సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 395వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నన్ను తన బిడ్డగా స్వీకరించిన సాయినాథుడు
  2. బాబాని నమ్ముకుంటే ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేస్తారు

నన్ను తన బిడ్డగా స్వీకరించిన సాయినాథుడు

సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు సాయిరాం! మనందరి తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయినాథుడు నన్ను తన బిడ్డగా స్వీకరించారని నాకు ఒక స్వప్నం ద్వారా చెప్పిన విషయాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు మీతో ఇలా పంచుకునే అవకాశాన్ని కల్పించిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ‘థాంక్యూ సో మచ్ సాయీ!’. ఈ అనుభవాన్ని వీలైనంత క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే మొత్తం రాస్తే ఈ అనుభవం చాలా పెద్దది అయిపోతుంది. సాయిబంధువులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

నా చిన్నప్పటినుంచి మా ఇంట్లో ఎటువంటి బాబాలు, స్వామీజీల ఫోటోలు ఉండేవి కావు. ఇంట్లో కేవలం డాడీ వాళ్ళ గురువుగారి ఫోటో మాత్రమే ఉండేది. ఎందుకంటే, డాడీ వేరే ఏ బాబాలను గానీ, స్వాములని గానీ నమ్మేవారు కాదు. అయినప్పటికీ ఎపుడైనా మన బాబా ప్రస్తావన వస్తే మాత్రం డాడీ చాలా గొప్పగా చెప్పేవారు బాబా గురించి. బాబా గొప్ప సద్గురువు అనీ, అంతటి మహాత్ముడు ఉండరు, ఉండబోరు అనీ, ఆయనని అనుసరించేవాళ్ళు కూడా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాళ్లు అనీ, ఇంకా చాలా చెప్పేవారు. అది విని ఆ వయసులో నాకు ‘బాబా గ్రేట్’ అని మాత్రం అనిపించేది, అంతే! భక్తి, నమ్మకం లాంటివి తెలియని వయసు కదా!

కొన్నాళ్ళకి డాడీ నన్ను విడిచి బాబా దగ్గరకు వెళ్ళిపోయారు. ఆ పరిస్థితిని మాటల్లో చెప్పలేను కాబట్టి ఏమీ చెప్పటం లేదు. అప్పటినుంచి బాబా ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా “నేను ఉన్నాను నీకు” అని చెప్పేవారు. కానీ, నేనే అర్థం చేసుకోలేదు. ఒకరోజు నేను మా నానమ్మ దగ్గర ‘సాయి సచ్చరిత్ర’ ఉంటే అడిగి తీసుకుని చదువుతూ ఉన్నాను. అదే మొదటిసారి నేను సచ్చరిత్ర చదవటం. అంతకుముందు బాబా ఫోటో అయినా, సచ్చరిత్ర అయినా నేను చూసింది మా అమ్మమ్మ ఇంట్లోనే. కానీ ఎప్పుడూ సచ్చరిత్ర చదవలేదు. ఆరోజు సచ్చరిత్ర చదువుతూ అలాగే నిద్రపోయాను. అప్పుడొక కల వచ్చింది. ఆ కలలో నేను చిన్నపిల్లగా, అంటే పదేళ్ళలోపు వయసులో ఉన్నాను. మా డాడీ నన్ను ఎత్తుకుని తీసుకువెళ్లి ఒక బిల్డింగ్ పైన కూర్చోపెట్టి, ‘ఇక్కడే ఉండు’ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ప్రదేశం చాలా క్రొత్తగా ఉంది, ఇంతకుముందెప్పుడూ నేను చూడలేదు. అయినా నాకు చాలా చాలా నచ్చింది. ఇప్పటికీ అది తలచుకుంటే చాలా బావుంటుంది. అక్కడినించి ఒక పెద్ద వేపచెట్టు కనిపిస్తోంది. అలాగే వేరే చోట ఒక గుర్రం బొమ్మ ఉంది. చాలామంది జనాలు అటు ఇటు తిరుగుతున్నారు. అవన్నీ చూస్తూ మైమరచిపోయాను. డాడీ లేరనే భయంగానీ, బెంగగానీ ఏమీ లేవు. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. అప్పుడే మా తమ్ముడు కాలేజీ నుండి వచ్చాడు. తన చేతిలో ఒక డైరీ ఉంది. తన ఫ్రెండ్ శిరిడీ వెళ్ళాడనీ, అక్కడినుండి ఆ డైరీని తీసుకొచ్చి తనకిచ్చాడనీ చెప్పాడు. నేను డైరీని నా చేతుల్లోకి తీసుకుని చూస్తూ ఉన్నాను. దానిలో శిరిడీలోని ప్రదేశాల ఫోటోలు ఇచ్చారు. వాటిలో ఒక ఫోటో చూసి నిర్ఘాంతపోయాను. ఎందుకంటే, కలలో డాడీ నన్ను ఏ బిల్డింగ్ పైన కూర్చోపెట్టారో ఆ బిల్డింగే ఆ ఫోటోలో ఉంది. అది మరేదో కాదు, మన బాబా సమాధిమందిరం! అంటే, నన్ను బాబాకి అప్పగించేసి డాడీ వెళ్ళిపోయారు. అప్పటినుంచి నన్ను బాబానే చూసుకుంటున్నారు. అప్పుడు అన్నీ అర్థమయ్యాయి, ఎందుకు బాబా పదేపదే నాకు కనిపించి నిదర్శనాలు చూపిస్తున్నారు అని. బాబా బిడ్డగా ఉంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. జీవితాంతం బాబా బిడ్డగానే ఉంటే చాలు! 

ఓం సాయిరాం!

బాబాని నమ్ముకుంటే ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేస్తారు

ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈమధ్యనే బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. కొద్దిరోజుల క్రితం నాకు కుడికాలు లాగేస్తున్నట్లు నొప్పిగానూ, బాగా ఇబ్బందిగానూ ఉండేది. లోపల నరం ఏమైనా దెబ్బతిన్నదేమోనని చాలా భయమేసింది. దాంతో నేను బాబాని ఆర్తిగా వేడుకున్నాను, “తండ్రీ! ఈ బాధనుండి నాకు విముక్తి కలుగచేయండి. నాకు ఈ బాధనుండి ఉపశమనం కలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని. బాబా అనుగ్రహంతో రెండు మూడు రోజుల్లోనే నొప్పినుండి చాలావరకు ఉపశమనం కలిగింది. ఇప్పుడు నా కాలు ఏ ఇబ్బందీ లేకుండా చాలా బాగుంది. బాబాని నమ్ముకుంటే ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేస్తారు. మనం ఓర్పుతో (సబూరి) ఎదురుచూడాలి. “బాబా! నాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించండి తండ్రీ!”


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


సాయి అనుగ్రహసుమాలు - 353వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయిఎనిమిదవ  భాగం 

9-3-1912

ఉదయం నేను కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ మంచి ధోరణిలో ఉన్నట్లు కనిపించారు. ఎప్పటిలాగే ఆశీర్వదించి, “భగవంతుడే అందరికంటే గొప్పవాడు" అన్నారు. తరువాత ఆయన మశీదుకి వెళ్ళారు. నేను తిరిగి వచ్చి నా ప్రార్థన చేసుకున్నాను. పంచదశి తరగతికి వెళ్ళటానికి తయారవుతుండగా ధన్‌జీషా ముంబాయి నుండి వచ్చాడు. అతను సాయిసాహెబ్‌కి మంచి పండ్లు తెచ్చాడు. మేం మాట్లాడుతూ కూర్చున్నాం. సాయిసాహెబ్ బయటకు వెళ్ళేటప్పుడు ఆయన్ను చూశాము. మా పంచదశి తరగతిని జరుపుకున్నాము గానీ, అది ఎక్కువసేపు జరుగలేదు. యథాప్రకారం నేను మశీదుకి వెళ్ళాను. సాయిసాహెబ్ "నింబారు"కి దక్షిణం వైపు క్రింద ఉన్న రెండు పిచ్చుకల చరిత్ర గురించి చెప్పారు. ఇప్పటిలాగే ఇంతకుముందు కూడా ఆ పిచ్చుకలు అక్కడే గూడుకట్టుకుని ఉంటూండేవని అన్నారు. వాటిని మృత్యువు కబళించింది. అది సర్పరూపంలో వచ్చి నింబారుని చుట్టుముట్టి వాటిని మ్రింగేసింది. ఆ పిచ్చుకలు మళ్ళీ ఇప్పుడు పుట్టి, ఇదివరలో ఎక్కడ గూడు కట్టుకున్నాయో ఖచ్చితంగా అక్కడే మళ్ళీ గూడుకట్టుకొని, ఇదివరకు ఎక్కడ కూర్చునేవో మళ్ళీ అక్కడే కూర్చున్నాయి. వాటిని తాను ముట్టుకోలేదనీ, మాట్లాడను కూడా లేదని అన్నారాయన. 

ఆయన ధన్‌జీషా పూజను అంగీకరించి, అతను సమర్పించిన పూలదండను తను ఎప్పుడూ ఉంచుకునే దానికన్నా ఎక్కువసేపు తన మెడలో ఉండనిచ్చారు. ఆ పూలు ఆయనకు నచ్చాయి. ఆయన కొన్ని ద్రాక్షపళ్ళను తిన్నారు. ధన్‌జీషా నాతోనే ఉంటున్నాడు. భోజనాలయిన తరువాత నేను కొద్దిసేపు పడుకున్నాను. తరువాత మా తరగతిని నిర్వహించాం - కాదు కొనసాగించాం. ఆ భాగాన్ని మేము చాలా ఆనందంగా ఆస్వాదించాం. సూర్యాస్తమయ సమయంలో మేము సాయి వ్యాహ్యాళికెళ్ళటాన్ని చూశాం. ఆయన ఆహ్లాదంగా ఉన్నారు కానీ, గోడమీద పూలతో చేసిన అలంకరణలని తాను లెక్కపెట్టననీ, అయితే తనకు మనుషులు కావాలన్నారు. రాత్రి భీష్మ స్వానుభవ దినకర్, దాసబోధ చదివాడు. బాలాసాహెబ్ భాటే కూడా వచ్చాడు. భజన కూడా జరిగింది.

10-3-1912

సాయిబాబా బయటకు వెళ్ళటం చూశాము. ఆయన తిరిగి వచ్చేటప్పుడు నేను మశీదుకి వెళ్ళాను. నన్ను నా పేరు పెట్టి పిలిచి, తమ తండ్రి చాలా ధనవంతుడనీ, ఉన్న డబ్బుని చాలా ప్రదేశాల్లో పాతిపెట్టాడనీ అన్నారు. ఒకసారి తమ తండ్రితో తమకు చాలా చిన్నవయసులో భేదాభిప్రాయం వచ్చి ఒక చోటుకి వెళ్ళారట. అది చాలా పెద్దగా, దట్టంగా ఉన్న బ్రహ్మజెముడు చెట్ల వరుస అనీ, అక్కడ భూమి లోపల పెద్ద ధనపురాశిని కనుగొన్నాననీ అన్నారు. సాయిసాహెబ్ దానిమీద కూర్చొని ఒక పెద్ద త్రాచుపాముగా మారిపోయారట. కొద్దిసేపు దానిపై కూర్చున్న తరువాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాలని కోరిక కలిగిందట. అందుకని పొరుగు గ్రామానికి వెళుతుండగా దారిలో తన మానవ రూపాన్ని తిరిగి పొందారట. మనుషుల్ని చంపే ఒక వీధిలోకి ఆయన వెళ్ళారట. ఆయన అక్కడ తిరిగారు కానీ, దెబ్బలు తగలకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారట. తరువాత ఆయన భిక్షకు వెళ్ళి అక్కడ దాచిపెట్టి ఉన్న నిధినంతా తీసుకువచ్చారట. 

మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగిపోయింది. నేను తిరిగి వెళ్తూండగా ఆయన అన్నారు: "ఇటు చూడు, జాగ్రత్త! కొందరు అతిథులు వస్తారు, వారిని రానీయకు” అని. అంటే దానర్థం - నేను కొన్ని అలజడి కలిగించే ప్రభావాలకు లోబడుతానని, దాన్ని ఎదుర్కోవాలని. మధ్యాహ్న భోజనానంతరం నేను కొద్దిసేపు నడుం వాల్చాను. తరువాత అన్నాసాహెబ్ ముతాలిక్ నుంచి ఉమ రజస్వల అయిందని ఉత్తరం వచ్చింది. అప్పుడు మతపరమైన, సామాజికపరమైన పండుగ చేయాలి. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. నారాయణ ధమాంకర్ అమరావతి నుండి ఆర్థికపరమైన ఒత్తిడులు అన్నివైపులనుండీ వస్తున్నాయని రాశాడు. సాయిసాహెబ్ ఇచ్చిన హెచ్చరిక యొక్క ఆవశ్యకతను అవగాహన చేసుకున్నాను.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 394వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఆరోగ్యసమస్యలకు పరిష్కారం చూపిన సాయి
  2. తల్లిపాలు త్రాగేలా ఆశీర్వదించిన బాబా

ఆరోగ్యసమస్యలకు పరిష్కారం చూపిన సాయి

నా పేరు అంజలి. బాబా నా జీవితంలో చూపించిన లీలలను కొన్నింటిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని లీలలను పంచుకుంటాను. “మీ లీలలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!” 

బాబా మమ్మల్ని కొత్త కారు కొనుక్కోమని చెప్పారని ఇంతకుముందు నా అనుభవంలో మీకు తెలియజేశాను. 2016 దీపావళి లోపు కారు తీసుకోమన్నారు బాబా. ఆలస్యం చేయకుండా పాత కారుని ఇచ్చేసి, షోరూంలో కొత్త కారు కొనుక్కున్నాము. ఆశ్చర్యం ఏమిటంటే, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, బాబా అనుగ్రహంతో కేవలం వారంరోజుల్లో లోన్ మంజూరు అయి క్రొత్త కారు కొనుక్కోగలిగాను. బాబా ప్రసాదించిన క్రొత్త కారులో శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని వచ్చాము. బాబా మమ్మల్ని ఇల్లు కూడా మారమన్నారు. బాబా దయవల్ల కేవలం నాలుగు రోజుల్లోనే ఇల్లు దొరికింది. బాబా కూడా అదే ఇంటికి మారమని సూచించారు. 2016 నవంబరులో నకిరేకల్ లోనే బాబా సూచించిన ఇంటికి మారాము. బాబా దయవలన అంతా బాగానే వుంది అనుకున్నాము. 2016 నవంబరులో కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సుబ్బారావు సార్ బాబా పదైక్యం చెందారు. అది నాకు చాలా పెద్ద విఘాతం. సుబ్బారావు సార్ ద్వారా బాబా నన్ను అత్యంత క్లిష్టపరిస్థితుల నుండి కాపాడారు

మా పాప పుట్టిన దగ్గర నుండి నాకు ఆరోగ్యసమస్యలు ఎక్కువయ్యాయి. 2018 మార్చి నెలలో నా శరీరంలో ఎడమభాగం మొత్తం, కాలు, చెయ్యి, తలకి కూడా తిమ్మిర్లు వచ్చాయి. కనీసం నిలబడి కూరగాయలు కూడా తరగలేకపోయేదాన్ని. గుంటూరు లలితా హాస్పిటల్లో డాక్టరుకి చూపించుకున్నాను. డాక్టర్ MRI స్కానింగ్ చేసి, స్పాండిలైటిస్ మరియు సయాటికా తీవ్రంగా అటాక్ అయ్యాయని, అందుకే తిమ్మిర్లు వస్తున్నాయని చెప్పి మందులు రాసిచ్చారు. మందులు వాడుతున్నప్పటికీ నా ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లేమీ కనిపించలేదు. ఉద్యోగానికి వెళ్ళలేక, ఇంట్లో కూడా ఏ పనీ చేయలేక నేను మానసికంగా చాలా కృంగిపోయాను. అయినప్పటికీ బాబానే ఏదోవిధంగా నా బాధను తగ్గిస్తారని నమ్మకంతో ఉండేదాన్ని. బాబా తలచుకుంటే ఇవన్నీ ఎంతసేపు? కానీ, కొంత కర్మ అనుభవించాలి కదా మనం. నేను దాదాపు ఎనిమిది నెలలపాటు మందులు వాడాను. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. నా ఆరోగ్యసమస్యలని తగ్గించమని ప్రతిరోజూ బాబాని ప్రార్థిస్తూ వుండేదాన్ని. 2018 అక్టోబరులో మా స్వంత ఊరు వేటపాలెం వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళినప్పుడల్లా దత్తమందిరానికి వెళుతూ ఉంటాము. అలాగే ఆరోజు కూడా వెళ్ళాము. నాకు ఇంటర్మీయడియట్ లో కెమిస్ట్రీ లెక్చరర్ అయిన ప్రమీలాదేవి ఆ మందిరానికి ధర్మకర్త. ఆమె మావారిని నా ఆరోగ్యం గురించి అడిగారు. మావారు నా ఆరోగ్యసమస్యల గురించి చెప్పి, “గుంటూరు లలితా హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది, రేపు డాక్టర్ అప్పాయింట్ మెంట్ వుంది” అని చెప్పారు. దానికి ఆవిడ, “అక్కడ వద్దు, చీరాలలో శశిధర్ అనే ఆయుర్వేద వైద్యులు ఉన్నారు, ఆయన మన నాడి చూసి మన ఆరోగ్యసమస్యలు పసిగడతారు, దానికి చక్కని ట్రీట్ మెంట్ ఇస్తారు” అని చెప్పి బలవంతంగా మమ్మల్ని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆ డాక్టర్ నా నాడి చూసి, నా ఆరోగ్యసమస్యలేంటో చెప్పి, మందులు ఇచ్చారు. ఆ సమయంలో నేను 99 కిలోల బరువుతో ఏ పనీ చేయలేక చాలా కష్టంగా జీవితం గడిపేదాన్ని. అల్లోపతి మందులు వాడటం వల్ల నేను అంత బరువు పెరిగాను. బాబా నన్ను సరైన సమయంలో ఈ ఆయుర్వేద వైద్యుని వద్దకు పంపించారు. ఆయనిచ్చిన మందులు వాడటంతో ఇప్పుడు ఆరోగ్యసమస్యలు చాలావరకు తగ్గిపోయాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఆరోగ్యసమస్యలు వున్నాయి. బాబా దయవలన అవి కూడా తొందరలో తీరిపోతాయనే నమ్మకం ఉంది. ఇప్పుడు నా బరువు 82 కిలోలు. జీవితంలో చాలా మార్పు వచ్చింది. అంతా బాబా దయ. బాబా మీద నమ్మకం వుంచండి, తప్పకుండా మనం కోరుకున్నది నెరవేరుతుంది. మనకు వుండవలసినది శ్రద్ధ మరియు సహనం. 

మావారికి పుట్టుకతోనే ఎడమకంటిలో దృష్టిలోపం వల్ల సరిగా కనపడేది కాదు. దాంతో కుడికంటి మీదే భారమంతా ఉండేది. నేను మావారి కన్ను బాగుచేయమని ఎల్లప్పుడూ బాబాను ప్రార్థించేదాన్ని. 2017లో ఎడమకంటికి సర్జరీ చేసి లెన్స్ వేశారు. దాంతో తన ఎడమకంటి దృష్టి సాధారణస్థితికి వచ్చింది. కుడికంటి కంటే ఎడమకంటి చూపే చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు కళ్లద్దాలు కూడా వాడకుండా డ్రైవ్ చేస్తున్నారు. అంతా బాబా అనుగ్రహమే. చెప్పాను కదా, బాబా మనకు అన్నీ ఇస్తారు. కానీ, మనం ఆయన మీద భారం వేసి సబూరీతో ఎదురుచూడాలి, అంతే!

తల్లిపాలు త్రాగేలా ఆశీర్వదించిన బాబా

హాయ్! నా పేరు నళిని. నేను సాయిభక్తురాలిని. ఇటీవల జరిగిన ఒక సాయి మహిమను నేనిప్పుడు సాటి సాయిభక్తులందరితో పంచుకుంటాను.


ఇటీవల ఒక గురువారంనాడు బాబా ఆశీస్సులతో నా సోదరి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబా రోజైన గురువారంనాడే బాబు పుట్టినందుకు మేమంతా చాలా సంతోషించాము. అయితే బాబు తల్లిపాలు త్రాగేవాడు కాదు. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "బాబు తన తల్లిపాలు త్రాగినట్లైతే నా ఆనందాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ఆయనతో చెప్పుకున్నాను. అంతలో నా సోదరికి ఒక చిన్న శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. బాబా దయవల్ల ఆ శస్త్రచికిత్స బాగా జరిగి, తను ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చింది. అప్పుడు నేను బాబుని పాలు త్రాగించేందుకు నా సోదరికి ఇచ్చాను. ఎంత అద్భుతం! బాబు తల్లిపాలు చక్కగా త్రాగాడు. "బాబా! మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతో ఉన్నాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


సాయి అనుగ్రహసుమాలు - 352వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయిఏడవ  భాగం

4-3-1912

నా భార్య సాయిసాహెబ్‌ని పూజించేందుకు ఆలస్యంగా వెళ్ళినప్పటికీ తను చేస్తున్న భోజనాన్ని నిలిపివేసి ఆమెని పూజచేసుకోనిచ్చారు బాబా.

6-3-1912

మేము కూటస్థదీప్‌ని పూర్తిచేసి ధ్యానదీప్ ప్రారంభించాము. తరగతి అయిపోయాక మామూలు ప్రకారం నేను మశీదుకి వెళ్ళాను. సాయిబాబా చాలా ప్రశాంతంగా ఉండటంతో వారికి సేవచేస్తూ కూర్చున్నాను. తమకి నడుమువద్దా, ఛాతీవద్దా, మెడదగ్గరా బిగపట్టినట్లుందనీ, తమలపాకులు కళ్ళమీద పెట్టాలని అనుకున్నామనీ, వాటిని తీసినప్పుడు విషయమేమిటో తెలుసుకున్నామని అన్నారు. తమకి అర్థంకానిదేదో కనిపించేసరికి చాలా ఆశ్చర్యం వేసిందట. వారు దాని కాలుని పట్టుకొని దాన్ని క్రిందపడేశారట. వారు అగ్నిని ప్రజ్వరిల్ల చేద్దామనుకొంటే కట్టెలు తడిగా ఉండటం వల్ల అవి అంటుకోలేదట. తాము నాలుగు శవాలను చూశామనీ, అవి ఎవరివో తమకు అర్థంకాలేదని అన్నారు. సాయిబాబా అదే అలసటతో అలా చెపుతూనే ఉన్నారు. తమ ఎడమవైపు పై దవడా, క్రింది దవడా చాలా నొప్పిగా ఉండటం వల్ల తాము నీరు కూడా త్రాగలేకపోతున్నారట.

7-3-1912

కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిమహారాజు చాలా ఆనందంగా ఉన్నారు. చావడి నుండి మశీదుకు వెళ్ళే సమయంలో నృత్యం చేశారు.

8-3-1912

ఉదయం భీష్మ, బందూ పెందరాళే లేచి ప్రార్థనా గీతాలు పాడారు. అవి చాలా బాగున్నాయి. నా ప్రార్థనానంతరం పంచదశి తరగతిని నిర్వహించాము. సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూసి నేను తరువాత మశీదుకు వెళ్ళాను. సాయిమహారాజు ఎంతో దయగా నన్ను పేరు పెట్టి పిలిచి, నేను కూర్చున్న వెంటనే తనకి నలుగురు సోదరులున్న కథను చెప్పటం ప్రారంభించారు. తను చాలా చిన్నవాడినైనా చాలా తెలివిగలవాడినని చెప్పారు. ఎంతో విశాలమైన తన ఇంట్లోనూ, దానికి ఎంతో సమీపంలో ఉండే అషుబ్‌‌ఖానా వద్దా ఆడుకునేవారట. దాని దగ్గరలో ఒక వృద్ధుడు కూర్చుని ఉండేవాడట. అతను మశీదులోకి గానీ, అషుబ్‌ఖానాలోకి గానీ వెళ్ళకుండా తనున్నచోటు తనది అని అంటూ ఉండేవాడట. అతని మనుషులు కోరుకోనప్పటికీ సాయిబాబా అషుబ్‌ఖానాకి కూడా వెళ్ళి, అక్కడ జరిగే కార్యక్రమాన్ని మెచ్చుకునేవారు. అక్కడ ఉండే వృద్ధుడే తన తల్లికి తండ్రి అవటం వల్ల శ్రీసాయిబాబా ఆయన కోసం ఎప్పుడూ ఒక రొట్టె, దానిలో నంచుకోవటానికి ఏదైనా తీసుకుని వెళ్ళేవారట. ఆ వృద్ధుడు కుష్టురోగి. ఆయన వేళ్ళు రోజురోజుకీ అధ్వాన్నంగా అయి చివరికి అతను ఆహారాన్ని నిరాకరించి చనిపోయాడట. అప్పుడు సాయిబాబా ఆయన దగ్గరలోనే ఆడుకుంటున్నారు. మరణం అంత సమీపంలోనే ఉందని ఆయన అనుమానించలేకపోయారు. దీన్ని గురించి వారి తల్లికి చెప్పగా ఆమె తన తండ్రిని చూడటానికి వెళ్ళింది. సాయిబాబా అక్కడకు వెళ్ళి ఆ వృద్ధుడు చనిపోగానే, ఆయన శరీరం ధాన్యంగా మారటాన్ని కనుగొన్నారట. ఆ వృద్ధుడి బట్టలను ఎవరూ తీసుకోలేదు. ధాన్యం మాయమైన తరువాత వృద్ధుడు మళ్ళీ జన్మించాడట, కానీ అంత్యజులతో కలిశాడట. సాయిబాబా అతనికి ఆహారం ఇచ్చారట. అప్పుడు వృద్ధుడు మూడవసారి కొండాజీ కొడుకుగా జన్మించాడట. ఆ పిల్లవాడు సాయిబాబాతో ఆడుకుంటూ ఉండేవాడు. అతను కొద్దినెలల క్రితం చనిపోయాడు. 

మధ్యాహ్న ఆరతి సమయంలో సాయిబాబా నా దగ్గరకు వచ్చి నా ఎడమచేతిని పట్టుకొని, తన చేతిని ఛాతీ వద్ద పెట్టి ఒక కుఱ్ఱవాడి గురించి చెప్పటానికి మనం ఎలా సైగలు చేస్తామో అలా చేసి, రెండవ చేతితో 'ఎవరో వెళ్ళిపోయారు' అనే సంజ్ఞను, తమ కళ్ళతో మరో సంజ్ఞను చేశారు. పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల నేను రోజంతా ఆ ఆలోచనలోనే చిక్కుపడిపోయాను.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 393వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. పిలిస్తే బాబా వస్తారు, అండగా నిలుస్తారు
  2. అన్నయ్య క్షేమాన్ని తెలియజేసిన బాబా

పిలిస్తే బాబా వస్తారు, అండగా నిలుస్తారు

గుంటూరు నుండి సాయిభక్తురాలు ప్రసన్న తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

జై సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. సాయినాథుని దివ్యపాదాలకు శిరసాభివందనాలు సమర్పించుకుంటూ, వారంరోజుల క్రితం సాయినాథుడు తన అనుగ్రహంతో నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

5-4-2020 రాత్రి నాకు ఛాతీనొప్పి వచ్చింది. రాత్రంతా నొప్పితో బాధపడ్డాను. మరుసటిరోజుకి నొప్పి ఇంకా ఎక్కువైంది. నేను వెంటనే బాబా వద్దకు వెళ్ళి, “నొప్పి చాలా ఎక్కువగా ఉంది బాబా. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఏ ఆసుపత్రులూ ఉండవు, ఏ డాక్టరూ అందుబాటులో ఉండరు. నువ్వే నా డాక్టర్, నీ ఊదీయే నాకు మెడిసిన్ బాబా. దయచేసి ఈ ఛాతీనొప్పిని తగ్గించి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నా ఆరోగ్యం మెరుగైన వెంటనే నాకు వీలుపడిన చోట నీ మందిరంలో కొబ్బరికాయను సమర్పిస్తాను. అలాగే సాయిమహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని సాయినాథుడిని మనసారా వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో మూడు రోజుల్లో నా ఛాతీనొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. “కృతజ్ఞతలు బాబా! దయగల తండ్రిలా నన్ను ఈ పరిస్థితిలో కాపాడి, ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే తండ్రీ”. మన సాయినాథుడు మనం ఏ సమస్యలో ఉన్నా మనందరినీ తప్పక కాపాడుతారు. ఏ పరిస్థితిలోనైనా, ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా మన సాయినాథుడు పలుకుతారు, రక్షిస్తారు. “ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరినీ తప్పకుండా రక్షించు బాబా!” అందరికీ వేంకటసాయి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. బాబా ప్రసాదించిన మరో అనుభవంతో మరలా మీ ముందుకు వస్తాను. 

జై సాయిరాం!

అన్నయ్య క్షేమాన్ని తెలియజేసిన బాబా


నేను బాబాకు సామాన్య భక్తురాలిని. నేను నా భర్త, పిల్లలతో కలిసి హైదరాబాదులో ఉంటున్నాను. మా సంసారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ బాబా దయతో హాయిగా సాగుతోంది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. మావారు ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. నేను రోజులో కనీసం ఒక్కసారైనా ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ చదువుతాను. పదకొండు సంవత్సరాలుగా నా మనసు పడుతున్న వేదన బాబా అనుగ్రహంతో ఒక ఆత్మీయ సోదరుడి పరిచయం వల్ల తగ్గింది. ఇప్పుడు మా మధ్య సంబంధాల్లో మార్పులు వచ్చాయి. లాక్ డౌన్ వల్ల ఆ అన్నయ్య ఉద్యోగం, వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడింది. వారం క్రితం అన్నయ్యతో స్పర్థ వల్ల మేము మాట్లాడుకోవటం లేదు. నా తప్పు కొంత ఉన్నప్పటికీ తను నాతో మాట్లాడటం మానేసేంత స్థాయి గొడవ కాదు మాది. అన్నయ్యకి అనారోగ్య సమస్య ఉంది. తన ఆరోగ్యం కోసం నేను శ్రీగురుచరిత్ర పారాయణ, బాబా మహాపారాయణ చేస్తున్నాను. మా అమ్మని, ఒక ఫ్రెండుని, ఆ అన్నయ్యని నేను ఏ దశలోనూ వదులుకోవడానికి ఇష్టపడను. ఇక నా అనుభవానికి వస్తే, శనివారం (11-04-2020) రోజున, “అన్నయ్య నాతో మాట్లాడకపోయినా, తను ఆరోగ్యరీత్యా ఎలా ఉన్నారో నాకు తెలియాలి బాబా” అని బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. “అన్నయ్య మెసేజ్ చేస్తే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు చెప్పుకున్నాను. దేవుడితో వ్యాపారం నాకు నచ్చదు, కానీ వేరే దారి లేదు నాకు. బాబా దయవలన ‘అన్నయ్య బాగానే ఉన్నార'ని మంగళవారం(14.04.2020) నాడు తెలిసింది. నేను ఎంతో సంతోషించాను. అన్నయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ తను నాతో మాట్లాడటం లేదు. త్వరలోనే మాట్లాడతారని ఆశిస్తున్నాను. మా బాంధవ్యం ఎప్పటిలా అన్యోన్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నాను. ‘తెలియని మనిషి, రక్తసంబంధం లేదు, మరి ఎందుకింత తపన?’ అని నన్ను చూసి మీరు నవ్వుకోవచ్చు. కానీ, ద్రౌపది-కృష్ణులది కూడా ఒక తల్లి సంతానం అనే బంధం కాదు కదా, అయినా వారి బంధం ఎంత గొప్పది! అన్నయ్య నాతో మళ్లీ మాట్లాడితే ఆ అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటాను. సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. 

ఓం శ్రీ సాయిరామ్!


సాయి అనుగ్రహసుమాలు - 351వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయిఆరవ భాగం

29-2-1912

ఉదయం ప్రార్థనానంతరం మా పంచదశి తరగతి నిర్వహించాము. మేము చదువుతున్నప్పుడు సాయిబాబా నడుస్తూ వెళ్ళారు. సాఠేవాడా వద్ద వారిని చూశాము. వారు చాలా అలసిపోయినట్లు కనిపించారు. వారు తిరిగి వచ్చాక మళ్ళీ వారిని చూశాను. వారు చాలా సాత్విక ధోరణిలో ఉన్నట్లు అనిపించారు. బాలాసాహెబ్ భాటే విశ్వాసనీయుడనీ, అతని భార్య నేతపని చేసే ఆమె అనీ, అతని కొడుకు బాబా కూడా 'సాలి'(నేతపనివాడు) అని చెప్పారు. వాసుదేవకాకా తన పూర్వజన్మలో ఒక రాజపుత్రుడనీ, అప్పుడతని పేరు జైసింగ్ అనీ సాయిసాహెబ్ చెప్పారు. అతనికి మాంసం అంటే చాలా ఇష్టమనీ, సాయిసాహెబ్, ఇంకా వేరేవాళ్ళూ అతన్ని 'మేక తల కావాలా' అని అడిగి అతని కోసం తెప్పించేవారనీ, జైసింగ్‌కి ఉన్న ముగ్గురు కొడుకులూ ఆర్మీలో ఉండేవారనీ, ఆయనకున్న ఒక్క కూతురూ చెడ్డమార్గంలో పడిపోయి, ఒక క్షురకునితో ఉండసాగిందనీ, అతనికి పిల్లల్ని కని అక్కడే చనిపోయిందనీ చెప్పారు.

వామన్ తాత్యా మధ్యాహ్న ఆరతి పూర్తయ్యే సమయానికి వచ్చి పూజచేయాలని కోరుకుని బాగా చీవాట్లు తినటం తప్ప అంతా మామూలుగానే జరిగిపోయింది. మధ్యాహ్న భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించి పంచదశి తరగతిని సాయంత్రం వరకూ కొనసాగించి, అప్పుడు సాయంత్రవు వ్యాహ్యాళికి వెళ్ళే సాయిని చూడ్డానికి వెళ్ళాను. వాడా ఆరతి అయ్యాక మశీదుకి వెళ్ళి చావడి ఊరేగింపుకీ, అక్కడ జరిగే శేజారతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ కోపం ప్రదర్శించారు. మశీదు కప్పుపై దీపాలు వెలిగించటానికి వెళ్ళినవారిని తిట్టారు. ఊరేగింపు మొదలైన సమయానికి బాపూసాహెబ్ జోగ్  భార్య తాయీజోగ్ మీదకు తన దండాన్ని విసిరారు. చావడిలో వారి దగ్గరకు వెళ్ళినందుకు బాపూసాహెబ్ జోగ్‌ని కొడతారనుకున్నాను నేను. అతని చేతులు పట్టుకొని, "ఆరతి ఎందుకిచ్చావు?" అన్నారు. కొద్దిసేపయ్యాక తమ దండంతో బాలాషింపీని, మేము 'మారుతి' అని పిలిచే త్రయంబకరావునీ కొట్టారు. బాలాషింపీ పారిపోయాడుగానీ, త్రయంబకరావు అలాగే నిలుచుని ఆ దెబ్బలను స్వీకరించి, సాయిమహారాజుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను పూర్తి అనుగ్రహాన్ని పొంది, కనీసం ఒక అడుగు ముందున్నాడనుకున్నాను. మేము తిరిగి వచ్చేటప్పుడు సాయిసాహెబ్ పెద్దగా మాట్లాడుతున్నారు. నేను బాలాసాహెబ్ భాటేతో మాట్లాడుతూ కూర్చున్నాను. భీష్మ భాగవతం, దాసబోధ చదివాడు.

1-3-1912

ఉదయం సుమారు పదకొండు గంటలకి మశీదుకు వెళ్ళాను. సాయిబాబా మంచి ధోరణిలో ఉన్నట్లనిపించారు. కానీ చాలా అలసిపోయినట్లున్నారు. త్రయంబకరావు ఫకీరుబాబాను దాదాపు తిట్టబోయినంత పనిచేశాడు. అది చూడబోతే నాకు చాలా స్వల్ప విషయంలా అనిపించింది. మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగింది. సాయిబాబా దీక్షిత్‌నీ, నానాసాహెబ్ చందోర్కర్‌నీ, సాఠేనీ గుర్తుచేసుకున్నారు.

3-3-1912


నేను కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా చాలా ఆహ్లాదంగా ఉండి ఎలాంటి కఠిన పదజాలాన్నీ ఉపయోగించకుండా మశీదులోకి వెళ్ళిపోయారు. అబ్దుల్లా వ్రేళ్ళాడుతున్న ఓ దీపాన్ని తీస్తూ పొరపాటున వదిలేస్తే అది నేలమీదపడి బ్రద్దలైంది. సాయిబాబాకి ఇది చాలా కోపం తెప్పిస్తుందనుకున్నాను కానీ అలా జరగలేదు. ఆయన దాన్నసలు పట్టించుకోలేదు. వరండాలో బాగా గాలి వీస్తూండటం వల్ల మేము మా పంచదశి తరగతిని గదిలో ఏర్పాటుచేశాము. సాయిబాబా బయటకి వెళ్ళటం, తరువాత మళ్ళీ తిరిగి రావటం చూశాము. ముందుజన్మలో రెండు మూడేళ్ళపాటు నేనాయనతోనే ఉన్నాననీ, ఇంటిదగ్గర సౌఖ్యంగా జీవించటానికి కావలసినంత ఉన్నా నేను రాజుసేవకు వెళ్ళాననీ వారు చెప్పారు. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందామనుకున్నప్పటికీ సాయిసాహెబ్ వాటిని చెప్పలేదు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 392వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో నయమైన గొంతునొప్పి
  2. ప్రేమ ఉంటే బాబా పూజకి ఏదీ అడ్డంకి కాదు

సాయిభక్తురాలు శ్రావణి తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

బాబా అనుగ్రహంతో నయమైన గొంతునొప్పి

మా ఇంటిలో కొన్నిరోజులుగా పెయింటింగ్ వర్క్ జరుగుతోంది. ఆ సమయంలో రేగే దుమ్ము, ధూళి కారణంగా డస్ట్ అలెర్జీ ఉన్న నాకు వారం రోజుల క్రితం గొంతునొప్పి వచ్చింది. తినే సమయంలో ఆ నొప్పి మరీ తీవ్రంగా ఉండేది. కానీ, 'బాబా ఉన్నారు, ఆయనే చూసుకుంటారు' అని అనుకుని నేను నా ఇబ్బంది ఎవరికీ తెలియకుండా రెండురోజులు సంబాళించుకున్నాను. అయితే 2020, ఏప్రిల్ 5వ తేదీన చపాతీ తినడానికి నేను చాలా కష్టపడుతుంటే, మా నాన్న నా ఇబ్బంది గమనించి 'ఏమైంద'ని అడిగారు. నేను విషయం చెపితే, "డాక్టరుని సంప్రదించవచ్చు కదా?" అన్నారు. అతికష్టం మీద ఎలాగో తినడం ముగించాను. తరువాత ఆ రాత్రి నేను, “నా గొంతునొప్పి త్వరగా తగ్గేలా చెయ్యండి బాబా” అని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి నిద్రపోయాను. మరుసటిరోజుకి నొప్పి తగ్గినట్లుగా అనిపించింది. అయినా మావారు (కర్ఫ్యూ కారణంగా హాస్పిటల్స్ అన్నీ మూసివుండటంతో) తెలిసిన ENT డాక్టరుని ఫోనులో సంప్రదించగా, ఆమె నా లక్షణాలని బట్టి అది అలెర్జీ అని చెప్పి ఫోనులోనే మందులు సూచించారు. బాబా దయవల్ల రెండురోజులలో గొంతునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మరో అనుభవం కూడా పంచుకుంటాను.

ప్రేమ ఉంటే బాబా పూజకి ఏదీ అడ్డంకి కాదు

సాధారణంగా మనం బాబాకి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఎన్నో అనుకుంటుంటాం. కానీ పరిస్థితులకు లోబడి, “మన బాబాయే కదా, ఆయన ఏమీ పట్టించుకోరు, ఆయనకు మన పరిస్థితి తెలుసు” అని సాకులు చెప్పుకొని, మనం చేయాలనుకున్నది చేయము. అయితే 2020, ఏప్రిల్ 9, గురువారంనాడు మా బాబు ద్వారా బాబా నాకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు.


నేను ప్రతి గురువారం మా ఇంటి మేడపైన గదిలో ఉన్న బాబాకి అభిషేకం చేసి, 108 పుష్పాలతో పూజ చేస్తాను. అయితే ఆరోజు నేను పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన గాలివాన మొదలైంది. గాలివాన కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపేశారు. ఆ వానలో పైకి వెళ్ళడం కుదరదని క్రింద ఉన్న బాబాకి పూజ చేసుకున్నాను. సాయంత్రానికి వాన కొంచెం తెరిపిచ్చింది. అప్పుడు నేను, మా బాబు మేడపైకి వెళ్ళాము. కొద్దిసేపటికి మాబాబు(7 సం.) నాతో, “ఈరోజు గురువారం కదా, బాబాకి స్నానం చేయించవా?” అని అడిగాడు. “ఈరోజు నేను బాబాకి క్రిందనే పూజ చేసేశాను. కరెంటు లేదు కదా, చీకటిలో ఇప్పుడిక్కడ చెయ్యలేము. రేపు ఉదయం చేసుకుందాంలే” అని అన్నాను. దానికి వాడు, “ఈరోజు గురువారమైతే రేపు చేస్తానంటావేమిటి? చీకటైనా ఈరోజు బాబాకి స్నానం చేయించాల్సిందే” అని పట్టుబట్టాడు. తరువాత వాడంతట వాడే బాబాకి వేసివున్న మాలలు, బట్టలు తీసేసి ఒక పెద్ద పళ్ళెంలో బాబాను, బాబా పాదుకలను పెట్టాడు. వాడికి బాబాపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమను చూసి సంతోషంగా అనిపించి, "సరే, నేను క్రిందకి వెళ్లి అన్నీ తీసుకొని వస్తాను, చీకటిలో నువ్వు రాకు, ఇక్కడే ఉండు" అని చెప్పేసి క్రిందకి వెళ్ళాను. నేను మళ్ళీ పైకి వెళ్లేసరికి వాడు బాబా పాదాలు పట్టుకొని పడుకొని ఉన్నాడు. వాస్తవానికి వాడికి చీకటంటే చాలా భయం. అలాంటిది ఏమాత్రం భయపడకుండా ఆనందంగా నాకోసం ఎదురుచూస్తున్నాడు. తరువాత వాడు ఎంతో ప్రేమగా బాబాకి అభిషేకం చేశాడు. ఇంకో విషయమేమిటంటే, నా ఫోన్ బ్యాటరీ 12 శాతం ఉన్నప్పుడు మేము పైకి వెళ్ళాము. సెల్‌ఫోన్ లైట్ ఆన్ చేసి, ఆ వెలుగులో దాదాపు గంటన్నరపాటు మేము పూజ చేసినా బ్యాటరీ డౌన్ అయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోలేదు. అంతసేపు లైట్ వెలుగుతున్నప్పటికీ కేవలం ఒక్క శాతం బ్యాటరీ మాత్రమే ఖర్చు అయ్యింది. చివరి పుష్పాన్ని బాబాకి పెట్టగానే కరెంటు వచ్చింది

ప్రేమ ఉంటే తమ పూజకి ఏదీ అడ్డంకి కాదని ఈ అనుభవం ద్వారా బాబా నాకు తెలియజేశారు. బాబా ప్రసాదించిన ఆ అనుభవంతో నాకు గొప్ప అనుభూతి కలిగింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక మా అన్నయ్యకి ఫోన్ చేసి పంచుకున్నాను. తను కూడా చాలా సంతోషించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయి అనుగ్రహసుమాలు - 350వ భాగం.


ఖపర్డే డైరీ - ముప్పయిఐదవ భాగం.

26-2-1912

కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా ఏమీ మాట్లాడకుండా మశీదుకు వెళ్ళిపోయారు. నాసిక్ స్త్రీలు ఈ ఉదయం వెళ్ళిపోయారు. తరువాత మా పంచదశి తరగతి నిర్వహించి సాయిబాబా బయటకు వెళ్ళటం, తిరిగి మశీదుకి రావటాన్ని చూశాము. వారు తమకొక సోదరుడున్నాడనీ, అతను అవిధేయతగా ప్రవర్తించటం వల్ల కులబహిష్కారం చేయబడ్డాడనీ ఒక కథ చెప్పారు. సాయిబాబా అతని మంచి, చెడులను చూసి తిరిగి కులంలోకి తీసుకున్నారట. మధ్యాహ్న ఆరతి అయ్యాక భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించి పంచదశి కొనసాగించాము. పూణే నుంచి దాతార్ అనే ఆయన తన కొడుకుతో సహా వచ్చాడు. అతని కొడుకు ప్లీడరు వృత్తి చేస్తున్నట్లనిపిస్తోంది. వాళ్ళు హాల్లో బస చేశారు. సాయిసాహెబ్‌ను వ్యాహ్యాళిలో చూసేందుకు మశీదుకు వెళ్ళాము. వాడా ఆరతి అయ్యాక భాగవతము, దాసబోధ జరిగాయి. భజనలో శ్రీమతి కౌజల్గి, ఆమె కొడుకు పాల్గొన్నారు.

27-2-1912

నేను మామూలుగా లేచి, ప్రార్థన ముగించిన తరువాత పంచదశి తరగతి నిర్వహించాము. సాయిబాబా బయటకు వెళ్ళేటప్పుడు దర్శించుకోలేకపోయాము. వారు తిరిగి వచ్చేవరకు వారిని దర్శించలేకపోయాము. పదకొండు గంటలకు మేము మశీదుకు వెళ్ళినప్పుడు సాయిబాబా తామొక పొలంలోకి వెళ్ళామని, అక్కడ పెద్ద చిలుకలు ఉన్నాయని చెప్పారు. వారు అక్కడ ఉండటంతో అవి బెదరిపోయాయట. తాము మాత్రం వాటి సైజునీ, రంగునీ మెచ్చుకొంటూ చాలాసేపు అలాగే నిలుచుండిపోయారట. మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగిపోయింది. మధ్యాహ్న భోజనానంతరం నేను కొద్దిసేపు విశ్రమించాక పంచదశి తరగతిని సాయిమహారాజు సాయంత్రపు వ్యాహ్యాళికి వెళ్లే సమయం వరకూ కొనసాగించి, వారిని చూడటానికి వెళ్ళాము. రాత్రి వాడా ఆరతి, శేజారతి జరిగాయి. భీష్మ దాసబోధ, భాగవతము చదివాడు.

28-2-1912

కాకడ ఆరతికి హాజరయి తిరిగి వచ్చి ప్రార్థన చేసుకొంటూండగా పూణే నుండి ధోండోబాబా వచ్చాడు. అతను బర్మానుండి ఇటీవలే వచ్చాడు. నేను నా స్నేహితుడు తిలక్ ఆరోగ్యం గురించి, అతని మానసికస్థితి గురించి అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆ పరిస్థితిలో అది ఎంత బాగుండాలో అంత బాగుంది. నేను తిరిగి వచ్చి బార్‌లో ప్రాక్టీస్ చేయాలని అతను కోరుకున్నాడుగానీ, అది సాయిసాహెబ్ చెప్పే దానిమీద ఆధారపడి ఉంటుంది. మేము నిర్వహించిన పంచదశి తరగతికి బాలాసాహెబ్ భాటే హాజరయ్యాడు. సాయిసాహెబ్ బయటకు వెళ్ళటం చూసి, వారు మశీదుకు తిరిగి వచ్చాక మశీదుకి వెళ్ళాము. వారు 'జీవముని చెల్లిస్తాడా?' అని అడిగారు. జీవముని అంటే నాకర్థం కాకపోయినా, ఆజ్ఞాపిస్తే జీవముని చేస్తాడన్నాను. జీవముని చేయడన్నారు వారు. వారు నాకు చాలా పళ్ళు, స్వీట్లు ఇచ్చారు. మధ్యాహ్న ఆరతి అయింది. ఈరోజు ఏకాదశి అవటం వల్ల నేను, రఘునాథ్ తప్ప ఎవరూ అల్పాహారం గానీ, మధ్యాహ్న భోజనం గానీ తీసుకోరు. ధోండోబాబా ఉపవసించాడు. ఇతను దాదాకేల్కరు కొడుకు భావూతో కలిసి సాయంత్రం నాలుగ్గంటలకు పూణేకి వెళ్ళిపోయాడు. తరువాత మేము పంచదశి తరగతి నిర్వహించి సాయంత్రం సాయిమహారాజుని వ్యాహ్యాళి సమయంలో చూసేందుకు వెళ్ళాము. వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు. నెమ్మదిగా నడుస్తూ, హాస్యస్ఫోరకంగా మాట్లాడారు. భీష్మ భాగవతము, దాసబోధ చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 391వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయి దివ్యపూజతో నెరవేరిన కోరికలు

ఆస్ట్రేలియా నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాలను పంచుకుంటున్నారు.

నేను సాయిబాబాకు దృఢమైన భక్తురాలిని. బాబాతో నాకు పరిచయం ఏర్పడి పదేళ్ళకు పైగా అయ్యింది. ఆయన నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. బాబా చాలా అద్భుతాలతో నన్ను ఆశీర్వదించారు. నా జీవితంలో ముఖ్యమైన సంఘటనలన్నీ గురువారమే జరిగాయి. వీసా ప్రాసెసింగ్, ఇంటర్వ్యూ కాల్స్, నాకు కూతురు పుట్టడం మొదలైనవి. బాబా నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇంక నేనేమి అడగగలను?

నాకు పాప పుట్టింది. ప్రసూతి విరామం తర్వాత నేను తిరిగి ఉద్యోగంలో చేరాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ ఉద్యోగం పొందడం చాలా కష్టంగా ఉండటంతో నేను కొన్ని నెలల పాటు మానసిక ఒత్తిడిని అనుభవించాను. ఆ స్థితిలో ప్రతి రాత్రి నేను సాయిబాబా అద్భుత లీలలను చదువుతూ ఉండేదాన్ని. ఒత్తిడితో కూడుకున్న ఆ సమయంలో భక్తుల అనుభవాలు బాబాపై నా నమ్మకాన్ని బలోపేతం చేసి ఆయనకి సన్నిహితం చేశాయి. ఒక రాత్రి అలా చదువుతున్నప్పుడు సాయి దివ్యపూజ గురించి చదివాను. అప్పుడు బాబా నన్ను వ్రతం చేయమని సూచిస్తున్నారని నా మనసుకి అనిపించింది. దాంతో నాకు ఉద్యోగం ఇమ్మని, చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఇంటి అమ్మకానికి సంబంధించి రెండు కోరికలను నెరవేర్చమని బాబాకి చెప్పుకుని గురువారంనాడు పూజ మొదలుపెట్టాను. దానితో పాటు పూజ విజయవంతంగా పూర్తిచేయగలిగేలా ఆశీర్వదించమని బాబాను ప్రార్థించాను. పుస్తకంలో చెప్పిన ప్రతిదీ చేశాను. 

రెండవ వారంలో నేను అంతకుముందు దరఖాస్తు చేసుకున్న ఒక కంపెనీ నుండి నాకు ఫోన్ వచ్చింది. మొదటి రౌండ్ ఇంటర్వ్యూ కూడా ఫోన్లో జరిగింది. ఆపై నాల్గవ గురువారంనాడు మరుసటిరోజు వ్యక్తిగత ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ కాల్ వచ్చింది. బాబా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంటర్వ్యూ బాగా చేశాను. తరువాత వాళ్ళు నన్ను పాత ఉద్యోగానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్లు అడిగారు. నేను వాటిని మంగళవారంనాడు వాళ్ళకిచ్చాను. హెచ్.ఆర్. మరికొన్ని రిఫరెన్సులు అడిగారు. వాటిని బుధవారంనాడు వాళ్ళకి అందజేసాను. తన భక్తులకు సహనం, విశ్వాసం అవసరమని బాబా చెప్పినప్పటికీ, ఆయన మనలను పరీక్షించదలిస్తే మనం విఫలమవుతాము. గురువారానికన్నా ముందే నేను శుభవార్త వినాలనీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలనీ నా వంతు ప్రయత్నం చేశాను కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. నేను ముందే చెప్పానుగా నా విషయంలో గురువారమే అన్నీ జరుగుతాయని. అది నాకు తెలిసి కూడా ఆరాటపడ్డాను. మరుసటిరోజు గురువారం, ఉదయం నా పూజ పూర్తయిన తరువాత కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి, నేను ఇంటర్వ్యూ  విజయవంతంగా పూర్తి చేశానని, వీలైనంత త్వరగా ఉద్యోగంలో చేరమని చెప్పారు. నేను అస్సలు నమ్మలేకపోయాను, ఆనందంలో చిందులు వేశాను. చాలాకాలంగా చేస్తున్న నా ఉద్యోగ ప్రయత్నాలు సాయి దివ్యపూజతో ఫలించాయి. బాబా నన్ను ఆశీర్వదించారు. ఆయనకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. బాబాపై నమ్మకం ఉంచండి. ఆయన ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటారు.

రెండవ అనుభవం: 

నేను ఐదు వారాలపాటు సాయి దివ్యపూజ చేస్తాననుకుని పూజ ప్రారంభించాను. పూజ మొదలుపెడుతూ ఒక నాణాన్ని పసుపుగుడ్డలో పెట్టి ముడుపుకట్టాను. రెండవ వారం ఆ నాణెం కనపడలేదు. అన్నిచోట్లా వెతికాను కానీ అది దొరకలేదు. దాంతో నా రెండవ కోరిక తీరడానికి బాబాకు మరికొంత సమయం అవసరమేమోనని సమాధానపడ్డాను. తరువాత మరొక పసుపుగుడ్డ తీసుకుని అందులో మరో నాణాన్ని పెట్టి ఇంటి అమ్మకం గురించి బాబాకు చెప్పుకుని మళ్ళీ ముడుపుకట్టాను. మూడవ వారంలో మా ఇంటిని తీసుకుంటామని మాకు ఫోన్ వచ్చింది. మేము అన్నీ మాట్లాడుకుని సంతోషంగా ఆ ప్రక్రియలో ముందుకు వెళ్ళాము. కానీ వారంలో ఆర్ధికపరమైన సమస్యల కారణంగా అతను వెనకడుగు వేయాల్సి వచ్చింది. నేను చాలా నిరాశపడ్డాను. కానీ, బాబా మొదటిసారి ముడుపుకట్టిన నాణెం కనపడకుండా చేసి, మళ్ళీ తాజాగా ముడుపుకట్టేలా ఎందుకు చేశారో నాకు అర్థమైంది. తరువాత ఐదవ వారంలో మరొక వ్యక్తి ఇల్లు తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. బాబా కృపతో ఈసారి ఏ సమస్యలు లేకుండా ఇంటి సమస్య పరిష్కారమైంది.

ఇలా ఐదవ వారంలో బాబా నా రెండు కోరికలు నెరవేర్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి మీ బిడ్డలందరినీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించండి".

ఓం సాయిరామ్!


సాయి అనుగ్రహసుమాలు - 349వ భాగం.


ఖపర్డే డైరీ - ముప్పయినాలుగవ భాగం 

23-2-1912

మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని, ఉదయమే పంచదశి తరగతిని నిర్వహించాము. అందులో మామూలు సభ్యులు కాక నాసిక్‌కి చెందిన సుందరీబాయి అనే స్త్రీ ఒకామె ఉన్నారు. సాయిసాహెబ్ బయటకు వెళ్ళేటప్పుడూ, మళ్ళీ మశీదుకు తిరిగి వచ్చాక మశీదులోనూ చూశాము. వారు నాతో తాము తమ చిన్నప్పుడు ఒక ఉదయం బయటకు వెళ్ళి హఠాత్తుగా అమ్మాయిగా ఎలా మారిపోయిందీ, కొంతకాలం అలాగే ఎలా కొనసాగిందీ చెప్పారు. ఎక్కువ వివరాలు చెప్పలేదు. మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగిపోయింది. పూజ చేసుకునేందుకు చాలామంది వచ్చారీ రోజు. మధ్యాహ్న భోజనానంతరం విశ్రమించి, పంచదశిని కొనసాగించాము. ఈరోజు మాధవరావు సాయిబాబాను నా తిరుగు ప్రయాణం గురించి ప్రశ్నించగా, నాకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల నేను ఇక్కడ మరికొద్ది నెలలు ఉండవలసి ఉందని సమాధానం చెప్పారు. సాయంకాలం బాబాను సాయంత్రపు వ్యాహ్యాళిలోనూ, వాడా ఆరతి తరువాత చూడటానికి వెళ్ళాము. శేజారతి అయ్యాక భీష్మ భాగవతము, దాసబోధ చదివాడు.

24-2-1912

కాకడ ఆరతికి హాజరయ్యాక మా పంచదశి తరగతి నిర్వహించాం. సాయిమహారాజు బయటకు వెళ్ళినపుడు చూసి మధ్యాహ్న ఆరతికి మశీదుకి వెళ్ళాం. మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగింది. భోజనానంతరం విశ్రాంతి తీసుకున్నాను. కోపర్గాం మామ్లేదారు సానే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నానాసాహెబ్ బిహారీతో, బాలాసాహెబ్ భాటేతో కలిసి వచ్చి, కొంతసేపు కూర్చుని సంభాషించారు. వారు వెళ్ళిపోయాక మా పంచదశి తరగతి కొనసాగించినా బాగా సాగలేదు. సాయంత్రపు వ్యాహ్యాళిలో సాయిబాబాను చూశాము. నాసిక్ నుంచి వచ్చిన స్త్రీలు వాడా ఆరతి అయ్యాక భజనలో పాల్గొన్నారు. వారికి మంచి కంఠస్వరాలు ఉన్నా చాలా బలహీనంగా ఉండటంతో పాడలేకపోయారు.

25-2-1912

నేను పెందరాళే లేచి, ప్రార్థన చేసుకొని, మాధవరావు దేశ్‌పాండే నాగపూరుకి బయలుదేరటం చూశాను. అక్కడనుంచి అతను నానాసాహెబ్ చందోర్కర్ గారి అబ్బాయి పెళ్ళికి గ్వాలియరు వెళ్ళి, అటునుండి దశలవారీగా కాశీ, అలహాబాదు, మధుర, ఇంకా దారిలో ఉన్న పవిత్ర క్షేత్రాలన్నీ చూసుకొని వస్తాడు. మా పంచదశి తరగతి నిర్వహించాము గానీ ఉపాసనీకి అస్వస్థతగా ఉండటం వల్ల అది బాగా సాగలేదు. మధ్యాహ్న ఆరతి, భోజనము అయ్యాక మళ్ళీ పంచదశి చదవటం కొనసాగించి కొంతవరకు చదివాము. సాయంత్రం దీని తరువాత భీష్మ దాసబోధ చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 390వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా స్మరణతో, ఊదీ నీళ్ళతో చేకూరిన స్వస్తత 
  2. నా సాయి ఇచ్చిన మంచి అనుభవాలు

బాబా స్మరణతో, ఊదీ నీళ్ళతో చేకూరిన స్వస్తత 

సాయిభక్తులందరికీ నమస్కారం. ముందుగా ఈ బ్లాగుని నిర్వహిస్తున్న సాయికి చాలా చాలా ధన్యవాదాలు. నాకు బాబా అంటే చాలా చాలా చాలా ఇష్టం. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను నా భర్త, ఇద్దరు పిల్లలతో అమెరికాలో నివసిస్తున్నాను. ఈమధ్య మా బాబుకి ఉన్నట్టుండి దగ్గు రావడం మొదలైంది. కొరోనా వైరస్ వల్ల పరిస్థితులు అసలే బాగాలేవు, పైగా దేశం కాని దేశంలో ఉంటున్నాము. ఈ సమయంలో బాబుకి దగ్గు వస్తుండేసరికి చాలా ఆందోళనపడ్డాను. ఎంతో దిగులుపడుతూ బాబా వద్దకు వెళ్ళి, “బాబా! నువ్వే మాకు శరణు. నువ్వే మా బాబుని రక్షించాలి, వాడికి దగ్గు తగ్గిపోయేలా అనుగ్రహించండి” అని బాబాని ఎంతో ఆర్తిగా ప్రార్థించాను. ఆ తరువాత ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, ఒక సాయిభక్తురాలు ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే బాబా అనుగ్రహించారనే అనుభవాన్ని చూశాను. వెంటనే నేను ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే నామాన్ని జపిస్తూ, బాబా ఊదీని నీళ్ళలో కలిపి మా బాబుకి ఇచ్చాను. అంతే! కేవలం రెండు రోజుల్లోనే బాబుకి దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. నేను బాబాను ప్రార్థించగానే, నాకు వచ్చిన సమస్య లాంటి అనుభవాన్నే ఈ బ్లాగులో ప్రచురించడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది. బాబానే నన్ను అలా అనుగ్రహించారని గ్రహించి ఎంతో ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తరువాత ఇదే సమస్య నా భర్తకి కూడా రావడంతో నేను మళ్లీ ఇలాగే బాబా నామస్మరణతో ఊదీని నీళ్లలో కలిపి తనకి ఇచ్చాను. తనకి కూడా దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న బాబాకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. “థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా! లవ్ యు బాబా! బాబా, మేము ఎల్లప్పుడూ నీ నామస్మరణతో జీవిస్తూ ఉండాలి. ఎలాంటి సమయంలోనైనా నీ పాదాల చెంత నుంచి మమ్మల్ని దూరం చేయకు తండ్రీ!”

నా సాయి ఇచ్చిన మంచి అనుభవాలు

USA నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయినాథ్! నేను బాబాకు సాధారణ భక్తుడిని. నేనిప్పుడు రెండు అనుభవాలు మీతో పంచుకుంటాను. 2019, అక్టోబర్ 18న నా తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం. ఆ సమయానికి మేము వాళ్లతో కలిసి ఉండేలా బాబా ఈ సంవత్సరం ఆశీర్వదించారు. నేను ఆరోజుని వారికోసం ప్రత్యేకంగా ఉంచాలని అనుకున్నాను. నేను ఆరోజు ఇంటి నుండి పని చేసుకునేలా అనుమతి తీసుకుని స్పెషల్ డిన్నర్ ఆర్డర్ చేద్దామని అనుకున్నాను. అయితే నాకు మైగ్రేన్ సమస్య ఉంది. అది వస్తే నేను చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందువలన నేను బాబాతో, "దయచేసి నాకీరోజు తలనొప్పి ఇవ్వవద్ద"ని ముందుగానే చెప్పుకున్నాను. కానీ మధ్యాహ్నం కొద్దిగా మైగ్రేన్ లక్షణాలు మొదలవుతున్నట్లు కనిపించాయి. అసలే రాత్రి భోజనం బయటినుండి తెప్పించుకోవాలని అనుకుంటున్నందువలన నేను కాస్త ఆందోళన చెందాను. తరువాత కూడా తలనొప్పి ఎక్కువ అవుతున్నట్లు అనిపించినప్పటికీ అంతగా ఇబ్బంది అనిపించలేదు. సాయంత్రానికల్లా బాబా దయవలన నేను బాగానే ఉన్నాను.

తరువాత నేను ఒక స్వీట్ తినబోతుంటే, 'తినొద్దు' అని నా లోపలినుండి నేనొక స్వరాన్ని విన్నాను. కానీ నేనది పట్టించుకోకుండా ఆ స్వీట్ తినేశాను. డిన్నర్ సమయానికి కాస్త ముందుగా మేము మందిరానికి వెళ్లి, అటునుంచి అటే రెస్టారెంటుకి వెళ్లి ఫుడ్ తెచ్చుకుందామని బయలుదేరుతుంటే మళ్ళీ తలనొప్పి మొదలై నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. "నన్ను ఎలాగైనా కాపాడమ"ని సాయికి చెప్పుకున్నాను. తరువాత మేము మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. ఆ తరువాత ఫుడ్ తీసుకుని ఇంటికి చేరుకున్నాము. సాయి దయవలన మేమందరం కలిసి సంతోషంగా డిన్నర్ చేశాము. నిజంగా బాబా నాపై చాలా కృప చూపారు. ఎందుకిలా అంటున్నానంటే, సాధారణంగా తలనొప్పి వచ్చినప్పుడు నాకు ఆహారం తినాలని అనిపించదు. అలాంటిది బయట ఫుడ్ తినగలిగేలా బాబా ఆశీర్వదించారు. నిజంగా ఇది నా ఊహకు మించినది. ముఖ్యంగా నా ఇబ్బంది గురించి నా తల్లిదండ్రులకు తెలియకూడదని అనుకున్నాను. నేను అనుకున్నట్లే నా ఇబ్బంది వాళ్ళకి తెలియనివ్వకుండా సంతోషంగా గడపగలిగేలా బాబా చేశారు. "థాంక్యూ సో మచ్ బాబా! మీరు నా ఈ తలనొప్పి సమస్యను పూర్తిగా తీసివేస్తారని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను".

రెండవ అనుభవం: 

అక్టోబర్ 23, బుధవారంనాడు కొలంబస్‌లో ఉన్న సాయిమందిరానికి వెళ్లాలని మా కుటుంబమంతా నిర్ణయించుకున్నాము. ముందురోజు రాత్రి పడుకునేముందు, మరుసటిరోజు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన పసుపురంగు దుస్తుల్లో ఉంటారని నాకొక ఆలోచన వచ్చింది. నేను ఆ ఆలోచనను నా భార్యతో చెప్పాను. అంతేకాకుండా మధ్యాహ్న ఆరతి సమయానికి మనం మందిరం చేరుకోవాలని అనుకుంటున్నాను, అలా జరిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పి నిద్రపోయాను.

మరుసటిరోజు మా ప్రయాణం బాగానే జరుగుతోంది. కానీ దారిలో మేము కొన్నిసార్లు ఆగినందువలన మధ్యాహ్నం గం.12:04 నిమిషాలకి మేము మందిరానికి చేరుకుంటామని గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తోంది. మేము మందిరానికి చేరుకునేలోపు నాకు మరో ఆలోచన వచ్చింది, "సాయి సచ్చరిత్ర అధ్యాయం 18-19 లో మధ్యాహ్న ఆరతి గంటలు శబ్దం విని శ్యామా, హేమాడ్‌పంత్‌లు మసీదుకు చేరుకున్నట్లు వివరించబడింది. అలా నేను కూడా గంటలు విని సాయిని చూడబోతున్నాన"ని. తరువాత మేము మందిరానికి చేరుకున్నాము. నేను నా పాదరక్షలు తీసిన మరుక్షణంలో మధ్యాహ్న ఆరతి గంటలు మ్రోగడం విన్నాను. తరువాత నేను మందిరం తలుపులు తెరచి ఆనందాశ్చర్యలలో మునిగిపోయాను. నా సుందరమైన సాయి పైనుండి కిందివరకు పూర్తి పసుపురంగు దుస్తుల్లో, నీలంరంగు కండువా ధరించి ఉన్నారు. నా ఆనందానికి హద్దులు లేవు. సాయి నా ప్రార్థనను అంగీకరించారని, ఏదో ఒకరోజు నా కోరికను తీర్చి ఆశీర్వదిస్తారని అనుకున్నాను. ఆ విషయంలో నాకిప్పుడు ఎటువంటి సందేహాలూ లేవు. ఏది ఏమైనా అయన నాకోసం ఉన్నారని నాకు తెలుసు. కొంతమందికి ఇది ఒక సాధారణ అనుభవంగా అనిపించవచ్చు, కానీ నా వరకు సాయే నా ప్రపంచం, ఆయనే నా శ్వాస. ఈరోజు నాదన్నదంతా ఆయన ఆశీర్వాదమే. విశ్వగురుడైన నా సాయి ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

సాయి సాయి సాయి సాయి సాయి.


source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2604.html


సాయి అనుగ్రహసుమాలు - 348వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయి మూడవ భాగం

20-2-1912

కాకడ ఆరతికి హాజరయ్యాను. ఇందులో చెప్పుకోదగ్గదేమిటంటే, సాయిసాహెబ్ చావడిని వదిలి మశీదుకి వస్తూ 'భగవంతుడే అందరికంటే గొప్పవాడు' అని అనటం తప్ప మరొక్క మాట కూడా అనలేదు. ప్రార్థనానంతరం నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, భీష్మ, శ్రీమతి కౌజల్గిలతో పంచదశి తరగతి నిర్వహించాను. సాయిసాహెబ్ ఉదయ వ్యాహ్యాళి నుండి మశీదుకు తిరిగి వచ్చాక, “తాము మశీదును తిరిగి నిర్మించాలనుకుంటున్నామ"ని అన్నారు. దానికోసం తగినంత డబ్బు ఉందనీ, దానిని గురించి మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. మధ్యాహ్న ఆరతికి షిర్కే కుటుంబానికి చెందిన కొందరు బరోడా స్త్రీలు హాజరయ్యారు. ఆరతి మామూలుగానే జరిగిపోయింది. రాధాకృష్ణఆయీ సాయిసాహెబ్ కూర్చునే చోటుకి పైన కొంగగ్రుడ్లలాంటివి వ్రేలాడదీస్తే వారు వాటిని పీకి అవతల పారేశారు. 

మధ్యాహ్నం మా పంచదశి తరగతిని నిర్వహించి సాయంత్రం ఆరుగంటలకి మశీదుకు వెళ్ళినప్పుడు సాయిమహారాజు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి నేను ఎక్కువ ఇష్టపడేది. మొదటి కథను నేను మర్చిపోయాను. నేను నా భార్యను, అక్కడున్న మిగతా అందర్నీ ఆ కథ గురించి అడిగాను. దాన్ని అందరూ మర్చిపోవటమే ఆశ్చర్యం. రెండవ కథలో ఒక వృద్ధురాలు తన కొడుకుతో జీవిస్తుండేది. ఆమె కొడుకు ఆ గ్రామంలో చనిపోయిన వారి శవాలను తగులబెట్టి దానితో డబ్బు సంపాదించేవాడు. అక్కడ ప్లేగు వ్యాపించి చాలామంది చనిపోయారు. అందుచేత అతని సంపాదన రెట్టింపయింది. అల్లా ఆమెని ఒకసారి కలిసి ఆమె కొడుకుని వ్యాపారంలో లాభాలు ఆర్జించవద్దని చెప్పారు. ఆమె తన కొడుకుతో ఈ విషయం సంప్రదించగా అతను పెడచెవిన పెట్టాడు. కొంతకాలానికి అతను చనిపోయాడు. ఆ వృద్ధురాలు నూలు వడికి తన జీవనం కొనసాగించసాగింది. ఆమెని ఆమె భర్త తరపు బంధువులింటికి వెళ్ళమన్నా కూడా ఆమె తిరస్కరించింది. ఒకరోజు కొందరు బ్రాహ్మణులు ఆమె ఇంటికి ప్రత్తి కొనుగోలుకై వచ్చి, ఆమె ఇంటి సమాచారాన్నంతా రాబట్టి రాత్రికి దాన్ని పడగొట్టేశారు. ఆ దొంగలలో ఒకడు ఆమె ముందు నగ్నంగా నిలబడ్డాడు. అతన్ని పారిపొమ్మనీ, లేకపోతే గ్రామప్రజలు అతని నేరానికి అతన్ని హత్య చేస్తారనీ ఆమె అతనితో చెప్పగా అతను వెంటనే పారిపోయాడు. తరువాత ఆ వృద్ధురాలు చనిపోయి ఆ దోపిడీదారు కుమార్తెగా జన్మించింది. నేనీ కథను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో నాకు తెలీదు. మేం సాయిసాహెబ్‌ను సాయంకాలపు వ్యాహ్యాళిలోనూ, రాత్రీ చూశాము. వాడా ఆరతి అయ్యాక భీష్మ భాగవతం, దాసబోధ చదివాడు.

21-2-1912

నేను మామూలుగానే లేచాను కానీ, మేమంతా సాక్షాత్ కరీబువా అని పిలిచే దేవాజీ అరుపుల వల్ల నా ప్రార్థనకు అంతరాయం కలిగింది. ఎలాగో నా మనసును స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థన పూర్తి చేశాను. తరువాత సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూసి మా పంచదశి తరగతిని నిర్వహించాము. దాని తరువాత నేను మశీదుకు వెళ్ళి బరోడాకి చెందిన షిర్కే కుటుంబ స్త్రీలు సాయిని సేవించటం చూశాను. బొంబాయికి చెందిన నాట్యకత్తె ఒకామె ఈరోజు వచ్చి మశీదులో కొన్ని పాటలు పాడింది. ఆమె తను బాలకృష్ణబువా విద్యార్థినిని అని చెప్పింది. సాయిబాబా ఆమె పాటలు విన్నారు. మధ్యాహ్న ఆరతి మామూలుగా జరిగిపోయింది. సాయిబాబా చాలా మంచి ధోరణిలో ఉన్నారు. మధ్యాహ్న భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించాక మా పంచదశి తరగతి మా మామూలు సభ్యులతో కొనసాగింది. సూర్యాస్తమయ సమయంలో సాయిబాబాను వారి సాయంత్రపు వ్యాహ్యాళిలో చూసేందుకు వెళ్ళాను. ఆ తరువాత వాడా ఆరతి అయ్యాక, శేజారతిలో బాబాను దర్శించుకున్నాను. ఊరేగింపు, ఇంకా మిగతా ఏర్పాట్లు ఈరోజు చాలా గొప్పగా ఉన్నాయి. గజ్జెలు, తాళాలతో భజన జరిగింది. శేజారతి అయ్యాక కూడా బొంబాయి నృత్యకారిణి మశీదులో కొన్ని పాటలు పాడింది. రాత్రి భీష్మ భాగవతం, దాసబోధ చదివాడు.

22-2-1912

ఈరోజు కాకడ ఆరతికి మేమంతా హాజరయ్యాము. ఆరతి అయ్యాక షిర్కే కుటుంబ స్త్రీలు వారి సేవకులతో కలిసి వెళ్ళిపోయారు. బొంబాయి నృత్యకారిణి తన మనుషులతో తాను వెళ్ళిపోయింది. తను అమరావతి వెళదామనుకుంటున్నానని చెప్పిందామె. మేము మా పంచదశి తరగతిని నిర్వహించాం. దీని తరువాత, నా భార్య ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ముందు తనకో కల వచ్చిందని చెప్పింది. సాయిసాహెబ్ కూడా దాదాకేల్కర్, బాలాషింపీలతో నేను వెళ్ళిపోవాలనుకొనే విషయం గురించి నేనేమైనా మాట్లాడానా అని అడిగారట. నటేకర్ (హంస) బహుశా ఈ నెలాఖరుకు నేను అమరావతి వెళ్ళేందుకు అనుమతి లభించవచ్చునని చెప్పాడు. ఇదంతా చూసి నా భార్యకు ఆశలు మళ్ళీ చిగురించాయి. కానీ మధ్యాహ్న ఆరతి సమయంలో సాయిబాబా ఈ ప్రస్తావన తేలేదు. మాధవరావు దేశ్‌పాండే మధ్యాహ్న ఆరతి సమయానికి హార్దానుంచి వచ్చేశాడు. అహ్మద్ నగర్ నుంచి అతని భార్యా, పిల్లలు కూడా వచ్చేశారు. మధ్యాహ్న భోజనం తరువాత విశ్రమానంతరం మా పంచదశి తరగతి దాదాపు రాత్రి సమయం వరకు కొనసాగింది. నేను హడావిడిగా మశీదుకు వెళ్ళి సాయిసాహెబ్‌ను దర్శించి ఊదీ తీసుకున్నాను. రాత్రి భీష్మ దాసబోధ, భాగవతం చదివి భజన చేశాడు. భాటే, బాపూసాహెబ్ అబ్కారీ ఇన్‌స్పెక్టరు, వారి పిల్లలూ రాత్రి నన్ను చూసేందుకు వచ్చారు. నిత్యమూ సాయిబాబా చేసే అద్భుతాల గురించి మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అప్పుడు మాధవరావు దేశ్‌పాండే కూడా అక్కడే ఉన్నాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 389వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నా ప్రేమను తిరిగి తెచ్చారు బాబా
  2. బాబాది పక్కా టైమింగ్

నా ప్రేమను తిరిగి తెచ్చారు బాబా

మలేషియా నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

స్థిరమైన విశ్వాసం, సహనం ఉన్నవారికి బాబా నుండి సమాధానం తప్పక లభిస్తుందని నేను అనుభవంతో తెలుసుకున్నాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నాకు మూడు సంవత్సరాలుగా ఒక అమ్మాయితో పరిచయం ఉంది. మా ఇద్దరి మధ్య ప్రేమపూర్వకమైన మంచి అనుబంధం ఉంది. మేము వివాహం చేసుకుందామని నిర్ణయించుకుని, మా భవిష్యత్తును చక్కగా మలచుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుని కష్టపడి పనిచేశాము. కొన్నిసార్లు మా మధ్య వాదోపవాదాలు, చిన్న చిన్న తగాదాలు ఉండేవి. కానీ మేము మాట్లాడుకుని వాటిని తక్కువ వ్యవధిలోనే పరిష్కరించుకునే వాళ్ళం. కానీ ఒకరోజు హఠాత్తుగా తను నన్ను వదులుకోవాలనుకుంటున్నానని, నా దారిన నన్ను జీవితంలో ముందుకు వెళ్ళమని చెప్పింది. ఒక్కసారిగా నా గుండె బద్దలైంది. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. ఆలోచించి ఆలోచించి ఎంతో ఏడ్చాను. నిరాశలో కూరుకుపోయాను, కొన్ని వారాల పాటు బాధపడుతూ గడిపాను.

అటువంటి సమయంలో మా మామయ్యలలో ఒకరు సాయి నవగురువార వ్రతం పుస్తకం నాకిచ్చి, బాబాను ప్రార్థించమని చెప్పారు. నేను చాలా సంవత్సరాల నుండి బాబా భక్తుడిని. కానీ నేనెప్పుడూ ఆయనను 'ఇది కావాలని' ప్రార్థించలేదు. ప్రతిరోజూ మామూలుగా నమస్కరించుకునేవాడిని, అంతే! అలాంటి నేను బాబాపై నమ్మకం పెట్టుకుని వ్రతం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగే వ్రతాన్ని ప్రారంభించి, అన్ని విధివిధానాలతో పూర్తి చేశాను. వ్రతంతోపాటు సాయి సచ్చరిత్ర, బ్లాగులోని అనుభవాలను చదువుతూ ఉండేవాడిని. అయితే ప్రతిరోజూ నేను గుండెనొప్పితో బాధపడుతూ ఉండేవాడిని. గుండెనొప్పి ఏమిటి అనుకుంటున్నారా? ఎంతగానో ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడమంటే అది గుండెకైన అతిపెద్ద గాయం. ఆ నొప్పిని భరించడం చాలా కష్టం.

రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. కానీ నేను బాబాను పూర్తిగా విశ్వసించి, సమస్యను ఆయనకు వదిలిపెట్టాను. హఠాత్తుగా నా బాబా తమ అనుగ్రహాన్ని నాపై కురిపించారు. ఐదు నెలల తరువాత ఆమె నుండి నాకొక మెసేజ్ వచ్చింది. ఆమె విహారయాత్రకు వెళ్ళి తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే బాగా ఆలస్యమైనందువల్ల టాక్సీలో వెళ్లడం సురక్షితం కాదని నన్ను రమ్మని నాకు మెసేజ్ పెట్టింది. నేను వస్తానని చెప్పానే గానీ, నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన దగ్గర మామూలుగా ఉండటానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ఇంటి నుండి బయలుదేరే ముందు బాబాను ప్రార్థించాను. తరువాత నేను ఆమె దగ్గరికి వెళ్ళాక, ఆమె నా కారు ఎక్కింది. కాసేపు మేమిద్దరం మౌనంగా ఉన్నాము. కొన్ని నిమిషాల తరువాత నేను ఆమెను "ఎలా ఉన్నావ"ని అడిగాను. ఆమె 'ఓకే' అని బదులిచ్చింది కానీ ఆమె కళ్ళలో కన్నీళ్ళు నేను చూశాను. అయినా నేను తొందరపడి ఏదీ మాట్లాడకుండా, "ఆకలిగా ఉందా?" అని అడిగాను. తరువాత కారు ఆపి తనకోసం ఫుడ్ తీసుకువచ్చాను. తరువాత ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆరోజునుండి మేము మునుపటిలా కలిసి ఉన్నాము. మా ప్రేమ సాయి ఆశీస్సులతో బలపడింది. "ధన్యవాదాలు బాబా. మీరు చేసే అద్భుతాలు ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. వాటిని అందరికీ చేరువ చేసేలా దయచేసి బ్లాగు వెనుక ఉన్న మీ భక్తబృందాన్ని ఆశీర్వదించండి".

ఓం సాయిరామ్!

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2608.html

బాబాది పక్కా టైమింగ్

సాయిభక్తులందరికీ సాయిరాం! సాయినాథ్ మహరాజ్ కీ జై! నా పేరు సునీత. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నేను ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

మా పెద్దబాబు ఢిల్లీలో చదువుకుంటున్నాడు. ఒకరోజు వాడు నాకు ఫోన్ చేసి, “మాకు సెలవులు ఇచ్చారమ్మా, నేను ఇంటికి వస్తాను” అన్నాడు. ఆ విషయం మావారితో చెబితే ఆయన, “సెలవులు ఇస్తే చక్కగా చదువుకోమను. అటూ ఇటూ తిరగడమెందుకు? రావద్దని చెప్పు” అన్నారు. దాంతో మా బాబు చాలా దిగులుపడ్డాడు. నేను వారిద్దరికీ సర్దిచెప్పలేక బాబా వద్దకు వెళ్ళి, “బాబా! మావారు తనంతట తానే మా బాబును ఇంటికి రమ్మని చెప్పాలి, లేదా మా బాబు తాను ఇంటికి రాలేకపోతున్నాననే దిగులు లేకుండా అక్కడే సంతోషంగా ఉండాలి. ఈ రెండింటిలో మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి బాబా” అని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. బాబా అందరికీ అద్భుతాలెన్నో చేస్తారు. అలాగే ఈ విషయంలో కూడా అద్భుతాన్ని చేశారు. మావారు మా బాబుకి ఫోన్ చేసి, వాడి దిగులు పోయేలా వాడిని ఎంతో బ్రతిమిలాడి, బుజ్జగించి ఇంటికి రమ్మని పిలిచారు. రాత్రి 10.30 ఫ్లైట్‌కి బయలుదేరి రమ్మని చెబితే, రాత్రి 7.30 సమయంలో టికెట్ బుక్ చేసుకుని, 10.30 ఫ్లైట్‌కి బయలుదేరాడు. బాబు ఇంటికి వచ్చేసరికి అర్థరాత్రి 2 గంటలు అయింది. అద్భుతం ఏమిటంటే, ఆ తెల్లవారినుంచి లాక్‌డౌన్ ప్రకటించారు. జరిగినవాటిలో ఏది ఆలస్యమైనా లాక్‌డౌన్ వల్ల మా బాబు అక్కడే చిక్కుకుపోయి ఎంతో ఇబ్బందిపడేవాడు. బాబా చూశారా, ఎంతటి దయామయులో! సరైన సమయంలో బాబుని ఇంటికి చేర్చారు. తన భక్తులు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఉండలేరు. ఇంత పెద్ద సమస్యని అతిసుళువుగా పరిష్కరించారు బాబా. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలా మరెన్నో అనుభవాలను మీ అందరితో పంచుకోవాలని బాబాను ప్రార్థిస్తూ..

సెలవు.. సాయిరాం!


సాయి అనుగ్రహసుమాలు - 347వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయి రెండవభాగం

18-2-1912

మాధవరావు దేశ్‌పాండే ఉదయం నన్ను నిద్ర లేపగా ప్రార్థన చేసుకొని కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ ఆరతిని ప్రశాంతంగానే తీసుకున్నారు. దీని తరువాత కొంచెం కఠినంగానే మామూలు ధోరణిలోనే మాట్లాడినా అవి చాలా సరళంగా ఉన్నాయనే అనాలి. దీక్షిత్ తన కొడుకు వొడుగుకి నాగపూర్  వెళదామనుకుంటున్నాడు. అతను తనతో పాటు నన్ను కూడా తీసుకువెళతానని సాయిబాబాని అడిగాడు. దానికి చాలా పరుషమైన సమాధానం వచ్చింది. నాకు అనుమతి లభించదని ఇంచుమించు నాకు గట్టిగా అనిపించింది. వెళ్ళాలని నా భార్య చాలా ఆత్రుతపడుతోంది. నేను బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీశాస్త్రి, ఇంకా మిగతావారితో కలసి పంచదశి తరగతిలో ఉండగా నానాసాహెబ్ చందోర్కర్ వచ్చి దీక్షిత్‌తో కూర్చున్నాడు. మా తరగతి అయ్యాక నేను సాయిసాహెబ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అతన్ని కలిశాను. సాయిసాహెబ్ అతనితో తన మామూలు ధోరణిలో తేలీ, వామన్ తాత్యా, అప్పాకోతే మొదలైనవారి గురించి మాట్లాడుతున్నారు. చివర్లో సాయిసాహెబ్ కొంచెం అసహనంగా అయి అక్కడున్న వారిని త్వరగా వెళ్ళిపొమ్మని చెప్పటం మినహా మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగింది. నేను నానాసాహెబ్ చందోర్కర్‌తోనూ, దీక్షిత్‌తోనూ కలసి భోజనం చేశాను. క్రిందటిసారి నానాసాహెబ్ వచ్చి కొద్దిరోజులున్నప్పుడు మధ్యలో ఆగిపోయిన మా చర్చను కొనసాగించమని అతన్నడిగాను. అదంతా సాయిబాబా చేతుల్లో ఉందన్నాడతడు. పెళ్ళి మొదలైన శుభకార్యాలలో వాడే 'చంద్రుడితో ఉండే కృత్రిమమైన తోట'ను అతను తీసుకువచ్చాడు. దాన్ని తెమ్మని రాధాకృష్ణఆయి కోరింది. నేను కొద్దిసేపు విశ్రమించాను. సుమారు నాలుగు గంటలకు నానాసాహెబ్ చందోర్కర్ వెళ్ళిపోయాక దీక్షిత్ రామాయణం చదివాడు. తరువాత మేము పరమామృతం తరగతి నిర్వహించి సాయిబాబాను సాయంత్రపు వ్యాహ్యాళిలో దర్శించటానికి వెళ్ళాం. 'చంద్రుడు' వెలుగుతూ చల్లని ప్రకాశాన్ని విరజిమ్ముతున్నాడు. అమరావతికి తిరిగి వెళ్ళిపోయేందుకు నా భార్య తన అభ్యర్థనను తిరిగి వారి ముందుంచగా సాయిబాబా పరుషంగా మాట్లాడారు. వాడా ఆరతి అయ్యాక దీక్షిత్ రామాయణం చదివితే, భీష్మ భజన చేశాడు. మర్నాడు పొద్దున్నే దీక్షిత్, మాధవరావు దేశ్‌పాండేల ప్రయాణం కోసం వీలుగా మా కార్యక్రమాన్ని మేం పెందరాళే ముగించాము.

19-2-1912.


దీక్షిత్, అతని భార్య, మాధవరావు దేశ్‌పాండే, హీరాలాల్, ఇంకా మిగతావారు ఈరోజు ఉదయాన్నే వెళ్ళిపోయారు. దీక్షిత్ వాళ్ళు వాళ్ళ అబ్బాయి 'బాబు' వొడుక్కి వెళ్ళారు. హార్దాలో ఒక స్నేహితుడి ఇంట్లో జరిగే అలాంటి వేడుకకే మాధవరావు దేశ్‌పాండే వెళ్ళాడు. ప్రార్థనానంతరం మేము పంచదశి తరగతి నిర్వహించాము. మోర్ గావోంకర్ తన వాచీ, గొలుసూ పోయాయని చెప్పాడు. బంగారపువి కావటంతో అవి చాలా ఖరీదైనవి. వెతికినా అవి దొరకలేదు. సాయిబాబా బయటకు వెళ్ళి తిరిగి రావటం చూశాము. ఎప్పటిలా ఒక్క చామరానికి బదులు రెండు చామరాలుండటంతప్ప మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగింది. బాలాసాహెబ్ భాటే పూజ చేసుకొని ఆరతికి ఉందామనుకున్నాడు గానీ, సాయీసాహెబ్ ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించాక మా సభ్యులతో కలసి పంచదశి తరగతి కొనసాగించాము. తరువాత దాదాకేల్కర్, బాలాషింపీ, ఇంకా మిగతావారు వచ్చారు. సాయిమహారాజుని వారి సాయంత్రవు వ్యాహ్యాళిలో చూసి, వాడా ఆరతి అయ్యాక శేజారతికి హాజరయ్యాము. అక్కడ మొట్టమొదటిసారి కృత్రిమమైన తోట, చందమామను ఉపయోగించారు. అవి చాలా అందంగా ఉండి చాలామందిని ఆకర్షించాయి. సాయిసాహెబ్ వాటిని ఇష్టపడనట్లు అనిపించలేదు. చందమామ నచ్చిందనుకుంటా. రాత్రి భీష్మ భాగవతం, దాసబోధలో పది సమాసాలు చదివాడు. నటేకర్ ఎలియాస్ హంస నేను ఈ నెలాఖరుకల్లా అమరావతికి తిరిగి రావాలని రాశాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 388వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాకార రూపుడై దర్శనమిచ్చి, ఆశీర్వదించిన సాయినాథుడు

గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరా
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

ఓం శ్రీ సాయినాథాయ నమః. ‘సాయిమహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకి నా నమస్కారములు. శ్రీ సద్గురు సాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ, 2007వ సంవత్సరంలో ఒక గురువారంనాడు సాయిబాబా నన్ను అనుగ్రహించి, నాకు రాబోయే వ్యాధిని నిర్మూలించి, నా జీవితంలో వ్యాధిరూపంలో ఉన్న చెడుకర్మ నుండి నన్ను రక్షించిన అద్భుతలీలని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

మొదట్లో నాకు తెలిసిన దైవాలు శివుడు, జగన్మాత. ప్రతిరోజూ నేను దేవుని ముందు దీపం వెలిగిస్తాను. ఆరోజు గురువారం, UKG, Nursery చదువుతున్న మా పిల్లల్ని స్కూలుకి పంపించి, 12 గంటలలోపు దీపం వెలిగించే అలవాటున్న నేను స్నానానంతరం తులసీమాతకు నీళ్ళుపోద్దామని బయటకు వచ్చాను. అనుకోకుండా గేటువైపు చూశాను. ప్రహరీ లోపల గేట్ దగ్గర సాయిబాబా తెల్లని కఫ్నీ, తలపాగా, జోలెతో (మాసిన తెలుపు వర్ణంలో), ప్రశాంత వదనంతో, ఆహ్లాదకరమైన ముఖవర్ఛస్సుతో నిల్చుని ఉన్నారు. తులసీమాతకు నీళ్ళు పోసి వడివడిగా బాబా దగ్గరికి వెళ్ళాను. నాకు నోట మాట రాలేదు. బాబాను అలా చూస్తూ ఉండిపోయాను. అప్పటికి సాయిబాబా గురించి ఏమీ తెలియని అజ్ఞానురాలిని. నేను లోలోపల కాస్త భయపడుతున్నాను. బాబా నాతో, “భయపడుతున్నావా?” అన్నారు. నేను, “మీరు అచ్చం సాయిబాబాలాగే ఉన్నారు” అన్నాను. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వారు. నెమ్మదిగా క్రింద కూర్చున్నారు. వాతావరణం చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంది. బాబా నన్ను బియ్యం ఇవ్వమని అడిగారు. నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక డబ్బాతో బియ్యం తీసుకొచ్చి బాబాకు ఇచ్చాను. బాబా మరలా బియ్యం అడిగారు. నేను మరొక డబ్బా బియ్యం తీసుకువచ్చి బాబా జోలెలో పోశాను. తరువాత, “నాకు డబ్బులు ఇవ్వు” అని అడిగారు బాబా. నేను ఇంట్లోకి వెళ్ళి, ఎంత డబ్బివ్వాలా అని ఆలోచించాను. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ మావారు ఇంట్లో లేనందున నా దగ్గర ఉన్న 1001 రూపాయలు తీసుకొచ్చి బాబాకు ఇచ్చాను. బాబా ఇంకా డబ్బులిమ్మని అడిగారు. ‘శిరిడీ పాదయాత్రకు డబ్బులు కావాల’ని అడిగారు. కానీ, బాబా గురించి ఏమాత్రం తెలియని నేను, ‘అంతే ఇవ్వగలను బాబా’ అన్నాను. బాబా చిన్నగా తలవూపి, ‘ఒక రూపాయి ఇవ్వు’ అన్నారు. నేను ఇంట్లోకి వెళ్ళి ఒక రూపాయి తీసుకువచ్చి బాబాకి ఇచ్చాను. ఆ రూపాయిని చేతిలోకి తీసుకుని, ఆ రూపాయిని నిమ్మకాయగా చేసి, ఆ నిమ్మకాయలో ఉన్న పులుపురసాన్ని అంతా పిండేసి, దానిని చిన్ని ముద్దమందార పువ్వులా చేశారు. ఆ పువ్వు చిన్నదిగా, చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. తరువాత, ‘ఒక క్రొత్త బట్ట ఇవ్వు’ అని అడిగారు. నేను ఇంట్లోకి వెళ్ళి ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక చిన్న బట్టను తీసుకొచ్చి బాబాకు ఇచ్చాను. బాబా ఆ బట్టలో ఆ చిన్ని ముద్దమందారాన్ని పెట్టి ఇచ్చారు. ‘దీన్ని ఏమి చేయాల’ని అడిగాను. బాబా తన జోలెలోంచి రెండు ఔషధమూలికలను తీసి నాకు ఇచ్చారు. నేను అజ్ఞానంతో, “ఇదేంటి? చెత్తలా ఉంది” అన్నాను. బాబా నవ్వి, “దీనిని మీ పూజామందిరంలో ఉంచు” అన్నారు. బాబా నవ్వినపుడు తన నోరు తాంబూలం వేసుకున్నట్లుగా ఎర్రగా ఉంది. ఆయన నాకు ఒక చీటీ ఇచ్చారు. ఆ చీటీలో సకల మతాల గుర్తులూ ఉన్నాయి. చీటీ క్రిందిభాగంలో, ‘శిరిడీ పాదయాత్రకు సహాయం చేయండి’ అనీ, ‘నీ అహంకారం వదలి నావైపు చూడు’ అనీ ఉంది. ఆ చీటీని, ఆ చిన్ని ముద్దమందారాన్ని మూలికలతో సహా బట్టలో పెట్టి మూటకట్టి పూజామందిరంలో ఉంచాను. అప్పుడు మాది అద్దె ఇల్లు. బాబా నన్ను, “తుల్జాపూర్ యాత్రకి వెళ్ళారా?” అని అడిగారు. నా చేతికి ఉన్న తుల్జాపూర్ గాజులు చూసి అడిగారేమో అనుకున్నాను. “ఆఁ, అవును, నా భర్త తుల్జాపూర్ వెళ్ళి వచ్చారు” అన్నాను. బాబాగారు లేచి నిలబడ్డారు. “మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాము” అని బాబాతో చెప్పాను. బాబా నవ్వారు. “ప్రక్కన ఇంట్లో నాకు తెలిసిన అక్క ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళండి” అన్నాను. బాబా నవ్వుతూ ‘సరే’ అని అక్కడనుండి వెళ్ళిపోయారు. నా అజ్ఞానం చూడండి, బాబా ఉన్నంతసేపూ ‘దేవుడిముందు దీపం వెలిగించాలి, సమయం 12 గంటలు కావస్తోంది. పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి’ అనే ఆలోచనలోనే ఉన్నాను. ఆ తరువాత దేవుడి ముందు దీపం వెలిగించి, పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్ కి వెళ్ళాను. స్కూల్ నుండి వచ్చాక ప్రక్కింటి అక్కను అడిగాను, “బాబా రూపంలో ఉన్న వృద్ధుడు వచ్చారా?” అని. “ఆఁ, వచ్చారు, నువ్వు మా ఇంటికి వెళ్ళమని చెప్పావంట కదా!” అని చెప్పింది. ఆ అక్క కూడా తాను బాబాకి బియ్యం ఇచ్చానని చెప్పింది.

ఇక ప్రతిరోజూ ఈ విషయం గురించే నేను ఆలోచించేదాన్ని, “వచ్చింది సాయిబాబానేనా? వచ్చింది భగవంతుడే అయితే పదే పదే బియ్యం, డబ్బులు ఎందుకు అడుగుతారు? భగవంతుడు మనం ఇచ్చింది తీసుకుంటాడేమో కదా? దైవం ఎక్కడైనా తాంబూలం వేసుకుంటారా? అసలు రూపాయి ఎందుకు అడిగారు? రూపాయిని నిమ్మకాయగా చేసి, పులుపంతా పిండేసి, ముద్దమందారంగా ఎందుకు చేశారు? జోలె నుండి ఆ మూలికలు తీసి ఎందుకిచ్చారు? దేవుడు గారడీ విద్యలు చేస్తాడా?” అని ప్రతిరోజూ ప్రశ్నించుకునేదాన్ని. ఈ జరిగిన సన్నివేశమంతా నాకు దగ్గరివాళ్ళకు చెప్పి, ‘అచ్చం సాయిబాబాలా ఉన్నారు, ఇలా చేశారు’ అని చెప్పి చాలా సంతోషించాను కూడా. నేను చెప్పిన వారిలో కొందరు సాయిని పూజించేవాళ్లు కూడా ఉన్నారు. అందరూ సంతోషిస్తున్నారే గానీ, ‘వచ్చింది సాక్షాత్తూ సాయిబాబానే’ అని నాకు ఎవరూ చెప్పలేదు. నా లోపల ఎన్నో ప్రశ్నలు తలెత్తినప్పటికీ సాయిబాబా రూపం మాత్రం నా మదిలో నిలిచిపోయింది. ఎంతో ప్రశాంతంగా, నిరాడంబరంగా, దయతో, కరుణతో ఉన్న ఆ ముఖారవిందం నా కన్నులలో నిలిచిపోయింది.

ప్రతిరోజూ నాకు నేనే ప్రశ్న వేసుకుంటూ ఉండేదాన్ని, “అహంకారం వదిలి నావైపు చూడు అని ఆ చీటీలో ఉంది, నాకేమి అహంకారం ఉంది?” అని. అలా నా అహంకారంతో రోజులు గడుస్తూనే ఉన్నాయి. ప్రతిరోజూ బాబా ముఖవర్ఛస్సుని గుర్తుచేసుకుంటూ, ఆ చిరునవ్వుని తలచుకుంటూ ఉండేదాన్ని. తరువాత కొంతకాలానికి మేము క్రొత్త ఇంటిలోకి వచ్చాము. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకసారి మేము శిరిడీ వెళ్ళాము. అక్కడ నాతో ముచ్చటించిన బాబా రూపం ఉన్న ఫోటో నా కంటపడింది. వెంటనే ఆ ఫోటోను కొనుక్కుని ఇంటికి తీసుకువచ్చాను. బాబా ఎన్నో లీలలు చూపిస్తున్నప్పటికీ బాబా ఉనికిని తెలుసుకోలేని ఒక అజ్ఞానురాలిగా ఉండిపోయాను. 

అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ నా కుటుంబంతో హాయిగా ఉన్నాను. అనుకోకుండా ఒకరోజు నా శరీరంపై తెల్లటి మచ్చ కనిపించింది. ఒక్కసారిగా నా జీవితం భయాందోళనలతో నిండిపోయింది. అంతకు కొన్నిరోజుల ముందు ఒక సాయిభక్తురాలు నాకు ‘సాయి నవగురువార వ్రతం’ పుస్తకాన్ని ఇచ్చింది. నేను ఆ పుస్తకాన్ని మా పూజామందిరంలో ఉంచాను. భయాందోళనలతో నిండిన నా జీవితంలోకి బాబా నవ గురువార పుస్తకం రూపంలో మళ్ళీ వచ్చి నన్ను అనుగ్రహించారు. డాక్టరును సంప్రదించగా, నా శరీరంపై ఉన్న తెల్లమచ్చ నేను అనుమానించిన వ్యాధేనని (బొల్లి, vitiligo) ఆయన తేల్చి చెప్పారు. ఇది ఎందుకు వస్తుందని నేను డాక్టరును అడిగాను. “నేను నాన్ వెజ్ తినను, అన్నీ శాకాహారమే తింటాను. మరి నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది?” అని అడిగాను. “ఇది పుల్లటి పదార్థాలు ఎక్కువగా త్రాగడం వలన, తినడం వలన వచ్చింది” అన్నారు డాక్టర్. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, వేసవిలో ఎండతీవ్రతకు వేడిచేయడం వలన ఉప్పు కలుపిన నిమ్మకాయనీళ్ళు ఎక్కువగా త్రాగిన విషయం. పులుపు పదార్థాలకు దూరంగా ఉండమని సలహా ఇస్తూ మందులు వ్రాశారు డాక్టర్. నేను ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను. “నేను ఏ పాపం చేశాను? నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? నేను ప్రతినిత్యం ఈశ్వరుడిని, జగన్మాతను పూజిస్తూ, నామజపం చేసుకుంటూ ఏ లోటూ లేకుండా హాయిగా జీవిస్తున్న నాకు ఈ గతి ఏమిటి?” అని పూజామందిరంలో నా ఇష్టదైవానికి చెప్పుకుని భోరున విలపించాను. “ఏమిటీ శిక్ష నాకు? నేను ఏ పాపం ఎరుగను. నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఇంటా బయటా ఎలా ఉండగలను? నా జీవితం అంధకారమేనా?” అని చాలా ఏడ్చేశాను. నన్ను ఓదార్చడం మావారి తరం కాలేదు. “నీకు నేనున్నాను, నీకు ఏమీ కాదు, తగ్గిపోతుందిలే” అని తను ఎంతగా భరోసా ఇచ్చినా, “ఈ మచ్చలను చూసి నా పిల్లలు నన్ను ఇష్టపడతారా?” అని భయంతో, బాధతో ఏడ్చేదాన్ని. అలా ఏడుస్తూనే పూజామందిరంలో ఉన్న సాయి నవ గురువార వ్రతం పుస్తకంలో ఏమి ఉందా అని చూశాను. మరుసటి గురువారం బాబా మందిరానికి వెళ్ళి, “రోగులను కాపాడే సాయీ, నన్ను రక్షించు తండ్రీ!” అని దీనంగా, ఆర్తిగా వేడుకున్నాను. కేవలం సాయీశ్వరుని కృపాకటాక్షాలతో సాయి నవ గురువార వ్రతం పూర్తయ్యే లోపే నా శరీరంపై ఉన్న తెల్లమచ్చ పూర్తిగా నా శరీరవర్ణంలోకి మారిపోయింది. ఆ అనుభవాన్ని ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను.

2007వ సంవత్సరంలోనే బాబా గురువారంరోజున 11 గంటల సమయంలో మేము ఉంటున్న ఇంటికి వచ్చి, నా శరీరతత్వానికి నిమ్మకాయ పులుపు చెడుచేస్తుందని నా వద్ద రూపాయి తీసుకుని, దానిని నిమ్మకాయగా చేసి, నా కర్మలో ఉన్న వ్యాధిని నిమ్మకాయరసం రూపంలో పిండేసి, చిన్ని ముద్ద మందారంగా చేసి, ఆ పువ్వులా వికసించమని నన్ను ఆశీర్వదించడానికే వచ్చి, నన్ను ఆశీర్వదించి వెళ్ళారని ఆరు సంవత్సరాల తరువాత తెలుసుకున్నాను. ఒకరోజు బాబా ఇచ్చిన చీటీ, ముద్దమందారం, మూలికలు ఉన్న మూటను తెరచి చూశాను. మూలికలు అలాగే ఉన్నాయి.  పువ్వు మాత్రం నల్లని బూడిదగా అయిపోయింది. చీటీలోని మిగిలిన అక్షరాలన్నీ చెదిరిపోయి, కేవలం ‘2007’ మరియు ‘నీ అహంకారాన్ని వదిలి నా వైపు చూడు’ అన్న అక్షరాలు మాత్రమే కనిపించాయి. “సాయిబాబా పదే పదే భిక్షను అడుగుతారని, దక్షిణ మళ్ళీ మళ్ళీ అడుగుతారని, అలా దక్షిణ స్వీకరించి భక్తుల చెడుకర్మలని తీసివేస్తార”ని సాయిసచ్చరిత్రలో కొన్ని అధ్యాయాలను మన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో చదువుతుంటే నా కళ్ళల్లో ఆనందాశ్రువులు పొంగిపొర్లాయి. బాబా వైద్యుడని, మొదట్లో మూలికలతోనే వైద్యం చేసేవారని తెలుసుకున్నాను. 2007వ సంవత్సరం గురువారం ఉదయం 11 గంటల సమయంలో బాబా నా ముందే నిలబడివున్నారు. అజ్ఞానంతో, అహంకారంతో నేను బాబాని గుర్తించలేని ఒక మూర్ఖురాలిని. బాబా నా చెడుకర్మని తీసివేయడానికి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్లారు. ఈరోజు ఆరోగ్యంగా, నా కుటుంబంతో సంతోషంగా ఉన్నానంటే అది నా సాయి పెట్టిన భిక్షే! “నా భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుంటాను” అనే బాబా వాక్కు నా విషయంలో నూటికి నూరుపాళ్ళు ధృవీకరణ అయింది. గురువారం 11 గంటల సమయంలో భక్తులంతా బాబా ఆరతి కోసం వరుసలో నిలుచుని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో బాబా నాకోసం, నన్ను ఆశీర్వదించడానికి వచ్చి, నా చెడుకర్మను తీసివేసి, నిత్యం ఆ సాయినాథుని దివ్యమంగళరూపాన్ని నా ఉచ్ఛ్వాసనిశ్వాసాలలో నిలుపుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. “సాయీ! మీ ప్రేమ మాటలకందనిది. తేనెను రుచి చూస్తేనే తీపి తెలిసినట్లు, మీ ప్రేమ పొందితేనే అందులోని మాధుర్యం తెలుస్తుంది. సాయీ! మీ దివ్యచరణాలకు వందనం చేస్తూ మరొకసారి చెబుతున్నాను. నా చెడుకర్మ అనే వ్యాధిని నిర్మూలించి నాకు పునర్జన్మను ప్రసాదించారు. ఇదంతా కేవలం మీ భిక్షే తండ్రీ! బాబా! మీకు ఏనాడూ పూజ చేయలేదు, ధూపదీపనైవేద్యాలను పెట్టలేదు. కనీసం మీ పేరైనా ఆర్తిగా పిలవలేదు. కేవలం వివాహం జరిగిన వెంటనే నా భర్తతో కలిసి నామమాత్రంగా శిరిడీని దర్శించాను, అంతే. బాబా! నాపైన మీకు ఎందుకు ఇంత ప్రేమ? మీరు నా ఇష్టదైవమైన శివుడే కదా! సాయీ! మీ ప్రేమను, ఉనికిని తెలుసుకున్నాను”.

అప్పటినుంచి నేను బాబాను సాయీశ్వరునిగా ప్రేమించటం ప్రారంభించాను. “సాయీ! మీ ప్రేమ పొందాకే ప్రేమకు సరైన నిర్వచనం నాకు లభించింది. ప్రేమస్వరూపా! ప్రేమంటే ఏమిటని అడిగితే, “ప్రేమకు నిలువెత్తు సాకారరూపమే సాయీశ్వరుడు” అని చెబుతాను తండ్రీ! మీ పాదాలను ఎన్నటికీ విడువను. నన్ను, మీ భక్తకోటిని ఆశీర్వదించండి. నా కుటుంబమంతా సదా నా సాయిస్మరణలో ఉండేలా ఆశీర్వదించండి”. సాయి దయవలన నేను అనేక రకాల ఆహారపదార్థాలను తింటున్నాను. పులుపు కూడా తింటున్నాను. సద్గురువే రక్షించాక నాకు భయమెందుకు? ఈరోజు అన్ని రుచులూ ఆరగిస్తున్నానంటే అది కేవలం సాయి భిక్షే. నేను స్వయంగా చూసిన నా సాయిబాబా ఎలా ఉంటారో మీకూ చూపిస్తాను, చూడండి. ఈక్రింది ఫోటోలో ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నారు బాబా. తలపాగా, కఫ్నీ, జోలె మాత్రం తెలుపువర్ణంలో ఉన్నాయి. ఆ దివ్యమంగళరూపాన్ని మళ్ళీ నేను శిరిడీలో ఈ ఫోటో రూపంలో చూశాను. ప్రేమతో ఆ ఫోటోను నాతో తీసుకువచ్చాను. ఈ ఫోటో రూపంలో బాబా ప్రతిరోజూ నా చేత పూజలందుకుంటారు. ప్రతిరోజూ బాబాని చూస్తాను, బాబా కూడా నవ్వుతూ నన్ను చూస్తుంటారు.





సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo