సంత్ గాడ్గేమహరాజ్ తో అనుభవం
ఇంతకుముందు చెప్పినట్లుగా, మహారాష్ట్రలో గొప్ప సాధువయిన గాడ్గేమహరాజ్ గురించి ఇప్పుడు తెలియచేస్తాను. ఆయన ఖార్ లో వున్న మా బంగళాకు తరచూ సాయంత్రం సమయంలో ముందుగా చెప్పకుండానే విచ్చేసి, రాత్రంతా వుండి, వేకువఝాముననే వెళ్ళిపోతూ ఉండేవారు. నేను ఆయనను స్వయంగా చూశాను. ఆయన వివిధ రంగుల గుడ్డముక్కలతో కుట్టబడిన కఫ్నీ ధరించి, తలకు ఒక గుడ్డముక్క కట్టుకునేవారు. ఈ వేషధారణ వల్ల ఆయనను 'గోధాడీ మహరాజ్' లేదా 'గోధాడీ బాబా' అని పిలిచేవారు. ఆయన కాళ్ళకు తోలుచెప్పులు వేసుకుని, చేతిలో ఎప్పుడూ వెదురు కఱ్ఱని తీసుకుని వెళుతుండేవారు. వెదురుకఱ్ఱ అరిగిపోకుండా అడుగున ఇనుపతొడుగు బిగించబడివుండేది.
ఆయన విఠలుని(విష్ణువు) పరమభక్తుడు. ఎల్లప్పుడూ, “పాండురంగా! పాండురంగా!” అని జపిస్తుండేవారు. మహారాష్ట్ర అంతటా తన కీర్తనల ద్వారా సాయిమహిమను చాటిన దాసగణు మహరాజ్ ఆయనను మా కుటుంబానికి పరిచయం చేశారనుకుంటాను. గాడ్గేమహరాజ్ దృష్టి ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల ప్రజలకు అన్నివిధాలుగా సహాయం చేయడంపైనే కేంద్రీకృతమై వుండేది. ఆయన వారికి పరిశుభ్రత యొక్క ప్రాధాన్యాన్ని తెలియచేస్తూ, మహారాష్ట్ర అంతా వీధులు ఊడ్చి, తానే స్వయంగా ఆచరించి చూపేవారు. "పరిశుభ్రతే దైవం" అనేది ఆయన నినాదం. గ్రామాలను అంటువ్యాధుల బారినుండి, జబ్బుల నుండి “పరిశుభ్రతే" సురక్షితంగా ఉంచుతుందన్నది గ్రామస్థులందరికీ ఆయన ఇచ్చే సందేశం. ఈ కార్యక్రమానికి ఆయన ధనవంతుల నుంచి ఆర్థికసహాయం కూడా స్వీకరించేవారు. అలా స్వీకరించిన ధనాన్ని గ్రామాల్లో అవసరమైనవారికి ఆయన పంచుతూ ఉండేవారు.
శ్రీసాయిబాబా మహాసమాధియైన తరువాత మా తాతగారు గాడ్గేమహరాజుకు బట్టలతానులు విరాళంగా ఇస్తూవుండేవారు. మా అమ్మగారు తన చేతులతో స్వయంగా గోధాడీ కుట్టి, గాడ్గేమహరాజ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయనకు సమర్పిస్తుండేవారు. ఆయన దానిని స్వీకరించి, మా అమ్మగారిని ఆశీర్వదించేవారు. ఆ కాలంలోని వారు కురిపించిన ప్రేమ, వాత్సల్యాలు ఈ రోజుల్లో చూడటం చాలా కష్టం.
ఇంతకుముందు చెప్పినట్లుగా మా నాన్నగారిచేత బంగళా కొనిపించడానికి ముఖ్యకారకులు సంత్ గాడ్గేమహరాజ్. ఆయన అన్నిచోట్లకు ఎక్కువగా కాలినడకనే తిరుగుతూ ఉండేవారు. ఆయన ఖార్ అనే ప్రాంతంలో ఒక బంగళాను చూశారు. దానినే మా నాన్నగారు 1923వ సంవత్సరంలో రూ.15,007 లకు కొన్నారు. అప్పట్లో ఓల్డ్ ఖార్ ప్రాంతంలో అదొక్కటే ఏకైక కట్టడం. మా బంగళా మిద్దెపై నుంచి మేము రైల్వేస్టేషన్, మౌంట్ మేరీ చర్చి మొదలైనవన్నీ ఎటువంటి అడ్డంకీ లేకుండా చూడగలిగేవారమని నాకు గుర్తు. ఎప్పుడైనా గాడ్గేబాబా మా బంగళాకు వచ్చినప్పుడు, జొన్నలతో రోటీ(భాకరీ), ఝుణకా(సంప్రదాయ మహారాష్ట్ర వంటకం) తయారుచేయమని మా అమ్మగారిని ఆదేశించేవారు. మేమంతా ఆ రాత్రికి 'ఝణకా భాకర్' తినేవాళ్ళం. ఆ పదార్థాల యొక్క అద్భుతమైన రుచి ఇప్పటికీ నా జ్ఞాపకాలలో అలాగే పదిలంగా ఉంది. రాత్రి భోజనం చేసిన తరువాత, గాడ్గేబాబా తాను వివిధ గ్రామాలలో చేసిన పాదయాత్రలలో తమ అనుభవాలను మాకు వివరిస్తూ ఉండేవారు. గాడ్గేబాబా సాధారణమైన వ్యక్తి కాదు, నిశ్చయంగా భగవంతుని దూతే. మా నాన్నగారు ఆయనతో కలసి పండరిపురం వెళ్ళినప్పుడు మా నాన్నగారికి కలిగిన దివ్యానుభవాన్ని మీకిప్పుడు వివరిస్తాను.
ఒకసారి మా నాన్నగారు ఆయనను, ఎప్పుడైనా పాండురంగ విఠలుని కలుసుకున్నారా అని అడిగారు. గాడ్గేబాబా మా నాన్నగారిని తనతో పాటు పుణ్యక్షేత్రమైన పండరిపురానికి రమ్మన్నారు. సౌఖ్యవంతమైన బంగళాలో ఉండేటటువంటి అన్ని సుఖాలకు దూరంగా, అక్కడ ఒక సాధారణ యాత్రికునిలా ఉండాలని ఆయన మా నాన్నగారితో చెప్పారు. అప్పుడు గాడ్గేబాబాతో కలిసి మా నాన్నగారు రెండవసారి పండరిపురానికి ప్రయాణమయ్యారు.
చంద్రభాగా నదీతీరంలో ఒక గుడారంలో వారికి బస ఏర్పాటు చేయబడింది. ఆయన రోజంతా గాడ్గేబాబాతో కలిసి తిరుగుతూ, ఆయన పరిశుభ్రతా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో, ఆయన చుట్టూ గుమిగూడే పీడిత ప్రజానీకానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో, ప్రజలు ఆయన జ్ఞానోపదేశాలను ఎంత ఓపికగా వింటున్నారో అవన్నీ ప్రత్యక్షంగా చూశారు. సంత్ గాడ్గేమహరాజ్ చేసే సామాజిక కార్యక్రమాల మీద మా నాన్నగారికి చక్కని అవగాహన వచ్చింది. సాయంత్రానికి వారు తమ గుడారానికి తిరిగివచ్చారు. గుడారం లోపల ప్రతి పడక మీద నలుపురంగు కంబళి అమర్చబడివున్న మూడు పడకలు, గుడారం మధ్యలో వేలాడుతూవున్న ఒక కిరోసిన్ లాంతరు ఉండటం మా నాన్నగారు గమనించారు. గాడ్గేబాబా మా నాన్నగారిని విశ్రాంతి తీసుకోమని, తాను బయటకు వెళ్ళి తినడానికి 'ఝుణకా భాకర్' తెస్తానని చెప్పారు. ఖాళీగా వున్న మూడవ పడక ఎవరికోసమని మా నాన్నగారు ఆయనను అడిగినప్పుడు, గాడ్గేబాబా తాను చెప్పడం మరిచాననీ, ఆ రాత్రికి తన అతిథి ఒకరు వస్తారనీ, ఆ రాత్రికి అక్కడే వుండి సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతారనీ చెప్పారు. ఆ అతిథి మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించరని గాడ్గేబాబా చెప్పారు. తానెప్పుడు పండరిపురం వచ్చినా ఈ అతిథి ఆ రాత్రి తనకు తోడుగా ఉంటారని చెప్పి గాడ్గేబాబా గుడారం నుంచి బయటికి వెళ్ళారు. కొద్దిసేపటిలోనే గుడారంలో చీకటిపరచుకుంది. అలాగే రాత్రి ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గిపోయింది. మా నాన్నగారు కొంతసేపు కునికిపాట్లుపడి వెంటనే నిద్రపోయారు.
తనకోసం ఝణకా భాకర్ తెచ్చిన గాడ్గేబాబా పిలుపుతో మా నాన్నగారు మేల్కొన్నారు. తన అతిథితో కలిసి తాను అప్పటికే భోజనం చేసినందుకు ఏమీ అనుకోవద్దని చెప్పి, మా నాన్నగారిని భోజనం పూర్తిచేయమనీ, ఈలోపల తాను అలా నది ఒడ్డున వాహ్యాళికి వెళ్ళి వస్తానని గాడ్గేబాబా చెప్పారు. మా నాన్నగారు ఆ అతిథివైపు చూశారు. అతడు ధోవతి కట్టుకుని, నడుము పైభాగంలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్నాడు. అతడి శరీరం కారునలుపుతో ఉండి, చూడటానికి భిల్లజాతివాడిలా ఉన్నాడు. అతడి కళ్ళు ఎఱ్ఱగా మండుతున్న నిప్పుకణికల్లా ఉన్నాయి. అతడి భుజం మీద కంబళి ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, గుడారం మొత్తం మా నాన్నగారు ఇంతకుముందెన్నడూ ఆఘ్రాణించని గాఢమైన కస్తూరి పరిమళంతో నిండిపోయింది. ఇంతలో వారిద్దరూ గుడారం నుంచి వెళ్ళిపోయారు. మా నాన్నగారు గాడ్గేబాబా తెచ్చిన భోజనాన్ని తినడం పూర్తిచేశారు. అటువంటి మధురమైన ఆహారాన్ని ఆయనెప్పుడూ రుచిచూసి వుండలేదు. భోజనం పూర్తిచేయగానే, గుడారంలోని కస్తూరి పరిమళం తన మత్తుప్రభావాన్ని చూపడంతో మా నాన్నగారు వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే కాకి అరుస్తున్న శబ్దానికి ఆయన నిద్ర లేచారు. గాడ్గేబాబా అప్పటికే నిద్ర లేచివున్నారు. ఆయన మా నాన్నగారిని ముఖం కడుక్కొని, ఆయనకోసం మట్టికుండలో ఉంచిన వేడి వేడి టీ త్రాగమన్నారు. మా నాన్నగారు రాత్రి వచ్చిన అతిథి గురించి ఆరా తీయగా, ఆ అతిథి తన కర్తవ్య నిర్వహణకోసం విఠోబా గుడి తెరవడానికి ముందే అక్కడ ఉండాలనీ, అందువలన అతడు అప్పటికే టీ త్రాగి వెళ్ళిపోయాడనీ గాడ్గేబాబా చెప్పారు. మా నాన్నగారు దానిని కొంచెం అమర్యాదగా భావించి, ఆ అతిథిని తనకెందుకు పరిచయం చేయలేదని గాడ్గేబాబాను అడిగారు. గాడ్గేబాబా మా నాన్నగారితో, అతడిని మీరు గుర్తించి ఉంటారని అనుకున్నాననీ, అతడిని పండరిపురంలో పరిచయం చేయాల్సిన అవసరం లేదనీ అన్నారు. మా నాన్నగారు ఆయనతో, రాత్రి చీకటిలో ఆ అతిథిని తాను సరిగా చూడలేదనీ, ఉదయాన్నే నిద్రలేచిన తరువాత అతడిని పరిచయం చేస్తారని అనుకున్నానని చెప్పారు. అప్పుడు గాడ్గేబాబా ఆ అతిథి మరెవరో కాదని, పండరిపురంలో వెలసిన శ్రీపాండురంగ విఠలుడేనని చెప్పారు. తరువాత గాడ్గేబాబా మా నాన్నగారితో, బంగళాలో తనను అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందా అని అడిగారు. రాత్రి మా నాన్నగారిని మంత్రముగ్ధుడిని చేసిన కస్తూరి పరిమళం అప్పుడు మళ్ళీ ఆయనను ఆవరించింది. తరువాత చాలాకాలంపాటు ఆ కస్తూరి పరిమళం తనని అనుసరించేదని, దాంతో లార్డ్ విఠోబా తనతోనే ఉన్నారనే భావన కలుగుతుండేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సంత్ గాడ్గేబాబా ఇంకొక ఆహ్లాదకరమైన అనుభవాన్ని కూడా ఇచ్చారు.
కాలం గడిచేకొద్దీ గాడ్గేబాబా వృద్ధులయ్యారు. మా బంగళాకు ఆయన ఆఖరిరాక కూడా మరపురానిది. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా తనతోపాటు కంబళి, వెదురుకఱ్ఱను తీసుకొని వచ్చి, తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని తనతోపాటు తీసుకుని వెళుతూ వుండేవారు. ఆయన చివరిసారి మా ఇంటికి వచ్చినప్పుడు తనతోపాటు వెదురుకఱ్ఱను తీసుకుని వెళ్ళడం మరచిపోయారు. నిజానికి ఆయన కఱ్ఱను తనతో తీసుకువెళ్ళడం మరచిపోలేదు. దానిని ఆయన జ్ఞాపకంగా ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడ వదిలేశారు. నేనిది ఎందుకు చెబుతున్నానంటే ఆయన నడకతీరు, కఱ్ఱ సహాయం లేకుండా నడవలేరన్నట్లుగా వుండేది. నా తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకుని, ఆయన ఆచూకీ తెలుసుకుని ఆయన కఱ్ఱని ఆయనకు తిరిగి ఇచ్చేద్దామనుకున్నారు. కానీ, ఆయన ఎల్లప్పుడూ మహారాష్ట్రలో సంచారం చేస్తూ వుండటం వలన ఆయనను వెదకి పట్టుకోవడం సాధ్యం కాలేదు. నా తల్లిదండ్రులు ఆ కఱ్ఱను ఎంతో పవిత్రమైనదిగా భావించి, దానిని చందనపు మందిరం దగ్గర వుంచారు. నా తల్లిదండ్రులు గాడ్గేబాబా చిత్రపటాన్ని ఒకటి కొని, దానిని కూడా చందనపు మందిరంలో ఉంచి, ప్రతిరోజూ పూజిస్తుండేవారు. గాడ్గేబాబాను కూడా వారు ఒక దైవంలా పూజించడాన్ని మీరు కూడా అభినందిస్తారు. ప్రియమైన పాఠకులారా! ఈ రోజుల్లో మన మధ్యన అటువంటి సాధువులుగాని, దేవదూతలుగాని ఎవరూ లేరని నేను అనుకుంటున్నాను. అటువంటి సాధువులకు నిస్వార్థసేవ చేసే అంకితభక్తుల ఉనికి కూడా కరువయింది.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
Hi Sai Suresh,
ReplyDeleteThank you for posting Sai Anugraha Sumaalu (Tarkhad Experience). However, there are few spelling mistakes today. Gadge Baba was typed as Gadde Baba at many places. Please take care of these typos before publishing.
Regards
Sreedhar
థాంక్యూ సో మచ్ సార్. మీరు తెలియజేయడం మంచిదైంది. సరిదిద్దగలిగాను. లేకపోతే అలాగే ఉండిపోయేవి.
Deleteనమస్సుమాంజలి,చాలా కొత్త విషయాలు,లీలలు
ReplyDeleteషేర్ చేసినందుకు ధన్యవాదమలు
హృదయ పూర్వక ధన్యవాదములు మీకు. ఓం శ్రీ సాయిరాం జీ🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
మంచి విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు సాయిరాం.
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDeleteOm sai ram, thanks for sharing this informatiin andi, baba na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, amma nannalani kshamam chusukondi vaalla badyata meede, ofce lo anta bagunde la chesi illu konali anna na korika neraverchandi
ReplyDelete