సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ సద్గురు సాయినాథ్ కృప మఠం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పూనాలోని స్వరగేట్ వద్దనున్న శ్రీ సద్గురు సాయినాథ్ కృప మఠం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ మందిరాన్ని నారాయణ్ దత్తాత్రేయ అలియాస్ బావూసాహెబ్.డి.లోంబార్ 1954వ సంవత్సరంలో నిర్మించారు. మందిరం కట్టించాలన్న అతని కోరికను బాబా ఎలా నెరవేర్చారు, ఆ ప్రదేశంలో మందిర నిర్మాణానికి బాబా ఎలా ఆదేశించారు, నిర్మాణాన్ని ఎలా నడిపించారు అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బావూసాహెబ్.డి.లోంబార్

బావూసాహెబ్ 1907వ సంవత్సరంలో కొల్హాపూర్ దగ్గర ఉన్న 'నిపని'లో జన్మించారు. అతని తల్లిదండ్రులు దత్తాత్రేయుణ్ణి, తుల్జా భవాని దేవతను ఆరాధించేవారు. అటువంటి అధ్యాత్మిక వాతావరణంలో అతను పెరగడం వలన అతిచిన్నవయస్సులోనే భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. అతనికి 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు 1920లో శిరిడీ సందర్శించాడు. ఆ సమయంలో ద్వారకామాయిలో బాబా దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆనాటి నుండి లక్ష్మీపూజ రోజున తాను చనిపోయేవరకు(1978) తరచూ శిరిడీ దర్శిస్తుండేవాడు.

మొదట్లో నగల వ్యాపారం అతని వృత్తిగా ఉండేది. తరువాత బాబా ఆజ్ఞపై ఆ వ్యాపారాన్ని సంతోషంగా వదిలిపెట్టి తన సమయాన్ని, శక్తిని పూర్తిగా బాబాకి అంకితం చేసాడు. బాబాపై అతని నమ్మకం పెరిగేకొద్దీ ఒక మందిరం నిర్మించాలన్న కోరిక అతనిలో బలపడింది. 1952లో పూనా నగరంలో మందిరం కట్టదలచి స్థలనిర్ణయం, మార్గనిర్దేశం చేయమని బాబాని ప్రార్థిస్తూ అరణ్యేశ్వర ఆలయంలో పదిరోజులు ఉపవాసంతో ధ్యానం చేస్తూ తీవ్రమైన ఉపాసనలో గడిపాడు. 10వ రోజున అతనికి ధ్యానంలో బాబా దర్శనమిచ్చి, "ఎందుకిక్కడ కూర్చుని ఉన్నావు? ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నీవు వెళ్లే మార్గంలో ఎక్కడైతే నీ పాదం భూమిలోకి దిగబడుతుందో అదే మందిర నిర్మాణానికి తగిన స్థలంగా భావించు" అని చెప్పారు. వెంటనే బాబా ఆజ్ఞానుసారం ఇంటికి బయలుదేరాడు బావూసాహెబ్. బాబా చెప్పినట్లుగానే ప్రస్తుతం మందిరమున్నచోట అతని పాదం భూమిలోకి దిగబడింది. అదే బాబా చూపిన స్థలంగా భావించి అక్కడొక చెట్టు క్రింద ధ్యానంలో కూర్చోగా, అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది. తరువాత మందిర నిర్మాణానికి అవసరమైన పనులు మొదలుపెట్టి, ముందుగా ఆ స్థలాన్ని కొనుగోలు చేసాడు. అప్పట్లో ఆ ప్రాంతమంతా అరణ్యంలా ఉండి, పాములు, తేళ్ల ఆవాసంగా ఉండేది. అయితే బాబాకు అంకిత భక్తుడైన అతను అక్కడొక గుడారాన్ని నిర్మించి, అందులో బాబా చిత్రపటాన్ని ఉంచాడు. వెంటనే ఆ ప్రదేశమంతా సుగంధభరితమై, 5 పాములు కనిపించాయి. అదంతా శ్రీ సాయిబాబా లీలగా గుర్తించి, భయపడాల్సిందేమీ లేదని ధైర్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు. కాసేపట్లో బాబా కృపవలన ఆ పాములు ఎవరికీ ఏ హానీ కలిగించకుండా ఆ చోటు వదిలి వెళ్లిపోయాయి.

మూడు, నాలుగు రోజుల తరువాత బావూసాహెబ్‌కు కలలో బాబా దర్శనమిచ్చి, "మందిర నిర్మాణం కోసం పునాదులు త్రవ్వుతున్నప్పుడు ఏది దొరికితే దానిని అక్కడే భూగర్భంలో స్థాపించు" అని చెప్పారు. తరువాత వాళ్ళు పునాదులు త్రవ్వుతున్నప్పుడు 7 అడుగుల పొడవున్న చెక్కపెట్టె కనిపించింది. అది తెరిచి చూసిన బావూసాహెబ్ ఆశ్చర్యపోయాడు. అందులో ఒక అస్థిపంజరం, దాని మొలలో కౌపీనంగా కాషాయవస్త్రమూ ఉన్నాయి. వాటిని ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. బాగా అలోచించి వాటిని నదిలో విడువదలచి ఒక గోనెలో కట్టి పక్కన ఉంచారు. కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చొని, ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. సాయి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, బాబా చెప్పింది వాటి గురించే అని గ్రహించి, ఆయన ఆజ్ఞ ప్రకారమే చేస్తానని చెప్పుకోగానే ఆ పాము అక్కడనుండి వెళ్ళిపోయింది.

మందిర నిర్మాణం 1955లో పూర్తికాగా, సాయిభక్తుడు దాసగణు మహారాజ్ బాబా పాదుకలను సాంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. పూనాలోని అపోలో థియేటర్ యాజమాని శ్రీసుఖియ, ఒక పార్శీ సాయిభక్తుడు కలిసి తొమ్మిది లోహాలతో 4 1/2 అడుగుల బాబా విగ్రహాన్ని తయారు చేయించి 1956లో మందిరంలో ప్రతిష్ఠించారు. ఈ మందిరం శిరిడీ సమాధిమందిరాన్ని పోలి ఉంటుంది. పునాదులు త్రవ్వుతున్నప్పుడు దొరికిన పేటికను గర్భగుడిలో సరిగ్గా బాబా మూర్తి క్రింద ఉన్న 10×10 అడుగుల భూగర్భ గృహంలో బాబా ఆదేశానుసారం భద్రపరిచారు. అక్కడికి వెళ్ళడానికి కేవలం బావూసాహెబ్ సంతతికి మాత్రమే అనుమతినిస్తారు. 1952లో స్థాపించిన ధుని ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది.


1949లో బావూసాహెబ్ కుమారుడు శ్యామారావు నాలుగు సంవత్సరాల బాలుడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆ బాలుని కంటినుండి రక్తం, చీము కారుతూ కంటిచూపు పోయింది. ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించినప్పటికీ వాళ్ళు ఇచ్చిన మందులేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ స్థితిలో బావూసాహెబ్ శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ, "బాబా! మీరు దయగలవారు, ఎంతో సమర్థులు. మీకు నా బిడ్డ శ్యామ్ పరిస్థితి తెలుసు. తన జీవితం అంధకారమైపోయింది. తన కంటిచూపు పునరుద్ధరించినట్లైతే వాడి జీవితాన్ని మీ సేవకు అంకితం చేస్తాను" అని వాగ్దానం చేసాడు. ఎంతోకాలంగా తన అంకిత భక్తుడైన శ్రీబావూసాహెబ్ ప్రార్థనలను దయగల సాయి విన్నారు. ఎంత ఆశ్చర్యమంటే, పూర్తిగా పోయిన అతని కంటిచూపు రెండు, మూడేళ్ల కాలంలో తిరిగి వచ్చి, శ్యామ్ పూర్తిగా కోలుకున్నాడు. తరువాత శ్యామ్ శ్రీసాయి ఆరాధనలో పూర్తిగా నిమగ్నమైపోయాడు.

శ్రీబావూసాహెబ్ పెద్ద కొడుకు శశికాంత్ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడు. అతని కుమార్తె శ్రీమతి షీలా లాంజెకెర్ పాటలు పడుతూ బాగా ప్రాచుర్యం పొందారు. ఒకసారి ఆమె శిరిడీలో శ్రీసాయిబాబా సమక్షంలో పాటల కార్యక్రమాన్ని నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

శ్రీ సాయి మందిరానికి వెనుక భాగంలో ఉన్న గదిని శ్రీ బావూసాహెబ్ విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించేవారు. ప్రతి గురువారం శ్రీబావూసాహెబ్ ఊదీ, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసి, వివిధ విషయాలపై వారికి సలహాలు ఇచ్చేవారు. ఆ గదిలో శ్రీ బి.డి.తాడే (ప్రభాత్ సినిమా కంపెనీ చిత్రకారుడు) చిత్రించిన శ్రీసాయిబాబా యొక్క గంభీరమైన ఆయిల్ పెయింటింగ్ ఉన్నది. ఈ చిత్రలేఖనం దాదాపు ఆరు అడుగుల కంటే ఎక్కువ పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. ఆ చిత్రం శ్రీసాయిబాబా శిరిడీ గ్రామంలో భిక్షకేగిన భంగిమలో ఉంటుంది. పెయింటింగ్ ప్రత్యేకించి మనోహరమైన కళ్ళతో జీవకళ తొణికిసలాడుతూ ఉంటుంది. 1968లో ఈ పెయింటింగ్‌కి సంబంధించిన ఒక అద్భుతం జరిగింది. ఆ సమయంలో శ్రీబావూసాహెబ్ "నవనాథ చరిత్ర" చదువుతున్నారు. ఒకరోజు అతను ధ్యానంలో ఉన్నప్పుడు, అతనికి కిటికీ వెలుపలనుండి చప్పట్లు కొట్టిన శబ్దం వినిపించింది. తన దృష్టిని మరల్చడానికి ఎవరో అలా చేస్తున్నారని అతను అనుకున్నాడు. అతను తన కళ్ళు తెరిచి చూస్తే, పెయింటింగ్‌లోని శ్రీసాయిబాబా పెదవులు తెరవబడి 'తిల్ గుల్' లాంటి  ప్రసాదం బయటకు వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు పెదవులు తెరచుకొని ఉండిపోయాయి. ఆ అద్భుతాన్ని నేడు కూడా ఎవరైనా వెళ్లి దర్శించవచ్చు. శ్రీసాయినాథుడు తన భక్తుల ఆశయాలు నెరవేర్చుతారనడానికి ఈ ఆలయం ఒక సజీవమైన  ఉదాహరణ.

బాబా మందిరం చుట్టూ చిన్న చిన్న మందిరాలనేకం ఉన్నాయి. అక్కడ అందమైన మ్యూజియం కూడా ఉంది. అందులో అరుదైన ఫోటోలు ఉంచారు. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయన్న గట్టి నమ్మకంతో ఎక్కడెక్కడినుండో భక్తులు నియమంగా వచ్చిపోతుంటారు. బాబా తన భక్తులను ఒక సాధనంగా చేసుకొని తన పనిని ప్రత్యేక పద్ధతిలో పూర్తి చేస్తారు.

మూలం: http://saiamrithadhara.com/Shri%20Sadguru%20Sainath%20Math_Pune.html,


శ్రీ సాయి సాగర్ మ్యాగజైన్, దీపావళి సంచిక - 2007.

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sri Sainath Maharaj ki Jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo