సాయి వచనం:-
'నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళు. నీకున్న భూ వివాదం పరిష్కారమవుతుంది. నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు!'

'జన్మకుండలిని చుట్టచుట్టి అవతల పారెయ్! జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు!' అన్న శ్రీసాయి, 'ద్వారకామాయి బిడ్డలను గ్రహాలేం చెయ్యగలవు?' అంటూ తన బిడ్డలైన భక్తుల మీద తన అనుగ్రహం తప్ప ఏ గ్రహాల ప్రభావమూ ఉండదని అభయాన్నిచ్చారు' - శ్రీబాబూజీ.

ఒక వృద్ధమహిళపై బాబా చూపిన కరుణ


అది 1914వ సంవత్సరం, శ్రీరామనవమి పండుగరోజు. బాబా దర్శనం చేసుకుని, తమ దండప్రణామాలు అర్పించుకోవడానికి సుమారు అరవై నుండి అరవైఅయిదు వేలమంది ప్రజలు శిరిడీకి  వచ్చారు. అంత జనాభాను నియంత్రించడానికి చిన్న, పెద్ద అధికారులతో ఒక పోలీస్ బృందం కూడా వచ్చింది. భక్తుల దర్శనార్థం వేకువఝామునుండి బాబా తమ ఆసనంపై కూర్చుని వున్నారు. ఉదయం 11 గంటల సమయంలో బాబా చుట్టూ ఉన్న భక్తులు, "బాబా అల్పాహారం చేయాలి, కాబట్టి వస్తున్న సందర్శకులను కాసేపు ఆపుచేయమ"ని పోలీసులని కోరారు. కానీ బాబా, "నాకు ఆకలి లేదు" అని అన్నారు. భక్తులంతా ఒకరినొకరు తోసుకుంటూ, పరుగెత్తుకుంటూ వచ్చి ద్వారకామాయిలోని బాబా దర్శనం చేసుకుంటున్నారు. అంతటా ఒకటే సందడిగా ఉంది. 

ఆ సమయంలో 60-65 ఏళ్ల వయస్సున్న ఒక వృద్ధమహిళ ద్వారకామాయికి కాస్త దూరంలో కూర్చుని, "దయాళువైన బాబా! కరుణించి నాపై ప్రేమపూర్వకమైన మీ దృష్టిని ప్రసరించండి" అని వేడుకుంటూ వుంది. శ్రీ R. A. తర్ఖడ్ జనసమూహం గుండా వెళుతుండగా ఆమె అరుపులు అతనికి వినిపించడంతో అతడు త్వరత్వరగా ఆమె వద్దకు వెళ్లి ఆమెను బాబా వద్దకు తీసుకునివెళ్లాడు. బాబాను చూసిన వెంటనే ఆమె ఎంతో ప్రేమగా ఆయనను స్పృశించింది. ఆమె కళ్ళనుండి కన్నీళ్లు ధారాపాతమయ్యాయి. తన్మయత్వంలో కొన్ని నిమిషాలపాటు అలాగే ఆమె మాట్లాడకుండా ఉండిపోయింది. అప్పుడు బాబా తమ వరదహస్తాన్ని ఆమె తలపై ఉంచి ఆమెను ఆశీర్వదించారు. తరువాత ఆమె మరియు ఆమె కుటుంబం యొక్క క్షేమసమాచారాలను అడిగి, "నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను. నాకోసం తినడానికి ఏమి తెచ్చావు?" అని అడిగారు బాబా. ఆమె, "బాబా! నేను మీకోసం ఒక రొట్టె, రెండు ఉల్లిపాయలు తీసుకుని వచ్చాను. కానీ సగందూరం వచ్చాక నేను చాలా అలసిపోయి, ఒక నదీప్రవాహం వద్ద కూర్చుని ఆకలికి తాళలేక సగం రొట్టె, ఒక ఉల్లిపాయ తినేశాను బాబా. సగం రొట్టె, ఒక ఉల్లిపాయ మాత్రం మిగిలివున్నాయి, దయచేసి వాటికి న్యాయం చేయండి బాబా" అని వేడుకుంది. బాబా వాటిని తీసుకుని, ఉల్లిపాయతో ఆ రొట్టెను ఆనందంగా తింటూ, "అబ్బ! ఎంత మధురంగా ఉన్నాయి ఇవి!" అన్నారు. తమ కళ్ళముందు జరుగుతున్న ఆ అద్భుత సన్నివేశాన్ని చూస్తూ, వారి సంభాషణను వింటున్న భక్తుల కన్నులు ఆనందభాష్పాలతో నిండిపోయాయి.

Source: 'శ్రీ సాయి ది సూపర్‌మాన్' - స్వామి సాయి శరణానంద.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo