సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 289వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా నాతో ఉన్నానని, నా ఇంటికి వస్తున్నానని ఇచ్చిన సూచన
  2. బాబా నా సమస్యలను పరిష్కరించారు

సాయిబాబా నాతో ఉన్నానని, నా ఇంటికి వస్తున్నానని ఇచ్చిన సూచన

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు:

బాబా కృపవలన నేను చిన్నప్పటినుండి సాయిభక్తురాలిని. నేను పుట్టకముందు మా బామ్మ షోలాపూరులో నివసిస్తుండేది. ఆమె బాబాకు మంచి భక్తురాలు. ఆమె ప్రభావంతోనే మేమంతా శిరిడీసాయి భక్తులమయ్యాము. ఆమె ప్రతి గురువారం తన పిల్లలతో కలిసి బాబాకి ఆరతి ఇచ్చి, బాబాకి పేడాను నివేదించేది. ఇప్పటికీ మేము బాబాకి సంధ్య ఆరతి చేస్తున్నాము. ఈమధ్యే మావారికి బైపాస్ సర్జరీ జరిగింది. బాబా దయతో ఆయన పూర్తిగా కోలుకున్నారు. మా కుటుంబసభ్యులందరం వారంరోజులలో లక్ష సాయినామజపం చేయాలన్న సంకల్పంతో 2019, మే 2వ తేదీ, గురువారం మొదలుపెట్టాము. సాయి కృపతో మే 9వ తేదీ గురువారానికల్లా దిగ్విజయంగా నామజపాన్ని పూర్తిచేశాము. అనుకోకుండా ఆరోజు నా మదిలో ఎవరైనా అతిథిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అంతలో మా ఇంట్లో పనిచేసే ఆమె వచ్చింది. ఆమెతో మాట్లాడుతుంటే, మాటల మధ్యలో తన పిల్లలు ఆరోజే సెలవులకి ఊరినుంచి వచ్చారనే విషయం తెలిసింది. ఆమె పిల్లలు తిరువణ్ణామలైలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. నేను ఆమెతో, "నీ పిల్లల్ని తీసుకొని ఈరోజు మా ఇంటికి భోజనానికి రా" అని చెప్పాను. ఆమె వెంటనే అంగీకరించింది. ఇక ఆలస్యం చేయకుండా నేను ఎంతో ఉత్సాహంతో వాళ్ళకోసం సాంబరన్నం, పెరుగన్నం, వంకాయ పచ్చడి, అప్పడాలు తయారుచేసి, గులాబ్ జామూన్ కొనుక్కొని రావడానికి బయటకు వెళ్లి వచ్చాను. ఇంటికి తిరిగి వచ్చాక ప్రశాంతంగా కళ్ళుమూసుకొని, “బాబా! మీరు సదా మాకు తోడు ఉంటూ మీ ఆశీస్సులు మాకందిస్తున్నారని మాకు తెలిసేలా ఏదైనా సూచన ఇవ్వండి“ అని ప్రార్థించాను. నిజానికి ఈ ఆలోచన బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నప్పటినుండి నా మదిలో ఉంది. మరుక్షణంలో నేను నా ఫేస్‌బుక్ పేజీ తెరచి చూశాను. అందులోని మొదటి పోస్టుని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆశ్చర్యం! నా రాజారామ్ (సాయిబాబా) ఫోటోపై “సాయి అడుగుపెడితే అద్భుతాలు జరుగుతాయి. నేను మీ ఇంటికే వస్తున్నాను” అని వ్రాసి ఉంది. ఆయన నేరుగా, 'నాతో ఉన్నానని, అతిథుల రూపంలో నా ఇంటికి వస్తున్నా'ని తెలియజేశారు. "థాంక్యూ సో మచ్ బాబా!" బాబాని పూర్తిగా నమ్మండి. అద్భుతాలు చేస్తారు.

రాజారామ్!!!

బాబా నా సమస్యలను పరిష్కరించారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! "బాబా! నేను మీ దివ్య పాదకమలాలకు నమస్కరిస్తున్నాను". ఇటీవల బాబా పరిష్కరించిన రెండు అనుభవాల గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:- 

ఈమధ్యకాలంలో ఒకసారి నా భర్త ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. ఆయనెంతగా ప్రయత్నించినప్పటికీ ఫోన్‌ ఆన్ కాలేదు. అత్యవసరంగా ఆయన కొన్ని ఫైల్స్ ఫార్వార్డ్ చేయవలసి ఉండటంతో చాలా ఆందోళనపడ్డారు. అప్పుడు నేను, "నా భర్త ఫోన్ స్విచ్చాన్ అయితే, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. తరువాత 5 నిమిషాల్లోనే బాబా కృపతో ఫోన్ ఆన్ అయ్యింది. "నా ప్రార్థనలను విన్నందుకు ధన్యవాదాలు బాబా! ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి".

రెండవ అనుభవం:- 

ఒకసారి నాకు, మావారికి మధ్య గొడవ జరిగింది. ఎదురుగా ఉన్న బాబా పటాన్ని చూస్తూ, "ఈ గొడవ పరిష్కారమయ్యేలా చూడండి బాబా! నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. కొద్దిసేపట్లో మావారు వచ్చి సమస్యను నాకు అర్థమయ్యేలా తెలియజేశారు. దాంతో అంతా మామూలుగా అయిపోయింది. ఇది బాబా వల్లనే జరిగింది. "చాలా ధన్యవాదాలు బాబా! మీరు సదా నాకు తోడుగా ఉన్నారని నేను గ్రహించాను. నేను మీమీద కోపం తెచ్చుకున్నందుకు నన్ను క్షమించండి". 

దయచేసి ప్రతి ఒక్కరూ బాబాపై విశ్వాసం ఉంచండి. ఆయన మీ సమస్యలను పరిష్కరిస్తారు.


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo