1. బాబా గైడెన్స్ - కుటుంబానికి ఆరోగ్యం
2. బాబా నాకు ప్రసాదించిన ఆధ్యాత్మిక స్థితి
3. తలనొప్పి తగ్గించిన బాబా
బాబా గైడెన్స్ - కుటుంబానికి ఆరోగ్యం
నేను దుబాయిలో నివాసముంటున్న సాయి బిడ్డని. బాబా నాకు ప్రసాదించిన ఒక గొప్ప అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, మే నెల మధ్యలో ముందుగా మా నాన్నగారికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చాయి. తర్వాత రెండురోజులకి అమ్మ జ్వరం, తలనొప్పి సమస్యలతో బాధపడింది. వెంటనే మా అన్నయ్య వాళ్ళకి రాపిడ్ టెస్ట్ చేయిస్తే, వాళ్ళిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మా అన్నయ్య, వదిన కూడా టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయవలన వాళ్ళిద్దరికీ నెగిటివ్ వచ్చింది. కానీ ఆరోజు మధ్యాహ్నానికి మా అన్నయ్యకి కూడా ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. ఇంక మరుసటిరోజు ఉదయం మా వదిన, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్లారు. అన్నయ్య మళ్లీ టెస్ట్ చేయించుకుంటే, రిపోర్టు మర్నాడు వస్తుందని చెప్పారు. అంతలో మా వదినకి కడుపులో మంట, వాళ్ళ చిన్నపాపకి జ్వరం వచ్చాయి. పాపని హాస్పిటల్‌కి తీసుకుని వెళితే, డాక్టరు మందులిచ్చి, ‘మళ్ళీ జ్వరం వస్తే రక్తపరీక్షలు చేయాలి’ అన్నారు. ఆలోగా అన్నయ్యకి కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దాంతో అక్కడ వదిన మళ్ళీ కోవిడ్ టెస్టు చేయించుకుంది. అంతలో చిన్నపాపకు మళ్ళీ జ్వరం వచ్చింది. వీటన్నిటితో మేము పడ్డ టెన్షన్ బాబాకే తెలుసు. నేను భయంతో బాబా దగ్గరకు వెళ్లి, "బాబా! మేము ఇంతదూరంలో ఉన్నాము. అమ్మానాన్నలకి, అన్నయ్యకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అక్కడ చిన్నపాపకి జ్వరం, వదినకి కడుపులో మంట, ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలున్నాయి. అవి చాలక తనకు కోవిడ్ వచ్చిందేమోనని వదిన భయపడుతోంది. నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది బాబా. దయచేసి మావాళ్ళని కాపాడు. చంటిదానికి రక్తపరీక్షల రిపోర్టులు నార్మల్ వచ్చేలా, వదినకి నెగిటివ్ వచ్చేలా చూడండి. లేదంటే, వదిన వల్ల ఆ కుటుంబం కూడా బాధపడుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. అమ్మానాన్నలకు, అన్నయ్యకు ధైర్యాన్ని ప్రసాదించండి బాబా. మీరు ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుగా ఉండి, తొందరగా కోలుకునేలా అనుగ్రహించండి బాబా" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. అంతేకాదు, "బాబా! నేను ఇక్కడ నుండి వాళ్ళకోసం ఏదైనా చేయగలిగేది ఉంటే నాకు తెలియజేయండి. ప్లీజ్ బాబా! అది ఏదైనా నేను చేస్తాను" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం నేనున్న ఒక భక్తి గ్రూపులో, 'ఈరోజు పాడ్యమి. ఈరోజు మొదలుకుని హనుమాన్ జయంతి లోపు 108 సార్లు హనుమాన్ చాలీసా చదివితే మంచిది' అని ఒక సందేశం వచ్చింది. అది బాబా నాకు ఇస్తున్న సలహాగా భావించి, వెంటనే నేను హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాను. అది జరుగుతూ ఉండగా మధ్యలో బాబా దయవల్ల చంటిదానికి రక్తపరీక్షల రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. ఇంకా వదినకి కరోనా నెగిటివ్ అని వచ్చింది. అది తెలిసి చాలా చాలా సంతోషించాము. ఇకపోతే, నేను హనుమాన్ జయంతి లోపు 108 సార్లు హనుమాన్ చాలీసా పూర్తిచేశాను. బాబా దయవల్ల అమ్మ, నాన్న, అన్నయ్య బాగానే కోలుకున్నారు.
కానీ అప్పటివరకు బాగానే ఉన్న అమ్మ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయి, తనకు ఏదో అయిపోతుందని ఒక రకమైన భయాన్ని పెట్టుకుంది. దాంతో అమ్మ చాలా నీరసించిపోయింది. ఒకరోజు రాత్రి నిద్రపట్టలేదని చెప్పి ఇంకాస్త డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. చివరికి, తెలిసి చేసిందో, తెలియక చేసిందో గానీ అమ్మ మా ఇంట్లో ఉన్న బావిలో దూకింది. అదృష్టం! నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల అమ్మకి ఏమీ కాలేదు. అన్నయ్య, నాన్న కలిసి అమ్మని బయటికి తీశారు. నాన్న నాతో, "మీ అమ్మని బాబానే కాపాడారమ్మా, తనకు ఎటువంటి దెబ్బలు తగలలేదు" అని చెప్పారు. మరుసటిరోజు ముగ్గురూ వెళ్లి టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయవల్ల ముగ్గురికీ కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ మా అమ్మ పరిస్థితిలో మార్పులేదు. ఇదివరకటిలా తనలో చురుకుతనం లేదు. అప్పుడు నేను, "బాబా! అమ్మ త్వరగా నార్మల్ అయ్యేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తరువాత అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. డాక్టరిచ్చిన మందులు వాడుతూ కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం కాస్త కుదుటపడింది. తనకి మరపు ఏమీలేదు, అన్నీ గుర్తున్నాయి. కానీ అమ్మలో ఒక రకమైన భయం అలుముకుంది. మేము ఎవరమైనా ఇంటికి వస్తామంటే, ‘వద్ద’ని మొదలుపెడుతుండేది. ఒకరోజు నేను, "మేము ఇండియా వస్తున్నాం అమ్మా" అని చెపితే, అందుకు అమ్మ, "నేను ఎందుకు చెప్తున్నానో విను. వస్తే నా మీద ఒట్టే" అంది. అప్పుడు నేను, "బాబా! మా అమ్మ పెట్టిన ఒట్టు మీ పాదాల దగ్గర పెడుతున్నాను. తనిప్పుడు వద్దంటున్నా తరువాత అమ్మే రమ్మని పిలిచేలా ఆమెలో మార్పు మీరు తీసుకుని రావాలి. ప్లీజ్ బాబా. ఆమెలో ఆ మార్పు వచ్చి, మేము ఇండియా వెళ్లి, తిరిగి క్షేమంగా వచ్చాక మళ్లీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా".
బాబా నాకు ప్రసాదించిన ఆధ్యాత్మిక స్థితి
నా పేరు అనూరాధ. నేను వృత్తిరీత్యా టీచర్ని. మాది హైదరాబాద్. నా జీవితంలో వచ్చిన ఎన్నో సమస్యలలో నాకు తోడుగా నిలిచిన కరుణాసముద్రుడు శ్రీసాయి. సమస్యలలో తోడుగా నిలిచి రక్షణనివ్వడమే కాకుండా దివ్యానుభూతిని ప్రసాదించిన సర్వాంతర్యామి బాబా. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానై నిలిచారు ఆ సాయినాథుడు. వారి కృపతో 2021, జూన్ 3న ఈ బ్లాగును చూడగానే నేను కూడా నా సాయితో నాకున్న అనుబంధాన్ని పంచుకోవాలని మనసు ఆరాటపడింది. అయితే ఆరోగ్య సమస్య కారణంగా కొంచెం ఆలస్యం అయింది.
సాయినాథునితో నా ప్రథమ దివ్యానుభూతి: 2014వ సంవత్సరంలో నేను ఎక్కిరాల భరద్వాజ మాస్టర్‌గారు రచించిన 'సాయిలీలామృతం' పారాయణ చేస్తున్న రోజులవి. అందులో, బాబా స్పర్శతో ఒక భక్తునిలో వచ్చిన ఆధ్యాత్మిక ఉన్నతిని గురించిన లీలను చదివిన నేను, "నాకూ అలాంటి దివ్యానుభూతిని అనుగ్రహించమ"ని బాబాను వేడుకున్నాను. పారాయణ చేస్తున్న క్రమంలో ఒకరోజు సాయినాథుని దేవాలయానికి వెళ్లాను. ఎప్పటిలాగే బాబా దివ్యపాదాలను స్పృశించి తల పైకెత్తుతున్న సమయంలో బాబా రెండవ పాదం నా తలకు గట్టిగా తగిలింది. అలా మునుపెన్నడూ జరగలేదు. ఆ మరుసటిరోజునుండి సుమారు రెండు నెలల పాటు నేను అలౌకికమైన ఆనందాన్ని అనుభూతి చెందాను. దివ్యమైన బాబా స్వప్నదర్శనం జరిగింది. అందులో బాబా విఘ్నేశ్వరునిలా, విష్ణుమూర్తిలా, అనేక దేవతామూర్తులుగా సాక్షాత్కరించారు. ఆ రెండు నెలలు నిరంతరం బాబా స్మరణ చేయాలనిపించడం, ఎక్కడ చూసినా బాబా రూపం కళ్ళముందు కనిపించడం.. ఇలా నా మనసంతా బాబాపైనే ఉండేది. బాబా నాకు ఇచ్చిన లౌకికమైన బాధ్యత తప్ప నా మనసు ఎలాంటి ప్రతికూల ఆలోచనలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండేది. అలా ఆ సర్వాంతర్యామి నన్ను అలౌకికము, దివ్యము అయిన అనుభూతిలో ముంచెత్తారు. బాబా ప్రసాదించిన ఆ అనుభూతి ఆధారంగా నాకు అర్థమైంది ఏమిటంటే.. 'బాబా కోర్కెలు తీర్చి, సమస్యల నుండి రక్షణ కల్పించే దైవం మాత్రమే కాదు, మనం బాబాను నిత్యం ప్రేమతో ధ్యానం చేస్తే, ఉన్నతమైన, ఆనందకరమైన దివ్యస్థితికి తీసుకువెళ్తారు' అని.
ఓం శ్రీ సాయినాథాయ నమః
తలనొప్పి తగ్గించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
నేను సాయిభక్తురాలిని. 'సాయీ' అని స్మరించినంతనే బాబా ఎన్నోసార్లు నాకు కష్టం నుండి విముక్తి కలిగించారు. 2021, జూన్ మూడవవారం చివరిలో నాకు తలనొప్పి వచ్చింది. నాకు మామూలుగానే మైగ్రేన్ సమస్య ఉంది. ఎప్పుడైనా ఆ తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. కానీ ఈసారి రెండు టాబ్లెట్లు వేసుకున్నా తలనొప్పి తగ్గలేదు. దాంతో నాకు భయం వేసి, "బాబా! నాకు తలనొప్పి తగ్గేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను ప్రార్థించి, డోలో-650 టాబ్లెట్ వేసుకున్నాను. రాత్రి పడుకునేముందు, "బాబా! రేపు తెల్లవారేసరికల్లా తలనొప్పి తగ్గేలా అనుగ్రహించండి" అని వేడుకుని, బాబా ఊదీని తలకు పెట్టుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజు తెల్లవారేసరికి తలనొప్పి లేదు. పూర్తిగా తగ్గిపోయింది. రోజూ చేసుకునే దానికన్నా ఎక్కువ పని ఆరోజు చేసుకున్నాను. "ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని కాపాడు తండ్రీ. నీవే మాకు అన్నీ సాయీ".
ఓంసాయి ఓంసాయి ఓంసాయి.
Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏🌼😊❤
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
808 DAYS
ReplyDeleteSAIRAM
🌺🙏🙏🙏🌺OmSriSaiRam🌺🙏🙏🙏🌺
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete