సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 284వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కలలో బాధను అనుభవింపజేసి సైనస్ నుండి విముక్తినిచ్చిన బాబా
  2. అనుకున్నంతనే బాబా ఇచ్చిన అనుభవం

కలలో బాధను అనుభవింపజేసి సైనస్ నుండి విముక్తినిచ్చిన బాబా

మారిషస్‌ నుండి సాయిభక్తురాలు లీనా తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నా పేరు లీనా. సాయి నాకు ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడం ఇదే మొదటిసారి. నేను 2010వ సంవత్సరం నుండి సాయిభక్తురాలిని. శిరిడీ సాయిబాబా నాకు కలలో దర్శనమిచ్చి నాతో క్రియోల్ (మారిషన్ భాష)లో మాట్లాడారు. ఆయన భారతదేశంలో ఉన్నప్పటికీ ఇక్కడ నాకు దర్శనం ఇవ్వడం చాలా వింతగా అనిపించింది. కలలో నేను బాబా కాలును తాకుతుండగా అది బూడిద(ఊదీ)గా మారి క్రింద పడిపోయింది. దాంతో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పటివరకు నేనెప్పుడూ బాబా ఊదీ గురించి వినలేదు. తరువాత నేను గూగుల్‌లో వెతికి ఊదీ గురించి తెలుసుకున్నాను. కలలోనే, నేను వెనక్కి తిరిగి చూస్తే, నా కుటుంబసభ్యులందరూ నా వెనుక క్యూలో బాబా దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. అంతటితో నేను మేల్కొన్నాను. ఇప్పుడు, అంటే 2019వ సంవత్సరంలో నా కుటుంబ సభ్యులందరూ సాయిభక్తులు. ఆ కల ద్వారా నా కుటుంబసభ్యులందరూ త్వరలో తమకు భక్తులవుతారని బాబా నాకు ఎన్నో సంవత్సరాల క్రితమే సూచన ఇచ్చారు.

2011లో నేను సైనస్ సమస్యతో చాలా బాధపడ్డాను. దాదాపు ఒక నెలంతా నా తలనొప్పి కారణంగా నేను పనికి వెళ్ళలేదు. నొప్పివలన నిద్రపట్టక రాత్రంతా మెలకువగా ఉండేదాన్ని. బాధ తట్టుకోలేక పగలు, రాత్రి ఏడుస్తూ మానసికంగా బాగా కృంగిపోయాను. చివరికి ఒక రాత్రి నేను సాయిబాబాతో, "నాకు నయం అయ్యేంతవరకు నేను పూజగదిలోనే నిద్రపోతాను. మీరు వచ్చేంతవరకు, నాకు నయం చేసే వరకు ఏడుస్తూనే ఉంటాను" అని చెప్పాను. అంతే! ఒక అద్భుతం జరిగింది. చాలారోజుల నుండి నిద్రలేని నేను నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. అప్పుడొక కల వచ్చింది. కలలో నేను మా అమ్మా వాళ్ళింట్లో ఉన్నాను.(వివాహమై ప్రస్తుతం నేను నా భర్తతో ఉంటున్నాను.) ముదురు నలుపురంగులో ఉన్న పాములు నన్ను చుట్టుముట్టాయి. అవి నా గొంతు నులిమేయడానికి ప్రయత్నిస్తున్నాయి. పాములను చూసి భయపడుతూ, అవి పెట్టే హింసకు నేను కలలోనే చాలా బాధ అనుభవించాను. ఇప్పుడు ఆ కల జ్ఞాపకం వచ్చినా కూడా నాకు వణుకుపుడుతుంది. కలలో సాయిబాబా నాపైన గాలిలో తేలుతూ నన్ను చూస్తూ నవ్వుతున్నారు. నేను మేల్కొన్నాక గమనిస్తే, అద్భుతం! ఆశ్చర్యం! నా నొప్పులన్నీ గాలిలో కలిసిపోయాయి. మళ్ళీ ఈరోజు వరకు నేను సైనస్‌తో బాధపడలేదు. ఆ అనుభవంతో బాబా పట్ల నా విశ్వాసం బిలియన్ రెట్లు పెరిగింది. ఇప్పుడు నేను నా సాయిబాబాకు గొప్ప భక్తురాలిని. "శతకోటి ధన్యవాదాలు బాబా! ఎప్పుడూ మానవాళిని ఇలాగే రక్షిస్తూ ఉండండి బాబా!" బాబా దయతో, ఆశీర్వాదాలతో ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

లోకాః సమస్తాః సుఖినో భవంతు!

ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.

అనుకున్నంతనే బాబా ఇచ్చిన అనుభవం

నా పేరు జ్యోతి. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ సాయిగ్రూపుల్లో వచ్చే మెసేజీలను తప్పక చదువుతూ ఉంటాను. బాబా మనకెన్నో చేస్తారు. కానీ, ఎప్పుడో సమయం వచ్చినప్పుడుగానీ అవి మనకు అర్థం కావు. ఒకసారి నేనొక బాబా పెయింటింగ్ చూశాను. ఆ పెయింటింగ్ చాలా బాగుంది, కానీ అందులో బాబా కళ్ళు మూసివున్నట్లుగా ఉన్నాయి. మా గురువుగారు కట్టించిన మందిరంలోని బాబా పెయింటింగ్ అది. ఆ మందిరంలో బాబా ఎలా ఉంటారో నాకు చాలా స్పష్టంగా తెలుసు. అందువలన నేను, "బాబా కళ్ళు ఇలా కాదు ఉండేది, అవి చాలా బాగుంటాయి" అని అనుకున్నాను. మరుసటిరోజు నేను గ్రూపులో అనుభవాలు చదివాక, బాబా నాకెన్నో చేసినప్పటికీ నేను వాటిని గుర్తించకుండా, "నాకు ఏ అనుభవం రాలేదు" అని అనుకున్నాను. ఆరోజు రాత్రి మాములుగా నిద్రపోయాను. వేకువఝామున నాకొక కల వచ్చింది. కలలో బాబా విగ్రహం రూపంలో కనిపించారు. బాబా ముందు తమ కళ్ళు తెరచి చూశారు. తరువాత షార్ట్  ధరించి, పైన కండువా వేసుకొని నడుస్తూ వచ్చి కూర్చున్నారు. నేను ఆయనను చూస్తూ, 'బాబా! బాబా!' అని అనుకుంటూ ఫోటోలు తీస్తున్నాను. ఆ తరువాత నాకు మెలకువ వచ్చింది. నాకెంతో సంతోషంగా అనిపించింది. ఎప్పటికీ మరువలేని అనుభూతి పొందాను. నాకు ఏ అనుభవమూ లేదనుకుంటే బాబా నిజంగానే వచ్చి దర్శనమిచ్చారు. ఆ దర్శనభాగ్యం నిజంగా మరువలేనిది. నా సాయితండ్రి దయామయులు, కరుణాస్వరూపులు, అనుకున్నదే తడవుగా అనుగ్రహించారు. "బాబా! అనుక్షణం నాకు తోడుగా ఉంటూ సమదమాది గుణాలను ప్రసాదించి సన్మార్గంలో నన్ను నడిపించండి". 

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!

2 comments:

  1. Om sainathaya namaha om sai ram subam bhavat

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo