సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాకామహాజని


 

లక్ష్మణ్ గణేష్ అలియాస్ కాకామహాజని సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతను ముంబాయిలోని విల్సన్ కాలేజీ సమీపంలో నివాసముండేవాడు. అతను మంచి కళాకారుడు. అతనికి ఒక స్వంత ఫోటో స్టూడియో ఉంది. అతను పొడవుగానూ, చక్కని ఆకృతితో అందంగానూ ఉండేవాడు. అతనెల్లప్పుడూ మహారాష్ట్ర పగడీ ధరించేవాడు. ఈ సాయిభక్తుని గురించి శ్రీసాయిసచ్చరిత్రలోని 12, 13, 27 మరియు 35 అధ్యాయాలలో ప్రస్తావించబడి ఉంది. ఇతను బాబా దర్శనానికి ఎప్పుడు వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు వంటి వివరాలు తెలియలేదు.

ఒకసారి కాకామహాజని గోకులాష్టమి ఉత్సవాలలో పాల్గొని వారంరోజులు శిరిడీలో గడపాలన్న ఉద్దేశ్యంతో ముంబాయి నుండి శిరిడీ ప్రయాణమయ్యాడు. అతను గోకులాష్టమి ముందురోజున శిరిడీ చేరుకున్నాడు. అతను బాబా దర్శనానికి వెళ్ళగానే బాబా అతనితో, "నువ్వు ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్తావు?" అని అడిగారు. ఆ మాటలు వింటూనే అతను ఆశ్చర్యంతో, "దర్శించుకున్న మరుక్షణమే బాబా ఇలా ఎందుకు అడుగుతున్నారు?" అనుకుని కాస్త వెనక్కి తగ్గాడు. కానీ బాబా అడిగినదానికి ఏదో ఒక సమాధానం ఇవ్వవలసి ఉండటంతో, "మీరెప్పుడు అనుమతిస్తే అప్పుడు నేను ఇంటికి తిరిగి వెళ్తాను" అని బదులిచ్చాడు. అతను చెప్పేది పూర్తి కాకముందే, "రేపు వెళ్ళు" అన్నారు బాబా. మరుసటిరోజు గోకులాష్టమి. ఆ ఉత్సవాలలో పాల్గొనాలని అతనెంతగానో ఆశపడ్డప్పటికీ బాబా ఆజ్ఞను శిరసావహిస్తూ, వారి పాదకమలాల వద్ద సాష్టాంగపడి సెలవు తీసుకుని ముంబాయికి ప్రయాణమయ్యాడు. కాకా ఇంటికి చేరుకుని, తరువాత తన కార్యాలయానికి వెళ్లేసరికి తన రాకకోసం తన యజమాని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుసుకున్నాడు. కారణం, కార్యాలయంలో పనిచేసే గుమాస్తా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో యజమానికి కాకా అవసరం ఎంతో ఉంది. అందుచేత యజమాని అప్పటికే కాకాను తిరిగి ముంబాయి రమ్మని శిరిడీకి ఒక లేఖ కూడా పంపించాడు. శిరిడీలో పోస్ట్‌మ్యాన్ కాకామహాజని గురించి విచారించి, అతను అప్పటికే శిరిడీ విడిచి వెళ్లిపోయాడని తెలిసి, ఆ లేఖను తిరిగి ముంబాయికి పంపించాడు. కాకామహాజని కార్యాలయం నుండి ఇంటికి చేరుకున్నాక ఆ లేఖ అతనికి అందింది.

ఒకసారి కాకామహాజని శిరిడీ వెళ్ళినప్పుడు అతను కలరా వ్యాధి బారినపడి తీవ్రమైన విరోచనాలతో చాలా బాధపడ్డాడు. సాయిబాబాకు భక్తుల బాధలు తెలుసుననే విశ్వాసంతో అతను తన పరిస్థితి గురించి బాబాతో చెప్పలేదు, ఔషధం కూడా తీసుకోలేదు. సాధారణంగా అతను బాబా చెంత కూర్చుని వారి పాదాలు ఒత్తుతుండాలని, ఆరతి సమయాలలో తప్పనిసరిగా మసీదులో బాబా చెంతనే ఉండాలని ఆరాటపడుతుండేవాడు. అయితే కలరా వ్యాధి కారణంగా ప్రతి ఐదు, పది నిమిషాలకు ఒకసారి కడుపులో కదలికతో అతను బహిర్భూమికి పరుగెత్తాల్సిన పరిస్థితి. అయినా అతను ఆరతిని వదులుకోదలచుకోలేదు. అందువలన అతను ఒక చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్లి, దాన్ని మసీదులో ఒక మూలన పెట్టి, ఆరతిలో పాల్గొంటుండేవాడు. కడుపులో కదలిక ఏర్పడిన ప్రతిసారీ పరుగున బహిర్భూమికి వెళ్లి వస్తుండేవాడు. ఇలా కొన్నిరోజులు కొనసాగింది. అతను నీరసించి పూర్తిగా అలసిపోయినప్పటికీ, బాబా తమంతట తాము తన బాధను నివారిస్తారని పూర్తి విశ్వాసంతో బాధను భరిస్తుండేవాడు. అతని పరిస్థితి సాయిబాబా దృష్టిని ఆకర్షించనట్లే ఉండేది. చివరికి అతని వ్యాధికి చికిత్స చేయాల్సిన సమయం వింతగా అరుదెంచి, బాబా ఆశీస్సులతో అతనికి నయమైంది.

ఒకరోజు భక్తులు సభామండపంలోని నేలను చదును చేయాలని నిర్ణయించారు. ఆరోజు బాబా లెండీ నుండి వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. కాకామహాజని వారి పాదాలొత్తుతూ కూర్చున్నాడు. నేల చదును చేసే పని ప్రారంభమైంది. ఒక వ్యక్తి గడ్డపారతో నేలను త్రవ్వడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం వింటూనే అకస్మాత్తుగా బాబా ఉగ్రరూపాన్ని దాల్చారు. వారి కనులు ఎర్రబడ్డాయి. "ఎవరు పారతో త్రవ్వుతున్నది? నేను వాళ్ళ వీపు బద్దలుకొడతాను!" అని భీకరంగా అరుస్తూ లేచి నిలబడి సటకాను చేతిలోకి తీసుకున్నారు. గడ్డపార పట్టుకున్న వ్యక్తి దాన్నక్కడే పడేసి పారిపోయాడు. మసీదులో ఉన్న భక్తులందరూ భయంతో పరుగుతీశారు. కాకామహాజని కూడా పరుగెత్తబోతుంటే బాబా అతని చేయి పట్టుకున్నారు. అతడు భయంతో వణికిపోతుంటే, "ఎందుకు పారిపోతున్నావు? ఇక్కడ నిలబడు" అన్నారు బాబా. అంతలో తాత్యా, లక్ష్మీబాయిషిండే అక్కడికి వచ్చారు. వాళ్ళని, ద్వారకమాయి వెలుపల నిలుచుని చూస్తున్నవారిని బాబా విపరీతంగా తిట్టారు. బాబా ఉగ్రరూపాన్ని చూసిన కొందరు ముంబాయి భక్తులు కంగారులో ఎక్కడివక్కడే వదిలి వాడాలోని తమ విశ్రాంతి గదులకు పారిపోయారు. అలా వాళ్ళు విడిచిపెట్టిన ఒక సంచిలో వేరుశెనగలు ఉన్నాయి. బాబా ఒకవైపు తిడుతూనే, మరోవైపు ఆ సంచిలో చేయిపెట్టి అందులోని వేరుశెనగలను తీసి, వాటిని నలిపి, పొట్టు తీసి మహాజని చేత తినిపించడం మొదలుపెట్టారు. మధ్యమధ్యలో తాము కూడా కొన్ని వేరుశనగలు తిన్నారు. దాదాపు ఆ సంచిలోని వేరుశెనగలు పూర్తయ్యాక బాబా అతనితో, "నాకు దాహం వేస్తుంది. కొంచెం మంచినీళ్లు తీసుకుని రా!" అన్నారు. అతను మంచినీళ్ళు తీసుకుని రాగానే తాము కొంచెం త్రాగి, అతని చేత కూడా త్రాగించారు. ఆ తరువాత బాబా మహాజనితో, "ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు. నీ వ్యాధి నయమైంది. పారిపోయిన భక్తులను తిరిగి తీసుకుని రా, ఆరతి సమయమవుతోంది" అని అన్నారు. అంతటితో కాకామహాజని వ్యాధి పూర్తిగా నయమైంది.

మరోసారి కాకామహాజని సోదరుడు గంగాధర్ పంత్ కడుపులో శూలనొప్పితో చాలా బాధపడ్డాడు. గంగాధర్ పంత్ శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించి, తన బాధను చెప్పుకుని నయం చేయమని బాబాను ప్రార్థించాడు. సాయిబాబా అతనిపై తమ కృపాదృష్టి సారించి, అతని కడుపుని తాకి, ఒక నిర్దిష్ట ప్రదేశంలో నొక్కి, "ఇక్కడ నొప్పి ఉందా?" అని అడిగారు. అతను ‘అవున’ని బదులిచ్చాడు. బాబా అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కడుపునొప్పి మాయమైంది.

కాకామహాజనికి 'ఏకనాథ భాగవతం' చదవడం అంటే చాలా ఇష్టం. అతనొకసారి ఆ పుస్తక ప్రతిని తీసుకుని శిరిడీ వెళ్ళాడు. నిజానికి ఆ పుస్తకాన్ని అతను తన మునుపటి శిరిడీ సందర్శనంలో బాబా వద్ద నుండి ప్రసాదంగా తీసుకున్నాడు. శ్యామా అతనిని కలిసినప్పుడు యాదృచ్ఛికంగా ఆ పుస్తకాన్ని చూసి, చదవడానికని దాన్ని తీసుకున్నాడు. తరువాత చేతిలో ఆ పుస్తకంతో శ్యామా మసీదుకు వెళ్ళాడు. శ్యామా చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి, "నీ చేతిలో ఉన్న ఆ పుస్తకం ఏమిటి?" అని అడిగారు బాబా. 'భాగవతమ'ని శ్యామా బదులిచ్చాడు. బాబా ఆ పుస్తకాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, దానిపై తమ దృష్టి సారించి తిరిగి అతనికి ఇచ్చారు. అప్పుడు శ్యామా 'ఆ పుస్తకం తనది కాదని, అది కాకామహాజనిదని, చదవాలన్న చిన్న కోరికతో దానిని అతని వద్ద తీసుకున్నాన'ని చెప్పాడు. కానీ బాబా అతనితో, "నేను ఈ పుస్తకాన్ని నీకు ఇచ్చాను. దానిని నీ వద్ద ఉంచుకో. అది నీకు ఉపయోగపడుతుంది" అని అన్నారు. కొన్నిరోజుల తరువాత కాకామహాజని మళ్ళీ శిరిడీ వచ్చినప్పడు మరో 'భాగవత' గ్రంథాన్ని తీసుకొచ్చి బాబా చేతిలో పెట్టాడు. బాబా దానిని తమ ప్రసాదంగా తిరిగి అతనికిచ్చి, "దీన్ని చాలా జాగ్రత్తగా నీవద్ద ఉంచుకో. నిజంగా ఇది నీకెంతో ఉపయోగపడుతుంది, చాలా మేలు చేస్తుంది. దీనిని ఎవరికీ ఇవ్వకు" అని అన్నారు. కాకా ఎంతో పూజ్యభావంతో ఆ పుస్తకాన్ని అందుకుని బాబా పాదాలకు ప్రణమిల్లాడు. (శ్రీసాయిసచ్చరిత్ర, అధ్యాయం 27)

కాకామహాజనికి సన్నిహితుడైన ఒక వ్యక్తికి విగ్రహారాధన పట్ల నమ్మకం ఉండేదికాదు. అతను నిరాకార ఆరాధనలో భక్తిప్రపత్తులు కలిగి ఉండేవాడు. ఒకసారి అతను శిరిడీ వెళ్లాలని ఎంతో ఆరాటపడ్డాడు. అందువలన అతను కాకామహాజనితో, "నేను కేవలం సాధుసత్పురుషుల దర్శన నిమిత్తం శిరిడీ వస్తాను. కానీ నేను బాబాకు నమస్కరించను, దక్షిణ సమర్పించను. ఈ రెండు షరతులకు అంగీకారమైతే నేను మీతో శిరిడీ వస్తాను" అని అన్నాడు. కాకామహాజని అందుకు అంగీకరించాడు. వాళ్లిద్దరూ శనివారం రాత్రి ముంబాయి నుండి బయలుదేరి ఆదివారం ఉదయానికి శిరిడీ చేరుకున్నారు. తరువాత బాబా దర్శనం కోసం ఇద్దరూ మసీదుకు వెళ్లారు. కాకా మశీదు మెట్టుమీద అడుగుపెడుతుండగా, దూరాన ఉన్న అతని స్నేహితుని చూసి బాబా మధురమైన స్వరంతో, "నువ్వు ఎందుకు వచ్చావు? సరే, లోపలికి రా!" అని అన్నారు. ప్రేమపూర్వకమైన ఆ మాటలు విని అతను ఆశ్చర్యపోయాడు. బాబా మాటతీరు అతనికి మరణించిన తన తండ్రిని గుర్తుచేశాయి. తనలో తాను, "ఈ స్వరం నాకెంతో సుపరిచితం. ఇవి ఖచ్చితంగా నా తండ్రి మాటలే!" అని అనుకున్నాడు. అతని హృదయం ద్రవించిపోగా, బాబా ముందు సాష్టాంగపడకూడదన్న తన సంకల్పాన్ని విస్మరించి, తన శిరస్సును బాబా పాదాలపై ఉంచాడు. బాబా కాకామహాజనిని మాత్రమే దక్షిణ అడిగి తీసుకున్నారు. తరువాత ఇద్దరూ మసీదు విడిచి వెళ్లారు. తిరిగి ముంబాయి ప్రయాణమవడానికి నిర్ణయించుకుని బాబా అనుమతికోసం ఇద్దరూ మళ్ళీ మధ్యాహ్నవేళ మసీదుకి వెళ్లారు. బాబా కాకామహాజనినిని "పదిహేడు రూపాయల దక్షిణ ఇవ్వ"మని అడిగి తీసుకున్నారు. అతని స్నేహితుడిని మాత్రం బాబా దక్షిణ అడగలేదు. అందువల్ల అతను బాధపడి నెమ్మదిగా కాకాతో, "బాబా మిమ్మల్ని మాత్రమే దక్షిణ ఎందుకు అడుగుతున్నారు? ఉదయమూ మిమ్మల్నే దక్షిణ అడిగారు, ఇప్పుడు కూడా మిమ్మల్నే అడిగారు. నేను మీతోనే ఉన్నప్పటికీ బాబా నన్నెందుకు దక్షిణ అడగడం లేదు?" అని అన్నాడు. అందుకు కాకా, "స్వయంగా నువ్వే బాబాను అడుగు!" అని బదులిచ్చాడు. అంతలో బాబా, "అతను ఏం చెబుతున్నాడు?" అని కాకాను అడిగారు. అప్పుడు కాకా స్నేహితుడు తనంతట తానే, "నేను మీకు దక్షిణ ఇవ్వవచ్చా?" అని బాబాను అడిగాడు. అందుకు బాబా, "నువ్వు దక్షిణ ఇవ్వడానికి ఇష్టపడలేదు, అందుకే నిన్ను అడగలేదు. ఇప్పుడు నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు" అని అన్నారు. బాబా దక్షిణ అడగటాన్ని, భక్తులు దక్షిణ ఇవ్వటాన్ని తప్పుపట్టిన తన స్నేహితుడు, ఇప్పుడు తనంతట తానే “దక్షిణ ఇవ్వవచ్చా?' అని బాబాను అడగటం చూసి కాకామహాజని ఎంతో ఆశ్చర్యపోయాడు. బాబా ఇంత అని చెప్పకుండానే కాకామహాజని స్నేహితుడు కూడా వారి పాదకమలాల వద్ద పదిహేడు రూపాయల దక్షిణ ఉంచాడు. అప్పుడు బాబా అతనితో, "వెళ్ళడానికి తొందరెందుకు? వేచి ఉండు, కాసేపు కూర్చో" అని, "నిన్ను, నన్ను వేరుచేసే అడ్డుగోడను పడగొట్టు. అప్పుడు ఒకరినొకరం కలుసుకోవటానికి విశాలమైన మార్గం తెరుచుకుంటుంది" అని అన్నారు. కాసేపటి తరువాత వాళ్ళు శిరిడీ విడిచి వెళ్ళటానికి బాబా అనుమతి ఇచ్చారు. ఆ సమయంలో మేఘావృతమై ఉన్న ఆకాశాన్ని చూసి శ్యామా బాబాతో, "వీళ్ళు దారిలో వర్షంలో తడిసిపోతారు" అని అన్నాడు. కానీ బాబా, "వాళ్ళని వెళ్ళనివ్వు. దారిలో వర్షం పడుతుందేమోనని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

ఇద్దరూ బాబా పాదాలకు నమస్కరించి టాంగాలో బయలుదేరారు. బలమైన గాలులు వీస్తున్నాయి, ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లుతోంది. గోదావరి ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. పడవలో గోదావరిని దాటాల్సి ఉండటంతో ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా సాగుతుందో లేదో అని కాకా స్నేహితుడు ఆందోళన చెందాడు. కానీ బాబా మాటపై కాకాకు పూర్తి నమ్మకం ఉంది. బాబా అనుగ్రహంతో వాళ్ళు సురక్షితంగా నదిని దాటి ముంబాయి రైలు ఎక్కారు. వాళ్ళు రైలు ఎక్కిన మరుక్షణం భారీవర్షం కురవసాగింది. బాబా అనుగ్రహం వలన ఇద్దరూ సురక్షితంగా ముంబాయి చేరుకున్నారు. కాకా స్నేహితుడు తన ఇంటికి చేరుకుని తలుపులు, కిటికీలు తెరవగానే లోపల చిక్కుకున్న ఒక పిచ్చుక బయటకు ఎగిరిపోయింది. మరో రెండు పిచ్చుకలు మాత్రం చనిపోయి కనిపించాయి. అప్పుడతను, ‘పారిపోయిన పిచ్చుకను కాపాడాలనే ఆరాటంతో బాబా తమకు అదేరోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చార’ని భావించాడు. ఇదిలా ఉంటే, అతను శిరిడీ దర్శనానికి కొన్ని నెలల ముందునుండి కాలిమడమనొప్పితో బాధపడుతున్నాడు. ఆశ్చర్యంగా, శిరిడీ నుండి తిరిగి వచ్చిన కొద్దిసేపట్లోనే ఆ నొప్పి పూర్తిగా అదృశ్యమైంది. అతనెంతో ఆనందంతో బాబా తనపై చూపిన అనుగ్రహానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

ముంబాయికి చెందిన న్యాయవాది ధరంసీ జెఠాభాయ్ ఠక్కర్‌కి పూర్వజన్మ సుకృతం కొద్దీ సాయిబాబాను దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. ఠక్కర్ సంస్థలో కాకామహాజని గుమస్తాగా పనిచేస్తుండేవాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా ఉండేవారు.  సెలవు దొరికిన ప్రతిసారీ కాకా శిరిడీ వెళ్లి సాయి సన్నిధిలో తన సెలవులను సద్వినియోగపరుచుకుంటుండేవాడు. ఎప్పుడు శిరిడీ వెళ్లినా అనుకున్న సమయానికి కాకా తిరిగి వచ్చేవాడు కాదు. తిరిగి రావడానికి సాయి అనుమతి ఇవ్వలేదని ఎనిమిదేసి రోజులు శిరిడీలోనే ఉండిపోతుండేవాడు. అందువలన ఠక్కర్, "ఈ సత్పురుషుల పద్ధతి ఏమిటి? ఈ ఆడంబరతను నేనొప్పుకోను" అని అనుకునేవాడు. అంతేకాదు, తాను గొప్ప సంపన్నుడినన్న అహంకారంతో, 'ఈ సత్పురుషులు కూడా ఇతర మానవులవంటివారే. అలాంటివారి ముందు ఎందుకు తలవంచాలి? అంధవిశ్వాసం మంచిది కాదు. కాబట్టి నేనే స్వయంగా చూసి నిర్ధారించుకుంటాను. ఈ విషయాన్ని నేరుగా సాయితోనే తేల్చుకుంటాను' అని ఠక్కర్ హోలీ సెలవులలో కాకామహాజనితో కలిసి శిరిడీ వెళ్లాలని అనుకున్నాడు. ఆ విషయం కాకామహాజనితో చెప్పి, "నువ్వు శిరిడీ వెళితే అక్కడే ఉండిపోతావు. ఈసారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేయాలి" అని చెప్పాడు. అందుకు కాకా, "అది నా చేతుల్లో లేదు" అని అన్నాడు. దాంతో ధరంసీ తనకు తోడుగా మరొకరిని వెంటతెచ్చుకున్నాడు. ముగ్గురూ కలిసి శిరిడీ ప్రయాణమయ్యారు.

దారిలో కాకామహాజని బాబాకు అర్పించడానికని గింజలున్న ద్రాక్షపండ్లు రెండు శేర్లు తీసుకున్నాడు. శిరిడీ చేరుకున్న వెంటనే వాళ్ళు బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్లారు. ఆ సమయంలో బాబా భక్తుడైన బాబాసాహెబ్ తర్ఖడ్ అక్కడే ఉన్నాడు. అతన్ని చూసిన ఠక్కర్ ఎంతో ఉత్సుకతతో, "మీరు ఇక్కడ ఏమి పొందారు? ఏది మిమ్మల్ని పదేపదే ఇక్కడకు వచ్చేలా చేస్తోంది?" అని అడిగాడు. అందుకు తర్ఖడ్, "నేను బాబా దర్శనం కోసం వచ్చాను" అని బదులిచ్చాడు. ఠక్కర్ మళ్ళీ అతనిని, "ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని నేను విన్నాను. అది నిజమేనా?" అని అడిగాడు. "అద్భుతాలను చూడటానికి నేనిక్కడికి రాలేదు. కానీ ఎవరి మనస్సులోనైనా ఏదైనా బలమైన కోరిక ఉంటే అది నెరవేరుతుంది" అని తర్ఖడ్ బదులిచ్చాడు. అంతలో కాకామహాజని బాబా వద్దకు వెళ్లి వారి పాదాలపై తన శిరస్సునుంచి నమస్కరించి తన చేతిలో ఉన్న ద్రాక్షపండ్లను బాబాకు సమర్పించాడు. బాబా వెంటనే ఆ ద్రాక్షపండ్లను అక్కడున్నవారికి పంచడం ప్రారంభించారు. ఇతర భక్తులతోపాటు ఠక్కర్‌కు కూడా ద్రాక్షపండ్లు ఇచ్చారు బాబా. ఠక్కర్‌కు గింజలున్న ద్రాక్షపండ్లు నచ్చవు. పైగా ద్రాక్షపళ్ళను కడగకుండా తినకూడదని డాక్టరు చెప్పాడు. అందువలన అతని మనస్సులో అనేక సందేహాలు తలెత్తాయి. అయినప్పటికీ అతను వాటిని తన నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలిని వేసి అపవిత్రం చేయరాదని తలచి గింజలను జేబులో వేసుకుంటూ తనలో తాను, "బాబా సత్పురుషులు, ఈ ద్రాక్షపండ్లు నాకిష్టం లేదని వారికి తెలియదా? బలవంతంగా నాకెందుకు ఇస్తున్నారు?" అని అనుకున్నాడు. ఈ ఆలోచన అతని మనసులోకి రాగానే బాబా అతనికి మరికొన్ని ద్రాక్షలు ఇచ్చారు. అతను అవి గింజలున్నవని వాటిని తన నోటిలో వేసుకోకుండా చేతిలో పట్టుకుని, వాటిని ఏమి చేయాలో తెలియక చాలా ఇబ్బందిపడ్డాడు. అంతలో బాబా, "వాటిని తిను!" అని అన్నారు. వారి ఆదేశం మేరకు అతను వాటిని నోటిలో వేసుకున్నాడు. వాటిలో గింజలు లేకపోవడంతో అతనెంతో ఆశ్చర్యపోయాడు. తనలో తాను, "ఈ సత్పురుషులకు ఏది అసాధ్యం? వారి శక్తి నిజంగా అద్భుతం! బాబా నా మనసు తెలుసుకున్నారు. అన్నీ గింజలున్న పండ్లే అయినా బాబా నా చేతికి గింజలు లేని మంచి పండ్లను ఇచ్చారు" అని అనుకున్నాడు. అతని అహం అంతరించి సత్పురుషులపట్ల అతని హృదయంలో ప్రేమ అంకురించింది. అయినా అతను తనకు కలిగిన అనుభవాన్ని మరోసారి ధృవీకరించుకోదలచి అక్కడే ఉన్న తర్ఖడ్‌ను, "మీ ద్రాక్షపళ్ళు ఎలాంటివి? గింజలున్నవా, లేక గింజలు లేనివా?" అని అడిగాడు. "గింజలున్న పండ్లే" అని తర్ఖడ్ చెప్పగా అతనికి మరింత ఆశ్చర్యం కలిగింది. అయినప్పటికీ మరోసారి బాబా సామర్థ్యాన్ని ధృవీకరించుకోవడానికి అతను తనలో తాను, "బాబా, మీరు నిజమైన సాధుసత్పురుషులైతే ద్రాక్షపండ్లను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి" అని అనుకున్నాడు. అతను ఇలా అనుకుంటున్న క్షణాన ఇతర భక్తులకు ద్రాక్షపండ్లను పంచుతున్న బాబా అకస్మాత్తుగా అక్కడితో ఆగి మళ్ళీ కాకా వద్దనుండి ద్రాక్షపండ్ల పంపిణీ ప్రారంభించారు. ఈ సంఘటనతో సాయిబాబా నిజమైన సత్పురుషులని ఠక్కర్‌కు పూర్తి నమ్మకం కలిగింది.

అక్కడే ఉన్న శ్యామా ఠక్కర్‌ని చూపిస్తూ, "బాబా! ఇతడు కాకా యజమాని" అని బాబాకు పరిచయం చేశాడు. అప్పుడు బాబా, "ఎవరు? అతనెలా కాకాకు యజమాని కాగలడు? కాకా యజమాని మరొకరు!" అని అన్నారు. బాబా మాటలు విన్న కాకామహాజని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. తరువాత బాబా ధుని వద్ద నిలబడి ఉన్న వంటవాడు అప్పా వైపు చూపిస్తూ, "ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నాకోసం కాదు. ఇదిగో! ఈ అప్పాపై ప్రేమతో శిరిడీ వచ్చాడు" అని అన్నారు. ఆ మాటలు విన్న ఠక్కర్ అమాంతం బాబా పాదాల మీద పడ్డాడు. తరువాత కాకా, ఠక్కర్ ఇద్దరూ వాడాకు తిరిగి వెళ్లారు.

మధ్యాహ్న ఆరతి తరువాత ఠక్కర్ తిరుగు ప్రయాణానికి సన్నద్ధమయ్యాడు. అప్పుడు ఠక్కర్ కాకామహాజనితో, “నేను బాబాను అనుమతిని అడగను. నీకు అవసరమైతే నువ్వు అడుగు” అని అన్నాడు. అప్పుడు శ్యామా, “కనీసం ఒక వారమైనా పూర్తికాకుండా బాబా కాకాకు అనుమతినివ్వరు. కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేం. కాబట్టి మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి” అని చెప్పాడు. తరువాత ముగ్గురూ బాబా వద్దకు వెళ్లి ముంబాయి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరగా బాబా ఒక కథను చెప్పనారంభించారు:

"చంచలబుద్ధిగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి శారీరక, మానసిక బాధలేవీ లేవు. కానీ లేని కష్టాన్ని ఆపాదించుకోవటం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తూ ఇక్కడా అక్కడా తిరుగుతాడు. అతని మనసుకు ప్రశాంతత లేదు. ఒక క్షణం భారాన్ని దించి, మరుక్షణంలో నెత్తిన పెట్టుకుంటాడు. అతను తన మనస్సును స్థిరంగా ఉంచుకోలేడు. అతని దుస్థితి చూసి దయతో నా హృదయం కరిగిపోయింది. నేను అతనితో, 'నీ మనస్సును స్థిరపరుచుకుని ఏదో ఒకదానిమీద పెట్టు. ఊరికే అనవసరంగా తిరగక మనస్సును ఒకచోట స్థిరంగా ఉంచుకోమ’ని చెప్పాను" అని అన్నారు. ఆ మాటలు ఠక్కర్ మనసులోకి చొచ్చుకునిపోయాయి. అవి తననుద్దేశించినవేనని, తద్వారా బాబా తనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారని అతను గ్రహించాడు. నిజమే! సిరిసంపదలు, గౌరవమర్యాదలతో అతనికెంతో వైభవమున్నా కూడా లేనిపోని దుఃఖాన్ని కల్పించుకుని, ఏ కారణం లేకుండానే ఎప్పుడూ దేనిగురించో చింతిస్తూ అనవసరంగా బాధపడుతుండేవాడు. అందువలన అతని మనసుకు శాంతిలేదు.

తరువాత ఠక్కర్‌తో కలిసి ముంబాయి తిరిగి వెళ్ళడానికి కాకామహాజనికి కూడా అనుమతినిచ్చారు బాబా. కాకామహాజని కూడా తనవెంటే బయలుదేరాలని ఠక్కర్ కోరిక. ఆ కోరికను కూడా తీర్చి, అతని మనసులోని అన్ని సందేహాలను తొలగించారు బాబా. 'బాబా నా మనసులోని విషయాన్ని గ్రహించారు. ఇది వారి సాధుత్వ లక్షణం. వారు గొప్ప సత్పురుషులు' అని అతను అనుకున్నాడు. వాళ్ళు బయలుదేరడానికి సిద్ధపడగా బాబా కాకాను పదిహేను రూపాయల దక్షిణ అడిగి, అతనితో, "నాకు ఎవరైనా ఒక రూపాయి దక్షిణగా ఇస్తే, నేను అందుకు బదులుగా వారికి లెక్కపెట్టి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్దనుంచి ఏదీ ఉచితంగా తీసుకోను. అలాగే, నేను అందరినీ దక్షిణ అడగను. ఆ ఫకీరు ఎవరిని చూపిస్తే వారివద్దే దక్షిణ తీసుకుంటాను. ఫకీరుకు ఋణపడివున్నవారినే నేను దక్షిణ అడుగుతాను. ఇచ్చినవారు దక్షిణ రూపంలో పుణ్యం నాటి, తరువాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరిసంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాలకోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడిచ్చినదే గనుక దానిని తిరిగి భగవంతునికివ్వడం వలన భక్తిజ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేమిటి? ఒకటి స్వీకరించి పదిరెట్లు ఇస్తున్నాను" అని అన్నారు. ఠక్కర్ తన మునుపటి సంకల్పాన్ని మరచి తనంతట తాను పదిహేను రూపాయల దక్షిణను బాబాకు సమర్పించాడు. తరువాత బాబా ఆశీస్సులను, ఊదీ ప్రసాదాన్ని తీసుకుని ముగ్గురూ ముంబాయి ప్రయాణమయ్యారు.

బాబా మహాసమాధి చెందిన తరువాత ఒకరోజు వేకువఝామున కాకామహాజనికి ఒక కల వచ్చింది. కలలో బాబా, “నువ్వు నిద్రపోతున్నావా? మేలుకో! నేను సమాధి చెంది ఇది 30వ రోజు” అని చెప్పారు. మహాజని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, ‘ఇదివరకే నెలరోజలు పూర్తయ్యాయి కదా!’ అని అనుకుంటూ క్యాలెండర్ తీసి రోజులు లెక్కించాడు. సరిగ్గా ఆరోజే 30వ రోజు! వెంటనే అతను పురోహితుని పిలిపించి పూజకు ఏర్పాటుచేశాడు. పూజారి శాస్త్రోక్తంగా బాబా పాదుకలకు అభిషేకం, పూజ చేశాడు. అనంతరం కాకామహాజని గొప్ప విందు కూడా ఏర్పాటు చేశాడు. ఆ విందుకు తన స్నేహితులను, బాబా భక్తులను ఆహ్వానించాడు. ఆ విధంగా బాబా మొదటి మాసికపూజ జరిగింది. తరువాత కూడా ముంబాయిలోని తన నివాసమందు అతడు ప్రతినెలా మాసికపూజ జరిపించాడు.

1923వ సంవత్సరంలో ‘శ్రీసాయిలీలా’ (మరాఠీ) పత్రిక మొదటి సంచిక వెలువడింది. దానికి సంపాదకుడిగా శ్రీకాకామహాజని వ్యవహరించారు.

శ్రీకాకామహాజని చివరిరోజులు:

తన చివరిరోజులలో శ్రీకాకామహాజని పక్షవాతానికి గురయ్యారు. దాంతో అతను తన వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చింది. తరువాత అతను మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని పంచగని దగ్గరలో గల వాయి గ్రామంలోని తమ పూర్వీకుల ఇంటికి చేరుకున్నాడు. అక్కడే అతను 1938వ సంవత్సరంలో తుదిశ్వాస విడిచాడు.

శ్రీకాకామహాజని కుటుంబ వివరాలు:

శ్రీకాకామహాజని కుటుంబ వివరాల విషయానికొస్తే, కాకామహాజని భార్యను అందరూ ‘కాకుబాయి’ అని పిలిచేవారు. ఆమె చాలా కలుపుగోలుగానూ, అందరితో సరదాగానూ మెలిగేది. కాకామహాజని ఆమెకు ఆంగ్లభాష నేర్పించారు. ఆమె ఆంగ్లం ఎంతో అనర్గళంగా మాట్లాడేది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కొడుకులు లేరు. వారి పెద్దకుమార్తె ప్రభావతిని బాబా ప్రేమగా ‘పిల్లా’ అని పిలిచేవారు. ఆమెకు శ్రీదినకరరావుతో వివాహమైంది. ఆ దంపతులిరువురు ప్రస్తుతం జీవించిలేరు. ఆ దంపతులకు ఒక కుమారుడు - జస్టిస్ పద్మాకర్ డి.మూలే. బాబా ఆశీస్సులతో అతను ఉజ్వలమైన జీవితాన్ని గడిపి మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా పదవీవిరమణ చేశాడు. అతను 2016, డిసెంబర్ 8న తుదిశ్వాస విడిచాడు.

కాకామహాజని రెండవ కుమార్తె సరోజిని. ఈమె బాబాతో ఆడుకుని, ఆయన ఒడిలో కూర్చున్న భాగ్యశాలి. బాబా ఆమెను ప్రేమగా 'మైనా' అని పిలిచేవారు. ఆమెకు శ్రీభాస్కరరావుతో వివాహమైంది. వివాహానంతరం ఆమె తన కుటుంబంతో ఇండోరులో నివాసముండేది. ఒకసారి ఆమె సాయిలీలా పత్రికకు సంబంధించిన రచయితల సమావేశానికి హాజరవడానికి శిరిడీ వెళ్లాల్సి వచ్చింది. 

ప్రయాణానికి ముందు ఒకరోజు ఆమెకు, ఆమె కుటుంబానికి తమ ఇంటివద్ద బాబా దర్శనమైంది. ఆరోజు ఉదయాన ఆ కుటుంబీకులకు, "సాయిబాబా దర్శనం చేసుకోండి" అని ఒక శక్తివంతమైన స్వరం వినిపించింది. ఆ మాటలు అన్నదెవరో చూడటానికి ఆమె, ఆమె కుటుంబం ద్వారం వద్దకు పరుగుతీశారు. అక్కడ 20, 25 సంవత్సరాల వయస్సున్న ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతను ఎరుపురంగు అక్షరాలతో 'సాయిరామ్' అని లిఖించబడి ఉన్న కాషాయరంగు వస్త్రాలు ధరించి చాలా అందంగా ఉన్నాడు. అతని చుట్టూ అద్భుతమైన ప్రకాశం ఉంది. అతని వద్ద శ్రీధబోల్కర్ రచించిన శ్రీసాయిసచ్చరిత్రతో పాటు బాబా ఫోటో ఉంది. శ్రీమతి సరోజిని ఆ యువకుడిని లోపలికి వచ్చి తన ఇంటిని పావనం చేయమని అభ్యర్థించింది. అతను లోపలికి వచ్చాడుగానీ కూర్చోవడానికి నిరాకరించాడు. వాళ్లంతా అతనికి నమస్కరించి 5 రూపాయలు దక్షిణగా సమర్పించారు. అతను దక్షిణ స్వీకరించడానికి నిరాకరిస్తూ, "నేను కేవలం దర్శనం ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. నాకు ఏ డబ్బులూ వద్దు" అని చెప్పాడు. సరోజిని దక్షిణ స్వీకరించమని ఎంతగానో పట్టుబట్టిన మీదట అతను డబ్బులు తీసుకోవడానికి అంగీకరించాడు. అతను 2 రూపాయలు మాత్రం ఉంచుకుని, మిగిలిన 3 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఆమె వాటిని బాబా ప్రసాదంగా భావించి సంతోషంగా తీసుకుంది. తరువాత ఆ యువకుడు బయలుదేరుతూ, "గురువారం శిరిడీలో మనం కలుద్దాం" అని చెప్పాడు. కొద్దిదూరం నడిచాక అతను అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. 

తరువాత ఆమె, "నేనేమీ చెప్పకుండానే నేను శిరిడీ వెళ్తానని, గురువారం అక్కడే ఉంటానని అతనికెలా తెలుసు?” అని ఆశ్చర్యపోయింది. తరువాత ఆమె శిరిడీ వెళ్లి, గురువారంనాడు కాకడ ఆరతి, మధ్యాహ్న ఆరతి సమయాల్లో ఆ జనసందోహంలో ఆ యువకుడికోసం వెతకసాగింది. కానీ అతనెక్కడా కనపడలేదు. అంతలో అనుకోకుండా ఆమె శ్రీసాయిబాబా పాలరాతి విగ్రహాన్ని చూసింది. బాబా (విగ్రహం) తల కదులుతూ కనిపించింది. ఆమె ఆశ్చర్యంతో మళ్ళీ చూసింది. బాబా(విగ్రహం) తమ తల ఆడిస్తూ, "అది నేనే, మనం మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాము" అన్నట్లు నవ్వుతున్నారు. ఆమె ఆనందంతో బాబాకు నమస్కరించుకుంది. ప్రస్తుతం సరోజిని దంపతులు జీవించిలేరు.

కాకామహాజని మూడవ కుమార్తె కుమారి శాంత. ఆమె అవివాహితురాలు. ఆమె చాలా చిన్నవయస్సులోనే మరణించింది.

సమాప్తం .......

Source: (Source: http://saiamrithadhara.com/mahabhakthas/kakasaheb_mahajani.html
Baba’s Vaani – His sayings and teachings compiled by Vinny Chitluri)
(రెఫ్: శ్రీసాయిలీలా పత్రిక. 4 జూలై, 1993 గురుపూర్ణి సంచిక)

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo