సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 369వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీయాత్రలోని అనుభవాలు - రెండవ భాగం...

నా పేరు సంధ్య. నిన్నటి భాగంలో నా శిరిడీయాత్రలోని కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మిగిలిన అనుభవాలను పంచుకుంటాను.

కొంతసమయం సేదతీరాక శనిశింగణాపూర్ దర్శనానికి బయలుదేరాము. మొదటిసారి శనిభగవానుని దర్శించుకున్నాం. దర్శనం చాలా చక్కగా జరిగింది. శనిభగవానుని దర్శించినప్పుడు సాక్షాత్తూ ఈశ్వరుడే కర్మఫలదాతగా శనీశ్వరుడిగా వెలిశారనే భావన కలిగింది. తరువాత శిరిడీ తిరిగి వచ్చాము. ఓం శనీశ్వరాయ నమః

సాయంత్రం మరోసారి బాబా దర్శనానికి వెళ్ళాము. ఆశ్చర్యం! అద్భుతం! ఉదయం నేను కట్టుకున్న చీర కలర్ మ్యాచ్ అవలేదన్న నా బాధను బాబా తొలగించారు. నేను ఎల్లో కలర్ చీరలో ఉన్నాను. బాబా కూడా ఎల్లో కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చారు. బాబా ఎవరినీ నిరాశపరచరు. “థాంక్యూ బాబా! లవ్ యు బాబా!” అని బాబా కురిపించిన ప్రేమకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సాయంత్రం చక్కగా షాపింగ్ చేశాము. సాయి సచ్చరిత్ర తీసుకున్నాను. 

ఆ తరువాత నాసిక్, త్రయంబకేశ్వర్ దర్శనానికి వెళ్ళాము. బాబా కృపవలన దర్శనం చక్కగా జరిగింది. నాసిక్‌లో అడుగుపెట్టగానే హోటల్లో ఒక ఫోటో దర్శనమిచ్చింది. ఆయన ఎవరో? ఆయన పేరేమిటో? నాకు తెలియదు. కానీ ఆశ్చర్యమేమిటంటే వారు నాకు ధ్యానంలో అదివరకే దర్శనమిచ్చారు. హోటల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆ గురువు పేరు అడిగాను. ‘అక్కల్కోట మహరాజ్’ అని సమాధానమిచ్చి, నాసిక్‌కి 2 కి.మీ. దూరంలో వారి ఆశ్రమం ఉందని చెప్పారు. 2 కిలోమీటర్ల దూరమే కదా, దర్శించుకుందామని నా భర్తని అడగలేకపోయాను. దగ్గరలోనే ఉన్నా కూడా దర్శించుకోలేకపోతున్నానే అని నిరాశచెందాను. తరువాత తిరిగి శిరిడీ చేరుకున్నాము.

ఆ మరుసటిరోజు పండరియాత్రకు బయలుదేరాము. పండరీపుర విఠలుని దర్శనంలో బాబా ఏవిధంగా దయచూపారో ఇప్పుడు మీతో పంచుకుంటాను. పండరీపుర యాత్ర, చంద్రభాగానది, విఠలేశ్వరుడు, రుక్మిణీమాత, సత్యభామ, అక్కడున్న దేవుళ్ళ దర్శనాలను తలచుకుంటూ కారులో ప్రయాణం సాగుతోంది. నా మనసులో ఒకటే అలజడి. నా పిల్లలకి, మావారికి క్యూలో నిలబడటానికి సహనం తక్కువ. పండరీనాథుణ్ణి దర్శించుకోవాలంటే 2,3 బిల్డింగులలో భక్తుల వరుసతో చాలా రద్దీగా ఉంటుంది. ఆ రద్దీలో మావారు, పిల్లలు నిలుచుంటారా అనే బాధ నన్ను వేధిస్తోంది. ఎందుకంటే, ఒకసారి విఠలుని దర్శించడానికి వెళ్ళినపుడు క్యూ రద్దీ చూసి మావారు విఠలేశ్వరుణ్ణి దర్శించుకోలేక బయటకు వచ్చేశారు. ఆ విషయం గుర్తొచ్చి, 'భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఉండవచ్చు, మరి వీళ్ళందరూ క్యూలో నిలబడగలరా?' అని మదనపడుతున్నాను. నా మనసునెరిగిన బాబా నాకు ధ్యానస్థితి కలిగించి, చంద్రదర్శనంతో నన్ను దీవిస్తున్నట్లుగా ధ్యానంలో దర్శనమిచ్చారు

ఇక పండరిపురం రానే వచ్చింది. చీకటిపడటంతో చంద్రభాగానదిని దర్శించుకోలేకపోయాము. ఇంతలో ఒకతను మా దగ్గరకి వచ్చి, “గుడి మూసేశారు, రూమ్ కావాలా?” అని అడిగాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి, “గుడి తెరిచే ఉంది, దర్శనానికి వెళ్ళండి” అని చెప్పారు. తులసీమాల తీసుకుని ప్రధానద్వారం నుండి విఠలుని దర్శనానికి బయలుదేరాము. అద్భుతం! నేను భయపడినంత భక్తుల రద్దీ ఏమీ లేదు. ఒక ఇరవైమంది భక్తులు మాత్రమే క్యూలో ఉన్నారు. వాళ్ళంతా 50, 60 సంవత్సరాల వయసు పైబడిన పెద్దవాళ్ళు. చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ వెనకాలే నిలుచున్నాము. క్యూలోనే విఠలేశ్వరునికి నమస్కరించుకుంటూ, 'మేము కూడా ఈ పెద్దమనుషులలాగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాల'ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వాళ్ళని చూస్తుంటే శివపార్వతులు, లక్ష్మీనారాయణులు జంటగా కనిపిస్తున్నారన్న నాలో భావన కలిగింది. వాళ్ళని అనుసరిస్తూ ముందుకుసాగగా విఠలేశ్వరుని దర్శనభాగ్యం రానేవచ్చింది. విఠలుని కనులారా దర్శించుకుని తులసిమాలను సమర్పించి, విఠలుని పాదాలకు తృప్తిగా నమస్కరించుకున్నాను. తరువాత రుక్మిణి, సత్యభామ, శనీశ్వరుని దర్శనాలను చేసుకుంటూ మిగతా దేవీ, దేవతామూర్తులను దర్శించుకుని విఠలేశ్వరుని సన్నిధిలో దీపాలు వెలిగించాము. ఆ చీకటిలో దీపాలు చాలా అందంగా, ఆకర్షణీయంగా వెలుగుతున్నాయి. పండరీపుర దర్శనం ఊహించని విధంగా అనుగ్రహించిన సాయిమహారాజుకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

ఇక తుల్జాపూర్ భవానీమాత దర్శనం చక్కగా జరిగింది. అనుకోకుండా హుమ్నాబాద్ మాణిక్ ప్రభు గురుస్థానాన్ని దర్శించుకున్నాము. ఆ తరువాత బసవకళ్యాణ్ (గురుస్థాన్) కూడా దర్శించుకుని బాబా లీలలని తలచుకుంటూ ఇంటికి చేరుకున్నాము. ఇంటికి వచ్చాక శిరిడీనుండి తెచ్చుకున్న సాయి సచ్చరిత్ర చదవడం పారాయణ ప్రారంభించాను. సాయి సచ్చరిత్రలో అక్కల్కోట మహరాజే శ్రీసాయిమహరాజ్ అనే అంశాన్ని అక్కల్కోట మహరాజ్ తన శిష్యుడికి కలలో చెప్పడం, గురుపాదుకలను శిరిడీలో ప్రతిష్ఠించే అంశాన్ని (బోధనని) పారాయణ చేస్తున్నప్పుడు నాసిక్‌కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కల్కోట మహరాజ్ ఆశ్రమాన్ని దర్శించలేక పోయానే అనే బాధ కూడా  తీరిపోయింది. నా కళ్ళలో ఆనందభాష్పాలు పొంగిపొర్లాయి. "ఇదంతా కేవలం మీ దయ తండ్రీ సాయీశ్వరా!".

ఈ విధంగా శిరిడీయాత్రలో బాబా నాకు తోడుగా ఉన్నారు. సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా భక్తుల అనుభవాలను పంచుకుంటూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న సాయికి ప్రత్యేక ధన్యవాదాలు. సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ ఫేస్‌బుక్‌లో నేను చూడటం, అందులో సాయి సచ్చరిత్రలోని కొన్ని అధ్యాయాలు చదవడం ద్వారా శిరిడీ యాత్ర, శిరిడీలో చూడదగ్గ దర్శించదగ్గ ప్రదేశాలు తెలుసుకోవడం, సాయి సచ్చరిత్ర శిరిడీ నుండి తెచ్చుకోవాలి అనే ఆలోచన రావడం, నన్ను ఆధ్యాత్మికంగా ముందుకుసాగేలా ఒకవిధంగా ప్రోత్సహించడం జరిగింది. సాయిబంధువులలో నా కుటుంబం కూడా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. "బాబా సాయీ! మిమ్మల్ని దర్శించి ఒక సంవత్సరం కావస్తోంది. కరుణతో శిరిడీ ప్రవేశ భాగ్యం త్వరలోనే మాకు కల్పించండి గురుదేవా! బాబా, మీ దయ అపారమయినది. నేను కోరిన కోరికలన్నీ నెరవేరాయి. బాధలన్నీ తొలగి సంతోషంగా ఉన్నాము. సాయీ! మమ్మల్ని ప్రాపంచిక మాయనుండి తొలగించి పారమార్థికంలోకి నడిపించండి. కోరికలే లేని స్థితిని ప్రసాదించి మీ పాదాలకు సర్వస్యశరణాగతి పొందేలా అనుగ్రహించండి గురుదేవా! సాయీ!"

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

4 comments:

  1. కోరికలే లేని స్థితిని ప్రసాదించి మీ పాదాలకు సర్వస్యశరణాగతి పొందేలా అనుగ్రహించండి గురుదేవా! సాయీ!అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. om sairam
    sai always be with me

    ReplyDelete
  3. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo