సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 184వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. శ్రద్ధ, సబూరీ - బాబా చేసిన సహాయం
  2. ఎవరి అనుభవాన్నీ జడ్జ్ చేయకు!

శ్రద్ధ, సబూరీ - బాబా చేసిన సహాయం

ఈరోజు సాయిలీల ద్వైమాసపత్రిక జూలై-ఆగస్టు 2008వ సంచికలో వచ్చిన ఒక సాయి లీలని తెలుసుకుందాము.

మేము గుజరాత్ లోని తాపి జిల్లా సోన్‌గడ్ లో నివసిస్తున్నాము. గత పది సంవత్సరాలుగా మేము ప్రతి గురుపూర్ణిమకి శిరిడీ సందర్శిస్తున్నాము. ఒక సంవత్సరం జూలై 2న గురుపూర్ణిమ వచ్చింది. అంతకు కొద్దిరోజుల ముందే మా అమ్మాయి వివాహం అయింది. తన అత్తవారిల్లు నాసిక్ లో ఉంది. ముందుగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని తరువాత తనని అత్తవారింట్లో దింపివద్దామని మేము అనుకున్నాము. కాబట్టి జూలై 1వ తేదీ రాత్రి నేను, నా భార్య, కూతురు ముగ్గురం కలిసి బస్సులో శిరిడీ ప్రయాణమయ్యాము. మా అమ్మాయి తన విలువైన పట్టుచీరలు, నగలు మొదలైనవన్నీ ఒక బ్యాగులో సర్దుకుంది. వాటి విలువ 75,000/- రూపాయల దాకా ఉంటుంది. బస్సు అంతా ప్రయాణీకులతో బాగా క్రిక్కిరిసి ఉండటంతో కూర్చోవడానికి చోటులేదు. అందువలన బ్యాగులన్నీ నా కాళ్ళవద్దే ఉంచుకుని నిలబడ్డాను. కొంతసేపటికి నా భార్యకు, అమ్మాయికి సీట్లు దొరకడంతో వాళ్ళు సీట్లలో కూర్చున్నారు, నేను మాత్రం నిలబడే ఉన్నాను. తెల్లవారుఝామున గం.3.30ని.కి బస్సు మన్మాడ్ చేరుకున్నాక నాకు సీటు దొరికింది. సీటులో కూర్చున్న వెంటనే నాకు బాగా నిద్ర పట్టేసింది. గంట తరువాత బస్సు ఏవలా చేరుకుంది. అక్కడ నలుగురైదుగురు ప్రయాణీకులు దిగారు. వాళ్ళ మూడు బ్యాగులు మా బ్యాగుల పక్కనే ఉండటంతో వాళ్ళు బస్సు దిగేటప్పుడు పొరబాటున తమ బ్యాగులతోపాటు మా అమ్మాయి బ్యాగు కూడా తీసుకుని దిగిపోయారు. గాఢనిద్రలో ఉన్న నాకు ఆ విషయం తెలియదు. కొంతసేపటికి బాబా కలలో కనిపించి, "బాబూ! నువ్వు నిద్రపోతున్నావు. మీ అమ్మాయి బ్యాగును ఇంతకుముందు దిగినవారు తమ బ్యాగులతోపాటు పట్టుకుని వెళ్ళిపోయారు" అన్నారు. నేను ఉలిక్కిపడి లేచి మా అమ్మాయి బ్యాగు కోసం చూశాను. కానీ బస్సు అంతా చీకటిగా ఉండి, నాకేమీ కనపడలేదు. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక కోపర్‌గాఁవ్ వచ్చింది. అప్పుడు డ్రైవరు లైట్లు వేశాడు. చూస్తే, మా అమ్మాయి బ్యాగు లేదు. అసలే బీ.పీ. పేషెంటునైన నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి నోట మాట రాలేదు. అందరూ ఇక ఆ బ్యాగ్ దొరకదని అన్నారు. కానీ నాకు బాబా మీద పూర్తి విశ్వాసముంది. వెంటనే కోపర్‌గాఁవ్ లో బస్సు  దిగిపోయి, ఏవలా వెళ్ళే బస్సు ఎక్కాము. సీటులో కూర్చుని కళ్ళు మూసుకుని మనసులో 'ఓం శ్రీసాయినాథాయ నమః' అని జపిస్తూ కూర్చున్నాను. కొద్దిసేపటికి బాబా, "అబ్బాయీ, భయపడకు. నీకు ఆ బ్యాగు దొరుకుతుంది" అని చెప్పి అదృశ్యమయ్యారు. బస్సు ఏవలా చేరుకునేటప్పటికి తెల్లవారింది. అక్కడున్న ఆటో డ్రైవర్లని తెల్లవారుఝామున 4.30 సమయంలో బస్సు దిగిన నలుగురైదుగురు ప్రయాణీకుల గురించి వాకబు చేశాను. వారిలో ఒకతను, రాత్రిపూట ఉండే ఆటోడ్రైవరును అడిగితే విషయం తెలియవచ్చని చెప్పి అతనిని పిలిచాడు. తను వారిని 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబే-వాడ్‌గాఁవ్ గ్రామానికి తీసుకుని వెళ్ళినట్లుగా చెప్పాడు. మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళమని నేను అతనిని అభ్యర్థించాను. అతను మమ్మల్ని వారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆటో హారన్ శబ్దం విని ఇంటిలోని వారు బయటకు వచ్చి, మేము ఏమీ అడగకముందే, "పొరపాటున మీ బ్యాగు తెచ్చేశామ"ని చెప్పారు. మేము "అందులో చాలా విలువైన వస్తువులున్నాయ"ని చెప్పగా, వాళ్ళు మా అమ్మాయితో, "అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోమ"ని చెప్పారు. అందులో అన్నీ సరిగా ఉన్నాయి. వాళ్ళు మాకు టీ ఇచ్చి, "మా పొరపాటు వలన మీకు కలిగిన ఇబ్బందికి మమ్మల్ని క్షమించండి" అని చెప్పారు. బాబా దయవల్ల మా బ్యాగు మాకు దొరికాక మేము శిరిడీ చేరుకున్నాము.

బాబా చెప్పిన శ్రద్ధ, సబూరీ మాటలు మా మదిలో మెదిలాయి.

"నమ్మకం, సహనం ఉన్నవారిని శ్రీహరి రక్షిస్తాడు" - ఓవీ.83 అ. 26 శ్రీసాయి సత్‌చరిత్ర.

పెద్ద కష్టంలో పడ్డ మమ్మల్ని బాబా రక్షించారు. ఆయన చేసిన దానికి  కృతజ్ఞతగా పదకొండు నెలలపాటు ప్రతి పౌర్ణమికి శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన దయవలన ఎటువంటి కష్టం లేకుండా 11 సార్లు శిరిడీ సందర్శించగలిగాను.

భగవత్ గంగాధర్ సోన్ వానె(అంభుర్నికర్)
సోన్ గడ్ ఫోర్ట్ పోస్ట్,
జనగాన్ రాం మందిర్ వద్ద,
తాపి జిల్లా,
గుజరాత్.

"ఎవరి అనుభవాన్నీ జడ్జ్ చేయకు!"

కెనడాకు చెందిన ఒక సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ జై సాయిరామ్! ముందుగా నా మదిలో వచ్చిన ఆలోచనలకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటూ, దయచేసి నా అహాన్ని, అజ్ఞానాన్ని తొలగించమని బాబాను వేడుకుంటున్నాను.

ఒకసారి నేను భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, ఒక భక్తుడు తన పర్సును పోగొట్టుకుని ఆందోళన చెందుతున్న అనుభవం నా కంటపడింది. మరుక్షణంలో నా మదిలో, 'పర్సు కోల్పోవడం వంటి చిన్న విషయాన్ని ఎవరు పోస్ట్ చేశారో! దానికై బాబాని బాధపెట్టడమెందుకో?' అని ఆలోచనలు వచ్చాయి. వెంటనే చదివానో లేక కొన్నిరోజుల తరువాత చదివానో స్పష్టంగా గుర్తులేదు గానీ, మరొక అనుభవాన్ని చదివాను. అందులో, "ఎవరి అనుభవమైనా చిన్నది, పెద్దది అని మనం అనుకోకూడదు, సాయిబాబా తన భక్తులందరినీ సమానంగా చూస్తారు" అని స్పష్టంగా చెప్పబడివుంది.

రోజులు గడిచిపోయాయి. ఒకసారి నా ప్రియమైన వ్యక్తి తన పర్సు కనపడటం లేదని నాతో చెప్పారు. అందులో బాబా ఫోటో, మా ఫోటోలు, లైసెన్స్, బ్యాంకు కార్డులు ఉన్నాయి. ఒక్కక్షణం నేనెంతో ఆత్రుత చెందాను. సాధారణంగా మేము దానిని పెట్టే బ్యాగులో, ఇంకా ఇతర చోట్లా వెతికాము కానీ దొరకలేదు. తక్షణమే గతంలో నేను చేసిన మూర్ఖత్వపు ఆలోచనలను గుర్తుచేసుకున్నాను. 'బాబాపట్ల ఒకరికుండే భావోద్వేగాలు, ప్రేమ వంటి విషయాల్లో నేనెలా తీర్పు చెప్పగలను?' అనే అపరాధ భావన నాలో కలిగింది. వాళ్ళు పోగొట్టుకున్న వస్తువు యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఏదేమైనా గాని ఎవరి విషయంలోనూ జడ్జ్ చేయకూడదనే గొప్ప పాఠాన్ని బాబా నాకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నారని నేను గ్రహించి, నా హృదయంలోనే, "గతంలో నేను చేసిన ఆలోచనలకు చాలా చింతిస్తున్నాన"ని బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. తరువాత ఆయన నామం తలచుకుంటూ ముందు వెతికిన అదే బ్యాగులో మళ్ళీ నా చేయి పెట్టాను. ఆశ్చర్యం! నా చేతికి తగిలిన మొదటి వస్తువు పర్సు! నేను వెంటనే నన్ను క్షమించినందుకు బాబాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇది దాదాపు ఒక సంవత్సరం క్రితం జరిగింది. అప్పటినుండి ఎపుడైనా ఎవరి విషయంలోనైనా తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ అనుభవమే నా మదిలో మెదులుతూ ఉంటుంది. ఇతరుల గురించి వారి వెనుక చెడుగా మాట్లాడకూడదని, ఎవరినైనా పైపైన చూసి తీర్పు చెప్పకూడదని నేను ప్రతిరోజూ ప్రయత్నిస్తూనే ఉంటాను. అందమైన సాయిలీల ఒక పాఠంగా మారిపోయింది. అది నా అహాన్ని ఆయనకు అర్పించేలా చేసి వినయంతో నడుచుకునేలా నన్ను ప్రోత్సహిస్తుంది. బాబా ప్రేమ మనకు ఇదే నేర్పుతుంది.

లోకాః సమస్తాః సుఖినోభవంతు.
ఓం శాంతి శాంతి శాంతిః.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo