సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 282వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. తగిన జీవితభాగస్వామిని చూపించి బాబా ఆశీర్వదించారు
  2. హార్డ్‌వేర్ సమస్య పరిష్కారంలో బాబా సహాయం

తగిన జీవితభాగస్వామిని చూపించి బాబా ఆశీర్వదించారు

సాయిభక్తురాలు నికితా గుప్తా తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా దయతో ఢిల్లీలోని ఒక ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తున్నాను. సాయిబాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. వాటిలో ఒక అనుభవాన్ని నేనిప్పుడు సాటి సాయిభక్తులతో పంచుకోబోతున్నాను. "క్షమించండి బాబా! నేను చాలా ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నాను".

కట్నం లేకుండా వివాహం చేసుకోవాలనేది నా నమ్మకం. అందువలన నేను చేసుకోబోయే వ్యక్తికి, అతని కుటుంబానికి అత్యాశ లేకుండా ఉండాలని అనుకునేదాన్ని. నాకిప్పుడు ముప్పై సంవత్సరాలు. నేను నా కెరియర్‌లో ఆలస్యంగా స్థిరపడ్డాను. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు నా వయస్సు 28 సంవత్సరాలు. అప్పటివరకు వివాహ విషయంలో నా తల్లిదండ్రుల నుండి నాపై ఎటువంటి ఒత్తిడీ ఉండేది కాదు. కానీ తరువాత ఆ విషయంలో వాళ్ళు ఆందోళనపడటం ప్రారంభించారు. ఎందుకంటే, వచ్చే సంబంధాలన్నీ అత్యాశ స్వభావం ఉన్నవాళ్లు కావడంతో నేను ఏ సంబంధాన్నీ అంగీకరించలేదు. అసలు వాళ్ళ కుటుంబం గురించి వింటూనే సంబంధాన్ని తిరస్కరించేదాన్ని. కనీసం ఒక్క అబ్బాయిని గాని, కుటుంబాన్ని గాని నేను కలవలేదు. అలాగే రోజులు గడుస్తూ ఉండటంతో నేను కూడా చాలా భయపడ్డాను. కానీ నేను బాబాపై నమ్మకం ఉంచుకున్నాను, ఆయనే నాకు తగిన జీవితభాగస్వామిని చూపించి నన్ను ఆశీర్వదిస్తారని. నేను నా జీవితభాగస్వామిని కలుసుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాట కూడా ఇచ్చాను.

ఒకరోజు నేను బాబాని, "నా కోసమే పుట్టిన ఆ వ్యక్తి ఎవరు బాబా?" అని అడిగాను. తర్వాత కొద్దిసేపట్లో ఫేస్‌బుక్‌లో నాకు తెలియని ఒక వ్యక్తి నుండి నాకొక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నేను సాధారణంగా ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించను. కానీ అతని కవర్ ఫోటోగా సాయిబాబా ఫోటో ఉంది. దాంతో నా మనసుకు "ఇతనేనా ఆ వ్యక్తి?" అని అనిపించింది. అందువలన అతని ఫ్రెండ్ రిక్వెస్టుని అంగీకరించాను. ఆ తరువాత మా ఇద్దరి మధ్య ఫేస్‌బుక్‌లో కొంత చాటింగ్ జరిగింది. త్వరలోనే మేము మంచి స్నేహితులుగా మారాము. ఒకరికొకరం ఫోన్ నెంబర్లు షేర్ చేసుకున్నాము. మేము చాటింగ్ చేసుకుంటున్నా, మాట్లాడుకుంటున్నా మా మనసులో ఏమీలేదు. మంచి స్నేహితులుగానే మెలిగేవాళ్ళము. కొంతకాలానికి వివాహ విషయంలో మా ఇద్దరిపై ఉన్న ఒత్తిడి గురించి తెలుసుకున్నాము. ఆ తరువాత మేమిద్దరం ఒకరు లేకుండా ఇంకొకరు జీవించలేమని గ్రహించాము. చివరికి ఒక సంవత్సరం ఫేస్‌బుక్ స్నేహం తరువాత మేమిద్దరం ఒకరినొకరం కలుసుకోవాలని నిర్ణయించుకున్నాము. అప్పుడు నేను మా విషయాన్ని నా కుటుంబసభ్యులకు తెలియపరిచాను. కానీ వాళ్ళు మా పెళ్ళికి సిద్ధంగా లేరు. ఎందుకంటే, ఆ అబ్బాయి వేరే రాష్ట్రానికి చెందినవాడు. దూరప్రాంతపు అబ్బాయని, అతని కుటుంబాన్ని ఎలా విశ్వసించగలమనేది వాళ్ళ వాదన. వాళ్ళు అన్నది నిజమేననిపించి నేను కూడా భయపడ్డాను. ఈ విషయం తెలిసి అతను కూడా నిరాశకు గురయ్యాడు. ఆ స్థితిలో నేను, "బాబా! ఆ వ్యక్తి నాకు సరైనవాడు కాదు అన్నది మీ నిర్ణయమైతే అది నాకూ సమ్మతమే. కానీ అతను నాకు సరైనవాడు అయితే దయచేసి అతని గురించి మాకు తెలిసేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. కొంతకాలం తర్వాత ఒకరోజు నేను అతని ఫేస్‌బుక్ పేజీలో చూస్తుండగా నా కజిన్ స్నేహితుడైన ఒక వ్యక్తి ఫోటోను చూశాను. అప్పుడు నా కజిన్ ఆ అబ్బాయి గురించి, అతని కుటుంబం గురించి ఆరా తీశాడు. అంతా సానుకూలంగా అనిపించింది. ఇక ఏ తప్పూ దొరకని కారణంగా మా కుటుంబమంతా వాళ్ళని కలవాలని అనుకున్నారు. ఆ సమావేశం తరువాత నా కుటుంబం మా ఇద్దరి వివాహానికి సంసిద్ధత తెలియజేసింది. నేను అప్పటికే ఆ అబ్బాయితో కట్నం గురించి చర్చించాను. తనకి, తన కుటుంబసభ్యులకు ఎటువంటి సమస్య లేదని నాకు తెలుసు. అలా బాబా దయతో 2017 నవంబరులో మా వివాహం జరిగింది. నేనిప్పుడు నా కలల రాకుమారుడితో చాలా సంతోషంగా ఉన్నాను. "బాబా! ధన్యవాదాలు. ఇప్పుడు నాకు మరోసారి మీ అవసరం వచ్చింది. నేను ఒక మగబిడ్డకు తల్లి కావాలని అనుకుంటున్నాను. దయచేసి ఆశీర్వదించండి బాబా! నా భర్తని, తన వ్యాపారాన్ని ఆశీర్వదించండి. నేను తన వ్యాపారంలో వృద్ధిని కోరుకుంటున్నాను. అందరినీ ఆశీర్వదించండి బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2507.html

హార్డ్‌వేర్ సమస్య పరిష్కారంలో బాబా సహాయం

యు.ఎ.ఇ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను ఒక ప్రొఫెషనల్ కన్సల్టెంటుని. నేను సర్ఫేస్ బుక్ 2 ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నాను. గత మే నెలలో ఏవో కొన్ని సమస్యలు వచ్చి ల్యాప్‌టాప్‌ ఆన్ కాలేదు. అందులో ఉన్న డేటా అంతా బ్యాకప్ చేయబడి లేకపోవడంతో నాకు అది జీవన్మరణ సమస్య అయ్యింది. నేను సహాయం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థను సంప్రదించి అన్నివిధాలుగా ప్రయత్నించాను. కానీ నాకెటువంటి సహాయమూ లభించలేదు. తరువాత నేను కొంతమంది డేటా రికవరీ నిపుణులను కలిశాను. వాళ్ళు డేటాను తిరిగి రాబట్టగలమని మాట అయితే ఇచ్చారు గానీ ల్యాప్‌టాప్‌ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. 3,500 డాలర్ల ఖరీదైన ల్యాప్‌టాప్‌ పాడవుతుందంటే నాకు చాలా ఆందోళనగా అనిపించినప్పటికీ, ఆ డేటా చాలా విలువైనది కాబట్టి నాకు వేరే మార్గం ఏదీ కనపడలేదు. సరే, ఒకరోజు వేచి చూసి డేటా రికవరీ చేయిద్దామని నిర్ణయించుకున్నాను. తరువాత నేను బాబాను తలచుకుని, నాకు సహాయం చేయమని ప్రార్థించాను. తరువాత ఆన్‌లైన్‌లో నేను కొన్ని ఫోరమ్‌లు చూస్తున్నాను. అందులో పేపర్‌క్లిప్‌తో స్క్రీన్‌ను మాన్యువల్‌గా ఎలా బయటకు తీయవచ్చో చూపించే ఒక వీడియో నా కంటపడింది. అలా చేస్తే నా స్క్రీన్‌ ఖచ్చితంగా పాడయ్యే అవకాశం ఉందని నాకు అనిపించింది. వెంటనే నేను ఆన్‌లైన్ ఫోరమ్‌లో కొంతమందిని  ఆ విషయం గురించి అడిగాను. వాళ్ళు ఇలాంటి పరిస్థితి మాకు కూడా ఉంది, కానీ ల్యాప్‌టాప్‌ను అలా వదిలేయడమే తప్ప ఏమీ చేయలేమని చెప్పారు. కానీ నా మనసుకెందుకో, 'నేనున్నాను, అంతా బాగానే ఉంటుంద'ని బాబా భరోసా ఇస్తున్నట్లుగా దృఢంగా అనిపించింది. దాంతో నేను ఆ పద్ధతిని ప్రయత్నించాను. బాబా దయవలన నేను స్క్రీన్‌ను బయటకు తీయగలిగాను, తరువాత దానిని ఛార్జ్ చేశాను. దాంతో నా సమస్య పరిష్కారమైంది. ఆ సమస్య కారణంగా నేను రెండు రాత్రులు నిద్రపోలేదు. చివరికి శ్రీ సాయిబాబా ఆశీస్సులవల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను. "థాంక్యూ సో మచ్ బాబా!" 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo