సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 12వ భాగం


శ్రీసాయిసచ్చరిత్రలోని మరికొన్ని లీలలు

ప్రియమైన పాఠకులారా! మా నాన్నగారు శిరిడీలో ఉన్నప్పుడు జరిగిన చాలా సంఘటనలు శ్రీసాయిసచ్చరిత్రలో వివరించబడ్డాయి. వాటిని మా నాన్నగారు మాకు వివరించి చెబుతూ వుండేవారు. ఈ అధ్యాయంలోని సంఘటలన్నీ అటువంటివే. వాటిని మా నాన్నగారి ద్వారా నేరుగా విన్నందుకు నేను ఎంతో అదృష్టవంతుడినని భావిస్తున్నాను. నా జ్ఞాపకాలలో భద్రపరచబడి వున్న ఆ అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆ సంఘటనలు జరిగిన సమయంలో అక్కడ ఉన్న చాలామంది భక్తులు కూడా అటువంటి అనుభవాన్నే పొందివుంటారు. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా అనిపిస్తే నన్ను మన్నిస్తారని భావిస్తున్నాను. 

పులికి ముక్తిని ప్రసాదించుట

ఈ సంఘటన 1918వ సంవత్సరంలో జరిగింది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు శిరిడీని ఆఖరిసారి దర్శించినప్పుడు జరిగిన సంఘటన కావటంతో దీనిని చాలా బాగా గుర్తుంచుకున్నారు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వారంరోజుల తరువాత బాబా మహాసమాధి చెందారు. ఆ సంఘటన జరిగిన రోజున ఎప్పటిలాగే మసీదులో బాబా దర్బారు జరుగుతుండగా, హఠాత్తుగా మసీదు బయట కలకలం చెలరేగింది. అందరూ అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నారు. నలుగురు దర్వేషులు ఎంతో బలంగా వున్న ఒక పెద్దపులిని గొలుసులతో బంధించి, ఎడ్లబండి మీద తీసుకుని వచ్చి, మసీదు ప్రవేశద్వారం వద్ద నిలిపారు. దర్వేషులలో ఒకతను మసీదులో ప్రవేశించి శ్యామాతో, ఆ పులి ఒక్కటే తమ జీవనాధారం అని, ఆ పులిని ఊరూరా త్రిప్పుతూ ప్రదర్శనలు చేసి, వచ్చిన ఆదాయంలో కొంత తమ జీవనానికి, కొంత పులి కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆ పులికి జబ్బు చేసిందని, శిరిడీ గ్రామం మీదుగా వెళుతుండగా, శిరిడీలో సాయిబాబా అనే గొప్ప మహాత్ముడు నివసిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. అంతేకాకుండా, సాయిబాబాకు అద్భుతమైన శక్తులున్నాయని, ఆయన తమ దివ్యదృష్టితోనే జీవుల బాధలు నివారించగలరని విన్నామన్నారు. అందుచేత తమకు అనుమతినిస్తే, బాధపడుతున్న ఆ పులిని బాబాకు చూపిద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు. 

శ్యామా బాబాను సంప్రదించగా, పులిని మసీదులోకి తీసుకురావడానికి బాబా సమ్మతించారు. నెమ్మదిగా నడుస్తున్న ఆ పులిని దర్వేషులు అన్ని జాగ్రత్తలతో మసీదులోనికి తీసుకుని వచ్చారు. ఆ పులి, బాబా కూర్చుండే మసీదు మెట్ల దగ్గరకు వచ్చింది. అది బాబా వైపు చూసి, తన ముందరి కాళ్ళను చాపి, బాబాకు నమస్కారం చేసుమటుగా తన శిరసును క్రిందకు వంచింది. అంతలోనే హఠాత్తుగా పెద్దగా గర్జించింది. ఆ గర్జన ఎంత భీకరంగా ఉందంటే, దాని దెబ్బకు మసీదంతా పెద్ద కుదుపునకు లోనయింది. అలా పెద్దగా గర్జించి, ఆ పులి అచేతనంగా నేలమీదకు ఒరిగిపోయింది. నలుగురు దర్వేషులు పరిగెత్తుకుని వెళ్ళి చూసి ఆ పులి మరణించిందని తెలుసుకుని ఖిన్నులయ్యారు. వారు బాబాతో, ఆ పులి చనిపోయిందని, దానిని ఏం చేయమంటారని అడిగారు. పులి శరీరాన్ని శివుని మందిరం బయటవున్న నంది విగ్రహం దగ్గర సమాధిచేయమని బాబా వారికి చెప్పారు. శిరిడీలోని జనమంతా ఆ పులిని సమాధి చేసే కార్యక్రమాన్ని చూడటానికి తరలివచ్చారు.

మా నాన్నగారు జరిగినదంతా ప్రత్యక్షంగా చూడటం వల్ల బాబాకు, పులికి మధ్య ఏదో మౌనసంభాషణ జరిగిందని, దాని తరువాతనే ఆ పులి మరణించిందని ఆయనకు అనిపించింది. బాబాకు, పులికి మధ్య నిజంగా ఏం జరిగిందన్నది బాబాను అడిగి తెలుసుకోవాలని ఎంతో ఆతురతతో ఉన్న మా నాన్నగారు, తగిన సమయం కోసం వేచి చూచి బాబాను అడిగారు. బాబా చిరునవ్వు నవ్వి మా నాన్నగారితో, “భావూ! ఆ పులి భరింపరాని వేదనతో ఉంది. తానిక ఆ వేదనను భరించలేనని, తనను ఆ బాధ నుంచి విముక్తి చేయమని అర్థించింది. దాని దీనావస్థను చూసి నాకు జాలి వేసి, దానికి ముక్తిని ప్రసాదించమని నేను దేవుని ప్రార్థించాను. నా దైవం ఎంతో దయకలవాడు. ఆయన నా ప్రార్థనలను స్వీకరించి, ఆ పులికి ముక్తిని ప్రసాదించాడు. ఆ పులి ఈ జనన మరణ చక్రాల నుండి సంపూర్ణమైన స్వేచ్ఛను పొందింది" అన్నారు. 

బాబా ఇచ్చిన వివరణకు మా నాన్నగారు నిశ్చేష్టులై బాబాతో, ఆయన యింతవరకూ మనుష్యుల మీదనే తమ అనుగ్రహ జల్లులను కురిపించడం చూశానని, కానీ మొదటిసారిగా ఇప్పుడు, పులి లాంటి ఒక క్రూరజంతువు మీద కూడా వారి అనుగ్రహపు జల్లులను కురిపించడం చూస్తున్నానని చెప్పారు.

వరుణుడిపై ఆధిపత్యం 

ఒకసారి శిరిడీలో అనుకోని విధంగా కుండపోత వర్షం వచ్చినప్పుడు జరిగిన దృష్టాంతం శ్రీసాయిసచ్చరిత్రలో మనము చూడవచ్చు. అప్పుడు మా నాన్నగారు అక్కడే ఉన్నారు. రెండు మహాశక్తుల మధ్య జరిగిన యుద్దాన్ని వీక్షించిన అదృష్టవంతులలో మా నాన్నగారు కూడా ఒకరు. సాయిబాబా అష్టసిద్ధులు సంపాదించారని, తమను కష్టాల బారినుండి బయటపడవేయమని తన భక్తులు కోరినప్పుడు, ఆ కష్టాల బారినుండి వారిని గట్టెక్కించడానికి బాబా వాటిని ఉపయోగించేవారని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సాయిబాబా ఈ భువిపైన అవతరించిన భగవంతుని అవతారం, అందుకే ప్రకృతి శక్తులు కూడా ఆయన ఆజ్ఞలను శిరసావహించేవి. 

అది వర్షాకాలం. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రమయ్యేసరికి ఇంకా పెద్దదయింది. ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈదురుగాలులు వీచడం మొదలైంది. ఉరుములతో కూడిన గాలి, వాన వచ్చే సూచనలు బాగా కనిపించాయి. ఆకాశంలో మెరుపులు, వాటివెనుకే భయంకరమైన ఉరుములు వస్తున్నాయి. ఆ తుఫాను చాలా తీవ్రంగా ఉండి శిరిడీ గ్రామాన్నంతా విపరీతమయిన వర్షంతో ముంచెత్తింది. ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయింది. శిరిడీ ప్రజలు అంతకుముందెప్పుడూ అటువంటి ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి చూడలేదు. గ్రామస్తులంతా తమ పశువులతో సహా బాబా మసీదులో గుమిగూడటం మొదలుపెట్టారు. ఈ ప్రళయానికి మా నాన్నగారేమీ మినహాయింపు కాదు. ఆయన కూడా మసీదు చేరుకున్నారు.

మహాభారతంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి సమస్త ప్రాణులను కనీవినీ ఎరుగని ప్రకృతి ఆగ్రహం నుండి రక్షించిన సంఘటనని అప్పుడాయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు శిరిడీలోని స్థానిక ప్రజలకు శ్రీకృష్ణునిలాగా తమను కూడా అటువంటి విపత్కర పరిస్థితి నుండి రక్షించగలిగే వాని అవసరం కలిగింది. అందరూ భయాందోళనలతో బాబాను ఆశ్రయించి, వారి అనుగ్రహం తమపై వర్షించాలని ఎదురు చూస్తున్నారు. తుఫాను తగ్గే సూచనలు ఎక్కడా కనపడలేదు. బాబా ఓర్పు కూడా నశించింది. ఆయన తమ గద్దె నుంచి లేచి, సటకా చేతిలోకి తీసుకొని మసీదు ద్వారం దగ్గరకు వచ్చారు. ఆయన మసీదు బయటకు రాగానే, ఆకాశంలో తీక్షణమైన మెరుపు మెరిసింది. బాబా సటకాతో నేలమీద కొట్టి, తీవ్రమైన స్వరంతో, “పోతావా లేదా! (జాతేస్ కీ నై)” అని గర్జించారు. ఆయన గర్జింపు ఎంత తీవ్రంగా ఉందంటే, శిరిడీ అంతా భూకంపం వచ్చిందా అన్నట్లు వణికింది. తీక్షణమైన మెరుపు రావడం, శిరిడీ నుంచి వెళ్ళిపొమ్మని వరుణదేవుడిని ఆజ్ఞాపిస్తూ బాబా సటకాతో నేలమీద కొట్టడం, యిలా వరుసగా మూడుసార్లు జరిగింది. అది రెండు మానవాతీతశక్తుల మధ్య జరిగే పోరాటమని స్పష్టంగా కనబడుతోంది.

త్వరలోనే బాబా ఆజ్ఞకనుగుణంగా తుఫాను తగ్గుముఖం పట్టింది. మెరుపులు ఆగిపోయాయి. వర్షం తగ్గుముఖం పట్టింది, ఈదురుగాలులు తగ్గాయి. సుమారు ఒక గంట తరువాత శిరిడీ అంతటా ప్రశాంతత నెలకొన్నది. ఆకాశం నిర్మలమవడంతో, అందరినీ తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళమని బాబా చెప్పారు. మా నాన్నగారు యథావిధిగా పెట్రోమాక్స్ దీపాలను వెలిగించడానికి వెళ్ళారు. ఆ యుద్ధం గురించి బాబాను అడుగుదామని తగిన సమయం కోసం చాలా ఆతృతగా ఆయన వేచివున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన, “బాబా! మీకు ప్రకృతిని కూడా శాసించగలిగే శక్తి ఉందా?” అని బాబాను అడిగారు. బాబా సమాధానం చెబుతూ, “భావూ! నా భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు, వారిమీద దయను కురిపించమని ఈ విశ్వమంతటికీ ప్రభువైన భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. భగవంతుడు వచ్చి నాకు సహాయం అందిస్తాడు” అన్నారు. అంతటి భయంకరమైన తుఫానులో నిలబడి, ప్రకృతి భీభత్సాన్ని ఆపమని బాబా వరుణదేవుని ఆజ్ఞాపించిన దృశ్యం మా నాన్నగారి హృదయంలో చెరగని ముద్ర వేసింది. ఆ సమయంలో బాబా విలక్షణమైన భగవదవతారంగా కనిపించారు.

అగ్నిమీద అధికారం

తాము మహాసమాధి చెందే రోజును బాబా ముందుగానే నిర్ణయించుకున్నారు. అదే విజయదశమి, మనకందరికీ బాగా తెలిసిన దసరా. ఒకరోజు సాయంత్రం, మసీదులో బాబా వెలిగించిన పవిత్రమైన ధునికి ఎదురుగా, ఎప్పుడూ కూర్చొనే స్థలంలో బాబా కూర్చొనివున్నారు. ధుని తీవ్రంగా ప్రజ్వరిల్లసాగింది. మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. ప్రతి సాయంత్రం ఆయన మసీదులో కూర్చుని, అక్కడ జరిగే వాటినన్నిటినీ ఆసక్తికరంగా గమనిస్తూ, తరువాత పెట్రోమాక్స్ దీపాలు వెలిగించి తన విధిని నిర్వహిస్తూ ఉండేవారు. ఆ రోజు బాబా హఠాత్తుగా లేచి ధుని వద్దకు వెళ్ళి కొన్ని కట్టెలను కదిపి, మసీదులో పైకి, క్రిందకు తిరుగుతూ ఏదో గొణగడం మొదలుపెట్టారు. అది గమనిస్తున్న మా నాన్నగారికి అనుకోని సంఘటన ఏదో జరగబోతోందనిపించింది.

ఆ రోజుల్లో కూడా, బాబా మతం గురించి అంటే పుట్టుకతోనే ఆయన హిందువా లేక ముస్లిమా అని తెలుసుకోవాలనే ఆత్రుతతో చాలామంది భక్తులుండేవారు. ఆయన మానవరూపంలో ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఒక మానవశరీరం నుంచే జన్మించి వుండవచ్చని, అటువంటప్పుడు ఆయన తల్లిదండ్రులు హిందువులా లేక ముస్లిములా అన్నదే వారి ప్రశ్న. మా నాన్నగారేమీ దీనికి మినహాయింపు కాదు. బాబా కోపం మెల్లమెల్లగా తారాస్థాయికి చేరుకుంది. ఆయన అక్కడున్న భక్తులందరినీ తిట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ ధునిలోని మంటలు కూడా బాబా కోపానికి అనుగుణంగా అదే స్థాయిలో పైపైకి ఎగసిపడుతున్నాయి. మసీదు మొత్తం ధుని మంటల వెలుగుతో ప్రకాశిస్తోంది. 

బాబా తీవ్ర ఆగ్రహావేశాలతో వున్నారు. ఇంతలో హఠాత్తుగా ఆయన తన తలకు చుట్టుకున్న వస్త్రాన్ని తీసి ధునిలో విసిరేశారు. ధునిలో మంటలు ఇంకా పైకెగసిపడసాగాయి. కొంతసేపయిన తరువాత బాబా తన కఫ్నీని తీసివేసి దానిని కూడా ధునిలోకి విసిరేశారు. ధునిలో మంటలు ఇంకా పైకెగసి మసీదు పైకప్పును అంటుకుంటాయేమోనని భక్తులంతా భయపడ్డారు. బాబా కోపం తారాస్థాయికి చేరుకున్నది. ఆయన ఆవేశంతో రెప్పపాటులో తన లంగోటీని కూడా తీసి మండుతున్న ధునిలో విసిరేసి దిగంబరంగా నిలబడి అక్కడున్న వారితో, ఆయనను జాగ్రత్తగా గమనించి, వారు హిందువా లేక ముస్లిమా అని తేల్చుకోండని గట్టిగా అరిచారు. అప్పుడు బాబా తీక్షణంగా మండుతున్న అగ్నిలా ఉన్నారు. బాబా కళ్ళు మండుతున్న అగ్నిగోళాల్లా ఉండి, ఆయన శరీరంలోని ప్రతి అణువు నుండి కాంతి కిరణాలు వెదజల్లుతూ ఉండి, ఆయన శరీరం మొత్తం ఒక ఆధ్యాత్మిక గోళంలాగా వెలిగిపోతున్నది. ఆ కాంతి కిరణాలు ఎంత శక్తివంతంగా ఉన్నాయంటే వాటిని చూడలేక మా నాన్నగారు కళ్ళు మూసుకోవలసి వచ్చింది. ఆ మిరుమిట్లు గొలిపే కాంతి వెలుగులో మా నాన్నగారితో సహా మసీదులోని భక్తజనమంతా నిశ్చేష్టులై నిలబడిపోయారు. 

బాబా మతమేదో కనుగొనటం ఎవ్వరి తరమూ కాలేదని వేరే చెప్పనవసరం లేదు. బాబా కోపం మాత్రం తగ్గలేదు. ధునిలోని మంటలు బాగా పైకి ఎగసిపడుతూ అమితమైన కాంతిని వెదజల్లుతున్నాయి. అదే సమయంలో, మసీదు బయట తీవ్రమైన ఉరుములు, మెరుపులతో ఆకాశం భీభత్సంగా ఉన్నది. అప్పుడు బాబాకు సన్నిహిత భక్తుడైన భాగోజీషిండే ముందుకు వచ్చి, ఎంతో ధైర్యంతో కొత్త లంగోటీని బాబా మొలకు చుట్టాడు. ఆ తరువాత బాబా శాంతించి మామూలు స్థితికి వచ్చారు. 

ఆయన సటకా తీసుకుని ధునికి దగ్గరగా వచ్చి, “ఉగీ! ఉగీ! (తగ్గు! తగ్గు!)” అంటూ సటకాతో మంటలను కొట్టడం మొదలు పెట్టారు. ఒక్కొక్క సటకా దెబ్బకు, కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి, కొంతసేపటికి ధుని మామూలుగా వెలగసాగింది. అప్పుడు భక్తులు ధైర్యం తెచ్చుకొని, బాబాకు క్రొత్త కఫ్నీ ధరింపచేసి, ఆయన తలకు కొత్త గుడ్డను చుట్టారు. అప్పటికే చాలా ఆలస్యమయినప్పటికీ, భక్తులందరూ బాబాను సగౌరవంగా చావడికి తీసుకొని వెళ్ళి శేజ్ ఆరతి ఇచ్చారు. దైవాంశసంభూతుడైన బాబా దేహం నుండి కాంతి వెలువడటం, ఆయన తమ శక్తినుపయోగించి అగ్నిని అదుపులో పెట్టడం మా నాన్నగారిని ఎంతో ముగ్ధుడిని చేశాయి.

బాబా విజయదశమిని ఒక ప్రయోజనం కోసం ఎన్నుకున్నారు. తాము ఈ ప్రపంచాన్నుంచి సెలవు తీసుకోవడానికి ఎన్నుకున్న రోజుగా తన భక్తులకు సూచించారు. తరువాత 1918లో విజయదశమి రోజున బాబా మహాసమాధి చెందారు. ప్రియమైన సాయి భక్తులారా! సాయి అంటే సాక్షాత్తు భగవంతుడే. సర్వాంతర్యామి అయిన శ్రీసాయిబాబా అన్ని కులమతాలకు అతీతులు. మనమంతా బాబా మతమేమిటన్న మన ఉత్సుకతను సమాధి చేసి అమితమైన భక్తితో, సంపూర్ణమైన విశ్వాసంతో ఆయనను సేవించాలి.

మేఘుడు సాయిబాబాను అభిషేకించుట

శిరిడీలో స్థిరనివాసం ఏర్పరచుకున్న గొప్ప సాయిభక్తుడు మేఘ. అతడు గొప్ప శివ భక్తుడనే విషయం బాబాకు తెలుసు. అతడి దైవమైన శివునిపై భక్తిని పెంపొందించడానికి బాబా అతడికి ఒక శివలింగాన్ని బహుకరించారు. బాబా మేఘుడిని ఎంతగా ప్రేమించేవారంటే, శిరిడీలో జరిగిన మేఘుని అంతిమయాత్రలో బాబాను పాల్గొనేలా చేసింది. బాబా ఒక సాధారణ మానవమాత్రునివలే కన్నీరు కారుస్తూ ఆ అంతిమ యాత్రలో పాల్గొని, పూలు చల్లుతూ స్మశానం వరకు వెళ్ళి, మేఘుని దేహంపై చేతులుంచి, “ఇతడు నా నిజమైన భక్తుడు!” అంటూ తన ప్రియమైన భక్తునిపై తమ ప్రేమను తెలియచేసారు.

మేఘుడు బాబానే తన శంకరుడిగా భావించుకొన్నందువల్ల, తమ నుదుటిమీద త్రిశూలం గీయాలనే మేఘుని కోరికను బాబా మన్నించి, అతడికి అనుమతినిచ్చారు. ఒక మహాశివరాత్రినాడు గోదావరిజలంతో బాబాను అభిషేకించాలనే బలమైన కోరిక మేఘుడికి కలిగింది. కానీ బాబా అంత తేలికగా ఒప్పుకోరని తెలిసి, చాలా రోజుల ముందునుంచే తనకు అనుమతినివ్వమని మేఘుడు బాబాను వేడుకోవడం మొదలుపెట్టాడు. అలా ఎంతో వేడుకొనగా, చివరకు మేఘుడు తమను అభిషేకించడానికి బాబా అనుమతించారు. బాబా అనుమతి లభించినందుకు మేఘుడు చాలా సంతోషించాడు. మహాశివరాత్రికి ఒకరోజు ముందే, మేఘుడు తన సన్నిహితులందరినీ ఆ అభిషేకోత్సవం తిలకించడానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానితులలో మా నాన్నగారు కూడా ఒకరు. 

ముందురోజు రాత్రే మేఘుడు శిరిడీకి 11 కి.మీ. దూరంలో ఉన్న గోదావరినది పవిత్రజలాన్ని తీసుకురావడానికి ఒక కలశం తీసుకొని శిరిడీ నుండి బయలుదేరాడు. మేఘలాంటి పట్టుదలగల భక్తునికి దూరం ఒక సమస్య కానేకాదు. అతడు గోదావరిజలం తీసుకుని మధ్యాహ్నానికి కొంచెం ముందుగానే శిరిడీకి చేరుకున్నాడు. మధ్యాహ్న ఆరతి అయిన తరువాత మేఘుడు బాబాను అభిషేకోత్సవానికి సిద్ధంగా వుండమని కోరాడు. తానేదో సరదాగా అన్నానని, తనలాంటి ఫకీరుకు అటువంటి (అభిషేకాలు చేయించుకోవడం) పనులకు అనుమతి లేదని బాబా అతడితో చెప్పారు. ఆ జలంతో శిరిడీలోనే ఉన్న శివుని మందిరంలోని శివలింగానికి అభిషేకం చేయమని బాబా అతడితో చెప్పారు.

అప్పుడు మేఘుడు, తాను శివలింగానికి ప్రతిరోజూ అభిషేకం చేస్తున్నాననీ, బాబానే తన దైవమైన శివునిగా ఆరాధిస్తున్నానని, శివభక్తులందరికీ మహాశివరాత్రి గొప్ప పర్వదినం కాబట్టి తనను నిరాశపరచవద్దని బాబాను కోరాడు. మేఘుడు చాలా మొండిగా పట్టుబట్టడంతో, ఒక షరతు మీద మాత్రమే తనను అభిషేకించడానికి ఒప్పుకుంటానని బాబా అతడితో అన్నారు. గంగ శివుని శిరస్సు నుండి ఉద్భవించింది కాబట్టి తమ శిరస్సు మీద మాత్రమే నీళ్ళుపోయమని, అలా చేస్తే శరీరమంతటినీ అభిషేకించినట్లవుతుందని, దానికొరకు తాను ముందుకు వంగి కూర్చుంటానని బాబా అతడితో చెప్పారు. మేఘుడు అయిష్టంగానే ఈ షరతుకు ఒప్పుకున్నాడు. 

అప్పుడు బాబా తమ ఆసనం నుంచి లేచి లెండీబాగ్ వెళ్ళి ఎప్పుడూ తాము స్నానానికి ఉపయోగించే రాయిమీద కూర్చుని, తమ శిరస్సును ముందుకు వంచి, అభిషేకించమని మేఘునికి సంజ్ఞ చేసారు. మేఘుడు బాబా శిరస్సు మీద నెమ్మదిగా నీళ్ళు పోయడం ప్రారంభించాడు. కానీ అలా అభిషేకం చేయడం ఏమాత్రం తృప్తిని కలిగించలేదు. అందుచేత తన మనస్సులో మొదటనుంచి నిర్ణయించుకున్న విధంగా చేయడానికి సిద్ధమయ్యాడు. హఠాత్తుగా మేఘుడు పాత్రలో మిగిలివున్న నీటిని, “హర హర మహాదేవ” అంటూ బాబా శరీరం మీద కుమ్మరించి, తన కోరికను సంపూర్ణంగా నెరవేర్చుకున్నందుకు ఉల్లాసంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. 

అతడు బాబా శరీరాన్ని పూర్తిగా అభిషేకించినా, కేవలం ఆయన తల మాత్రమే తడిసి, కఫ్నీతో సహా మిగిలిన శరీరభాగమంతా పొడిగా ఉండటం చూసిన మేఘుడు, తన కళ్ళను తానే నమ్మలేక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అప్పుడు బాబా అతడితో, “మేఘా! నీకు తెలుసా! గంగ శివుని శిరస్సునుండి ప్రవహిస్తుంది, కానీ ఆయన మిగిలిన శరీరాన్ని మాత్రం తాకదు” అన్నారు. మిగిలిన ఆహ్వానితులతో కలిసి మా నాన్నగారు కూడా ఈ వినోదాన్నంతా వీక్షిస్తూ వున్నారు. బాబా పలికినదే వేదవాక్కని, దానిని ధిక్కరించే సాహసం ఎవరికీ ఉండదని మేఘుడికి తెలియచెప్పాలని బాబా ఉద్దేశ్యమని మా నాన్నగారికి అర్థమయింది. అంతేకాకుండా, అతడి దైవమైన శివుడు తామే అని మేఘుడికి బాబా తెలియచేయాలనుకున్నారు

అప్పటికే మా నాన్నగారు బాబా చర్యలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. కాలక్రమంలో కొంతమంది ఆదర్శప్రాయమైన భక్తులను బాబా తమ దగ్గరకు రప్పించుకున్నారు. ఆ భక్తుల ద్వారా, అనన్యమైన భక్తితో భగవంతుని అస్తిత్వాన్ని, ఆయన అద్భుతమైన శక్తులను గౌరవించడం నేర్చుకునేలా బాబా తమ భక్తులందరినీ ప్రభావితం చేస్తూ వుండేవారు. అలాంటివారిలో కొందరు - మేఘ(శివుడు), నానావలీ(హనుమాన్) మరియు దాసగణు(విఠోబా). నిజానికి దాసగణు తాను రచించిన ఒక ఆరతిగీతంలో “శిరిడి మాయే పండరిపుర సాయిబాబా రమావర (శిరిడీయే నా పండరిపురము, సాయిబాబాయే నా రమావరుడు (విబా)” అని కీర్తించాడు. బాబా సరదాగా ఉన్న సమయాలలో, “హే భావూ! నేను లక్ష్మీదేవతను, మసీదులో కూర్చుని నేనెన్నడూ అసత్యం పలుకను” అని అనేవారు. బాబా తానే భగవంతుడినని ఎన్నడూ చెప్పలేదు, ఎల్లప్పుడూ భగవంతుడి దూతననే చెప్పారు. ఆయన ఏది ఉచ్ఛరిస్తే అది తప్పకుండా జరిగేది. “భావూ! నేను ఈ శరీరాన్ని వదలి వెళ్ళిన తరువాత ప్రజలు పంచదార కోసం వచ్చే చీమలబారుల్లా శిరిడీకి రావడం నువ్వు చూస్తావు” అని బాబా చెప్పిన మాటలను మా నాన్నగారు ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండేవారు. ఎన్నో సంవత్సరాల క్రితం బాబా చెప్పిన ఆ మాటలు నిత్యసత్యమనే విషయం, మనమందరం ఇప్పుడు సంవత్సరంలో ఏ రోజున శిరిడీ దర్శించినా మనకు తెలుస్తుంది.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


6 comments:

  1. Om sairam andi tarkhad gaari kutumbam tho anubhaavaalni baaghunnaayandiii om sairam

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo