సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిపై దృఢమైన విశ్వాసం – సమస్యలకి పరిష్కారం


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

ప్రేమస్వరూపులైన సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నేను 23 ఏళ్ల అమ్మాయిని. మాది చాలా సాదాసీదా చిన్న కుటుంబం. మేము సాధారణ జీవితం గడుపుతూ ఉండగా, 2017 ఆరంభంలో మా జీవితాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. జనవరి నెలలో ఒకరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మా అమ్మ చాలా భయంకరంగా ప్రవర్తించసాగింది. ఆమె, "నేను ఆత్మని, నేను చనిపోతాన"ని బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. మాకు ఎలా ప్రతిస్పందించాలో అర్థంకాక నిశ్చేష్టంగా ఉండిపోయాం. పైగా అర్థరాత్రి, ఎక్కడికీ పోలేని పరిస్థితి. ఆ క్షణంనుండి మొదలైన ఆ పరిస్థితి సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. నేను, నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము. ఆమె అసలు పడుకునేది కాదు. ఎదురుగా ఎవరో ఉన్నట్లు ఆగకుండా మాట్లాడుతూనే ఉండేది. ఆమెను చూస్తూ భయంతో వణికిపోయేవాళ్ళం. మా బంధువులంతా తలా ఒక సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. సాధువుల వద్దకు తీసుకెళ్ళమని ఒకరు, తాంత్రికుల వద్దకు తీసుకెళ్ళమని మరొకరు, ఏదైనా గుడికి తీసుకెళ్ళమని ఇంకొకరు... ఇలా రకరకాలుగా చెప్తూ ఉండేవారు. వాళ్లంతా చెప్పేది ఏమిటంటే, అమ్మ పరిస్థితికి కారణం ఆత్మ ప్రభావమని, ఎవరో మంత్రప్రయోగం చేసారని. నేను నాన్నతో ఒక్కటే చెప్పాను, "బాబా వద్దకు తప్ప ఇంకెక్కడికీ అమ్మని తీసుకెళ్ళవద్దు" అని. నేనలా కరాఖండిగా చెప్పడంతో మా బంధువులంతా నన్ను ఒకరకంగా చూడటం మొదలుపెట్టారు. కానీ నేనేమీ పట్టించుకోలేదు. నేను బాబానే నమ్ముకున్నాను. అమ్మకు బాబా ఊదీ ఇస్తూ సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అమ్మ తను కళ్ళు తెరవకుండా, "మీరంతా నాకు దూరంగా ఉండండి. నన్ను చూడకండి. నన్ను చూస్తే మీక్కూడా ఈ పరిస్థితి వస్తుంద"ని అరుస్తూ ఉండేది. నేనేమీ పట్టించుకోకుండా, బాబాని తలుచుకుంటూ ఆమెను గట్టిగా హత్తుకునేదాన్ని. నేను, "బాబా! ఈ ప్రపంచాన్ని సృష్టించింది మీరు. మీ ఆధీనంలో లేనిదంటూ ఏమీలేదు. మీ శక్తిని మించి ఏదీ లేదు. అలాంటప్పుడు ఈ ఆత్మలు, మంత్రవిద్యలు మీ భక్తులకు హాని కలిగిస్తాయా? అమ్మని కాపాడండి బాబా!" అని ప్రార్థిస్తూ అమ్మకి మందులతోపాటు ఊదీ ఇస్తూ సహనంతో వేచివుండేవాళ్ళం. ఏది ఏమైనా నా చేయి సాయి విడిచిపెట్టరు, ఆయన అమ్మని కాపాడుతారని నా నమ్మకం.

అమ్మ పరిస్థితి ఇలా ఉంటే, ఫిబ్రవరి నెలలో మరో సమస్య చుట్టుముట్టింది. మాకు దూరంగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మా అక్క అనారోగ్యం పాలై సెలవు తీసుకుని ఇంటికి వచ్చింది. అమ్మ పరిస్థితి చూసి తను, తన పరిస్థితి చూసి అమ్మ ఇద్దరూ ఒకటే ఏడుపు. ఇద్దరినీ ఓదార్చలేకపోయాం. డాక్టరు వద్దకు వెళ్తే అది మామూలు జ్వరమని కొన్ని మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఇంతలో ఆమె సెలవులు పూర్తవడంతో తప్పనిసరై ఆ పరిస్థితిలోనే వెళ్లి ఉద్యోగంలో చేరింది. కొన్నిరోజుల తర్వాత ఫోన్ చేసి, "ఇప్పటికే నేను పది కేజీల బరువు తగ్గిపోయాను. సమస్య ఏమిటో అర్థం కావట్లేద"ని ఏడవడం మొదలుపెట్టింది. ఇక అక్కని చూసుకోవడానికి నాన్న తత్కాల్ టికెట్ తీసుకుని బెంగళూరు వెళ్లారు. ఇక్కడ నేను అమ్మను చూసుకుంటూ ఉండేదాన్ని. మేము విశ్వాసాన్ని కోల్పోకుండా, "బాబా! మాకు మార్గం చూపించండి. సమస్య ఏమిటో బయటపడేలా చూడండి" అని ప్రార్థించాము. అలా ప్రార్థించిన తరువాత బాబా కృపవలన తన ఊపిరితిత్తులలో ఒక లీటర్ ద్రవం చేరిందనీ, అందువల్లనే సమస్యలనీ బయటపడింది. ఆ సమస్యలతో తనకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. తను నిద్రపోలేకపోయేది, కనీసం కూర్చోలేకపోయేది, తిండి తినలేకపోయేది. కొంచెం తిన్నా వాంతి అవుతుండేది. చివరికి తను ఒక అస్థిపంజరంలా తయారైంది. తను పూర్తిగా శారీరకంగా, మానసికంగా చాలా బలహీనపడిపోయింది. తను ఫోనులో ఏడుస్తుంటే తట్టుకోలేక నాకు ఏడుపు వచ్చేసేది. అంత దారుణమైన పరిస్థితుల్లో బాబాకే శరణు అన్నాము. అక్క విషయంలో పరిష్కారం చూపమని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైటులో బాబాను అడిగితే, 'చిలుము సమర్పించమ'ని వచ్చింది. నేను చిలుము తీసుకుని వెళ్లి బాబా పాదాలవద్ద పెట్టి, అక్కని కాపాడమని ప్రార్థించాను. శ్రీసాయిసచ్చరిత్ర 50వ అధ్యాయంలో దురంధర్ ఆస్తమా వ్యాధిని బాబా చిలుముతోనే నయం చేశారు. తరువాత డాక్టరు, "సర్జరీ చేసి ఆ ద్రవాన్ని తొలగించాలి, అది చాలా నొప్పితో కూడుకున్నది" అని అన్నారు. నేను, "బాబా! ఆ నొప్పినుండి తనని మీరే కాపాడండి" అని ప్రార్థించాను. బాబా కృపతో డాక్టర్ సర్జరీ లేకుండా మందులిచ్చారు.

ఒకవైపు అమ్మ, మరోవైపు అక్క. ఆ పరిస్థితుల్లో జీవితం నరకంలా ఉండేది. కానీ ప్రతి చీకటిరాత్రి తర్వాత పగలు ఉంటుందనే ఆశతో, బాబాపై విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచాయి. "బాబా! మీరు ఏదైనా చేయగలరు" అని నిత్యం ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. దాదాపు రెండు, మూడు నెలలకి అక్క ఉపిరితిత్తులలోని ద్రవం ఎండిపోవడం మొదలుపెట్టింది. కొంచెం కోలుకోవడంతో నాన్న, అక్క ఇద్దరూ ఇంటికి వచ్చారు. అమ్మని, అక్కని ఇద్దరినీ సంతోషంగా ఉండేలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఊదీతోపాటు మందులిస్తూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. దాదాపు ఆరేడు నెలల తర్వాత 'మహాపారాయణ' మా జీవితాలలో కొత్త ఆశలు తీసుకొచ్చింది. అక్క ఊపిరితిత్తులలోని ద్రవం 70% ఎండిపోయింది. నిదానంగా మునుపటివలె తను బరువు సంతరించుకుంది. మళ్ళీ తననలా ఆరోగ్యంగా చూసిన ఆనందంలో నాకు కన్నీళ్లు వచ్చేసాయి. పరిమితికి మించిన సెలవులవలన దాదాపు తన ఉద్యోగం పోయిందనే అనుకున్నాం. కానీ, బాబా ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే ఇంకే ఆటంకాలు అడ్డురావు. తను మళ్ళీ ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు తనకి టీం లీడ్ గా ప్రమోషన్ కూడా వచ్చింది. అంతా బాబా అనుగ్రహం.

మరోవైపు అమ్మ కూడా క్రమంగా సాధారణస్థితికి వచ్చింది. దాదాపు సంవత్సరం కష్టకాలం తరువాత అమ్మ ముఖంపై నవ్వు చూసాము. ఆ సమయంలో నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అమ్మ ఇప్పటికీ మందులు వాడుతోంది, అయినప్పటికీ తన పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది.  ఇప్పుడు తను కూడా 'మహాపారాయణ'లో భాగమై పారాయణ చేస్తోంది.

సమస్యలు పెద్దవే కావచ్చు, కానీ మన బాబా కన్నా అవేమీ పెద్దవి కావు. సైన్సు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు బాబా ప్రవేశించి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. సమస్యల్లో ఉన్న మనల్ని బాబా ఎప్పుడూ విడిచిపెట్టరు. ఆయన ఎప్పుడూ తన భక్తులను మధ్యలో విడిచిపెట్టనని మాట ఇచ్చారు. ఆయన అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక్కోసారి చాలా ఆలస్యమైనట్టు కనబడుతున్నప్పటికీ ఆయన తప్పక కరుణిస్తారు. కష్టాలను ఎదుర్కొనే శక్తిని బాబా ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు. నాలుకపై ఆయన శక్తివంతమైన నామం సమస్యలను దూరం చేస్తుంది. "కష్టసమయంలో మీరు తోడుగా ఉండి, సమస్యలనుండి బయటపడేసినందుకు థాంక్యూ సో మచ్ బాబా!"

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo