సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 378వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఎన్నో కష్టాలలో తోడుగా ఉన్న బాబా
  2. నవగురువార వ్రతంతో లభించిన బాబా అనుగ్రహం

ఎన్నో కష్టాలలో తోడుగా ఉన్న బాబా

హైదరాబాదు నుండి శ్రీమతి సుధారాణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నా పేరు సుధారాణి. నేను హైదరాబాదు నివాసిని. నేను గత 30 సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. ఎన్నో కష్టాలలో బాబా నాకు తోడుగా ఉన్నారు. మాకు ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళిద్దరూ కూడా బాబా భక్తురాళ్ళే. నా పెద్ద కూతురు చదువుకునే రోజుల్లో బాబా పారాయణ చేస్తుండేది. పరీక్షల సమయంలో కూడా పారాయణ చేస్తూ సత్సంగాలకు హాజరయ్యేది. ఇలాగే చేస్తుంటే తను పరీక్షల్లో ఫెయిల్ అవుతుందేమోనని  నాకు చాలా ఆందోళనగా ఉండేది. కానీ బాబా దయవలన నా కూతుళ్ళిద్దరూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ జీవితంలో చక్కగా స్థిరపడ్డారు.

ఒకసారి అమెరికాలో ఉన్న మా పెద్ద కూతురికి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తను నాకు చెప్పలేదు. ఆరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో నేను, మా చిన్నల్లుడు బాబా పూజ చేస్తున్నాము. బాబా విగ్రహం నుండి బాబానే స్వయంగా నిలబడి అభయహస్తం చూపిస్తున్నారు. మా అల్లుడు, “ఆంటీ! బాబా వచ్చారు” అంటూ నాకు చెప్తున్నాడు. ఇద్దరం బాబాకు నమస్కారం చేసుకున్నాము. అంతటితో కల ముగిసింది. మరుసటిరోజు ఉదయం నేను నిద్రలేచినప్పటి నుండి మా చిన్నమ్మాయికి నాకు వచ్చిన కల గురించి చెప్పాలని ఆరాటపడ్డాను. కానీ తను ఆఫీసులో ఉంటుంది, ఎందుకులే డిస్టర్బ్ చెయ్యడమని సాయంత్రం వరకు చూసి అప్పుడు ఫోన్ చేస్తే, “ఆఫీసులో చాలా బిజీగా ఉన్నానమ్మా, మళ్ళీ మాట్లాడతాను” అన్నది. ఆ తరువాత మళ్లీ పొద్దున్నే ఫోన్ చేసాను. తను ఫోన్ లిఫ్ట్ చేయగానే, బాబా నాకు స్వప్నంలో అభయహస్తం చూపుతూ దర్శనమిచ్చారని చెప్పాను. తను మా పెద్ద కూతురికి ఫోన్ చేసి, అమ్మకు బాబా స్వప్నదర్శనమిచ్చారని చెప్పింది. అప్పుడు మా పెద్దమ్మాయి నాకు వీడియో కాల్ చేసి, తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం చెప్పింది. బాబా దయవలన పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. మొహం మీద చిన్న చిన్న గాయాలయ్యాయి. మా పెద్ద మనవడికి అప్పుడు ఏడాది లేదా ఏడాదిన్నర వయసుంటుంది. వాడు కారులో వెనకాల సీట్లో ఉన్నాడు. బాబా దయవలన బాబు క్షేమంగా ఉన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, అంత పెద్ద యాక్సిడెంట్ నుండి వాళ్ళని బాబానే కాపాడారని, ఆ విషయం స్వప్నదర్శనం ద్వారా బాబా నాకు తెలియజేశారని.

మరో అనుభవం:

ఒకసారి నా మోకాలికి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ తరువాత విపరీతమైన నొప్పితో ఆ రాత్రంతా నిద్రలేదు. మధ్యలో ఒక్క పది నిమిషాలు నిద్రపట్టింది. అప్పుడు ఒక కల వచ్చింది. 30 సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్న రూపంలో బాబానే వచ్చి, “ఏం తల్లీ, కాలు నొప్పిగా ఉందా? ‘శ్రీ శిరిడీ సాయి శక్తి’ అనుకో తల్లీ, నొప్పి తగ్గిపోతుంది” అన్నారు. ఇంతలో మెలకువ వచ్చింది. కలలో బాబా చెప్పిన విధంగా 108 సార్లు ‘శ్రీ శిరిడీ సాయి శక్తి’ అని జపించాను. ఆశ్చర్యంగా కాలునొప్పి వెంటనే తగ్గిపోయింది. నన్ను చూడటానికి వచ్చిన నా స్నేహితులతో ఈ విషయం చెబితే, “బాబానే స్వయంగా మీ నాన్న రూపంలో వచ్చి చెప్పారు” అన్నారు. ఇలా ఎన్నో కష్టాలలో బాబా నాకు తోడుగా ఉన్నారు. మా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ కుటుంబలతో అమెరికాలో ఉన్నారు. అక్కడ కొరోనా వైరస్ ఎక్కువగా ఉంది అని న్యూస్ లో చెబుతున్నారు. “బాబా, నా ఇద్దరు కూతుళ్లు, వాళ్ళ కుటుంబసభ్యులు అందరూ క్షేమంగా ఉండేలా వాళ్ల వెంట ఉండి కాపాడు తండ్రీ. నిన్నే నమ్ముకున్నాను తండ్రీ, వాళ్ళను కాపాడు బాబా”.

శ్రీ శ్రీ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయిరాం, సాయిరాం, సాయిరాం బాబా.

నవగురువార వ్రతంతో లభించిన బాబా అనుగ్రహం

ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను బెంగళూరు నివాసిని. నేను ఇదివరకు ఉద్యోగం చేసిన కంపెనీలో జీతం చాలా తక్కువగా వస్తుండేది. అందువలన నేను ఉద్యోగంలో మార్పు కోసం ఆరాటపడ్డాను. అందుకోసం నేను అన్ని జాబ్ వెబ్‌సైట్‌లలో నా ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేశాను. కానీ ఇంటర్వ్యూ కాల్స్ రాలేదు. ఆ ప్రయత్నంలో నేను చాలాకాలం ఎదురుచూశాక నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియక నవగురువార వ్రతం మొదలుపెట్టి, "బాబా! నేను మీకు శరణాగతి చెందుతున్నాను. మిమ్మల్నే సదా స్మరించుకుంటాను. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ కర్తవ్యం" అని బాబాను ప్రార్థించాను. కొన్ని నెలల తరువాత నా స్నేహితులిద్దరు తమ సంస్థలలో ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి, నా ప్రొఫైల్‌ను ఫార్వర్డ్ చేశారు. నేను రెండు కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరై, వాటిలో ఒక ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఇప్పుడు నేను అక్కడే ఉద్యోగం చేస్తున్నాను. బాబా దయతో నేను 35% ఎక్కువ జీతాన్ని అందుకుంటున్నాను. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" బాబాను నమ్మండి, సరైన సమయంలో మనకు శ్రేయస్కరమైనది అనుగ్రహిస్తారు. అప్పటివరకు శ్రద్ధ, సబూరీ కలిగి ఉండండి.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2581.html


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo