సాయి వచనం:-
'శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజురోజుకూ పెరిగినట్లు నన్ను రోజురోజుకూ అధికంగా ఆరాధించేవారు, మనోవృత్తిని, కామక్రోధాది వికారాలను నాకోసం అర్పించినవారు ధన్యులు. దృఢవిశ్వాసంతో తమ గురువును ఆరాధించేవారికి పరమేశ్వరుడు ఋణపడివుంటాడు. అట్టివారిని ఎవరూ చెడుబుద్ధితో చూడరు. అలా ఘడియ అయినా వ్యర్థం చేయక హరియొక్క, గురువుయొక్క భజనలో శ్రద్ధ ఉన్నవారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు.'

'సర్వజీవుల్లోనూ ఉన్న ఒకే భగవత్తత్త్వాన్ని గుర్తించమనీ, వారి దుఃఖాన్ని చేతనైనంతవరకు తొలగించమనీ బాబా ఉద్బోధించారు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 170వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • బాబాయే నా గురువు, స్నేహితుడు

సాయిభక్తురాలు ప్రియావినోద్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. సాయి మా జీవితంలో ఒక భాగమైపోయారు. చిన్నప్పటినుండి మా కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా బాబా ఎప్పుడూ మా చేయి విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టాలున్నా ఆయన మాకు తోడుగా ఉండి మా జీవిత ప్రయాణాన్ని సాఫీగా నడిపిస్తున్నారు. మీ అందరిలాగే నాకు కూడా బాబాతో చాలా అనుభవాలు ఉన్నాయి. వాటిలో ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

చిన్నప్పటినుండి నేను చాలా కష్టపడి చదివేదాన్ని. నేను డాక్టరు కావాలని కలలుకంటూ ఉండేదాన్ని. పిల్లలు తాము కోరుకున్న వాటికోసం తల్లిదండ్రులను మారాం చేసేలా నేను 'నాకు మంచి మార్కులు ఇవ్వండి, క్లాసులో ఫస్ట్ వచ్చేలా చేయండి..' మొదలైన కోరికలతో బాబాను ఇబ్బందిపెడుతూ ఉండేదాన్ని. మన స్వీట్ సాయి ఎప్పుడూ నా కోరికలు తీరుస్తూ నన్ను ఆశీర్వదిస్తుండేవారు. నా స్కూల్ డేస్ లో ఆయనెప్పుడూ నా చేయి విడిచిపెట్టలేదు. చిన్నతనంవలన కోరికల కోసం తప్పితే బాబాను పెద్దగా పట్టించుకోలేదు. కానీ పరిస్థితులు మారుతూ మా ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం మొదలైంది. ఆ కారణాల వలన నేను చదువులో శ్రద్ధ చూపలేకపోయాను. అందువలన నాకు మార్కులు తక్కువగా వచ్చాయి. చిన్నతనంవలన, పరిపక్వతలేని కారణంగా అందుకు బాబాను కారణంగా నిందించి, ఆయనను ప్రార్థించడం మానేశాను. చిన్న చిన్న కారణాలతో స్నేహితులతో పోట్లాడి మాట్లాడటం మానేసినట్లు నేను ఆయనకి దూరంగా ఉండసాగాను. "మన భావం ఎలా ఉంటే, ఫలితం అలా ఉంటుంద"ని బాబా అంటారు. అందుకేనేమో బాబా కూడా నాలో మార్పు తీసుకురాకుండా, నేనే అర్థం చేసుకుంటానని నాకు కొంత సమయం ఇచ్చారు. కొన్నిరోజులకి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఇంటిలో బాబా పూజ, పారాయణ జరిగింది. అక్కడికి మా ఇంట్లో అందరూ వెళ్లారు, నేను తప్ప! బాబాయే నన్ను పిలుస్తారు అని మొండిగా అనుకునేదాన్ని. ఆయన పద్ధతులు ఆయనకు ఉంటాయి కదా! పూజ నిర్వహించిన ఆవిడ ప్రసాదం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చింది. ఆమె నాతో, "నువ్వెందుకు రాలేదు?" అని అడిగింది. నేను, "బాబాకి, నాకు ఫైట్ జరుగుతోంది" అని సమాధానం ఇచ్చాను. ఆమె నవ్వుతూ, "బాబా కేవలం ప్రేమకు దాసోహమంటారు" అని చెప్పింది. ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపాయి. వెంటనే నేను బాబా వద్దకు పరుగుతీసి ఆయన ముందు కూర్చుని ఏడ్చేశాను. ఆయనకు క్షమాపణలు చెప్పుకుని, "ఏమి జరిగినా నా చేయి విడిచిపెట్టకండి బాబా!" అని ప్రార్థించాను.

కొన్ని నెలల తరువాత 2014లో మెడికల్ ఎంట్రన్స్ టెస్టు వ్రాసాను. కానీ సీటు రావడానికి అవసరమైన స్కోర్ సాధించలేకపోయాను. అదే సంవత్సరం మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఎంతలా అంటే, అక్క పెళ్లికోసం, నా చదువుకోసం అని ఉంచిన డబ్బు, ఆస్థి కూడా పోగొట్టుకున్నాము. ఆ సంవత్సరమే మా అక్క బి.టెక్ పూర్తి చేసింది. ఇంకా తనకి ఉద్యోగం రాలేదు. ఆ సంవత్సరం మా జీవితాల్లో అంధకారమైనదని చెప్పాలి. నాకు ఆ పరిస్థితులన్నీ కొత్తగా అనిపించాయి. కానీ బాబాపై విశ్వాసాన్ని కోల్పోలేదు. నేను వేరే కోర్స్ ఏదీ జాయిన్ కాకుండా ఇంట్లోనే ఉంటూ మరుసటి సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ టెస్టుకు సిద్ధమవుతున్నాను. ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నప్పటికీ నా తలిదండ్రులు నా ఇష్టానికి అడ్డు చెప్పలేదు. మరుసటి సంవత్సరమైనా మంచి మార్కులు తెచ్చుకుని, సీటు సంపాదిస్తానో, లేదోననే భయంతో ఒకరోజు బాబాకి మధ్యాహ్న ఆరతి ఇస్తూ, "బాబా! నేనసలు నా చదువు కొనసాగించగలుగుతానా, లేదా?" అని ఏడ్చేసాను. మా బంధువులు నన్ను ఏవేవో మాటలు అంటూ, 'ఏదో ఒక డిగ్రీలో అయినా చేరవచ్చు కదా!' అని అంటుండేవారు. దానితో నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అయితే మా నాన్న ఎప్పుడూ మాకు అండగా నిలిచేవారు. ఆయన నా దగ్గరకు వచ్చి, "నీకేమి కావాలంటే అది చేయి. నేను నీకు తోడుగా ఉన్నాను. ఆశ వదులుకోకు. ఈసారి కోచింగ్ తీసుకుని ప్రయత్నించు" అని ధైర్యం చెప్పారు. నేను సంతోషించినా అది అంత సులువు కాదని నాకు తెలుసు. ఎలా లేదన్నా కోచింగ్ కు 50 వేల దాకా ఖర్చు అవుతుంది. మేము ఆ స్థితిలో లేము. కానీ సమస్యను బాబా చేతిలో పెట్టి ఒక అడుగు ముందుకు వేయాలని అనుకున్నాను.

మరోవైపు అక్క ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండేది. మా అమ్మ, "బాబా! నా బిడ్డకి ఉద్యోగం వస్తే మొదటినెల జీతం శిరిడీ పంపుతాను" అని బాబాను ప్రార్థిస్తుండేది. మా నాన్నగారు సాధారణ సాయిభక్తులు. ఆయనెప్పుడూ బాబాని ఏదీ అడిగేవారు కాదు కానీ, బాబా పట్ల విశ్వాసంతో పూజించేవారు. అమ్మ అలా ప్రార్థాస్తూ ఉంటే ఆయన, "దేవుడితో వ్యాపారం చేస్తున్నావా? నిజంగా నీ కూతురి జీతం 50 వేల రూపాయలైతే అదంతా పంపగలవా?" అని సరదాగా అంటుండేవారు. అక్క ఉద్యోగ విషయంలో నేను, "బాబా! అక్కకు మంచి ఉద్యోగాన్నిచ్చి మా కుటుంబానికి, నా కోచింగ్ కి అండగా నిలిచేలా చేయండి" అని ప్రార్థిస్తుండేదాన్ని. ఎన్నో ఇంటర్వ్యూల తరవాత 2015, జులై 29న ఒక ఎం.ఎన్.సి. కంపెనీ నుండి అక్కకి మరుసటిరోజే ఉద్యోగంలో చేరమని అపాయింట్‌మెంట్ వచ్చింది. తన జీతం 15 వేల రూపాయలు. అక్క ఉద్యోగంలో చేరుతూనే అమ్మ తన మొదటిజీతం శిరిడీకి ఎలా పంపాలా అని ప్రణాళికలు మొదలుపెట్టింది. అక్కకు ఉద్యోగం రావడం సంతోషమే అయినా, అమ్మ మ్రొక్కువలన నేను కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి ఇంకా ఒక నెల ఆగాలని ఆందోళనపడ్డాను. ఎందుకంటే, అప్పటికే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసులు మొదలై రెండు నెలలు అయ్యాయి. అయితే ఒక వారం గడిచేసరికి బాబా మిరాకిల్ చూపించారు. ఆరోజు గురువారం. నేను పూజలో ఉండగా, అక్క నైట్ షిఫ్ట్ కారణంగా పడుకుని ఉంది. నేను, "బాబా! ఇంకా నన్ను పరీక్షించకండి. నా చదువు విషయంలో నన్ను ఆశీర్వదించండి" అని బాబాను ప్రార్థిస్తున్నాను. అంతలో హఠాత్తుగా అక్క నిద్రలేచి అమ్మానాన్నలను పిలిచి తన హ్యాండ్‌బ్యాగ్ నుండి ఒక కవరు తీసి వాళ్ళ చేతిలో పెట్టింది. అందులో 800 రూపాయల చెక్ ఉంది. అక్క అది తన మొదటి సంపాదన అని, జులై 30, 31 తేదీల జీతంగా మేనేజర్ ఇచ్చారని చెప్పింది. అమ్మ, నాన్న ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. నేను కూడా ఒక్క మాటైనా మాట్లాడలేకపోయాను. నా కళ్ళనుండి కన్నీళ్లు జలజలా రాలిపోయాయి. నిజానికి మా పేరెంట్స్ ఆర్థిక పరిస్థితులతో అల్లాడిపోతున్నారు. అక్క జీతం కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ బాబా కానుకైన మొదటిజీతాన్ని శిరిడీ పంపడానికి అభ్యంతరం చెప్పలేక మౌనంగా ఉన్నారు. ఇప్పుడీ జీతాన్ని చూసి వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కళ్ళనిండా కన్నీళ్లతో  నాన్న, "బాబాకి మన పరిస్థితి తెలియనిదా?" అన్నారు. వెంటనే ఆ చెక్ తీసుకుని శిరిడీకి పంపడానికి వెళ్లారు.

తరువాత బాబా దయతో నేను మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. బాబా కృప చూపి నా ఫీజులు చెల్లించేలా మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచారు. నాకు మంచి మెరిట్ వచ్చినందువలన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నాకు ఫ్రీ సీటు వచ్చింది. ఫీజుగా కేవలం పదివేల రూపాయలు సంవత్సరానికి కడితే చాలు. నేనిప్పుడు ఎం.బి.బి.ఎస్. రెండవ సంవత్సరం చదువుతున్నాను. త్వరలో నాకు సెమిస్టరు పరీక్షలు ఉన్నాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వలన కనీసం ఒక గంటసేపు నిలకడగా కూర్చుని చదవలేకపోతున్నాను. ఈ విషయమే బాధతో బాబాని ప్రార్థించినప్పుడు బ్లాగును చూపించారు బాబా. అందులోని అద్భుతమైన సాయి లీలలు చదువుతుంటే బాబాపట్ల ప్రేమ, విశ్వాసం దృఢమవుతున్నాయి. నేను నా భారాన్ని ఆయనపైనే వేసాను, అంతా ఆయనే చూసుకుంటారు. ముఖ్యవిషయం ఏమిటంటే, నా కాలేజీ నా సొంత ఊరిలోనే! నా కుటుంబంతో కలిసే ఉంటూ నా కల నెరవేర్చుకునేలా బాబా సహాయం చేశారు. ఆయన లేని జీవితాన్ని నేను ఉహించలేను. బాబాయే నా గురువు, స్నేహితుడు. ఆయనెప్పుడూ నాకు తోడుగా ఉన్నారు.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/07/shirdi-sai-baba-miracles-part-2408.html

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo