సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీరఘువీర్ భాస్కర్ పురందరే - మొదటి భాగం


శ్రీ రఘువీర్ భాస్కర్ పురందరే సాయిబాబాకు అంకిత భక్తుడు. బాబా ఇతనిని 'భావూ' అని ప్రేమగా పిలిచేవారు. ఇతను 1872లో జన్మించాడు. దేశస్థ శుక్ల యజుర్వేద బ్రాహ్మణ కులానికి చెందిన ఇతను ముంబాయిలోని బాంద్రా నివాసి. ఇతను బాంద్రాలోని రైల్వేశాఖలో గుమస్తాగా పనిచేసేవాడు. ఇతని గురించిన సంక్షిప్త ప్రస్తావన శ్రీసాయి సచ్చరిత్ర 9వ అధ్యాయంలో ఉంది. ఇతని గురించిన మరింత సమాచారం శ్రీ బి.వి.నరసింహస్వామి రచించిన 'డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శ్రీసాయిబాబా'లోనూ, డాక్టర్ కేశవ్ భగవాన్ గవాంకర్ రచించిన 'శిరిడీంచే సాయిబాబా'లోనూ ఉంది. ఆ వివరాలను మీ ముందుంచుతున్నాం.

రఘువీర్ భాస్కర్ పురందరే ఎల్లప్పుడూ సాధుసత్పురుషుల దర్శనాన్ని, వారి సహవాసాన్ని కోరుకునేవాడు. అతడు 1909వ సంవత్సరంలో మొదటిసారి సాయిబాబా గురించి విని ఆకర్షితుడయ్యాడు. ఒకరోజు అతను దాసగణు చెప్పిన హరికథలో సాయిబాబా గొప్ప సత్పురుషులని, భగవంతుని అవతారమని, శిరిడీలో నడయాడే దైవమని విని సాధ్యమైనంత త్వరగా శిరిడీ సందర్శించాలని ఆరాటపడ్డాడు. తరువాత ఒకరోజు అతనికి కలలో బాబా దర్శనమిచ్చి, 'శిరిడీ రమ్మ'ని చెప్పారు. అంతటితో అతను తన తల్లిని, భార్యను వెంటబెట్టుకొని శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి అతని పెద్ద కుమార్తె (అప్పటికి ఆరునెలల వయస్సు) చాలా అనారోగ్యంతో బాధపడుతోంది. అందువల్ల అతని తల్లి జ్వరంతో ఉన్న బిడ్డని అంత దూరం ప్రయాణం చేయించడం మంచిది కాదని చెప్పింది. కానీ అతడు తమ ఒక్కగానొక్క(అప్పటికి) బిడ్డ ఆరోగ్యం గురించి వెరవకుండా ఎలాగైనా శిరిడీ వెళ్లాలని పట్టుబట్టి భార్య, బిడ్డ మరియు తల్లిని వెంటబెట్టుకొని శిరిడీకి ప్రయాణమయ్యాడు. వాళ్ళు శిరిడీ చేరిన మూడవరోజుకి బిడ్డ ఆరోగ్యం చక్కబడింది. కానీ బాబా పదమూడవరోజు వరకు వాళ్ళు తిరిగి వెళ్లేందుకు అనుమతించలేదు. అందువల్ల అతను తన మొదటి శిరిడీ సందర్శనలోనే సాయిబాబా వద్ద పదమూడురోజులు గడిపాడు. అతను విష్ణువును చాలా ఇష్టపడేవాడు, అందుచేత అతను విష్ణువునే ఆరాధిస్తుండేవాడు. బాబా కూడా అతనితో ముందునుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని చెప్పారు. ఒకరోజు బాబా పురందరేతో తమకు గల అనుబంధం గురించి అతని తల్లితో, “మా అనుబంధం ఏడు శతాబ్దాలనాటిది. అతడు రెండువేల మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ అతడిని మరువను. అతను లేకుండా నేనొక్క ముద్దయినా తినను” అన్నారు.

ఆ మొదటి దర్శనంలోనే సాయిబాబా పురందరేను 'శాల'కి వెళ్ళమని చెప్పారు. అతనికేమీ అర్థం కాలేదు. 'శాల' అంటే రాధాకృష్ణమాయి ఇల్లు అని దీక్షిత్ చెప్పాడు. వెంటనే అతను ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె తలుపు తీయకుండానే, "ఎవరు వచ్చారు? ఏమి కావాలి?" అని లోపలినుండే అడిగింది. అతను చెప్పాడు, కానీ ఆమె అతనిని ఇంటి లోపలికి రానీయలేదు. పదినిమిషాలు అక్కడే వేచి చూశాక అతను మసీదుకు తిరిగి వెళ్ళాడు. బాబా, "శాలకు వెళ్ళావా, లేదా?” అని అడిగారు. అందుకతను, "వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేద"ని బదులిచ్చాడు. “మళ్ళీ వెళ్ళు” అని బాబా ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం అతడు మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ఆమె తలుపు తీసి అతని కాళ్ళపై పడి ఏడవసాగింది. ఆమె ప్రవర్తన అర్థంకాని అతను కలవరపడ్డాడు. కానీ ఆరోజు నుండి ఆమె చనిపోయేంతవరకు అతనిని తల్లిలా ప్రేమించింది. అతనికి కూడా ఆమె సర్వస్వం అయింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ శిరిడీలో ఉన్న ప్రతిక్షణం అతను బాబా సేవలో గడిపేవాడు. ఆమె అతనిని రోజంతా బాబా కోసంగా ఎక్కువగా తన ఇంట్లోనూ, అప్పుడప్పుడు మసీదులోనూ, ఇంకా ఇతర చోట్ల పని చేయిస్తుండేది. ఆమె గురించి పురందరే ఇలా చెప్పాడు: "ఆయీది విచిత్రమైన స్వభావం. ఆమె భక్తిపారవశ్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కొక్కసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది లేదా గద్గదస్వరంతో పాడుతుండేది లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది".

బాబా అతనిని చాలాసార్లు రెండు రూపాయలు దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి అతడు బాబాను, “ఎందుకు మీరు నన్నెప్పుడూ రెండు రూపాయలు దక్షిణ అడుగుతున్నారు?" అని అడిగాడు. అందుకు ఆయన, "నాకు కావలసింది ఈ రూపాయలు కాదు. నేను కోరేది - ఒకటి 'నిష్ఠ' (అంచంచలమైన విశ్వాసం), రెండవది 'సబూరి' (సంతోషంతో కూడిన ఓరిమి)” అన్నారు. దానికతడు, "ఇదివరకే వాటిని నేను మీకు సమర్పించాను” అన్నాడు. అప్పుడు బాబా, "ఆ నిష్ఠ చెదరకుండా కాపాడుకో. చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉండు. నీవెప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడున్నా, అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను” అని చెప్పారు. దానికతను, “బాబా, మీరు చెప్పినట్లుగా నడుచుకోడానికి ప్రయత్నిస్తాను. కానీ నా మనస్సు నా ఆధీనంలో ఉంచుకునేందుకు మీ సహకారం కావాలి” అని అడిగాడు. అందుకు బాబా సమ్మతించారు.

తరువాత బాబా అనుమతితో వాళ్ళు నాశిక్ మీదుగా తాము నివసిస్తున్న దాదర్‌కు తిరిగి వెళ్లారు. పురందరే మొట్టమొదటి దర్శనంలోనే బాబాకు పూర్తిగా శరణాగతి చెందాడు. మధ్యతరగతికి చెందిన వాడైనందున అతను బాబాకు ఖరీదైన వస్తువులను కానుకగా సమర్పించుకోలేకపోయాడు. కానీ తనకున్నదంతా బాబా పాదపద్మాల చెంత సమర్పించుకున్నాడు. అతనెంతో దృఢచిత్తుడు మరియు ప్రేమమయుడు. పేదవాడైనప్పటికీ, ఎప్పుడూ ఏ ప్రాపంచిక కోరికలతో బాబా వద్దకు వెళ్ళలేదు. అతనికి బాబానే తల్లి, తండ్రి, సర్వమూ.

పురందరే భార్యకు పునర్జన్మ ప్రసాదించిన బాబా ఊదీ:- పురందరేకు బాబాపై అంతులేని దృఢమయిన విశ్వాసం. తన పిల్లలుగాని, భార్యగాని ఎప్పుడయినా అనారోగ్యానికి గురైతే చూసుకోవడానికి బాబా ఉన్నారనే ధీమాతో ఉండేవాడు.

ఒకసారి అతని భార్య కలరా బారినపడింది. ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఆగకుండా అవుతున్న వాంతులు, నీళ్ళ విరోచనాలతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. 8 గంటల సమయంలో ఆమె ఒళ్ళంతా చల్లబడిపోయి నాడి బలహీనంగా కొట్టుకోసాగింది. వెంటనే వైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడు పరీక్షించి, ఆమె గంటకన్నా ఎక్కువ సమయం బ్రతకదేమోనన్న సందేహాన్ని వ్యక్తపరిచాడు. ఆ సమయంలో తన మేనకోడలి కోసం బంగారు నగ చేయించే పనిమీద కంసాలి ఇంటిలో ఉన్నాడు పురందరే. ఒకతను ఏడ్చుకుంటూ వెళ్లి వైద్యుడు చెప్పిన విషయాన్ని పురందరేకు తెలియజేశాడు. వెంటనే అతను ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేదారిలో ఒక దత్తమందిరం ఉంది. అక్కడ బాబా ఒక ఫకీరు రూపంలో చేతిలో జోలెతో దర్శనమిచ్చారు. దుఃఖితుడైన పురందరేను ఆ ఫకీరు ఓదారుస్తూ, “నీ భార్య గురించి ఏమీ భయపడకు. ఆమె మరణించదు. నీటిలో ఊదీ కలిపి ఆమెచేత త్రాగించు. ఒక గంటలో ఆమెకు నయమవుతుంది. మిమ్మల్నందరినీ నేను కాపాడుతూ ఉంటాను” అని అన్నారు. పురందరే ఇంటికి చేరుకునేసరికే అందరూ శోకాలు పెడుతున్నారు. అతను ఇంట్లోకి వెళ్ళి బాబా ఊదీని నీళ్లల్లో కలిపి, భార్య పడుకున్న మంచం వద్దకు వచ్చాడు. ఆమె పళ్ళు బాగా గట్టిగా బిగపట్టుకొని ఉంది. అందువల్ల అతనొక చెంచా తీసుకొచ్చి ఆమె నోటిలో పెట్టి, నోరు తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి కుటుంబసభ్యులంతా చాలా భయపడి, బలవంతంగా తీర్థాన్ని గొంతులో పోయవద్దని చెప్పారు. అతను వారి మాటలేమీ పట్టించుకోకుండా ఆమె నోరు తెరిచి ఊదీ తీర్థాన్ని నోటిలో పోశాడు. మరికొంత ఊదీ తీసుకొని ఆమె శరీరమంతా రాశాడు. తరువాత అతను స్నానం చేసి, బాబాకు పూజచేసి నైవేద్యం సమర్పించాడు. ఆ తరువాత ఎవరికోసమూ ఎదురు చూడకుండా ఏమీ పట్టనట్టుగా భోజనం చేశాడు. ఒక గంట తరువాత వైద్యుడు వచ్చి ఆమెని పరీక్షించాడు. శరీర ఉష్ణోగ్రత మామూలుస్థాయికి వచ్చి, నాడి కూడా సాధారణంగా కొట్టుకుంటున్నట్లు గమనించిన వైద్యుడు ఆశ్చర్యపోతూ "మందు ఏమిచ్చార"ని పురందరేను అడిగాడు. "బాబా ఊదీ తీర్థం తప్ప ఇంకేమీ ఇవ్వలేద"ని అతను సమాధానమిచ్చాడు. తరువాత వైద్యుడు కొన్ని మందులిచ్చి వాడమని చెప్పి వెళ్ళిపోయాడు. ఫకీరు చెప్పినట్లుగానే ఆమె మరణాన్ని జయించి త్వరలోనే ఆరోగ్యవంతురాలయింది. అప్పటినుండి అతడు తరచూ శిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారం ఎక్కువరోజులు అక్కడే గడిపేవాడు. అప్పుడప్పుడు బాబా కూడా అతడిని  శిరిడీ రమ్మని దీక్షిత్‌ చేత జాబు వ్రాయించేవారు. అతడు తరచుగా దీక్షిత్‌తో కలిసి బాబాను దర్శించేవాడు.

ఒకసారి పురందరే తన కుటుంబంతో శిరిడీకి బయలుదేరుతున్నాడు. ఆ విషయం తెలిసి రామచంద్ర ఆత్మారాం తర్కడ్ భార్య ప్రేమతో బాబాకోసమని రెండు పెద్ద వంకాయలను తెచ్చి పురందరే భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగుపచ్చడిని, రెండవదానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని కోరింది. శిరిడీ చేరుకున్న తరువాత శ్రీమతి పురందరే వంకాయ పెరుగుపచ్చడి చేసి, మశీదుకు వెళ్లి బాబా భోజనానికి కూర్చున్న సమయంలో ఆ పచ్చడిని బాబాకు నివేదించింది. బాబాకు ఆ పచ్చడి చాలా రుచికరంగా అనిపించింది. ఆయన అందరికీ పచ్చడి పంచి పెట్టి, వెంటనే తమకు వంకాయ వేపుడు కావాలని అడిగారు. భక్తులు ఈ సంగతి రాధాకృష్ణమాయికి తెలియపరిచారు. అది వంకాయల కాలము కాదు గనుక ఏమి చేయాలో ఆమెకు తోచలేదు. వంకాయలు ఎలా సంపాదించాలన్నది ఆమెకు సమస్య అయ్యింది. వంకాయపచ్చడి తెచ్చినదెవరని విచారించగా పురందరుని భార్యయని తెలిసి వంకాయ వేపుడు గూడ ఆమెనే తెచ్చిపెట్టమని కబురుపంపింది. అప్పుడందరికీ బాబా వంకాయ వేపుడు అడగటంలోని బాబా ఉద్దేశ్యం అర్థమై, బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపోయారు. (సచ్చరిత్ర అధ్యాయము - 9)

ద్వారకామాయిలో తులసీ బృందావనం ఏర్పాటు చేయబడింది. దాన్ని స్థాపించడంలో పురందరేతో సహా భక్తులందరూ సహాయపడ్డారు. మసీదు ముందున్న సభామంటపాన్ని 1912లో నిర్మించారు. సాఠేవాడాలో జి.ఎస్.ఖపర్డే పంచదశి మొదలైన గ్రంథాలను చదివి వివరిస్తుండేవాడు. ఉపాసనీబాబా కూడా ఆ గ్రంథపఠనానికి హాజరయ్యేవాడు. కానీ ఆ పురాణ పఠనానికి పురందరే మాత్రం ఎప్పుడూ హాజరయ్యేవాడు కాదు. అతనెప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడు.


1911 లేదా 1912లో ఇంజనీరుగా పనిచేస్తున్న శ్రీరఘునాథ్ ముకుంద్ మనుమడైన యశ్వంతరావుతో కలిసి గురుపౌర్ణమి(ఆషాడ పౌర్ణమి)కి శిరిడీ వెళ్ళాడు పురందరే. ఆ సమయంలో శిరిడీలో కలరా ప్రబలంగా ఉంది. బాబా యశ్వంతరావును ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశిస్తూ ఊదీ ఇచ్చారు. కానీ అతడు పురందరే లేకుండా ఒంటరిగా ముంబాయి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. పురందరే కూడా అతనిని వెళ్లిపొమ్మని చెప్పినప్పటికీ అతడు బయలుదేరకుండా శిరిడీలోనే ఉన్నాడు. ఆ రాత్రే అతను కలరా బారినపడి, మరుసటిరోజు ఉదయం మరణించాడు.

పురందరే ఆఫీసుకు సెలవు పెట్టి శిరిడీ వెళుతుండేవాడు. అయితే సెలవు ముగిసిన తరువాత కూడా బాబా తరచూ అతనిని శిరిడీలోనే ఉంచేసేవారు. 1912లో ఒకసారి సెలవు ముగిసిన తరువాత దీర్ఘకాలం అతడిని శిరిడీలోనే ఉంచేశారు బాబా. షామా తదితర భక్తులు బాబా దగ్గరకు వెళ్ళి, “బాబా! అతను తప్పక వెళ్ళాలి. లేకుంటే అతని యజమాని అతడిని తప్పుపడతాడేమో, అతడిని వెళ్లనివ్వండి" అని విన్నవించారు. బాబా, "నేనే అతని యజమానిని" అని చెప్పి అతనిని శిరిడీలోనే ఉంచేశారు. చివరికి సెలవు ముగిసిన చాలారోజుల తరువాత పురందరే ముంబాయి తిరిగి వెళ్లి ఒక గురువారంనాడు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆఫీసుకు వెళ్ళాడు. అతని పైఅధికారి సెలవు తీసుకోకుండా ఆఫీసుకు గైర్హాజరు అయినందుకు అతనిని సంజాయిషీ అడిగాడు. అందుకు పురందరే ఏమీ జవాబు చెప్పకుండా తన రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. పైఅధికారి ఈ విషయాన్ని ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. దాంతో ఉన్నతాధికారి అయిన విల్సన్ (డిప్యూటీ సూపరింటెండెంట్) పురందరేను పిలిపించి, ఇన్నిరోజులు ఎక్కడున్నావని అడిగాడు. అందుకతను శిరిడీలో సాయిబాబా వద్ద ఉన్నానని సమాధానమిచ్చాడు. అతను విషయమంతా తెలుసుకొని, మారుమాట్లాడకుండా అతని రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేశాడు. ఉన్నతాధికారి చేసిన పని పురందరే పైఅధికారికి నచ్చలేదు, కానీ ఏమీ చేయలేకపోయాడు. విల్సన్ ఆ పైఅధికారితో, "అతను నీ క్రింది ఉద్యోగే కానీ, పనివాడు కాదు” అని పురందరేను ఉద్దేశించి అన్నాడు. ఆరునెలలు గడిచిన తరువాత పురందరేకు ప్రమోషన్ వచ్చింది. ఆ పైఅధికారి పురందరేకు క్రిందిఉద్యోగి అయ్యాడు.

ఒకసారి పురందరే తన చిన్నకూతురు తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్థితిలో ప్రయాణం చేస్తే రోగం ఇంకా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అతని తల్లి శిరిడీ వెళ్ళేందుకు వ్యతిరేకించింది. కానీ అతను ఎలాగైనా శిరిడీ వెళ్లాలని నిర్ణయం తీసుకొని తనతోపాటు భార్యాపిల్లలను, తల్లిని, సోదరుడిని, మేనల్లుడిని తీసుకొని శిరిడీకి ప్రయాణమయ్యాడు. వాళ్ళు శిరిడీ చేరుకున్న వెంటనే బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్లారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వలన వాళ్లంతా వెనుకగా కూర్చున్నారు. బాబా పురందరేను 'భావూ!' అని పిలిచి ముందుకొచ్చి తమ పాదాలొత్తమన్నారు. తరువాత బాబా అతనికి చిలుం అందించారు. కానీ అతడు పొగ త్రాగడానికి నిరాకరించాడు. అలా బాబా ఇవ్వటం, అతను నిరాకరించడం కొన్నిసార్లు జరిగింది. ఈ సంఘటన అక్కడున్న భక్తులందరికీ అతనిపై కోపం తెప్పించింది. ఎందుకంటే బాబా ఇష్టానికి వ్యతిరేకంగా అతను నడుచుకుంటున్నాడని, అది అతనికి మంచిది కాదని. ఆరోజు సాయంత్రం పురందరే బాబా వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది భక్తులున్నారు. బాబా మళ్ళీ అతనికి చిలుం ఇచ్చి, "కోపంతో ఉన్న ఆ భక్తులు సరిగానే ఉన్నారు. వాళ్ళకి పిచ్చిలేదు. నువ్వు ఆలోచించి ప్రవర్తించాలి" అని చెప్పారు. ఈసారి పురందరే చిలుం పీల్చాడు.

ఒకసారి పురందరే తల్లి తనను పవిత్రమైన నాశిక్ క్షేత్రానికి తీసుకెళ్ళమని అతనిని కోరింది. పురందరే బాబాను అనుమతి కోరినప్పుడు ఆయన వారిని ఆశీర్వదిస్తూ, "నాశిక్‌లో ఒకరోజు గడిపి యింటికి వెళ్ళమ"ని చెప్పారు. వాళ్ళు నాశిక్ చేరేసరికి ఆ క్షేత్రంలో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించి ఉంది. పురందరే సోదరునికి గూడ ఆ వ్యాధి సోకింది. వెంటనే ఆ ఊరు విడిచి వెళ్ళిపోదామని అతని తల్లి చెప్పినప్పటికీ బాబా ఆదేశానికి కట్టుబడి పురందరే ఒకరోజంతా కుటుంబంతో ఆ క్షేత్రంలో గడిపాడు. తరువాతరోజు బయలుదేరి అందరూ సురక్షితంగా ఇల్లు చేరుకున్నారు. ఎంతటి ప్రమాదస్థితిలోనైనా బాబా ఆదేశాన్ని పాటించడం వలన అతడికెన్నడూ ఎట్టి నష్టమూ కలగలేదు. ఇటువంటి అనుభవాల వలన సద్గురువుపై భక్తుల విశ్వాసం దృఢమవుతుంది. ఈ రీతిన బాబా వాచా ఏమీ చెప్పకనే భక్తులకు ఆధ్యాత్మికమైన శిక్షణ ఇస్తుండేవారు.

Amrosia in Shirdi & Baba's Runaanubandh by vinny chittluri.



 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

 


2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai ram 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo