సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 256వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. పిలిస్తే బాబా వస్తారు
  2. బాబా కృపతో మా ఆభరణం మాకు దక్కింది

పిలిస్తే బాబా వస్తారు

సాయిభక్తురాలు సుచిత్ర తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

సాయిరామ్! ఈమధ్య మావారు బాబా మాల ధరించారు. 2019, డిసెంబరు 3న మేము భిక్ష ఏర్పాటు చేసి కొంతమంది భక్తులను ఆహ్వానించాము. ఇంకా మూడురోజులు ఉందనగా, నేను భిక్ష అయిపోయాక తాంబూలంలో బాబాకు ఇష్టమైన రెండు రూపాయలు పెట్టి దక్షిణగా సమర్పించుకుందామని అనుకున్నాను. కానీ రూపాయి నాణాలైతే దొరుకుతాయిగానీ, రెండు రూపాయల నాణాలు దొరక్కపోవచ్చు అని అనుకొని ఆ విషయాన్ని  పూర్తిగా మర్చిపోయాను. భిక్ష ఏర్పాటు చేసే రోజు వేకువఝామున 3 గంటలకి కలలో బాబా దర్శనమిచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తరువాత ఒక సాయిభక్తుడు షాపులన్నీ తిరిగి రూపాయి నాణాలు ఎక్కడా దొరకలేదని రెండు రూపాయల నాణాలే తీసుకొచ్చాడు. వాటిని చూడగానే మూడురోజుల క్రితం నేను అనుకున్న విషయం గుర్తొచ్చింది. 'సముద్రం లోతు కొలువవచ్చును కానీ, మనసు లోతు కొలువలేమ'ని చిన్నప్పటినుంచి విన్న సామెతలో చెప్పినట్లుగా, ఏ భక్తుని మనసులో ఏముందో బాబాకి తెలుసునని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

బాబాకు అలంకరణ జరుగుతున్న సమయంలో మావారు వచ్చి, "బాబాని ఇంటికి రమ్మని పిలిచావా?" అని అడిగారు. అయ్యో! మర్చిపోయానే అనుకొని నేను బాబా పటం ముందు కూర్చొని, "తండ్రీ! అందరికంటే ముందు నిన్ను పిలవాలి. కానీ మరచిపోయాను. అందుకు నన్ను క్షమించి, దయచేసి మా ఇంటికి రండి బాబా!" అని బాబాను పిలిచాను. తరువాత భిక్ష చాలా బాగా జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు వచ్చారు. 

ఆరోజు రాత్రి 10.30 సమయంలో మావారు నాతో, "బాబా ఏ రూపంలో మన ఇంటికి వచ్చారో స్వప్నంలో చూపించమని బాబాని అడుగు" అన్నారు. నేను, "ఏమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? బాబాను భిక్షకి పిలవడం, పైగా ఏ రూపంలో వచ్చారో అడగటం ఏమిటి?" అనుకున్నాను. అయినా ఆయన మాట కాదనలేక నేను బాబా ముందు కూర్చొని ప్రార్థించి నిద్రపోయాను. ఆ రాత్రి స్వప్నంలో బాబా ఒకామెను చూపించారు. నిజానికి నేను ఆమెను భిక్షకు ఆహ్వానించేందుకు ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. ఆమె వేరే భక్తురాలి ద్వారా తెలుసుకొని బాబాకి అభిషేకం చేస్తున్న సమయంలో వచ్చింది. ఆమె మధ్యాహ్నం ఆరతి పూర్తయిన వెంటనే, ఎందరు ఉండమని చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. ఆమె రూపాన్నే బాబా స్వప్నంలో చూపించారు. ఆమె రూపంలో బాబా మధ్యాహ్న ఆరతి తీసుకొని వెళ్లారని మాకు చాలా సంతోషం కలిగింది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ! ఆమెకు సంతానం లేదు. తను మీకు మంచి భక్తురాలు. తనకు సంతానాన్ని ప్రసాదించండి". 

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.

బాబా కృపతో మా ఆభరణం మాకు దక్కింది

యు.ఎస్.ఏ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేను నా చిన్నతనం నుండి సాయిభక్తురాలిని. ఒకసారి మా అమ్మగారిని తన సహోద్యోగి, "నేను ఒక పార్టీకి వెళ్లాల్సి ఉంది, మీ బంగారుహారాన్ని ఇస్తే రేపే తిరిగి ఇచ్చేస్తాను" అని అడిగింది. ఆమె అమ్మకు 6 సంవత్సరాలుగా పరిచయం ఉన్నందున, ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉన్నందున అమ్మ తన 4 లక్షల విలువ గల బంగారు ఆభరణాన్ని ఆమెకిచ్చింది. తరువాత మూడురోజులు గడిచిపోయినా ఆమె హారం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో మా అమ్మ ఆందోళన చెంది హారం గురించి ఆమెను అడిగింది. అందుకావిడ కొంతసేపు వాదించి, అది అసలు బంగారు ఆభరణం కాదని అన్నది. పైగా, "నేను దాన్ని పోగొట్టుకున్నాను, దానికి బదులు డబ్బు కూడా ఇవ్వను" అని మొరటుగా చెప్పింది. ఆ మాటలతో అమ్మ మనసు పూర్తిగా విరిగిపోయింది. ఆ మొరటు మహిళతో ఏం మాట్లాడాలో తనకి తెలియక అక్కడినుండి వచ్చేసింది. తరువాత నాకు ఫోన్ చేసి బాధపడుతూ విషయాన్ని  చెప్పింది. నేను అమ్మతో, "బాధపడకు, నేను బాబాని ప్రార్థిస్తాను, ఆయన చూసుకుంటారు" అని చెప్పాను. మరునిమిషం నేను పూజగదిలోకి వెళ్లి, “బాబా! నా తల్లి తన సహోద్యోగికి సహాయం చేయడానికి తన హారాన్ని ఇచ్చింది. కానీ ఆ మహిళ నా తల్లిని మోసం చేస్తోంది. హారం ఆ మహిళ వద్దే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ హారం మాకు తిరిగి వచ్చేలా దయచేసి మీరే ఏదైనా చేయండి” అని బాబాను ప్రార్థించాను. అదేరోజు అద్భుతం జరిగింది. ఆరోజు సాయంత్రం ఆమె మా అమ్మ వద్దకు వచ్చి, తాను చేసిన తప్పు ఒప్పుకుని, అమ్మకు క్షమాపణలు చెప్పి హారాన్ని తిరిగిచ్చింది. ఆ వార్త తెలిసి నిజంగా నేను మూగబోయాను. అంత త్వరగా నా ప్రార్థనకు సమాధానం ఇచ్చినందుకు బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. హృదయపూర్వకంగా ప్రార్థిస్తే బాబా ఖచ్చితంగా సమాధానమిస్తారు. బాబా ఆమె మనసుని మార్చి సమస్యను పరిష్కరించారు. "బాబా! మరోసారి మీకు చాలా చాలా కృతజ్ఞతలు". 

6 comments:

  1. Sadguru sainathaya namaha sugar bhavat

    ReplyDelete
  2. great experiences. Jai Sairam

    In fact I am going thr a tough phase in my life for the last 8 months and fortunately only last month I could see this blog and ever since daily I am reading sai leelas and now I have become very bold and confident. pl note that my problems are not yet solved. There are still there. What I want to say is that his leelas gave me the needed strength to face the problems.

    I am sure that Sai will solve my problems also very shortly...

    Jai sai ram

    ReplyDelete
  3. Om sairam
    I am sure that Sai will solve my problems also very shortly

    ReplyDelete
  4. ఓం సాయి రామ్ 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo