సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 544వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి దివ్యపూజ అనుభవాలు
  2. బాబా అనుగ్రహం

సాయి దివ్యపూజ అనుభవాలు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నేను రెండు అనుభవాలను పంచుకున్నాను. ఇది నా మూడవ అనుభవం. "ఇంత ఆలస్యంగా నా అనుభవాలను పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!".

దివ్యపూజ చేయాలని నా మనసులో బలంగా ఉన్నప్పటికీ అందరూ ఏవేవో చెప్పి భయపెట్టడం వల్ల ఎన్నోసార్లు మందిరంలో నాకు సాయి దివ్యపూజ పుస్తకాలను ఇచ్చినా నేను తీసుకోలేదు. అలా రెండు సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు ఎవరో పూజా విధానాన్ని కూడా తెలిపి, “నీ కష్టాలు తీరుతాయి” అని చెప్పి దివ్యపూజ పుస్తకం నాకు ఇచ్చారు. ఆ సమయంలో అది బాబా అనుగ్రహంలా తోచి ఆ పుస్తకం తీసుకున్నాను. 2019 మార్చి నెలలో మొదటిసారి దివ్యపూజ ప్రారంభించాను. అప్పుడు బాబా నాకు కొన్ని అనుభవాలు ప్రసాదించారు.
 
మొదటి అనుభవం :
 
మొదటి గురువారం పూజ ప్రారంభిస్తుండగానే ఒక ఆటంకం వచ్చింది. మనసుకి చాలా కష్టంగా అనిపించి ఎంతో ఏడ్చాను. చివరికి బాబా మీద భారం వేసి దివ్యపూజ ప్రారంభించాను. బాబా దయవలన పూజ సంతోషంగా సాగింది. రెండవవారం దివ్యపూజ పూర్తైన తరువాత సచ్చరిత్ర పుస్తకం మీద వెంకటేశ్వరస్వామి రూపం కనపడింది. బాబా నా పూజకు సంతోషించి ఇలా నిదర్శనమిచ్చారని చాలా సంతోషించాను. ఆ ఫోటోను ఈ క్రింద జతపరుస్తున్నాను, మీరు కూడా చూసి ఆనందించండి.
మూడవవారం పూజ యథావిధిగా జరిగింది. నాలుగవవారం పూజ పూర్తిచేసి ధూప్ స్టిక్ వెలిగించాను. ఆ వెలుగులో శివుడి ఆకారం బాబా ఫోటోపైన కనపడింది. ఆ ఫోటోను కూడా జతపరుస్తున్నాను, చూడండి.
చివరివారమైన ఐదవ గురువారంనాడు పూజ చాలా ఆడంబరంగా చేద్దామని అందరినీ ఆహ్వానించాను. యథావిధిగా పూజ చేస్తుండగా, ఎండాకాలం అయినప్పటికీ విపరీతమైన గాలి, వాన మొదలైంది. ఆ కారణంగా కరెంటు పోయింది. నేను ఆహ్వానించినవాళ్ళు వర్షం పడుతున్నందువలన పూజకు రాలేమని చెప్పేశారు. బాబా నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టారని బాధతో ఎంతో ఏడ్చేశాను. అయినా చేసేది లేక దివ్యపూజ ముగించి ఆరతి ఇస్తుండగా బాబా కృపవలన కరెంటు వచ్చింది. ఒక గంట తరువాత వర్షం కూడా తగ్గింది. అందరూ వచ్చి,  బాబాను దర్శించుకొని చాలా సంతోషించారు. తరువాత ప్రసాదాలు తీసుకొని తమతమ ఇళ్ళకు వెళ్లారు. బాబా నాపై ప్రేమతో వర్షాన్ని అపి, భక్తులను పంపి, ప్రసాదం తీసుకొని వెళ్లేలా చేశారని చాలా సంతోషించాను. ఇదంతా ఈ భక్తురాలిపై బాబా చూపిన అపారమైన అనుగ్రహం.

2019 జూలై-ఆగష్టులో రెండవసారి దివ్యపూజ చేసినప్పటి అనుభవం:

నేను తరచూ బాబా పూజ చేసిన తరువాత, బాబా ప్రశ్నలు & జవాబులు యాప్‌లో బాబా సందేశం కోసం చూసేదాన్ని. అలా చూసినప్పుడు దాదాపు ప్రతిసారీ, “బాబాని శ్రీరాముని అవతారంలో చూసుకో!” అని వచ్చేది. అందువలన మొదటివారం పూజలో వడపప్పు, పానకం బాబాకు సమర్పించాను. కాసేపటి తరువాత పూజామందిరంలో ఉన్న వడపప్పు, పానకం తీసుకొచ్చి, ఇంట్లో ఎవరూ లేరని వంటగదిలో ఉన్న బాబా క్యాలెండరు క్రింద పెట్టాను. అందరూ వచ్చాక ప్రసాదం స్వీకరిద్దామని చూస్తే, పానకం ఉన్న పాత్ర ఖాళీగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాను. బాబానే ఆ పానకాన్ని స్వీకరించి మొదటివారమే ఇలా ఆశీర్వదించారని చాలా సంతోషించాను. దివ్యపూజ పూర్తి కావస్తుండగా శిరిడీలో బాబా సేవకు పిలుపు వచ్చింది. బాబా కృపతో తొమ్మిది రోజులపాటు శిరిడీలో బాబా సేవ చేసుకునే అదృష్టం ప్రాప్తించింది.

2020 ఏప్రిల్-మే నెలల్లో మూడవసారి దివ్యపూజ చేసినప్పటి అనుభవం:

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మూడవసారి దివ్యపూజ చేశాను. యథావిధిగా మూడు వారాలు గడచిపోయాయి. మరుసటిరోజు శుక్రవారంనాడు పూజామందిరాన్ని శుభ్రంచేద్దామని బాబా ప్రక్కన ఉన్న స్టాండులో నుండి ఒక గుడ్డ తీస్తుండగా ప్రక్కనే రెండు వేపాకులు కనపడ్డాయి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, మా ఇంటి ప్రాంగణంలో అసలు వేపచెట్లే లేవు. నా జీవితంలోని చేదు(చెడు) రోజులను తొలగించి, మంచి రోజులని ప్రసాదించానని ఆ వేపాకుల ద్వారా బాబా నాకు నిదర్శనమిచ్చారని నేను చాలా సంతోషించాను. అంతా బాబా దయ. ఆయన అనుగ్రహం.

"బాబా! మీకు నా కృతజ్ఞఙ్ఞతలు. మీ ఆశీస్సులు ఎల్లవేళలా మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ!"

బాబా అనుగ్రహం

ఓం శ్రీ సాయిరామ్! నా పేరు సబిత. నేను మొదటసారిగా నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకుంటున్నాను.

మొదటి అనుభవం: 

ఈమధ్య నాకు, మావారికి, మా బాబుకి జ్వరం వచ్చింది. నాకు, మావారికి త్వరగానే జ్వరం తగ్గినప్పటికీ మా బాబుకి తగ్గలేదు. దాంతో కరోనా ఏమోనన్న భయంతో మేము చాలా కంగారుపడ్డాము. ఆ స్థితిలో, "బాబుకి జ్వరం తగ్గేలా చేయమ"ని బాబాను వేడుకున్నాము. బాబా దయవలన కొద్దిరోజుల్లోనే జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ బాబా, థాంక్యూ సో మచ్".

రెండవ అనుభవం:

ఆగస్టు 31న నేను పదవీ విరమణ చేశాను. నేను ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందోనని ఆందోళనపడి, 'అంతా సవ్యంగా జరిగేలా చూడమ'ని బాబాని వేడుకున్నాను. బాబా ఆశీస్సులతో నేను ఊహించని విధంగా నా పదవీ నిరమణ కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది. "థాంక్యూ బాబా! మీ దయవలన నా గ్యాస్ట్రిక్ సమస్య కొంతవరకు తగ్గింది. దానిని పూర్తిగా తగ్గిస్తారని ఆశిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా కరోనాకు వ్యాక్సిన్ వచ్చేలా అనుగ్రహించండి బాబా".

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.


8 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo