సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 296వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఊదీ మహిమలు
  2. సాయిబాబా ఇచ్చిన చక్కటి దర్శనం, అనుభవాలు

ఊదీ మహిమలు

నా పేరు లక్ష్మి. నేను బెంగుళూరు నివాసిని. ముందుగా శ్రీసాయినాథునికి నా నమోవాకములు. సాయిభక్తులకు నా వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవాలు జరిగినప్పుడు ఇంత చిన్నవాటికి కూడ సాయిబాబా సహాయం చేస్తారా అనుకునేదాన్ని. కానీ ఆ తండ్రి ప్రేమకు అవధులు లేవని ఋజువు చేసారు.

నేను చాలాకాలం నుండి కీళ్ళనొప్పులతో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా నొప్పులు తగ్గేవి కావు. అలాగే బాధపడుతూ ఉండేదాన్ని. బ్లాగులో సాయిభక్తులందరి అనుభవాలు చదివాక, నేను నా కీళ్ళనొప్పులకు బాబా ఊదీనే ఔషదమని నమ్మి, బాబాను ప్రార్థించి ఊదీ రాసుకున్నాను. బాబా ఊదీ ప్రభావంతో నా కీళ్ళనొప్పులు తగ్గిపోయాయి. ఇప్పుడు నేను హాయిగా పని చేసుకోగలుగుతున్నాను. అంతా బాబా అనుగ్రహమే!

ఒకసారి మా చిన్నమనవడికి స్కిన్ ఎలర్జీ వచ్చింది. మేమంతా అది అమ్మవారు(చికెన్ పాక్స్) అనుకుని ఆ జాగ్రత్తలలో ఉన్నాము. కానీ ఎటువంటి ఉపశమనం కన్పించలేదు. దాంతో నేను బాబా ఊదీతోనే ఇది తగ్గుతుందని భావించి, బాబాను ప్రార్థించి, మా మనవడి ఒళ్ళంతా ఊదీ రాసి, కొద్దిగా ఊదీని నీళ్ళల్లో కలిపి త్రాగించాను. ఊదీ ప్రభావంతో రెండు రోజులలోనే ఆ ఎలర్జీ తగ్గిపోయింది. తర్వాత వాడు హాయిగా ఉన్నాడు. ఇదంతా సాయినాథుడి ఆశీర్వాదమే. "ధన్యవాదాలు బాబా! ఇలాగే ఎప్పుడూ మాకు అండగా ఉంటూ అన్ని విషయాలలోనూ మమ్మల్ని కాపాడాల"ని వేడుకుంటున్నాను. 

ఓం శ్రీ సాయినాథాయనమః.

సాయిబాబా ఇచ్చిన చక్కటి దర్శనం, అనుభవాలు

నేను బాబాకు చిన్న భక్తురాలిని. ఆయన నాకు చాలా అనుభవాలను ప్రసాదించి నన్ను ఆశీర్వదించారు. గత రెండు సంవత్సరాల నుండి నేను ప్రతి సంవత్సరం మే నెలలో శిరిడీ దర్శించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మే నెలలో వెళ్లేలా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. ప్రయాణ తేదీ సమీపిస్తున్న తరుణంలో నా నెలసరి కూడా ఇంచుమించు అదే తేదీలో ఉన్నట్లు నేను గమనించాను. దాంతో బాబా దర్శనభాగ్యాన్ని కోల్పోతానేమోనని చాలా భయపడ్డాను. వాస్తవానికి నా భర్త తను లేకుండా నన్ను పంపడానికి ఇష్టపడరు. కానీ మొట్టమొదటిసారి నా సోదరితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు నా ప్రయాణానికి అంతరాయం ఏర్పడితే మళ్ళీ నేను శిరిడీ ఎప్పుడు వెళ్ళగలుగుతానో ఏమిటో అని ఆందోళనపడి, 'ఎలాగైనా నా నెలసరి వాయిదాపడేలా చేయమ'ని మనస్సులోనే బాబాను ప్రార్థించాను. ఇక శిరిడీ ప్రయాణమయ్యేరోజు రానే వచ్చింది. మేము శిరిడీ చేరుకున్నాము. బాబా చక్కటి దర్శనాన్ని, ఆరతిని అనుగ్రహించారు. ఇంకో ముఖ్యవిషయం, బాబా నీలిరంగు దుస్తుల్లో దర్శనం ఇచ్చారు. ఇందులో ఏముంది అనుకుంటారేమో! ఆరోజు నేను అదే రంగు దుస్తులు ధరించాను. దర్శనానికి వెళ్లేముందు, 'బాబా కూడా ఇదే రంగు దుస్తులలో దర్శనమిస్తారా?' అని అనుకున్నాను. అలా బాబా నా కోరిక మన్నించి, నన్ను ఆశీర్వదించి నా మనసుకు చాలా ఆనందాన్నిచ్చారు.

ఇక మేము తిరుగు ప్రయాణమవ్వాల్సిన సమయం వచ్చింది. కానీ ఏదో లోపం కారణంగా మా ఫ్లైట్ రద్దయింది. బాబా దయవల్ల మరుసటిరోజు ప్రయాణమవడానికి విమానయాన సంస్థ తగిన ఏర్పాట్లు చేసింది. మేము విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన హోటల్ గదికి వెళితే అక్కడ సాయిబాబా ఫోటో దర్శనమిచ్చింది. ఆరోజు కూడా మేము శిరిడీలో ఉండేలా బాబా చేసినందుకు మేము చాలా చాలా సంతోషించాము. సచ్చరిత్రలో పేర్కొన్నట్లు బాబా అనుమతి లేకుండా మనం శిరిడీకి వెళ్ళలేము, అదేవిధంగా ఆయన అనుమతి లేకుండా తిరిగి రాలేము. ఫ్లైట్ రద్దు కాకుండా ఉన్నట్లైతే మేము కనెక్టింగ్ ఫ్లైట్ కోసం మధ్యలో వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఆ అవసరం లేకుండా నేరుగా వెళ్లేలా బాబా ఏర్పాటు చేశారు. "ఏ సమస్యలు లేకుండా చక్కటి దర్శనాన్ని, మంచి అనుభవాలను ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! నా బిడ్డని, భర్తని, మొత్తం నా కుటుంబాన్ని దయచేసి ఆశీర్వదించండి. మేము మా సమస్యలన్నింటినీ మీ పాదాల వద్ద సమర్పిస్తున్నాము. మాకు సరైన మార్గనిర్దేశం చేసి ముందుకు నడిపించండి బాబా!".


2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. om sairam
    sri sairam

    sai alway be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo