సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 335వ భాగం.


ఖపర్డే డైరీ - ఇరవయ్యవ భాగం  

17-1-1912

నేను చాలా పెందరాళే లేచి బాపూసాహెబ్ జోగ్ స్నానానికి బయటకు వెళ్ళటం చూసి ఆలోగా నా ప్రార్థన ముగించాను. అప్పుడు చావడికి కాకడ ఆరతికి వెళ్ళాం. తీవ్ర అనారోగ్యం వల్ల మేఘుడు ఆరతికి హాజరు కాలేదు. అందుచేత బాపూసాహెబ్ జోగ్ ఆరతిచ్చాడు. సాయిబాబా తమ మోమును మృదుమధుర దరహాసాలొలికిస్తూ చూపారు. అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటం కోసం ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా పడివుండవచ్చు. నేను పారవశ్యంతో పిచ్చివాడిలా అలాగే బాబాను చూస్తూండిపోయాను. మేము తిరిగి వచ్చాక నారాయణరావు కుమారుడు గోవింద్, సోదరుడు భావూ హుషంగాబాద్ మార్గం గుండా బండిలో కోపర్గాం వెళ్ళారు. నేను నిత్యక్రమం ప్రారంభించాను. కొద్దివాక్యాలు రాసి ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్‌తో కలసి పరమామృతం చదవటం మొదలుపెట్టాను. సాయిమహారాజు బయటకు వెళ్ళటం తిరిగి వారు మశీదుకు రావటం చూశాము. వారు జారీ చేసిన మౌన ఆజ్ఞలను మూర్ఖుడిలా నేను అర్థం చేసుకోలేకపోయాను. వాడాకు తిరిగి వచ్చాక నేను ఓదార్పు లభించనట్లుగా అకారణంగా విచారగ్రస్తం అయిపోయాను. బల్వంత్ కూడా విచారగ్రస్తుడై - తాను శిరిడీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. సాయిబాబాని అడిగి నిర్ణయించుకోమని అతనికి నేను చెప్పాను. భోజనానంతరం కొద్దిసేపు విశ్రాంతి తరువాత దీక్షిత్‌చే రామాయణం వినాలనుకున్నాను కానీ సాయిబాబా అతని కోసం కబురుపెట్టటం వల్ల అతను వెళ్ళవలసి వచ్చింది. మొత్తానికి మేము ప్రగతి సాధించలేదు. 

ఖాండ్వా తహసీల్దారు ప్రహ్లాద్ అంబాదాసు తిరిగి వెళ్ళటానికి అనుమతిని కోరి సంపాదించుకున్నాడు. జలగాంకి చెందిన పాటే, అతనితో పాటు ఒక లింగాయతు ఉన్నారిక్కడ. వారు రేపు వెళ్ళిపోవచ్చు. మేము సాయిబాబాను వారి సాయంత్రపు వ్యాహ్యాళిలో చూశాము. వారు ప్రసన్నంగా ఉన్నారు. సాయంత్రం యథాప్రకారం భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి. వాడాలో ఆరతి జరిగేటప్పుడు ఉదయం నాకు జారీ చేయబడిన ఆజ్ఞలను అవగాహన చేసుకొని ఆనందించాను.

18-1-1912.

ఈరోజు రాయవలసింది చాలా ఉంది. నేను చాలా పెందరాళే లేచి, ప్రార్థనానంతరం, తెల్లవారేందుకు ఇంకా గంట సమయముందని తెలుసుకొని, మళ్ళీ పడుకొని తిరిగి సూర్యోదయం చూసేందుకు సరైన సమయంలో లేచాను. నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, భీష్మ పరమామృతం చదివాము. తహసీల్దారు ప్రహ్లాద్ అంబాదాసుగారు, పాటే, అతని సహచరుడు(లింగాయతు) వారి స్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు. చివరి ఇద్దరూ తాము వెళ్లేందుకు అనుమతిని కేవలం బయలుదేరేందుకు ముందు మాత్రమే సంపాదించారు.

సాయిబాబాను వారు బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి మశీదుకు వచ్చేటప్పుడూ దర్శించుకున్నాము. నన్ను వారు దయగా చూశారు. నేను వారిని సేవించేటప్పుడు వారు నాకు రెండు, మూడు కథలు చెప్పారు. చాలామంది తన డబ్బుని తీసుకోవటం కోసం వచ్చారని అన్నారు. ఆయన దాన్నెప్పుడూ కాదనకుండా వాళ్ళని తీసుకోనిచ్చారట. ఆయన వాళ్ళ పేర్లను గుర్తుంచుకొని వాళ్ళని అనుసరించారుట. వాళ్ళు భోజనం కోసం కూర్చున్నప్పుడు వాళ్ళను చంపి తమ డబ్బును వెనక్కు తెచ్చుకున్నారట. 

మరో కథ ఏమిటంటే, ఒకచోట ఒక అంధుడు ఉండేవాడట. అతను ఇక్కడున్న తకియా దగ్గరే ఉండేవాడట. ఒక మనిషి అతని భార్యకు ఆశ చూపి వశపరుచుకొని ఆ అంధుడ్ని హత్యచేశాడట. చావడి వద్ద నాలుగు వందలమంది గుమిగూడి అతడ్ని తిట్టి అతని తల తీయమన్నారట. ఉరి తీసేవాడు ఈ ఆజ్ఞను పాటించాడట. కానీ దాన్ని కేవలం తన విధి నిర్వహణగా కాకుండా, ఏదో ఒక ఉద్దేశ్యం మనసులో పెట్టుకొని చేశాడట. కనుక తరువాత జన్మలో ఆ హంతకుడు ఉరి తీసేవాడి కొడుకుగా పుట్టాడట. 

తరువాత వారు మరో కథ మొదలుపెట్టారు. ఈలోగా ఎవరో ఒక క్రొత్త ఫకీరు వచ్చి బాబా పాదాలు పట్టుకున్నాడు. సాయిబాబా ఉగ్రులైనట్లు కనిపించి, తను బాబాతో సమానుడు అన్న భావంతో మొండిగా విపరీతమైన పట్టుదలను చూపించిన ఫకీరును గట్టిగా ఊపేశారు. చివరికి అతను వెళ్ళి ప్రహరీ గేటుకి అవతలగా బయట నిలబడ్డాడు. సాయిబాబా చాలా కోపంతో ఆరతి సామాగ్రినీ, భక్తులచే తేబడిన ప్రసాదాలతో నిండిన పళ్ళాలనూ నెట్టి దూరంగా విసిరేశారు. 

రామమారుతిబువాను అమాంతంగా ఎత్తేస్తే, అతను తరువాత తనకి అపారమైన ఆనందం కలిగిందనీ, ఉత్తమ లోకాలకు పంపినట్లనిపించిందనీ చెప్పాడు. భాగ్య అనేవాణ్ణి, మరో గ్రామస్తుణ్ణి బాబా తీవ్రంగా కొట్టారు. సీతారామ్ ఆరతి తెచ్చాడు. మామూలుగానే అయినా కొంత హడావుడిగా ఆరతిని పూర్తి  చేద్దామనుకున్నాము. మహల్సావతి కొడుకు మార్తాండ్ ఎంతో సమయస్పూర్తితో గందరగోళం లేకుండా ఆరతిని సక్రమంగా ముగించాడు. సాయిబాబా తన స్థానంలోంచి లేచినప్పుడు దాన్ని యథావిధిగా పూర్తి చేశాడతను. ఆరతి పూర్తవబోయే ముందు సాయిబాబా తమ స్థానంలోకి వచ్చారు. అంతా సవ్యంగా జరిగిపోయింది. అయితే 'ఊదీ' అందరికీ విడివిడిగా ఇవ్వకుండా పెద్ద మొత్తంలో ఒకరికిచ్చి అందర్నీ పంచుకోమన్నారు. 

నిజానికి వారికి కోపం లేనే లేదు. ఈ తతంగమంతా కేవలం ఒక "లీల"గా మాత్రమే చూపారు. ఈ వ్యవహారమంతా అయేటప్పటికి మాకు చాలా ఆలస్యమైంది. తాత్యాపాటిల్ తండ్రిపోయిన సందర్భంగా కర్మకాండలో భాగంగా అతను మా అందరికీ సంతర్పణ చేశాడు. కాబట్టి నాలుగున్నర వరకూ భోజనాలు పూర్తికాలేదు. దీని తరువాత ఏం చేయటానికీ మాకు సమయం లేకపోయింది. కనుక వ్యాహ్యాళికి బయటకు వస్తున్న సాయిమహారాజును దర్శనం చేసుకున్నాము. వారు మామూలుగానే వచ్చారు. మేము మామూలుగానే నమస్కరించుకున్నాం. వాడాలో మామూలు ఆరతి జరిగింది. మేఘుడు కనీసం లేచి నుంచోవటానిక్కూడా వీల్లేనంత అనారోగ్యంతో ఉన్నాడు. ఈ రాత్రికే అతను మరణిస్తాడని బాబా చెప్పారు. సాయంత్రం అవటంతో మేము చావడి ఊరేగింపుకు హాజరయ్యాము. యథాప్రకారం నేను నెమలిపింఛాల విసనకర్ర పట్టుకొన్నాను. అంతా సజావుగా సాగిపోయింది. సీతారామ్ ఆరతి ఇచ్చాడు. రాత్రి భీష్మ భజనా, దీక్షిత్ రామాయణమూ జరిగాయి.

పి.యస్.:- పైన నేనో విషయం చెప్పటం మరిచిపోయాను. ఈరోజు వారు తీవ్రమైన పదజాలంతో తిడుతున్నప్పుడు నా కొడుకు బల్వంత్‌ను రక్షించామని చెప్పారు. "ఫకీరు దాదాసాహెబ్‌ను (అంటే నన్ను) చంపాలనుకొన్నాడు. కానీ నేను అనుమతించలేదు " అనే మాటల్ని పదేపదే అన్నారు. వారు మరో పేరు కూడా అన్నారు కానీ, ఇప్పుడది నాకు గుర్తురావటం లేదు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo