సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 331వ భాగం.


ఖపర్డే డైరీ - పదహారవ భాగం

4-1-1912.

నేను ఉదయాన్నే లేచి, ప్రార్థన చేశాక, మా అబ్బాయి బాబాని, గోపాలరావు డోర్లేని సాయిమహారాజు వద్దకు వెళ్ళి, అమరావతి వెళ్ళేందుకు అనుమతిని సంపాదించమన్నాను. కానీ నా భార్య ఈరోజు మా కులదేవతకు చాలా పవిత్రమైన పౌష్యపౌర్ణమి కాబట్టి అవసరమైన అనుమతి కోసం ఎటువంటి ప్రయత్నమూ చేయకూడదని చెప్పింది. నేను బాబాను మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడు చూసి ఆయన మశీదుకు తిరిగి వచ్చాక అక్కడకు వెళ్ళాను. మధ్య విరామంలో రామాయణం చదివాను. మధ్యాహ్న ఆరతి అయాక మేం తిరిగి వచ్చాము. మధ్యాహ్న భోజనాలయ్యాక నేను కాసేపు బాపూసాహెబ్ జోగ్‌తో మాట్లాడుతూ కూర్చుని, ఆ తరువాత రామాయణం మళ్ళీ మొదలుపెట్టాము. సాయంత్రం ఐదుగంటలయ్యాక మశీదులో ఉన్న సాయిమహారాజు వద్దకు వెళ్లి ఆయన కాంపౌండులో నడుస్తూండటం చూశాను. నా భార్య కూడా వచ్చిందక్కడికి. కొంతసేపు గడిచి వారు యథాస్థానంలో కూర్చున్నాక వారికి చేరువలో కూర్చున్నాం. దీక్షిత్, అతని భార్య కూడా వచ్చారు. సాయిమహారాజు అప్పుడొక కథ చెప్పారు. ఒక భవనంలో ఒక మహారాణి నివసిస్తోందట. ఒక అంత్యజుడు ఆమెను ఆశ్రయమివ్వమని కోరాడు. అక్కడే ఉన్న ఆమె వదిన దానిని తిరస్కరించిందట. ఆశ్రయం పొందలేని ఆ అంత్యజుడు తన భార్యతో కలిసి తన గ్రామానికి వెళుతూండగా మార్గంలో అల్లామియాని కలసి తను ఎలా పేదరికంలో మగ్గుతూ ఆశ్రయాన్ని కోరి తిరస్కరింపబడ్డాడో ఆ కథంతా చెప్పాడట. తన భార్యతో కలసి తిరిగి మరొకసారి ఆ మహారాణి వద్దకే వెళ్ళి ఆశ్రయాన్ని కోరమని అల్లామియా సలహా ఇచ్చారట. అతను అలాగే చేసి ఆశ్రయం సంపాదించి ఆ కుటుంబసభ్యుల్లో ఒకడుగా చూడబడ్డాడట. అంత్యజుడు ఆరునెలలు అన్ని సౌఖ్యాలూ అనుభవిస్తూ అక్కడే ఉండి, బంగారాన్ని దొంగిలించి, మహారాణిని హత్యచేశాడట. ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులు గుమిగూడి పంచాయితీ జరిపారట. అంత్యజుడు నేరం ఒప్పుకున్న కొంతకాలానికి ఆ విషయం రాజు దృష్టికి వెళ్ళిందట. అంత్యజుడిని వెళ్ళనివ్వమని అల్లామియా సలహా ఇస్తే రాజు అందుకు ఒప్పుకున్నాడట. అంత్యజుని చేత హత్యచేయబడిన మహారాణి అతని కుమార్తెగా పుట్టిందట. అతను మరొకసారి భవనానికి వచ్చి, అక్కడ ఉండేందుకు అనుమతి పొంది హాయిగా పన్నెండు సంవత్సరాలు ఉన్నాడట. అప్పుడు అల్లామియా మహారాణిని హత్యచేసిన అంత్యజుడి మీద పగ తీర్చుకోవటం కోసం అతను మహారాణిని ఎలా హత్యచేశాడో ఆ విధంగానే హత్యచేయమని రాజుని కోరారట. విధవరాలైన అంత్యజుడి భార్య అంత్యజుని విధిని అంగీకరిస్తూ తన గ్రామానికి తిరిగి వెళ్ళిందిట. మరుసటి జన్మలో అంత్యజుని కుమార్తెగా పుట్టిన మహారాణి ఆ ప్రదేశానికి వచ్చి, ముందు జన్మలో తనకు చెందినవన్నీ స్వాధీనం చేసుకొని సంతోషంగా జీవించిందట. అక్కడ భగవంతుని పని నెరవేర్చబడి ఆయన న్యాయం అమలుపరచబడింది. రాత్రి శేజారతి, భీష్మ భజన, దీక్షిత్ రామాయణ పఠనము జరిగాయి. ఈరోజు శేజారతికోసం సాయిమహారాజు ఊరేగింపుతో చావడికి వెళ్ళేటప్పుడు రామమారుతి సాయిమహారాజుని కౌగలించుకున్నాడు.

5-1-1912.

రాత్రి నేనంత బాగా నిద్రపోకపోయినా ఉదయం త్వరగా లేచి కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిమహారాజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా అబ్బాయి బాబా, గోపాలరావు డోర్లే ఆయన వద్దకు వెళ్ళారు. వీళ్ళను చూడగానే ఆయన "వెళ్ళండి" అన్నారు. దీనిని వాళ్ళు తిరిగి వెళ్ళటానికి అనుమతిగా తీసుకొని బాలాభావూ టాంగాను మాట్లాడుకొని వెళ్ళిపోయారు. నా ప్రార్థనానంతరం సాయిమహారాజు బయటకు వెళ్ళేటప్పుడూ, మళ్ళీ ఆయన తిరిగి వచ్చాకా వారిని దర్శించుకున్నాను. ఆయన చాలా సరదాగా ఉన్నారు. చాలామంది వచ్చారు. మధ్యాహ్న ఆరతి, భోజనము అయ్యాక కొద్దిసేపు విశ్రమించి, దీక్షిత్ పఠిస్తున్న రామాయణం వింటూ కూర్చున్నాను. అప్పుడు ఉపాననీ, భీష్మ మాధవరావులు కూడా ఉన్నారు. సాయంత్రం అయిదు గంటలవుతుండగా భీష్మతోనూ, మా అబ్బాయి బల్వంత్‌తోనూ కలసి సాయిమహారాజు దర్శనార్థం వెళ్ళాను. ఆయన తన ఒంట్లో ఎలా బాగాలేదో అదంతా చెప్పి, తన జబ్బులను చాలా హాస్యస్ఫోరకంగా వర్ణించారు. బాలాభావూ జోషీ ఎండబెట్టిన శనగలు తెచ్చాడు. సాయిమహారాజు స్వల్పంగా తిని మిగిలినవి పంచేశారు. తరువాత వారు సాయంకాలపు నడకకి బయటకొచ్చినప్పుడు మేం చావడి వద్ద నిలుచున్నాం. వాడాలో మా మామూలు ఆరతి, భీష్మ భజన, దీక్షిత్‌చే రామాయణంలో రెండు అధ్యాయాల పఠన జరుపుకున్నాం. కొంతమంది ఈరోజు ధూలియా నుండి వచ్చి వెళ్ళారు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo