సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆదం దలాలి


ఆదం దలాలి బాంద్రాలోని ఎస్టేట్ బ్రోకర్. అతడు పూర్తిగా లౌకికమైన ప్రయోజనాల కోసం బాబాను ఆశ్రయించాడు. అతను ఖురాన్ ఎన్నడూ చదవలేదు, బాబాను కూడా ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలలో సలహా కోరలేదు. అతనికి చాలామంది కుమారులు ఉన్నారు. ప్రతిసారీ వీరిలో ఒకరి వివాహం చేయవలసిన సందర్భంలో దలాలికి నిధుల సమస్య వచ్చేది. ముస్లిం సంప్రదాయం ప్రకారం, పెళ్లికొడుకు తండ్రి నిధులను అందించాలి. కాబట్టి ప్రతి కుమారుని వివాహం సమయంలో సహాయం కోసం అతను బాబా వద్దకు వెళ్తుండేవాడు. ప్రతి సందర్భంలోనూ బాబా అతనిని, "ఇప్పుడు వెళ్ళి, మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు" అని ఆశీర్వదించేవారు. తిరిగి వచ్చాక వివాహం కోసం అతనికి మంచి బ్రోకరేజ్ లభించేది. కాబట్టి, ప్రతి కుమారుని వివాహ సందర్భంలో బాబా యొక్క ఆశీర్వాదాలు అతనికి అవసరమైన నిధులు ఇచ్చాయి.

ఒకసారి ఆదం దలాలి తన కుమారుని పెళ్లి చేసేందుకు ఎన్నోసార్లు బాబా అనుమతి అడిగాడు. అతడు అడిగిన ప్రతిసారి “అల్లా మాలిక్ హై” అని మాత్రమే బాబా సమాధానం ఇచ్చేవారు.  చివరికి 3 సంవత్సరాలు గడిచిన తరువాత 1913-14 లో పెళ్ళికి అనుమతినివ్వడమే కాక, తేదిని కూడా నిర్ణయించి ఆరోజున వివాహం జరిపించమని బాబా ఆదేశించారు. వారి కృపవలన సరిగ్గా అదే ముహుర్తానికి వివాహం జరిగింది.

ఒకప్పుడు తనఖా భవనం యొక్క విక్రయంలో ఒక బ్రోకర్ గా పనిచేయడంతో అతనిపై ఒక క్రిమినల్ కేసు పెట్టబడింది. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు నకిలీవి కావటం వలన ఆ కేసు పెట్టారు. పోలీసులు నిందితులలో మొట్టమొదట వ్యక్తిగా దలాలిని పేర్కొన్నారు. నిజానికి అతనికి ఆ పత్రాల గురించి ఏమీ తెలియదు. దలాలి బాబా దగ్గరకు వెళ్లి ఆయన సహాయాన్ని అర్థించాడు. బాబా "భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది" అన్నారు. అతడు టెండూల్కర్ మరియు శ్రీమతి టెండూల్కర్ ని కలసి తన తరఫున బాబాని ప్రార్థించమని వేడుకున్నాడు. ఆ తర్వాత బాబా దయవలన దలాలి ఆ కేసు నుండి బయటపడ్డాడు.

బాబా అప్పుడప్పుడు ఇతర రూపాల్లో ఆయన వద్దకు వచ్చి అతనిని పరీక్షించేవారు. ఒకసారి సాయి బ్రాహ్మణ రూపంలో దలాలి వద్దకు వచ్చి దక్షిణ అడిగితే, అతడు రెండు అణాలు ఇచ్చాడు. మరోసారి బాబా ఒక మర్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. అప్పుడు దలాలి అతనికి నాలుగు అణాలు ఇచ్చి, మార్వాడి హోటల్ కు వెళ్లి భోజనం చేయమని చెప్పాడు. తరువాత అతను షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నప్పుడు, బాబా అక్కడ ఉన్న భక్తులతో, "నేను ఇతని దగ్గరకి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్ కి వెళ్లి భోజనం చేయమన్నాడు" అన్నారు.

ముస్లింలు వారి ఆచారం ప్రకారం ఫోటోలను, విగ్రహాలను పూజించనప్పటికీ, అదం దలాలి తన ఇంటిలో బాబా యొక్క ఫోటోను పెట్టుకొని రోజూ అగరువత్తులు వెలిగించి పూజించేవారు.


8 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo