సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 295వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. పెద్దప్రమాదం నుండి కాపాడిన బాబా
  2. సాయి సందేశం - కలలో మార్గనిర్దేశం

పెద్దప్రమాదం నుండి కాపాడిన బాబా

అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి సాయిభక్తుడు వెంకటరాముడు 2020, జనవరి 1న తనను, తనతోపాటు మరో వ్యక్తిని బాబా పెద్ద ప్రమాదం నుండి కాపాడిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

జనవరి 1వ తారీఖున మాకు తెలిసినవాళ్ళు శిరిడీ ప్రసాదాన్ని మాకిచ్చి, మా యింటి దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పారు. క్రొత్త సంవత్సరం ఆరంభమవుతూనే బాబా ఆశీస్సులు ప్రసాదం రూపంలో మాకు లభించాయని మేము చాలా సంతోషించాము. నేను ఆ ప్రసాదాన్ని తీసుకొని బైక్ మీద బయలుదేరాను. నేను రోడ్డు దాటుతున్న సమయంలో వ్యతిరేకదిశలో ఒకతను మోటార్ సైకిల్ మీద సుమారు 65, 70 కిలోమీటర్ల వేగంలో వస్తూ సడన్‌గా నన్ను చూసి వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. దాంతో పట్టుతప్పి బైక్ మీద నుంచి కిందపడిపోయాడు. బైక్ దాదాపు ఎనిమిది అడుగుల దూరం నుంచి జారుకుంటూ వచ్చి నేను కాలు పెట్టుకున్న ఫుట్‌రెస్ట్‌కు వచ్చి బలంగా గుద్దుకొని ఆగింది. అంత బలంగా గుద్దుకున్నప్పటికీ నా కాలికి చిన్న గీత కూడా కాలేదు. నిజంగా ఇది బాబా నాకు చేసిన పెద్ద సహాయం. ఒకవేళ ఆయన దయ చూపకుంటే నా పాదం విరిగిపోయి ఉండేది. బాబా నన్నే కాదు ఆ బైక్ పై ఉన్న అతనిని కూడా కాపాడారు. అతనికి పెద్ద అపాయమేమీ కాకుండా చిన్న ఫ్రాక్చర్ మాత్రమే అయింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అవతలివాళ్ళు, చుట్టుపక్కలవాళ్ళు ప్రమాదానికి కారణమైనవాళ్ళని నానా మాటలంటారు. కానీ నా విషయంలో ప్రమాదానికి గురైన అతనుగాని, చుట్టుపక్కలవాళ్లుగాని ఒక్క మాట కూడా అనలేదు. ఇదంతా సాయికి నాపై ఉన్న ప్రేమ వలనే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ మేలు మరువలేనిది. ఎప్పటికీ మీ ప్రేమని ఇలాగే నాపై  చూపిస్తూ ఉండండి బాబా!"
   
జై సాయిరామ్! జై జై సాయిరామ్!!

సాయి సందేశం - కలలో మార్గనిర్దేశం

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయి ప్రేమను పంచుతున్న భక్తులకు మరియు బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. "నేను నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి సాయీ!" 

నేను పొత్తికడుపులో సమస్యతో బాధపడుతున్నాను. ఆ విషయమై నేను సాయిని ప్రార్థించి క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో అడిగితే, "దానం చేయండి. మీ సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది" అని వచ్చింది. నేను సాధారణంగా ప్రతి గురువారం సాయిమందిరానికి వెళ్ళినప్పుడు దానం చేస్తుంటాను, కాబట్టి దానికంటే అదనంగా దానం చేయాల్సిన అవసరం ఉందని నేను గ్రహించాను. అయితే, 'మందిరంలో దానం చేయాలా? లేక వేరే ఎక్కడైనా చేయాలా?' అన్న అయోమయంలో పడ్డాను. దాంతో 'నాకు మార్గనిర్దేశం చేయమ'ని సాయిని ప్రార్థించాను.

ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి డబ్బులు దానం చేస్తున్నాను. కానీ సమస్య ఏమిటంటే, నేనెప్పుడూ సాయిమందిరం వద్ద పిల్లల్ని చూడలేదు. పిల్లలు డబ్బులు అడుగుతున్నట్లు నేను చూసిన ఏకైక ప్రదేశం మార్కెట్లో ఉన్న దుర్గగుడి. అదికూడా మంగళవారం సూర్యాస్తమయం తరువాత మాత్రమే వాళ్ళని అక్కడ చూశాను. మిగతా రోజుల్లో వాళ్ళు మార్కెట్లో అక్కడక్కడా కనిపిస్తుంటారు. కానీ కలలో పిల్లలంతా ఒకేచోట ఉండటం చూశాను. ఏదేమైనా నేను సూర్యాస్తమయానికన్నా ముందుగా సాయిమందిరానికే వెళ్ళాను. నేను ఆశ్చర్యపోయేలా మందిరం దగ్గర నాకు ఒక అద్భుతం ఎదురైంది. దాదాపు 5 సంవత్సరాలుగా నేను క్రమంతప్పకుండా ఆ మందిరానికి వెళ్తున్నాను. అంతకాలంలో ఒక్కసారి కూడా నేను డబ్బులు అడుగుతున్న పిల్లల్ని ఆ మందిరం వద్ద చూడలేదు. కానీ ఆరోజు ముగ్గురు పిల్లలు డబ్బులు అడుగుతుండటం నేను మొదటిసారి చూశాను. నేను వాళ్లకు డబ్బులు దానం చేశాను. ఆ సమయంలో నేను చెప్పిన మార్కెట్‌కు వెళ్లినా చాలా కష్టమయ్యేది. కానీ నా సాయి నాకు సహాయం చేశారు. శ్రమపడకుండా సాయి నా సమస్యను పరిష్కరించారు. ముఖ్యమైన విషయమేమిటంటే, సాయి నాకు సందేశాన్ని ఇవ్వడమే కాకుండా కలలో మార్గనిర్దేశం కూడా చేశారు. సాయి మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు, కానీ ఆ సంకేతాలను మనం అర్థం చేసుకోలేము. మనం స్వార్థపరులం, కానీ దయ కలిగి ఉన్నామని అనుకుంటాము. నిజంగా మనం సాయి ఆశీస్సులు పొందాలనుకుంటే మనల్ని మనం మార్చుకోవాలి. ఇతరులకు సహాయం చేయడానికి త్యాగం చేయవలసి వచ్చినా కూడా సహాయం చేయాలి. చెడు ఆలోచనలను, ప్రతికూల ఆలోచనలను వదిలిపెట్టి ప్రేమను వ్యాప్తి చేద్దాం.

ఓం సాయిరామ్!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2520.html


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo