ఈ భాగంలో అనుభవం:
- కన్నీటిపరమైన జీవితాల్లో వెలుగు నింపిన బాబా
సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మేము వరంగల్ దగ్గర ఒక పల్లెటూరులో నివాసముంటున్నాము.
2019 నుండి నేను బాబా భక్తురాలినయ్యాను. అసలు ఎందుకు ఆయనకు భక్తురాలినయ్యానో, ఎలా అయ్యాను నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ నేను బాబాని విడువలేనంత, తలవకుండా ఉండలేనంత దగ్గరయ్యాను ఆయనకు. 2004, జనవరి 5న మా నాన్న అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుండి అమ్మ ఒక్కతే చాలా కష్టపడాల్సి వచ్చింది. నాన్న చనిపోయిన మూడు నెలలకి 2004, మార్చ్ 11న మా అక్కకి వివాహం చేసింది. నన్ను, మా అన్నని పెంచి పెద్ద చేసి చదివించింది. 2020 నుండి నాకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే నాకు, మా అన్నకి సంబంధాలు చూసే పెద్ద దిక్కు, మా వివాహాలకు అండగా ఉండేవాళ్లు ఒక్కరు కూడా లేరు. తెలిసినవాళ్లు ఎవరైనా చూసినా వాళ్ళు వాళ్ళ కన్నా తక్కువ స్థాయిలో ఉండాలని, చదువులేని వాళ్ళని, క్రైస్తవులని తీసుకొచ్చేవాళ్ళు. అవి నాకు నచ్చేవి కాదు. అలా సంవత్సరాలు దొర్లుతూ ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కూడా కుదరలేదు. గ్రామంలో అందరూ మమ్మల్ని చూసి, 'మీకు దిక్కు ఎవరూ లేరని, మీకింకా పెళ్లి కాదని' ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉండేవారు. ఆ టార్చెర్ అనుభవిస్తూ నేను, అన్న, మా అమ్మ మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ, ఇంట్లో ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళం. చివరికి ఊర్లో వాళ్ళందరూ మా అమ్మని అనే మాటలకి తట్టుకోలేక ఇంట్లోని అం దరం చచ్చిపోదాం అనే స్థితికి వచ్చాము. మా పరిస్థితి అంత దారుణంగా ఉన్నప్పటికీ నేను మొదటినుంచి మా అమ్మ, అన్నలకి, "బాబా ఉన్నారు. ఆయన మంచి సంబంధాలు తెస్తారు. ఆయన అనుగ్రహంతో ఘనంగా వివాహాలు జరుగుతాయి" అని ధైర్యం చెప్తూండేదాన్ని. కానీ మనసులో మాత్రం, 'ఎప్పటికీ నా పరిస్థితి ఇంతేనేమో! నాకు వివాహం కాదేమో! నేను ఇలాగే ఈ ఇంట్లోనే ఉండిపోతానేమో! మమ్మల్ని అందరూ ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉంటారేమో!' అని బాగా ఏడ్చేదాన్ని. నేను ఏడవని రోజంటూ ఉండేది కాదు. నాలో నేనే కుమిలిపోతూ, కృంగిపోతూ ఉండటం వల్ల నా ఆరోగ్యం బాగుండేది కాదు.
అంతటి కష్టంలోనూ నేను ప్రతిక్షణం సాయిస్మరణ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆయన నాకు ఎన్నో స్వప్న దర్శనాలు ఇచ్చారు. ఒకసారి స్వప్నంలో 'నేను ఒక అబ్బాయి బండి మీద వెళ్తున్నాను. ఒక మారుమూల గ్రామంలోని పొలం పక్కగా వెళ్తుంటే దారికి ఎడమవైపున ఒక రేగి చెట్టు ఉంది. అక్కడ నేను ఆ అబ్బాయిని బండి ఆపమని చెప్పి, రేగుపళ్ళు తెంపుకొని నేను తింటూ ఆ అబ్బాయికి కూడా ఇచ్చాను. అతను 'నాకొద్దు నువ్వే తిను' అన్నాడు. తర్వాత మేము అక్కడినుండి ఆ అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళాము. వాళ్లది చిన్న ఇల్లు. ఆ ఇంటి ముందున్న ఒక హోటల్ వద్ద 'సాయిబాబా హోటల్' అని ఫ్లెక్సీ ఉంది. అది చూసిన నేను మా అమ్మవాళ్ళు రమ్మంటుంటే, 'ఇక్కడ బాబా ఉన్నారు. నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే బాగుంది' అని అంటున్నాను. అంతలో బాబా ఒక నది మీదగా గాలిలో కాషాయ రంగు వస్త్రాలలో, చేతిలో జపమాలతో దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదిస్తూ, 'నేను శిరిడీలో పుట్టాను. శిరిడీలో పెరిగాను. నీకు అంతా మంచే జరుగుతుంది' అని చెప్పి అదృశ్యమయ్యారు'. నాకు మెలకువ వచ్చింది. వెంటనే నేను ఆ కల గురించి మా ఇంట్లోని అమ్మవాళ్లతో చెప్పాను. వాళ్ళు, "అదంతా నీ భ్రమ" అన్నారు. కానీ నా మనసుకు తెలుసు, 'బాబా నాకు మంచి భాగస్వామిని ఇస్తార'ని. అదే నమ్మకంతో బాబా మీద విశ్వాసంతో బ్రతుకుతుండేదాన్ని.
2024, జూలై 10న నా పుట్టినరోజు. ఆ రోజు నాకు ఒక అబ్బాయి నుండి 'హాయ్! మేము పెళ్ళికి ఆసక్తిగా ఉన్నామ'ని మెసేజ్ వచ్చింది. విషయమేమిటంటే, 2023లో 'భరత్ మ్యాట్రిమోనీ'లో నేను నా ప్రొఫైల్ అప్లోడ్ చేశాను. కేవలం అప్లోడ్ చేయడమైతే చేసానుగాని, 'నాకేం సంబంధం కుదురుతుంది?' అనుకొని ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఆ అబ్బాయి మెసేజ్ వచ్చినప్పుడు 'ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి' అని ఏదో మామూలుగా చూశాను. కానీ ఆ అబ్బాయి ఫోటో చూస్తే, బాబా నాకు స్వప్నంలో చూపించిన అబ్బాయి పోలికలు సరిపోలాయి. ఆ విషయం నేను మా ఇంట్లోవాళ్ళకి చెప్తే, వాళ్ళు నమ్మలేదు, 'పిచ్చమ్మాయి' అన్నట్టుగా నన్ను చూశారు. నాకు ఒకవైపు బాబా లీల అనిపించినప్పటికీ మరోవైపు అంతా నా భ్రమ ఏమో అనిపించింది. కానీ అదే అబ్బాయితో నాకు వివాహం నిశ్చయమై 2024, డిసెంబర్ 11కి ఘనంగా జరిగింది. ఆరోజు స్వప్నంలో కనిపించిన అబ్బాయి, ఇప్పుడు నా భర్త; స్వప్నంలో ఉన్న ఆ ఇల్లే నా అత్తారిల్లు. నా జీవితాన్ని బాబా నాకు ముందుగానే స్వప్నంలో చూపించారు. నేను కోరుకున్న దానికంటే ఎన్నోరేట్లు అధిక సద్గుణాలు కలిగిన వ్యక్తిని నాకు భర్తగా ప్రసాదించారు బాబా. ఆయన కృపవల్ల గుణవంతుడైన భర్త, ప్రేమగా చూసుకునే అత్తారిల్లు నాకు లభించాయి. ఆయన నా వివాహాన్ని ఒక అద్భుతంలా జరిపించి నన్ను చిన్న చూపు చూసిన వారి ముందే తలెత్తుకుని గౌరవంగా ఉండేలా చేశారు.
బాబా అనుగ్రహంతో నా అన్నకి కూడా సంబంధం కుదిరి నా పెళ్ళికి 20 రోజుల ముందు అనగా 2024, నవంబర్ 20న వివాహం అయింది. ఇదంతా చూసి ఊర్లో వాళ్లంతా, 'ఏంటి ఇదంతా? ఇన్ని రోజులు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరని వాళ్ళిద్దరికీ సంబంధాలు కుదిరి, రెండు పెళ్లిళ్లు ఒకేసారి అవ్వడం ఏంటి?' అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మా ఇంట్లో అందరం చాలా సంతోషంగా, మనశాంతిగా, ప్రశాంతంగా ఉన్నాము. మాకు ఇప్పుడు బాబానే అండదండ అని తలచి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాము. మా ఇంట్లో జరిగిన ఈ పెళ్ళిళ్ళను బాబా ప్రసాదంగా, బిక్షగా నేను, నా కుటుంబం భావిస్తున్నాము. బాబా అంటే తెలియని నా భర్త కూడా ఇప్పుడు బాబా భక్తుడిగా మారి బాబానే సర్వంగా తలుస్తున్నారు. ఇదంతా బాబా దయవల్లనే. ఇదంతా టైపు చేస్తుంటే నా మనసు కదిలిపోతుంది, నాకు మాటలు రాక సరిగా బాబా లీలను వ్యక్తపరచలేకపోతున్నాను. ఏదేమైనా కన్నీటిపరమైన నా జీవితంలో వెలుగు నింపిన బాబాకి శతకోటి వందనాలు. "తండ్రీ! సాయినాథా! మీకు శతకోటి వందనాలు. నేను ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాను. నా భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను మన్నించి నాకు ఎల్లవేళలా తోడుగా ఉండు తండ్రీ. జన్మజన్మలకు నీ భక్తురాలిగా నీ పాద సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించు తండ్రీ".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

Very nice Sai Leela.When we keep Shraddha and Saburi on him he will take care of all devotees.Om Sai Ram
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl rasmi ki pregnancy vachhatatlu chai thandi
ReplyDeleteOm Sai Ram
ReplyDelete