సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 261వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఊదీ ఎంతటి మహిమాన్వితమైనదో!
  2. సాయి కృపాశీస్సులు

బాబా ఊదీ ఎంతటి మహిమాన్వితమైనదో!

బళ్ళారి నుండి ఒక సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం! సాయిబంధువులకు నా నమస్కారాలు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బాబా ఊదీ ఎంతటి మహిమాన్వితమైనదో మనందరికీ తెలిసిన విషయమే. బాబా ఊదీ మహిమతో భక్తులు పొందిన అనుభవాలను ఈ బ్లాగులో నేను చాలాసార్లు చదివాను. ఇటీవల నా జీవితంలో జరిగిన బాబా ఊదీ మహిమను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా అమ్మకి రెండు సంవత్సరాల క్రితం కడుపునొప్పి రావడంతో తనను పరీక్షించిన డాక్టరు మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు. నొప్పి చాలా ఎక్కువగా వుండడం వలన ఆపరేషన్ చేసి ఆ రాళ్లను తొలగించారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు తను ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ నెల రోజుల క్రితం నుంచి అమ్మకి మరలా నొప్పి రావడం మొదలైంది. నొప్పి రావడం, తగ్గడం ఇలా రెండుసార్లు జరిగింది. నెలరోజుల్లోపలే మూడోసారి కూడా నొప్పి రావటంతో వెంటనే సిటీలోని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాలనుకున్నాము. కానీ నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల మా ఊరి ప్రక్కనే ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్ స్కానింగ్ చేసి, మూత్రపిండాలలో రాళ్లు ఉండటంవలనే నొప్పి వస్తోందని చెప్పి, అమ్మను అడ్మిట్ చేసుకుని ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. డాక్టర్ రెండు సెలైన్లు పెట్టి, "మూత్రపిండాలలోని రాళ్లు యూరిన్ ద్వారా పడిపోతాయి, అలా జరగకపోతే తరువాతి ట్రీట్‌మెంట్ చెయ్యాల"న్నారు. రెండు సెలైన్లు ఎక్కించాక కూడా అమ్మకి నొప్పి తగ్గలేదు. "అమ్మకి త్వరగా నయం చేయండి బాబా!" అని నేను బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. అమ్మని కూడా బాబాని ప్రార్థించుకోమని, అంతా బాబానే చూసుకుంటారని చెప్పాను. డాక్టర్ అమ్మకి ఎక్కువగా మంచినీళ్ళు ఇవ్వాలన్నారు. నేను మంచినీళ్ళలో బాబా ఊదీ వేసి అమ్మకి ఇవ్వసాగాను. సాయంత్రం అయ్యింది, అమ్మకి నొప్పి తగ్గలేదు. డాక్టర్ వచ్చి మరలా రెండు సెలైన్లు పెట్టారు. నేను, "బాబా! మా అమ్మకి నొప్పి తగ్గించండి. ఆపరేషన్ అవసరం లేకుండా రాళ్లను యూరిన్ ద్వారా పోయేలా చెయ్యండి బాబా! మీ ఊదీ మహిమను చూపించండి" అని బాబాను వేడుకున్నాను. "అమ్మకి నయమైతే నేను ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని కూడా బాబాతో చెప్పుకున్నాను. తరువాత బాబా తమ ఊదీ మహిమను చూపించారు. మా అమ్మకి ఆరోజు రాత్రి నుండి నెమ్మదిగా నొప్పి తగ్గడం ప్రారంభమై తెల్లవారేసరికి పూర్తిగా తగ్గిపోయింది. మరుసటిరోజు ఉదయం డాక్టర్ వచ్చి స్కానింగ్ చేసి మూత్రపిండాలలో నుండి రాళ్లు యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోయాయని చెప్పారు. ఎంతో సంతోషంతో బాబాకు మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబాకు చెప్పినట్లుగానే నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.

సాయి కృపాశీస్సులు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను చాలా సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నేను ఒక ఐటి కంపెనీలో పని చేస్తున్నాను. నేను యు.ఎస్.ఏ. లో వుండే భాగస్వాముల కొరకు రోజూ కొన్ని రిపోర్టులు రూపొందించాలి. అవి మా లీడర్ షిప్ టీమ్ కి వెళ్తాయి. ఒకరోజు నేను రిపోర్టులు తయారుచేసి ఇంటికి బయలుదేరాను. తీరా ఇంటికి చేరుకున్న తరువాత, నేను ఒక రిపోర్టును సరిగ్గా రూపొందించలేదని గ్రహించాను. సాధారణంగా మా భాగస్వాములు ఏ చిన్న పొరపాటు జరిగినా చెడామడా తిట్టేస్తారు. అది తలచుకుంటూనే నాకు భయమేసింది. వెంటనే నేను, "నాకు సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. బాబా ఆశీర్వాదం వల్ల నేను ఆ సంఘటన నుండి బయటపడ్డాను. వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

కొన్ని వారాల క్రితం నా కొడుకుకి చికెన్ పాక్స్ వచ్చింది. అది తగ్గాలని, నా కొడుకు ఎటువంటి బాధా అనుభవించకుండా చూడమని నేను బాబాను ప్రార్థించాను. తను 4 రోజుల్లో చికెన్ పాక్స్ నుండి కోలుకున్నాడు. సాధారణంగా చికెన్ పాక్స్ వచ్చిన వ్యక్తి అనుభవించే బాధను తను అస్సలు అనుభవించలేదు. "మమ్మల్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2482.html
 

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీ సాయి

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo