- చిరస్మరణీయమైన చివరి దర్శనం
- శిరిడీలో బాబా మహాసమాధి - ముంబయిలో నిదర్శనం
- శ్రావణ సోమవారం - శ్రీసాయిలో ఐక్యం
చిరస్మరణీయమైన చివరి దర్శనం
అది 1918వ సంవత్సరం నవరాత్రి రోజులు అనుకుంటాను(జబ్బుతో బాధపడుతున్న పులికి మోక్షాన్ని ప్రసాదించిన ఏడు రోజులకు బాబా విజయదశమినాడు మహాసమాధి చెందారు). వృద్దాప్యంవల్ల బాబా ఇద్దరు భక్తుల సహాయంతో నడిచేవారు. ఒకరోజు సాయంత్రం మా నాన్నగారు పెట్రోమాక్స్ దీపాలను వాటి వాటి స్థానాలలో ఉంచిన తరువాత, బాబా చాలా అలసటగా ఉండటం గమనించారు. బాబాకు కాస్త ఉపశమనంగానూ, సౌఖ్యంగానూ ఉంటుందని, ఆయన బాబాతో, “బాబా! కాళ్ళు ఒత్తమంటారా?” అని అడిగారు. “నీ తృప్తి కోసం నువ్వు కోరుకున్నట్లుగానే కానీ!” అన్నారు బాబా. మా నాన్నగారు బాబా పాదాలవద్ద కూర్చుని, బాబా పాదాలు ఒత్తసాగారు. కొంతసేపయిన తరువాత బాబా ఆయనవైపు తిరిగి, “భావూ! ఇదే మన ఆఖరి కలయిక. ఇక మీదట మనం కలుసుకోము. రకరకాల ప్రజలు ధనము, పిల్లలు, ఆరోగ్యం వంటి రకరకాలయిన కోరికలు తీర్చుకోవడానికి శిరిడీకి వస్తారని నీకు తెలుసు. నేను ఎవ్వరినీ నిరాశపరచక, వారి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాను. భగవంతుడు కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తాడు. నా దగ్గరకు వచ్చి ఏమీ అడగని వాళ్ళలో నువ్వు ఒకడివి. నీకు వివాహం అవకపోవడం వల్ల, సంసారం లేకపోవడం వల్ల నీకు ఏదీ అవసరమనిపించకపోవచ్చు. కానీ భావూ! మనం ఇక ఎప్పటికీ కలుసుకోలేము. కాబట్టి, నీకు కావలసింది ఏదయినా అడుగు. లేకపోతే నువ్వింతవరకు నాకు చేసిన సేవలన్నిటికీ నేను నీకు ఎప్పటికీ ఋణపడిపోతాను” అన్నారు. మా నాన్నగారు, “బాబా! మీ అనుగ్రహం వల్ల జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి. నాకు ప్రాపంచికమైన అవసరాలు ఏమీ లేవు. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నా మీద ఉండేలా మాత్రం అనుగ్రహించండి. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులలోనూ మీరు నా స్మృతిపథం నుంచి మాత్రం తొలగిపోకుండా ఉండేలా వరమివ్వండి (హేచి దాన్ దేగా దేవా తుఝా విసార్ న వవ)” అని అన్నారు. అప్పుడు బాబా, “భావూ! నా భక్తుల విధి నిర్వహణకు నేను బద్దుడను. ప్రత్యేకంగా నీ కోసం ఏదయినా కోరుకోమని నేను అడుగుతున్నాను. కారణం ప్రతి మానవుడికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తమ జీవితం విజయవంతంగా సాగడానికి బయటనుంచి సహాయం అవసరమవుతుంది. అందువల్ల, మొహమాటపడకుండా అడుగు!” అన్నారు. మా నాన్నగారు అది తనకు కఠిన పరీక్ష అనుకొని, “బాబా! మీరు అంతగా అడుగుతున్నారు కనుక నా కోరికను తప్పకుండా తీరుస్తానని ముందుగా నాకు మాటివ్వండి” అన్నారు. అప్పుడు బాబా, “భావూ! నేను భక్తులందరి కోరికలను తీరుస్తాను. నువ్వు నాపట్ల లేశమాత్రమయినా అనుమానం పెట్టుకోవద్దు! నువ్వు అడుగు! నేను తీరుస్తాను” అన్నారు. మా నాన్నగారు, “బాబా! నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను. మీరు నాకు ఎలాంటి జన్మను ప్రసాదించినా, నేను మీ పాదాలవద్దే వుండేలా అనుగ్రహించండి” అన్నారు. బాబా అప్పుడు కొంచెంసేపు మౌనంగా ఉండి, తరువాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, “భావూ! నీ ఈ కోరికను నేను తీర్చలేను” అన్నారు. మా నాన్నగారు, “బాబా! నా అంతట నేనుగా మిమ్మల్ని కోరలేదు. ఈ విషయంలో మీరే బలవంతపెట్టారు. ఇది తప్ప మీ నుండి నాకింకేమీ అవసరం లేదు” అన్నారు.
అప్పుడు బాబా చిరునవ్వు నవ్వి, “భావూ! ఎంతోమంది శిరిడీకి వస్తారు. కానీ నీలాగా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది కొద్దిమందే. నీ కోరికతో నువ్వు నన్ను శాశ్వతంగా బద్దుణ్ణి చేద్దామనుకుంటున్నావు. ఈ విధంగా ఎవరితోనూ బంధం ఏర్పరచుకోవడానికి నాకు నా దేవుడి నుండి అనుమతి లేదు. అయినప్పటికీ నువ్వు నిరాశపడనవసరంలేదు. మన తరువాతి జన్మలో మనకు పది సంవత్సరాల వయసప్పుడు మనిద్దరం కలసి కూర్చుని ఒకే కంచంలో తింటామని మాట ఇస్తున్నాను” అన్నారు. నాన్నగారు, “మీ ఇష్టం బాబా” అన్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే, మరుసటి జన్మలో మరలా కలుస్తానని మా నాన్నగారికి బాబా ప్రమాణం చేశారు. మా నాన్నగారు సంతృప్తి చెంది వెంటనే బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా ఆయనను లేవనెత్తి తన ప్రక్కనే ఉన్న ఊదీ కుండలో చేయిపెట్టి, చేతినిండా ఊదీ తీసి మా నాన్నగారికిచ్చి, “భావూ! దీనిని ప్రాణప్రదంగా భద్రపరచుకో! బాగా అవసరమయినప్పుడు మాత్రమే ఉపయోగించు! జీవులలో పోయిన ప్రాణాన్ని తిరిగి ప్రవేశపెట్టేంత అనంతమైన శక్తి ఈ ఊదీలో వుంది” అని అన్నారు.
అప్పుడు సంధ్య ఆరతి సమయం అయింది. ఆ క్షణంలో మా నాన్నగారికి ఎంతో సంతృప్తి కలిగిన అనుభూతి కలిగింది. అదే సమయంలో బాబా అదే తమ ఆఖరి కలయిక అని చెప్పడం వల్ల కాస్తంత విచారము కలిగింది. మరునాడు బాబా ఆయనను ముంబయి వెళ్ళిపొమ్మని చెప్పారు. ఇంటికి చేరుకోగానే ఆయన శిరిడీలో జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఒక చిన్న వెండిబాక్సు కొని, దానిని బాబా ప్రసాదించిన ఊదీతో నింపారు. ఆ ఊదీని భగవంతుడే స్వయంగా ప్రసాదించిన అమృతంలా వారు భావించారు. మాలో ఎవరికైనా తీవ్రంగా సుస్తీ చేస్తే, నయమవడానికి మా నాన్నగారు నీళ్ళలో ఆ ఊదీ కొంచెం వేసి, మాకు త్రాగడానికివ్వడం నాకు ఇంకా గుర్తుంది. ఆయన జీవించివుండగా, ఆయన ఏడుగురు సంతానంలో ఎవరూ మరణించలేదు.
మా నాన్నగారు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆయనకు స్వంత బంగళా, కారు ఇలా ప్రతీదీ - ఎవరైనా తమ జీవితంలో ఏమేం కావాలనుకుంటారో అవన్నీ - ఉన్నాయి. కానీ, తరువాత కాలంలో ఆయనకు ఈ ప్రాపంచికజీవితం మీద కోరిక పోయింది. ఆయన తన 70వ యేట జబ్బుపడి మరణించేంత వరకు ఆయన ఒక్కసారి కూడా జబ్బున పడటం నేనెన్నడూ చూడలేదు.
శిరిడీలో బాబా మహాసమాధి - ముంబయిలో నిదర్శనం
వారు బాంద్రాలోనే తమ ఇంటికి దగ్గరలో ఉన్న టెండూల్కర్ ఇంటికి గానీ, దభోళ్కర్ ఇంటికి గానీ వెళదామనుకున్నారు. కానీ ఆ అవసరం లేకపోయింది, ఎందుకంటే ఆ సాయంత్రం విలేపార్లే నుంచి కాకాసాహెబ్ దీక్షిత్ సేవకుడు వీరి ఇంటికి వచ్చి, ఆరోజు మధ్యాహ్నమే శిరిడీలో శ్రీసాయిబాబా మహాసమాధి చెందారని, దీక్షిత్ కుటుంబం శిరిడీకి బయలుదేరి వెళుతున్నారనీ, మా తాతగారిని కూడా తమతో రమ్మన్నారనీ చెప్పాడు. ఆ విషయం విన్నాక, ఈ రెండు సంఘటనల ద్వారా, బాబా మహాసమాధి చెందబోతున్నట్లు తమకు ముందుగా వైర్ లెస్ సందేశం పంపారని వారికి అర్థమయింది.
అందుచేతనే మోరేశ్వర్ గారికి తాత్కాలికంగా ఆస్త్మా తిరగబెట్టింది. వారింట్లోని చందనపు మందిరంలో వున్న బాబా చిత్రపటం ఒక ప్రక్కకు ఒరిగిపోయింది. శిరిడీకి, ముంబయికి మధ్య ఎంతో దూరమున్నా, బాబా తాము మహాసమాధి చెందబోతున్నామని తమ ప్రియభక్తులకు తమదైన విలక్షణరీతిలో తెలియచేశారు. అందుచేతనే శ్రీసాయిబాబా “అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్" గా పిలవబడుతున్నారు.
ఆయన తెలియచేసే ఇటువంటి విలక్షణమైన సందేశాలు ఆయన ప్రియభక్తులలో ఎటువంటి గగుర్పాటును కలిగిస్తాయో వారి భక్తులకు మాత్రమే అనుభవం. సాయిబాబా మహాసమాధి చెందినప్పటికీ అది భౌతికంగా మాత్రమే. ఎందుకంటే ఆయన తమ అవతారకార్యంలో, పిలిచిన వెంటనే తాను తన భక్తుల చెంత ఎల్లప్పుడూ ఉంటానని నిరూపించి తమ భక్తుల మనస్సులను ప్రభావితం చేశారు. “నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయి. నాయందు నమ్మకముంచండి. నిత్యసత్యమేమిటంటే నేను ఎల్లప్పుడూ సజీవంగానే వుంటాను (నిత్య మీ జీవంత జాణా హేచి సత్య). మీ అందరికీ ఇది నా హామీ. దీనిని మీరు మరువవద్దు” అని బాబా ముందే ప్రకటించేవున్నారు.
ప్రియపాఠకులారా! శ్రీసాయితో అంతటి ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన తరువాత కూడా మా నాన్నగారు సామాన్యమానవుని వలె తన మిగిలిన జీవితాన్ని ఎలా గడపగలిగారా అని ఆశ్చర్యపోతూవుంటాను. సామాన్యంగా ఎవరైనా ప్రాపంచిక విషయాలను వదిలించుకోవడం కోసం, పరమార్థం కోసం భక్తిమార్గాన్ని అనుసరిస్తారు. కానీ, ప్రత్యేకంగా మా నాన్నగారి జీవితం ఈ సూత్రానికి మినహాయింపేనని ఎవరైనా ఒప్పుకోవలసిందే.
శ్రావణ సోమవారం - శ్రీసాయిలో ఐక్యం
1918 తరువాత మా నాన్నగారి వివాహం మా అమ్మగారితో జరిగింది. ఆమె పేరు లక్ష్మీదేవి కేళ్వేకర్. ఆమెది. ముంబయిలోని కేళ్వేమాహిం. ఇదే సమయంలో నా తల్లిదండ్రులకు మహారాష్ట్రలోని గొప్ప సాధువులలో ఒకరైన శ్రీ గాడ్గే మహరాజుతో పరిచయమయింది. ఆయన మా నాన్నగారిని ఒక బంగళా కొనుక్కోమని నిర్దేశించారు. ఆయన నిర్దేశించినట్లుగా, మా నాన్నగారు ఖార్ లో (51 E, ఖార్ పాలీ రోడ్) ఒక బంగళా కొనుక్కొని, టాటాబ్లాక్సులో వున్న ఇంటికి 1923లో వీడ్కోలు చెప్పారు.
శ్రీ జ్యోతీంద్ర, శ్రీమతి లక్ష్మీదేవి తర్కడ్ |
మా నాన్నగారు మంచి ఆరోగ్యంతో ఉండేవారు. ఆయన జబ్బుపడటం గాని, కనీసం సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుతో బాధపడటం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఆయనకు అయిదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆయన తన అయిదుగురు కుమార్తెలకు వివాహాలు చేసి తన బాధ్యతను నిర్వర్తించారు, కానీ తన ఇద్దరు కొడుకుల వివాహాలను మాత్రం చూడలేకపోయారు.
అది 1965 సంవత్సరం, జులై నెల మా నాన్నగారు తీవ్రమైన ఆస్త్మాకు గురయ్యారు. దానికి తోడు నడుమునొప్పితో ఆయన మంచానికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మేమంతా కూడా అవి వార్ధక్య లక్షణాలని అనుకున్నాము. నేను వి.జె.టి.ఐ. ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఇ. ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మా పెద్దన్నయ్య రవీంద్ర, మా నాన్నగారు పదవీవిరమణ చేసిన టెక్స్ టైల్ మిల్లులోనే పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో మా అమ్మగారు రక్తపోటు (బి.పి.), చక్కెరవ్యాధి (డయాబెటిస్), ఆస్త్మా వంటి రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉండేవారు. ఆమెకు ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా ఉండేదంటే, మేము ఆమెకు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేది. ఆమె కోసం మా ఇంట్లో ఎప్పుడూ ఒక ఆక్సిజన్ సిలిండర్ సిద్ధంగా ఉంచుకునేవాళ్ళం.
మా నాన్నగారిని పరీక్షించిన వైద్యులు ఆయనకు ప్రాథమికంగా లుంబాగో(వెన్నుపూస క్రింద భాగంలో వచ్చే నొప్పి) అని నిర్ధారించారు. నేను వింటోజెనో బామ్ గాని, మహానారాయణతైలం గాని ఆయన నడుముకు రాస్తూ ఉండటం వల్ల ఆయనకు కొంచెం ఉపశమనంగా వుండేది. మాచేత సేవ చేయించుకోవలసి రావడంతో ఆయన చాలా విచారిస్తూ ఉండేవారు. ఆయన అంతకుముందెప్పుడూ మమ్మల్ని కనీసం కాళ్ళు ఒత్తమని కూడా అడగలేదు. అందుచేత ఆయన జబ్బుతో అలా మంచానికే పరిమితం అవడంవల్ల చాలా భాధపడేవారు. తాను ఆ వ్యాధి నుండి ఎప్పటికైనా బయటపడగలనా అని ఒకసారి ఆయన నన్ను అడిగారు. బాబాను ఆర్తిగా ప్రార్ధించమని, వారే ఆయనను రక్షించగలరని నేను ఆయనతో చెప్పినట్లు గుర్తు. కానీ ఆయన పరిస్థితి క్షీణించింది. డాక్టరు జోషీ సలహా మేరకు ఆయనను శాంతాక్రజ్ లోని నానావతీ ఆసుపత్రిలో చేర్పించాము. మా అమ్మగారు స్వయంగా తానే ఒక రోగినన్న విషయాన్ని మరచిపోయి, ఆయనకు సపర్యలు చేయడంలో పూర్తిగా మునిగిపోయారు.
ఆమె ఉదయాన్నే ఆయనకు టీ, అల్పాహారం తీసుకుని వెళుతుండేవారు. మరలా సాయంత్రం భోజనం తీసుకొని వెళ్ళేవారు. నేను కాలేజీ నుంచి రాగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మా అమ్మగారిని అడుగుతూ ఉండేవాడిని. ఆయనలో అంతగా మార్పు లేదనీ, అయితే ఆయన తన ఇంద్రియజ్ఞానం కోల్పోలేదనీ ఆమె చెప్పేవారు. ఆ విధంగా ఆయన ఒక వారంరోజులు ఆసుపత్రిలో ఉన్నారనుకుంటాను. మా అమ్మగారు ప్రతిరోజూ ఉదయాన్నే తేనీటితో పాటు బాబా ప్రసాదించిన పవిత్రమైన ఊదీని కూడా ఆయనకు ఇస్తూవుండేవారు. ఆగష్టు 16వ తేదీన మరాఠీ క్యాలెండర్ ప్రకారం శ్రావణ సోమవారం వచ్చింది. ప్రతి శ్రావణ సోమవారంనాడు మేము సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించేవాళ్ళం. అందువలన, మా అమ్మగారు మా అన్నయ్యతోనూ, నాతోనూ ఆరోజు త్వరగా ఇంటికి తిరిగిరమ్మని చెప్పారు. నేను మధ్యాహ్నమే కాలేజీనుంచి ఇంటికి తిరిగి వచ్చాను.
మా అమ్మగారు ఆసుపత్రికి వెళుతూ, ఈ రోజు చాలా క్లిష్టమైన రోజు అని, మా దాదాకు (తండ్రికి) ఈరోజు గండం గడిస్తే ఆయన కనీసం మరొక సంవత్సరంపాటు తప్పక బ్రతుకుతారని చెప్పారు. ఎందుకలా అంటున్నారని నేను ఆమెను అడిగినప్పుడు, తర్ఖడ్ కుటుంబంలోని మగవాళ్ళందరికీ శ్రావణసోమవారం దురదృష్టకరమైన రోజు అనీ, చాలామంది మగవారు ఆరోజునే మరణించినట్లు తన అత్తగారు చెప్పారనీ ఆమె సమాధానమిచ్చారు. ఆ తరువాత ఆమె ఆసుపత్రికి వెళ్ళారు. సుమారు 3.30 గంటలకు ఆమె తనతో తీసుకువెళ్ళిన థర్మాస్ ప్లాస్కులోంచి ఒక కప్పు టీ మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారికి టీ ఎక్కువసార్లు త్రాగే అలవాటు. టీ త్రాగిన తరువాత ఆయనకు కొంచెం ఉపశమనంగా అనిపించి, సుమారు 4 గంటలకు మరొకసారి టీ ఇమ్మని మా అమ్మగారిని అడిగారు. మా అమ్మగారు ఆయనతో, అరగంట క్రితమే టీ ఇచ్చాననీ, మళ్ళీ 5 గంటలకు మాత్రమే టీ ఇస్తానని అన్నారు. ఇంకా, ఆ రోజు శ్రావణసోమవారం కాబట్టి త్వరగా ఇంటికి వెళతానని చెప్పారు. కానీ మా నాన్నగారు తనకు టీ వెంటనే ఇవ్వవలసిందేనని పట్టుపట్టారు.
ఆయన తానేదో దృశ్యాన్ని చూస్తున్నాననీ, కానీ అది స్పష్టంగా కనపడటం లేదనీ అన్నారు. మా అమ్మగారు, ఆయనను ఆందోళన పడవద్దని చెప్పి, ఆయన చేతిలో ఒక తులసిమాలను ఉంచి, బాబాను ప్రార్థిస్తూ ఉండమని చెప్పారు. ఆమె మా నాన్నగారి నుదుటిమీద పవిత్రమైన బాబా ఊదీని రాశారు. కాసేపటి తరువాత ఆమె మా నాన్నగారికి టీ ఇచ్చారు. ఆయన ఒక గుక్క టీ త్రాగిన వెంటనే మా అమ్మగారితో, తనను ఎవరో పిలుస్తున్నారనీ, కానీ ఆ ముఖాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నానని, దానివల్ల ఆ వ్యక్తి ఎవరో సరిగా నిర్ధారించుకోలేకపోతున్నాననీ అన్నారు.
మా అమ్మగారు ఆయనతో, గదిలో మనమిద్దరమే ఉన్నామని, మౌనంగా బాబా జపం చేసుకోమని చెప్పారు. ఆయన బాబా నామాన్ని మెల్లగా జపించసాగారు. కొంతసేపటికి ఆయన ముఖం ఎంతో ప్రకాశవంతంగా మారింది. ఆయన ముఖంలో నడుమునొప్పి వల్ల కలిగే బాధ మాయమైపోగా, “బాబా! నేను వస్తున్నాను!” అని పెద్దగా అరిచారు. ఆ ఆఖరి మాటలు పలికి ఆయన తన శరీరాన్ని విడిచారు. ఇది ఆయన చరమాంకం.
ఆ సమయంలో ఆయనకు బాబా సాక్షాత్కరించి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఎంత గొప్ప మరణం ఆయనది! ప్రతి ప్రాణి శరీరం నుండి ప్రాణం (ఆత్మ) వదలి వెళ్ళేముందు చాలా బాధపడుతుందని అందరూ చెప్తుంటారు. కానీ మా నాన్నగారు, “బాబా, నేను వస్తున్నాను!” అంటూ తమ ప్రాణాలు విడిచారు. ఈ విధంగా శ్రీసాయిబాబా తన భావూని తనతోపాటు తీసుకువెళ్ళారు. ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన మా అమ్మగారి ధైర్యానికి మెచ్చుకున్నాను. ఆమె నాతో, మా దాదా (తండ్రి) మరణించారని, ఈ విషయాన్ని అందరికీ తెలియపరచి, ఆయన అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయమని చెప్పారు.
నేను స్కూలులో చదువుకునేటప్పుడు, “మరణాత్ ఖరోఖరా జగ జగతే” (One Lives The Real Life In One's Death) అనే శీర్షికతో మాకొక పాఠం ఉందని నాకు గుర్తు. దాదా (మా నాన్నగారు) దాన్ని నూటికి నూరుపాళ్ళు ఋజువుచేశారు. నిజానికి మా అమ్మగారికి భావోద్వేగం చాలా ఎక్కువ. కానీ, ఆమె ఒక్క కన్నీటిబొట్టును కూడా రాల్చలేదు. అటువంటి అపూర్వమైన మరణదృశ్యాన్ని చూసి ఆనందంలో మునిగిపోయి వుండవచ్చు, లేదా ఆరోజున కన్నీరు కార్చకూడదని శ్రీసాయిబాబా ఖచ్చితమైన ఆదేశమయినా అయివుండవచ్చు. అలా మా అమ్మగారి సిద్ధాంతం, 1965వ సంవత్సరం ఆగష్టు 16వ తేదీ, శ్రావణ సోమవారం రోజున నిజమైంది.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
Jai sairam
ReplyDeleteOm Sairam🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chudandi valla badyata meede tandri pls, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, ofce lo anta bagunde la chesi illu konali anna na kalaki oka daari chupinchandi tandri pls
ReplyDelete