా నాన్న క్షేమంగా ఉన్నారంటే అది బాబా కృపే. అలా బాబా మా నాన్నని చావుబ్రతుకుల పరిస్థితి నుండి రక్షించడమే కాకుండా అమ్మని, అక్కావాళ్ళ బాబుని త్వరగా కోలుకునేలా చేశారు. "బాబా! మీకు వేలకోట్ల ధన్యవాదాలు".


ఇకపోతే, నాకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పాను కదా! ఆ విషయం తెలిసిన వెంటనే మా పిల్లలను మా అత్తయ్యావాళ్ళింట్లో ఉంచి, నేను మా ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంటూ మందులు వాడసాగాను. అందరూ నాతో, "భయపడకు, ధైర్యంగా ఉండు" అని చెప్తుండేవారు. నేను వాళ్ళతో, "నాకేం భయంగానీ, టెన్షన్ గానీ లేవు. ఎందుకంటే, నాకు తోడుగా బాబా ఉన్నారు" అని చెప్పాను. నాకు నీరసం ఏమీ లేదు, నార్మల్ గానే ఉండేది. అందువల్ల గురువారం శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేద్దామని అనుకున్నాను. అయితే బుధవారం రాత్రి వరకు బాగానే ఉన్న నేను గురువారం ఉదయాన లేవలేకపోయాను. అయినప్పటికీ కాస్త ఓపిక తెచ్చుకుని లేచి పారాయణ చేద్దామని అనుకున్నాను. కానీ నావల్ల కాలేదు. బాగా నీరసంగా ఉంది. దాంతో "బాబా! నావల్ల కావడం లేదు. నన్ను క్షమించండి" అని బాబాతో చెప్పుకుని పడుకున్నాను. కొద్దిసేపటికి నా శరీరం మొద్దుబారిపోయినట్లు, నా శరీరం నుండి ఆత్మ వేరవుతున్నట్టు నాకు తెలుస్తోంది. వెంటనే నేను 'బాబా' అని గట్టిగా అరిచాను. మరుక్షణం బాబా నాకు కనిపించారు. "బాబా! నన్ను కాపాడండి. నాకు పిల్లలున్నారు బాబా" అని చెప్పుకుని, 'బాబా, బాబా' అంటూ బాబా నామాన్ని జపిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో మావారు నాకు ఫోన్ చేశారట. నేను ఎంతకూ స్పందించకపోయేసరికి నేనుండే ఇంటి వద్దకు వచ్చి, బయట నుండి గట్టిగా పిలిచినా నేను పలకలేదట. దాంతో మావారు ఇంటి తలుపులు తెరచి చూస్తే, నేను స్పృహలో లేను. మావారు నన్ను గట్టిగా తట్టి లేపి కూర్చుండబెట్టి, "ఏమైంది?" అని అడిగారు. నేను నా శరీరం మొద్దుబారిన విషయం, బాబా కనిపించిన విషయం చెప్పాను. మావారు, అత్తయ్య కంగారుపడి, 'నేను కోవిడ్ నుండి కొలుకుంటే, నన్ను బాబా గుడికి తీసుకువస్తాను" అని మొక్కుకున్నారు అంట. ఆ మరుసటిరోజు నుండి నాకు ఏ ఇబ్బందీ లేదు. కోవిడ్ నుండి నన్ను, నా తల్లదండ్రులను కాపాడిన బాబాకు ఎన్ని వేల కోట్ల కృతజ్ఞతలు చెప్పినా ఆయన ఋణం తీర్చుకోలేను. "బాబా! మీ ప్రేమ ఎప్పుడూ మీ బిడ్డలమైన మాపై ఇలాగే వుండాలి".

 

ఇంకో విషయం, మా అమ్మావాళ్ళ ఇంట్లో ఉన్న మా అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చినా బాబా దయవల్ల మా పిల్లలిద్దరికీ వైరస్ సోకలేదు. ఇంతలా మమ్మల్ని కాపాడుతున్న బాబాకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. "బాబా! నాలోని లోపాలను సరిచేసి నన్ను మంచి మార్గంలో నడిపించండి. తెలిసీతెలియక నేను ఏమైనా తప్పులు చేసివుంటే నన్ను క్షమించండి బాబా. ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను మన్నించండి బాబా".


కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా


"ఓం సాయినాథా! కరుణాకర దీనబంధో! భక్తులపాలిట కల్పవృక్షమగు నీవే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమూ. సర్వకాల సర్వావస్థలయందు మమ్ము రక్షించండి సాయీ". నా పేరు శ్రీదేవి. 2021, మే 12న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఆ సమయంలో నా భర్తకు కాస్త ఒళ్ళునొప్పులు వచ్చాయి. దాంతో ఆయన సందేహించి కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో నేను బాబాను ప్రార్థించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం జపించాను. కానీ, మావారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను చాలా భయపడి, "బాబా! నా భర్తను ఎలాగైనా కాపాడండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు గురువారం. బాబాకు దివ్యపూజ చేస్తూ, "వచ్చే గురువారానికల్లా నా భర్తకు పూర్తిగా నయం కావాల"ని వేడుకున్నాను. మరుసటి గురువారం మావారికి బి.పి కాస్త ఎక్కువగా ఉండటంతో హాస్పిటల్‌కి వెళ్ళవలసి వచ్చింది. కొంతసేపటికి నేను ఇంట్లో  దివ్యపూజ ప్రారంభిస్తుండగా మావారు ఫోన్ చేసి, "ఇక్కడ కరోనా టెస్ట్ చేశారు. కరోనా నెగిటివ్ వచ్చింది" అని చెప్పారు. నేను కోరుకున్నట్లే అనుగ్రహించి నా భర్తను కాపాడినందుకు చాలా సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని పూజ ముగించాను. ఆ సాయంకాలానికి మావారి బి. పి. కూడా నార్మల్ అయింది. అయితే కరోనా వల్ల మావారికి షుగర్ కొంచెం పెరిగింది. నేను, "బాబా! మావారికి స్వీట్లంటే ఇష్టం. ఎలాగైనా ఆయనకు షుగర్ నార్మల్ చేయండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటి వారంలో మావారు టెస్ట్ చేయించుకుంటే, బాబా దయవల్ల షుగర్ నార్మల్ వచ్చింది. "బాబా! ఎల్లప్పుడూ మావారు క్షేమంగా ఉండేలా చూడండి. మా భారమంతా మీదే. మీ దివ్యపాదాలనే నమ్ముకున్నాం బాబా".


సర్వం శ్రీసాయి.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఏళ్లనాటి తలనొప్పి బాబాను ప్రార్థించినంతనే అదృశ్యం


నా పేరు కళ్యాణి. నాకు 2000వ సంవత్సరంలో పెళ్లయింది. మా పెళ్లికి ఎవరో బాబా ఫోటోను బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ సమయంలో మాకు బాబా మీద నమ్మకం లేనందున మేము ఆ ఫోటోను ప్రక్కన పెట్టాము. ఇకపోతే, చిన్నప్పటినుండి నాకున్న తలనొప్పి ఏళ్ళు గడుస్తున్నా నన్ను వదలలేదు. ఎప్పుడూ తలనొప్పితో బాధపడుతూ ఉండేదాన్ని. మా అమ్మాయి బాబా భక్తురాలు. ఇటీవల ఒకరోజు తను నా తలకు బాబా ఊదీ రాసి, "అమ్మా! నువ్వు నమ్మకంతో బాబాను ప్రార్థించు" అని చెప్పింది. దాంతో నేను, "బాబా! ఇప్పటినుండి నేను మిమ్మల్ని నమ్ముతాను. నా తలనొప్పి తగ్గించండి" అని ప్రార్థించాను. అంతే, 10 నిమిషాల తరువాత నా తలనొప్పి తగ్గిపోయింది. ఇది ఈమధ్యనే, అంటే 2021, ఏప్రిల్ నెలలో జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు నాకు మళ్ళీ తలనొప్పి రాలేదు. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నాకు అన్నీ నువ్వే బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 848వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ‘సాయిభక్తుడు’
2. పరీక్షలు విజయవంతంగా వ్రాయించిన బాబా
3. బాబా ఊదీ మహిమ

‘సాయిభక్తుడు’


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ ద్వారా పాఠకులలో బాబాపట్ల భక్తివిశ్వాసాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఈ బ్లాగును ప్రారంభించి చక్కగా నిర్వహిస్తున్నవారు బాగుండాలనీ, వారికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో ఒక అనుభవాన్ని ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేనొక బాబా భక్తుడిని. మొదట్లో నాకు బాబా గురించి ఏమీ తెలియదు. నా క్లోజ్‌ఫ్రెండ్, నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రక్కప్రక్కనే కూర్చుని చదువుకున్నాం. తన కుటుంబంలోని వారంతా బాబాను ఆరాధిస్తారు. ప్రతి గురువారంనాడు సాయంకాలం తనకు తోడుగా బాబా గుడికి రమ్మని తను నన్ను పిలిచేవాడు. నేను తనతో వెళ్లేవాణ్ణి. గురువారం కావటంవల్ల భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉండేది. మేము మోకాళ్ల మీద కూర్చుని బాబా పాదుకలకు మ్రొక్కేవాళ్ళం. కనీసం 100 సార్లయినా బాబా పాదాలను పట్టుకొని వుంటాను. కానీ అప్పుడు కూడా నాకు బాబా గురించి ఏమీ తెలియదు. స్నేహితునితో కలిసి ఏదో సరదాగా గుడికి వెళ్ళి వస్తున్నాను, అంతే. ఒక గురువారంనాడు బాబా గుడికి వెళదామని నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. తను రెడీ అవుతుండగా వాళ్ళ అత్త నన్నడిగింది, “ఎక్కడికి వెళుతున్నావయ్యా?” అని. “సాయిబాబా గుడికి” అని చెప్పాను. ఆవిడ వెంటనే, “వెళ్లు, బాబా నీకు మంచి, చెడు చెప్తారు, నీ మనసు బాగా అర్థం చేసుకుంటారు” అన్నది. నాకప్పుడు 16, 17 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ మాటలు విని, ‘గుడిలో ఉండే బొమ్మ మంచి, చెడు చెబుతుందా?’ అని మనసులోనే నవ్వుకున్నాను. కానీ ఆవిడ దగ్గర ఏం మాట్లాడకుండా, సరేనని తలాడించి స్నేహితునితో కలిసి గుడికి వెళ్ళాను. అలా చాలా గురువారాలు మేమిద్దరం కలిసి బాబా గుడికి వెళ్ళాము. ఆ తరువాత కొంతకాలానికి ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా నా స్నేహితుడు చెన్నైకి వెళ్ళాడు. నేను లోకల్‌గా ఒక కంపెనీలో ఉద్యోగంలో సెటిలయ్యాను. తరువాత వివాహం చేసుకున్నాను. బాబాను పూర్తిగా మరచిపోయాను.


అసలు కథ అప్పుడే మొదలైంది. నాకు ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడల్లా బాబా నుంచి సందేశం రావడం స్పష్టంగా గమనించాను. అది మెసేజ్ రూపంలో గానీ, పుస్తకం ద్వారా గానీ, ఎలా అయినా కావచ్చు, మన సమస్యకు సరైన సందేశమిస్తారు బాబా. నేను పనిచేస్తున్న కంపెనీలో 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న తరువాత ఒక సమస్య వలన తీవ్రమైన వేదన అనుభవించాను. ఆ వేదన నుండి బయటపడగలిగేవాణ్ణి కాదు. ఉద్యోగం మానుకోవాలని కూడా అనుకునేవాణ్ణి. అలాంటి సమయంలోనే ఒక స్నేహితుడు మాటల సందర్భంలో నాతో, ‘నీకు ఒక మూవీ యాప్ పంపిస్తాను’ అన్నాడు. ‘సరే, పంపమ’న్నాను.  ఇంటికి వెళ్లిన తరువాత స్నానం చేసి ఆ యాప్ ఓపెన్ చేశాను. ఆశ్చర్యంగా, ‘శ్రీసాయిసచ్చరిత్ర’ వచ్చింది. చదివాను. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు సరియైన సమాధానం అందులో దొరికింది. ‘ఇలాంటి పుస్తకం ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదవలేదు?’ అనుకున్నాను. బాబా అనుగ్రహంతో నా సమస్య నుంచి నిలదొక్కుకున్నాను. తరువాత ఆ యాప్ పంపిన స్నేహితుడితో, “నువ్వు పంపిన పుస్తకం చాలా బాగుంది” అని చెబితే, “ఆ పుస్తకం నేను చూడలేదు” అన్నాడు. “సరేలే, ఏదయినా కానీ మంచి మాత్రమే జరిగింది” అనుకున్నాను. 


నా జీవితంలో ఏవైనా మంచిపనులు గానీ, సమస్యలకు పరిష్కారాలు గానీ గురువారంనాడే జరగడం గమనించాను. నాకు కొడుకు పుట్టింది కూడా గురువారంనాడే. బాబుకి ‘సాయి’ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను బాబాను చూడనిరోజు లేదు, బాబాను తలవనిరోజు కూడా లేదు


ఈమధ్యకాలంలో నేను ఇంటినిర్మాణం మొదలుపెట్టాను. అందుకోసం పి.యఫ్ లోన్‌కి అప్లై చేశాను. సిస్టమ్‌లో జాయినింగ్ డేట్ లింక్ అవలేదు. ఇప్పుడు లింక్ చేసుకుందామనుకుంటే, “అందుకు టైం పడుతుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల స్టాఫ్ సగంమందే ఉన్నారు, పనిపూర్తవడానికి లేటవుతుంది” అన్నారు సంబంధిత అధికారులు. దాంతో నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, నాకు డబ్బు చాలా అవసరం. పాత ఇంటిని చదరం చేసి ఫ్యామిలీ మొత్తం బాడుగ ఇంటికి మారాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా పి.యఫ్ రాకపోతే నాకు ఎంత భయమేస్తుందో కదా. చాలా బాధపడేవాణ్ణి. “పిలిస్తే పలుకుతానంటావు. ఇప్పుడు ఎందుకు పలకవు? ఏమీ తెలియనప్పుడు కొంచెం కొంచెంగా నీ మార్గంలోకి లాక్కున్నావు. మరి ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నావు? నువ్వు చెప్పే పద్ధతులు ఒక్కొక్కటిగా ఆచరణలో పెట్టుకుంటూ వస్తున్నాను కదా, అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?” అని బాబాను నిందించేవాణ్ణి. కళ్లలో నీళ్లు తిరిగేవి, కానీ ఏడ్చేవాణ్ణి కాదు. ఒక వారంరోజులపాటు బాబాను ఎంతో గాఢంగా ప్రార్థించాను. “ఆధ్యాత్మికతను బలంగా నమ్మాను, నా నమ్మకాన్ని వమ్ముచేయకు బాబా. నాకున్న ఒకే వ్యసనం ఖైనీ (తంబాకు). దాన్ని కూడా నీకు దక్షిణగా సమర్పించుకుంటాను (వదులుకుంటాను)” అని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారం అయింది


గురువు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. గురువుకు కేవలం నమస్కారం చేస్తే సరిపోదు. మనం ఆయన అడుగుజాడలను అనుసరించాలి. సలహాలు ఎవరైనా ఇస్తారు. కానీ, ఏదయినా తేడా వస్తే, “నేనేం చేయగలను? ఏదో చెప్పాను, అంతే!” అనేస్తారు. మనిషికి సాటిమనిషి సహాయం చేయగలడు, కానీ అది కొంతవరకే. ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితుల్లో కచ్చితంగా మనకు సహాయపడగలవారు గురువు మాత్రమే! స్వార్థం నిండిన ప్రస్తుత పరిస్థితుల్లో దైవాన్ని నమ్మడం అత్యావశ్యకం. 


నేను ఇదివరకటిలా లేను, చాలా మారాను. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతిరోజూ పూజ చేయనిదే ఏమీ తినటం లేదు. “తినేముందు అన్నం సమృద్ధిగా బయట విడచిరా!” అని బాబా చెప్పినట్లుగా, తినేముందు కొంత అన్నం బయట విడిచిపెట్టి తరువాత తింటున్నాను. స్వార్థం, అసూయ పూర్తిగా వదిలేశాను. ‘ఇవ్వడంలో ఆనందం ఉంద’నే బాబా వాక్కును బలంగా నమ్ముతున్నాను. నేను ఎక్కువగా సోషల్ మీడియా వాడుతున్నానంటే అది బాబా గురించి అందరికీ తెలియజేయడానికే. బాబా లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికానో తెలియదు. కానీ, ఇప్పుడు మాత్రం బాబా లేకుండా ఒక్కరోజు కాదుకదా, ఒక్కక్షణం కూడా బ్రతకలేను. బాబా కళ్లల్లోకి చూస్తూ రోజులు, సంవత్సరాల తరబడి ఆనందంగా ఉండిపోగలను. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఇంటికి 'సాయి నిలయం' అని పేరు పెడతాను. ఆరోజున బాబాను ‘ఒక బొమ్మ’ అన్నాను, ఈరోజున ‘నాకున్న బలమైన ఆస్తి సాయిబాబా మాత్రమే’ అని ప్రగాఢంగా నమ్ముతున్నాను. సమస్యలు ఎదుర్కొన్న తరువాతే మనలో బలమైన మార్పు వస్తుంది, సమస్యల వలనే మన గురువు ఎవరో, మన గమ్యమేమిటో మనం తెలుసుకోగలం. సమస్యలకు మనం కృతజ్ఞత కలిగివుండాలి. ఆధ్యాత్మికతను మరింత బలంగా ఆచరించే శక్తిని ఇవ్వమని బాబాను ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా జీవితాన్ని బాబాకు సమర్పణ చేయాలనుకుంటున్నాను. అది ఎలాగో నాకు తెలియదు, కానీ బాబా కచ్చితంగా తెలియజేస్తారని బలంగా నమ్ముతున్నాను. నా పేరు నాకు అవసరం లేదు, నాకు ‘సాయిభక్తుడు’ అన్న పేరే కావాలి. నేను గురువుకు తగ్గ శిష్యుడిగా బ్రతకాలి.


పరీక్షలు విజయవంతంగా వ్రాయించిన బాబా


సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నేను సాయిభక్తుడిని. నేను పి.జి రెండవ సంవత్సరం చదువుతున్నాను. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఈసారి పరీక్షల సమయంలో నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. నేను సాధ్యమైనంతవరకు మందులు వాడకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే, ఈసారి ఎందుకోగానీ ఏం చేసినా తలనొప్పి తగ్గలేదు. మా అమ్మగారు నా తలనొప్పి తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో నేను పరీక్షలు వ్రాయలేనేమో అనుకున్నాను. అలా ఉండగా ఒకరోజు (పరీక్షకు రెండురోజుల ముందు) నేను బాబా గుడికి వెళ్లాను. ఆరోజు ఏకాదశి. బాబాకు మధ్యాహ్న ఆరతి ఇస్తున్నారు. నిజానికి నాలుగు రోజుల ముందు నేను బాబా ఆరతికి వెళ్లాలనుకున్నాను. కానీ తలనొప్పి వల్ల వెళ్ళలేకపోయాను. ఆ సంగతి గుర్తుకు వచ్చి, 'బాబా నన్ను సరిగ్గా ఆరతి సమయానికి రప్పించుకున్నార'ని చాలా సంతోషించాను. ఆరతి పూర్తయ్యేవరకూ ఉండి, ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చాను. అద్భుతమేమిటంటే, అప్పటికి సుమారు వారం రోజులుగా ఏమి చేసినా తగ్గని తలనొప్పి చాలావరకు తగ్గిపోయింది. దాంతో పరీక్షలకు కొద్దిగా చదవగలిగాను. కానీ పరీక్ష జరిగేరోజున మళ్లీ తలనొప్పి రావటంతో ఒక గంటసేపు పరీక్ష వ్రాశాక, పేపర్లు ఇచ్చేసి వచ్చేద్దామనుకున్నాను. కానీ బాబాపై భారం వేసి ఎలాగో పూర్తిగా వ్రాశాను. అది కూడా బాబా దయవలన బాగా వ్రాయగలిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా అండగా ఉండగా ఏ సమస్యా మన దరి చేరదు. "ధన్యవాదాలు బాబా! అందరినీ ఎల్లప్పుడూ చల్లగా చూడండి, అందరినీ రక్షించండి బాబా". బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలు ఇంకోసారి పంచుకుంటాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ఊదీ మహిమ


ప్రతి భక్తునికీ ఈ బ్లాగ్ ఒక 'ఆధునిక సచ్చరిత్ర' వంటిది. ఈ అద్భుతమైన బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు శిరీష. 2021, జూన్ మొదటి వారంలో బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆరోజు ఉదయాన్నే నా ఎడమచేతి మణికట్టు చాలా నొప్పిగా అనిపించింది. స్నానం చేసి పూజ చేస్తున్నప్పుడు నేను కొద్దిగా బాబా ఊదీని నా మణికట్టుకి రాసి, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. బాబా దయవలన అప్పటినుండి నొప్పి క్రమంగా తగ్గుతూ మరుసటిరోజుకి పూర్తిగా అదృశ్యమైంది. "బాబా! మీకు ధన్యవాదాలు".


సాయిభక్తుల అనుభవమాలిక 847వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రేమతో సమస్యలు తీర్చిన బాబా
2. కష్టం నుండి బయటపడేసిన బాబా
3. తోటి భక్తుల అనుభవాల ద్వారా అభయమిస్తున్న బాబా

ప్రేమతో సమస్యలు తీర్చిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. ఒకరోజు ఉన్నట్టుండి నాకు గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన నొప్పి చాలా తీవ్రంగా వచ్చింది. అలా నొప్పి వచ్చినప్పుడు నేను సాధారణంగా గ్లూకోజ్ ఎక్కించుకోవలసి ఉంటుంది. అయితే, ఈసారి కరోనా సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళడానికి నాకు భయం వేసింది. అప్పుడు నేను, "బాబా! గ్లూకోజ్ ఎక్కించుకోకుండానే నాకు నయమయ్యేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. తరువాత ఎలాగో ధైర్యం చేసి హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టరు రెండురోజులకి మందులు ఇచ్చారు. కానీ ఆ మందులతో నొప్పి తగ్గలేదు. మళ్ళీ డాక్టరుని సంప్రదిస్తే, మందులు మార్చి ఇచ్చారు. దాంతో నొప్పి తగ్గింది. బాబా ఎంతో దయతో గ్లూకోజ్ ఎక్కించాల్సిన అవసరం లేకుండా మందులతో తగ్గేలా అనుగ్రహించారు. "బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ. నాకు ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. దాన్ని తొందరగా నయం చేయండి బాబా. మీదే భారం తండ్రీ. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు తండ్రీ".


మరొక చిన్న అనుభవం:


ఒకసారి మా అమ్మావాళ్ళింట్లో వాషింగ్ మెషీన్లోంచి నీళ్ళు బయటికి పోకుండా స్ట్రక్ అయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎవరైనా వస్తారా, లేదా అన్న టెన్షన్‌తో అమ్మ బాబాకు మ్రొక్కుకుంది. బాబా దయవల్ల మా తమ్ముడు నీళ్ళు బయటికి పోవడానికి చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలించి రెండు రోజులకి నీళ్ళు బయటికి పోయాయి. ఆ విధంగా బాబా సమస్యను పరిష్కరించారు. "బాబా! చిన్న విన్నపం తండ్రీ. నైట్ షిఫ్ట్స్ వలన నా సోదరుని ఆరోగ్యం పాడవుతోంది. దయచేసి తనకు ఉదయం షిఫ్ట్స్ వచ్చేలాగా ఆశీర్వదించండి బాబా".


ఇంకో అనుభవం:


ఈమధ్య మా అమ్మ చేతివేళ్ళలో ఒక గోరు మీద లైన్ ఒకటి ఏర్పడింది. కొన్ని రోజులకి మరో గోరుకి కూడా అలాంటి లైన్ వచ్చింది. నేను అమ్మతో, "అలా ఎందుకు వస్తుందో? ఒకసారి డాక్టరుకి చూపించుకోమ"ని చెప్పాను. దాంతో అమ్మ వెళ్లి డాక్టరుకి చూపించుకుంది. డాక్టరు, "ఒక్కోసారి నార్మల్‌గా అలా వస్తుంటాయి. అలాగే సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నా వస్తాయి" అని కొన్ని టెస్టులు వ్రాశారు. నాకు భయం వేసి బాబాకు నమస్కరించుకుని, "రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని రావాలి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి. దాంతో డాక్టరు 'కాల్షియమ్ తక్కువగా ఉంద'ని చెప్పి, అందుకు మందులు రాసిచ్చి, "20 రోజులు వాడిన తరువాత మళ్లీ రండి, చూద్దాం" అన్నారు. "బాబా! మీ దయవల్ల అప్పటిలోగా అమ్మ గోర్లలో ఉన్న సమస్య నయం కావాలి తండ్రీ. బాబా! అమ్మకి వేరే ప్రాబ్లమ్ కూడా ఉంది. అది కూడా తొందరగా నయమై తను ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రీ. మా రెండు కుటుంబాల బాధ్యత మీదే తండ్రీ. మా అందరి ఆరోగ్యాలు బాగుండేలా దీవించండి సాయీ. మీ దీవెనలు మాపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ కరోనాని అంతం చేయండి సాయితండ్రీ. చివరిగా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రీ".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


కష్టం నుండి బయటపడేసిన బాబా


నేను సాయిభక్తురాలిని. బాబా ఆశీస్సులతో మరోసారి నా అనుభవాలను పంచుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను పనిచేస్తున్న ఆఫీసులో కరోనా కారణంగా ఇంటినుండి పనిచేసే అవకాశం ఇచ్చినందున మేమంతా ఇంటినుండే పనిచేస్తున్నాము. ఇటీవల ఒక గురువారంనాడు మా సార్‌కి కరోనా వచ్చి హైదరాబాదులో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని నాకు తెలిసింది. నిజానికి తనకొక చిన్నబాబు ఉన్నందున ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. అయినప్పటికీ ఆయనకి కరోనా వచ్చింది. అప్పుడు నేను, "వచ్చే గురువారానికల్లా మా సార్‌కి కరోనా తగ్గిపోవాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన మరుసటి గురువారానికి మా సార్ బాగున్నారని తెలిసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబాకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.


మరో అనుభవం:


నేను ఒక వ్యక్తి విషయంలో చాలా దారుణంగా మోసపోయాను. అది నా తప్పే. ఎందుకంటే, ఆ విషయంలో నా సాయి నాకు కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ నేను వాటిని గుర్తించలేకపోయాను. మాయలో ఉన్నప్పుడు మనకు అలాంటివి కనిపించవు. తీరా మోసపోయాక ఒకరోజు మధ్యరాత్రి నిద్రలేచి బాగా ఏడ్చి, "బాబా! నన్ను ఈ సమస్యను నుంచి బయటపడేయండి" అని బాబాను వేడుకున్నాను. దయతో నా సాయి నన్ను ఆ కష్టం నుండి బయటపడేశారు. అయితే నాకు ఆ చెడుకాలం గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుండేది. అలా ఒకరోజు బాధలో ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ క్రింది మెసేజ్ వచ్చింది:

"గతం ముగిసిపోయింది. అది మళ్ళీ రాదు. దాన్ని నీ వర్తమానంలోకి లాగవద్దు బిడ్డా. ప్రస్తుత జీవితంతో నీవు సంతోషంగా ఉన్నావు. ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకో! నీకు నువ్వే సమస్యలు సృష్టించుకోకు. నీదైనది ఖచ్చితంగా నీదే!"


అది చూసి చాలా సంతోషించాను. "ధన్యవాదాలు సాయీ! నన్ను ఈ చెడుకాలం నుండి పూర్తిగా బయటపడేసి, నాకు మంచి భవిష్యత్తునివ్వండి". నా అనుభవాలు చదివిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


తోటి భక్తుల అనుభవాల ద్వారా అభయమిస్తున్న బాబా

 

ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ ద్వారా అందరికీ మనోధైర్యాన్ని ఇస్తున్న నిర్వాహకులకు అభినందనలు. నేను సాయిభక్తురాలిని. బాబా ఇటీవల ప్రసాదించిన కొన్ని చిన్న చిన్న అనుభవాలను నేనిప్పుడు మీతో  పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈమధ్య నాకు ఏ సమస్య వచ్చినా, దాన్ని తీర్చమని బాబాను అడిగిన మరుసటిరోజు అదే సమస్యకు సంబంధించి వేరే వారి అనుభవాలు ఈ బ్లాగులో వచ్చేవి. అది చదవగానే తద్వారా నాకు బాబా అభయమిస్తున్నట్లు అనిపించేది. అలాంటి అనుభవాలలో మొదటిది: క్రిందటి నెలలో నా కుడికన్ను ఎర్రబారి ఒక 15 రోజులు నన్ను బాగా ఇబ్బందిపెట్టింది. 'అది తగ్గితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. అలా అనుకున్న మరుసటిరోజే వేరొకరు అదే అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నారు. ఆరోజు నుంచే నా కంటి ఎరుపుదనం తగ్గటం మొదలై, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది.


మరొకసారి గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నా పొట్ట చాలా గట్టిగా అయ్యి, నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు కూడా 'ఈ సమస్య తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని బాబాకు నమస్కారం చేసుకున్నాను. మరుసటిరోజు అదే సమస్యకు సంబంధించి వేరొకరి అనుభవాన్ని ఈ బ్లాగులో చదివాను. తరువాత నా గ్యాస్ట్రిక్ సమస్య నెమ్మదిగా తగ్గిపోయింది.


క్రిందటి నెలలో మేము మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నాము. దానివలన ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నేను చాలా భయపడ్డాను. బాబా దయవల్ల ఏ సమస్యలూ రాలేదు. సకాలంలో రెండవ డోసు మాకు అందేలా అనుగ్రహించమని బాబాను  కోరుకుంటున్నాను. ఇంకా, నూతన గృహం నిర్మించుకోవాలన్న మా కోరికను మన్నించి, తమ దివ్యాశీస్సులతో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా గృహనిర్మాణం పూర్తయ్యేలా అనుగ్రహించమని బాబాను వేడుకుంటున్నాము. "నీ పాదాల యందు మాకు భక్తి, శ్రద్ధలు నిరంతరం వృద్ధి పొందేలా ఆశీర్వదించు శ్రీసాయినాథా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయీ శరణం మమ.


రాధాకృష్ణమాయి - నాలుగవ భాగం



రాధాకృష్ణమాయి బాబాకు అవసరమైనది చేస్తూ, ఇతర భక్తులతో చేయిస్తూ పగలురాత్రి తేడా లేకుండా రోజంతా బాబా సేవలో నిమగ్నమై ఉండేది. మార్గాలను శుభ్రపరచడం, మన్ను, గులకరాళ్లు తొలగించడం, జంతువుల, పిల్లల మలాన్ని ఎత్తి పారవేయడం, గుంతలు త్రవ్వి మొక్కలు నాటడం, మట్టి, ఆవుపేడతో నేలను అలకడం, కట్టెలు కొట్టడం, షాండ్లియర్లను శుభ్రపరచడం, మసీదును శుభ్రపరచడం, రంగురంగుల కాగితాలతో పువ్వులు, జెండాలు తయారుచేయడం, శిరిడీకి వచ్చే ఉత్సవ పతాకాలను, చిహ్నాలను శుభ్రపరచడం, శ్రీరామనవమి పండుగ సందర్భంగా మశీదులో ఉయ్యాల ఏర్పాటుచేయడం, గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మదినోత్సవం జరుపుకోవడం మొదలైన బాధ్యతలను ఆమె ఇతర భక్తుల సహాయంతో నెరవేర్చేది.

కొన్ని సేవలలో మాత్రం వంతులు లేవు:

రాధాకృష్ణమాయి ఎన్నో సేవలలో భక్తుల సహాయం తీసుకొనేది. కానీ కొన్ని పనులను మాత్రం తానొక్కతే చేసేది. నిజానికి ఆ పనులలో ఇతరుల జోక్యాన్ని ఆమె అస్సలు సహించేది కాదు. మసీదులో రెండు మట్టికుండలు ఉండేవి. ఆ కుండలు ఎప్పుడు, ఎలా నిండేవో, వాటిని ఎవరు నింపేవారో ఎవరూ గమనించలేకపోయారు. బాబా సన్నిధిలోని ఆ నీళ్ళను భక్తులు ఎంతో పవిత్రజలంగా భావించి సేవించేవారు. కొంతమంది భక్తులు తాము పేదరికం నుంచి బయటపడటానికి ఆ నీటిని గ్లాసులో నింపుకుని తమ ఇళ్ళకు తీసుకొనిపోయేవారు. ప్రతిరోజూ రాధాకృష్ణమాయి స్వయంగా ఆ కుండలను నీళ్లతో నింపేది. ఆ పనిలో ఆమె ఎవరి సహాయాన్నీ తీసుకునేది కాదు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా ఆ పని చేయడానికి ముందుకొస్తే, అందుకు ఆమె అభ్యంతరం చెప్పేది. దీక్షిత్ వాడా వెనకభాగంలో ఒక బావి ఉండేది. ఆ బావినుండే ఆయీ అదృశ్యరూపంలో నీళ్లు తీసుకొచ్చి ఆ మట్టికుండలు నింపేదని భక్తులు విశ్వసించేవారు. 1916లో రాధాకృష్ణమాయి కుటీరంలో వామనరావు పటేల్ బసచేశాడు. అప్పుడొకరోజు అతనికి తెల్లవారుఝామున 3 గంటలకు మెలకువ వచ్చింది. ఆ సమయంలో ఆయీ అక్కడ కనిపించకపోవడంతో అతను ఆందోళన చెంది ఆమెకోసం వెతకడం మొదలుపెట్టాడు. దీక్షిత్ వాడా వెనుకనున్న బావి వద్ద ఆమె కుండలను నీటితో నింపడం చూసి, పరుగున వెళ్లి, "దయచేసి నన్ను మీకు సహాయం చేయనివ్వండి" అని అడిగాడు. అందుకు ఆమె, "నువ్వు వెళ్ళి నిద్రపో, నాకు ఎటువంటి సహాయమూ అవసరం లేదు" అని చెప్పింది.

ఒకరోజు తెల్లవారుఝామున రాధాకృష్ణమాయి బాబా నడిచే దారిని శుభ్రపరచడం వామనరావు చూశాడు. దారిలో ఉన్న చిన్న చిన్న రాళ్లను, కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువుల మలాన్ని చేతులతో ఎత్తి పారేయడంలో ఏమాత్రం సంకోచం గానీ, అసహ్యం గానీ ఆమెకు అనిపించేవి కావు. అది చూసిన వామనరావు, "నా బాబా పవిత్ర పాదాలు ఈ నేలను తాకుతాయి. ఆ స్పర్శకు నేల మృదువుగా ఉండాలి. ఆ నేలను శుభ్రం చేసే వ్యక్తి ఎంతో భాగ్యశాలి అవుతాడు. కాబట్టి నేను కూడా ఆ పవిత్రకార్యంలో పాలుపంచుకోవాలి" అని అనుకున్నాడు. ఆ మరుసటిరోజు అతను త్వరగా నిద్రలేచి, ఆయీకి చెప్పకుండా, చీపురు తీసుకొని ఆ మార్గాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న రాళ్లను ప్రక్కకు తీసి దారంతా శుభ్రం చేస్తూ కొంతదూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసి, అంతవరకూ తాను శుభ్రం చేసిన మార్గమంతా రాళ్లు, మట్టిగడ్డలతో నిండి ఉండటం గమనించి నిశ్చేష్టుడయ్యాడు. మళ్ళీ మళ్ళీ అతను ఆ మార్గాన్ని శుభ్రం చేసి అలసిపోయాడు, కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అదంతా ఎవరు చేస్తున్నారో అతనికి అర్థం కాలేదు. కొన్నిరోజుల తరువాత రాధాకృష్ణమాయి కుటీరంలో కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బూటీ, డాక్టర్ పిళ్ళై తదితర భక్తులు భోజనం చేస్తున్నప్పుడు తాత్యాపాటిల్ తన అనుభవాన్నిలా వివరించాడు: "ఒకరోజు నాకు, రాధాకృష్ణమాయికి మధ్య గొడవ జరిగింది, దానివల్ల ఆమెకు చాలా కోపమొచ్చింది. ఆ కోపాన్ని ఆమె చాలా వింతగా వ్యక్తపరచింది. ఆ గొడవ జరిగిన తరువాత నేను పొలానికి వెళ్లి నా పనిలో నిమగ్నమయ్యాను. హఠాత్తుగా కొన్ని రాళ్ళు ఎగిరొచ్చి నా మడమలపై పడసాగాయి. దాంతో నేను తీవ్రంగా గాయపడ్డాను. అయితే ఆ రాళ్లను ఎవరు విసురుతున్నారో నాకు అర్థం కాలేదు. అయితే ఆ తరువాత ‘అదంతా రాధాకృష్ణమాయి చేసిన మాయ’ అని తెలుసుకున్నాను" అని చెప్పాడు. తాత్యా అనుభవం ద్వారా, 'ఆరోజు తానంతగా శుభ్రపరచినప్పటికీ మార్గం శుభ్రం కాకపోవడానికి కారణం రాధాకృష్ణమాయి యోగక్రియేననీ, ముందుగా ఆమె అనుమతిని తీసుకోలేదు కాబట్టి తాను ఆ పని చేయడం ఆమెకు ఎంత మాత్రమూ ఆమెకు ఆమోదయోగ్యం కాద'నీ వామనరావు గ్రహించాడు.

శ్రీరామనవమి ఉత్సవ ఏర్పాట్లు:

శిరిడీలో 1897 నుండి 1911 వరకు శ్రీరామనవమినాడు ఉరుసు ఉత్సవము జరుగుతుండేది. ఆరోజున పగలు హిందువులకు పవిత్రమైన జెండా ఉత్సవము, రాత్రులందు మహ్మదీయులకు పవిత్రమైన చందనోత్సవము జరుగుతుండేవి. ఇరుమతాలవారు కలసిమెలసి ఎట్టి అరమరికలు లేకుండా ఆ ఉత్సవాలలో పాల్గొంటుండేవారు. రాధాకృష్ణమాయి శిరిడీ వచ్చినప్పటినుండి ఆ ఉత్సవాలకు సంబంధించి మసీదులో చేయవలసిన ఏర్పాట్లను, భక్తుల అవసరాలను స్వయంగా తానే చూసుకొనేది. బయటపనులు తాత్యాకోతేపాటిల్ చూసుకొంటుండేవాడు. 1912 నుండి పై ఉత్సవములతో పాటు ఉత్సవాన్ని తొమ్మిది రోజులు నిర్వహించడం (చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు), శ్రీరామజన్మోత్సవం, హరిదాసుల భగవత్ సంకీర్తన (హరికథ) వంటి విశేష సంస్కరణలను ఆయీ తీసుకొచ్చింది. మసీదులో నిరంతరము ధుని వెలుగుతుండటం వలన గోడలు మసిపట్టి ఉండేవి. ఉత్సవానికి ముందు బాబా చావడిలో నిద్రించే రాత్రి ఆయీ ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ బయటపెట్టి, ధుని కారణంగా మసీదు గోడలకు పట్టిన మసినంతా శుభ్రంగా కడిగి, సున్నము వేయించేది. ఉత్సవానికి కావలసిన వస్తువులన్నీ సిద్ధపరిచేది. అంతేకాదు, శిరిడీని అందంగా అలంకరించడంలో ఆమె చేసిన కృషి ప్రశంసనీయం. ఉత్సవ సమయంలో ఆమె నివాసం భక్తులతో కిటకిటలాడుతుండేది. వారందరి అవసరాలను ఆమె చూసుకుంటుండేది. 1912లో శ్రీరామజన్మోత్సవం సందర్భంగా ఆయీ ఒక ఊయలను మసీదులో వ్రేలాడదీసింది. కీర్తన ముగిశాక భక్తులు తన్మయులై జయకారాలతో, నృత్యగీతాదులతో గులాల్ పైకి ఎగురవేశారు. అనుకోకుండా అది బాబా కళ్ళలో పడడంతో ఆయన కోపంతో అందరినీ తిట్టసాగారు. బాబా ఆ కోపంలో అక్కడ కట్టివున్న ఊయలను ముక్కలు చేస్తారేమోనని ఆయీ భయపడి, వెంటనే ఆ ఊయలను విప్పేయమని వెనుకనుండి కాకామహాజనితో చెప్పింది. ఆమె చెప్పినట్లే ఊయలను విప్పటానికి మహాజని మెల్లగా ముందుకు జరిగాడు. బాబా పట్టరాని కోపంతో కాకామహాజని మీదకు ఉరికారు. కొంతసేపటి తరువాత బాబా శాంతించాక ఊయలను విప్పడానికి అనుమతి కోరినప్పుడు, "అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు? ఇంకా దాని అవసరముంది కదా!" అన్నారు బాబా. బాబా ఊరికే ఏదీ అనరు. ‘మరి ఆ అవసరమేమిటి?’ అని ఆలోచించగా, 'బాబా చెప్పింది నిజమే! ఉత్సవం ఇంకా సమాప్తి కాలేద'ని వారికి స్ఫురించింది. శ్రీరామజన్మోత్సవం జరిగిన మరునాడు గోపాలకాలా ఉత్సవం జరిగితేనేగానీ ఉత్సవం సంపూర్ణం కాదు. ఇలా బాబా సన్నిధిలో జరిగే ప్రతి విషయంలోనూ రాధాకృష్ణమాయి ప్రమేయముండేది. 

1913లో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నామసప్తాహమును కూడా రాధాకృష్ణమాయి ప్రారంభించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా ఆమే స్వయంగా చేసేది. భక్తులు వంతులవారీగా వచ్చి ఆ ఏర్పాట్లలో పాల్గొంటుండేవారు. రాధాకృష్ణమాయి కూడా తెల్లవారుఝామున నామసప్తాహంలో పాల్గొంటుండేది. శ్రీరామనవమి రోజున బాబా భక్తులకు సొంఠ్‌వడ (పంజిరి) ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు. ఆ ప్రసాదాన్ని రాధాకృష్ణమాయి స్వయంగా తానే తయారుచేసేది. చాలారోజుల ముందు నుండే ఆమె ఆ ప్రసాదం తయారీకి చేయవలసిన పనులను ప్రారంభించి, ఎండిన అల్లం (సొంఠి), మెంతులు, గసగసాలు, కొబ్బరి, వాము బాగా ఎండబెట్టి, వేయించి, పొడి చేసి సిద్ధంగా ఉంచుకునేది. ఉత్సవం సందర్భంగా భారీఎత్తున అన్నసంతర్పణ కూడా జరిగేది. అందుకు అవసరమైన భోజనపదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలోనే తయారయ్యేవి. ఆమెతో సహా ఎందరో సాయిభక్తులు తమంతటతామే ఆ వంటపనులలో నిమగ్నమయ్యేవారు. రానురానూ ఈ ఉత్సవం అభివృద్ధిచెంది నేడు శిరిడీలో మహావైభవంగా జరుగుతోంది. ఈ విధంగా శిరిడీలో జరిగే కార్యక్రమాలకు, శిరిడీ వైభవానికి రాధాకృష్ణమాయియే మూలకారకురాలు.

బాబాపట్ల ఉన్న భక్తిప్రేమల వలన బాబా సేవలో ఏ కష్టానికీ ఆయీ చలించేదికాదు. అందుకు అద్దంపట్టే ఒక సన్నివేశాన్ని జస్టిస్ యం.బి.రేగే ఒక లేఖలో ఇలా వ్రాశాడు: "1914వ సంవత్సరం గురుపూర్ణిమ వేడుకలకు నేను హాజరవగలనో లేదోనని మొదట సందేహించాను. అయినప్పటికీ సమయానికి నేను శిరిడీ వెళ్లగలిగాను. నేనింకా అక్కడికి చేరుకోకముందే బాబా తమ భిక్ష నుండి ప్రతిరోజూ మామూలుగా పంపే ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని రాధాకృష్ణమాయికి పంపారు. దాంతో, ఆమెకు నేను శిరిడీ వస్తున్నట్లు అర్థమై, ఆ విషయాన్ని అందరికీ చెప్పింది. ఆమె ఇంటిలో వంట మొదలైంది. సరిగ్గా ఉదయం 9 గంటలకు నేను అక్కడికి చేరుకున్నాను. సాధారణంగా వంట ఆయీ ఇంటిలోనే జరిగేది. కానీ, “నువ్వు రాకపోయివుంటే వేరే ఎక్కడైనా వంట ఏర్పాట్లు చేసేదాన్ని” అని ఆమె నాతో చెప్పింది. అంతలో వంట చేస్తున్న వాళ్ళు మసాలా ద్రవ్యాలు నూరడానికి ఒక రాయి కావాలని అడిగారు. రాయిని ఇంటిలోకే తీసుకొస్తే మంచిదని తలచి నేను, ఆయీ కలిసి అతికష్టం మీద ఒక పెద్దరాయిని కదిలించాము. దాన్ని ఆయీ ఇంటి ద్వారం వద్దకు తీసుకొచ్చేసరికి పురంధరే వచ్చి సహాయం చేయబోయాడు. ఆ ప్రయత్నంలో రాయి ఒకవైపుకు ఒరిగి నా చేయి నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో హఠాత్తుగా ఆయీ ఆ రాయిని తనవైపుకు లాక్కుంది. దాంతో ఆమె కుడిచేతి చూపుడువేలు రెండుముక్కలయ్యేంతగా నలిగిపోయింది. ఆమెకు ఎంత బాధ కలిగివుంటుందో ఎవరైనా ఉహించవచ్చు. కానీ ఆయీ మాత్రం ఏమీ జరగనట్లు ఒక గుడ్డముక్కను నూనెలో తడిపి రక్తం కారుతున్న ఆ వేలికి చుట్టి వంటలో సహాయం చేయడానికి వెళ్ళింది. పనులన్నీ పూర్తయిన తరువాత ఆమె నన్ను పిలిచి, "నొప్పి చాలా తీవ్రంగా ఉంది, తోటలోకి వెళ్లి ఏడవాలని ఉంది" అని అన్నది. దాంతో ఇద్దరమూ తోటలోకి వెళ్ళాము. అక్కడ ఆమె అరగంటపాటు తనివితీరా ఏడ్చింది. తరువాత మేము తిరిగి మా సాధారణ పనులలో పడ్డాము. ఆమెకు తన శరీరంపై ఎంతటి నియంత్రణ! సద్గురు సేవలో బాధ, సంతోషాల పట్ల ఎంతటి ఉదాసీనత!"

బాబా – ఆయీలకు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ:

బాబాపట్ల ఉన్న అంతులేని ప్రేమతో రాధాకృష్ణమాయి వారి ప్రతి అవసరాన్నీ తెలుసుకొని ఎంతో శ్రద్ధగా సమకూర్చేది. అందుకే ఏ చిన్న అవసరమొచ్చినా, సమస్య ఎదురైనా అందరూ ఆమెనే సంప్రదించేవారు. ఒకసారి పురందరే తన కుటుంబంతో శిరిడీ వెళుతున్నప్పుడు, శ్రీమతి తర్ఖడ్ రెండు పెద్ద నల్లని వంకాయలను శ్రీమతి పురందరే చేతికి ఇచ్చి, ఒక వంకాయతో భరీత్ (వంకాయ వాడ్చి నూరిన పచ్చడి), రెండవదానితో వంకాయ వేపుడుకూర చేసి బాబాకు భోజనంలో వడ్డించమని కోరింది. మొదటిరోజున పురందరే భార్య వంకాయతో భరీత్ చేసి, మిగతా పదార్థాలతోపాటు దానిని కూడా బాబా భోజనపళ్ళెంలో వడ్డించింది. బాబా వంకాయ భరీత్ తిని, వెంటనే తమకు వంకాయ వేపుడుకూర కావాలనే కోరికను వెలిబుచ్చారు. శిరిడీలో బాబా భోజన ఏర్పాట్లను చూసే రాధాకృష్ణమాయికి ఏం చేయాలో తోచలేదు. అది వంకాయలు దొరికే కాలం కూడా కాదు కనుక, శిరిడీలాంటి గ్రామంలో వంకాయలు దొరకడం కష్టం. అందువల్ల, ఆమె అక్కడున్న ఆడవారిని అడిగి, వంకాయ భరీత్ తెచ్చింది శ్రీమతి పురందరే అని తెలుసుకుని, పరుగున ఆమె వద్దకు వెళ్ళి, వంకాయలు ఇంకా ఉన్నాయేమోనని అడిగింది. అప్పుడామె తన దగ్గర ఇంకొక వంకాయ ఉందనీ, దానితో మరునాడు వంకాయ వేపుడుకూర చేసి బాబాకు సమర్పించాలని ఉంచినట్లు చెప్పింది. అప్పుడు రాధాకృష్ణమాయి ఆమెతో, బాబా అప్పటికప్పుడే తమకు వంకాయ వేపుడుకూర కావాలన్నారని చెప్పి, ఆ వంకాయను తీసుకెళ్ళి, త్వరత్వరగా వేపుడుకూర చేసి బాబా కొరకు పంపింది. బాబా ఆ వంకాయకూర వడ్డించేవరకు వేచి చూసి, దానిని స్వీకరించిన తరువాతే తమ భోజనం ముగించి లేచారు. బాబా, తమ భక్తులపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తీకరించడమే కాకుండా, తమ భక్తుల భక్తి, ప్రేమలను తాము స్వీకరించినట్లు తెలియచేసే అద్భుతమైన సంఘటన ఇది.

బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడేవారు. ఆ వ్యాధి వలన ఆయన భోజనం చాలా తక్కువగా తీసుకునేవారు. రోజూ మధ్యాహ్నంపూట లక్ష్మీబాయిషిండే తీసుకువచ్చే పాయసం మాత్రమే కొద్దిగా తింటుండేవారు. అందువలన బాబా రోజురోజుకీ నీరసించిపోతుండటంతో రాధాకృష్ణమాయి తట్టుకోలేక సాయిశరణానందకి ఒక లేఖ వ్రాసింది. "వామన్! బాబా ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల మధ్యాహ్నంపూట పాయసం తప్ప ఏమీ తినటం లేదు. వారికిద్దామంటే ఇక్కడ మంచి చిక్కటి పాలు కావలసినన్ని దొరకటం లేదు. అందువల్ల నువ్వు రోజుకు సుమారు ఎనిమిది శేర్ల పాలిచ్చే కాఠియావాడీ ఆవును పంపితే చాలా బాగుంటుంది. ఇది బాబాకు ఉత్తమమైన సేవ అవుతుంది. ఒకవేళ అలాంటి ఆవు దొరికినట్లైతే గనక తాత్యాపాటిల్‌కి కూడా ఒక ఆవు కావాలట, అతనికోసం కూడా ఒక ఆవును కొను. అందుకోసం కావలసిన డబ్బును ప్రస్తుతం నువ్వు ఏర్పాటు చేయి. తరువాత నేను నీకిస్తాను" అని వ్రాసింది. ఆ సమయంలో అతని వద్ద డబ్బులేక తన చెల్లెలి చిన్నపూసల బంగారు గొలుసును అమ్మేసి రెండు ఆవులను కొని శిరిడీ పంపించాడు. ఆ ఆవు పాలను ఆయీ రోజూ బాబాకు నివేదించేది. అది ఆమెకు బాబాపట్ల ఉన్న ప్రేమ.


బాబా కూడా ఆమెపట్ల అంతే ప్రేమాదరాలు చూపేవారు. ఆమె శిరిడీ వచ్చినప్పటినుండి తాము ప్రతిరోజూ భిక్షకి వెళ్లొచ్చాక షామా ద్వారా ఆమెకు రొట్టె, కూర మొదలైనవి బాబా పంపుతుండేవారు. అంతేకాదు, ప్రతిరోజూ సాయంత్రం లక్ష్మీబాయిషిండే రొట్టె, కూర బాబాకు నివేదిస్తుండేది. బాబా కొంచెం తిని, మిగిలినది ఆమె ద్వారా రాధాకృష్ణమాయికి పంపుతుండేవారు. ఆ విధంగా ఆమె బాబా భుక్తశేషాన్నే భుజిస్తుండేది. అప్పుడప్పుడు రాత్రిపూట కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బూటీ లేదా ఇతర భక్తులు తమ ఆహారాన్ని తెచ్చి రాధాకృష్ణమాయితో పంచుకునేవారు. అందువలన ఆమెకు వంట చేయాల్సిన అవసరం ఉండేది కాదు. రోజులో ఉదయంపూట ఒక్కసారే ఆమె బాబా కోసం అల్పాహారం తయారుచేయడానికి వంట చేసేది. ఆమె ధరించే తెల్లని వస్త్రాలను కూడా బాబానే ఆమెకు పంపుతుండేవారు. ఆ వస్త్రాలను ఆమె ఎంతో అమూల్యమైనవిగా భావించి ధరిస్తుండేది. అంతకుమించిన అవసరాలేమీ ఆమెకు లేనందున వేటినీ సమకూర్చుకొనవలసిన అవసరం ఉండేదికాదు. ఆమె మరణించేంతవరకు బాబా ఆమెకు అన్నవస్త్రాలు సమకూరుస్తూ, ఎవరూ లేని ఆమెకు అన్నీ తానయ్యారు. అంతటి భాగ్యురాలామె.

తరువాయి భాగం వచ్చేవారం ... 

 
source: దేవుడున్నాడు లేదంటావేం?, శ్రీ సాయి సచ్చరిత్ర,

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo