సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 387వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మాత్రమే డిప్రెషన్‌ను తొలగించారు
  2. "నేనుండగా భయమేల?"

బాబా మాత్రమే డిప్రెషన్‌ను తొలగించారు

నా పేరు శ్రావణి. నా జీవితంలో సాయిబాబా నాకు చేసిన సహాయాన్ని సాటి సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సభ్యులకు నా ధన్యవాదాలు. 2019వ సంవత్సరంలో నేను సాయిబాబాకు భక్తురాలినయ్యాను.

నేను 2014వ సంవత్సరంలో నా చదువు పూర్తి చేశాను. అప్పటినుండి ప్రభుత్వ బ్యాంకింగ్ పరీక్షలకు ప్రయత్నిస్తున్నాను. 2018వ సంవత్సరం వరకు నేను మూడు బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇంటర్వ్యూలను కేవలం ఒకటి రెండు మార్కులలో చేజార్చుకున్నాను. ఇక క్లర్క్ పరీక్షలైతే ఎన్ని చేజారిపోయాయో చెప్పనక్కర్లేదు. ఈ బాధతో నేను మానసికంగా చాలా కృంగిపోయాను. నాకు ఉద్యోగం రావాలని మా అమ్మ అందరి దేవుళ్ళకీ పూజలు చేసింది. ఎన్నో మ్రొక్కులు మ్రొక్కింది. నేను కూడా పూజ చేయని దేవుడు లేడు. ఎన్ని పూజలు చేసినా నాకు ఉద్యోగం రాలేదు సరికదా, కనీసం నేను డిప్రెషన్ నుండి కూడా బయటకి రాలేకపోయాను. 2018వ సంవత్సరంలో నా ఆరాధ్యదైవమైన శివుడి గుడినుండి వస్తూంటే, ఎందుకో దారిలోనే వున్న సాయిబాబా మందిరానికి వెళ్దామనిపించి వెళ్ళాను. బాబాను దర్శించుకున్న తరువాత నా మనసు చాలా కుదుటపడింది. కానీ ఆ సంవత్సరంలో కూడా బ్యాంకింగ్ ప్రిలిమ్స్ పరీక్ష ఒక్కసారి కూడా నేను పాసవలేదు. దాంతో ఇంక నేను సాయిబాబా మందిరానికి వెళ్ళడం మానేశాను. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో శ్రీరామనవమి ముందురోజున నేను ఒక చోటికి వెళ్ళడానికి బస్సు ఎక్కాను. బస్సులో ఒక సీట్లో ఒక పెద్దాయన కూర్చుని కనిపించారు. ఆయన ప్రక్కసీటు ఖాళీగానే ఉన్నప్పటికీ, ఆయన ప్రక్కన ఎందుకులే కూర్చోవడం, ముందుకు వెళ్లి వేరే సీట్లో కుర్చుందామని అనుకున్నాను. కానీ పండగ ముందురోజు కావటంతో నాకు బస్సులో సీటు దొరకలేదు. చివరకు వచ్చి ఆయన ప్రక్కనే కూర్చున్నాను. ప్రయాణం మధ్యలో ఆయన ఏం చేస్తున్నావమ్మా? అని నా గురించి అడిగారు. నేను ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాననీ, కానీ ఒకటి రెండు మార్కులతో చేజారిపోతోందనీ చెప్పాను. అప్పుడాయన నాతో, “సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చెయ్యి” అన్నారు. నేను ఆయనతో, “మా ఇంట్లో సాయిబాబాని పూజించరు. బాబాని పూజిస్తే కలిసిరాదని మా ఇంట్లోవాళ్ళు చెప్పారు” అని అన్నాను. అప్పుడు ఆ పెద్దాయన బాబా అనుగ్రహంతో తనకు జరిగిన అనుభవాలని నాతో చెప్పి సచ్చరిత్ర పారాయణ చేయటానికి నన్ను ఒప్పించారు. సచ్చరిత్ర పారాయణ చేయటం ప్రారంభించిన తరువాత నేను డిప్రెషన్ నుండి, బాధ నుండి బయటపడ్డాను. ఆ తరువాత ఒకసారి యూట్యూబ్ లో ‘సాయి దివ్య పూజ’ ఎలా చేయాలో చూసి, నాకు ఉద్యోగం రావాలని బాబాకు మ్రొక్కుకొని, అయిదు వారాలు సాయి దివ్య పూజ చేశాను. అయినా నాకు ఉద్యోగం రాలేదు. ఆ తరువాత నాలుగు నెలలకు నాకు మంచి అబ్బాయితో పెళ్లి కుదిరింది. కానీ, నేను అతన్ని పెళ్లి చేసుకోవచ్చా లేదా అని సందిగ్ధంలో పడ్డాను. అప్పుడొకరోజు రాత్రి కలలో నాకు బాబా దర్శనమిచ్చి,అతన్ని పెళ్లి చేసుకోమ్మా, మంచిది” అని చెప్పారు. బాబా మాటపై భరోసాతో ఏ భయమూ లేకుండా నేను అతనిని ఫిబ్రవరి 13, 2020న పెళ్ళి చేసుకున్నాను. వివాహమైనప్పటికీ మేము మంచి స్నేహితుల్లా ఉన్నామే కానీ, భార్యాభర్తల్లా ఎప్పుడూ మెలగలేదు. ఒకసారి మా అమ్మ, “మీరిద్దరూ ఎలా వున్నార”ని అడిగింది. అమ్మకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, బాబాతో, “బాబా! మేమిద్దరం భార్యాభర్తల్లా మెలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో మేమిద్దరం ఇప్పుడు భార్యాభర్తల్లా మెలుగుతున్నాము. బాబాకు మాటిచ్చినట్లుగానే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. బాబా ఆశీస్సులతో త్వరలోనే నాకు ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగం వస్తున్నదని ఆశిస్తున్నాను. అందరికీ సాయిబాబా ఆశీస్సులు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

"నేనుండగా భయమేల?"

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

నా పేరు ఎన్.సత్యనారాయణమూర్తి. నేను హైదరాబాదులోని విజయనగర్ కాలనీవాసిని. 34 సంవత్సరాల క్రితం 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' నామ ప్రచారకులైన శ్రీ శంకరయ్యగారి ద్వారా నేను సాయి మార్గంలోకి వచ్చాను. అప్పటినుండి సాయి మహారాజ్ ద్వారా ఎన్నో అనుభవాలు పొందుతున్న అదృష్టవంతుడను. 2020, ఏప్రిల్ 16, గురువారం రాత్రి నాకు కలిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

లాక్‌డౌన్ కారణంగా గత ఇరవైరోజులుగా ఆఫీసు పనులు లేక ఇంట్లోనే ఉంటున్నందున శ్రీసాయిసచ్చరిత్ర మూడు పారాయణలు పూర్తి చేశాను. ఏప్రిల్ 16, గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో నాకు విపరీతమైన దగ్గు, దానితోపాటు తుమ్ములు వచ్చాయి. దాంతో, ప్రస్తుతం నెలకొన్న కొరోనా భయంకర పరిస్థితుల కారణంగా నా భార్య చాలా ఆందోళన చెందింది. తుమ్ములు, దగ్గు ఇంకా ఎక్కువైతే గనక పక్కవాళ్ళేమైనా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారేమోనని భయపడింది. కానీ నేను కొద్దిగా బాబా ఊదీ తీసుకొని నుదుటిపై ధరించి, "సాయితండ్రీ! మరలా నాకు తుమ్ము, దగ్గు రాకుండా కాపాడండి" అని బాబాని ప్రార్థించి నిద్రకు ఉపక్రమించాను. రాత్రి ఒక్కసారి కూడా తుమ్ముగాని, దగ్గుగాని రాలేదు. నిద్రలో "నేనుండగా భయమేల?" అన్నట్లు సాయిసచ్చరిత్ర పుస్తకాలు గుట్టలుగా కనపడ్డాయి. బాబా దయవలన రాత్రంతా చక్కగా నిద్రపోయాను. ఇప్పుడీ అనుభవాన్ని వ్రాస్తున్న సమయం వరకు కూడా ఎటువంటి ఇబ్బందీ లేదు. 'సాయీ' అని పిలిచినంతనే రక్షణనిచ్చే ఆ సాయితండ్రికి నా ధన్యవాదాలు. ఈ కొరోనా వ్యాధి బారినపడకుండా సమస్త జనులు సుఖంగా ఉండాలని మన తండ్రి సాయిని ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాను.

ఇట్లు

ఎన్.ఎస్.మూర్తి.


8 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. ok sai,nenu inka konni rojulu matrame wait chesta ika naa valla kadu baba,pls naku help cheyandi,nannu tondaraga indulo nundi bayata veyyandi,om sai sree sai jaya jaya sai

    ReplyDelete
  3. Shirdi Sai baba PATYAKSHA DAIVAMU, KARUNA MAYUDU, MANASU VIPPI KORINACHO, TAKSHAMU KARUNINCHE MAHA MURTHI,, NENU AAYANANI THANDRI ROOPAMU LO BHAVINCHU KUNTANU,

    ReplyDelete
  4. Shiridi Sai Nadhudu is India, s SIMPLEST SAINT. Etuvanti poojalu cheyakunna, Parayanalu cheyakunna, Simple ga MANASPOORTHI tho korina varamu lichhu kaliyuga Mahaneeyudu, KOTI KOTI pranamlu Sainadhuniki,

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఈ కొరోనా వ్యాధి బారినపడకుండా సమస్త జనులు సుఖంగా ఉండాలని మన తండ్రి సాయిని ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయిరాం తాతయ్య🙏🙏🙏

    ReplyDelete
  7. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo