సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 152వ భాగం....


ఈరోజు భాగంలో:
  • నూనె లేని దీపాలు వెలిగించడం గురించి బాబా వివరణ

2002, జూలై 24న పవిత్రమైన గురుపూర్ణిమ పండుగ వచ్చింది. ఆరోజు తెల్లవారుఝామున మేఘశ్రీ కామత్ సాయిబాబా మందిరాన్ని దర్శించి పండ్లు, మిఠాయిలు బాబాకు సమర్పించుకున్నారు. తరువాత ఆమె విజయ్ హజారేగారి ఇంటికి వెళ్ళి బాబా లీలల గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని అర్థవంతంగా గడిపారు. రాత్రి తన అలవాటు ప్రకారం బాబా నామం స్మరించుకుంటూ ఆమె నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి తన జీవితాన్ని మార్చేసే అద్భుతమైన కల వచ్చింది.

కలలో ద్వారకామాయి కనిపించింది. బాబా తమ ప్రక్కన ఉన్న కఠడాపై ఎడమ మోచేయి ఆనించుకుని తమ సహజరీతిన కూర్చుని ఉన్నారు. మేఘ గబగబా ద్వారకామాయి మెట్లెక్కి బాబా పాదాలను పట్టుకుని, తన తలను ఆయన పాదాలపై ఉంచారు. బాబా తమ దివ్యహస్తాలను ఆమె తలమీద ఉంచి, "అల్లా మాలిక్" అని ఆశీర్వదించి, కొంచెం ఊదీ ఆమె నుదుటిమీద పెట్టారు. ఆమె బాబా ముందు కూర్చుని, "బాబా! మీరెందుకు మట్టి ప్రమిదలలో నీళ్లు పోసి దీపాలు వెలిగించారు?" అని అడిగింది. బాబా కాసేపు మౌనంగా ఉండి, "నేను నూనె లేకుండా దీపాలు వెలిగించేది నా భక్తులందరి మేలు కోసం. ప్రతి ఒక్క భక్తుని కోసం నా హృదయం ప్రేమ, దయ, జాలి, కరుణతో పొంగిపొర్లుతోంది. అయినప్పటికీ, మనుషుల దుర్మార్గపు ధోరణులను చూసి నాకు దుఃఖం కలుగుతుంది. దురదృష్టవశాత్తు, అది విస్తృతంగా వ్యాపించి నాలుగుదిశలలో అదే కనిపిస్తూ నన్ను బాధిస్తుంది" అని అన్నారు. వెంటనే ఆమె, "బాబా! ఎలాంటి దుర్మార్గపు ధోరణులు?" అని అడిగింది. అందుకు బాబా తల ఆడిస్తూ, "చాలామంది జనులు రోజూ ప్రమిదలలో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. వాళ్ళు వాటిని తమ పూజగదిలో దేవుని ముందు, బయట ద్వారం వద్ద, తులసి బృందావనం వద్ద పెడతారు. ఆచారపూర్వకంగా కొంతమంది రోజుకు నాలుగుసార్లు దీపాలు పెడతారు. ఇంకొంతమంది పూజగదిలో 'అఖండ జ్యోతి' పెడతారు. అయినా వాళ్ళు ద్వేషపూరితంగా, హానికరంగా, సాటి మనుషుల పట్ల అమానుషంగా ఉంటారు. వాళ్ళ హృదయంలో సాటి మనుషుల పట్ల సానుభూతి, మానవత్వం, ప్రేమ లోపించాయి. ప్రేమ, దయ లేకుండా దీపాలు వెలిగిస్తే అది వ్యర్థం. అది నూనె లేకుండా దీపాలు వెలిగించడంతో సమానం. అలా ఎందుకు దీపాలు వెలిగించడం? రోజూ దీపాలు వెలిగించి, బయటికి వెళ్ళి ఇతరుల విషయంలో మోసాలు, కుట్రలు చేస్తారు. తరువాత మీ భక్తిని ప్రదర్శించుకోవడానికి అధిక మొత్తంలో డబ్బులు, ధూపాలు, పూలు, నైవేద్యాలు నాకు సమర్పిస్తారు. ఆ మనిషి ఆడైనా, మగైనా, సోదరసోదరీమణులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఏ బంధువులైనా కావచ్చు, కానీ ప్రేమలేని ఆ అనుబంధాలు వ్యర్థమైనవి. వాళ్లంతా రక్తసంబంధీకులు అయినందున కర్మసంబంధంగా తలచి అర్థాంగీకారంతోనే ఆ సంబంధాలను భరిస్తారు. దురదృష్టంకొలది అత్త తన కోడలిని సొంత కూతురిలా భావించదు. అన్న భార్య తమ్ముడి భార్యని సోదరీభావంతో ప్రేమ చూపించదు. మీ బుద్ధిలో, హృదయంలో తీవ్రమైన అంధకారం గూడుకట్టుకోవడం నేను గమనిస్తున్నాను. వాస్తవానికి మీలో కొంతమంది మానవత్వం, దయ కలిగి సరైన మార్గంలో జీవించేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివాళ్ళు ఈ ప్రపంచంలో మనుగడ సాగించడం చాలా కష్టం. మీ మనస్సునందు, హృదయమునందు ప్రేమ లేనిచో దీపాలు వెలిగించడం గురించి ఆలోచించవద్దు. ఎవరి హృదయం ఇతరులపట్ల చెడుతలంపులు లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో ఆ వ్యక్తే దీపాలు వెలిగించాలి, అప్పుడే అది అంధకారాన్ని పారద్రోలుతుంది. అప్పుడే నిజమైన జ్యోతి వెలుగుతుంది. ఇతరులపట్ల మంచి సంకల్పం లేకపోతే నా ఊదీకాని, ధ్యానంకాని మీకు సహాయపడవు. ఎప్పుడైతే మీరు ప్రేమ, కరుణలను అలవరచుకుంటారో అప్పుడు అంధకారం మాయమైపోతుంది. నా చుట్టూ ఉన్న తీవ్రమైన అంధకారాన్ని చూసి నాకు బాధ కలుగుతుంది. బేటా! నీవు దీపాలు నీటితో వెలిగించడం గురించి ప్రశ్నించావు. అందుకే నేను ఇవన్నీ నీకు చెప్పాను. నేను ఏదైతే చెప్పానో దానిగురించి నీవు ఎంతమంది భక్తులకు వీలైతే అంతమందికి తెలియచేసి, అవగాహన కలిగిస్తే, అది మీ అందరికీ చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. నా సందేశాన్ని స్వీకరించి వారి చెడు మార్గాలను మార్చుకున్నంతవరకు వాళ్ళు నా లీలలు, చరిత్ర చదవకపోయినా, నాకు ఆరతులు చేయకపోయినా ఫరవాలేదు. బేటా! నువ్వు ఇది నాకోసం చేస్తావా?" అని చెప్పి కన్నీళ్లు నిండిన కళ్ళతో బాబా తమ చేతిని మేఘ తలపై ఉంచి ఆశీర్వదించారు. మరుక్షణం ఆమెకు మెలకువ వచ్చి, తాను కలగన్నానని గ్రహించింది. ఆ క్షణంనుంచి తాను కలుసుకున్న ప్రతి భక్తునికి ఆ ప్రత్యేకమైన బాబా సందేశాన్ని తెలియజేయడమే తన జీవితధ్యేయంగా మారిపోయింది.

మనం మన కర్మల ద్వారా సృష్టించుకున్న అంధకారాన్ని తొలగించడానికి బాబా తనదైన ప్రత్యేకశైలిలో మనకి సహాయం చేస్తారు. ఆయన ఈ లీల ద్వారా ఆత్మజ్యోతి(ఆత్మ సాక్షాత్కారం) వెలిగించడానికి ప్రతిఒక్కరూ సాధన చేయాలని సందేశాన్నిస్తున్నారు.

Ref.: Sai Prasad, Deepavali vissesh ank, 2002.
Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

సాయిభక్తుల అనుభవమాలిక 151వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. దొంగ బారినుండి కాపాడిన బాబా
  2. బాబా చిలుము నాకు బలాన్నిచ్చింది.

దొంగ బారినుండి కాపాడిన బాబా

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పద్మ. నేను ఖమ్మం నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. ప్రతిరోజూ నేను బ్లాగులోని సాయి లీలలు తప్పకుండా చదువుతూ చాలా ఆనందాన్ని పొందుతున్నాను.  2017, అక్టోబరులో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు గురువారం. ఉదయం 11-12 మధ్యలో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంటి ముందుతలుపులు మూసేసి పెరట్లో పని చేసుకుంటున్నాను. పనులన్నీ పూర్తయ్యాక చెత్త బయట పడేద్దామని చేతిలో చెత్తడబ్బాతో వెనకనుండి ముందుకి వచ్చేసరికి, ముందుతలుపుల వద్ద ముఖానికి మాస్క్ కట్టుకుని ఒకడు నిలబడివున్నాడు. నాకు భయమేసి, "ఎవరు నువ్వు?" అని అడిగాను. వాడు ఉలుకూ పలుకూ లేకుండా అలాగే నిలబడివున్నాడు. మా బంధువులెవరైనా తమాషాగా నన్ను భయపెడుతున్నారేమో అనుకుని మళ్లీ "ఎవరు నువ్వు?" అని అడిగాను. వాడు పలకలేదు. వాడు దొంగ అని నేను గ్రహించేలోగా వాడు నేను అరవకుండా గట్టిగా నా నోరు మూసేశాడు. నాకేం జరుగుతుందో, అసలు ఏమి చేయాలో తెలియడం లేదు. ఆ స్థితిలో బాబాని తలచుకుని, "బాబా! నన్ను నువ్వే కాపాడాలి" అని అనుకున్నాను. ఇంతలో పక్కింటివాళ్ళు కనిపించారు. చెయ్యి కదిలిస్తూ, ఇటు చూడండి అన్నట్లు వాళ్ళకి సైగలు చేశాను గాని, చెట్టు అడ్డంగా ఉండటంతో నేను వాళ్ళకి సరిగ్గా కనపడట్లేదు. నేను గట్టిగా పిలవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ శబ్దం రాకుండా వాడు నా నోరు గట్టిగా మూసేసి ఉన్నాడు. అయితే బాబా కృపవలన వాళ్ళకి ఏదో అలికిడి అవుతున్నట్లు అనిపించి మా ఇంటివైపు చూశారు. వాళ్ళు 'ఆంటీ.. ఆంటీ' అని నన్ను పిలిచారు. కానీ ఆ దొంగ, "పిలిచావంటే నిన్ను చంపేస్తా, నా దగ్గర కత్తి ఉంది" అన్నాడు. నిజంగానే కత్తి ఉందేమో, దాన్ని తీసి నన్ను ఎక్కడ చంపుతాడో అని నేను భయపడిపోయాను. అయితే వాడి దగ్గర కత్తి లేదని గమనించి ఎలాగో మొత్తానికి వాడి చేతులు విదిలించుకుని 'దొంగ దొంగ' అని గట్టిగా అరిచాను. అది విని వాళ్ళందరూ బయటికి వచ్చారు. దాంతో ఆ దొంగ నన్ను బలంగా ఒకవైపుకు నెట్టేసి పారిపోయాడు. కానీ నేను భయంనుండి పూర్తిగా బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. బాబా దయవల్ల వాడు నెట్టివేయడం వలన అయిన చిన్న గాయం తప్ప ఇంకే హానీ జరగలేదు. నా మెడలో ఉన్న చైను కూడా సురక్షితంగా ఉంది. తలచుకోగానే ఆ దొంగ బారినుండి నన్ను కాపాడి 'పిలిస్తే పలికే దైవం' అని నిరూపించుకున్నారు బాబా. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మీరు చేసిన మేలు నేనెప్పటికీ మరచిపోలేను".

బాబా చిలుము నాకు బలాన్నిచ్చింది.

కెనడా నుండి సాయి భక్తురాలు ప్రియ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం శ్రీ సాయిరామ్. నేను సాయి భక్తురాలిని. నేను గత 10 నెలలుగా కెనడాలో ఉంటున్నాను. మొదటి ఆరు నెలలు కనీస అవసరాల కోసం నేను చాలా కష్టపడ్డాను. నేను, నా కుటుంబం ఊహించని పరిస్థితులు ఎదుర్కున్నాము. ఇల్లు, ఉద్యోగం దొరకక జీవించడం పెద్ద సవాలుగా అనిపించింది. చాలా శ్రమతో 6 నెలల తరువాత నాకొక కార్యాలయంలో ఉద్యోగం దొరికింది. అది నా అర్హతకు సరైనది కానప్పటికీ, నా మనుగడ కోసం ఆ ఉద్యోగం చేయడానికి సిద్ధపడ్డాను. అయితే ఆఫీసు నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. బస్ స్టాప్ నుండి ఆఫీసు వరకు చాలా దూరం నడవాల్సి ఉన్నందున రాకపోకల విషయంలో నేను ఆందోళన చెందాను.

నేను ఉద్యోగంలో చేరడానికి ముందురోజు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మందిరానికి వెళ్ళాను. అక్కడినుండి తిరిగి వచ్చే సమయంలో బస్సు దొరకనందున నడుచుకుంటూ ఇంటికి బయటలుదేరాను. అది అక్టోబర్ నెల. సమయం రాత్రి 7 గంటలయింది. సూర్యుడు అస్తమించి ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. నేను నడుస్తుండగా అకస్మాత్తుగా సిగరెట్ వాసన వస్తున్నట్లు అనిపించింది. ఎక్కడినుంచి వస్తుందా అని నేను చుట్టూ చూశాను. కనీసం 300 మీటర్ల దూరంలో నా చుట్టూ ఎవరూ లేరు. ఇల్లు కూడా ఎడమవైపుగా చాలా దూరంలో ఉన్నాయి. ఒకవేళ అక్కడినుండి ఆ వాసన వచ్చినా మరీ అంతదూరం వచ్చే అవకాశం లేదు. 70 కిలోమీటర్ల వేగంతో కార్లు మాత్రమే నాపక్కనుండి పోతున్నాయి. నేను ఏదో పరిహాసంగా "బాబా! మీరు నాతోపాటు ఉన్నారా?" అని అడిగాను. తరువాత 3, 4 అడుగులు వేశాక ఆ వాసన మరిలేదు. మరో 10 అడుగులు ముందుకు వెళ్ళాక మళ్ళీ ఆ వాసన మొదలైంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడు కూడా నా సమీపంలో ధూమపానం చేస్తూ ఎవరూ లేరు. నా మనసుకొక్కటే అనిపించింది, 'బాబా నాతోపాటు నడుస్తున్నారు. ఆయన నాతో ఉన్నానని భరోసా ఇస్తున్నారు. ఇక నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. 

మరుసటిరోజు నేను మొదటిసారి ఆఫీసుకు వెళ్ళాను. ఆ గదిలో నాకు శిక్షణనిచ్చే వ్యక్తి తోపాటు మొత్తం ముగ్గురం ఉన్నాము. అకస్మాత్తుగా గది లోపల ఘాటుగా సిగరెట్ వాసన రావడం మొదలైంది. అది ‘నో స్మోకింగ్' ఏరియా. నాతో ఉన్న ఇద్దరు ఆ వాసన గురించి ఏమీ ప్రస్తావించడం లేదు. 'నీకేం భయంలేదు. నేను నీతోనే ఉన్నాను' అని బాబా నాకు తెలియజేస్తున్నారు అనుకున్నాను. వెంటనే నాకు  'ఒక భక్తురాలు ఆఫీసులో ఉండగా తన డెస్క్‌ వద్ద  చిలుము వాసన వచ్చినట్లు' నా స్నేహితులొకరు చెప్పిన అనుభవం గుర్తుకువచ్చి 'బాబా నాతోనే ఉన్నార'ని ధృవీకరించుకుని చాలా సంతోషంగా బాబాకు కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.

ఓం శ్రీ సాయిరామ్. 

సాయిభక్తుల అనుభవమాలిక 150వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నా బిడ్డ బాధ్యత బాబా తీసుకున్నారు.
  2. ఆటంకం లేకుండా ఫంక్షన్ జరిపించిన బాబా.

నా బిడ్డ బాధ్యత బాబా తీసుకున్నారు.

విజయవాడ నుండి సాయి భక్తురాలు హారిక తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సద్గురు సాయినాధునికి నా సాష్టాంగ నమస్కారములు. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారములు. నాకు 20 ఏళ్లుగా బాబా గురించి తెలుసు. అయితే ఆయనకు ఒక నమస్కారం పెట్టడం, గుడికి వెళ్లడం, అప్పుడప్పుడు శిరిడీ వెళ్లడం అంతవరకే. అలాంటిది మా అబ్బాయి విషయంలో వచ్చిన ఒక సమస్య నన్ను బాబాకి చాలా దగ్గర చేసింది. బాబా లీలలు మనకు అర్ధంకావు. ఆయనెప్పుడూ మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తారో తెలీదు. ప్రతి సంఘటన వెనక ఒక పరమార్ధం ఉంటుంది. ఇక బాబాకు దగ్గర చేసిన అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా అబ్బాయి వెల్లూరులో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి  నేను హైదరాబాద్ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తను చదువుతున్న కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. "మీ అబ్బాయి పరిస్థితి ఏమీ బాగాలేదు, తాను చదువులో చాలా వెనకబడ్డాడు, ఇలాగే ఉంటే టి.సి. ఇచ్చి పంపేస్తాము" అన్నారు. ఆమాట వింటూనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే, మా అబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో ముందుండేవాడు. అలాంటిది ఇలా అయిందంటే నేనస్సలు నమ్మలేకపోయాను. విషయం నావరకు వచ్చేసరికే తను చివరి సంవత్సరంలో ఉన్నాడు. ఏమి చేయాలో నాకు తోచలేదు. వెంటనే నేను కాలేజీ వాళ్లతో మాట్లాడుదామని వెల్లూరు వెళ్ళాను. అక్కడకు వెళ్ళాక మా అబ్బాయితో చదువుతున్న ఒక అబ్బాయి తల్లితో నాకు పరిచయం అయ్యింది. ఆమె గొప్ప సాయి భక్తురాలు. ఆమె మాట్లాడిన ప్రతి మాటలో సాయి గురించి ప్రస్తావన ఉంటుంది. అలాంటి తనతో పరిచయం బాబా ఇచ్చిన గొప్పవరం. తన పరిచయంతో నేను బాబాకు చాలా చాలా దగ్గరయ్యాను.

ఇక అసలు విషయానికి వస్తే, మా అబ్బాయి విషయంలో నేను చేయాల్సింది చేసిన తరువాత శిరిడీ వెళ్ళాను. నేను సమాధి మందిరంలో బాబా దర్శనానికి క్యూలో నిలబడి బాబాను చూస్తూ కన్నీళ్లతో మా అబ్బాయి సమస్య గురించి ఆయనకు చెప్పుకుని, "నా బిడ్డ భారం మీరు తీసుకున్నట్లైతే, మీరు సమాధి వద్దనుండి నాకు ఒక పుష్పాన్ని ఇవ్వండి. నేను మాత్రం ఎవరినీ ఏమీ అడగను" అని ప్రార్ధించాను. ఆశ్చర్యం! ఒక లేడీ సెక్యూరిటీ వచ్చి నా చేతిలో కాజు బర్ఫీ పెట్టింది. నేను నా మనసులో 'నేను అడిగింది పుష్పాన్ని కదా, మరి స్వీట్ ఇచ్చారేమిటి?' అనుకుంటున్నంతలో ఆమె మళ్ళీ వెనుకకు వెళ్లి సమాధి వద్దనుండి ఒక పుష్పాన్ని తెచ్చి నా చేతిలో పెట్టింది. సమాధికి నాకు మధ్య చాలా దూరం ఉంది. పైగా నాముందు చాలామంది ఉన్నారు. అందరినీ దాటుకుని నా చేతిలోనే ఆమె ప్రసాదం, పుష్పాన్ని పెట్టడం చాలా ఆశ్చర్యమనిపించింది. అలా నా బిడ్డ బాధ్యతను తాము స్వీకరిస్తునట్లుగా బాబా నాకు నిర్ధారణ ఇచ్చారు. ఇక ఆయనే అంతా చూసుకుంటారని నేను అనుకున్నాను. అయితే తల్లి మనస్సు అప్పుడప్పుడు ఆందోళనపడుతూ ఉండేది. మావారు, "బాబాపై విశ్వాసం ఉంటే, ఇలా ఆందోళన పడకూడదు" అంటుండేవారు. అది నిజమే కానీ నేను స్థిమితంగా ఉండలేకపోయేదాన్ని. అయితే బాబా తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు. ఆయన కృపతో నా బిడ్డ ఒకటిన్నర సంవత్సరంలో తన ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఈ అనుభవం నా బిడ్డకి కూడా బాబాపట్ల విశ్వాసాన్ని పెంచింది.  

ఇకపోతే పై చదువులకోసం మా అబ్బాయిని జర్మనీ పంపమని తెలిసిన ఒకతను సూచించారు. ఆ విషయమై మేము హైదరాబాదులోని కన్సల్టెన్సీల ద్వారా చాలా ప్రయత్నించాం కానీ ప్రయోజనం లేకుండాపోయింది. అందరూ మా అబ్బాయి ప్రొఫైల్ ననుసరించి తనకి జర్మనీ వెళ్లే అవకాశం లేదని, ఆస్ట్రేలియా అయితే సాధ్యపడుతుందని అన్నారు. అప్పడు నేను "బాబా! అందరూ మా అబ్బాయికి జర్మనీలో అవకాశం లభించడం అసాధ్యమని అంటున్నారు. కానీ అది మీవల్ల సాధ్యమవుతుంది. అదేజరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్ధించాను. వెంటనే బాబా కృప చూపించారు. మా అబ్బాయి స్నేహితుని ద్వారా విజయవాడలో ఉన్న ఒక కన్సల్టెన్సీ గురించి తెలిసి, వెంటనే మేము ఆ కన్సల్టెన్సీని సంప్రదించాము. వాళ్ళు, "ఖచ్చితంగా జర్మనీలో అవకాశం లభించేలా చూస్తామ"ని చెప్పారు. తరువాత కొద్దిరోజుల్లోనే మా అబ్బాయికి జర్మనీలో అడ్మిషన్, వీసా వచ్చేలా బాబా అనుగ్రహించారు. ఇప్పుడు మా అబ్బాయి ఎంతో పద్దతిగా ఉంటున్నాడు. ఎందుకంటే వాడి భాద్యత బాబా తీసుకున్నారు కదా! ఇప్పుడు వాడికి ఉద్యోగం రావాల్సి ఉంది. ఆ భాధ్యత కూడా ఆయనదే. ఖచ్చితంగా ఆయన త్వరలో నా బిడ్డను మంచి స్థాయిలో స్థిరపరుస్తారని నా నమ్మకం. అందరికీ బాబా తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

ఓం సాయిరాం.

ఆటంకం లేకుండా ఫంక్షన్ జరిపించిన బాబా.

ఒక అజ్ఞాత సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 7 సంవత్సరాలకు పైగా శ్రీ సాయిబాబా భక్తురాలిని. రెండు నెలల క్రితం మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ మా ఇంటిలో ఏర్పాటు చేసుకుని దాదాపు 400 మంది అతిథులను ఆహ్వానించాము. హఠాత్తుగా ముందురోజు సాయంత్రం మా అమ్మాయి జ్వరంతో అనారోగ్యానికి గురైంది. అది కాలానుగుణంగా వచ్చే ఫ్లూ జ్వరం. దానినుండి కోలుకోవడానికి కనీసం ఒక వారం పడుతుంది. కొద్దిరోజుల ముందు నా భర్త కూడా జ్వరంతో దాదాపు పదిరోజులు బాధపడ్డారు. అందువలన నేను చాలా టెన్షన్ పడి బాబాను ప్రార్ధించాను. మావారు తనని డాక్టరు వద్దకు తీసుకెళ్ళగా, డాక్టరు మందులు ఇచ్చారు. కానీ ఉదయానికి కూడా తనకి జ్వరం ఎక్కువగానే ఉంది. ఏం చేయాలో అర్ధంకాక కన్నీళ్ళు పెట్టుకుంటూ బాబాని ప్రార్థించి ఫంక్షన్ ఏర్పాట్లు మొదలుపెట్టాము. బాబా కృపవలన మధ్యాహ్నానికి జ్వరం తగ్గింది. సాయంత్రం ఫంక్షన్ మొదలుపెట్టాము. తను ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 గంటలపాటు ఫంక్షన్‌లో నిలబడగలిగింది. మా అమ్మాయిని రక్షించింది బాబా మాత్రమే. జ్వరం తగ్గకుంటే ఏమి జరిగేదో నేను ఊహించలేను. నా ప్రార్థనలకు బాబా సమాధానమిచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". బాబా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 2వ భాగం


ప్రప్రథమ సాయి దర్శనము

1908 సంవత్సరం - వేసవికాలంలో ఒకరోజున ఈ క్రింది సంఘటన జరిగింది. మా నాన్నగారు (జ్యోతీంద్ర) మెట్రో సినిమా దగ్గరున్న ఇరానీ రెస్టారెంటులో భోజనం చేసి, తను చదివే సెయింట్ జేవియర్ స్కూలుకు తిరిగి వెళుతున్నారు. ప్రతిరోజు స్కూలు విరామ సమయంలో ఇరానీ రెస్టారెంటుకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసిరావడం ఆయనకు అలవాటు. ఆరోజు ఆయన రోడ్డు దాటుతున్నప్పుడు తెల్లని దుస్తులు ధరించి ఉన్న ఒక ఫకీరు ఆయనను పిలిచి దక్షిణ అడిగాడు. మా నాన్నగారు తన జేబులోంచి ఒక పైసా నాణెం(మధ్యలో కన్నం ఉన్న రాగినాణెం) తీసి ఆ ఫకీరుకిచ్చి స్కూలుకు సాగిపోతున్నారు. కానీ ఆ ఫకీరు ఆయనను ఆపి, అది 1894 సంవత్సరంలో ముద్రించిన ఒక పైసా నాణెం అని మా నాన్నగారితో అన్నాడు.

ఆ రోజుల్లో ప్రజలు ఒక పైసాను విరాళంగా ఇస్తూ ఉండేవారు. ఒక విద్యార్థి ఒక పైసా దానం చెయ్యడమంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం క్రింద లెక్క. మా నాన్నగారు ఆ ఫకీరుతో, ప్రతిరోజు మధ్యాహ్నభోజనం నిమిత్తం తనకు నాలుగు అణాలు ఇస్తారని, అందుచేత తాను ఒక పైసా దానం చేయగలననీ, అంతే కాకుండా, ఒక పైసా నాణెం ఇంకా చలామణిలోనే ఉంది కాబట్టి ఫకీరు దాని గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదనీ చెప్పారు. దానికి ఆ ఫకీరు నవ్వుతూ, “అల్లా భలా కరేగా!” అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత మా నాన్నగారు స్కూలుకు వెళ్ళిపోయారు. తరువాత, ఆ విషయం గురించి ఆయన పూర్తిగా మరచిపోయారు.

మా నాన్నగారికి ఇద్దరు అన్నయ్యలు, సత్యేంద్ర మరియు రవీంద్ర. వీరిద్దరూ వైద్య కళాశాలలో చదువుతూ ఉండేవారు. తరువాత, మా పెదనాన్న గారైన సత్యేంద్ర జీ.జీ.ఎం.సీ. (గ్రాడ్యుయేట్ ఆఫ్ గ్రాండ్ మెడికల్ కాలేజ్. ఇదే తర్వాత ఎం.బీ.బీ.ఎస్. గా రూపాంతరం చెందింది) డిగ్రీ సాధించారు. ఈయన మాతుంగాలోని కొంకణనగర్ లో ఉండేవారు. (ఇప్పుడాయన జీవించి లేరు. ఆయన కొడుకు, కూతురు మాత్రం అక్కడ నివసిస్తున్నారు).

మా నాన్నగారి సోదరుడు ఒక డాక్టరు, ఆయన బాబాయి ఒక డాక్టరు, ఆయన తాతగారు ఒక ప్రముఖ మెడికల్ ప్రాక్టీషనరే కాకుండా అప్పటి ముంబయి వైస్రాయికి కుటుంబవైద్యుడు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే మా నాన్నగారిది వైద్యుల కుటుంబం. కుటుంబంలో ఇంతమంది వైద్యులు ఉన్నా, మా నానమ్మ మైగ్రేన్ వల్ల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేది. అన్నిరకాల మందులు వాడారు, కానీ ఆమె వ్యాధి నివారణ కాలేదు. మా నానమ్మని బాంద్రా మసీదు దగ్గరున్న పీర్ మౌలానా బాబా వద్దకు వెళ్ళమని వాళ్ళింట్లో పనిచేస్తున్న పనిమనిషి సలహా ఇచ్చింది. ఆయన ఇచ్చే ఆయుర్వేద మందులతో దీర్ఘకాలం నయమవ్వని జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పింది.

ఆ రోజుల్లో ఒక హిందూ స్త్రీ, మసీదుకు వెళ్ళి ఒక ముస్లిం బాబాను కలుసుకోవడమంటే చాలా కష్టమైన విషయం. కానీ మా నానమ్మగారు, తనను అక్కడకు తీసుకెళ్ళమని తన కుమారుడితో చెప్పింది. స్వభావసిద్ధంగా ధైర్యవంతుడయిన మా నాన్నగారు, మా నానమ్మగారి సలహా మేరకు, ఆమె కోసం ఒక బురఖా ఏర్పాటుచేసి, ఆమెను కారులో పీర్ మౌలానాబాబా దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఎవరైనా ఎంతకీ నయం కాని వ్యాధితో బాధపడుతున్నప్పుడు మత కట్టుబాట్లను ఛేదించడం అసమంజసం కాదు కదా! కానీ, మౌలానాబాబాని కలుసుకొన్న తరువాత ఆమె తలనొప్పి తగ్గడానికి బదులు ఎక్కువయ్యింది. మా నానమ్మతో పీర్ మౌలానాబాబా, ఆమె వ్యాధిని నయం చేయడానికి తన వద్ద మందులేదని చెప్పి, “శిరిడీలో 'సాయిబాబా' అని నా సోదరుడు ఉన్నారు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన మీ వ్యాధిని నయం చేసి మీ బాధలన్నింటినీ పోగొడతారు” అని చెప్పడంతో వారిద్దరూ అయోమయంలో పడ్డారు కారణం - మొదటిది, మా తాతగారు ప్రార్థనా సమాజవాది కావటం వల్ల 'బాబా'లను కలుసుకోవడానికి అనుమతివ్వరని వారికి తెలుసు. ఇక రెండవది, శిరిడీ ఎక్కడ వుందో, అక్కడకు ఎలా వెళ్ళాలోనన్నది ఇంకా పెద్ద ప్రశ్న. 

అయినప్పటికీ మా నాన్నగారు వెనుకాడలేదు. శ్రీసాయిబాబాను కలుసుకోవాలని వారి భవితవ్యం ముందే వ్రాసి ఉండటం వల్ల, శిరిడీ వెళ్ళకుండా వారిని ఎవ్వరూ ఆపలేకపోయారని నేను నమ్ముతున్నాను. మెట్రో సినిమా దగ్గరున్న ఇరానీ రెస్టారెంట్ యజమాని నుంచి మా నాన్నగారు బాబా గురించిన సమాచారాన్ని సేకరించారు. శిరిడీ గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలో ఉందని, అక్కడకు వెళ్ళాలంటే రైలులో మన్మాడ్ మీదుగా కోపర్గాం వెళ్ళాలని ఆయన తెలుసుకున్నారు. కోపర్గాం నుంచి 9 కి.మీ. దూరంలో ఉన్న శిరిడీకి గుఱ్ఱపుబండిలో వెళ్ళాలి. అంటే ముంబయి నుండి శిరిడీకి వెళ్ళి రావాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. ఏమయినప్పటికీ మా నాన్నగారు, మా తాతగారి అనుమతి సంపాదించి శిరిడీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఒక శుక్రవారం సాయంత్రం తల్లి, కొడుకులిద్దరూ బయలుదేరి శనివారం ఉదయానికి శిరిడీ చేరుకున్నారు. వారు వివరాలన్నీ సేకరించి, స్నానాదికాలు ముగించుకొని శ్రీసాయిబాబాను కలుసుకోవడానికి మసీదుకు చేరుకొని, అక్కడ ధుని (బాబా వెలిగించిన పవిత్రమైన అగ్ని) ముందు కూర్చుని ఉన్న సాయిబాబాను చూసారు. మా నానమ్మ వంగి బాబా పాదాలను తాకి నమస్కరించుకున్నారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
బాబా మా నానమ్మగారితో, “అమ్మా! బాంద్రానుంచి నా సోదరుడు పంపగా నువ్వు నావద్దకు వచ్చావు. దయచేసి కూర్చో! అమ్మా! నువ్వు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నావు కదూ?” అని అన్నారు. తరువాత సాయిబాబా తన అయిదు వేళ్ళను ఊదీతో నిండి ఉన్న ప్లేటులో ముంచి, ఆ చేతితో మా నానమ్మ గారి నుదుటి మీద మెల్లగా తట్టారు. వెంటనే ఆయన, ఆమె నుదుటిని తమ వరదహస్తంతో గట్టిగా నొక్కుతూ, “అమ్మా! నీ తలనొప్పి పూర్తిగా నివారణయింది. ఇప్పటి నుండి జీవితాంతం వరకు ఎటువంటి నొప్పీ నీ దరిచేరదు!” అన్నారు.

శ్రీసాయి చర్యకు మా నానమ్మగారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆమె ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయినా సాయిబాబాకు వారి రాక గురించి, ఆమె తలనొప్పి గురించి ఎలా తెలిసింది? బాబా తమ రెండు చర్యల ద్వారా మా నానమ్మ తలనొప్పి పూర్తిగా నివారించారు. 

మొదటిది - బాబా తమ దివ్యమైన చూపును మా నానమ్మపై ప్రసరింపచేయడం.

రెండవది -  ఊదీ నిండిన తమ పవిత్రహస్తంతో ఆమె నుదిటిని తాకడం. 

మా నానమ్మకు అంత శక్తివంతమైన మోతాదులో మందు ఎప్పుడూ ఇవ్వబడలేదు. ఆమెలో ఎటువంటి పరివర్తన సంభవించిందనే విషయం ఆమెకు మాత్రమే తెలుసు. తలనొప్పి వల్ల ఆమె వదనంలో కనబడే బాధ మటుమాయమై, ఎంతో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆమె తిరిగి బాబా పాదాలకు నమస్కరించి, మా నాన్నగారిని కూడా బాబా పాదాలకు నమస్కరించమని చెప్పింది. 

జరిగినదంతా గమనిస్తున్న మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఎప్పుడూ ఆమె అలా ఆజ్ఞాపించలేదు. మా నాన్నగారు బాబా పాదాలు తాకి నమస్కరించుకున్నారు. వెంటనే బాబా మా నాన్నగారితో, “భావూ! నీవు నన్ను గుర్తుపట్టలేదా?” అన్నారు. మా నాన్నగారు గుర్తుపట్టలేదని చెప్పారు. అప్పుడు బాబా, “నన్ను చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు!” అని అన్నారు. ఎంత ప్రయత్నించినా మా నాన్నగారికి కొంచెం కూడా గుర్తురాలేదు.
బాబా వెంటనే తమ కఫ్నీ జేబులో నుంచి ఒక పైసా రాగి నాణాన్ని బయటకు తీసారు. ఆయన ఆ నాణాన్ని మా నాన్నగారికి చూపించి, “భావూ! ఒకరోజు నువ్వు స్కూలుకు వెళుతున్నప్పుడు, 1894లో ముద్రించిన ఈ నాణాన్ని ఒక ఫకీరుకు దక్షిణగా ఇచ్చావు, గుర్తులేదా?” అన్నారు. అప్పుడు మా నాన్నగారికి ఆ సంఘటన గుర్తువచ్చి, కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారగా, వెంటనే ఆయన బాబా పాదాలకు నమస్కరించారు. బాబా మా నాన్నగారిని లేవనెత్తి, “భావూ! ఆరోజు నువ్వు కలుసుకున్న ఆ ఫకీరును నేనే. నీవిచ్చిన ఆ పైసా నాణాన్ని నీకు తిరిగి ఇస్తున్నాను. దీనిని జాగ్రత్తగా భద్రపరచుకో! ఇది నీకు ఎన్నోరెట్లు సంపదనిస్తుంది” అని అన్నారు.

ప్రియపాఠకులారా! మా నానమ్మగారికి, మా నాన్నగారికి ఎంతో ప్రసన్నమైన సాయిబాబా దర్శనం అయిందని, ఆ దర్శనం వారికి ఎంతో చిరస్మరణీయమైనదని మీరు పూర్తిగా నాతో అంగీకరిస్తారు! అప్రయత్నంగానే అప్పటినుండి వారు బాబాపట్ల ఆకర్షితులయ్యారు. తమ మొట్టమొదటి దివ్యదర్శనంలోనే ఆ తల్లీకొడుకులు సాయిబాబాను తమ గురువుగా భావించుకొని, పూర్తిగా సాయిభక్తికి అంకితమైపోయారు. మా నానమ్మగారి తలనొప్పి శాశ్వతంగా నివారింపబడింది. భగవంతునియందు ఆమె భక్తి ద్విగుణీకృతమయ్యింది. బాబా ఇచ్చిన పైసా నాణెం మా ఇంటిలో పూజలో ఉంచబడింది.

సాయిబాబాను కలుసుకున్న తరువాత ఏం జరిగిందని మేము మా నాన్నగారిని అడుగుతూ ఉండేవాళ్ళం. శ్రీసాయిబాబా ప్రసన్నమైన చూపులు ఎవరినైనా అయస్కాంతంలా ఆయన వైపుకు ఇట్టే ఆకర్షిస్తాయనీ, ఎంతో శక్తివంతమైన ఆయన హస్తస్పర్శ ఎంత లోతైన గాయాన్నయినా మాన్పగలదనీ మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. 

సాయిబాబా ఎప్పుడూ తాను భగవంతుడినని చెప్పుకోలేదని, తాను దైవం యొక్క దూతనని చెబుతూ ఉండేవారని మీకందరికీ తెలుసు. ఖండోబా ఆలయ పూజారైన భగత్ మహల్సాపతి మొట్టమొదటిసారిగా బాబాను చూసినప్పుడే “రండి సాయి! రండి!” అని సంబోధించి, ఆయనకు సరియైన నామకరణం చేసారని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు.

మన భారతదేశం ఎంతోమంది ఆధ్యాత్మిక బాబాలకు నిలయం. వారి వారి భక్తులు వారిని తగిన పేరుతో పిలుచుకుంటారు. 'సాయి' అనే పేరు అన్నింటినీ సూచిస్తుందని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆయన వివరించిన దాని ప్రకారం మరాఠీలో 'సాయి' అనే మాటకి అర్థం: 'సా' అంటే సాక్షాత్' (సత్యమైన), 'యి' అనగా 'ఈశ్వర్' (భగవంతుడు). ఆయన దృష్టిలో 'సాయిబాబా' అంటే 'సాక్షాత్ భగవంతుడు' అని అర్థం.

మా నాన్నగారు శిరిడీ సందర్శించినప్పుడు ఆయనకు కలిగిన అనుభవాలు చాలా అద్భుతమైనవి. సామాన్య మానవులెవరైనా అటువంటి దివ్యానుభూతిని పొందినప్పుడు, సాయిబాబా అతీతమైన దివ్యశక్తులు కలిగి ఉన్నారనే నిర్ణయానికి వస్తారు. అంతటి అనుగ్రహాన్ని పొందిన కుటుంబంలో జన్మించినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. సాయిబాబా అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

శ్రీసాయిబాబాతో అంతటి అద్భుతమైన అనుభవం వల్ల కలిగిన అనుభూతితో తల్లీ కొడుకులిద్దరూ వెంటనే బాంద్రా తిరిగి వెళ్ళి, మా తాతగారితో ఎప్పుడెప్పుడు ఆ అనుభవం చెబుదామా అనే ఆత్రుతతో ఉన్నారు. కానీ సాయిబాబా వారిని మరికొద్ది రోజులు శిరిడీలో ఉండమని సూచించగా వారు ఆనందంగా అంగీకరించారు. కొంతసేపటి తరువాత, బాబాకు సన్నిహితంగా ఉంటూ, భక్తులకు సహాయపడుతూ ఉండే మాధవరావు దేశపాండేని (శ్యామా) కలిసినప్పుడు ఆయన వారితో, ఆ రోజు ఉదయం బాబా ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉన్నారనీ, ఎవరికోసమని తాను అడిగినప్పుడు, తన తల్లి, సోదరుడు తనను కలుసుకోవడానికి వస్తున్నట్లుగా బాబా చెప్పారని అన్నారు. అంతేకాకుండా, బాబా అనుమతి తీసుకున్న తరువాతనే భక్తులు శిరిడీ వదిలి వెళ్ళడం అక్కడి సంప్రదాయమని కూడా శ్యామా వారితో చెప్పారు.

తరువాత వారు తాము సాయిబాబా ఆజ్ఞ మేరకు శిరిడీలో మరికొన్ని రోజులు ఉంటామని, వారు పొందిన అనిర్వచనీయమైన అనుభూతిని వివరిస్తూ బాంద్రాలో ఉన్న మా తాతగారికి (బాబాసాహెబ్ తర్ఖడ్) ఉత్తరం వ్రాసారు. అలా శిరిడీలో వారం రోజులు ఉన్న తరువాత బాబా అనుమతి తీసుకుని, మరలా మా తాతగారితో కలసి వస్తామని బాబాకు మాట ఇచ్చి వారు బాంద్రాకు తిరిగి వెళ్ళారు. వారు శిరిడీలో వున్న ఆ వారం రోజులలో సాయి భక్తులయిన శ్రీమహల్సాపతి, కాకా మహాజని, శ్యామారావ్ జయకర్ మొదలైన ప్రముఖ సాయిభక్తులను కలుసుకున్నారు. వారంతా, శ్రీసాయిబాబా సాధారణ మానవమాత్రులు కారనీ, ఆయన భక్తుల బాధల నివారణకు మంచి మందులనివ్వడమే కాక, అద్వితీయమయిన శక్తులు కూడా కలిగి ఉన్నారని చెప్పారు.

బాంద్రా చేరుకున్నాక, మా నానమ్మ తన దివ్యానుభవాన్ని మా తాతగారికి వివరించినప్పుడు, ఆమె మనోభావాలను ఆయన చాలా తేలికగా కొట్టిపారేశారు. అదే సమయంలో, మా నాన్నగారి నుంచి కూడా అటువంటి అభిప్రాయాన్నే విని కొంచెం ఆశ్చర్యపోయారు. తాము మరలా మా తాతగారితో కలిసి శిరిడీ సందర్శించుకుంటామని బాబాకు చెప్పినట్లుగా కూడా వారు తెలియచేసారు.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"


 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం

 కోసం

బాబా పాదాలు తాకండి.

 




సాయిభక్తుల అనుభవమాలిక 149వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. నెలసరి భయానికి బాబా ఇచ్చిన చక్కటి అనుభవం
  2. సాయి తీసుకొచ్చిన పరివర్తన

నెలసరి భయానికి బాబా ఇచ్చిన చక్కటి అనుభవం

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్నిలా మనతో పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. ఆయన దయవల్ల నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. ముందుగా బ్లాగు, వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న మీకు నా కృతజ్ఞతలు. మీ గ్రూపులో ఉండే అవకాశం లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక గ్రూపు మాత్రమే కాదు, మా ఉనికికి ఒక మార్గం చూపుతుంది. భక్తులు పంచుకుంటున్న అనుభవాల ద్వారా ఎన్నో విషయాలకు బాబా పరిష్కారం చూపిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ పనికి మా అందరి తరపున మీకు చాలా కృతజ్ఞతలు. ఇక నా అనుభవానికి వస్తే ...


శిరిడీలో నాకొక ఆశ్చర్యకరమైన అనుభవం జరిగింది. దాన్నిప్పుడు నేను మీతో పంచుకుంటాను. ఇటీవల మేము ముందుగా ప్రణాళిక చేసుకున్న తేదీన మా ఊరినుండి శిరిడీకి ప్రయాణమయ్యాము. అయితే మా ప్రయాణానికి నెలరోజుల ముందునుండి నేను నా నెలసరి విషయంగా చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఆ సమస్య ఎక్కడ మా ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుందో అనే ఆలోచనతో నేను చాలా భయపడ్డాను. విషయం ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఆందోళనపడుతూ ఉండేదాన్ని. అటువంటి సమయంలో బ్లాగులో వచ్చిన "నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి" అనే అనుభవం చదివిన తరువాత నా మనసు సమాధానపడింది. దానితో ధైర్యంగా శిరిడీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దురదృష్టవశాత్తు శిరిడీ చేరుకున్న తర్వాత నాకు నెలసరి వచ్చింది. బాబా నుండి నాకు స్పష్టమైన సమాధానం వచ్చినప్పటికీ సమాధిమందిరంలోకి వెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది. అయినా 'తమకు అటువంటి పట్టింపులు లేవ'ని బాబా తన భక్తులకు ఎన్నో అనుభవాలిస్తుంటే నేనింకా భయపడటం సరికాదని నా హృదయాన్ని దృఢపరుచుకుని లోపలికి వెళ్ళాను. అద్భుతం! ఆరతి జరుగుతున్నంతసేపూ, అంటే దాదాపు 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం తమకు దగ్గరగా నిలబడే అవకాశాన్నిచ్చారు బాబా. ఆరతి పాడేవాళ్ళు కూడా నా వెనుక నిలబడ్డారు. బాబా నన్ను అంత గొప్పగా చూసుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదంతా వ్రాస్తూ ఆ క్షణాన నేను పొందిన మధురానుభూతిని మళ్ళీ అనుభూతి చెందుతున్నాను. నా శరీరమంతా రోమాంచితం అవుతుంది. "చక్కటి అనుభవాన్నిచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మనం బాబాతో వ్యవహరించినట్లే ఆయన మనతో వ్యవహరిస్తారు. ఆయన మననుండి ఆశించేది భక్తి, ప్రేమలను మాత్రమే. మరేవీ ఆయనకు, మనకు మధ్య అడ్డుకావు. ఆయన వేర్వేరు మార్గాల ద్వారా మన సమస్యలకు సమాధానాలు ఇస్తారు. ఆయనిచ్చే సమాధానాలు తగిన వ్యక్తికి తగిన విధంగా చేరుతాయి.

"నెలసరి విషయంలో బాబా చేసిన సందేహ నివృత్తి" అనుభవం చదవాలనుకునే వారికోసం క్రింద లింకు ఇస్తున్నాను.


సాయి తీసుకొచ్చిన పరివర్తన

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నాకు 22 ఏళ్లు. నేను ప్రస్తుతం గుర్గాఁవ్ లోని ఒక టెలికాం ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. అంతకుముందు నేనొక కంపెనీలో ఉద్యోగం చేస్తుండేదాన్ని. నా స్నేహితులంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో మంచిస్థాయిలో ఉండటంతో నేను అసూయ చెందుతూ వాళ్లతో కలవలేకపోయేదాన్ని. ఆ కారణాల వల్ల నేను చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ నెలలు గడుస్తున్నా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. ఈలోగా నాకు అర్హత లేనప్పటికీ బాబా అనుగ్రహం వలన నా జీతం 40% పెరిగింది. అయినప్పటికీ నా మనసుకు ప్రశాంతత లేదు. ఒకరోజు, "దేవా! నా స్నేహితులపట్ల అసూయ చెందడం నాకిష్టంలేదు. న్యూనతా భావంతో వాళ్లతో నేను కలవలేకపోతున్నాను. దయచేసి నాకు మంచి సంస్థలో ఉద్యోగాన్ని ఇవ్వండి" అని నిజాయితీగా బాబాను ప్రార్థించాను. అదేరోజు నాకొక పెద్ద సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అయితే అది నేను చేస్తున్న ఉద్యోగానికి పూర్తి భిన్నమైనది. కానీ అమ్మాయిలకి చాలా అనుకూలమైనది కావడంతో నేను చాలా సంతోషించాను. గూగుల్ లో వెతికి కష్టపడి ఇంటర్వ్యూ కోసం ఒక రోజంతా చదివాను. రోజుల తరబడి అదే సబ్జెక్టు మీదే జ్ఞానం సంపాదించిన వారికి, ఒక్కరోజులో ప్రిపేరైన నాకు చాలా వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ బాబా కృపవలన నేను ఎంపిక కాబడతానని నాకు పూర్తి నమ్మకముంది. ఒక గురువారంనాడు నా ఇంటర్వ్యూ జరిగింది. ఒకటి తరువాత ఒకటి, మొత్తం నాలుగు రౌండ్లు పూర్తి చేశాను. రెండురోజుల తరువాత బాబా మహాసమాధి రోజున కంపెనీ వాళ్ళు  ఫోన్ చేసి నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. అవధులు లేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, నా కుటుంబసభ్యులతో ఆ సంతోషకరమైన వార్తను పంచుకున్నాను.

ఆ తరువాత వారం గడిచినా వాళ్ళనుండి ఏ కాల్ లేకపోవడంతో మరుసటి గురువారం నేను కంపెనీకి ఫోన్ చేశాను. వాళ్ళు నా జీతానికి సంబంధించిన సమస్య వలన నన్ను హోల్డ్ లో పెట్టి, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పారు. ఆ మాటతో నా గుండె బద్దలైపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ, "సాయిదేవా! దయచేసి నాకా ఉద్యోగాన్ని ఇప్పించండి" అని అభ్యర్థించాను. మరుసటిరోజు నాకొక కల వచ్చింది. కల స్పష్టంగా గుర్తులేదుగాని, కలలో నేనొక పూలమాలను బాబాకి సమర్పిస్తున్నాను. ఆ సాయంత్రం నేను గుడికి వెళ్లి, షాపులో పూలమాల తీసుకుంటుండగా కంపెనీ హెచ్.ఆర్. నుండి ఫోన్ వచ్చింది. అతను, "మేము మీకు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీకు సమ్మతమైతే, ఇప్పటికే మేము తీసుకున్న వ్యక్తి వేరే బ్రాంచ్ కి వెళ్తార"ని చెప్పారు. నేను వెంటనే నా అంగీకారం తెలిపాను. ఆ ఆనందంలో బాబాకి పూలమాల సమర్పించుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ తరువాత కూడా కంపెనీ నుండి స్పందన లేదు. వారం గడిచాక నేను ఫోన్ చేస్తే, "కొన్ని కారణాల వలన మిమ్మల్ని హోల్డ్ లో పెట్టాం" అన్నారు. మళ్ళీ నేను కృంగిపోయాను. ఎంతో బాధతో, "బాబా! నా విషయంలో ఎందుకిలా చేస్తున్నారు? ఇలా చేయడం మీకు తగునా?" అని సాయితో పోరాడాను. "దయచేసి నన్ను అనుగ్రహించండి" అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాను. మరుసటిరోజే కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి, "మీ ఉద్యోగం నిశ్చయమైంది. మీ శాలరీ స్లిప్స్, ఇతర డాక్యుమెంట్లు పంపించండి" అన్నారు. మళ్ళీ సంతోషంతో బాబాకి క్షమాపణలు చెప్పి, "ఆశాభంగమైన కారణంగా బాధలో మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఇకపై మీకు తగిన బిడ్డగా ఉంటాను" అని బాబాకు వాగ్దానం చేశాను.

అయితే తరువాత కూడా వాళ్ళనుండి ఎటువంటి స్పందనా లేదు. మళ్ళీ నేనే ఫోన్ చేసి అడిగితే, వాళ్ళు, "ఇంక మీరు వేచి ఉండనవసరం లేదు. మాకు కావాల్సిన, ఆ ఉద్యోగానికి తగిన వ్యక్తి దొరికారు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ప్రయత్నించండి" అని స్పష్టంగా చెప్పేశారు. అంతా ఒక ఆటలా సాగింది. కానీ ఈసారి నేను ఏడవలేదు, అదే ఉద్యోగం కావాలని పట్టుబట్టలేదు, బాబాతో పోట్లాడలేదు. ప్రశాంతంగా పూర్తి విశ్వాసంతో, "దేవా! ఎన్నో ఏళ్లుగా మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ ఉద్యోగం ఇవ్వడం లేదంటే అందులో ఏవో సమస్యలు ఉండే ఉంటాయి. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి ఎప్పుడూ నాకు తోడుగా ఉండండి. ఐ లవ్ యు సాయి" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు గురువారం, నేను ఆశ్చర్యపోయేలా హెచ్.ఆర్. ఫోన్ చేసి, "మేము చేసిన గందరగోళానికి క్షమాపణలు చెప్తున్నాను. మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వండి" అని చెప్పారు. అంతేకాదు, నేను అడిగిన శాలరీ హైక్(జీతం పెంపు) కూడా ఇచ్చారు. ఇదంతా సాయి లీల. ఏ పరిస్థితులు ఎదురైనా చెదిరిపోకుండా, ఎప్పుడూ నమ్మకాన్ని కలిగివుండే ఆయనకు తగిన బిడ్డగా నన్ను మలిచారు. "ఐ లవ్ యు సాయీ!"

అంతేకాదు, నా పాత కంపెనీనుండి నాకు రిలీవింగ్ లెటర్ వచ్చేలా కూడా బాబా సహకరించారు. 7 నెలల క్రితమే 40% శాలరీ హైక్ ఇచ్చినందువలన రిలీవింగ్ లెటర్ ఇవ్వడంలో వాళ్ళు నాకు సమస్యలు సృష్టించారు. కానీ సాయి ఉండగా దేనికైనా అసాధ్యమనేది ఉంటుందా? అందరికీ సాయిరామ్! 

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 1వ భాగం


పరిచయం

సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించిన తర్జడ్ కుటుంబానికి (శ్రీబాబాసాహెబ్ తర్ఖడ్, శ్రీమతి తర్ఖడ్ మరియు జ్యోతీంద్ర తర్ఖడ్) వారసుడైన వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్, సాయిబాబా గురించి, సాయిలీలలను గురించి తన తండ్రిగారు స్వయంగా వెల్లడించిన విషయాలను, ఆంగ్లంలో రచించి ప్రచురించిన గ్రంథం - “Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi”. ఈ అమూల్య గ్రంథంలో ఇప్పటివరకు వెలుగుచూడని ఎన్నో సాయిలీలలు, అనుభవాలు, సాయిచరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు పొందుపరచడం జరిగింది. శ్రీసాయి తత్త్వాన్ని, లీలాప్రబోధాన్ని ప్రతి అక్షరంలోనూ నిక్షిప్తం చేసుకున్న ఈ గ్రంథం చదువుతున్నంతసేపు శ్రీసాయి సాన్నిధ్యాన్ని మనకు అందిస్తుంది. ఆ అమూల్యమైన అనుభవాల తెలుగు అనువాదం మీ ముందు ఉంచుతున్నాము.

పరిచయం

ప్రియ పాఠకులారా! నేను(వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్) ఈ అనుభవాలను గ్రంథస్తం చేసేముందు, అవన్నీ కూడా నా స్వంత అనుభవాలు కావని, మా తండ్రిగారయిన శ్రీజ్యోతీంద్ర రామచంద్ర తర్ఖడ్  తాము జీవించి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మాతో పంచుకున్నవేనని మనవి చేసుకుంటున్నాను. నా చిన్నతనంలో, ఆయన తమ అనుభవాలను చెబుతుండగా విన్న నాకు అవి అద్భుతమైన కథలలాగా అనిపించేవి. నేను పెరిగి పెద్దయ్యాక, శ్రీసాయిబాబా దివ్యశక్తుల గురించి తెలుసుకున్న తరువాత, ఒక సామాన్య మానవుడు తన పూర్తి జీవితకాలంలో పొందడానికి అసాధ్యమైనటువంటి అమూల్యమైన అనుభవాలను, ఆధ్యాత్మిక అనుభూతులను శ్రీసాయిబాబా సాన్నిహిత్యంలో కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే మా నాన్నగారు పొందారని అర్థమయింది. నేనెప్పుడూ ఈ అద్భుతమయిన అనుభవాలను అందరితో పంచుకోవాలని అనుకుంటుండేవాణ్ణి, కానీ, ప్రాపంచిక జీవితంలో మునిగితేలుతూ, దైనందిన కార్యక్రమాలలో తీరికలేకుండా ఉండే మనకు ఆధ్యాత్మిక రచనల మీద దృష్టి పెట్టడం కష్టమే. సాయిబాబా నడయాడిన పవిత్రక్షేత్రమైన శిరిడీని నేను అనేకసార్లు దర్శించాను. ఆ సమయంలో చాలామంది సాయిభక్తులను కలుసుకుంటున్నప్పుడు, “నేను కూడా ఒక సాయిభక్తుడినేనా?” అనే ఒక ప్రశ్న నాలో ఉదయిస్తుండేది. అలా చెప్పుకోవడానికి నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది, ఎందుకంటే మా నాన్నగారు అనుసరించిన సాయి పూజా విధానానికి, ఆధ్యాత్మిక మార్గానికి నేను దరిదాపులలో కూడా లేను. కానీ, మా నాన్నగారు జీవించి ఉన్నప్పుడు, బాబాతో ఆయనకున్న సాన్నిహిత్యం వల్ల నాకు కూడా శ్రీసాయిబాబాతో అద్వితీయమైన అనుబంధం ఉన్నదని, మా నాన్నగారు శిరిడీలో ఉన్నప్పుడు బాబా కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొన్న కారణంగా నేను శిరిడీ దర్శిస్తూ ఉంటానని సాటి సాయిభక్తులతో చెపుతుండేవాడిని. 

శ్రీసాయిబాబాతో అంతటి అనుబంధం కలగటానికి మా తర్ఖడ్ కుటుంబంలోని  ముగ్గురు వ్యక్తులు - మా నానమ్మగారు శ్రీమతి సీతాదేవి రామచంద్ర తర్ఖడ్, మా తాతగారు శ్రీరామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ మరియు మా నాన్నగారు శ్రీజ్యోతీంద్ర రామచంద్ర తర్ఖడ్ - ప్రధాన కారకులు. శ్రీసాయిబాబాతో ఈ ముగ్గురి అనుబంధం 1908వ సంవత్సరంలో మొదలై 1918వ సంవత్సరం వరకు అంటే శ్రీసాయిబాబా మహాసమాధి అయ్యేంతవరకూ కొనసాగింది. ఈ అనుబంధం ఫలితంగా మా కుటుంబంలోని వారందరికీ శ్రీసాయిబాబా ఆరాధ్య దైవమయ్యారు.

నేను శిరిడీలో వున్నప్పుడు ఎవరైనా సాయిభక్తులు మా నాన్నగారు పొందిన కొన్ని దివ్యానుభూతులను వర్ణించమని నన్ను కోరినప్పుడు, వారి కోరికను మన్నించి, అప్పటికప్పుడు నా మదిలో మెదిలిన అనుభవాలను వారితో పంచుకునేవాడిని. ఇదంతా శిరిడీలోని లెండీబాగ్‌‌లో జరుగుతూ ఉండేది. ఆ అనుభవాలను విన్న భక్తులు ఆ తరువాత నా పాదాలకు నమస్కరించేవారు. వారలా చేయటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి పుణె నుంచి వచ్చిన ఒక సాయిబృందం నన్ను పుణె వచ్చి అక్కడి సాయిభక్తులందరికీ ఆ అనుభవాలన్నింటినీ వివరించమని నన్ను కోరారు. నేనందుకు సమ్మతించి, నా భార్యాపిల్లలతో కలిసి పుణె వెళ్ళాను. రెండు గంటలపాటు జరిగిన ఆ కార్యక్రమం పూర్తయ్యాక, నాకు నమస్కారం చేయడానికి అందరూ లైనులో నిలబడివున్నారు. నేను గృహస్తుడిని, నేను పంచుకున్న అనుభవాలన్నీ మా నాన్నగారివి, పైగా వాటిని చెప్పేటప్పుడు కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉన్న కారణంగా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అదే సమయంలో, నేను ఉద్యోగ విరమణ చేసిన తరువాత చాలా ఖాళీ సమయం ఉంటుందని, ఆ సమయాన్ని మా తర్ఖడ్ కుటుంబసభ్యుల అనుభవాలను గ్రంథస్తం చేయటానికి ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇది కేవలం శ్రీసాయిబాబాపై నాకున్న భక్తి, ప్రేమలను తెలియచేయడానికే. జూన్ 18, 2003 నాటికి నాకు 60 సంవత్సరాలు నిండాయి. ఈరోజు ఆగస్టు 15, 2003 అనగా మన ప్రియతమ భారతదేశపు 57వ స్వాతంత్య్ర పర్వదినాన, నేను ఈ పుస్తకం వ్రాయడానికి ఉపక్రమించాను.

ప్రియమైన సాయిభక్తులారా! నేను(వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్) చిరస్మరణీయమైన శ్రీసాయిసచ్చరిత్ర రచించిన శ్రీఅన్నాసాహెబ్ దభోళ్కర్ (హేమాడ్ పంత్) అంతటివాడిని కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. శ్రీసాయిబాబా జీవితచరిత్రను 53 అధ్యాయాలుగా గ్రంథస్తం చేయబడిన ఆ పవిత్రమైన గ్రంథాన్ని నేను క్రమం తప్పకుండా పారాయణ చేస్తుంటాను. ఆ పవిత్రమైన గ్రంథంలో, మా నాన్నగారు శిరిడీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు తాను స్వయంగా చూసి, నాకు చెప్పిన వాటిని, నేను మీకు సవినయంగా వివరిస్తున్నాను. ఆ సంఘటనలు జరిగిన ఖచ్చితమైన తేదీలు గాని, సమయం గాని మీకు చెప్పలేకపోతున్నందుకు నన్ను మన్నించమని కోరుకుంటున్నాను.

మా నాన్నగారు, 1908 - 1918 సంవత్సరాల మధ్యకాలంలో మొత్తం 17 సార్లు శిరిడీ దర్శించారు. ఒకసారి శిరిడీ వెళితే, అక్కడ 8 రోజుల నుంచి నెలరోజుల వరకు ఉండేవారు. ఈ సందర్భాలలో ఆయన, శ్రీసాయిబాబా మానవాతీతశక్తులను, దివ్యలీలలను ప్రత్యక్షంగా చూశారు. నిజానికి, ఆయన తను సెయింట్ జేవియర్ స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే తన అనుభవాలను వ్రాస్తుంటే ఎంతో బాగుండేది. మా మనస్సుకు అద్వితీయమైన ప్రశాంతతను కలుగచేసే ఈ అనుభవాలు వ్రాయడానికి గల ముఖ్యకారణం శ్రీసాయిబాబాపై మాకున్న ప్రగాఢమైన, మనఃపూర్వకమైన భక్తి శ్రద్దలను వ్యక్తీకరించడానికే.

ఈ గ్రంథం చదివిన తరువాత నాకు కూడా కొన్ని దివ్యానుభూతులు కలిగి ఉండవచ్చని మీరు అనుకోవచ్చు. నాకు కలిగిన అనుభవాలు, మా నాన్నగారు అనుభవించినంత గొప్పవి మాత్రం ఖచ్చితంగా కాదని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల, ఆయనకు శ్రీసాయిబాబాతో అనుబంధం ఏర్పడాలని ముందే విధి నిర్ణయింపబడి వున్నదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. 

ఆయన అనుభవాలన్నీ కూడా ఆయన వివాహానికి ముందు అనగా ఆయన వయస్సు 14 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండగా జరిగినవి. అటువంటి దివ్యానుభూతులను పొందిన తర్వాత కూడా మా నాన్నగారు సంసార జీవితంలోకి ఎందుకు అడుగుపెట్టారోనని నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఒకవేళ అలానే జరిగివుంటే అప్పుడు నేనే ఉండేవాడిని కాదు, ఈ పుస్తకం కూడా వెలుగు చూసి ఉండేదికాదు.

తర్ఖడ్ కుటుంబ పరిచయం

మా స్వంత ఊరు వసయ్ కోట (ఫోర్ట్ ఆఫ్ బస్సెన్) దగ్గరున్న తర్ఖడ్  గ్రామం. అందుచేత  మా ఇంటి పేరు తర్ఖడ్ అయింది. చారిత్రాత్మకంగా, మా పూర్వీకులు గొప్ప మరాఠాయోధుడైన చిమ్నాజీ అప్పాగారితో కలిసి వసయ్ కోట యుద్ధంలో పోర్చుగీసువారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ యుద్ధంలో పోర్చుగీసువారు ఓడిపోయారు. మా పూర్వీకుల ధైర్యసాహసాలకు గుర్తుగా చిమ్నాజీ అప్పాగారు తర్ఖడ్ గ్రామాన్ని వారికి జాగీరుగా ఇచ్చారు. తరువాత కాలంలో మరాఠాల నుంచి ఆ కోటను ఆంగ్లేయలు తమ వశం చేసుకున్నారు. మా ముత్తాత నాన్నగారయిన శ్రీపాండురంగ తర్ఖడ్ తమ నివాసం తర్ఖడ్ నుండి ముంబయికి మార్చారు. ఆయన చౌపాటీలోని చర్నీరోడ్డులో విల్సన్ కాలేజ్ దగ్గర బంగళా కట్టుకున్నారు. పాండురంగ గారికి ఇద్దరు కొడుకులు - దడోబా మరియు ఆత్మారాం. వీరిలో దడోబా ప్రముఖ వ్యాకరణవేత్త. ఆయన మరాఠీ మాతృభాష అయిన వారికోసం, ఆంగ్లంలో తప్పులు లేకుండా చక్కగా మాట్లాడటానికి, వ్రాయడానికి ఉపయోగపడేలా ఆంగ్ల వ్యాకరణ పుస్తకాలను వ్రాసారు. రెండవ కొడుకు ఆత్మారాం వృత్తిరీత్యా వైద్యుడు. అప్పట్లో ముంబయి వైస్రాయికి కుటుంబవైద్యుడు కూడా. 

మా తాతగారయిన శ్రీరామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ కాటన్ టెక్స్ టైల్ రంగంలో స్పెషలిస్ట్ మరియు ఖటావ్ గ్రూపు మిల్లులకు సెక్రెటరీ. ఆయన బాంద్రాలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తరువాత ఆయనకు శ్రీసాయిబాబాతో పరిచయం ఏర్పడింది. 'శ్రీశిరిడీ సాయిబాబా సంస్థాన్' వ్యవస్థాపకసభ్యులలో ఆయన ఒకరు. అంతేకాకుండా, ఆయన దానికి మొట్టమొదటి కోశాధికారి కూడా. 

ముంబయి మరియు మహారాష్ట్ర ప్రజలకు బాబా సందేశాలనందిస్తున్న దాసగణు మహారాజుకు ఆయన సాధ్యమయినంత సహాయం చేస్తుండేవారు. మీరు శిరిడీని సందర్శించినప్పుడు, బాబా సమాధిమందిరంలో, బాబా భక్తుల ఫోటోల మధ్యలో వారి ఫోటోలను కూడా చూడవచ్చు. స్వర్గీయ అన్నాసాహెబ్ దభోళ్కర్ వ్రాసిన శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథం మనకు ఆ కాలంలో శిరిడీలో జరిగిన బాబా లీలల యొక్క సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. శ్రీసాయిసచ్చరిత్రలోని 9వ అధ్యాయం తర్ఖడ్ కుటుంబానికి శ్రీసాయిబాబాతో గల అనుభవాలను తెలియచేస్తుంది. ఆ అధ్యాయంలో ప్రస్తావించబడిన బాబాసాహెబ్ తర్ఖడ్ మా తాతగారు, శ్రీమతి తర్ఖడ్ మా నానమ్మగారు, వారి కుమారుడు జ్యోతీంద్ర రామచంద్ర తర్ఖడ్ మా నాన్నగారు. నేను చెప్పబోయే అనుభవాలు ఎక్కువగా మా నాన్నగారు జ్యోతీంద్రగారివిఆయన 1895, జూన్ 15న జన్మించి, 1965, ఆగస్టు 16న మరణించారు. 

రచయిత పరిచయం

నా పేరు వీరేంద్ర జ్యోతిరాజా తర్ఖడ్. జ్యోతీంద్ర రెండవ కుమారుడిని. వృత్తిరీత్యా నేను ఇంజనీరుని. నేను క్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్, సీమన్స్ ఇండియా లిమిటెడ్ అనే రెండు కంపెనీలలో మేనేజర్ హోదాలో పనిచేసి, ప్రస్తుతం పదవీవిరమణ చేసి శాంతాక్రజులో ఉంటున్నాను. ప్రియమైన సాయిభక్తులారా! ఈ గ్రంథం చదివిన తరువాత శ్రీసాయిపై మనకున్న భక్తి, ప్రేమలను పరస్పరం పంచుకోవడానికి మనం తప్పక కలుసుకోవచ్చు.

వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"


 




 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo