సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 841వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నాతోనే ఉండి నన్ను నడిపించిన బాబా
2. ముడుపు కట్టించుకుని ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. బాబా దయవలన వచ్చిన మార్పు
4. 'సాయిబాబా తమ భక్తులను కాపాడుతారు' అనేది అక్షరసత్యం

నాతోనే ఉండి నన్ను నడిపించిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః


నా పేరు ధనలక్ష్మి. మాది విశాఖపట్నం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు నా అనుభవాలు రెండు, మూడుసార్లు పంచుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఒక అనుభవాన్ని పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. కొన్నిరోజుల క్రితం పంచుకున్న అనుభవానికి ఇది కొనసాగింపు వంటిది. 


నాకు 2021, మే 18న కరోనా వచ్చింది. కానీ అది కరోనా అని నాకు మొదట్లో తెలియదు. నాకు లో-ఫీవర్ ఉంటే, 'అది నార్మల్ ఫీవర్ అయివుంటుంది. నేను జాగ్రత్తగానే ఉంటున్నాను కదా, నాకెందుకు కరోనా వస్తుంది?' అని అనుకున్నాను. అయితే, డోలో టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ రెండు రోజులైనా జ్వరం తగ్గలేదు. మూడవరోజు కూడా అలానే ఉండటంతో నాలుగవరోజు, మే 21న కోవిడ్ టెస్టు చేయించుకున్నాను. దాంతో మే 22న నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వెంటనే డాక్టరుని ఫోన్లో సంప్రదించి మందులు వాడటం మొదలుపెట్టాను. అయినా భయంతో మా పాపను వెంటనే హైదరాబాద్ పంపించాను. అక్కడికి వెళ్ళాక తనకు టెస్ట్ చేయిస్తే, తనకు కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో తను కూడా మందులు వాడటం మొదలుపెట్టింది. కాకపోతే, తనకి కోవిడ్ చాలా తక్కువగా వచ్చింది. కోవిడ్ లక్షణాలేమీ లేవు, నార్మల్‌గానే ఉంది. కానీ నాకే లో-ఫీవర్, దగ్గు. రెండు రోజులు ఒక్కదానినే ఇంట్లో ఉండటం వల్ల భయంభయంగా ఉండేది. అన్ని భయాలూ చెప్పలేను. జ్వరంతో, నీరసంతో మరుక్షణం ఎలా ఉంటుందో కూడా కష్టం అన్నట్లుండేది నా పరిస్థితి. అప్పుడు నేను బాబాను, "నీవు తప్పితే నాకు ఎవరూ లేరు. మీరే నాకు ఇంట్లోనే కరోనా తగ్గించాలి బాబా" అని వేడుకుని, బాబా ఊదీ పెట్టుకుని, ఆయననే తలచుకుంటూ ఉండేదాన్ని. ఫీవర్ వస్తూపోతూ ఉండేది. అప్పుడు నాకు తెలిసినవాళ్ళు నన్ను బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. అలాగే చేశాను. బాబా దయవలన రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వచ్చాయి. కానీ ఫీవర్ తగ్గడం, రావడం జరుగుతుండేది. ఒకప్రక్క భయం, మరోప్రక్క 'బాబా ఉన్నారు, నాకు తప్పక సహాయం చేస్తార'ని గట్టి నమ్మకం. ఇలా సతమతమవుతూ, "బాబా! మీరే నాకు సర్వమూ" అని వేడుకుంటుండేదాన్ని.


తరువాత బాబా ఇంకొకరి ద్వారా మళ్లీ బ్లడ్ టెస్టుకు ఇవ్వమని చెప్పించారు. దాంతో మళ్ళీ టెస్టుకి బ్లడ్ ఇచ్చాను. ఈసారి రిపోర్టులో కొన్ని తేడాలు కనిపించాయి. ఫోన్లోనే డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని మందులు సూచించారు. అవి వాడినా ఫీవర్ తగ్గలేదు. అప్పుడు బాబా ప్రేరణ వల్ల నాకు తెలిసిన ఒక వ్యక్తికి నా బ్లడ్ రిపోర్ట్స్, నేను వాడిన మందులు అన్నీ మెసేజ్ చేశాను. అవి చూసి అతను, "వెంటనే సీటీ స్కాన్ కూడా చేయించుకుని, రిపోర్టులన్నీ తీసుకుని డాక్టర్ని కలిస్తే ట్రీట్మెంట్ మొదలుపెడతారు" అని చెప్పారు. దాంతో నేను ఆలస్యం చేయకుండా ఓపిక తెచ్చుకుని హాస్పిటల్‌కి వెళ్లి సీటీ స్కాన్ చేయించుకుని, రిపోర్ట్ తీసుకుని డాక్టర్ని కలిశాను. డాక్టర్ రిపోర్ట్ చూసి, "ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజిలో ఉంది" అని చెప్పి కొన్ని మందులిచ్చి, "ఐదు రోజుల తరువాత రండి" అని చెప్పారు. ఆ మందులు వాడుతుంటే రెండు రోజులకే కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఐదురోజులు అయిపోయాక బ్లడ్ టెస్ట్ చేయించుకుని మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్లాను. "ఇంకా కొంచెం ఉంది, తగ్గుతుంది" అని చెప్పి మందుల డోస్ కొంచెం తగ్గించి పదిరోజులకి ఇచ్చారు. నేను పదిరోజుల మధ్యలోనే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుని డాక్టరుని కలిసాను. డాక్టరు, "తగ్గుతుంది. ఇంకేం ఫరవాలేదు" అని అన్నారు. ఒంటరిగా నిస్సహాయస్థితిలో ఉన్న నాతో ఇవన్నీ చేయించింది బాబానే. లేకపోతే నా వల్ల ఇదంతా సాధ్యమయ్యేది కాదు. మామూలు జ్వరానికే మనం కదలలేం. అలాంటిది శరీరంలో కరోనా వైరస్ ఉంటే ఇంకెలా ఉంటుంది? నిజంగా బాబా లేకపోతే ఈరోజు నేను లేను.


తరువాత 2021, జూన్ 12న నేను డాక్టరుగారిని, "నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను. ఊరు వెళ్ళొచ్చా?" అని అడిగాను. "మూడు వారాలు అయిందిగా వెళ్ళండి" అన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ బయలుదేరాను. బాబా నాతోనే వస్తున్నారు. తిరిగి నన్ను, నా బిడ్డను హైదరాబాద్ నుండి విశాఖపట్నంకి క్షేమంగా చేరుస్తారు. బాబాకు కోటి నమస్కారాలు చేసినా సరిపోదు. ఇలా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం తప్పితే నేను బాబాకు ఏం చేయగలను? చివరిగా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను: "బాబాను శ్రద్ధగా నమ్మండి. బాబా అన్నీ చూసుకుంటారు. నమ్మకం మాత్రమే ముఖ్యం. ఇది సత్యం, ముమ్మూటికీ సత్యం. నాకు ఒకటేమిటి, చాలా అనుభవాలు ఇచ్చారు బాబా. అందుకే మీరందరూ కూడా బాబాను నమ్మండి. నమ్మకంతో ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. అందరికీ నా ధన్యవాదాలు". నా అనుభవాన్ని పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


ముడుపు కట్టించుకుని ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా


ఓం సాయి. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, మార్చి నెలలో మా అమ్మాయి అనారోగ్యం పాలైంది. తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా అయింది. అటువంటి స్థితిలో ఒకరోజు నేను గుడికి వెళ్ళాను. అక్కడ ఒక చిలుక జోస్యం చెప్పే అతను ఉన్నాడు. అతనిని చూసి అమ్మాయికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాకనిపించింది. దాంతో అతని దగ్గరకు వెళ్లి, "మా అమ్మాయి ఆరోగ్యం బాగాలేదు. కొంచెం తన జాతకం చూడండి" అని అడిగాను. అతను చిలుక చేత ఒక కార్డు తీయించాడు. అందులో బాబా వచ్చారు. అప్పుడతను, "బాబాకు ఒక రెండు రూపాయలు ముడుపుకట్టి, అమ్మాయికి నయమయ్యాక ఆ ముడుపు అప్పజెప్పుతామని మ్రొక్కుకోండి. బాబా దయతో అమ్మాయికి బాగుంటుంది" అని అన్నాడు. అతను చెప్పినట్లు నేను బాబాకు ముడుపుకట్టాను. తరువాత అమ్మాయిని హాస్పిటల్లో చేర్చాము. ఆరోజు నుండి నేను సాయినామాన్ని వదలలేదు. వారం రోజుల తర్వాత అమ్మాయిని ఇంటికి పంపించారు. అయితే 'రాత్రికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. క్రమంగా కోలుకుంటుంది' అని అన్నారు. "ధన్యవాదాలు బాబా. మీ దయతో తన జీవితంలో అన్నీ బాగుండాలి. తను పూర్తిగా కోలుకున్నాక మీకు ముడుపు అప్పజెప్పుతాను తండ్రీ". ఈ విధంగా బాబా నాకు ప్రసాదించిన ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఊరటనిచ్చింది.


శ్రీ సాయినాథా! శ్రీ సాయినాథా!


బాబా దయవలన వచ్చిన మార్పు


నేను ఒక సాయిభక్తురాలిని. మాది కామారెడ్డి. సాయిబాబా ఏకాదశ సూత్రాలలో, "మీ భారములు నాపై బడవేయుడు, నేను మోసెదను" అన్న బాబా వచనం అక్షరసత్యం. అందుకు నిదర్శనమైన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఆరునెలల క్రితం మా ఇంట్లో చాలా గొడవలు రేగాయి. మా తోడికోడలు నన్ను ఎన్నో మాటలు అన్నది. ఆమె వేసిన అభాండాలకు తట్టుకోలేక నేను చనిపోదామని అనుకున్నాను. కానీ, 'బాబాను నమ్ముకున్న భక్తులకు అన్యాయం జరగదు' అన్న తలంపుతో బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! నా తోడికోడలి మనసు మారాలి, తను ఇంట్లో అందరితో మంచిగా ఉండాలి. ఆమె కోసం ఐదువారాల సాయి దివ్యపూజ చేస్తాను" అని మ్రొక్కుకున్నాను. సాయి దివ్యపూజ రెండు వారాలు ముగిసేలోపు బాబా దయవల్ల ఆమెలో కొంచెం మార్పు వచ్చింది. ఆ కాస్త మార్పు ఎంతో శాంతిని ఇచ్చింది. "బాబా! మీ దయవలన నా తోడికోడలు ఇంట్లో గొడవలు పెట్టకుండా ఉండాలి".


'సాయిబాబా తమ భక్తులను కాపాడుతారు' అనేది అక్షరసత్యం


నా పేరు సాయిచంద్. మాది సిరిసిల్ల. కొన్నిరోజుల క్రితం మా అమ్మగారికి కరోనా వచ్చి బాగా సీరియస్ అయింది. ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడంతో అమ్మను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. డాక్టర్లు అమ్మను పరీక్షించి, "పరిస్థితి విషమంగా ఉంది, వెంటనే హాస్పిటల్లో చేర్చమ"ని చెప్పారు. మేము అలాగే చేశాము. మా అక్క అమ్మ గురించి బాబాకు మ్రొక్కుకుని ఆయనపై భారం వేసింది. నన్ను కూడా 'బాబాను నమ్ముకోమ'ని చెప్పింది. సరేనని నేను కూడా బాబాకు మ్రొక్కుకున్నాను. కానీ, 'అమ్మ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఇంటికి క్షేమంగా చేరుకుంటుందో లేదోన'ని మనసులో చాలా భయంగా ఉండేది. రెండు రోజులు అలానే గడిచింది. అయితే బాబా దయవల్ల మూడవరోజు నుండి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఊహించని విధంగా అమ్మ కోలుకుంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాలుగు రోజుల్లో అమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో ఐదవ రోజు అమ్మను ఇంటికి తీసుకొచ్చేశాము. మేము ఏమాత్రమూ ఊహించని విషయం ఏమిటంటే, అమ్మ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది గురువారంనాడే. బాబా దయవలన ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. 'సాయిబాబా తమ భక్తులను కాపాడుతారు' అనేది అక్షరసత్యం.


8 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 😀😊❤🕉🙏

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. కొందరికి బుద్ధి వుండదు. సంసారంలో కలతలు రేపుతారు.ఆ బాథ నా కు తెలుసు. జీవితం నరకం అవుతుంది.బాబా వారికి బుద్ధి చెప్పుచు.మనము ఏమి చేయలేేము. ఓం సా౦ుు బాబా నమస్కారము చేసి నా కుటుంబము కాపాడు తండ్రి. ❤❤❤��

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  6. Baba Santosh ki santanam kalagali thandri

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo