సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 337వ భాగం.


ఖపర్డే డైరీ - ఇరవైరెండవ  భాగం. 

21-1-1912

నేను లేచి కాకడ ఆరతికి హాజరయ్యాను. బాలాషింపీ తప్ప అందరూ ఉన్నారక్కడ. ఆరతయ్యాక అప్పాకోతే, తేలీ, వామన్ తాత్యా మొదలైనవాళ్ళ పేర్లు పెట్టి అంతర్గత శత్రువుల్ని కఠినమైన పదజాలంతో తిట్టే తన మామూలు ఆచారాన్ని అనుసరించారు బాబా. బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, రామమారుతీలతో కలిసి నేను పరమామృతాన్ని చదివాను. సాంగ్లీ నుంచి వచ్చిన బాపూసాహెబ్ జోగ్ అతిథులు మా క్లాసుకి హాజరయ్యారు. అతని పేరు లిమయే. సాయిబాబాని బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడూ దర్శించాము. మేం మశీదులో ఉన్నప్పుడు మాధవరావు దేశ్‌పాండే నగర్ నుంచి తిరిగి వచ్చాడు. అతనితో దాదాసాహెబ్ కరండికర్, బరోడాకి చెందిన ఓ పెద్దమనిషి ఉన్నారు. కరండికర్‌ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక కేసు విషయమై అతను నగర్ వచ్చి, అక్కడ మాధవరావు దేశ్‌పాండేని కలుసుకొని, సాయిమహారాజుని దర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నట్లు కనిపించింది. మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అతను సాయంత్రం నాలుగున్నర గంటలకి నగర్ వెళ్ళిపోయాడు. లిమయేలు కూడా వెళ్ళిపోయారు. మొదట వారికి అనుమతి దొరకలేదు, కానీ తరువాత సాయిబాబా అనుమతి ఇచ్చారు. సదాశివరావు దీక్షిత్ కూడా వెళదామనుకున్నాడు గానీ, ఆ మరుసటిరోజు పొద్దున భార్యా, పిల్లలూ, రామమారుతిలతో కలసి వెళ్ళమని చెప్పటమైంది. సాయిబాబా సాయంకాలవు వ్యాహ్యాళికి వెళ్ళటం చూశాము. వాడాలో సాయంకాలపు ఆరతి అయ్యాక దీక్షిత్ రామాయణం విన్నాము.

22-1-1912.

ఉదయం త్వరగా లేచి ప్రార్థన చేసుకున్నాను. సాయిమహారాజు బయటకు వెళ్ళటమూ, తిరిగి వారు రావటమూ చూశాము. పూజాసమయంలో వారు రెండు పూలను రెండు నాసికారంధ్రాలలో, రెండు పూలను రెండు చెవుల మధ్యా, తల మీదా పెట్టుకున్నారు. నేను దీన్ని మాధవరావు దేశ్‌పాండే చెప్తే గమనించాను. ఇది ఒక సూచన అని నేననుకున్నాను. సాయిబాబా రెండవసారి కూడా అదేవిధంగా చేశారు. నేను రెండోసారి దాన్ని మనసులో ఊహించేసరికే వారు నాకు చిలుం ఇవ్వటంతో అది ధృవపడింది. వారు నాతో ఏదో చెప్పారు. వెంటనే నేను దానిని గుర్తుంచుకొని, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలని అనుకున్నాను గానీ, నా మనసులోంచి అది తుడిచిపెట్టుకుపోయి, దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని రోజంతా చేసిన నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రకమైన అనుభవం మొదటిసారి కావటంతో నేను చాలా ఆశ్చర్యపడ్డాను. సాయిబాబా ఆజ్ఞ చాలా గొప్పదనీ, నా కొడుకు ఆరోగ్యం గురించి నేనేమీ ఆదుర్దాపడనవసరం లేదని అన్నారనీ, అదే దానికర్థమనీ నేను అవగాహన చేసుకున్నాను

మధ్యాహ్న ఆరతి అయిపోయి మేము తిరిగి వచ్చేసరికి శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గి (మావిశీబాయిగా వ్యవహరిస్తారిక్కడ) నా బస ముందర నిలబడి వుంది. ఆమెను చూసి నేను చాలా ఆనందించాను. నేను మశీదునుండి బయటకు రాగానే ఆమె వచ్చి సాయిమహారాజుకి నమస్కరించుకొంది. వారు ఆమెపై ప్రత్యేకమైన అనుగ్రహం చూపి ఆమెను తమ సేవ చేసుకోనిచ్చారు. భోజనానంతరం కొద్ది నిమిషాలు నేను విశ్రమించాక, దీక్షిత్ రామాయణమూ, నాథమహారాజు గాధలూ చదివాడు. ఉపాసనీ, శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గి ఈ తరగతికి హాజరయ్యారు. ఆమె చర్చలో పాల్గొంది. ఆమె వేదాంతం బాగా తెలిసిన మనిషిలా అనిపించింది. సాయంత్రం వ్యాహ్యాళి సమయంలోనూ, శేజారతిలోనూ మేము సాయిమహారాజుని చూశాము. లక్ష్మీబాయి కొన్ని పాటలు పాడింది. ఆమె రాధాకృష్ణబాయికి పిన్ని. రాత్రి నా అభ్యర్థన మేరకు ఆమె కొద్దిగా భజన చేసింది. దీక్షిత్ రామాయణం చదివాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo