సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 341వ భాగం.


ఖపర్డే డైరీ -  ఇరవైఆరవ భాగం

31-1-1912.

నేను కాకడ ఆరతి సమయానికి లేచి, నారాయణరావు వామన్ గావోంకర్‌తో కలసి వెళ్ళాను. మేము తిరిగి వచ్చేటప్పుడు సాయిమహారాజు కొంచెం కోపాన్ని ప్రదర్శించారు. బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ శాస్త్రి, కౌజల్గిలతో కలిసి మా పరమామృతం తరగతి బాగా సాగింది. నా బసకి పదకొండు గంటలకి వచ్చి కొన్ని జాబులు రాద్దామని కూర్చున్నానుగానీ, రాసే ప్రక్రియలో చాలా నిద్ర ముంచుకువచ్చింది. దాదాకేల్కరు కొడుకు భావూ నన్ను నిద్రలేపగా మధ్యాహ్న ఆరతికి మశీదుకి వెళ్ళిపోయాను. అంతకుముందు మామూలు ప్రకారం సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాను. మధ్యాహ్న ఆరతి మామూలుగా జరిగిపోయింది. రెండు వాడాల్లో నివసించేవారినీ, ఇంకా వేరే కొందర్నీ మేఘుడు చనిపోయిన పదమూడవరోజున అతని సంస్మరణార్ధం దాదాకేల్కర్ విందుకు పిలిచాడు. భోజనం సహజంగానే ఆలస్యమైంది. దానికోసం పిలిచేవరకు నేను పడుకొని గాఢంగా నిద్రపోయాను. ఐదుగంటలకు పూర్తయిందది. 

నేను అక్కడనుండి మశీదుకు వెళ్ళి సాయిసాహెబ్ దగ్గర కూర్చున్నాను. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. హాయిగా మాట్లాడారు, నృత్యం చేశారు, పాటలు పాడి  నాకూ, మిగతా అందరికీ కూడా అలనాటి గోకులంలోని చిన్నికృష్ణుణ్ని గుర్తుకుతెచ్చారు. వారి సాయంకాలపు వ్యాహ్యాళి సమయంలో వారిని చూశాం. వాడా ఆరతి అయ్యాక భీష్మ కొంచెం భజన చేశాడు. దీక్షిత్ రామాయణం చదివాడు. అందులో సుందరకాండను ఈ రాత్రి పూర్తి చేశాము.

1-2-1912.

ఈరోజు నేను లేవటం కొంచెం ఆలస్యమైనా సమయానికి ప్రార్థన పూర్తిచేసుకొని పరమామృతం తరగతికి హాజరవగలిగాను. ఈరోజు పుస్తకం పూర్తవుతుంది, రేపు పురశ్చరణ చేస్తాం. నేను తరువాత మశీదుకి వెళ్ళి సాయిమహారాజుతో కూర్చుని వారితో కలసి సాఠేవాడా వరకు వెళ్ళాను. వారికి నమస్కరించుకోవటం కోసం భక్తులు అక్కడ గుమికూడారు. వాళ్లతోపాటు నేను కూడా ఆయనకు నమస్కరించి, తరువాత బావూసాహెబ్ జోగ్ ఇంటికి వెళ్ళి పంచదశి మొదలుపెట్టాను. దాదాపు గ్రంథంలోని సారాంశమంతా ఇమిడి ఉన్న మొదటి పదిశ్లోకాలు వివరించాను. తిరిగి నా బసకు వచ్చి కొన్ని జాబులు వ్రాసి పోస్టుచేసి, మధ్యాహ్న ఆరతికి హాజరయ్యేందుకు మశీదుకు వెళ్ళాను. ఆరతి బాగానే జరిగింది. ఈ సంవత్సరమే ఎల్.ఎల్.బి డిగ్రీ తీసుకున్న అహ్మద్ నగర్‌కి చెందిన మాణిక్‌చంద్ ఇక్కడకు వచ్చి రోజంతా ఇక్కడే గడిపాడు. ఆరతి నుంచి వచ్చాక భోజనం చేసి సాఖ్రేబువా పర్యవేక్షించిన జ్ఞానేశ్వరి చదువుతూ కూర్చున్నాను. దురదృష్టవశాత్తూ మిగతా అన్ని ప్రచురణలలాగానే ఇదీ నా అన్ని సందేహాలనూ తీర్చలేదు. తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు. శిరిడీ మామల్తదారు సానే, డిప్యూటీ కలెక్టరు, సబ్ డివిజనల్ ఆఫీసరూ అయిన సాఠే వచ్చి కొంతసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. వారు వెళ్ళిపోయాక మా రామాయణం కొనసాగించి, సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళే సాయిని చూసేందుకు మశీదుకి వెళ్ళాము. వాడా ఆరతి అయ్యాక శేజారతికి వెళ్ళాం. భీష్మ భజన చేయకుండా సఖారామ్ గారి ప్రాకృత భాగవతం చదివాడు. రాత్రికి దీక్షిత్ రామాయణం చదివాడు. ఈరోజు సాయంత్రం సాయిబాబా వద్దకు మేమందరం వారు సాయంకాలవు వ్యాహ్యాళికి వెళ్ళేముందు చేరాము. సాయిసాహెబ్ తమ కాళ్ళు మర్దన చేస్తున్న నా భార్యకు రెండువందల రూపాయిలు ఇవ్వమని దీక్షిత్‌తో చెప్పారు. ఈ ఆజ్ఞ తిరుగులేనిది. నేను మరొకరి దయాధర్మం మీద బ్రతకవలసి వచ్చిందా! దీనికంటే నాకు మరణమే నయం. నా అహాన్ని మచ్చిక చేసి చివరకు నశింపచేయాలని అనుకుంటున్నారేమో ఈయన. అందుకే ఆయన నన్ను పేదరికానికి, ఇతరుల దయాధర్మానికి అలవాటు చేస్తున్నారు అని అనుకున్నాను.

గమనిక: డైరీలో ఫిబ్రవరి 1, 1912 తారీఖు పేజీలు తిరగేసి నీతో గుర్తించబడ్డ పేరాను చదివాను. అది సరిగ్గా నా భావాలకు ప్రాతినిధ్యం వహించింది. మన సద్గురు సాయిమహారాజు ఆజ్ఞలను జారీచేశారు. ఆయన సర్వాంతర్యామి. నా మనసులో ఉన్న ఆలోచనలతో సహా ప్రతీదీ ఆయనకు తెలును. తన ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో ఆయన ఎన్నడూ బలవంతం చేయరు. ఇప్పుడు నా భార్య కష్టతరమైన జీవితాన్నీ, పేదరికాన్ని ఇష్టపడకపోవటం మీదకు నా దృష్టి పోయింది. ఆమె అలా ఇష్టపడనట్లు నాకు తోచింది. కాకాసాహెబ్ దీక్షిత్ ఆ జీవితాన్ని అంగీకరించాడు కనుక హాయిగా ఉన్నాడు. అందుకే సాయిమహారాజు అతన్ని రెండువందల రూపాయలు అంటే పేదరికాన్ని, సహనాన్ని నా జీవితానికి ఇవ్వమని అతనికి చెప్పారు.

2-2-1912.


కాకడ ఆరతికి లేచి దాని తరువాత పంచదశి తరగతిని నిర్వహించాము. అయితే పంచదశి గురించే మాట్లాడాలనిపించి, దాన్ని చదవటం మొదలుపెట్టాము. అది చాలా గొప్ప గ్రంథం. ఏదీ దాన్ని అధిగమించలేదు. నేను సాయిమహారాజుని వారు బయటకు వెళ్ళే ముందు చూడటానికి వెళ్ళి వారిని సాఠేవాడా వరకు అనుసరించి తరువాత మధ్యాహ్న ఆరతికి హాజరయ్యాను. ఈరోజు అమరావతి నుండి నన్ను ప్రాక్టీసు చేసుకోవటానికి తిరిగి రమ్మంటూ మళ్ళీ ఒక జాబు వచ్చింది. సాయిమహారాజుని అడగమని మాధవరావు దేశ్‌పాండేకి నేను చెపితే అతను అలాగే చేస్తానని వాగ్దానం చేశాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo