సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 176వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. యాక్సిడెంట్ జరిగినా, తల్లీబిడ్డలను కాపాడిన సాయి మహరాజ్
  2. నచ్చని వ్యక్తితో నా వివాహం జరగనివ్వలేదు శ్రీసాయి

యాక్సిడెంట్ జరిగినా, తల్లీబిడ్డలను కాపాడిన సాయి మహరాజ్

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు శాంత. నేను సాయిభక్తురాలిని. ఆయనంటే నాకు ప్రాణం. ఆయన నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నీ. నేను ఆయన్ని మా ఇంట్లో వ్యక్తిగా, మా ఇంటి యజమానిగా భావిస్తాను. ఎందుకంటే నన్ను, నా కుటుంబాన్ని చూసుకునేది ఆయనే. ఉదయం లేచిన వెంటనే బాబాకు నీళ్లిచ్చి నమస్కరించడంతో మొదలవుతుంది నా దినచర్య. నేను తినే ప్రతి పదార్థాన్నీ ఆయనకు సమర్పించాకే స్వీకరిస్తాను. నా కూతురు విషయంలో బాబా చేసిన మేలుని ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా అమ్మాయి తొమ్మిదినెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఒకరోజు బండిమీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. తను బండి మీదనుండి క్రింద పడిపోయింది. కళ్ళముందే జరిగిన యాక్సిడెంట్ ని చూసి నా గుండె ఆగినంత పనయింది. భయంతో ఎంతగా ఏడ్చానో ఆ బాబాకే తెలుసు. కడుపులో ఉన్న బిడ్డకు ఏం జరుగుతుందో, ఏమిటోనన్న కంగారుతో బాబాను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ సహాయం కోసం అర్థించాను. భారమంతా బాబా మీద వేసి, ఆయననే స్మరించుకుంటూ ఉన్నాను. డాక్టర్ అమ్మాయిని పరీక్షించి, "కంగారుపడకండి. తనకి ఏమీ కాలేదు. పైపై దెబ్బలే తగిలాయి. లోపల ఉన్న బిడ్డకి ఏమీ కాలేదు. కానీ నొప్పులు మొదలయ్యాయి. కాబట్టి వెంటనే డెలివరీ చేయాలి" అని చెప్పారు. తరువాత అమ్మాయిని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. కొద్దిసేపట్లో బాబా దయవల్ల మా అమ్మాయి పండంటి బిడ్డని ప్రసవించింది. తల్లికి, బిడ్డకి ఎలాంటి అపాయం కలుగకుండా బాబా చూసుకున్నారు. అంతా ఆయన దయ. మనం వాహనాలు ఎంత జాగ్రత్తగా నడిపినా ఎదురుగా వచ్చే వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కర్మానుసారం అలా జరగాలని రాసివుందేమో! కానీ బాబా ఆ కర్మనుండి మాకు రక్షణనిచ్చారు. "నా బిడ్డలను ప్రారబ్ధం ఏమి చేయగలదు? నేను వారిని రక్షిస్తాను" అని బాబా అభయమిచ్చారుగా. కాబట్టే ఎలాంటి నష్టమూ జరగలేదు. "థాంక్యూ సాయీ! సమయానికి మీరు ఆదుకోకుంటే, జరిగే పరిస్థితిని ఊహించడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు".

నచ్చని వ్యక్తితో నా వివాహం జరగనివ్వలేదు శ్రీసాయి

హైదరాబాదు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా భక్తురాలినైన నేను హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. తోటి సాయిభక్తుల అనుభవాలను బ్లాగులో చదువుతుంటే మానసికబలం చేకూరుతుంది. నేను చిన్నప్పటినుంచి బాబా భక్తురాలిని. మా అమ్మ బాబాకి గొప్ప భక్తురాలు. ఆమె ద్వారా నాకు తెలియకుండానే నేను కూడా ఆయన వైపు ఆకర్షితురాలినయ్యాను. బాబా నా జీవితంలో చాలాసార్లు మార్గనిర్దేశం, సహాయం చేసారు. నేనిప్పుడు ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. "ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!"

నాకు 25 ఏళ్ళు. నా తల్లిదండ్రులు నాకు వివాహం జరిపించాలని సంకల్పించి, నాకోసం తగిన వరుడిని శోధించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాకు ఎవరూ నచ్చలేదు. గత సంవత్సరం ఒక సంబంధం వచ్చింది. నా తల్లిదండ్రులకు ఆ సంబంధం బాగా నచ్చింది. కానీ ఆ అబ్బాయి నాకు నచ్చలేదు. మొత్తానికి ఎలాగో ఆ సంబంధం కుదరలేదు. చాలా రోజులు గడిచాక ఇటీవల మళ్ళీ ఆ అబ్బాయి తండ్రి తనంతట తాను, "మేము మీ సంబంధంపట్ల ఆసక్తిగా ఉన్నామ"ని ప్రతిపాదన తీసుకొచ్చారు. నేను అతనిని ఇష్టపడకపోయినప్పటికీ నా తల్లిదండ్రులు, "ఒకసారి అబ్బాయిని నేరుగా కలిసి చూడమ"ని చెప్పారు. నేనందుకు కాస్త సంకోచంగానే అంగీకరించాను. ఒక మంచిరోజున ఆ అబ్బాయి, తన కుటుంబం మా ఇంటికి వచ్చారు. మేము ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాము. తనతో మాట్లాడిన తరువాత, మేమిద్దరం చాలా భిన్నంగా ఉన్నామని, ఒకరికొకరు అనుకూలంగా లేమని నాకు అర్థమైంది. అయితే నేను తప్ప మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆ సంబంధాన్ని ఇష్టపడ్డారు. అబ్బాయి కుటుంబంవారికి కూడా సమ్మతంగానే అనిపించింది. నేను అంగీకారం తెలిపితే సంబంధం ఖాయమవుతుందని కుటుంబంలోని అందరూ సంతోషంగా ఉన్నారు. నా తల్లిదండ్రులకు బాగా నచ్చినందువలన నేను ఇష్టంలేదని చెప్పలేకపోయాను. అటువంటి స్థితిలో నాకు ఏమి చేయాలో తెలియలేదు. రోజూ బాబా ముందు కూర్చొని, "నాకు నచ్చని వ్యక్తితో నా వివాహం జరగనివ్వకండి" అని వేడుకుంటుండేదాన్ని. చివరికి నా తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా నేను ఆ సంబంధానికి అంగీకారం తెలిపాను. కానీ, "అబ్బాయి కుటుంబంనుండి తిరస్కారం వచ్చేలా చేయండి" అని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. ఆ విషయమై నేను బాబా ముందు చీటీలు వేసాను. అందులో బాబా సమాధానంగా 'ఈ సంబంధం కుదరదు' అని వచ్చింది. దానితో నేను చాలా సంతోషంగానూ, ఎంతో ఆత్రంగానూ ఆ సమయంకోసం ఎదురుచూశాను. వారంరోజుల తరువాత అబ్బాయి తండ్రి ఫోన్ చేసి, "మా అబ్బాయికి ఇష్టం లేనందున మేము మరింత ముందుకు వెళ్ళదలుచుకోవట్లేదు" అని చెప్పారు. ఆ మాటలు వింటూనే పట్టలేని సంతోషంతో నాకు సహాయం చేసినందుకు బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. అదంతా బాబా చేసిన అద్భుతంగా నేను భావిస్తున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి ఎల్లప్పుడూ నాతో ఉండి నా కోరికలను తీర్చండి బాబా!"

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo