సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 181వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఊహకందనంత దూరంగా బాబా ఇచ్చిన మార్కులు
  2. బాబా మొత్తం ప్రపంచానికే సర్వశ్రేష్ఠమైన వైద్యులు

ఊహకందనంత దూరంగా బాబా ఇచ్చిన మార్కులు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సి.ఏ. చదువుతున్నాను. నేను నా సి.ఏ ఫైనల్ కి సంబంధించిన మొదటి గ్రూపు పరీక్షలను 4వ ప్రయత్నంలో పూర్తి చేశాను. ఆ తరువాత నేను రెండవ గ్రూపు పరీక్షలకు హాజరయ్యాను. కానీ మునుపటిలాగే నేను ఫెయిలయ్యాను. దానితో నాకు సహాయం చేయట్లేదని సాయి మీద ఒక నెలపాటు కోపంతో ఉన్నాను. "అందుకు నన్ను క్షమించండి సాయీ".

నెల తరువాత మళ్ళీ చదవడానికి కావలసిన మానసిక బలాన్ని బాబా ఇచ్చారు. ఈసారి నేను పరీక్షలకు చక్కగా సిద్ధమయ్యాను. పరీక్షలు మొదలయ్యాక మొదటి రెండు పేపర్లు బాగా వ్రాసాను. కానీ 3వ పేపర్‌ చూస్తూనే నేను చాలా కలవరపడ్డాను. ఎందుకంటే అందులోని ప్రశ్నలన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేనని నాకనిపించింది. మొత్తానికి ఏదో వ్రాసి, ఇంటికి వచ్చాక ఎన్ని మార్కులు వస్తాయని లెక్కించుకుంటే కేవలం 36 మార్కులు మాత్రమే వస్తాయనిపించింది. కనీసం 40 మార్కులు వస్తే గానీ పాస్ కాలేను. 3వ సబ్జెక్టుతో పోల్చితే 4వ సబ్జెక్టు బాగా చదవలేదు. అయినప్పటికీ ఆ పరీక్ష బాగా వ్రాశాను. ఎటొచ్చీ 3వ పేపర్ విషయంలోనే టెన్షన్ అంతా. నేను సాయిని ప్రార్థించి, "నేను నా కర్మ పూర్తిచేశాను, మిగతాది మీ చేతిలో వదిలిపెడుతున్నాను సాయీ!" అని చెప్పుకున్నాను. తరువాత 2 నెలలు నేను నా ఫలితాలకోసం ఎదురుచూస్తూ గడిపాను. ఆ సమయమంతా, "3వ పేపర్లో కనీసం 40 మార్కులు వచ్చేలా అనుగ్రహించమ"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ విషయమై నేను క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో అడిగిన ప్రతిసారీ సానుకూలమైన సమాధానాలు వస్తుండేవి.

చివరికి ఫలితాలు రావడానికి ఒక వారం మాత్రమే ఉన్న సమయంలో నాకొక ఆలోచన వచ్చింది. "ఫలితాలు బుధవారం ప్రకటించబడతాయి. కాబట్టి ముందు గురువారంనుండి ఒక వారంపాటు సాయి ముందు ఒక దీపం వెలిగిస్తాను. చివరిరోజైన బుధవారంనాడు సి.ఏ. పూర్తిచేసిన వ్యక్తిగా ఆయన ముందు దీపం పెడతాను" అని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే రోజూ దీపం వెలిగించాను. చివరికి బుధవారం రానే వచ్చింది. భయం భయంగా సైట్ తెరిచాను. ఆశ్చర్యం! "పాస్" అని కనపడింది. నా ఆనందానికి హద్దుల్లేవు. నా ఊహకందనంత దూరంగా 3వ పేపర్‌లో 55 మార్కులు వచ్చాయి. అంతా బాబా ఆశీర్వాదఫలమే! అప్పుడు నేను అనుకున్నట్లుగానే సి.ఏ. పూర్తి చేసిన వ్యక్తిగా బాబా ముందు దీపం వెలిగించాను. "నాకు తెలుసు బాబా, మొత్తం నా సి.ఏ. ప్రయాణంలో మీరు నాకు తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చారు. అందుకు నేను మీకు కేవలం కృతజ్ఞతలు చెప్పుకోలేను. నా జీవితమంతా మీకు ఋణపడివుంటాను. నేను మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇక నా భవిష్యత్తును మీరే నిర్ణయించండి. నాకేది శ్రేయస్కరమో అది చేస్తారని నా నమ్మకం. శ్రద్ధ, సబూరీల నిజమైన అర్థాన్ని నాకు అర్థమయ్యేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు సాయీ!"

బాబా మొత్తం ప్రపంచానికే సర్వశ్రేష్ఠమైన వైద్యులు

బెంగుళూరు నుండి సాయిభక్తుడు సూరజ్ రావు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబాకు అంకిత భక్తుడిని. ప్రతి విషయంలో నేను ఆయననే అంటిపెట్టుకుని ఉంటాను. ఆయనే నాకు దైవం, గురువు, తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, ప్రేమికుడు, స్నేహితుడు, వైద్యుడు, నన్ను నడిపించే ప్రేరణశక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన నా సూపర్ హీరో.

ఓం శ్రీసాయినాథాయ నమః. నా అనుభవాన్ని వ్రాసే ముందు, నన్ను ఆశీర్వదించమని సాయిబాబాను, శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాను. ఒకరోజు ఉదయం నా స్నానమయ్యాక నా మెడ భాగంలో ఒక రకమైన శబ్దం వినిపించింది. నేను దానిని అంతగా పట్టించుకోలేదు. కానీ ఆరోజు ముగిసే సమయానికి మెడ చుట్టూ నొప్పిగా అనిపించింది. కొన్నిరోజులకి నొప్పి తీవ్రంగా మారింది. దానివలన నేను కూర్చోలేను, నిలబడలేను, నిటారుగా నడవలేను, చివరికి సరిగ్గా నిద్రపోలేకపోయాను. నేను మందులు తీసుకున్నప్పటికీ నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఆఖరి ప్రయత్నంగా నేను బాబాను ప్రార్థించి అగరుబత్తి నుండి రాలిన బూడిదను ఊదీగా తీసుకుని మెడ చుట్టూ రాసుకున్నాను. అలా ప్రతిరోజూ చేస్తుండేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలో ఉన్నప్పుడు కలలో బాబా కనిపించి నా మెడ చుట్టూ సున్నితంగా తాకారు. నాకెంతో ఆశీర్వాదపూర్వకంగా అనిపించి సంతోషించాను. బాబా స్పర్శతో నా మెడనొప్పి పూర్తిగా అదృశ్యమైంది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. బాబా మొత్తం ప్రపంచానికే సర్వశ్రేష్ఠమైన వైద్యులు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo