సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 332వ భాగం.


ఖపర్డే డైరీ - పదిహేడవ భాగం

6-1-1912.

ఉదయం తెలతెలవారుతుండగా లేచి యథాప్రకారం నా ప్రార్థన ముగించి, సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాను. ఆయన అటు వెళ్ళాక నేను బాలాసాహెబ్ భాటే వద్దకు వెళ్ళి మరాఠీలో రంగనాథస్వామి వ్రాసిన యోగవాశిష్ఠం అరువు తెచ్చుకొని నా బసకు వచ్చాను. కానీ రామాయణ పఠనమే కొనసాగించాను. మేమంతా మధ్యాహ్న ఆరతికి హాజరై యథాప్రకారం భోజనాలు కానిచ్చాము. ఈరోజు నిద్రపోకూడదనుకున్నాను కానీ బాగా నిద్ర ముంచుకొచ్చి సుమారు రెండు గంటలు నిద్రపోయాను. తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు. ఆ తరువాత నేను మశీదుకు వెళ్ళి సాయిమహారాజుని దర్శించాను. వారు ఉత్సాహంగా ఉండి ఎంతో బాగా మాట్లాడారు. సాయంత్రం మామూలుగా వాడా ఆరతి అయ్యాక మేం చావడిలో శేజారతికి హాజరయ్యాం. సాయిమహారాజు చెప్పలేనంత ఉత్సాహంగా ఉండి, మేఘాకి నిగూఢమైన సూచనలిచ్చారు. అతనికి యోగాలో చెప్పబడే "దృష్టిపాతం" చేశారు. ధూలియా నుండి ఒక హస్తసాముద్రికుడు వచ్చాడు. అతను ఉపాసనీ అతిథి, కనుక వాడాలో ఉన్నాడు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణము జరిగాయి.

7-1-1912.

ఉదయం నేను త్వరగా లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. అవధుల్లేనంత ఉత్సాహంతో ఉన్న సాయిమహారాజు తమ యోగదృష్టిని ప్రసరింపచేశారు. రోజంతా నేను చెప్పలేని పారవశ్యంతో గడిపాను. పొద్దున నేను, బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ కలసి రంగనాథ్ వ్రాసిన యోగవాశిష్ఠం మొదలుపెట్టాము. తరువాత సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూసి, విరామసమయంలో  మశీదుకు వచ్చిన ఇద్దరు ముస్లిం యువకులతో మాట్లాడుతూ కూర్చున్నాను. అందులో ఒకరు కొన్ని శ్లోకాలు చదివారు. 

మధ్యాహ్న ఆరతి ఆలస్యమైంది. సాయిబాబా ఒక మంచి కథ మొదలుపెట్టారు. తమకొక మంచి బావి ఉండేదనీ, దానిలో నీరు నీలిరంగులో ఎప్పుడూ నిండుగా ఉండేదనీ చెప్పారు. నాలుగు మోటలతో తోడినా నీరు అయిపోయేది కాదట. ఆ నీటితో పండించిన పళ్ళు చాలా తాజాగా, రుచికరంగా ఉండేవట. అక్కడనుండి వారు కథను కొనసాగించలేదు. మధ్యాహ్నం దీక్షిత్ రామాయణంలో రెండు అధ్యాయాలు చదివాడు. నాతోపాటు ఉపాసనీ, రామమారుతి, దీక్షిత్ ఉన్నారక్కడ. తరువాత మేము సాయిబాబా వద్దకు వెళ్ళి, వారి షికారుకి హాజరయ్యాం. చీకటి పడుతుండటం వల్ల ఆయన కట్టెలు కొట్టుకునే స్త్రీల మీద తమకు లేని కోపాన్ని ప్రదర్శించారు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.

8-1-1912.


ఉదయం నేను చాలా త్వరగా లేచి మరీ వేకువఝాము అనిపించటం వల్ల మళ్ళీ పడుకొని విపరీతంగా నిద్రపోయి, నేను రోజూ లేచే సమయం వరకూ అలాగే నిద్రలో ఉండిపోయాను. కనుక పనులన్నీ వెనుకబడిపోవటమే కాక రోజువారీ పనులన్నిటి మీదా దీని ప్రభావం పడింది. ప్రార్థనానంతరం బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, రామమారుతి, మాధవరావు దేశ్‌పాండేలతో కలసి రంగనాథ్ వ్రాసిన యోగవాశిష్ఠం చదువుతూ కూర్చున్నాను. 

సాయిమహారాజు బయటకు వెళ్ళేటప్పుడూ, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా దర్శించాను. మధ్యాహ్న ఆరతి అయ్యాక, సాయిమహారాజు హఠాత్తుగా తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించి, విపరీతంగా తిట్టారు. ఇక్కడ ప్లేగు మళ్ళీ వచ్చేలా ఉంది. అందుకే సాయిమహారాజు అది తిరిగి రాకుండా నిరోధించే పనిని చేపట్టినట్లున్నారు. భోజనం అయ్యాక మేం మాట్లాడుతూ కూర్చున్నాము. నేను కొంచెం రామాయణం చదివాక కోపర్గాఁవ్ మామ్లేదార్ సానే, ధూలియా డిప్యూటీ కలెక్టర్ జోషీతో కలసి వచ్చాడు. రామాయణం ఒక అధ్యాయం చదివిన తరువాత మేము సాయిమహారాజు దగ్గరకు వెళ్ళాము. వారిని దర్శించేందుకు చాలాసేపు అక్కడ వేచి ఉండి సాయంత్రం వారు బయటకు వెళ్ళేటప్పుడు చూసి, మళ్ళీ శేజారతికి హాజరయ్యాం. రాత్రి భజన, రామాయణము జరిగాయి.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo