వినాయక విగ్రహాన్ని రక్షించిన శ్రీసాయి
చందనపు మందిరంలో చిన్న పాలరాతి వినాయకుడి విగ్రహం కూడా ఉంది. అది ఒక అపూర్వమైన విగ్రహం. ఆ వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఆ విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించిన వెండి సింహాసనంలో ఉంచాము. ఈ విగ్రహం కథ ఆద్యంతము చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం బాబా కృపవల్లనే ఈ వినాయకుడి విగ్రహం ఈనాటికీ మా ఇంటిలో కొలువై పూజలందుకొంటున్నది. ఆ బాబా లీలను ఇప్పుడు మీకు వివరిస్తాను.
మా తాతగారు ముంబయిలోని రీగల్ థియేటర్ దగ్గరవున్న పురాతన వస్తువులు అమ్మే దుకాణానికి వెళుతూ ఉండేవారు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు, షాపు యజమానితో ఒక ఆంగ్లేయుడు బేరమాడుతూ ఉండటం మా తాతగారికి వినబడింది. మా తాతగారికి కుతూహలం కలిగి ఆ బేరాన్ని ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. ఆ బేరం అందమైన పాలరాతితో చేసిన ఒక వినాయకుడి విగ్రహం గురించి. అది 9 అంగుళాల ఎత్తుతో, రకరకాల రంగులతో, పద్మంలో కూర్చుని ఉన్న ఎంతో అందమైన వినాయకుడి విగ్రహం. అయితే, సోమనాథ్ మందిరానికి సంబంధించిన ఆ విగ్రహం చాలా పురాతనమైనదని, అందుకే దాని ధర రూ.15 అని షాపు యజమాని చెప్పాడు. ఆంగ్లేయుడు మొదట రూ.5 లతో బేరం మొదలుపెట్టి చివరకు రూ.8 ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. 
మా తాతగారు ఆ బేరసారాలకు ఆకర్షితుడై, కుతూహలంతో ఆ విగ్రహంతో ఏం చేయబోతున్నారని ఆ ఆంగ్లేయుడిని అడిగారు. ఆ అందమైన పాలరాతి విగ్రహాన్ని తన బల్లమీద పేపరువెయిట్‌లాగా వాడుకుంటానని ఆ ఆంగ్లేయుడు సమాధానం చెప్పడంతో, మా తాతగారికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే మా తాతగారు తమ దైవాన్ని పేపరువెయిట్‌లాగా ఉపయోగించనివ్వనని, తన పర్స్ నుండి వందరూపాయల నోటు తీసి ఆ షాపు యజమానికి ఇస్తూ, అందులోనుండి రూ.80/- తీసుకొని (ఆంగ్లేయుడు ఆ విగ్రహాన్ని బేరం చేసిన 8 రూపాయలకు 10 రెట్లు) ఆ విగ్రహాన్ని తన కొరకు ప్యాక్ చేయమని చెప్పారు.
షాపు యజమానితో మాట్లాడిన మీదట, ఆ విగ్రహం సోమనాథ మందిర ప్రధాన ద్వారం దగ్గర ఉండేదని, అతి పురాతనమైనదని ఆయనకు తెలిసింది. ఇంటికి వెళ్ళిన వెంటనే మా తాతగారు ఆ విగ్రహాన్ని చందనపు మందిరంలో ఉంచి, సాయిబాబాతోపాటు దానిని కూడా పూజిస్తానని, అలా చేయటం పేపరువెయిట్‌లాగా వాడటం కంటే ఎంతో మేలైనదని అన్నారు. కుటుంబంలోని వారంతా ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. 
ప్యాకెట్ విప్పగానే, విగ్రహం యొక్క తొండం కుడివైపునకు తిరిగి ఉండటం గమనించిన మా నానమ్మగారు, ఇటువంటి వినాయకుడి(సిద్ది వినాయక) విగ్రహాన్ని సాధారణంగా పూజకోసం యింట్లో ఉంచుకోకూడదని, ఒకవేళ ఉంచుకుంటే, ఆ ఇంట్లో ఆచార వ్యవహారాలు చాలా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని చెప్పారు. అప్పుడు వారు పూజారిని సంప్రదించగా ఆయన, ప్రతి వినాయకచవితినాడు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా, దానికి మరలా రంగులు వేసి పూజిస్తూ ఉండే షరతుపై విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించుకోవచ్చని చెప్పారు. 
అటువంటి పరిష్కారం సూచించినందుకు తర్ఖడ్ కుటుంబమంతా సంతోషించి, మరుసటి సంవత్సరం వినాయకచవితి సమయానికి ఆ విగ్రహానికి వెండి సింహాసనం చేయించి శాస్త్రోక్తంగా దానిని చందనపు మందిరంలో ప్రతిష్టించారు. అప్పటినుండి ప్రతి 'హర్తాలిక'కు (వినాయకచవితి ముందురోజు) మా నాన్నగారు ఆ విగ్రహానికి ఉన్న పాతరంగులను టర్పెంటైన్‌తో తొలగించి, తరువాత పరిమళపు నీటితో స్నానం చేయించేవారు. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని విగ్రహానికి మరలా రంగులు వేసి, వినాయకచవితినాడు దానిని మరలా వెండి సింహాసనంలో ప్రతిష్టించిన తరువాత మేమంతా కలిసి పూజ చేసేవాళ్ళం. 
నా చిన్నప్పుడు నా స్నేహితులు ప్రతి వినాయకచవితికి “మీరు గణపతిని తెచ్చుకున్నారా?” అని నన్ను అడిగినప్పుడు, నేను 'మా ఇంట్లో శాశ్వత గణపతి' ఉన్నారని చెప్పడం నాకింకా గుర్తున్నది. వాళ్లకు నేను చెప్పేది అర్థమయ్యేది కాదు. అలా తర్ఖడ్ కుటుంబంలోని వారంతా ప్రార్థనాసమాజస్థుల నుండి విగ్రహారాధకులుగా మారిపోయారు.
మా ఇంట్లో ఉన్న ఈ వినాయకుడి విగ్రహానికి మా నానమ్మగారు ఒకసారి కఠిన పరీక్ష పెట్టారు. మా తాతగారికి టెక్స్‌టైల్ యిండస్ట్రీలో మంచి పేరుండటంచేత, బరోడా మహారాజు తమ రాష్ట్రంలో ఒక టెక్స్‌టైల్ మిల్లును స్థాపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. వారి వసతి కోసం నది ఒడ్డున ఒక బంగళా ఇచ్చారు. అందుచేత మా తాతగారు తమ నివాసం బరోడాకు మార్చారు.
ఒకసారి వర్షాకాలంలో ఒకరోజు రాత్రంతా భారీ వర్షం కురవడంవల్ల ఉదయానికల్లా వారి బంగళా ఆవరణంతా నీటితో నిండిపోయింది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతూ ఉండటంతో మా నానమ్మగారు భయపడ్డారు. కొన్ని గంటల తరువాత బంగళా ఆవరణంతా నీటిమట్టం పెరుగుతూ, ఒక్క ఆఖరి మెట్టు తప్ప బంగళా మెట్లన్నీ నీటిలో మునిగిపోయాయి. మా నానమ్మగారు అప్పుడు ఒక రాగి పాత్రను తెచ్చి ఆఖరి మెట్టు మీద పెట్టారు. తరువాత పూజామందిరంలో వెండి సింహాసనంలో ఉంచిన 'విఘ్నహర్త'ని(వినాయకుడి విగ్రహాన్ని) తీసుకొనివచ్చి ఆ రాగిపాత్రలో ఉంచి, నీటిమట్టం పెరిగి, ఆ విగ్రహం కనుక వరదనీటిలో మునిగిపోతే, అదే నీటిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తానని ప్రకటించారు.
పైకి అలా అన్నా, అటువంటి విపత్కర పరిస్థితి నుండి భగవంతుడు తమను రక్షిస్తారనే ఆమె దృఢమయిన నమ్మకం. ఎంతో దృఢమయిన భక్తి కలిగిన భక్తులు మాత్రమే అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు. భగవంతుడు కూడా అలాంటివారినే ఇష్టపడతారేమో! నీటిమట్టం ఇంకా పెరిగి, ఆఖరి మెట్టు కూడా మునిగిపోయి రాగిపాత్ర అడుగును తాకిన తరువాత ఇక పెరగడం ఆగిపోయింది. 3, 4 గంటల తరువాత నీటిమట్టం బాగా తగ్గిపోవడంతో అంతా సంతోషించారు. వారి ప్రార్థన మేరకు వారి 'విఘ్నహర్త' వారిని రక్షించాడు. ఆ సంవత్సరం వారు వినాయకచవితిని ఒకటిన్నర రోజులకు బదులుగా అయిదు రోజులు జరుపుకున్నారు.
వినాయకుడి విగ్రహానికి సంబంధించిన మరొక సంఘటనను వివరిస్తాను. ఈ సంఘటన ఈ అధ్యాయానికి పెట్టిన పేరుకు సార్థకత చేకూరుస్తుంది. ఒకసారి 'హార్తాలిక' రోజు పాతరంగులు తీసివేస్తున్నప్పుడు విగ్రహం యొక్క కుడిచేయి మోచేయి దగ్గర నుండి విరిగిపోయింది. హిందూమత సిద్ధాంతం ప్రకారం విరిగిపోయిన విగ్రహాన్ని పూజించకూడదు కనుక మా నాన్నగారు చాలా భయపడ్డారు. ఏమయినప్పటికీ ఆ విగ్రహం ఇప్పుడు వారి కుటుంబంలో ఒక భాగమైపోయినందువల్ల దానిని వదులుకోవడానికి వారు ఇష్టపడలేదు. అందుకని వారు వినాయకచవితి ఉత్సవాలు కొనసాగించాలని, ఆ తరువాత శిరిడీ వెళ్ళి వినాయకుడి విగ్రహం గురించి శ్రీసాయిబాబా సలహా తీసుకుందామని నిర్ణయించుకొన్నారు.
వారు వినాయకచవితి ఉత్సవాలు జరుపుకొని ఆ తరువాత శిరిడీకి బయలుదేరి వెళ్ళారు. వినాయక విగ్రహం విషయంలో వాళ్ళు అంతవరకు బాబాను సంప్రదించకుండా ఉండటం చాలా అనుచితం. అంతవరకు ఆ విగ్రహం గురించి ఒక్కసారి కూడా వారు బాబాను సంప్రదించలేదు, కానీ ఇప్పుడు ఈ విపత్తు సంభవించేసరికి ఆయన సహాయం కావాల్సి వచ్చింది. ఈసారి వారు మసీదుకు వెళ్ళినప్పుడు, బాబా ఎప్పటిలా కాకుండా చాలా మౌనంగా ఉన్నారు. మొదటినుంచి బాబాను సంప్రదించకుండా తప్పుచేసామనే భావన కలిగి వారు పశ్చాత్తాపపడ్డారు. వారు మనసులోనే బాబాను క్షమించమని వేడుకొని ఓర్పుతో బాబా అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 
మసీదులో జనం తగ్గిపోయాక బాబా వారిని దగ్గరకు పిలిచి, "తల్లీ! మన పిల్లవాడికి చేయి విరిగితే అతణ్ణి ఇంటినుండి వెళ్లగొట్టము కదా! దానికి బదులు వాడికి దగ్గరుండి తినిపించి, అతడు త్వరగా కోలుకొని, తిరిగి మామూలు మనిషి అయ్యేలా ఇంకా ఎక్కువ ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాము, అవునా!” అన్నారు. బాబాతో ఒక్కమాటైనా చెప్పకుండానే, బాబా మాటల ద్వారా వారి సమస్యకు పరిష్కారం లభించడంతో, వారు వెంటనే ఆయన పాదాలపై పడి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. 
ప్రియపాఠకులారా! బాబా జ్ఞానాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావటం లేదు. ఆయన నిజంగా 'సర్వాంతర్యామి', ఎందుకంటే మన మనస్సుల్లో ఏముందో ఆయనకు అంతా తెలుసు. బాబా లీలలు ఎంతో అమోఘమైనవి. ఆ తల్లీ కొడుకులిద్దరూ నిజంగా ధన్యులు. ఈ విధంగా బాబా అనుగ్రహం వల్ల రక్షింపబడిన ఆ వినాయక విగ్రహం ఈనాటికీ తర్ఖడ్ కుటుంబంలో పూజలందుకుంటున్నది.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
 

 
 
 
 
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏
OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete🌹🌹 Om Sairam🌹🌹
ReplyDeleteMa abbayiki aarogyani evvu baba malli tirigi job lo ki velettu gachudu sai
ReplyDeleteOm sai ram, amma nannalani Ammamma tataya ni ayur arogyalatho anni velala kshamam ga kapadandi tandri, naaku manchi arogyanni echi ofce lo anta prashantam ga unde la chusukondi baba pls, neeve ma dikku tandri.
ReplyDelete