సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీబాలాసాహెబ్ భాటే


సాయి మహాభక్త దివంగత శ్రీబాలాసాహెబ్ భాటే అలియాస్ పురుషోత్తం సఖారాం మరియు దివంగత శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ ఇరువురూ కళాశాలలో చదువుకునేటప్పటినుండి స్నేహితులు. భాటే కాలేజీ రోజుల్లో ఒక స్వేచ్ఛాజీవి. స్వతంత్రభావాలు కలిగి ఉండేవాడు. ముఖ్యంగా సంశయవాది. ప్రతి విషయాన్నీ అనుమానించేవాడు. అతనికి మతపరమైన విషయాలపట్ల, ఆధ్యాత్మిక విషయాలపట్ల అస్సలు ఆసక్తి ఉండేది కాదు. అతనికి ధూమపానం చాలా ఇష్టం. యథేచ్ఛగా పొగత్రాగుతుండేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, “ఈరోజు తిను, త్రాగు, రేపటిరోజు మనం చనిపోతాం!" అనేది అతని సిద్ధాంతం. అతని స్నేహితుడైన శ్రీ కాశీనాథ్ ఖండేరావ్ గార్డే హాస్యాస్పదంగా ఇలా వ్యాఖ్యానిస్తుండేవాడు: “యత్ర యత్ర భాటే, తత్ర తత్ర ధూమః” అని. అంటే, ఎక్కడ భాటే ఉంటాడో అక్కడ పొగ ఉంటుంది అని.
తరువాత భాటే మామల్తదారు అయ్యాడు. మంచి సమర్థత కలిగిన వ్యక్తి అని కలెక్టర్ అతన్ని బాగా ఇష్టపడేవారు. కొంతకాలానికి భాటే సుమారు 5 సంవత్సరాలపాటు (1904-1909) కోపర్‌గాఁవ్‌లో మామల్తదారుగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలో విద్యావంతులైన తన స్నేహితులు ఎవరైనా బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్తూ అతన్ని కలిసినప్పుడు, సాయిపట్ల వాళ్ళు చూపించే ప్రేమను, శ్రద్ధను చూసి, 'బాబా ఒట్టి పిచ్చిఫకీరు' అనీ, 'అమాయకులు ఆయనను వెర్రిగా పూజిస్తున్నారు' అనీ అనేవాడు. అందుకు అతని స్నేహితులు బాధపడి, "సాయిబాబాను ఒక్కసారి చూసి, అప్పుడు మాట్లాడమ"ని అనేవారు. ఆ మాట కూడా అతనికి నచ్చక వారిని అపహాస్యం చేసేవాడు. ఒక మారుమూల గ్రామంలోని పేద ఫకీరును సందర్శించడం తన గౌరవానికి తక్కువగా భావించాడతను. 

తరువాత 1909వ సంవత్సరంలో అతడు శిరిడీలో క్యాంప్ నిర్వహించడానికి వెళ్లి ప్రతిరోజూ సాయిబాబాను గమనిస్తూండేవాడు. ఐదవరోజు సాయిబాబా అతనిపై ఒక కాషాయవస్త్రాన్ని కప్పారు. ఆ క్షణంనుండి భాటేలో గొప్ప మార్పు చోటుచేసుకుంది. అతను ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలనుగాని, తన విధినిర్వహణను గాని పట్టించుకోలేదు. ఆరోజునుండి అతని లక్ష్యమొక్కటే - మరణించేవరకు శిరిడీలో సాయిసేవ చేసుకుంటూ ఉండాలని, బాబా సమక్షంలోనే తన జీవితాన్ని ముగించాలని. అలా అతడు శిరిడీలోనే స్థిరపడిపోయాడు. అతని భార్యాబిడ్డలు కూడా శిరిడీ వచ్చి నివసించసాగారు. 

అతడు తన నిత్యకర్మలను ఆచరిస్తూ బాబా సమక్షంలో ఉపనిషత్తులు పఠిస్తుండేవాడు. అప్పుడప్పుడు బాబా వాటిగురించి వివరించి చెప్తుండేవారు. అతనిలో వచ్చిన ఆ తీవ్రమైన మార్పుకు కారణమేమిటని గార్డే అడిగినప్పుడు భాటే, "సాయిబాబా నాపై కాషాయవస్త్రం వేసినప్పటినుండి నాకు క్రొత్త జన్మ ఎత్తినట్లయ్యింది. అప్పటివరకు ఉన్న ఆలోచనాసరళి స్థానే క్రొత్త ఆలోచనాసరళి చోటుచేసుకుంది. లౌకిక జీవితం దుర్భరమైంది. ముఖ్యంగా ఉద్యోగవిధుల గురించి ఆలోచన కూడా చేయలేకపోయాను" అని చెప్పాడు.

భాటే ఉద్యోగవిధులను వదలి శిరిడీలో ఉండిపోవడంతో అతని స్నేహితుడైన దీక్షిత్ చేత ఒక సంవత్సరంపాటు సెలవు కోరుతూ ఒక దరఖాస్తును వ్రాయించారు బాబా. దానిపై భాటేతో సంతకం చేయించి కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. అతనిపై మంచి అభిప్రాయం ఉన్న కలెక్టర్ అతడు మునుపటిస్థితికి రావొచ్చేమో చూద్దామనే ఉద్దేశ్యంతో ఒక సంవత్సరం సెలవును మంజూరు చేశాడు. ఆ సమయంలో ఒకసారి అతని పైఅధికారి శిరిడీ వచ్చినప్పుడు భాటేను కలిసి ఉద్యోగవిధులలో చేరమని అడిగినప్పుడు భాటే, "తనకు శిరిడీ విడిచి ఎక్కడికీ వెళ్లాలని లేదు" అని ఖండితంగా చెప్పాడు. 

సంవత్సరకాలం సెలవు పూర్తికావచ్చినా అతని వైఖరిలో మార్పు రాలేదు. తన గురువైన బాబాయందు అమితమైన ప్రేమను కలిగి ఉండేవాడు. అతని మనో వైఖరిని గమనించిన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ మరియు శ్యామాలు, 'ఇలా అయితే అతను తన కుటుంబాన్ని ఎలా పోషించుకోగలడ'నే ఆందోళనతో, అతనికి సహాయం చేయమని బాబాను అభ్యర్థించారు. బాబా వాళ్లతో, "ప్రత్యేకమైన కేసుగా పరిగణించి పెన్షన్ మంజారు చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఒక దరఖాస్తు వ్రాసి, భాటేతో సంతకం చేయించి పంపమ"ని చెప్పారు. నిజానికి భాటే కేవలం 13 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ విధులను నిర్వర్తించాడు. అందువల్ల పెన్షన్ పొందటానికి ఎటువంటి అర్హతా లేదు. కానీ బాబా కృపవలన అతని వైరాగ్యాన్ని గుర్తించిన కలెక్టర్ అతనిపై జాలితో నెలకు 30 రూపాయల పింఛను మంజూరు చేశాడు. ఆ కొద్దిపాటి పెన్షన్ డబ్బులతో కడు పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ అతని ముఖంలో దివ్యతేజస్సు ఉట్టిపడుతుండేది.

తరువాత కొంతకాలానికి మొదటిసారి శిరిడీ వచ్చిన హేమాడ్‌పంతుకి, భాటేకి మధ్య సాఠేవాడాలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ సమయంలో భాటే గురువు యొక్క ఆవశ్యకత గురించి, ప్రాపంచిక సమస్యలను అధిగమించడానికి, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి మనిషికి గురువు యొక్క మార్గదర్శకత్వం ఎంతైనా అవసరముందని గట్టిగా వాదించాడు. ఆ వాదనలతో అవతలివాళ్ళు సంతృప్తి చెందకపోయినప్పటికీ గురువుపట్ల అతనికున్న దృఢమైన విశ్వాసం, గురువుపట్ల అతనికున్న అవగాహన తెలుస్తుంది. బాబా కృపతో నాస్తికుడైన అతనిలో వచ్చిన గొప్ప మార్పుకు ఈ సంఘటన ఒక తార్కాణం.

అంత గొప్ప భక్తునికి కూడా ఏమారే క్షణాలుంటాయి కాబోలు! ఒకప్పుడు అతని కూతురు సాయిబాయి కోసం కాకాసాహెబ్ దీక్షిత్ మంచి పెండ్లిసంబంధం తీసుకుని వచ్చాడు. ఆ విషయం గురించి అతడు బాబాతో చెప్పగానే ఆయన, "అంతకంటే ఆమెను అప్పా అనే వంటవాడికి ఇవ్వడం మేలు!" అన్నారు. సమయం చూసుకుని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే బాబా చికాకుగా, "వాడికే ఇచ్చి చేసుకో పో, ఏడ్చుకో!" అన్నారు. తీరా ఆ వివాహం జరిపించాక, ఆరుమాసాలలో ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే భక్తులతో బాబా, "ప్రతివాడూ 'బాబా! నీకు తెలియనిది ఏమున్నది?' అంటాడేగాని, చెప్పినట్లు వినిచచ్చేవాడు ఎవడూ లేడు" అన్నారు.

1918 అక్టోబర్ 15న సాయిబాబా మహాసమాధి చెందారు. ఆయన అంత్యక్రియలలో భాటే ప్రధానపాత్ర వహించాడు. 13 రోజుల తరువాత అతడు ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్‌లతో కలిసి ప్రయాగ్ (అలహాబాద్) వెళ్లి గంగానది తీరాన మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేశాడు. ఒక సంశయవాదిగా బాబా గురించి తీవ్రమైన ఆరోపణలు చేసిన బాలాసాహెబ్ భాటే చివరకు బాబావైపు ఆకర్షితుడై ఆయనకు దృఢమైన భక్తుడయ్యాడు. బాబా సేవలో జీవితాంతం గడిపి, ఆయన కృపతో ఆధ్యాత్మిక పురోగతి కూడా సాధించాడు.

శ్రీబాలాసాహెబ్ భాటే కూతురు శ్రీమతి జానకీబాయి తంబే అలియాస్ శ్రీమతి సాయిమాయి(సాయిబాయి) తండ్రివలే మంచి భక్తిపరురాలు. ఆమెకు బాబాపట్ల అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె నిండు వైరాగ్యానికి, నిస్వార్థసేవకు ప్రతిరూపంలా ఉండే మహిళ. 1943 జనవరి 2వ తేదీన ఆమె తన స్థిరచరాస్తులన్నింటినీ సాయి సంస్థాన్‌కు రాసిచ్చింది. అంతేకాదు, సాయిసంస్థాన్‌ వారి ప్రసాదాలయంలో భక్తులకు వడ్డన చేస్తూ ఆమె చాలా సేవ చేసింది. అత్యంత ఉత్సుకతతో, శ్రద్ధతో చకచకా ఆమె చేసిన సేవ అందరి ప్రశంసలను పొందింది. ఆ సేవలో ఆమె తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేసేదికాదు. ఎందుకంటే, తాను చేసే ఆ సేవ సాక్షాత్తు సాయిబాబాకే చేస్తున్నట్లుగా భావించేది. ఎన్ని అసమానతలు ఉన్నప్పటికీ, భక్తుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన 'భోజన గృహాన్ని' సంతృప్తికరమైన రీతిన నిర్వహించిన ఘనత ఆమెకు దక్కుతుంది. ఆమెలా కృషిచేసి 'భోజన గృహాన్ని' నిర్వహించడం వేరెవరికీ సాధ్యంకాదని చెప్పవచ్చు.

దీక్షిత్, భాటే ఇరువురూ ఒకే సంవత్సరంలో శ్రీసాయి సన్నిధికి చేరుకున్నారు. ఇద్దరూ బాబాపట్ల అంకితభావంతో ఉంటూ భాగవతం వంటి గ్రంథాలు కలిసి పఠనం చేసేవారు. అన్నీ విడిచి సాయిని అంటిపెట్టుకుని ఉండిపోయిన భాటే అంటే దీక్షిత్‌కు ఎనలేని అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం భాటేతోనే ఆగలేదు, అతని కుటుంబంపై కూడా ప్రసరించింది. భాటే భార్యని 'భాభీ' అనీ, 'సాయిబా' అనీ ప్రేమగా పిలిచేవారు దీక్షిత్. పేదరికంలో అలమటిస్తున్న ఆ కుటుంబానికి అండగా నిలిచి వారి బాగోగులు చూసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే భాటే కుటుంబంపై కాకాసాహెబ్ దీక్షిత్ చూపిన ప్రేమ, కరుణ వెలకట్టలేనివి.

కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దర్శనం చేసుకున్నప్పటి నుండి ఎక్కువగా శిరిడీలోనే ఉంటూ ఉండేవాడు. ఆ కారణంగా అతని కుటుంబసభ్యులు కూడా శిరిడీ వచ్చి అతనితోపాటు ఉండేవారు. అతని పెద్దకొడుకు రామకృష్ణ(బాబు దీక్షిత్)ను శిరిడీలోని మరాఠీ పాఠశాలలో చేర్చారు. అదే పాఠశాలలో భాటే పెద్దకొడుకు(బాబు భాటే) కూడా చదువుతున్నాడు. పిల్లలిద్దరూ ఒకే వయస్సువారు, ఒకే తరగతి చదువుతుండేవారు. పాఠశాలలో ఇచ్చిన హోమ్‌వర్కును కలిసి చేసుకుంటూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. చావడిలో బాబా నిద్రించే రాత్రి ఈ పిల్లలిద్దరూ జరీ టోపీలు ధరించి బాబా యొక్క చోప్‌దారుల వలే చేతిలో ఒక కర్ర పట్టుకుని చావడి ప్రవేశద్వారం వద్ద నిలబడి, సెల్యూట్ చేస్తూ, "ఇక విశ్రాంతి తీసుకోండి మహారాజా" అని అనేవారు.

పిల్లలిద్దరూ శిరిడీలో విద్యను పూర్తిచేశాక ఉన్నత చదువులకోసం నగరానికి వెళ్ళవలసి వచ్చింది. దీక్షిత్, భాటేతో సంప్రదించి తన భార్యతోపాటు పిల్లలిద్దరినీ ముంబైకి పంపారు. బాబుభాటేను తమ సొంతబిడ్డలా చూసుకునేవారు దీక్షిత్. ఆహారం, దుస్తులు వంటివి ఏవి తన కొడుకు బాబుకు ఇచ్చినా, వాటిని బాబుభాటేకు కూడా ఇచ్చేవారు. విల్లేపార్లేలోని వారి ఇంటిలోకి తరచూ తేళ్లు, పాములు చొరబడేవి. అందువలన పిల్లలిద్దరికీ ఇనుప మంచాలు కొని వేయించారు. పిల్లలిద్దరూ ముంబైలో పాఠశాల విద్యను పూర్తిచేశాక బనారస్ సెంట్రల్ హిందూ కళాశాలలో చేరారు. బాబుభాటే B.A. చదువు ఎంచుకోగా, బాబుదీక్షిత్ B.Sc. లో చేరాడు. ఇద్దరూ తెలివైనవారు, కష్టపడి చదివి మంచి గ్రేడ్‌లతో ఉత్తీర్ణులయ్యారు. తరువాత బాబుబాటే M.A., లా చేయాలనుకున్నప్పటికీ తన తండ్రి మరణంతో తన తల్లిని, తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత అతని భుజాలపై పడింది. తనకు విద్యను అందించిన కాకాసాహెబ్ దీక్షిత్‌ పట్ల కృతజ్ఞత కలిగివున్న అతను ఇంకా ఆయనపై భారం వేయడానికి ఇష్టపడక, పైచదువులు చదువుకోవాలనే ఆలోచనను వదిలిపెట్టి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. బ్యాంక్ అతనికి రూ.100/- జీతం ఇచ్చేది. ఆ కొద్దిమొత్తంతో అతను తన తల్లిని చూసుకుంటూ తమ్ముడిని చదివించాడు. బాబుభాటే కష్టపడి పనిచేసేవాడు, నిజాయితీపరుడు, బాధ్యతాయుతమైన వ్యక్తి. అతని తమ్ముడు పాఠశాల విద్యను పూర్తిచేశాక ఉన్నతవిద్యను అభ్యసించాలనుకున్నాడు. బాబుభాటే తన తమ్ముడి ఇష్టాన్ని కాదనకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఒక కళాశాలలో చేర్పించాడు. అతడు కాలేజీ చదువుతున్న సమయంలోనే ఒకసారి బాబుభాటే ఉద్యోగరీత్యా నాసిక్ వెళ్లి, అక్కడ కలరా వ్యాధి బారినపడి మరణించాడు.

Source(Source: Devotees’ Experiences of Sri Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji,Shri Sai Satcharitra by Late Shri.Govind Raghunath Dabholkar alias Hemadpant and Shri Sai Baba of Shirdi by Late Shri.Moreshwar W. Pradhan)

5 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼❤😊

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo