సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - శ్రీ నాగేష్ ఆత్మారామ్ సావంత్


సాయిభక్తుడు శ్రీ నాగేష్ ఆత్మారామ్ సావంత్ మరాఠా కులానికి చెందినవాడు. అతడు సబ్‌ఇన్‌స్పెక్టరుగా పనిచేశాడు. ఇతను 1922 డిసెంబరులో సావంత్‌వాడీలో ఉన్నప్పుడు 'సాయిలీలా మ్యాగజైన్' చదవడం ద్వారా సాయిబాబా గురించి తెలుసుకున్నాడు. ఆ పత్రికలోని బాబా లీలలు అతనిని ఎంతగానో ఆకర్షించాయి. 1923 డిసెంబరు నెలలో ఒకరోజు అతని తలపై ఒక బల్లి పడింది. అది ఎంతో అశుభసూచకం. అప్పుడు అతని భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మహారాష్ట్రలోని మాల్వాన్ తాలూకా, పెందూర్‌లో నివాసముంది.

1924 జనవరిలో నాగేష్ శిక్షణ(ట్రైనింగ్) కొరకు నాసిక్‌లో ఉన్న పోలీస్ స్కూలుకి వెళ్ళాడు. ఆ శిక్షణ అతనికి నచ్చలేదు. అతనెప్పుడూ బాబా గురించే ఆలోచిస్తూ, ఆయనే తనని కాపాడతారని నమ్మి ప్రార్థిస్తుండేవాడు. తరువాత తన స్నేహితుడు శ్రీ పి.దేవ్ వద్ద నుండి ఒక బాబా చిత్రపటం తీసుకుని పూజించడం మొదలుపెట్టాడు. నాసిక్‌లో జరిగిన శాఖాపరమైన పరీక్షలో నాగేష్ విఫలమయ్యాడు. ఆ పరీక్షలో విఫలమైన వారికి సబ్‌ఇన్‌స్పెక్టర్ అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల, అతను సుమారు ఐదు సంవత్సరాలు తాత్కాలిక సబ్‌ఇన్‌స్పెక్టరుగా కొనసాగాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో అతను మళ్ళీ నాసిక్ వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. తాను పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా బాబా తనను శాశ్వత సబ్‌ఇన్‌స్పెక్టరును చేస్తారని అతను పూర్తి నమ్మకంతో ఉండేవాడు. అతడి నమ్మకం వృధా పోలేదు. 1929 జులైలో పోలీసుశాఖ ప్రత్యేక కేసుగా పరిగణించి, నాగేష్‌ను పరీక్ష నుండి మినహాయించి పర్మినెంట్ సబ్‌ఇన్‌స్పెక్టరుగా నియమించింది.

1924వ సంవత్సరం నుండి నాగేష్ ప్రతి విజయదశమికి శిరిడీ వెళ్లి సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. ఆ అలవాటు ప్రకారం అతను 1926లో శిరిడీ వెళదామనుకున్నాడు. అది మొహర్రం మాసమైనందువలన సాధారణంగా డిపార్టుమెంట్ సెలవు మంజూరు చేయదు. కానీ అతను ఎలాగైనా సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాలకు హాజరు కావాలని ఆత్రుతగా ఉన్నాడు. ఆ రాత్రి అతనికి బాబా కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా కొన్ని కాగితాలమీద సంతకం చేయడాన్ని అతను చూశాడు. దానినిబట్టి  సాయిబాబా తనను సెలవుకోసం దరఖాస్తు చేసుకోమని సూచిస్తున్నట్లుగా అతను భావించి, సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎటువంటి సమస్య లేకుండా సెలవు మంజూరైంది.

1929, ఫిబ్రవరిలో ముంబాయిలో హిందూ ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాగేష్ పరేల్ ప్రాంతంలో విధుల్లో ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి జ్వరం, తలనొప్పి వచ్చాయి. మరో విభాగం నుండి ఒక యూరోపియన్ పోలీస్ ఆఫీసర్ పరిస్థితిని గమనించడానికి అక్కడకు వచ్చాడు. అతను నాగేష్‌ను చూసి, "నీ ఆరోగ్యం సరిగా లేనట్లుంది" అని అన్నాడు. తరువాత అతను నేరుగా నాగేష్ యొక్క పోలీసు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి, నాగేష్‌కు మౌఖిక సెలవు మంజూరు చేయించి, ఆ స్థానంలో అతను అదనపు బాధ్యతలు తీసుకున్నాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు నాగేష్ ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇంటికి చేరుకున్నాడు. అతను అక్కడినుండి వచ్చిన తరువాత ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగి, ఆ అల్లర్లలో యూరోపియన్ ఆఫీసరును చంపివేశారని సుమారు ఒక గంట తరువాత నాగేష్‌కి తెలిసింది.

నాగేష్ అనారోగ్యం అలానే కొనసాగుతుండటంతో అతడు పోలీస్ హాస్పిటల్‌కి వెళ్ళాడు. వైద్యులు పరీక్షించి అతను టైఫాయిడ్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. సుమారు 17 రోజుల తరువాత ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కలలో నల్లని దుస్తులు ధరించి, తలకు నల్లని వస్త్రాన్ని కట్టుకున్న ఒక బలిష్ఠుడైన వ్యక్తి నాగేష్‌ను ఈడ్చుకుంటూ వెళ్ళసాగాడు. నాగేష్ "బాబా, బాబా" అని అరవడం ప్రారంభించాడు. మరుక్షణంలో తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి కనిపించి ఆ నల్లని మనిషితో పోట్లాడి, నాగేష్‌ను అతని బారినుండి కాపాడాడు. నాగేష్ "బాబా! దత్తమహరాజ్!" అని అరిచాడు. అకస్మాత్తుగా బాబా అతను పూజించే పటం నుండి బయటకు వచ్చి కొన్ని క్షణాల్లో అంతర్థానమయ్యారు. అప్పటికే ఆ నల్లని వ్యక్తి, తెల్లని వ్యక్తి అదృశ్యమయ్యారు. ఆ సమయంలో సబ్జా ఆకుల, అగరుబత్తీల పరిమళాన్ని నాగేష్ అనుభవించాడు. ఆ క్షణం నుండి అతనిని ఇబ్బంది పెడుతున్న జ్వరం తగ్గిపోయింది.

నాగేష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు, గ్రామంలో ఉన్న అతని తల్లికి కలలో ఎవరో కనిపించి, "భయపడవద్దు, నేను నీ కొడుకుని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాను" అని చెప్పారు. సరిగ్గా ఒక వారం తరువాత నాగేష్‌కు 3 నెలల సెలవు దొరకడంతో ఇంటికి వెళ్ళాడు.

అబ్బాసావంత్ అనే 44 సంవత్సరాల వయస్సున్న తన స్నేహితుని అనుభవం గురించి నాగేష్ ఇలా చెప్పాడు:

"అబ్బాసావంత్ ముంబాయిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండేవాడు. అతను మా ఇంటి సమీపంలోనే నివసిస్తుండేవాడు. అతను ఒక కొత్త చీర తీసుకొచ్చి, 'బాబా కానుక' అని చెప్పి తన భార్యకు ఇచ్చాడు. బాబా మీద నమ్మకం లేని ఆమె తన భర్తతో, "ఇది బాబా ఇచ్చిన బహుమతి అని మీరు అంటున్నారు. కానీ ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా కొన్నది?" అని అన్నది. ఆ రాత్రి చీరను ఆమె ఒక టేబుల్ మీద ఉంచింది. మరుసటి ఉదయాన్నే ఆమె లేచి చూసేసరికి టేబుల్‌పై ఉన్న కొత్త చీర మధ్యలో నిప్పు కణిక పెట్టినట్లుగా పై మడత నుండి క్రింది మడత వరకు కాలిపోవడంతో పనికిరాకుండా పోయింది. అప్పుడు ఆమె తన భర్తతో, "బాబా రేపు మరొక కొత్త చీర ఇస్తారేమో చూద్దాం" అని అన్నది. మరుసటిరోజు అతనికి అకస్మాత్తుగా కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అతను మరొక కొత్త చీర తీసుకుని తన భార్యకు ఇచ్చాడు".

సమాప్తం.

Source: Devotees Experiences of Sri Saibaba part II by Pujya Sri B.V.Narasimha Swamiji

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. ఓం సాయి రామ్🙏💐🙏

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏❤😊

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo