సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 386వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ‘బాబాది, నాది 18 జన్మల సంబంధం’
  2. శిరిడీ సందర్శించాలన్న కలను బాబా నెరవేర్చారు

‘బాబాది, నాది 18 జన్మల సంబంధం’

సాయిబంధువులకి నమస్కారం. నా పేరు సంహిత. ఇంతకుముందు బాబా ఒకే సంవత్సరంలో (2019) అయిదుసార్లు నన్ను శిరిడీకి రప్పించుకొని తమ దర్శనభాగ్యాన్ని ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు కలలో చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను.

2019 అక్టోబరు నెలలో నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నాను. ఆ ప్రదేశం కొంచెం ఇరుకుగా ఉంది. దారంతా సన్నగా ఉంది. అయినా అక్కడ చాలామంది ఉన్నారు. అలాగే వెళ్తూ ఉంటే చిన్న బాబా మందిరం కనిపించింది. బాబా ఆకుపచ్చని రంగు దుస్తులలో చక్కగా ఉన్నారు. ఇప్పటికీ ఆ రూపం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆ మందిరం కట్టి రెండు సంవత్సరాలు అవుతోందని, అక్కడి వాళ్ళు బాబా మందిరం రెండవ వార్షికోత్సవం జరుపుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసం అందరినీ విరాళాలు అడుగుతున్నారు. నా దగ్గర డబ్బులు లేనందువల్ల, “Paytm నుంచి డబ్బులు పంపించవచ్చా?” అని వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళు, “ఆఁ, ఇంటికి వెళ్ళాక కూడా డబ్బులు పంపించవచ్చు” అని చెప్పారు. “విరాళం ఎంత ఇవ్వాలి?” అని అడుగుతున్నాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. నాకేమో రూ. 2,000 ఇవ్వాలని ఉంది. అక్కడికి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ బయట ఒక డాక్టర్ ఉంది. తను నా దగ్గరకి వచ్చి, “నీకు నచ్చితే ఒక్క రూపాయి అయినా ఇవ్వచ్చు. బాబాది, మనది 18 జన్మల సంబంధం. కాబట్టి, ఒక్కో జన్మకి ఒక్కో రూపాయి చొప్పున 18 రూపాయలు ఇవ్వు” అని చెప్పింది. తరువాత నాకు మెలకువ వచ్చింది. కలని గుర్తుచేసుకుంటూ, ‘బాబాది, నాది 18 జన్మల సంబంధం’ అని చాలా ఆనందించాను. “థాంక్యూ సో మచ్ బాబా!”. నాకు ఈ కల అక్టోబరులో వచ్చింది కదా, నేను నవంబరులో శిరిడీ వెళ్ళినప్పుడు బాబాకి 18 రూపాయలు సమర్పించుకున్నాను. “బాబా! మీ ఆశీస్సులు ఎప్పటికీ అందరిమీదా ఉండాలి. అందరినీ కాపాడండి. బాబా! కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకడం లేదు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. బాబా! దయచేసి నన్ను కాపాడండి, నన్ను నడిపించండి”.

శిరిడీ సందర్శించాలన్న కలను బాబా నెరవేర్చారు

యు.ఎస్. నుండి సాయిభక్తురాలు కవిత తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఈ లోకంలోని అసంఖ్యాకమైన సాయిభక్తులలో నేనూ ఒకదానిని. 2018 ఆరంభం నుండి నేను ఆయన భక్తురాలిని. అప్పటినుండి నేను శిరిడీ సందర్శించాలని కలలుగన్నాను. 2018 వేసవిలో నేను భారతదేశానికి వెళ్లాను గానీ, శిరిడీ వెళ్ళలేకపోయాను. అందువల్ల నేను చాలా నిరాశపడ్డాను. అప్పటినుండి నేను, "బాబా! దయచేసి శిరిడీ దర్శించాలన్న నా కలను నెరవేర్చండి" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని.

2019లో మేము ఇండియా వెళ్ళడానికి 2 నెలల ముందు నుండి "అతి త్వరలో మీరు శిరిడీ సందర్శిస్తారు" అని వివిధ మార్గాల (ఇన్‌స్టాగ్రామ్/ఇంటర్నెట్) ద్వారా నాకు సందేశాలు వస్తుండేవి. బాబా చాలాసార్లు ఇస్తున్న ఆ సందేశంతో ఈసారి శిరిడీ సందర్శిస్తానని నమ్మకం నాలో ఏర్పడింది. ఆశ్చర్యకరంగా తేదీలన్నీ చక్కగా అమరాయి. శిరిడీ వెళ్లాలన్న నా ఆలోచనకు మావారు సంతోషంగా అంగీకరించారు(గత సంవత్సరానికి భిన్నంగా). ఆయనంతట ఆయనే 'మనం గురువారం శిరిడీ వెళదామ'ని అన్నారు. బాబా అనుగ్రహంతో అనుకున్నట్లుగానే మేము గురువారం శిరిడీ చేరుకున్నాము. బాబా అద్భుతమైన దర్శనం ప్రసాదించారు. నేను మాటలలో చెప్పలేనంత అనుభూతి పొందాను. ఆనందం కన్నీళ్ల రూపంలో వ్యక్తమైంది. ముఖ్యంగా ద్వారకామాయిలో బాబా ఉనికిని బాగా అనుభవించగలిగాను. ఎప్పటికీ మరువలేని ఆనందమది.

కొన్ని ఆరోగ్యసమస్యలున్న మా పాపకు నేను రోజూ బాబా ఊదీని ఇస్తూ ఉంటాను. అందువలన నేను ఎప్పుడూ ఊదీ ప్యాకెట్లు కావాలని ఆరాటపడుతుంటాను. ఆ కారణంగా మేము మందిరం నుండి బయటికి వచ్చేముందు అక్కడున్న సెక్యూరిటీతో నేను, "మాకు ఎక్కువ ఊదీ లభిస్తుందా?" అని అడిగాను. వాళ్ళు, "డొనేషన్ కౌంటర్లో సంప్రదించండి" అని చెప్పారు. మేము ఆ కౌంటరుకి వెళ్లి కొంత డబ్బు విరాళంగా కట్టాము. అతను కొన్ని ఊదీ ప్యాకెట్లను మాకు ఇచ్చాడు. చూస్తే, మా ఊహకందనంత ఎక్కువ ఊదీ ప్యాకెట్లున్నాయి. పూర్తిగా అది బాబా కృప. ఆయన చూపిన ప్రేమకు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.

మరుసటిరోజు (శుక్రవారం) మా తిరుగు ప్రయాణం. ఆ రాత్రి నేను అలారం పెట్టుకోకుండానే నిద్రపోయాను. సరిగ్గా తెల్లవారుఝామున 3.30 గంటలకు నాకు మెలకువ వచ్చింది. కాకడ ఆరతి సమయానికి నేను వెళ్ళగలిగాను. సమయానికి బాబానే నన్ను మేల్కొల్పారని భావించి కృతజ్ఞతతో ఆయనకు నమస్కరించుకున్నాను.

ఇప్పుడు బాబా ఇచ్చిన అద్భుత అనుభవాన్ని చెప్తాను. నేను శిరిడీలోని షాపింగ్ సెంటర్‌లో తెల్లని పాలరాతి బాబా విగ్రహాన్ని కొనాలని అనుకున్నాను. కానీ తగినంత సమయం దొరకక నేను కలత చెందాను. హోటల్ చెకౌట్ చేయడానికి మేము సిద్ధమవుతున్న సమయంలో హోటల్ సిబ్బంది మమ్మల్ని పిలిచి మాకొక బహుమతి ఉందని చెప్పారు. నేను దానిని అందుకుని ప్యాకెట్ తెరచి చూసి అవాక్కయ్యాను. అది తెల్లని పాలరాతి బాబా విగ్రహం! బాబా అంత ప్రేమ కురిపిస్తారని నేనస్సలు ఊహించలేదు.

ఇక చివరిగా మేము శిరిడీ నుండి బయలుదేరేముందు మా పాపకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. దాంతో ముందుగా అనుకున్నట్లుగా ఆరోజు తిరిగి వెళ్లగలమా అని మేము ఆలోచనలో పడ్డాము. నేను తనకి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. కొద్దినిమిషాల్లో తన తలనొప్పి తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మొత్తం మీద నేను కలలు కన్న శిరిడీ సందర్శించగలిగాను. మీ అనుగ్రహాన్ని చాలా పొందగలిగాను".

అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2589.html


7 comments:

  1. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. om sairam
    sai always be with me

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    “బాబా! మీరు ప్రపంచాన్నంతటినీ కొరోనా బారినుండి కాపాడండి”.

    ReplyDelete
  5. baba,pls nannu chala tondaraga indulo nundi bayata padeyandi,pls baba,pls baba,pls baba,ika ee game ni aapiveyandi deva,love u baba,be with me forever.

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయిరాం తాతయ్య🙏🙏🙏

    ReplyDelete
  7. అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo