సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నివృత్తి పాటిల్



సాయిభక్తుడు నివృత్తి పాటిల్ శిరిడీలోనే పుట్టి పెరిగాడు. చిన్ననాటినుండి బాబాతో అనుబంధాన్ని కలిగివున్న అదృష్టవంతుడతడు. బాబా మహాసమాధి చెందిన చాలాకాలానికి, అంటే 1983లో అతను మరణించాడు. తన మరణానికి కొన్ని సంవత్సరాల ముందు పంటలు నూర్చే నూర్పిడి యంత్రం అవసరమై దాన్ని కొనేందుకు కోపర్‌గాఁవ్‌లోని డీలర్ షోరూమ్‌కి వెళ్లాడు నివృత్తి పాటిల్. ఆ షాపులోని సేల్స్ ఏజెంట్ ముందుగా నివృత్తి పాటిల్ పేరు, చిరునామా నమోదు చేసుకొని, అతని వంతు వచ్చేవరకు వేచి ఉండాల్సి ఉంటుందని చెప్పి, ఆ యంత్రానికి సంబంధించిన వివరాలిచ్చి, దాని ధర 1,100 రూపాయలు అని చెప్పాడు. కానీ నివృత్తి పాటిల్‌కి ఆ యంత్రం అత్యవసరంగా కావలసివుండటంతో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకొని నేరుగా కిర్లోస్కర్‌వాడి వెళ్లి శ్రీశంకరరావు కిర్లోస్కర్‌ను కలిశాడు. అతనితో తన గురించి, తన అవసరం గురించి వివరంగా చెప్పాడు. అయితే ఆ సమయంలో యంత్రాల స్టాక్ లేకపోవడంపై కిర్లోస్కర్ తన విచారాన్ని వ్యక్తం చేస్తూ అతనిని తరువాత రమ్మని చెప్పాడు. అంతలో స్టాక్ అండ్ సప్లై విభాగానికి చెందిన కులకర్ణి అక్కడికి వచ్చాడు. అతను అదివరకు ఒకసారి శిరిడీ వెళ్ళినపుడు నివృత్తి పాటిల్‌ను అక్కడ చూసినందువల్ల వెంటనే గుర్తుపట్టాడు. పాటిల్ కులకర్ణితో, “నేను బాబా ముందు చీటీలు వేశాను. యంత్రం దొరుకుతుందని సమాధానం వచ్చింది. అందువల్ల ఖచ్చితంగా యంత్రం లభిస్తుందని అనుకున్నాను” అని ఒక అబద్ధం చెప్పాడు. అప్పుడు కులకర్ణి తన యజమానితో, “అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకొని మనము ఇతనికి యంత్రాన్ని సరఫరా చేద్దాం” అని చెప్పాడు. సరఫరా విభాగానికి బాధ్యత వహిస్తున్నది కులకర్ణే కాబట్టి, “సరే అలాగే చేయమ”ని కిర్లోస్కర్ బదులిచ్చాడు. వాళ్ళ సంభాషణ జరుగుతుండగానే హైదరాబాద్ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ సారాంశమేమిటంటే, తాము అదివరకు ఇచ్చిన 63 యంత్రాల ఆర్డర్‌కు బదులుగా ప్రస్తుతం తమకు 61 యంత్రాలు చాలు అని. దాంతో నివృత్తి పాటిల్ రెండు యంత్రాలను కొనుక్కున్నాడు. అంతేకాదు, ఒక్కో యంత్రంపై 500 రూపాయల భారీ డిస్కౌంట్‌ను కూడా పొందాడు. ఎంతో ఆనందంగా రెండు యంత్రాలతో తిరిగి శిరిడీ చేరుకొని అందరితో, “నేను అబద్ధం చెప్పినా బాబా నాకు సహాయం చేశారు” అని చెప్పాడు.

కానీ, అసత్యం పలకడాన్ని బాబా ఎంతగానో ఖండించారు. బాబా ఒకసారి బాపూరావు చందోర్కర్‌తో, “నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు” అని చెప్పారు. ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ దీక్షిత్, న్యాయవాది అయిన తాను తన క్లయింట్‌లను కాపాడటానికి సత్యాన్ని వక్రీకరించాల్సి వస్తుందని బాబాతో చెప్పినప్పుడు, బాబా పదేపదే అతనితో “నిజం మాత్రమే మాట్లాడమ”ని చెప్పారు. అంతటితో దీక్షిత్ న్యాయవాదిగా తాను మనుగడ సాగించలేనని తన న్యాయవాది వృత్తిని వదులుకున్నాడు. అలాగే బాబా పురంధరేతో, “నీవెప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో!” అని చెప్పారు.

మరి అబద్ధం చెప్పిన నివృత్తి పాటిల్‌కి బాబా ఎందుకు సహాయం చేసారంటే, అతను ఒక రైతు. అతను పండించే పంట ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తుంది. అతనికి ఆ యంత్రం లభించకపోతే పంట సమయానికి అందక చాలామంది ఆకలితో అలమటించాల్సి వస్తుంది. అందువల్ల ప్రజల ప్రయోజనం దృష్ట్యా బాబా అతని కోరిక నెరవేర్చడంలో అతనికి సహాయం చేసి ఉండవచ్చు.

సమాప్తం.... 

రిఫరెన్స్అంబ్రోసియా ఇన్ శిరిడీ బై రామలింగస్వామి
సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి

5 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai ram always be with us tandri

    ReplyDelete
  3. 🙏🌺🙏🙏🌺🙏
    ఓం సాయిరాం

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo