సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా ప్రేమను చూడండి! ఆయన నన్నెప్పుడూ పస్తు ఉండనివ్వలేదు.

సాయిభక్తుడు శరణ్ తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. ఆన్లైన్‌లో భక్తుల అనుభవాలు చదువుతుండటం వలన బాబాపై నా భక్తివిశ్వాసాలు రెట్టింపు అవుతున్నాయి. బ్లాగులు నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా ధన్యవాదములు. 2015 నుండి నేను సాయి భక్తుడిని. అంతకుముందు కూడా నేను బాబాని ప్రార్థించేవాడిని, కానీ ఆయన గురించి నాకు అంతగా ఏమీ తెలియదు. ప్రతిరోజూ నా బాబా నాకు తోడుగా ఉండి నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నారు. నాకే సమస్య ఎదురైనా నేను బాబానే ప్రార్థిస్తాను, ఆయన వెంటనే నాకు పరిష్కారం చూపిస్తూ ఉంటారు. ఇక నా అనుభవానికి వస్తే..

నా వయసు 37 సంవత్సరాలు. నా జీవితం ఫ్రెండ్స్, పార్టీలు, నా గర్ల్‌ఫ్రెండ్ చుట్టూ తిరుగుతూ సంతోషంగా గడిచిపోయేది. అలాంటి నా జీవితంలో ఉన్నట్టుండి 'గౌట్& రుమటాయిడ్ అర్థరైటిస్' వ్యాధి(వాత రక్తం -  రక్తంలో ఏర్పడిన అధికమైన యూరిక్ యాసిడ్ కిడ్నీ ద్వారా బయటికి వెళ్లిపోవాలి. అలా జరగకుండా కీళ్ల మధ్య ఉండిపోవడం వల్ల అక్కడ నొప్పి, వాపు ఉంటాయి) సోకింది. దానితో నా వేళ్ళలో, కాళ్లలో కదలిక  పరిమితమైంది. ఆ బాధ ఏమిటో అనుభవించేవారికే తెలుస్తుంది. ఇదొక సమస్యైతే, 2014లో నా పై అధికారి నా స్థానంలో తక్కువ శాలరీ తీసుకునే ఇంకొక వ్యక్తిని తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సంవత్సరానికి ఒకసారి ఇచ్చే రేటింగును తక్కువగా చూపిస్తూ ఉండేవాడు. ఉద్యోగంలో సమన్వయం లేకపోవడంతో, అటువంటిచోట ఉద్యోగం చేయడం అనవసరం అనిపించి 2014, డిసెంబరులో ఉద్యోగాన్ని వదిలేశాను. తర్వాత సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను. కానీ సరిపడా డబ్బులు లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. దాంతో మళ్లీ ఉద్యోగప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే ఇంటర్వ్యూలో నేను చాలా ఆందోళనకు గురవుతూ  ఉండటంవలన అది కూడా సరిగ్గా చేయలేకపోయాను. ఇక పూర్తిగా నిరాశపడిపోయాను. ఆ సమయంలో ఒక స్నేహితుడిని కలిసాను. అతను గొప్ప బాబా భక్తుడు, తరచూ శిరిడీ దర్శిస్తూ ఉండేవాడు. తనతో మాట్లాడిన తర్వాత నాకు బాబా గుడికి వెళ్ళాలనిపించి, మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను. 

రోజూ బాబా దర్శనం చేసుకుని, మందిర ప్రాంగణంలో కూర్చుని మొబైల్‌లో సచ్చరిత్ర చదువుతూ ఉండేవాడిని. ఒకరోజు నేను చదువుకుంటూ ఉండగా ఒకామె వచ్చి నా ముందు నిలుచుంది. నేను ఆమెను గమనించకుండా చదువుకుంటూ ఉంటే, పక్కనున్న భక్తుడు, 'చూడు!' అంటూ నన్ను తట్టాడు. నేను చూస్తే, ఆమె 'నవ గురువార వ్రతం' పుస్తకం, అరటిపండు, తాంబూలం నా చేతిలో పెట్టింది. ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆమె పాదాలను తాకి, నన్ను ఆశీర్వదించమని అడిగాను. వ్రత విధానం తెలియకపోయినా, నాకు తోచిన విధంగా వ్రతం చేస్తూ బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. తొమ్మిది వారాల వ్రతం పూర్తైన తర్వాత ఒకరోజు నేను మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని తిరిగి వచ్చేయబోతుండగా పూజారి నన్ను పిలిచి, "సాయంత్రం నాలుగు గంటలకి వస్తే బాబాకి అభిషేకము, స్నానం  చేయించడంలో పాల్గొనవచ్చు" అని చెప్పారు. ఈ రోజుల్లో పూజారులు దేవుడి పేరు పెట్టి డబ్బులు గుంజుతూ ఉంటారు. కానీ నా దగ్గర అంత డబ్బులు ఏమీలేవు. కాబట్టి బాబాని ప్రార్థించి, ఒకవేళ పూజారి అడిగితే ఇవ్వొచ్చని 50 రూపాయలు జేబులో పెట్టుకుని సాయంత్రం నాలుగు గంటలకు గుడికి వెళ్లాను. పూజారిగారు అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ నన్ను చూసి గర్భగుడిలోకి రమ్మని పిలిచారు. అక్కడ నేను తప్ప అందరూ ఆడవాళ్లే ఉన్నారు. బాబా వస్త్రాలు, మాలలు తీసి పక్కన పెట్టారు. తెల్లని పాలరాతి బాబా అందాన్ని చూస్తూ నేను మైమరిచిపోయాను. కుంకుమ నీళ్లు, ఊదీ నీళ్లు, చందనములతో అభిషేకించి తరువాత మంచినీటితో బాబాకి స్నానం చేయించాం. నా భాగ్యానికి నేనెంతో మురిసిపోయాను. ఎప్పటినుంచో ఉన్న భక్తులు సైతం ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఈమధ్యనే బాబా భక్తుడినైన నాకు అంత గొప్ప అవకాశం రావడం నా మహద్భాగ్యం. తర్వాత నేను ఇంటికి వచ్చేముందు పూజారిగారి చేతిలో 50 రూపాయలు పెట్టాను. కానీ అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ, "డొనేషన్స్ బాక్సులో వేయమ"ని చెప్పి, "నీకు సంతోషమే కదా?" అని అడిగారు. నేను, "ఈరోజు నా జీవితంలోనే చాలా ప్రత్యేకమైన రోజు. నేను పొందిన ఆనందాన్ని ఏమని చెప్పగలను? ఈ అవకాశమిచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు" అని చెప్పాను.

నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఒంటరిగానే అపార్ట్‌మెంటులో ఉంటూ ఉండేవాడిని. ఇంటి అద్దె కట్టడానికి, తిండి తినడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. కానీ బాబా ప్రేమను చూడండి! ఒక్కరోజు కూడా ఆయన నాకు భోజనం చేయకుండా పడుకునేరోజు ఇవ్వలేదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు నాకు ఆహారాన్ని అందించేవారు. నెలాఖరు వచ్చేసరికి ఇంటి అద్దె కట్టేందుకు డబ్బులు కావాలని బాబాని ప్రార్థించేవాడిని. అద్భుతాలలోకే అద్భుతం! ఆ డబ్బులు ఏదో ఒకవిధంగా బాబా ఏర్పాటు చేసేవారు. ఇప్పటికి ఉద్యోగం లేకుండా మూడేళ్ళు అవుతున్నా బాబా నన్ను ఎంతో శ్రద్ధగా, నా ప్రతి అవసరాన్నీ తీరుస్తున్నారు. చాలాకాలంగా కొన్ని కారణాల వలన నేను ఉపయోగించుకోలేకపోతున్న నా ప్రావిడెంట్ ఫండ్‌ని కూడా బాబాయే ఇటీవల నాకు అందేలా చేశారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

బాబాని ప్రార్థిస్తూ, సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టిన తర్వాత నిదానంగా నేను బాబా బోధనలను ఆచరించడం మొదలుపెట్టాను. అవి నాకెంతగానో సహాయం చేస్తున్నాయి. నేను ఇతరులను అసహ్యించుకోవడం, వారిపై కోపం తెచ్చుకోవడం, వాళ్ళ వెనక చాడీలు మాట్లాడటం, ఒకరిపట్ల అసూయచెందడం మొదలైనవి మానుకున్నాను. ఇవన్నీ బాబాకి దగ్గరవడంలో నాకెంతగానో సహాయపడుతున్నాయి. చాలామంది సాయిభక్తులు బాబా తమ బాధను వినిపించుకోవడం లేదని, సాయం అందించడం లేదని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ ఆశని వదులుకోకండి. బాబా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మీకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఆయన తప్పకుండా సరైన సమయంలో వాటిని మీకు అందిస్తారు. ఆయన ఆలోచన ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. ఎవరితోనూ అబద్ధం చెప్పకండి, ఎవరిపట్ల అసూయ చెందకండి, చెడుగా మాట్లాడకండి, మీ మాటలతో ఇతరులను గాయపరచకండి. వీలైనంత సాటిజీవులకు ఆహారాన్ని అందించండి, మన కర్మలు కొంతైనా తొలగిపోతాయి. "ఐ లవ్ యు సాయి! ప్లీజ్! ఎప్పుడూ తోడుగా ఉంటూ నన్ను, నా కుటుంబాన్ని, మీ భక్తులను రక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఉండండి".

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo