సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 269వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అడుగడుగునా బాబా తోడుగా ఉండి నన్ను నడిపించారు

నందివెలుగు నుండి సాయి భక్తుడు సాయి సుమన్ బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.

నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. కొన్ని కారణాల వల్ల గతేడాది నేను ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు. నేనెప్పుడు నా ఉద్యోగ విషయం గురించి బాబాని అడిగినా "నిశ్చింతగా కూర్చో!" అని సమాధానం వస్తుండేది. కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిలకడగా ఉండలేకపోయేవాడిని. అంతలో నాకు శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. శిరిడీ వెళ్లి వచ్చాక బాబా కృపతో మంచి ఉద్యోగం వస్తుందని నేను, నా మిత్రులు ఆశించాం. కానీ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించలేదు. దానికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టి మనశ్శాంతి కరువైపోయింది. దాంతో నా గురువైన సాయినాథునిపై కూడా తగిన శ్రద్ధ పెట్టలేకపోయాను.

ఇలా రోజులు గడుస్తూ ఉండగా 2019, సెప్టెంబరు నెలలో బాబా దయతో నాకు తెలిసినవాళ్ళ ద్వారా వ్యాపారానికి సంబంధించిన ఒక ప్రతిపాదన వచ్చింది. నాకు వెంటనే సచ్చరిత్రలోని దామూ అన్నా ఉదంతం గుర్తుకు వచ్చింది. దామూ అన్నాకి తన స్నేహితుని ద్వారా వ్యాపార ప్రతిపాదన వచ్చినప్పుడు, అతడు శ్యామాకు ఉత్తరం వ్రాసి బాబా అభిప్రాయాన్ని తెలియజేయమని అడుగుతాడు. అలాగే, ఏ విషయంలో అయినా బాబాని అడిగి ముందుకు వెళ్లే అలవాటున్న నేను కూడా బాబా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అనుకున్నాను. బాబా నాకు ప్రసాదించిన మంచి ఆధ్యాత్మిక మిత్రుడు సురేష్‌కి ఈ విషయాన్ని చెప్పి, బాబా అభిప్రాయం ఏమిటో తెలుసుకోమని అడిగాను. తను బాబాని అడిగినప్పుడు బాబా నుండి సానుకూలమైన సమాధానం వచ్చింది. అది తెలిసిన వెంటనే నేను నా మనసులో,  "బాబా! నా అంతట నేను ఏదీ చేయలేనివాడిని. అలాంటి నేను మీ ఆదేశంతో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాను. దానికి తగిన శక్తియుక్తులు లేనివాడిని. కాబట్టి మీరే నాకు తోడుగా ఉండి, ముందుకు నడిపించాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విని అడుగడుగునా నాకు తోడుగా ఉండి నడిపించారు.

ముందుగా వ్యాపారం కోసం విజయవాడలో ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకున్నాము. కానీ అక్కడ అద్దెలు ఎక్కువగా ఉండటం, మరికొన్ని ఇతర కారణాల వలన ఇల్లు దొరకలేదు. అప్పుడు వ్యాపార ప్రతిపాదన తెచ్చినవాళ్ళు 'జంగారెడ్డిగూడెంలో అద్దెలు తక్కువగా ఉంటాయి, కాబట్టి అక్కడ ఇల్లు తీసుకోమ'ని సలహా ఇచ్చారు. అయితే, జంగారెడ్డిగూడెం అంటే బాగా దూరం అవుతుంది, తెనాలి అయితే దగ్గరగా ఉంటుందని నాకు అనిపించింది. అయితే ఈ రెండింటిలో ఏ ఊరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోయాను. దాంతో నిర్ణయం కోసం మళ్ళీ సురేష్ ద్వారా బాబాని అడిగించాను. నేను ఆ మాట చెప్తూనే సురేష్ తన మనసులో యథాలాపంగా, "తెనాలి ఓకే అంటే శిరిడీ ప్రత్యక్ష ప్రసారంలో బాబా తెలుపు రంగు దుస్తుల్లో ఉండాలి" అనుకున్నాడు. అంతే! మరుక్షణంలో ప్రత్యక్ష ప్రసారం చూస్తే బాబా తెలుపురంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. అలా వెంటనే బాబా మాకు సమాధానమిచ్చారు. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, తెనాలిలోనే ఇల్లు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను.

ఒకవైపు వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ పనులు చేస్తూనే తెనాలిలో ఇల్లు వెతకటం ప్రారంభించాను. ఒక ఇల్లు చూసి, అద్దె మొదలైన విషయాలన్నీ మాట్లాడుకున్న తరువాత కూడా ఏవో కారణాల చేత అడ్వాన్సు ఇచ్చి ఇల్లు ఖాయం చేసుకోవడంలో జాప్యం కాసాగింది. ఇల్లు ఖాయం చేసుకోకపోయినా మాట్లాడిన తేదీ నుండి అద్దె కట్టమని ఆ ఇంటి ఓనర్ పేచీ పెట్టాడు. మరోవైపు లైసెన్స్ విషయం కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. అంతలో మా బంధువుల ఇల్లు ఒకటి ఖాళీగా ఉందని తెలిసింది. అయితే ఆ ఇంటి వాస్తు అనుకూలంగా లేదని కొందరన్నారు. బాబా ఉండగా వాటి గురించి భయపడనవసరం లేదని తెలిసినా నేను ఆలోచనలో పడ్డాను. అయితే బాబా, "నన్ను నమ్ముకో! ఏ గ్రహాలు, వాస్తు ప్రభావాలు ఏమీ చేయలేవ"ని నాకు కొన్ని నిదర్శనాలు ఇచ్చారు. దాంతో నేను ఆ ఇంటిని ఖాయం చేసుకున్నాను. ఇదంతా బాబాయే నడిపించారు. ఒకవేళ నేను ముందు మాట్లాడుకున్న ఇంటికి అడ్వాన్సు ఇచ్చివుంటే నేను చాలా నష్టపోయి ఉండేవాడిని. అలా జరగకుండా బాబానే కాపాడారు. అందుకే మనం ఏ విషయంలో అయినా బాబానే నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది.

అక్టోబరు నెలలో వ్యాపారానికి సంబంధించిన సరుకు కొరకు ఆర్డర్ పెట్టాము. సరుకు వస్తుంది వస్తుంది అంటూనే ఆలస్యం కాసాగింది. అయినా నేను ఆందోళన చెందలేదు. ఎందుకంటే, నా బాబాకి ఎప్పుడు ఏది ఇవ్వాలో బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహిస్తారని సహనంతో వేచి ఉన్నాను. ఈలోగా నవంబరు నెల వచ్చింది. బాబా మళ్ళీ నన్ను శిరిడీకి పిలిచారు. నా స్నేహితులు శిరిడీ వెళ్తుంటే, వాళ్లతోపాటు నేను, నా తల్లిదండ్రులు శిరిడీ వెళ్ళాము. నాలుగు రోజులు చక్కటి దర్శనాలతో బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. శిరిడీ నుండి వచ్చిన కొన్నిరోజులకి సరుకు హైదరాబాదుకి వచ్చింది. (వ్యాపారానికి కొత్త కాబట్టి నేర్చుకునేందుకు మొదటిసారి సరుకును తెలిసినవాళ్ళ వద్దకు తెప్పించాము). మేము చేయాల్సిన పనులు పూర్తి చేశాము. ఇక ఆ సరుకును హైదరాబాదు నుండి విజయవాడలో ఉన్న అమెజాన్ గోడౌనుకి తరలించాల్సి ఉంది. అయితే ఎంత ప్రయత్నించినా ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ దొరకలేదు. అప్పుడు నేను "సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. వెంటనే అప్పటివరకు ఎంత ప్రయత్నించినా దొరకని ట్రావెల్స్ లిస్ట్ నా కంటిముందు కనిపించింది. అది కూడా ఆ లిస్టులో ఉన్న 'సాయిరాం మినీ ట్రావెల్స్' పైనే నా దృష్టి పడింది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. సరేనని వేరేవాళ్ళకి ఫోన్ చేశాము. అంతలో సాయిరాం ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. కానీ విషయం ఒక కొలిక్కి రాలేదు. దాంతో నేను, "ఏమిటి బాబా, మీరు చూపాక కూడా సమస్య అలాగే ఉంద"ని అనుకున్నాను. ఆ రాత్రి పడుకుని, మరుసటిరోజు ఉదయాన లేచాను. "ఈరోజు సాయంత్రానికల్లా సరుకు విజయవాడకి ఎలాగైనా చేర్చాలి బాబా. ఇప్పటివరకు ట్రావెల్స్ సెట్ కాలేదు, ఏమి చేయాలి బాబా?" అనుకున్నాను. మరుక్షణం ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే, సాయిరాం ట్రావెల్స్ నుండి ఫోన్. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. బాబా కృప చూడండి, అతను అతి తక్కువ మొత్తానికే (మిగతా ట్రావెల్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో దాదాపు సగానికి) సరుకు విజయవాడ చేర్చడానికి ఒప్పుకున్నాడు. ఇదంతా బాబా చలవే అని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఇక ట్రావెల్స్ వాళ్ళు ఎలాంటి డ్రైవరుని పంపుతారో అని టెన్షన్ పడ్డాను. "నన్ను నమ్మి, నా ధ్యానమందే ఎవరు ఉంటారో, వారి కర్మలన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను" అన్న చందంగా బాబా నా టెన్షన్ తీసేశారు. ట్రావెల్స్ వెహికిల్ వచ్చింది. మొట్టమొదటగా నా దృష్టిలో పడింది ఆ వెహికిల్‌లో ఉన్న బాబానే! బాబానే స్వయంగా వచ్చారు, ఇక నాకు టెన్షన్ ఎందుకని చాలా ఆనందించాను. సరుకంతా వెహికిల్‌లో ఎక్కించి మేము బయలుదేరాము. రైలు ప్రయాణంలో రేగే 'బాబా.. బాబా' అని చేసుకున్న ప్రార్థన గుర్తుకొచ్చి, నేను కూడా బాబా స్మరణ చేస్తూ, బాబా ధ్యాసలోనే ప్రయాణమంతా గడిపాను. సమయం తక్కువగా ఉంది, సాయంత్రానికల్లా విజయవాడ చేరుకోవాలని డ్రైవర్ భోజనానికి కూడా ఆపకుండా బిస్కెట్స్ మాత్రమే తీసుకుని డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చి బాబా ప్రేమకు కరిగిపోయాను. అసలు ఏమి జరిగిందంటే, ఉదయం నేను టిఫిన్ చేయడానికి వెళ్లి ఒక దోశ తిన్నాను. సాధారణంగా ఏదో ఒక్క ఐటం మాత్రమే తింటాను. అలాంటిది ఎందుకో నా హృదయం, "ఈరోజు నీకు మధ్యాహ్న భోజనం ఉండదు, కాబట్టి ఇంకా ఏదైనా తిను" అని చెప్తున్నట్లు అనిపించింది. ఎందుకిలా అనిపిస్తుంది అనుకుంటూనే నేను ఇడ్లీ కూడా తిన్నాను. తన బిడ్డ ఆకలికి తాళలేడని తెలిసిన బాబా ముందుగానే నా మనసులో ఆలోచన ఇచ్చి కడుపునిండా తినేలా చేశారు.

ఇక అసలు కథ ఇప్పుడు మొదలైంది. విజయవాడలో గోడౌన్ సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. మేము విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి 6.40 అయ్యింది. వ్యాపారంలో సహచరమిత్రులు ఫోన్ చేసి, "టైమ్ అయిపోయింది, గోడౌన్ మూసివేస్తారు. రేపటివరకు సరుకు ఎక్కడ పెడతావు? చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంద"ని అన్నారు. నేను చాలా ఆందోళనపడ్డాను. కానీ ఏ సమస్య వచ్చినా బాబానే నాకు దిక్కు. కాబట్టి వెంటనే మనసులో బాబా పాదాలు తలచుకుని, "బాబా! నీ ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. నీ అనుజ్ఞ ప్రకారమే నేను హైదరాబాదులో బయలుదేరాను. ఏ ఇబ్బందీ లేకుండా అంతా సజావుగా జరిగేటట్లు చూడండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత గోడౌన్ అడ్రెస్ సరిగా తెలియలేదు. ఎవరిని అడిగినా తెలియదనే చెప్తున్నారు. ఏమి చేయాలో అర్థం కాలేదు. అంతలో ఒక ముసలివ్యక్తి కనిపించాడు. 'ఆ ముసలాయనకు ఏమి తెలుస్తుందిలే' అని నేను నా మనసులో అనుకుని, నా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో అతనిలో ఉన్న బాబాను గుర్తించలేకపోయాను. చివరికి అతని ద్వారానే అడ్రెస్ తెలిసింది. మేము వెంటనే గోడౌన్ వద్దకు చేరుకున్నాము. గోడౌన్ తెరిచే ఉండటం చూసి నేను ఆనందం పట్టలేకపోయాను. అదంతా నా బాబా చలవే. మామూలుగా అయితే ఆరు గంటలకే మూసేసే వాళ్ళు, కానీ ఏవో కారణాలతో వాళ్ళకి ఆలస్యమై మేము చేరుకున్న సమయానికే వాళ్ళు బయటకి వస్తున్నారు. వాళ్ళు ఏమంటారో అని నేను టెన్షన్ పడ్డానుగానీ, లోపలకి అడుగుపెడుతూనే గయలో శ్యామాకు దర్శనమిచ్చినట్లు బాబా నాకు దర్శనమిచ్చారు. బాబాను చూస్తూనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బాబా దయవలన వాళ్ళు సరుకు దింపుకునేందుకు అనుమతించారు. తరువాత ఒక చిన్న సమస్య వచ్చిందిగాని, బాబాను ప్రార్థించిన వెంటనే సమసిపోయింది. ఇలా అడుగడుగునా బాబా నాకు తోడుగా ఉండి నడిపించారు.

అందరికీ నేను విన్నవించుకునేది ఏమిటంటే, మనం ఏపని చేస్తున్నా భారమంతా బాబా మీద వేసి శ్రద్ధ, సబూరీలతో ఉంటే ఆయన మన మీద అనుగ్రహవర్షాన్ని కురిపించడమే కాదు మనకు అండగా ఉంటూ మన పనులన్నీ సక్రమంగా జరిగేలా చేస్తారు.

జై సమర్థ సద్గురు సాయిబాబా!

5 comments:

  1. Akilandakoti brahmandanayaka rajadiraja Yogi rajadiraja parahbramha Sri sachchidananda sadguru sainath maharajuki jai. jai sairam

    ReplyDelete
  2. Inni rojula ga eduru chusa baba nee blessings kosam nuvvu palukuthunnav anukoina naa samasya gurinchi neeku antha telsu anukoina Kani eeroju ila jaruguthundhi Ani anukoledhu.....

    ReplyDelete
  3. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo