బాబాసాహెబ్ రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ ప్రథమ సాయి దర్శనము
ప్రియమైన పాఠకులారా! మా తాతగారు కూడా సాయిబాబాను కలవాలని ముందే నిర్ణయింపబడివున్నదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆయన తన స్నేహితులయిన శ్రీశ్యామారావ్ జయకర్, శ్రీకాకాసాహెబ్ దీక్షిత్, జస్టిస్ దురంధర్ లను కలుసుకుని వారందరూ కూడా సాయిభక్తులేనని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయారు. ఆఖరికి మా తాతగారు తన కుటుంబంతో కలసి శిరిడీకి ఒక విహారయాత్రగా వెళ్ళడానికి అంగీకరించారు. ఆయన ఉద్యోగంలో తీరికలేని కారణంగా ఉద్యోగానికి సెలవుపెట్టి శిరిడీకి వెళ్ళడం కష్టం. అందుచేత, వారాంతంలో అంటే శుక్రవారం రాత్రి బయలుదేరి తన స్నేహితులతో కలిసి శిరిడీ వెళదామని నిర్ణయించుకున్నారు.
అలా ఒక శుక్రవారం రోజు రాత్రి వారు రైలులో మన్మాడుకు ప్రయాణమయ్యారు. మా నాన్నగారు, నానమ్మగారు పక్కలు పరచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. మా తాతగారు తన స్నేహితులతో కలిసి పేకాటలో మునిగిపోయారు. రైలు నాసిక్ రోడ్డు స్టేషను దాటి ముందుకు పరుగెడుతున్నది. ఇంతలో తలకు తెల్లని గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు వారున్న పెట్టెలోకి ప్రవేశించాడు. అతడు నేరుగా మా తాతగారి వద్దకు వచ్చి దక్షిణ అడిగాడు. మా తాతగారు అతడి స్థితి చూసి జాలిపడి వెంటనే ఒక వెండి రూపాయి నాణెం ఆ ఫకీరుకిచ్చి అక్కడి నుండి వెళ్ళమని చెప్పారు. ఫకీరు ఆ రూపాయి నాణాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆరోజుల్లో ఒక వెండి రూపాయి ఇవ్వడమంటే చాలా పెద్ద మొత్తం దానం చేస్తున్నట్లు లెక్క.
మా తాతగారు ఖటావ్ గ్రూపు మిల్లులకు సెక్రెటరీగా, అప్పట్లోనే(1908) నెలకు రూ.2000/- జీతం తీసుకునేవారు. ఆయన ఆ ఫకీరుతో, ఆ నాణెం 1905వ సంవత్సరంలో విడుదల చేయబడిందని, 5వ జార్జ్ బొమ్మ ముద్రించివున్న ఆ నాణెం అసలయినదేనని, అందుచేత అతడు ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదని చెప్పారు. తరువాత తమ పేకాటకు అంతరాయం కలుగుతుండటంతో అతడిని అక్కడి నుండి వెళ్ళిపొమ్మని మా తాతగారు మళ్ళీ చెప్పడంతో ఆ ఫకీరు వెళ్ళిపోయాడు.
మరునాడు ఉదయానికి వారు శిరిడీ చేరుకున్నారు. మా నానమ్మగారికి, నాన్నగారికి అంతకుముందే శిరిడీతో పరిచయం ఉండటం వల్ల మా తాతగారిని, వారి స్నేహితులను బసకు తీసుకువెళ్ళారు. వారు స్నానాలు, ఫలహారం ముగించుకుని పూజా సామగ్రితో మసీదులోకి ప్రవేశించారు. మా నాన్నగారు, నానమ్మగారు బాబా పాదాలు తాకి నమస్కరించుకున్నారు. బాబా అప్పుడు వారివైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి, మా తాతగారి వైపు తిరిగి, "మ్హాతరా(ముసలోడా)! నా తల్లీ, సోదరుడు నిన్ను ఎంతో బ్రతిమలాడి ఒప్పించడంతో నువ్వు శిరిడీ రావడానికి అంగీకరించావు. సరే, ఇంతకీ నన్ను గుర్తుపట్టావా?” అన్నారు. మా తాతగారు లేదన్నట్లుగా తల ఊపారు. అప్పుడు బాబా తమ కఫ్నీ జేబులో చెయ్యి పెట్టి 5వ జార్జ్ బొమ్మ ఉన్న ఒక వెండి రూపాయి నాణాన్ని బయటకు తీసి, దానిని మా తాతగారికి చూపిస్తూ, "కనీసం నిన్న రాత్రి నువ్విచ్చిన ఈ నాణాన్నైనా గుర్తించావా?” అని అడిగారు. అప్పుడు మా తాతగారు ముందురోజు రాత్రి రైలులో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని, తిరిగి సమాధానం చెప్పేలోగా, బాబా ఆయనతో, “ఏయ్! రాత్రి నువ్వు కలిసిన ఫకీరు మరెవరో కాదు, నేనే!” అన్నారు. బాబాను ఒక యాచకుడిగా భావించి తప్పుచేశానని తెలుసుకున్న బాబాసాహెబ్ పశ్చాత్తాపంతో బాబా పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. బాబా గురించి తన భార్య, కుమారుడు చెప్పినది నూటికి నూరు శాతం నిజమని, బాబా సామాన్యమైన వ్యక్తి కాదని, 'భగవంతుని దూత' అని ఆయనకు అర్థమయింది.
బాబా ఆ వెండి రూపాయి నాణాన్ని మా తాతగారికి తిరిగి ఇస్తూ, “మ్హాతరా! నువ్విచ్చిన నాణాన్ని తిరిగి నీకే ఇస్తున్నాను. దీనిని నువ్వు పూజించు! నీ జీవితం ఫలప్రదం అవుతుంది. నన్ను నమ్ము! ఈ పవిత్రమైన మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యం పలుకను” అన్నారు. ఆ విధంగా బాబా మా తాతగారిని "మ్హాతరా” అనీ, మా నాన్నగారిని 'భావూ' అని సంబోధించడం మొదలుపెట్టి, తరువాత కూడా అలాగే కొనసాగించారు.
బాబా పవిత్రం చేసి ఇచ్చిన నాణెం, కఫ్నీ |
ప్రియ పాఠకులారా! ఈ విధంగా తర్ఖడ్ కుటుంబంలోని ఆ ముగ్గురికీ శ్రీసాయిబాబాతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. నిజానికి బాబానే ఒక శక్తివంతమైన అయస్కాంతంలాగా వారిని తమ వైపుకు ఆకర్షించారు. వారందరూ కూడా బాబాపై అమితమైన ప్రేమను పెంపొందించుకున్నారు. అద్వితీయమైన అనుభవాలు కలగటంతో వారు తరచుగా శిరిడీ దర్శించసాగారు. ఆ అద్భుతమైన అనుభవాలన్నీ కూడా వారికి బాబా భగవంతుని అవతారమని తెలియజేస్తాయి. ఈ అనుభవాలన్నింటినీ నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. వాటిని చదివిన తరువాత మీరు కూడా బాబా భగవంతుని అవతారమని నాతో ఏకీభవిస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
ఓం సాయిరాం జీ 🙏🙏🙏
ReplyDeleteOm Sairam🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete