సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 456వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రసాదం
  2. 'నా భక్తులు కష్టంలో ఉంటే, నాకు కన్నీళ్లు వస్తాయి'

బాబా ప్రసాదం

సాయిభక్తుడు శంకరరావు తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

మేము ఐదేళ్లక్రితం శ్రీసాయిబాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు బాబా కోసం ఏదైనా స్వీట్ తీసుకొని వెళ్లాలని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల తొందరలో స్వీట్ ఏమీ తీసుకోలేకపోయాము. ఖాళీ చేతులతోనే వెళ్లి క్యూ లైన్లో నిలుచున్నాము. బాబా కోసం ఏదీ తీసుకొని వెళ్లలేకపోతున్నందుకు నేను  చాలా బాధపడ్డాను. సాధారణంగా బాబాకు అర్పించడానికి భక్తులు తెచ్చేవాటిని అక్కడున్న పూజారులు అందుకొని, వాటిని బాబాకు నివేదించి తిరిగి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. కానీ నేను బాబాకు ఏదీ తీసుకొని వెళ్లట్లేదు కాబట్టి ప్రసాదం లేకుండా ఒట్టి చేతులతో తిరిగి రావాలని కలవరపడుతూనే బాబా ముందుకు చేరుకున్నాను. బాబాకు అర్పించడానికి నా చేతిలో ఏమీ లేనందున కేవలం బాబాకు మనసారా నమస్కరించుకున్నాను. తరువాత నాకు తెలియకుండానే ఏదో అందుకోవడానికి అన్నట్లు నా రెండు అరచేతులను బాబా ముందు చాచాను. మరుక్షణంలో అద్భుత లీల జరిగింది. అకస్మాత్తుగా నా అరచేతుల్లో ఒక ప్యాకెట్ వచ్చి పడింది. అందులో తెల్లని గుళికల్లాంటి స్వీట్స్ ఉన్నాయి. ఆశ్చర్యంతో బాబా చూపిన లీలకు అనందపరవశుడినయ్యాను. అలనాడు గురుపూర్ణిమనాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తుంటే భక్తుడు రేగే తాను ఏమీ తేలేదని నొచ్చుకుంటే, బాబా తమ మెడలోని మాలల్ని చూపిస్తూ, "ఇవన్నీ నీవే" అని అంటారు. అలా ఎప్పటికీ మరిచిపోలేని అద్భుత అనుభవం బాబా నాకు ప్రసాదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

'నా భక్తులు కష్టంలో ఉంటే, నాకు కన్నీళ్లు వస్తాయి'

సాయిబంధువులకు, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 2020, జూన్ 15వ తారీఖున నాకు ఒక అనుభవం కలిగింది. అయితే, "ఇది నిజంగా బాబా లీలేనా!?" అని నిర్ధారించుకోవడానికే నాకు కాస్త సమయం పట్టింది. ఎందుకంటే, ఈ విషయంలో నా బాధ తగ్గించమని గానీ, సహాయం చేయమని గానీ నేను బాబాను అడగలేదు. కానీ సమస్త ప్రాణికోటినీ కన్న ప్రేగు కదా ఆయనది, ఆయనకి అన్నీ తెలుసు. తన బిడ్డలు బాధపడుతుంటే బాబా చూడలేరు. జరిగినదంతా కాసేపు ఆలోచించుకుని అర్థం చేసుకున్నాను, ఇదంతా నా బాబా చేసిన సహాయమే అని. కానీ 'దీన్ని బ్లాగులో పంచుకోవాలా, వద్దా?' అని సందేహించాను. ఎందుకంటే ఇది అందరితో పంచుకునేంత పెద్ద విషయం కాదేమో అనిపించింది. కానీ, 'నా బాబా చేసే ప్రతి లీలనూ అందరితో పంచుకోవాలి, అందరికీ బాబా మీద నమ్మకం పెరగాలి' అని ఆలోచిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. రోజుకి ఎన్నోసార్లు కేవలం బాబా కోసం, బాబా ఏదైనా సందేశం ఇస్తారని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అలానే ఓపెన్ చేశాను. నా ఆలోచనలకి తగినట్టుగానే నా బాబా సందేశం కనిపించింది. బాబా ఫోటో క్రింద ఆయన సందేశం ఇలా ఉంది: "It brings tears in my eyes, seeing my devotees in pain (నా భక్తులు కష్టంలో ఉండటం చూస్తే, నా కళ్ళ నుండి నీళ్లు వస్తాయి)". ఇంక నాకు పూర్తిగా అర్థమైంది, బాబానే నాకు సహాయం చేశారు అని. అది ఎలా అనేది ఇప్పుడు మీతో పంచుకుంటాను.

కరోనా వల్ల దాదాపు మూడు నెలల నుండి మాకు మినరల్ వాటర్ సప్లై చేసేవాళ్ళు రావటం మానేశారు. నేను మా నాన్నతో కలిసి బైక్ మీద వెళ్లి వాటర్ క్యాన్ తీసుకొస్తుంటాను. మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాము. నా తల్లిదండ్రులకి కొడుకైనా, కూతురైనా నేనే. అందువల్ల నేనే వాటర్ క్యాన్‌ని పైకి మోసుకుని వెళ్తాను. కానీ ఎందుకో తెలియదు, నిన్నటినుండి(2020, జూన్ 14)  నా కుడి అరచేయి చిన్న నొప్పితో మొదలయ్యి కొద్దిగా ఉబ్బింది. దాంతో కుడిచేత్తో దేన్నీ పట్టుకోలేకపోతున్నాను, కనీసం మంచినీళ్ల చెంబు కూడా. ఈరోజు ఉదయం మేము వెళ్లి వాటర్ క్యాన్‌ తీసుకురావాలి. సాధారణంగా డాడీ ఆఫీసుకి వెళ్లేముందు నన్ను తీసుకెళ్లి, వాటర్ క్యాన్‌ తీసుకొని, నన్ను ఇంటి దగ్గర దింపేసి తరువాత ఆఫీసుకి వెళ్తారు. కానీ ఈరోజు డాడీ ఆఫీసుకి బయలుదేరే సమయానికి నేను చేస్తున్న బాబా పారాయణ పూర్తి కాలేదు. దాంతో వాటర్ క్యాన్‌ని సాయంత్రం తీసుకొద్దామని చెప్పి మా డాడీ ఆఫీసుకి వెళ్లిపోయారు. 

కానీ మెల్లమెల్లగా నా చేతినొప్పి ఇంకా ఎక్కువైంది. "ఇంత నొప్పితో సాయంత్రం వాటర్ క్యాన్‌ని పైకి ఎలా తేవాలి?" అని అనుకున్నాను. సమయం గడిచి మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పడుకుందామని అనుకున్నాను. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నాలో ఉన్నట్టుండి ఏదో ఆందోళన మొదలైంది. మనసులో బాబాను స్మరిస్తున్నప్పటికీ ఆందోళన అలానే ఉంది. దాంతో అసలు నిద్రపోలేకపోయాను. "ఏంటి బాబా ఇది? ఏమీ జరగకుండానే ఈ ఆందోళన ఎందుకు? నన్ను హాయిగా పడుకోనివ్వు" అని అనుకుంటున్నాను. సుమారు ఒక 45 నిమిషాల తర్వాత, క్రింద నుండి గట్టిగా అరుపులు - "వాటర్, వాటర్" అని. "అరే, మాకు వాటర్ క్యాన్ సప్లై చేసే అతనేనా?" అని పరిగెత్తుకుని బయటికి వెళ్ళి చూశాను, అతనే! కాసేపట్లో అతను వెళ్లిపోయేవాడే, ఎందుకో ఒక్క క్షణం ఆగి పైకి చూశాడు. నేను అడగగానే వాటర్ క్యాన్‌ని పైకి తీసుకొచ్చి ఇచ్చాడు.

దాదాపుగా మూడునెలల నుండి రానివాళ్ళు ఈరోజు వచ్చారు. ఒకవేళ నేను నిద్రపోయుంటే అతను వెళ్లిపోయేవాడే. నన్ను నిద్రపోకుండా చేసి వాటర్ క్యాన్ తీసుకునేలా చేశారు బాబా. ఇంక మా మంచినీటి సమస్య తీరిపోయింది. 

బాబాకి సర్వస్య శరణాగతి చేసి, ఆయన్నే నమ్ముకుంటే ప్రతి విషయంలోనూ బాబా మన వెన్నంటే ఉంటారు. నేను అడగకుండానే ఈ విషయంలో బాబా నాకు సహాయం చేశారు. "బాబా! నాకోసం నువ్వు బాధపడకు, నా చెయ్యినొప్పి కూడా తగ్గిపోతుంది. నువ్వు బాధపడితే నీ భక్తులమైన మేము కూడా తట్టుకోలేము. నీ ప్రేమని పొందుతున్న నేను ఎంతో అదృష్టవంతురాలిని. శరణు సాయీ, శరణు! నీ భక్తులందరినీ ఎల్లవేళలా వెన్నంటి ఉండి రక్షించు".

ఓం సాయిరాం!


సాయి అనుగ్రహసుమాలు - 414వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభై ఏడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బాబా కుశాల్ సేట్ ఇంటినుంచి బయలుదేరి నదిని దాటి బండి ఆగివున్న చోటువరకూ నడిచి చేరుకున్నారు. నేను కూడా అక్కడకు చేరుకున్నప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది: “వెనుకనుండి నన్ను పట్టుకుని నువ్వు గుర్రంలా నడువు!” అని. అందువల్ల నేను బాబాకి సరిగ్గా వెనకాల నిలుచున్నాను. బాబా నడుముని రెండు చేతులతో పట్టుకుని గుర్రంలా నడిచాననుకుంటా. అలాగే బాబా చరణాల వద్ద ఆకుపచ్చని బట్టలో చుట్టబడివున్న (శిరస్సు, ముఖం, ఛాతీలతో సహా) ఒక శవాన్ని చూశాను. అది చూసిన నాకు, 'బాబా ఇక్కడ ఎవరో ఒక రాక్షస ఫకీరును చంపారేమో' అనిపించింది. తరువాత బాబా బండిలో కూర్చున్నారు. వారితోపాటు బండిలో కాకాసాహెబ్, నార్వేకర్ కూర్చున్నారు. మేము బండి వెనుక కొంతదూరం వరకూ పరుగెత్తాం. అప్పుడు బాబా నాతో, “అరె! ముళ్ళల్లోకి ఎందుకెళ్తావు? సరిగ్గా రోడ్డుమీద నడువు” అన్నారు. దాని తరువాత వామనరావ్ నార్వేకర్‌కు కుశాల్‌భావు చేత కొంచెం డబ్బును అప్పుగా ఇప్పించటం కోసం బాబా ఆరోజు కుశాల్‌భావు ఇంటికి వెళ్ళారని నాకు తెలిసింది. వామనరావుకి అప్పు లభించిందో లేదో తెలుసుకోవటం కోసం అక్కడ నేను ఆగలేదు కనుక ఈరోజు వరకూ నాకది తెలీలేదు. 

శ్రీకృష్ణభగవానుడు ఈ రకంగానే రాక్షససంహారం చేయటం కోసం బృందావనానికి ఆవుల్ని మేపటానికి తీసుకొని వెళ్తుండేవారు. ఈ సంఘటన తరువాత నాకు రాక్షససంహారాన్ని బాబా ప్రత్యక్షరూపంతో చూపించారని అనిపించేది. నాతో పాటు బాబా వెంటవచ్చిన కాకాసాహెబ్ గానీ లేదా నార్వేకర్ గానీ ఆ దృశ్యాన్ని చూసి ఉంటారని నాకనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూపించి బాబా నాకు, "నీవు ఇక్కడనుంచి వెళ్ళు! ఈ ఫకీరు రాధాకృష్ణమాయిని చంపేశాడు. చూడు, నా చరణాల వద్ద ఆమె శవం!” అని సూచిస్తున్నారేమో! అలాగే అయింది కూడా. వైకుంఠరావు వచ్చి నన్ను ముంబాయి తీసుకెళ్ళాడు. ముంబాయి నుంచి నేను మోతా వెళ్ళాను. నేను శిరిడీని వదిలిన 21 రోజుల తరువాత, రాధాకృష్ణమాయి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అంతం చేసుకున్నదని నాకు తెలిసింది.

ఒకరోజు ఉదయం బాబా నామోచ్ఛారణ చేస్తూ బాబా చరణాలకి ప్రణామం చేసినప్పుడు బాబా, “అరె! ఇంకా అదే చేస్తున్నావా?” అన్నారు. దీంతో నేను ఆలోచనలో పడిపోయాను. బాబా తమ 'సాయినాథ్' నామస్మరణతో ప్రసన్నులు కాలేదా? వేరే ఏదైనా నామం జపించాలని నాకు ఆదేశమిస్తున్నారా? అని అనిపించింది. బాబా ఆదేశంతో నేను జపిస్తున్న మంత్రం యొక్క తీవ్రమైన శబ్దం అలా మస్తిష్కం నుంచి బయటకొచ్చి ఆకాశంలో సమ్మిళితమైపోయింది. దీనికి వివరణ మొదటే ఇచ్చేశాను. నానావలీ నా తలమీద రాయితో రెండు గాయాలు చేసి నాతో, “సితార్ వాయించటం తెలీకపోతే చేతిలోకి ఎందుకు తీసుకున్నావు?” అన్నారు. దీంతో నేను జపిస్తున్న మంత్రం విషయంలో నా చిత్తంలో శంక ఉత్పన్నం అయింది. అందుకని బాబా తమ నామోచ్ఛారణ విషయం తమకు నచ్చకపోవటాన్ని ప్రకటించారు. మరి ఇప్పుడు నేను ఏ నామస్మరణ చేయాలి? ఏ మంత్రజపాన్ని చేయాలి? అన్న యోచనలో పడిపోయాను. కానీ ఈ విషయంలో స్పష్టంగా సూచన లభించే వరకూ నేను బాబా ద్వారా లభించిన మంత్రజపాన్నే కొనసాగించాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 455వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఊదీతోనే జ్వరాన్ని తగ్గించేశారు బాబా
  2. బాబా మాటలు పొల్లుపోవు - ఆయనకన్నీ తెలుసు!

ఊదీతోనే జ్వరాన్ని తగ్గించేశారు బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. 2020, జూన్ 13న జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆరోజు రాత్రి మా అపార్ట్‌మెంటులో వాళ్ళు మాతో మాట్లాడటానికి మా ఇంటికి వచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే మావారికి చలిగా అనిపించింది. అయినా అలానే కూర్చుని మాట్లాడుతున్నారు. కొంతసేపటి తరువాత తన శరీర ఉష్ణోగ్రత బాగా ఎక్కువైపోయి చలి బాగా పెరిగిపోయింది. అసలే ఈ సమయంలో అంతటా కోవిడ్ ఉంది. దాంతో నాకు చాలా భయమేసి, బాబాను ప్రార్థించి, మావారి నుదుటిపై కొద్దిగా బాబా ఊదీని పెట్టి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి తనకు త్రాగించాను. తరువాత 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అని 108 సార్లు జపించాను. "మావారి జ్వరం తగ్గించు బాబా!" అని తెల్లవారుఝామున 3 గంటల వరకు బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. బాబా అద్భుతం చూపించారు. 3 గంటల సమయంలో మావారికి శరీరమంతా చెమటలు పోశాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చేసింది. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండానే కేవలం తన ఊదీతోనే మావారి జ్వరాన్ని తగ్గించేశారు బాబా. "బాబా! నీ భక్తులను కాపాడు తండ్రీ. కోవిడ్ బారినుంచి అందరినీ కాపాడు. మా కుటుంబానికి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కావాలి బాబా. నా తప్పులేమైనా ఉంటే మన్నించు బాబా!'

బాబా మాటలు పొల్లుపోవు - ఆయనకన్నీ తెలుసు!

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులకు నా నమస్సులు. బాబా అనుగ్రహం వల్ల నేను గతంలో కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను ప్రతి మంగళవారం గణేశునికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు చేసేదాన్ని. కానీ కొన్ని రోజులుగా మానసిక వ్యధ వల్ల దేవుడి మీద విరక్తి కలిగి పూజల మీద నాకు శ్రద్ధ ఉండటం లేదు. అయితే సాయిసచ్చరిత్ర, శ్రీగురుచరిత్ర మాత్రం పారాయణ చేస్తుండేదాన్ని. జూన్ 10, 2020న చేసుకోవాలనుకున్న సంకటహర గణపతి వ్రతాన్ని కొన్ని కారణాలవల్ల చేసుకోలేకపోయాము. ఆరోజు సచ్చరిత్ర పారాయణ పూర్తయ్యాక వాట్సాప్ ఓపెన్ చేస్తే బాబాకు సంబంధించిన ఒక ఇంగ్లీషు బ్లాగులో బాబా గణేశుడిగా దర్శనం ఇచ్చిన ఒక భక్తురాలి అనుభవం వచ్చింది. నా పాపకర్మ చూడండి, నా మనసుకి ఉన్న అహం వల్ల, 'బాబా ఇలాంటి కంటితుడుపు చర్యలు చేయటం తప్ప నా బాధ మాత్రం తీర్చటం లేదు' అనుకున్నాను. తరువాత పిల్లలని పడుకోబెట్టి ఫోన్ తీసుకుని బయట కూర్చున్నాను. అప్పుడే మా బావగారు వచ్చి 'గణపతి హోమం చేసుకున్నామ'ని చెప్పి ప్రసాదం ఇచ్చారు. లాక్‌డౌన్ తర్వాత అదే మొదటిసారి ఆయన మా ఇంటికి రావటం. ఆ మర్నాడు, ఆరోజు పూర్తిచేయాల్సిన సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశాక, ఒక సమస్య కోసం ప్రశ్న-జవాబుల వెబ్‌సైట్ చూస్తే "రోగం నుండి బయటపడతారు, బాబాను స్మరించండి" అని వచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. తరువాత, "మరో వారం సచ్చరిత్ర పారాయణ చేయనా?" అని బాబా ముందు చీటీలు వేస్తే, "వద్దు" అని వచ్చింది. 

మర్నాడు అంటే 12 జూన్, 2020న ఉదయం లేస్తూనే భరించలేనంత భుజంనొప్పి వచ్చింది. ఆ నొప్పితోనే దీపారాధన చేసి మావారిని ఆఫీసుకి పంపి, పిల్లలకి భోజనం పెట్టాను. ఆ తరువాత లాక్‌డౌన్ వల్ల హాస్పిటల్‌కి వెళ్ళే అవకాశం లేక డాక్టరుకి ఫోన్ చేసి, నా భుజం నొప్పి గురించి చెప్పి, నొప్పి తగ్గటానికి మందులిమ్మని అడిగాను. డాక్టర్ నా భుజంనొప్పికి మందులు రాయటానికి ముందు నన్ను రక్తపరీక్ష చేయించుకోమన్నారు. రక్తపరీక్ష చేయిస్తే, రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. ఆ తరువాత కాసేపు పడుకుని సాయంత్రం ఆరింటికి లేచాక పూజ, వంట చేసి బాబా ఊదీ పెట్టుకున్నాను. ఇంతలో మావారు ఆఫీసునుండి వచ్చి ఒక వాచీ కోసం అడిగారు. అది పైన బీరువాలో పెట్టినట్లు గుర్తు. కానీ నాకు చెయ్యి పైకెత్తి పనిచేసే ఓపిక లేక బాబాకి నమస్కారం చేసుకుని (దేవుడితో ఇలాంటి మొక్కులు నాకు నచ్చకపోయినా), "బాబా! ఈ భుజంనొప్పితో ఆ వాచీ కోసం నేను వెతకలేను. ఆయన అసలే కోపంగా ఉన్నారు. ఒక చిన్న వాచీకోసం ఆయనతో గొడవ జరగకూడదు. ఏ గొడవా జరగకుండా ఆయన ప్రశాంతంగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. వెంటనే మా పెద్దమ్మాయి, "అమ్మా! వాచీలు మేకప్ బాక్సులో ఉన్నాయి" అంటూ ఆ వాచీ తీసిచ్చింది. ఇక్కడ బాబా దయకు మరో తార్కాణం - ఆ రాత్రికి గొడవవుతుందని అనుకుంటే మావారు నన్నేమీ అనలేదు, పైగా చక్కగా మాట్లాడారు కూడా. నేను ఈరోజు (శనివారం, 13 జూన్ 2020) పడుకుని లేచేసరికి నాకు భుజంనొప్పి లేదు.

ముఖ్యమైన సంగతి - ప్రశ్న-జవాబుల వెబ్‌సైట్‌లో "రోగం నుండి బయటపడతారు, బాబాను స్మరించండి" అని వచ్చినప్పుడు, "నేను బాగానే ఉంటే బాబా ఇలా రోగం నుండి బయటపడతారు అన్నారేంటి? కంప్యూటరులో అన్నీ ఇలాగే వస్తాయి" అని అనుకున్నాను. కానీ నా భుజంనొప్పి, రిపోర్ట్ నార్మల్‌గా రావటం చూస్తే, "బాబా మాటలు పొల్లుపోవు; మనకి తెలియని విషయాలు, మనం చూడలేని విషయాలు బాబాకు తెలుసు" అని అర్థమైంది. దాంతో "నాకున్న బాధ బాబాకు తెలుసు. దాన్ని కూడా వారు అనూహ్యమైన రీతిలో తీరుస్తారు" అని నమ్మకం పెరిగింది. అంతేకాదు, 'ఆ వెబ్‌సైట్ చిన్న పిల్లల ఆట కాదు' అని తెలుసుకున్నాను.  ప్రస్తుతం నేను అనుభవిస్తున్న బాధను బాబా తీర్చగానే ఆ అనుభవాన్ని కూడా తప్పకుండా ఈ బ్లాగులో పంచుకుంటాను. అందరికీ ఒకటే చెబుతున్నా - బాబా మార్గం అనూహ్యం. ఆయన తన బిడ్డలను ఎప్పటికీ విడువరు. మనమందరం బాబా స్మరణ ఎల్లప్పుడూ చేద్దాము.

ఓం సాయిరాం!


సాయి అనుగ్రహసుమాలు - 413వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైఆరవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి మధ్యాహ్న ఆరతి, భోజనం అయ్యాక బాపూసాహెబ్ జోగ్ నాతో, “వామనరావ్! ఈ ఎడ్లబండి ఎక్కు. బాబా రహతాలో కుశాల్ సేట్ ఇంటికి వెళ్ళారు. మనం కూడా అక్కడికి వెళ్దాం పద!” అన్నాడు. జోగ్ ధర్మపత్ని కూడా ఆయన వెంట ఉంది. వారిద్దరితోపాటు నేనూ బండిలో కూర్చున్నాను. దారిలో ఒకచోట బండి చక్రం బురదలో కూరుకుపోయింది. దాన్ని చూసి బాపూసాహెబ్ నాతో, “నీకు సిద్ధి ప్రాప్తించిందని అందరూ అంటున్నారు. ఈ చక్రాన్ని నీ చేత్తో స్పృశించు. దాంతో ఈ చక్రం బురద నుండి బయటకు వచ్చి బండి ముందుకు నడిస్తే అప్పుడు నేను లోకుల మాటలు సత్యమని అంగీకరిస్తాను” అన్నాడు. ఇలా అని ఆయన నా చేత బండిచక్రాన్ని స్పృశింపచేశాడు. ఆయన శ్రద్ధ వల్ల చక్రం వెంటనే బయటకు వచ్చి బండి తనంత తానే నడవసాగింది. ఇది చూసి బాపూసాహెబ్, "లోకులు చెప్పిన దాంట్లో అసత్యమేమీ లేదు. నీ వద్ద ఖచ్చితంగా ఏదో ఉంది. కానీ, నాకు స్వతహాగా వీటన్నిటి మీదా నమ్మకం లేదు. బాబా ఎవరిపై కృప చూపిస్తారో వారికన్నీ ప్రాప్తిస్తాయని నాకనిపిస్తుంది” అన్నాడు. అతని శ్రద్ధకు బాబా సరైన ప్రమాణాన్ని చూపించారు. నదిని దాటిన తరువాత రహతాలో ఒడ్డుమీద బండి ఆగిపోయింది. మేం దిగి కుశాల్ భాయి ఇంటివైపు నడవటం ప్రారంభించాం.

అక్కడొకవైపున నేను బాబాని చూశాను. నేను వారి వెనక్కి వెళ్ళాను. ఒక పెద్ద హాల్లో సర్కస్ లేదా నాట్యాలయాల్లో వెనకటిరోజుల్లో కూర్చోవటానికి ఏర్పాట్లు ఎలా ఉండేవో, లేదా మా రోజుల్లో కాలేజీలో కూర్చునేందుకు ఏర్పాట్లు ఎలా ఉండేవో ఆ ప్రకారంగానే మూడువైపులా కూర్చోవటానికి బెంచీలు వేసి ఉన్నాయి. కూర్చునేచోట మూడువైపులా స్త్రీ పురుషులతో క్రిక్కిరిసిపోయి ఉంది. నాలుగవ ప్రక్క ఖాళీగా ఉంది. ఆ ప్రక్కన నేలమీద ఇత్తడితో తయారుకాబడిన ఒక చిన్న పంజరం వుంది. దాని పైభాగం తెరవబడి ఉంది. అక్కడున్న జనసముదాయమంతా కలిసి బాబాకు ప్రేమపూర్వకంగా వందనం చేసింది. బాబా తన స్థానంలోనే నిలబడి వారందరి నమస్కారాలనూ చేతులు ముకుళించి స్వీకరించారు. అలాగే ఆయన ఆ పంజరాన్నించి బయటకు వచ్చి కుశాల్ భాయి దగ్గరకు వెళ్ళారు. ఆ హాలు గురించి తరువాత నేను శిరిడీలో చాలాసార్లు అడిగాను. 1957లో కూడా మళ్ళీ మరోసారి అడిగాను. కానీ రహతాలో ఇలాంటి హాలు ఉండేదని ఎవరికీ తెలిసినట్లు లేదు. బాపూసాహెబ్ జోగ్‌తో ఈ విషయం గురించి మాట్లాడేందుకు నాకు అవకాశం రాలేదు. నేను చూసిన దృశ్యాన్ని గురించి నేను ఆయనతో కానీ, ఆయన భార్యతో కానీ మాట్లాడలేదు. దీంతో ఈ దృశ్యం బాబా కేవలం నాకోసమే చూపించారని నాకిప్పుడు అర్థమవుతోంది. బాబా దర్శనం కోసం గుమిగూడిన ప్రజలు సుమారు ఒక వెయ్యిమంది ఉంటారు. వారు దర్శన సమయంలో ఎంత శాంతిగా, క్రమశిక్షణతో ఉన్నారంటే అది నిజంగా ప్రశంసనీయం. ఇంతేకాదు, ఇలా అరుదుగా దృష్టికి కనిపించే ఈ రకమైన శాంతి, క్రమశిక్షణలు అనునరించవలసినవి. అందువల్ల నా మనసులో ఆ చిత్రం చెరిగిపోని విధంగా ముద్రించుకుపోయింది. అక్కడ్నుంచి బాబాని అనుసరిస్తూ అనుసరిస్తూ మేము కుశాల్ సేట్ ఇంటికి వెళ్ళాం.

బాబా తన గద్దెమీద దిండ్లనానుకొని కూర్చున్నారు. నేను, కాకాసాహెబ్ మొదలైన వారందరం బాబా ఎదుట కూర్చున్నాం. బాబా ఆగమనానికి స్వాగతం చెప్తూ, పూజ, అర్చన చేసి పండ్లతో నిండిన పళ్ళాన్ని బాబా ఎదుట ఉంచాడు కుశాల్ సేట్. నేను బాబాకి సరిగ్గా ఎదురుగా కూర్చున్నాను. ఆ పళ్ళెం నుంచి ఒక అరటిపండుని తీసి, ఒలిచి నేను బాబాకిచ్చాను. అందులో సగం అరటిపండుని తాము గ్రహించి మిగిలిన సగభాగాన్ని నాకు తిరిగిచ్చారు బాబా. నేను చేసిన ఈ పనిని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ముఖ్యంగా కాకాసాహెబ్. శిరిడీకి వెళ్ళాక ఈ విషయాన్ని రాధాకృష్ణమాయితో చెప్పారు. అప్పుడు ఆమె నన్ను చూస్తూ, “ప్రేమను కేవలం శిరిడీ బయటే చూపించాలా ఏం? వామన్! ఇంతటి ప్రేమను చూపించటం పట్ల ఇక్కడ ఎవరు అడ్డుచెబుతారు?” అన్నది. నా మనసులో అలా ఏమీ లేదు. నాకు అంతరంగం నుంచి ఆదేశం వచ్చిన ప్రకారం నేను బాబాకు అరటిపండిచ్చాను, ఆ ప్రకారంగానే ఆయన తిన్నారు. దీన్నిబట్టి బాబానే దీన్ని ఆదేశించారని తెలుస్తోంది. ఇదే సత్యం. దీన్ని అంగీకరించడంలో ఎవరూ సందేహించనక్కరలేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయి అనుగ్రహసుమాలు - 412వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైఐదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

తరువాత నేను పరిసరాల్లో ఉన్న గోడ ప్రక్కగా వెళుతూ అక్కడ నిలబడ్డానో లేదో అంతలో బాబా దగ్గర్నుంచి కాకాసాహెబ్ దీక్షిత్ నా దగ్గరకు వచ్చారు. ఆయన నాకు బాబా ప్రసాదమైన ఓ సీతాఫలం ముక్కనిచ్చారు. ఆ రోజుల్లో నాకు జ్ఞానాభిమానం ఉందో, లేక జ్ఞానప్రాప్తి కోసం ఎక్కువ అభిలాష ఉందో గానీ మొత్తానికి నాకా ప్రసాదం రుచించలేదు. అందువల్ల కాకాసాహెబ్ దీక్షిత్ ఇచ్చిన ప్రసాదం చేత్తో తీసుకున్నప్పటికీ మనసుతో స్వీకరించలేదు. ఆ పరిసరాల్లో ఉన్న గోడపై దాన్నలాగే ఉంచి రోడ్డుపై పచార్లు చేయసాగాను. దార్లో ఆలోచిస్తూంటే, సీతాఫల ప్రసాదం బాబా కేవలం నా కోసమే కాకాసాహెబ్ ద్వారా పంపించటంలోని ఉద్దేశ్యం, నాకు సీతాఫలం, అంటే సీత యొక్క అనన్య, అవ్యభిచార భక్తిని ఆచరించటం యోగ్యమన్న ఉపదేశం ఇవ్వటానికేనని తెలిసింది. కానీ ఆ రోజుల్లో నాకు జ్ఞానం గురించిన అహంకారం ఉండేది. అంటే, జ్ఞానం లేకపోతే జనన మరణ చక్రాలనుంచి తప్పించుకోలేమని నాకనిపించేది. అంతేకాక, 'నేను జ్ఞానానికి అర్హుడిని, ఇంక భక్తితో పనేమిటి?' అన్న అహంకారం కూడా ఉండేది. పచార్లు చేస్తుండగా, "ఈ విషయంలో నాకు మొండిపట్టు ఎందుకు? గురుమహారాజుకి నా భూమిక ఏమిటో బాగానే తెలుసు. వారు నాకు ఏది యోగ్యమో అదే ఇస్తారు. గుడ్డిగవ్వలాంటి యోగ్యతను పెట్టుకుని మనం వంద రూపాయలను ఆశిస్తే అదెలా కుదురుతుంది? అందువల్ల బాబా చేత పంపబడిన ప్రసాదాన్ని అవమానించటం నేను చేసిన పెద్దనేరం" అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనతో తిరిగి సీతాఫలం ముక్కను పెట్టిన చోటికి వెళ్ళాను. దాన్నెక్కడ పెట్టానో అక్కడే ఉందది. దాన్ని అక్కడ పెట్టి ఇంత సమయం గడిచిపోయినప్పటికీ ఏ వ్యక్తీ, పక్షీ, కనీసం జంతువు దృష్టిలోనూ అది పడకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ప్రసాదాన్ని స్వీకరించకపోవటం నా గొప్ప నేరమని మనసులో దృఢంగా అన్పించి ఆ సీతాఫలం ముక్కను ఆనందంగా స్వీకరించాను. “సీతామాతకు ప్రభువు శ్రీరామచంద్రునిపై ఉన్న అనన్య ప్రేమ, భక్తి లాంటి భక్తిని ఆచరించాల"న్నదే బాబా ఉపదేశం అని ఈరోజుక్కూడా నాకనిపిస్తుంది. అలాగే నేను సన్యాసం స్వీకరించిన తరువాత కూడా గురుభక్తి, అంటే ప్రేమారాధనను చేయాలన్న ఉపదేశాన్ని బాబా శ్రీవణశీకర్ నాకెంతో పట్టుదలతోనూ ఆదరపూర్వకంగానూ ప్రసాదించిన పాదుకల ద్వారా ఇచ్చారని నేను తెలుసుకున్నాను.

ఒకసారి సాయంకాలం మశీదులో అందరూ సమావేశమయ్యే సమయంలో నేను వెళ్ళి కట్టడా బయట కూర్చున్నాను. అప్పుడు బాబా కొంచెం కోపంగా ఉన్నట్లు కనిపించారు. అప్పుడు కాకాసాహెబ్ మొదలైనవారు పైన కూర్చోవటానికి వచ్చారు. కానీ బాబా వాళ్ళని అక్కడ కూర్చోనివ్వక నన్నొక్కడినే ఒంటరిగా కూర్చోబెట్టుకొని, "వీరంతా ఆమెని (రాధాకృష్ణమాయిని) తీసుకొచ్చి నా ఎడమచేతి ముందు కూర్చోపెట్టాలనుకుంటున్నారు. కానీ ఆమెని నేను కూర్చోనివ్వను. ముంబాయి వాళ్ళందరూ అలిగారు. అందరూ కేవలం స్త్రీనే చూస్తున్నారు. స్త్రీలకే మనుషులు బానిసలవుతున్నారు” అన్నారు.

ఒకరోజు ఉదయం 9 గంటలకు నన్నో ఫకీరు కలిశాడు. అతడు నన్ను, “వామనరావ్ ఎల్.ఎల్.బి. అంటే నువ్వేనా?” అన్నాడు. నేను, “మీరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు?” అని అడిగితే, అప్పుడతను “బాబా నాకో రూపాయి ఇచ్చి, ఒక దర్గా దగ్గరకు వెళ్ళి ‘వామనరావు ఎల్.ఎల్.బి కోసం ప్రార్థించమ’ని చెప్పారు. అందువల్లే మీరు వారేనా అని మిమ్మల్ని నేనడుగుతున్నాను” అన్నాడు. బాబాకి నా గురించి ఎంత ఆరాటం! ఈ విషయం ఈ ఫకీరుకీ, బాబాకీ, నాకూ తప్ప ఇంకెవరికీ తెలియదు. మహాత్ములు ఇంత నిష్కామంగా, శాంతంగా ప్రేమిస్తారు. వారు భక్తుల పాత్రతను, అపాత్రతను గురించి ఆలోచించరు. బాబా నా యోగ్యాయోగ్యాలను ఆలోచిస్తే నేను అయోగ్యుణ్ణే. వారు సర్వజ్ఞులు. నా అల్పత్వమంతా వారికి తెలును. కానీ వారిపై ధ్యానం పెట్టుకోకపోయినా ముద్దుచేసే తల్లిదండ్రులలాగా వారు నా స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ నిష్కామప్రేమకు ప్రతిఫలంగా వారికి నేనేం చేయగలను? పైన వ్రాసినదాన్ని చదివి ఎవరైనా, "బాబా తమకు లభించిన దక్షిణ నుంచే ఇవన్నీ చేస్తారా?" అనుకుంటే, వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి - నాకన్నా పదిరెట్లు ఎక్కువగా ఖర్చుపెట్టేవారు లేదా దక్షిణ ఇచ్చే భక్తులున్నారు ఆయనకు. వామనరావు నార్వేకర్ ఒకేసారి ఐదువందల రూపాయలు బాబాకి ఇచ్చినప్పుడు బాబా అతని రోగనివారణ చేశారు. అలాగే వారివద్ద శ్రీమంతులెంతోమంది ఉండేవారు. వారి ఎదుట నేనెంతటివాణ్ణి? అయినప్పటికీ నాపై అపరిమితమైన ప్రేమను చూపి దానికి ప్రత్యుపకారం చేయలేనటువంటి ఉపకారాన్ని ఆయన నాకు చేశారు. అలా లెక్కలేనన్నిసార్లు వారు ఉపకారం చేస్తూ వస్తున్నారు. దాన్ని లెక్కించటం మొదలుపెడితే అదెప్పటికీ పూర్తికాదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 454వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • ఊదీ నీళ్లతో కిడ్నీలో రాయిని తొలగించిన బాబా

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

బాబా కుమార్తెలు, కుమారులందరికీ నమస్తే. బాబా నాకు పునర్జన్మను ఎలా ప్రసాదించారో నేనిప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నాను. సచ్చరిత్రలో చెప్పబడినట్లు ఊదీ నీళ్లతో కిడ్నీలోని రాయిని తొలగించారు బాబా. 2014, జూన్ 1, ఆదివారంనాడు నేను పళ్ళుతోముకోవడానికని వాష్‌రూమ్‌కి వెళ్లాను. అకస్మాత్తుగా విచిత్రమైన నొప్పి మొదలైంది. ఏదోక విధంగా పళ్ళుతోముకుని కష్టపడుతూ బయటకు వచ్చాను. 5-10 నిమిషాల్లో తీవ్రమవుతున్న నొప్పిని తట్టుకోలేక ఏడవటం మొదలుపెట్టాను. నాకు బాగా చెమట పడుతోంది, చూపు అస్పష్టంగా మారుతోంది, క్షణాల్లో స్పృహ కోల్పోబోతున్నట్లుగా ఉంది నా పరిస్థితి. నోటమాట రావడం లేదు. అమ్మ నాపై రెయికీ(Reiki) ప్రయోగించింది. అయితే ఏదో దుష్పరిణామం జరుగుతోందని నాకు అర్థం అవుతోంది. అతి కష్టం మీద అమ్మతో పక్కింటి ఆంటీని పిలవమని చెప్పాను. ఆంటీ వచ్చేసరికి నేను దారుణమైన స్థితిలో ఉన్నాను. నా శరీరంలోని కుడివైపు భాగమంతా నొప్పి వ్యాపించింది. వెంటనే ఆంటీ తన ఫ్యామిలీ డాక్టరుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. డాక్టర్ వెంటనే నన్ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పారు. మా అమ్మ, ఆంటీల సహాయంతో చాలా కష్టంగా అడుగులు వేయగలిగాను. మేము వెళ్తున్న దారిలో బాబా మందిరం ఉంది. ఆ సమయంలో మధ్యాహ్న ఆరతి జరుగుతోంది.

ఆసుపత్రికి చేరుకున్న వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్ళారు. డాక్టరు బాబాకు గొప్ప భక్తురాలు. ఆసుపత్రిలో ప్రతి గదిలో బాబా ఫోటోలు ఉన్నాయి. ఆమె వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ నన్ను చూసి ఆగి, స్కానింగ్ చేసి, "కుడి మూత్రపిండంలో వాపు ఉంది, చిన్న రాయి క్రిందికి కదులుతోంది" అని చెప్పి నన్ను ఐసియులో చేర్చారు. నేను నీళ్లు కూడా త్రాగే స్థితిలో లేనందున నాకు డ్రిప్స్ ఇవ్వడం ప్రారంభించారు. నొప్పి భరించలేక, "నొప్పి లేకుండా నన్ను తీసుకెళ్లిపొండి బాబా" అని బాబాను అడుగుతున్నాను. నేను ఆయన సన్నిధికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సాయంత్రమంతా నాకు పెయిన్ కిల్లర్స్, డ్రిప్స్ ఇస్తూనే ఉన్నారు. కాసేపటికి నన్ను 7వ నెంబరు మంచం నుండి బాబా ఫోటో ముందున్న 9వ నెంబరు మంచం మీదకి మార్చారు. రాత్రి నొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉంటుందేమోనని నేను భయపడి, "బాబా! నేనింక ఈ బాధను భరించలేను. దయచేసి ఈ నొప్పిని మీరే భరించండి" అని బాబాను వేడుకున్నాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఆసుపత్రి సిబ్బందిలో ఒకరి వద్ద ఎప్పుడూ శిరిడీ నుండి తెచ్చిన బాబా ఊదీ ఉంటుంది. ఆసుపత్రిలో చేర్చిన వెంటనే తను నాకు బాబా ఊదీ కలిపిన నీళ్లు ఇచ్చారు. రాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా నొప్పి ఎక్కువైంది. దాంతో నాకు మరో పెయిన్ కిల్లర్ ఇచ్చారు. నర్సు రాయి బయటకు వెళ్ళడానికి అదనంగా 3 డ్రిప్స్ పెట్టింది. తర్వాత నొప్పి తగ్గడంతో నేను ఉదయం వరకు నిద్రపోయాను. ఉదయం డాక్టర్ వచ్చారు. అప్పటికి నా ఆరోగ్యం బాగానే ఉంది, నొప్పి లేదు, నా అంతట నేను లేవగలిగాను. నీరు త్రాగగలిగే స్థితిలో ఉన్నాను. డాక్టర్, "24 గంటల్లో నొప్పి తగ్గడం నీ అదృష్టం. మూమూలుగా అయితే రాయి బయటకు పోవడానికి 48 గంటలు పడుతుంది" అని అన్నారు. తరువాత ఆమె స్కాన్ చేసి, ఇంకా ఒక రాయి మిగిలివుందని చెప్పి, మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. ఆశ్చర్యమేమిటంటే, అమ్మ హాస్పిటల్ బిల్లు చెల్లించడానికి వెళ్లి, "అమౌంటులో ఏమైనా తగ్గించే అవకాశం ఉందా?" అని అడిగితే, వాళ్ళు సరిగ్గా 900 రూపాయలు తగ్గించారు.

ఆరోజు సాయంత్రం మేము పూర్తి స్కానింగ్ చేయించుకోవడం కోసం వెళ్ళాము. కానీ డాక్టర్ వెళ్లిపోవడంతో స్కానింగ్ చేయలేదు. నేను ఇంటికి తిరిగి వచ్చి ఊదీ నీళ్లు త్రాగుతూ, "నేను నొప్పిని తట్టుకోలేను బాబా. సచ్చరిత్రలో మూత్రంలోని రాయితో బాధపడుతున్న వృద్ధునికి నయం చేసినట్లు నాకు కూడా నయమయ్యేలా చేసి నా నొప్పిని తీసేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా అదే చేశారు. మేము మరుసటిరోజు స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళాము. డాక్టర్ మొత్తం పొత్తికడుపును పరిశీలించి, రాయి బయటకు పోయిందని ధృవీకరించారు. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆయన నాకు పునర్జన్మనిచ్చారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా! ఎంతటి భయంకరమైన విపత్తు అయినా బాబాపై విశ్వాసం ఉంచండి. ఆయన మనల్ని రక్షిస్తారు. మనం ఆయనలో ఐక్యమయ్యేంతవరకు ఆయనే మన ఏకైక రక్షకుడు.

source: http://www.shirdisaibabaexperiences.org/2014/11/a-couple-of-sai-baba-experiences-part-771.html


సాయిభక్తుల అనుభవమాలిక 453వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడిన అపార కరుణాజలధి శ్రీసాయి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

2020, జూన్ 9వ తేదీ తెల్లవారుఝామున నిద్రలేస్తూనే సుమారు పాతికేళ్లక్రితం బాబా నాపై చూపిన అపారమైన కరుణ గుర్తుకొచ్చింది. ఆనాడు బాబా చేసిన సహాయము, గొప్ప ఆశీర్వాదము తలచుకుంటుంటే కన్నీళ్ళు ఆగలేదు. అప్పుడు, "సాయిబాబా! నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడిన మీ అపారమైన కరుణను అందరికీ తెలుపవద్దా?" అని బాబాని అడిగాను. అందుకు బాబా, "నీకు ఆ లీల అంతగా నచ్చితే, చెప్పు" అని బదులిచ్చారు. అందుకే అమ్మకు, నాకు మాత్రమే తెలిసిన ఈ అనుభవాన్ని ఇన్నేళ్ల తరువాత మీ అందరితో పంచుకోబోతున్నాను.

ఈ సంఘటన సుమారు పాతికేళ్లక్రితం జరిగింది. అప్పుడు నాకు పదహారేళ్లు ఉంటాయి. నాకు చిన్నప్పటినుండి బాబా అంటే చాలా చాలా ఇష్టం. ప్రతిదానికీ ఆయననే తలచుకుంటూ ఉండేదాన్ని. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఉన్నంతలో అమ్మ నన్ను, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటుండేది. మా అమ్మ నా పెళ్లి త్వరగా చేసేద్దామని తలచింది. మాకు తెలిసిన ఒకాయన ఒక సంబంధం గురించి చెప్పారు. "అప్పుడే పెళ్లి వద్దు, నాకు చదువుకోవాలని ఉంద"ని అమ్మకి చెప్పాను. కానీ అమ్మ బలవంతపెట్టింది. దాంతో పెళ్లిచూపులకు ఒప్పుకున్నాను. పెళ్లికొడుకు తల్లిదండ్రులు, అక్క, బావ వచ్చి నన్ను చూసి, "అమ్మాయి మాకు నచ్చింది. ఒకసారి మా ఇంటికి వచ్చి చూసిపోండి" అని అన్నారు. దాంతో మా అమ్మ తనకు తోడుగా వేరేవాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ అబ్బాయి తండ్రి 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో పాపం అమ్మ ఇంటికి వచ్చి, "అంత డబ్బు నేనెక్కణ్ణించి తెచ్చేది?" అని బాధపడింది. దానికి నేను, "ఎందుకమ్మా బాధపడతావు? నేను చదువుకుంటాను. పెళ్లి సంగతి తర్వాత చూద్దాం. మనకి ఆర్థిక స్థోమత కూడా లేదు కదా" అని అన్నాను. కానీ అమ్మ, "మంచి సంబంధం వదులుకుంటే ఎలా? పిల్లవాడు బుద్ధిమంతుడు. ఈ సంబంధం కుదిరితే నువ్వు సంతోషంగా ఉంటావు" అంది. తర్వాత అమ్మ మా మావయ్యకి ఉత్తరం వ్రాసింది. అతను తనకి చేతనైన సహాయం చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్నాయి. పెళ్లికొడుకు బావ మా ఊరికి దగ్గరలోనే ఉండటం వలన దాదాపు ప్రతిరోజూ మా ఇంటికి వచ్చి, "మంచి సంబంధం ఎందుకు దూరం చేసుకుంటారు? ఏదో ఒక విధంగా తొందరగా సంబంధం ఖాయం చేసుకోమ"ని ఒత్తిడి చేస్తుండేవాడు. మంచే చెబుతున్నాడు కదా అని మేము అతనితో మర్యాదగా మాట్లాతుండేవాళ్ళం. ఈ విధంగా మూడు, నాలుగు నెలలు గడిచాయి. తరువాత ఒకరోజు అతను అమ్మతో, "మీకు ఆర్థిక ఇబ్బంది ఉంది కదా, మంత్రాలయంలోని బ్రాహ్మణ సంఘం వాళ్ళు బ్రాహ్మణ వధువులకు ఉచితంగా తాళిబొట్టు ఇస్తారు. అది వస్తే నీకు కొంత సహాయంగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిని నాతోపాటు పంపించండి. నేను వాళ్ళతో మాట్లాడి తాళిబొట్టు తీసుకొని వస్తాను" అని చెప్పాడు. అతని వెంట నన్ను పంపడం అమ్మకు ఇష్టం లేదు. కానీ అతను, "చూడమ్మా! నా బావమరిదికి సంబంధం అనుకున్న అమ్మాయి నాకు చెల్లెలవుతుంది. కాబట్టి నీ కూతురు విషయంలో నువ్వు భయపడాల్సిన పనిలేదు" అని నమ్మబలికాడు. దాంతో పాపం అమ్మ సరేనని చెప్పింది. అమ్మ అమాయకురాలు, నేను పదహారేళ్ళ చిన్నపిల్లని. ఇప్పట్లో ఉన్నన్ని తెలివితేటలు అప్పట్లో మాకు లేవు.

తరువాత ఒకరోజు మంత్రాలయం వెళ్ళడానికి నేను అతనితో బయలుదేరాను. మధ్యలో దిగి మరో బస్సు ఎక్కాము. మధ్యలో అతనికి తెలిసిన ఒకామె కూడా బస్సు ఎక్కింది. ఆమె చూడడానికి కూలిపని చేసుకునే మనిషిలా ఉంది. నేను ఏమీ పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని నా సీట్లో పడుకున్నాను. కొంతసేపటికి 'మంత్రాలయం వచ్చింది, దిగమ'ని చెప్తే వాళ్లతోపాటు దిగాను. వాళ్ళు నన్ను తీసుకొని నేరుగా ఒక లాడ్జికి వెళ్లి రూమ్ తీసుకున్నారు. రూములోకి వెళ్ళాక అతను, "రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్దాం. నువ్వు స్నానం చేసి చీర కట్టుకొని రెడీగా ఉండు" అని చెప్పి షాంపూ ప్యాకెట్లు ఇచ్చి బయటికి వెళ్లాడు. నేను స్నానం చేసి, చీర కట్టుకొని తయారయ్యాను. మధ్యలో ఒకామె ఎక్కిందని చెప్పాను కదా, ఆమె కూడా మాతో పాటు దర్శనానికి రావడానికి తయారయ్యింది. ముగ్గురం కలిసి వెళ్లి ముందుగా రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకున్నాము. తర్వాత అతను నన్ను, ఆమెను ఒక దగ్గర కూర్చోమని, తాను ఆఫీసర్లను కలిసి వస్తానని చెప్పి వెళ్ళాడు. పది నిమిషాల తర్వాత వచ్చి, "ఈరోజు పని కాలేదు. ఉదయాన్నే రమ్మని చెప్పారు. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండి, ఉదయం వాళ్ళని కలిసి ఊరు వెళ్లిపోదామ"ని చెప్పాడు. రాత్రి అక్కడే ఉండాలంటే నాకు చాలా భయమేసింది. మనసులో అనేక రకమైన ఆలోచనలతో లాడ్జికి వెళ్ళాను. నాకు చాలా ఆకలిగా వుంది. అతను, "మేమిద్దరం బయటకు వెళ్లి వస్తాము, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తామ"ని చెప్పాడు. నేను సరేనన్నాను. అప్పుడు సుమారు రాత్రి 7:00-7:30 గంటలైంది. వాళ్ళు వెళ్ళాక నేను గది తలుపులు వేసుకొని, బట్టలు మార్చుకొని కూర్చున్నాను. బయట మనుషులు తిరుగుతున్న శబ్దం వినిపిస్తోంది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని నాకు భయంభయంగా వుంది. ఒక్కసారి నా సినిమా పరిజ్ఞానమంతా గుర్తుతెచ్చుకున్నాను. నాకు అంతకన్నా తెలివితేటలు ఎక్కడివి మరి? ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో కళ్లనుండి నీళ్లు కారిపోతున్నాయి. ఏదో జరుగుతుందని భయంతో వణికిపోతున్నాను. బాబా ఉన్నారు, ఆయన రక్షణనిస్తారని తెలిసినా ఏదో తెలియని భయం. అయినా ఆయనకు మోకరిల్లడం తప్ప నేనేమి చేయగలను? అందుకే, "బాబా! గది బయట ఎవరో తిరుగుతున్న శబ్దం వస్తోంది. నాకు భయమేస్తుంది. వీళ్ళిద్దరూ బయటికి వెళ్లారు. వాళ్ళు వచ్చేవరకు గది బయట నిలబడి నాకు రక్షణనివ్వండి తండ్రీ. నాకు ఏమీ కాకుండా చూడు. నన్ను క్షేమంగా అమ్మ దగ్గరికి చేర్చు" అని బాబాను ప్రార్థించాను. ఇదివరకూ ఒక పెద్ద కష్టం నుండి బాబా కాపాడారు, అలాగే ఇప్పుడు కూడా అండగా ఉంటారని ధైర్యం కూడగట్టుకొని వాళ్ళ రాకకోసం ఎదురుచూస్తున్నాను.

కొంతసేపటికి తలుపు చప్పుడైంది. భయంభయంగా తలుపు తీశాను. వాళ్ళిద్దరినీ చూసి, 'హమ్మయ్య! ఇంకేం భయం లేదు, అన్న వచ్చాడు' అనుకున్నాను. అయితే ఆమె లోపలికి రాకుండా ద్వారం బయటే కూర్చుంది. నాకేమీ అర్థం కాలేదు కానీ, పని చేసుకొని బ్రతికే ఆమె కదా, వాళ్ళకది మామూలేమో అనుకున్నాను. అతను లోపలికి వచ్చి తలుపు వేశాడు. అతని దగ్గర ఏదో వాసన వస్తోంది. అతను వచ్చి మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. మనిషి మత్తులో ఉన్నట్లు కనిపించింది. బహుశా అతను తాగి వచ్చాడేమో అనుకున్నాను. కొద్దిసేపటికి అతను నాతో అసందర్భంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అది నాకు అర్థమవుతోంది, కానీ అతనికి అనుమానం రాకుండా ఏమీ అర్థం కానట్లు కూర్చున్నాను. అతడు నా మీద దురుద్దేశ్యంతో ఉన్నాడని మాత్రం నాకు అర్థమైంది. "ఇప్పుడు నా గతి ఏమిటి? నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నాను. సహాయం అర్థించడానికి ఎవరూ లేరు. నేనంత బలమైన మనిషిని కూడా కాదు. అసలు నా వయసు ఎంతని? ఇంకా పూర్తి బుద్ధి పరిపక్వత కూడా లేని తల్లిచాటు బిడ్డని. ఇప్పుడు ఎవరు వచ్చి నన్ను కాపాడుతారు? ఇంతకుముందంటే ఆరుబయట కాబట్టి బాబా కాపాడారు. ఇప్పుడు ఈ నాలుగు గోడల మధ్య ఆయన ఎలా కాపాడుతారు?" అని మనసులో పరిపరివిధాల ఆలోచనలు సాగుతున్నాయి. అతను ఏదేదో చెబుతున్నాడు కానీ, వాటిని జీర్ణించుకునే స్థితిలో నేను లేను. ఎందుకంటే, నా వయసుకు అవి నేను ఊహించలేని మాటలు. అతనింకా తన పూర్తి స్వభావాన్ని బయటపెట్టలేదు కానీ, నేను చాలా ప్రమాదంలో ఉన్నానని తెలుస్తోంది. నాకు జీవితంలో మొట్టమొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంది. 'బయట ఆమె కాపలా కాస్తోంది. ఇతను ఇలా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఉంటుందా ప్రపంచం? ఇంతటి భయంకరమైన మనుషులు కూడా ఉంటారా?' అని అనుకున్నాను. చిన్నప్పటినుంచి బాబా తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు. బాబా ప్రేమను చూసిన మనసుతో ప్రపంచమంతా ఇలానే ఉంటుంది అనుకున్నాను. అలాంటి నాకు సమాజంలో దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి ఇంత ప్రమాదం ఏర్పడుతుందని ఎలా ఊహించగలను? అమ్మ అమాయకురాలు, నాది చిన్న వయస్సు. 'ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని నిరాశ్రయులుగా ఉన్నందువల్లే కదా ఈ స్థితి ఏర్పడింది' అని మనసులో ఎన్నో ఆలోచనలు సాగుతున్నాయి. కానీ 'మా' అనేవాడు ఒకడున్నాడు, పిలిస్తే తప్పకుండా వస్తాడని ఏదో గట్టి నమ్మకం. 'వస్తాడు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. బిడ్డలు పిలిస్తే బాబా పలకకుండా ఉండడు. నా ఈ పరిస్థితి బాబాకు తెలియదా?' అనుకుంటూ నా బాధ బాబాతో చెప్పుకుందామని బాత్‌రూమ్ లోపలకి వెళ్లి తలుపు గడియపెట్టుకున్నాను.

అతను బయట ఏదేదో అంటున్నాడు. కానీ, నా మనసుకవేవీ అంటట్లేదు. బాబాను తలచుకుంటూ, "బాబా! నేను ఉన్నది పరమ పవిత్రమైన మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి సన్నిధిలో. 'గురువులంతా ఒక్కటే' అని చెప్తారు కదా! మరి ఆ రాఘవేంద్రస్వామి మీరే కదా! ఈ పరిస్థితిలో మీరు ఎలా వస్తారో నాకు తెలీదు. కానీ బాబా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు. చాలా అలసిపోయాను, ఒంట్లో శక్తి లేదు, మానసికంగా ఏడవడానికి కూడా బలం లేదు. నన్ను కాపాడాల్సింది మీరే బాబా" అంటూ నా బాధంతా చెప్పుకున్నాను. నా బాధకు ఆ తండ్రి ఎంతగా కదిలిపోయారో ఏమోగానీ, హఠాత్తుగా అతను బాధతో అరుస్తున్నట్టు వినిపించింది. ఇంతలోనే ఏం జరిగిందోనని మౌనంగా వినసాగాను. అతను బాధతో విలపిస్తున్నాడని అర్థమైంది. కానీ బయటకు రావాలంటే భయం. అయినా నెమ్మదిగా తలుపు కొద్దిగా తెరిచి బయటకు చూశాను. అతను మంచం మీద పడి కాళ్ళు పట్టుకొని మెలికలు తిరిగి పోతున్నాడు. ఏమి జరిగిందో అర్థం కాలేదు. ధైర్యం కూడగట్టుకొని నెమ్మదిగా అడుగులు వేశాను. అతనేమైనా నటిస్తున్నాడేమోనని లోపల భయంగా ఉంది. కానీ అతను లేవగలిగే స్థితిలో లేడని అర్థమైంది. నేను మెల్లగా వెళ్లి తలుపు తెరిచాను. గుమ్మం వద్దే కూర్చుని ఉన్న ఆమె లేచి లోపలికి చూసింది. వాళ్ళ మధ్య బంధమేమిటోగాని చూసిన వెంటనే ఆమె గబగబా లోపలికి వెళ్లి, "ఏమైంది, ఏమైంది" అని కంగారుగా అడగసాగింది. అతను బాధతో ఏమీ చెప్పలేకపోతున్నాడు. రాత్రంతా అతనలాగే బాధపడుతూ ఉన్నాడు. ఆమె అతని ప్రక్కనే ఉండి ఏవేవో మాటలు చెప్తోంది. నేను ఒక మూల ఒదిగి కూర్చుండిపోయాను. ఏ సమయానికో అతను కాస్త కుదుటపడినట్లున్నాడు. తెల్లవారుఝామున ముగ్గురమూ కిందికి వచ్చి, లాడ్జి వాళ్లకు డబ్బులిచ్చి, బస్సెక్కి ఊరికి బయలుదేరాము. బస్సులో ఎలా కూర్చున్నానో నాకే తెలియదు. జరిగింది జీర్ణించుకోలేక అవే ఆలోచనలతో ఉన్నాను. ఎప్పుడు ఊరు వచ్చిందో కూడా తెలియదు. అతను పిలిస్తే బస్సు దిగాను. అతను తన ఊరికి వెళ్లిపోయాడు. నేను ఇంటికి వెళ్ళాను.

గుమ్మం వద్ద కూర్చొని నాకోసం ఎదురుచూస్తున్న అమ్మ ముఖమంతా పీక్కుపోయి ఉంది. కానీ ఏదీ అడిగే స్థితిలో నేను లేను. అమ్మని చూస్తూనే బాధను తట్టుకోలేక, "ఎంత అమాయకంగా పంపించావమ్మా?" అన్నాను. అమ్మ ఏం జరిగిందో ఊహించలేక నా నోటినుంచి ఏం వినాల్సి వస్తుందోనని భయంగా చూస్తోంది. ఏడుస్తూ జరిగిందంతా చెప్పాను. అంతా విన్న అమ్మ, "బాబా! నువ్వు లేకుంటే నా బిడ్డ ఏమైపోయేది?" అని కన్నీళ్లు పెట్టుకుంటూ, "నిన్ను పంపించినప్పటినుంచి నా మనసు స్థిమితంగా లేదు. 'ఎంత పొరపాటు చేశాను' అని అనుకుంటూ రాత్రంతా, "బాబా! నువ్వే నా బిడ్డను కాపాడు. అది చాలా అమాయకురాలు. నువ్వు తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు" అని బాబాని వేడుకుంటూ ఉన్నాను" అని చెప్పింది.

మరుసటిరోజు ఆ దుర్మార్గుడు మళ్లీ వచ్చాడు. వాడిని చూస్తూనే ధైర్యంగా, "నువ్వూ వద్దు, నీ సంబంధమూ వద్దు. ఇంట్లో నుండి బయటకి పో" అంటూ అడగాల్సినవన్నీ అడిగేశాను. అంత ధైర్యం ఎక్కడినుండి వచ్చిందో ఏమో! అది బాబా చలవే. సొంత బావమరిది కోసం చూసిన అమ్మాయి విషయంలో అంత క్రూరంగా ఆలోచించినవాడికి ఏం జవాబు చెప్పాలో పాలుపోలేదు. ఇంక మాట్లాడే ధైర్యంలేక వెళ్ళిపోయాడు. తర్వాత ఆ సంబంధం తెచ్చిన అతనితో 'నాకు ఈ సంబంధం ఇష్టం లేద'ని చెప్పేశాను. కానీ జరిగిన విషయాలేమీ అతనికి చెప్పలేదు. అతను ఆ సంబంధం నిలిపిపెట్టమని వాళ్ళకి ఉత్తరం వ్రాశాడు. జరిగిన ఆ విషయం నాకు, అమ్మకి, వాడికి, వాడితో వచ్చిన ఆమెకి తప్ప ఇంతవరకు ఎవరికీ తెలియదు. తర్వాత ఎనిమిది నెలల్లో వాడు క్యాన్సర్‌తో ప్రతిక్షణం చిత్రహింసను అనుభవిస్తూ చనిపోయాడు. సాయిబాబా తన బిడ్డల మీద ఈగనైనా వాలనిస్తాడా! అలాంటిది తన బిడ్డ విషయంలో అంత అన్యాయానికి పూనుకుంటే ఊరుకుంటాడా?

అతను చనిపోయిన తర్వాత కొద్దిరోజులకి అతడి బావమరిది కుటుంబీకులు మళ్ళీ వచ్చి, అమ్మతో పెళ్లి గురించి మాట్లాడారు. వాడు అంత హీనుడైతే వీళ్లంతా ఎలాంటి వాళ్ళో అని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అమ్మ మాత్రం 'పిల్లవాడు మంచివాడు' అని చెప్తుండేది. నాకైతే నమ్మకం లేకపోయింది. అప్పుడు అమ్మ, "వాడు అలాంటివాడైతే అందరూ అలా ఉంటారా? నిజంగా అబ్బాయి మంచివాడు. దయచేసి పెళ్లికి ఒప్పుకో. నాకేమైనా అయితే నీకు దిక్కెవరు?" అని ఎంతగానో బ్రతిమాలింది. అంతలో ఇంకా మంచి సంబంధం వచ్చింది. కానీ అమ్మ ఇష్టపడలేదు. అప్పుడు నేను బాబాని అడిగి నిర్ణయం తీసుకుందామని చెప్పి బాబాను అడిగాను. బాబా, "లేమివాని ఇంట ఎద్దు మాంసం తినటం కంటే, ప్రేమగల చోట ఆకుకూర భోజనం మేలు" అని సమాధానమిచ్చారు. దాంతో నేను మొదటి సంబంధమే చేసుకోవడానికి ఒప్పుకున్నాను. బాబా దయవల్ల నిజంగా నా భర్త చాలా మంచివాడు. బావకు, బావమరిదికి పోలికే లేదు. నా భర్తది ఉన్నదాంట్లో సర్దుకుపోదామనే మనస్తత్వం. చెడు వ్యసనాలు, చెడు గుణాలు ఏవీ లేవు. నా భర్తతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.

ఆరోజు నేను, "నాలుగు గోడల మధ్య ఉన్న నన్ను సాయిబాబా ఎలా కాపాడతార"ని అనుకున్నాను. కానీ ఆయన లేని, రాలేని చోటంటూ ఉందా అసలు? నా సాయికి సాధ్యం కానిదంటూ ఉందా? ఎంత హీనమైన మనుషులు? అతనికీ ఒక కూతురు ఉంది. పరాయి ఆడపిల్ల అంటే అంత చిన్నచూపా? 'ప్రతి ఆడపిల్లా నా కూతురుతో సమానం' అనే ఆలోచన కూడా ఉండదా వాళ్ళకు? ఆడపిల్లలను వేధించే ఇటువంటి హీనులను బాబా శిక్షించాలి.

ఎవరన్నారు సాయి లేడని? సర్వకాల సర్వావస్థలందు ఆయన ఉన్నాడు. ఆయన లేని క్షణమంటూ లేదు. కన్నతల్లి కూడా బిడ్డలను కాపాడుకోలేని క్షణంలో సాయి మాత్రమే కాపాడగలడు. సాయి ముందు ఎంతటివారైనా సరే చేష్టలుడిగిపోవాల్సిందే. "సప్త సముద్రాల అవతల ఉన్నా నావారిని కాపాడుతాన"ని చెప్పిన బాబా నన్ను ఎంతలా కాపాడారో చూడండి. ఆపదసమయాలందు తన బిడ్డలకు రక్షణనివ్వడానికి ముందుంటాడు నా సాయి తండ్రి. ఆయన నాపట్ల చూపించిన కరుణను ఏమని చెప్పేది? ఆయన లేకపోతే నేనేమైపోయేదాన్నో! ఇంత చేసిన ఆయనకి ఎలా కృతజ్ఞతలు తెలిపేది? అసలు నాకు అది సాధ్యమేనా? అయినా ఆ తండ్రి అవన్నీ ఏమీ కోరడు. నా సాయికి సాటి ఎవ్వరూ రారు. నా జీవితంలో ఆయన లేకపోతే నేనంటూ లేను.


సాయి అనుగ్రహసుమాలు - 411వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైనాలుగవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఈ మధ్యలో నన్ను తీసుకెళ్ళటానికి మా పెద్దబావగారొచ్చారు. బాబా అనుమతి లభించింది. దాంతో నేను బావగారితో కలిసి బయలుదేరాను. దారిలో నది పొంగటాన్ని చూసి ఇద్దరం వెనక్కి తిరిగి వచ్చాం. నావ నుంచి దిగి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను కొట్టుకుపోతూ కూడా బాబా దయవల్ల రక్షించబడ్డాను. నేను తిరిగి రావటాన్ని చూసి కాకాసాహెబ్ దీక్షిత్ కొంచెం కూడా అప్రసన్నుడు కాలేదు. మునుపటిలాగానే నన్ను స్నేహపూర్వకంగా ఆదరించాడు. 1913వ సంవత్సరంలో రాధాకృష్ణమాయిని నేను మొదటిసారి కలిశాను. ఆమె మొదటినుంచీ కూడా నన్నెంతో ప్రేమగా చూసుకొనేది. ఆమె నన్నో చిన్నపిల్లవాడిలా చూసి గారాబం చేసేది. అలాగే నేను కూడా ఆమెను నా తల్లిలాగానే గౌరవించేవాడిని. మా పరిచయమై అప్పటికి కేవలం మూడు, నాలుగు రోజులే అయింది. అవి చాతుర్మాస్యం రోజులు. ఆమె నాకు వెచ్చని స్వెట్టర్ తొడిగి, అలాగే తలపాగా పెట్టి నావైపు చూస్తూ, “వామన్యా, ఇప్పుడు నువ్వు ‘వార్కరీ’ అయినట్లు కనిపిస్తున్నావు” అన్నారు. భగవద్గీత చదివినందువల్ల నా మనసు దృఢంగా ఉండేది. శ్రేయస్సుని పట్టుకుని ప్రియమైనదాన్ని త్యజించే శక్తి నాకు భగవద్గీత నుంచే ప్రాప్తించిందన్న అనుభవం నాకు కల్గింది.

ఒకసారి నేను చావడి నుంచి బయలుదేరి ద్వారకామాయి వైపు వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు బాబా, “నా వామన్‌కి తినటానికేమైనా దొరకుతోందా?” అన్నారు. ఒకసారి బాగా తెల్లవారుఝామున చీకట్లో శౌచవిధి కోసం బావి దగ్గరకు వెళుతున్న సమయంలో దారిలో ఉన్న పెద్ద గుంట నాకు కనిపించలేదు. అయితే ఆ సమయంలో సగుణమేరునాయక్ మేలుకునే ఉన్నాడు కాబోలు, నేను గుంట వైపు వెళ్ళటం చూసి వేగంగా నా వెనుక పరిగెత్తుకొచ్చాడు. నేను గుంటలో పడకుండా అతను నన్నలా రక్షించాడు. సగుణరావు నన్నక్కడనుంచి వాడాకి తీసుకొచ్చి వదిలాడు.

ఒకరోజు మధ్యాహ్నం, ఇప్పుడు మాధ్యమిక పాఠశాల ఉన్నచోటు, అంటే శ్యామసుందర్ అనే బాబా గుర్రం కట్టబడి ఉన్నచోట్లో ఆ ఇంటిగోడని ఆనుకొని భక్తులతో పాటు నేను నిలుచుని ఉన్నాను. ఇంతలో రాధాకృష్ణమాయి గదిలోంచి ఏదో శ్వాస వచ్చినట్లనిపించింది. ప్రాణవాయువును బాబా మీదకు వదిలినట్లూ, అలాగే ఆ ప్రాణవాయువు విస్తరించి బాబా నిత్యరూపం ఉన్న స్థానంలో రుద్రాక్షధారి రూపంలో దర్శనమైంది. ఇదిలా రాస్తున్నప్పుడు ఈ దృశ్యం ద్వారా బాబా బహుశా నాకు “నేను శుద్ధ బుద్ధ నిర్గుణ నిరంజన నిరాకారుడిన”ని చెప్పాలనుకుంటున్నారనిపిస్తోంది. అయితే మాయయొక్క శ్వాసతో (స్పందనతో) ఈ శివరూపం ప్రాప్తించింది. నాకు శివరూపంలో దర్శనమైన రూపమే తలకు బట్ట కట్టుకుని గడ్డం, మీసాలతో ఉన్న కఫ్నీధారి రూపమని తెలుసుకోండి! పూర్ణ బ్రహ్మత్వం మాయవల్లనే సాకారమవుతుంది.

ఒకరోజు నేను ద్వారకామాయికి వెళుతున్నాను. ఆ పరిసరాల్లో గోడను దాటి వాకిలికి ఒకటి రెండు అడుగుల దూరంలో ఉన్నాను. అక్కడ ఎవరో, “అక్కడే నిలబడు” అని నన్ను ఆజ్ఞాపించారు. నేనలాగే నిలబడిపోయాను. తరువాత, “ఇక్కడే నిలబడి బాబా నామాన్ని స్మరించు” అన్న ఆదేశం ఇవ్వబడింది. ఆ ఆదేశానుసారం ఆ స్థానంలో నిలబడే నేను బాగా తీవ్రంగా బాబా నామోచ్ఛారణ చేశాను. ఇది విని కొంచెంసేపయిన తరువాత బాబా తమ ఆసనంలోంచి లేచి తులసికోట దగ్గరున్న గట్టుమీద విరాజమానులైనారు. ఆయనే నన్ను పిలిచారో లేక నేనే అక్కడకు వెళ్ళానో కానీ నేను ప్రేమపూర్వకంగా ఆయన చరణాలకు నమస్కరించాను. మళ్ళీ ఆయన తిరిగి తమ ఆననం మీద కూర్చున్నారు. నేను నామోచ్ఛారణ చేసినందుకే బాబా ఆసనంపైనుంచి లేచి వచ్చారన్న మాటను చెప్పవలసిన అవసరంలేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 452వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా దయతో నొప్పి పోయింది
  2. బాబా తన భక్తుల వెన్నంటి వుంటారు

బాబా దయతో నొప్పి పోయింది

సాయిభక్తురాలు శ్రీమతి ఇందిర తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయిరాం! ముందుగా ఈ బ్లాగుకు, దీని రూపకర్తలకు నా అభినందనలు. ఈ బ్లాగులోని అనుభవాలను చదవకుండా నాకు రోజు పూర్తి కాదు. కొన్ని అనుభవాలు కంటతడి పెట్టిస్తే, కొన్ని నాకు ధైర్యాన్నిచ్చాయి.

నా అనుభవానికి వస్తే.. నా పేరు ఇందిర. నేను బాబాకు సామాన్య భక్తురాలిని. నా కష్టం, సుఖం రెండూ బాబా దయగా భావిస్తాను. ఈమధ్య మా అత్తగారి కుడికాలు బాగా వాచి నడవలేని పరిస్థితి వచ్చింది. మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఆమె బాధని చూసి నాకు భయమేసింది. అప్పుడు నేను, "బాబా! మా అత్తగారి కాలినొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయాన్నే చూస్తే వాపు కొంత తగ్గింది. మూడురోజులకి వాపు పూర్తిగా తగ్గి కాలు మామూలు స్థితికి వచ్చింది. నాకు చాలా సంతోషమేసింది. బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

బాబా తన భక్తుల వెన్నంటి వుంటారు

హైదరాబాదు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఒక సాయిభక్తురాలిగా బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

నాకు వివాహం కాకముందు సాయిబాబా అంటే పెద్దగా తెలియదు. బాబా నన్ను తమ భక్తురాలిగా ఎందుకు ఎంచుకున్నారో తెలియదుగానీ అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నాకు పెద్దగా చదువుకునే అవకాశంలేక పదవతరగతితోనే చదువు ఆపేశాను. మాకు పెద్దగా ఆస్తులు లేకపోయినా బాబా నా కొరకు తన భక్తుడిని నా భర్తగా ఎంపిక చేసి, అదృశ్యంగా తానుండి మా పెళ్లి ఘనంగా జరిగేలా చూశారు. నా భర్త మంచి బాబా భక్తుడు కావటం వల్ల నేనూ బాబా గురించి ఆలోచించేలా చేశారు. బాబా దయవల్ల నా చెల్లెలి వివాహం కూడా మావారి ద్వారానే వాళ్ళ బాబాయి కొడుక్కి ఇచ్చి చేశాము, వాళ్ళూ జీవితంలో బాగానే స్థిరపడ్డారు. నేను ఒక అడుగు వేస్తే బాబా నాకోసం వంద అడుగులు దిగివచ్చి నన్ను 100% బాబా భక్తురాలిగా మార్చేశారు

కానీ నా తమ్ముడి విషయంలో బాబా కొన్ని పరీక్షలు పెట్టారు. అయినా చివరకు బాబా చేసిన మేలుతో మేమంతా సంతోషంతో  బాబా లీలను ఇప్పటికీ తలచుకుంటున్నాము. అదేమిటంటే... నాకు ఒక తమ్ముడు, వాడు పెద్దగా చదువుకోలేదు, మా అమ్మావాళ్ళకి ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కాలం కలిసిరాక వ్యవసాయంలో అన్ని నష్టాలే. అప్పులు పెరిగిపోయాయి. దాంతో ఉన్న కొద్ది పొలాన్ని కూడా అమ్మి అప్పులు తీర్చేశారు. ఒక్కసారిగా వారి జీవితం అగమ్యగోచరంగా తయారైంది. మా అమ్మానాన్నలు నా తమ్ముడి గురించి బాగా దిగులుపడుతుండేవారు. నేను తరచూ వాళ్ళకి ఫోన్ చేసి, "బాబా వున్నారు, ఏమీ భయపడవద్దు" అని ధైర్యం చెప్పేదాన్ని. వాళ్ల మంచికోసం బాబాని ప్రతిరోజూ వేడుకునేదాన్ని. కానీ కొన్ని కర్మలు ప్రారబ్ధం ప్రకారం జరగాల్సి ఉంటుంది, జరిగిపోతాయి. కానీ బాబా ఎంతో దయతో మనపై వాటి తీవ్రతను తగ్గిస్తారు.

నా తమ్ముడు పెద్దగా చదువుకోకపోవటం వల్ల మరియు ఆస్తిపాస్తులు లేకపోవటం వల్ల తనకు పెళ్ళి కావటం ఆలస్యమైంది. ఇంతలో ఒక సంబంధం వచ్చింది. పూర్తిగా నచ్చకపోయినా, వాడు ఉన్న పరిస్థితిని ఆలోచించి ఏదో ఒకటిలే అని సరిపెట్టుకుని పెళ్లి చేశాము. కానీ వారి భావాలు కలవలేదు. దాంతో వారికి ఒక బాబు పుట్టాక వాళ్ళిద్దరూ విడిపోవలసి వచ్చింది. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మా అమ్మానాన్నలు ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురయ్యారు. మానసికంగా చాలా బాధపడేవారు. వారికి ఏదోలా దారిచూపమని నేను బాబాని రోజూ ప్రార్థించేదాన్ని. బాబా ఏదో ఒకరోజు మన మొర అలకిస్తారు, సహాయం చేస్తారు అని ఆశతో ఎదురుచూసేదాన్ని. ఇంతలో మావారు తను పనిచేసే కంపెనీలోనే మా తమ్ముడికి ఒక ఉద్యోగం ఇప్పించారు. దానితో మా తమ్ముడు మా ఊరు విడిచి వచ్చి సంతోషంగా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగానికి కావలసిన చదువులు కూడా దూరవిద్య ద్వారా పూర్తిచేసి జీవితంలో స్థిరపడ్డాడు. ఇంతలో తనకు మంచి సంబంధం వచ్చింది. ఆనందంగా తనకు పెళ్లి చేశాము. బాబా వారిని ఒక పాప, ఒక బాబుతో ఆశీర్వదించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో అన్నీ చకచకా జరిగిపోయాయి. మా అమ్మానాన్నలు గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు, బాధలు ఏవీ ఇప్పుడు మచ్చుకు కూడా గుర్తుకు రాకుండా ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. బాబా చేసిన సహాయం, చూపిన కృప ఎప్పటికీ మరువలేము. అందుకే ప్రతి ఒక్కరికీ నా విజ్ఞప్తి - బాబా ఒక కల్పవృక్షం, నమ్మినవారికి కొంగుబంగారం. చిన్న చిన్న బాధలకు, ఇబ్బందులకు కృంగిపోవద్దు. శ్రద్ధ సహనాలతో బాబా పాదాలు పట్టుకోండి, మీ భవిష్యత్తు అనే నావను బాబాకు వదిలేయండి, వారు దాన్ని సురక్షితంగా తీరానికి చేరుస్తారు. ఇది నిజం.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

మీ 
సాయిభక్తురాలు


సాయి అనుగ్రహసుమాలు - 410వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైనాలుగవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేనలాంటి అస్థిరమైన విచిత్ర మానసికస్థితిలో ఉండగా ఒకసారి బాబా స్నానానికి సిద్ధమౌతున్నప్పుడు రాధాకృష్ణమాయి నా రెండు భుజాలమీదా తువ్వాలు వేసి 'పద' అన్నది. నేనక్కడికి వెళ్ళినప్పుడు బాబా స్నానం చేసి నిలుచొని ఉన్నారు. భక్తులు ఆయన శరీరాన్ని తుడుస్తున్నారు. కానీ నేనో చెట్టులాగా శూన్యమనసుతో అలాగే నిలబడిపోయాను. ఎవరో ఒకతను నేను అన్యమనస్కంగా ఉండటాన్ని చూసి నా భుజం మీదున్న తువ్వాలును తీసుకుని బాబాను తుడవటం ప్రారంభించాడు. నా భుజాల మీద తువ్వాలు పెట్టిన రాధాకృష్ణమాయి ఉద్దేశ్యం అప్పుడర్థమైంది నాకు. నేను తువ్వాలు తీసుకొని కేవలం ద్వారకామాయికి వెళ్ళటం కాదు, అక్కడ బాబా శరీరాన్ని నా చేతులతో తుడిచి సేవచేసుకోవాలన్నదే ఆమె ఉద్దేశ్యం. కానీ అప్పుడు ఆ మానసికస్థితిలో సేవచేసే సాధనమూ, సేవచేసే సమయమూ వచ్చి కూడా బాబాకు సేవ చేసుకోలేకపోయాను.

అదేవిధంగా ఓసారి రాధాకృష్ణమాయి ఇచ్ఛానుసారం నేను చావడికి బయలుదేరి, 'ఇప్పుడు నేనెందుకు వెళ్ళాలి? ఇది రాధాకృష్ణమాయి ఇచ్ఛ, రాక్షసిమాయ' అనుకొని నేను చావడికి వెళ్ళలేదు. ఆ రోజుల్లో నాకు భోజనం మీద కూడా ధ్యాస ఉండేది కాదు. మధ్యాహ్నం పూట ఎన్నోసార్లు నేను భోజనం చేయటం మరచిపోయేవాడిని. ఒకసారి డా౹౹పిళ్ళే ఉదయమే నన్ను భోజనానికి ఆహ్వానించాడు, కానీ నేనా విషయం మరచిపోయాను. సాయంకాలం అతను 'ఎందుకు రాలేద'ని నన్ను అడిగినప్పుడుగానీ నాకా విషయం గుర్తురాలేదు. రాధాకృష్ణమాయి ఇంటిక్కూడా గుర్తుంటేనే వెళ్ళేవాడిని. ఈ రకమైన మానసికస్థితి వల్ల నా శరీరం చిక్కి శల్యమైంది. వాడాలో ఉండే ఒక భక్తుడు నాతో, "వామనరావ్! నీకేదైనా కష్టంగానీ లేదా విచారంగానీ ఉందా? నువ్విక్కడకు వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయావు” అన్నాడు. ఇదంతా చూసి బాపూసాహెబ్ బూటీ ఒకసారి నాతో, “నీవు ఇక్కడ ఉండాలనుకొంటే సంతోషంగా ఉండు. నీ ఖర్చుకోసం నేను ప్రతి నెలా యాభయ్యో అరవయ్యో ఇస్తాను. అంతేకానీ ఈ రకంగా దుఃఖించకు” అన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదని చెప్పనవసరం లేదనుకుంటా. బాపూసాహెబ్ బూటీ అన్న ఆ మంచిమాటలకు నేను సమాధానం కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు మరి కృతజ్ఞతలు మాత్రం ఎందుకు చెప్పాలి?

ఒకసారి అందరూ దీక్షిత్ వాడాలో భోజనం చేస్తున్నారు. కానీ శ్రీమతి దీక్షిత్ మాత్రం భోజనానికి కూర్చోలేదు. నేనక్కడ పచార్లు చేస్తున్నాను. ఆమె నన్ను చూసి, "వామనరావ్! భోజనానికి పద, మనిద్దరం కూర్చుందాం” అన్నది. నేను సరేనని భోజనం చేయటానికి కూర్చున్నాను. భోజన సమయంలో నా పళ్ళెం దగ్గర ఒక అణా పడివుండటం కనిపించింది. ఈ అణా ఎక్కడ్నించి వచ్చిందని నేను ఆలోచించసాగాను. శ్రీమతి దీక్షిత్ దాన్నక్కడ పెట్టలేదు. అలాగే ఇతరులెవరూ అక్కడకు రాలేదు. ఇంకా వేరెవరో పెట్టటమనేది అసంభవం. అప్పుడే, 'ఈ అణాకి అర్థం - గురుకృప' అని ఆకాశవాణి వినిపించింది.

పదకొండు నెలలు నేను శిరిడీలో ఉన్న సమయంలో ఒకరోజు మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటలై ఉంటుంది. రాధాకృష్ణమాయి నేనొక అణాని దొంగిలించానని నాపై ఆరోపణ చేసింది. “శ్రమచేసి తాను ప్రాప్తింపచేసుకున్న జ్ఞానాన్ని నేను దొంగిలించాను” అని రాధాకృష్ణమాయి నాకు చెప్పాలనుకున్నదని నేను అర్థం చేసుకున్నాను. ఆమె ద్వారా బాబా నాకెన్నో నేర్పించారు. ఆ మాట నిస్సందేహం. అలా చూస్తే ఆ ఆరోపణ ఒకరకంగా నిజం కూడా. ఒక సాయంకాలం బాబా మాధవరావుతో, “ఇతను నా కాలిని ఖండించి తీసుకెళ్ళాడు” అన్నారు. ఈ ప్రకారంగానే రాధాకృష్ణమాయి కూడా ఆరోపించారు. నేను రాధాకృష్ణమాయి ఆరోపణను అంగీకరించాను. అలాంటప్పుడు బాబా చెప్పిన మాట అసత్యమెలా అవుతుంది? వీరిద్దరి మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 451వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కోరుకున్న కుంకుమను కరుణతో ప్రసాదించిన సాయి
  2. బాబా అనుగ్రహంతో వీసా పొడిగింపు

కోరుకున్న కుంకుమను కరుణతో ప్రసాదించిన సాయి

ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ సాయిరాం! నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని చిన్న చిన్న అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇది కూడా అలాంటి ఒక బుల్లి అనుభవమే. వినటానికి, చదవటానికి చిన్న అనుభవమే, కానీ నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చిన అనుభవం. ఎందుకంటే, ఈ అనుభవం సాయి సచ్చరిత్ర 41వ అధ్యాయంలో బాబా చెప్పిన "నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను. ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల?" అన్న వాక్యానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఈ అనుభవం ద్వారా సచ్చరిత్రలో బాబా పలికిన మాటలు ఎంత సత్యవాక్కులో మీకు అర్థమవుతుంది. 

చాలామందికి అలవాటు ఉన్నట్టే ప్రతిరోజూ కుంకుమ పెట్టుకోవటం నాకు చిన్నప్పటినుంచీ అలవాటు. ఒకసారి మా నానమ్మ మాకు తెలిసిన ఒక గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడనుండి ప్రసాదంగా కొంచెం కుంకుమ తీసుకొచ్చింది. అది నాకు చాలా నచ్చింది. మేముండే ప్రాంతంలో ఆ కుంకుమ దొరకటం చాలా కష్టం. అలాంటి కుంకుమని ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని ప్రజలు వాడుతారు. కొద్దిరోజులకే ఆ కుంకుమ అయిపోయింది. మళ్లీ ఆ ఆశ్రమం నుంచి కుంకుమ తెప్పించాను, కానీ అది మామూలు కుంకుమ. ఆ తర్వాత నాకు కావలసిన కుంకుమ కోసం ఎంతో ప్రయత్నించాను. గుళ్ళో పూజారిగారితో సహా ఎంతోమందిని అడిగాను, కానీ దొరకలేదు. మావాళ్ళు ఎవరు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా అలాంటి కుంకుమ తీసుకురమ్మని అడిగేదాన్ని. కానీ అందరినించీ ఒకటే సమాధానం - ఆ కుంకుమ ఇక్కడ దొరకదు అని.

ఒకరోజు పెద్ద పెద్ద బాబా ఫోటోలతో, మైకులో ఏదో చెప్తూ మా ఇంటి ముందు నుంచి ఒక వాహనం వెళ్ళింది. ప్రక్క ఊళ్ళో బాబా గుళ్ళో ఏదో పెద్ద పూజ చేస్తున్నారట, దానికి చందాల కోసం తిరుగుతున్నారు. డబ్బులు, బియ్యం ఏవైనా తీసుకుంటున్నారు. మా అమ్మ కూడా కొంత డబ్బు, బియ్యం ఇచ్చింది. వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. మీరు ఊహించగలరా ఆ ప్రసాదం ఏమిటో? నేను చాలా రోజుల నుంచి కోరుకుంటున్న కుంకుమ! ఎక్కడైనా బాబా ప్రసాదంగా ఊదీ ఇస్తారు. కానీ నా సాయితండ్రి తన బిడ్డ ఎంతగానో కోరుకుంటున్న కుంకుమను తన గుమ్మం ముందుకే వచ్చి ఇచ్చారు. అప్పుడు నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. బాబా అనుగ్రహం అంతటితో అయిపోలేదు. అలా బాబా ప్రసాదించిన కుంకుమ కొద్దిరోజులకు అయిపోయింది. అయితే ఈసారి కుంకుమ కోసం నేను ఎవరినీ అడగలేదు. ఎందుకంటే అన్నీ ఇవ్వటానికి నా సాయితల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉండగా వేరేవాళ్ళని నేనెందుకు అడగాలి? అవును, నా నమ్మకమే నిజమైంది. కొన్ని సంవత్సరాలు వాడినా తరిగిపోనంత కుంకుమను బాబా నాకు పంపారు. ఎక్కడినుంచి పంపారో తెలుసా? - శిరిడీ నుంచి! ఎప్పుడు పంపారో తెలుసా? - బాబా శతాబ్ది సంవత్సరంలో! ఇప్పటికీ నిత్యం ఆ కుంకుమే పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని సంవత్సరాలు అయినా ఆ కుంకుమ అయిపోదు. ఒకవేళ అయిపోయినా మళ్లీ నా సాయి ఇస్తారు కదా!

ఇపుడు చెప్పండి, నేను అన్నది నిజమే కదా? సచ్చరిత్ర అంటే సత్య చరిత్ర. అందులోని బాబా మాటలు సత్యవాక్కులు. మనకి అన్నీ ఇవ్వటానికి మన సాయిమహారాజు మన హృదయంలో కొలువై ఉండగా మనం అనవసరంగా వాళ్ళని, వీళ్ళని అడుగుతుంటాం, కదా? బుల్లి అనుభవం అని చాలా పెద్దగా రాశాను, మన్నించాలి.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా అనుగ్రహంతో వీసా పొడిగింపు

యు.ఎస్‌.ఏ నుండి శ్రీమతి అనుపమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు అనుపమ. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.  మేము USA లో ఉంటున్నాము. గత నెల మావారి వీసా గడువు పూర్తయిపోయింది. 4 నెలల క్రితమే మేము వీసా గడువు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వీసా ఆమోదింపబడలేదు. వీసా గురించి మావారు బాగా ఆందోళనపడుతుంటే చూడలేక, "బాబా! కొరోనా కారణంగా నెలకొన్న ఈ పరిస్థితుల్లో మేము ఇండియాకు వెళ్లలేము. అందువల్ల మా వీసా గడువు పెరిగేలా చూడండి బాబా. మీ అనుగ్రహంతో వీసా వస్తే నేను 108 ప్రదక్షిణలు చేస్తాను, అలాగే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో వీసా గడువు పొడిగించబడింది. మా ఆనందం ఏమని చెప్పను. "థాంక్యూ సో మచ్ బాబా! ఇలాగే ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి. అందరినీ చల్లగా చూడండి".


సాయి అనుగ్రహసుమాలు - 409వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైమూడవ భాగం

నిన్నటి తరువాయిభాగం.....

ఒకరాత్రి సరిహద్దు రాయి మీద ధ్యానస్థుడినై కూర్చున్నాను. అక్కడ ఒక గుడిసె ఉంది. ఆ గుడిసెలో రాత్రంతా భజన జరుగుతోంది. దాన్ని నేను విన్నాను కానీ అక్కడ నాకెవరూ కనపడలేదు. ధ్యానావస్థలో నేనక్కడొక ఎడ్లబండిని చూశాను. అందులో బాబా రుద్రవేషధారణలో నిలబడి ఉన్నారు. వారి మీసాలు విశేషించి చాలా పొడవుగా ఉన్నాయి. బండిలో నుంచి వారొక పెద్దరాయినీ, బోలెడన్ని కంకరరాళ్ళనూ నా మీదకు విసిరారు. అవి నా వద్దకు వచ్చి పడ్డాయి కానీ, నాకు దెబ్బ తగల్లేదు. తిరిగి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి నా నివాసస్థలానికి చేరుకున్నాను.

ఈ మధ్యకాలంలో ఒకరాత్రి అందరూ నిద్రిస్తున్నప్పుడు నేను నా చెంబు తీసుకొని బయటకు వచ్చాను. బయటకొస్తూనే సన్యసించాలని నిశ్చయించుకున్నాను. శిరిడీ గ్రామం నుండి బయటకొచ్చి రహతా గ్రామం వైపు నడిచాను. రాత్రి పన్నెండున్నర గంటలైంది. ఆశ్వయజ మాస బహుళపక్షం అవటం వల్ల అంతటా చీకటిగా ఉంది. కొద్దిదూరం వెళ్ళాక, సూర్యోదయ సమయంలోనూ, సూర్యాస్తమయ సమయంలోనూ ఉండే రక్తవర్ణ సూర్యుడి లాంటి ఎర్రని గోళం ఆకాశంలో కనిపించింది. నేను సర్వాన్నీ త్యజించాలని నిశ్చయించుకున్నాను కాబట్టి సూర్యనారాయణుడు నాకు దర్శనమిచ్చారని నాకనిపించింది. “నిజమైన సన్యాసి త్యాగాన్ని చూసి ‘ఈ వైరాగ్య పురుషుడు నాకన్నా ముందు వెళతాడేమో’ననుకొని సూర్యుడు కూడా భయకంపితుడౌతాడు. అర్థరాత్రి సూర్యదర్శనం అవుతుంది” అన్న శాస్త్రవచనాలు నా స్మృతిపథంలోకి వచ్చాయి. ఈ విధంగా - ప్రతిపాదించబడిన శాస్త్రం యొక్క సత్యానికి బలం చేకూరింది. ఈ ఆలోచన నా మనసులోకి రావటంతోనే ఆ సూర్య ప్రకాశంవల్ల వీధి చివర ఎత్తైన భాగంలో ఉన్న నీళ్ళు కనిపించాయి. అప్పుడు నేను సావధానుడినైనాను. లేకపోతే ఆ అంధకారంలో కాలికి దెబ్బ తగిలి ఉండేదే. ఇదంతా చూసి - సాయిబాబా నన్ను రక్షించినట్లనిపించింది.

వెళుతూ వెళుతూ కాసేపటి తరువాత ముగ్గురు నలుగురు మనుషులు చెత్తను కాలుస్తూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కూర్చున్న చోటికొచ్చాను. వారు నన్ను పిలిచారు. నేను ఆగి అక్కడ కాసేపు కూర్చున్నాను. అయితే వారికీ, నాకూ మధ్య ఎలాంటి సంభాషణా జరగలేదు. తరువాత నేను నా చెంబుని అక్కడే వదిలేసి ముందుకెళ్ళి రహతా నదిని దాటి ఆ ఇసుకలో ఒక విరిగిన చెట్టుకొమ్మ మీద కూర్చున్నాను. ఒక గంట తరువాత నదిలో ఉన్న చెట్ల పైనుంచి పిశాచాలు వచ్చే చప్పుడైంది. మళ్ళీ నాకు లఘుశంక అనిపించి అందుకోసం కూర్చున్నప్పుడు ఎవరో ఒక దీపం పట్టుకుని నా గుహ్యభాగం మీద వెలుతురును ప్రసరింపచేయటం నాకు తెలిసింది. ధ్యానం పెట్టి చూస్తే అదో పిశాచమని తెలిసింది. దాని తలమీద ఒక దీపమో లేక దీపంలాంటి ప్రకాశమో ఉంది. అది తల క్రిందకీ, కాళ్ళు పైకీ పెట్టి నడుస్తోంది. లఘుశంక అయిన తరువాత మళ్ళీ చెట్టుకొమ్మ మీద కూర్చున్నాను. చూస్తూండగానే ఆ పిశాచం తల క్రిందకీ, కాళ్ళు పైకీ పెట్టి నదిలో దిగి నీళ్ళల్లో రెండు మునకలు వేసి కొంచెంసేపైన తరువాత అదృశ్యమైపోయింది. ఆ పిశాచాన్ని చూస్తే అది బ్రహ్మరాక్షసేమో అనిపించింది. తలమీద ప్రకాశాన్ని చూసి బహుశా అది ఒక పండితుడేమో అనిపించింది. అతడే బ్రహ్మరాక్షసుడి రూపంలో తిరుగుతున్నాడేమో! పండితుడు భక్తిహీనుడై తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోకపోతే వాడి అవస్థ ఇలాగే ఉంటుందన్న విషయం అప్పుడు నాకు గుర్తొచ్చింది. తెల్లవారుతూనే నేను శిరిడీ చేరుకున్నాను. అక్కడే ఖాన్‌గీవాలేతో పరిచయమైంది. ఆయన, “రాత్రి మీరెక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని వెతకటానికి బాబా ఒక మనిషిని పంపించారు. నేను కూడా గుర్రం మీద మిమ్మల్ని వెతకటానికి బయలుదేరాను, కానీ మీ జాడ తెలియలేదు. బాబా మమ్మల్ని ఈ రకంగా కష్టపెట్టకుండా ఉండాలంటే ఇకముందు మీరు కాకాసాహెబ్ వాడాలో నిద్రిస్తానని మాటివ్వాలి” అన్నారు. కాకాసాహెబ్, "ఇక్కడే పడుకో. నీవద్ద మా బాబు పడుకొంటాడు. నీవు కూడా బాబుని ఇష్టపడతావు కదా” అన్నారు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 450వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ప్రార్థించినంతనే పదిలంగా ఇంటికి చేర్చిన బాబా
  2. నమ్మకంతో ఉంటే బాబా అనుగ్రహం లభిస్తుంది

ప్రార్థించినంతనే పదిలంగా ఇంటికి చేర్చిన బాబా

సాయిభక్తురాలు శాంతి తన తల్లికి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువుకి నా ధన్యవాదాలు. నా పేరు శాంతి. బాబా ఆశీస్సులతో మా కుటుంబానికి కలిగిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 

నాకు సుమారు 13 సంవత్సరాల వయసప్పుడు మా అమ్మ మా బంధువుల గృహప్రవేశానికి 90 కి.మీ దూరంలో ఉన్న ఊరికి ఒంటరిగా వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లాక నెలసరి రావటంతో అమ్మ అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. వారు అమ్మని వేరే చోట ఉండవచ్చని ఎంత నచ్చజెప్పినా అమ్మకు అక్కడ ఉండటానికి మనస్కరించలేదు. తన వల్ల ఎవరూ ఇబ్బందులు పడకూడదన్నది అమ్మ ఆలోచన. అందువల్ల రాత్రి 9 గంటల సమయంలో అక్కడనుండి బస్సులో బయలుదేరింది. అమ్మ బస్సు ఎక్కినప్పటినుండి బాబాని స్మరిస్తూ ఉంది. "బాబా! నేను మా ఊరు దగ్గరున్న టౌనుకి వెళ్ళేసరికి అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. అక్కడనుండి నీవే నన్ను ఇంటికి   చేర్చాలి" అంటూ బాబాను ప్రార్థించింది. సరిగ్గా మా ఊరు దగ్గరున్న టౌనుకి వచ్చేసరికి అర్థరాత్రి 12 గంటలైంది. ఫోన్ చేస్తే టౌనుకి వెళ్లి అమ్మను తీసుకురావడానికి అప్పటికి ఇంత ఫోన్ టెక్నాలజీ కూడా లేదు. బస్సు దిగగానే అంతా నిర్మానుష్యంగా ఉంది. అమ్మకు కాస్త భయమేసింది. ఇంటికి వెళ్ళడానికి ఆటోలు కూడా లేవు. ఉన్నట్టుండి ఎక్కడినుండి వచ్చాడో తెలియదు, ఒక వృద్ధుడు కారులో వచ్చి, "ఒక్కదానివే ఉన్నట్టున్నావు, ఎక్కడికి వెళ్లాలమ్మా? నేను నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను" అని చెప్పి అడ్రస్ అడిగారు. 'ఆయనని బాబానే పంపాడు' అని మనసుకి అనిపించి అమ్మ ఇంటి అడ్రస్ చెప్పింది. ఆయన అమ్మని కారు ఎక్కించుకుని జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలిపెట్టారు. మేము ఆ సమయంలో అమ్మని చూసి ఆశ్చర్యపోయాం. అమ్మ జరిగిందంతా చెప్పింది. అమ్మని తీసుకువచ్చింది బాబా పంపిన వ్యక్తి కాదు, బాబానే! అందరం ఎంతో ఆనందంగా బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. "బాబా! వృద్ధాప్యంలో ఉన్న అమ్మానాన్నలపై ఎల్లప్పుడూ మీ ప్రేమ చూపండి బాబా!"

నమ్మకంతో ఉంటే బాబా అనుగ్రహం లభిస్తుంది

హైదరాబాద్ నుండి సాయి భక్తురాలు శ్రీమతి ఉష బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఓం శ్రీసాయినాథాయ నమః.

సాయికుటుంబసభ్యులందరికీ నా నమస్కారములు. 'నేను సాయిభక్తులలో ఒకరిని' అని చెప్పుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రూపులోని సాయిభక్తుల అనుభవాలు, సాయినాథునితో వారికి గల జీవిత విశేషాలను చదువుతుంటే నాకు కూడా నా జీవితంలో జరిగిన ఒక మరపురాని సంఘటనను పంచుకోవాలనిపించింది. ఆ సాయి దివ్యలీలను మీ అందరితో పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది జరిగి ఇప్పటికి సుమారు 17 సంవత్సరాలు అవుతోంది.

ఇది 2003 జులై నెలలో నా డెలివరీ సమయంలో జరిగింది. మొదటినించీ నాకు నార్మల్ డెలివరీ జరగాలని కోరిక. నేను గర్భం దాల్చిన తరువాత 9 నెలల పాటు అంతా సజావుగానే సాగింది. డెలివరీకి ఇంకా కొద్ది రోజులు వున్నప్పటికీ మానవసహజ తప్పిదం వల్ల నేను ముందుగానే హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. రెండు రోజులు వేచి చూసి ఎంతకీ నొప్పులు రాకపోయేసరికి నొప్పులు రావటానికి మందు ఇచ్చారు. 5, 6 గంటల నొప్పుల తరువాత కూడా బిడ్డ తల కనిపించలేదని సిజేరియన్ చేయటానికి అన్నీ సిద్ధం చేసేస్తున్నారు. అంతవరకూ నొప్పులకు తట్టుకోలేక విలవిలలాడిన నాకు ఈ సిజేరియన్ వార్త వినగానే విపరీతమైన ఏడుపు తన్నుకువచ్చింది. ఇంక అప్పుడు నా మదిలో మెదిలిన దైవం - శ్రీసాయి. ఆ భగవంతునితో నా మొర చెప్పుకుని, "నాకు ఈ సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ జరిగేలా చెయ్యి సాయీ! నా బిడ్డతో శిరిడీకి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను" అని కన్నీళ్ళతో ప్రార్థిస్తూ వున్నాను. తరువాత ఒక 10, 15 నిమిషాలలో డాక్టర్ వచ్చి చూసి, "బిడ్డ తల కనిపిస్తోంది కనుక సక్షన్ (నార్మల్ డెలివరీ సమయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు, సిజేరియన్ చేయాల్సిన అవసరం లేకుండా, వాక్యూమ్ పరికరాన్ని ఉపయోగించి బిడ్డను బయటికి తీసే ప్రక్రియ) చేద్దాం, సిజేరియన్ అవసరం లేదు" అని చెప్పారు. ఆ తరువాత అంతా సజావుగా సాగి నాకు నార్మల్ డెలివరీ జరిగింది. నా మొర ఆలకించి నా కోరిక తీర్చిన శ్రీసాయికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కొంతకాలం తరువాత శ్రీసాయికి మాట ఇచ్చినట్లుగా నా బిడ్డతో శిరిడీ వెళ్లి ఆ భగవంతుని కనులారా దర్శించుకున్నాను. 'బాబా మీద నమ్మకంతో ఉంటే ఆయన మనలను కంటికి రెప్పలా కాపాడుతారు' అనటంలో ఎటువంటి సందేహం లేదు. 

ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయి అనుగ్రహసుమాలు - 408వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభై రెండవ  భాగం 

నిన్నటి తరువాయిభాగం..... 

ఆ మరుసటి సంవత్సరం 1917లో నేను చాతుర్మాస్యం పాటించాను. అప్పుడు బ్రహ్మసూత్రం మూడవ అధ్యాయంలో 16వ అధికరణంలో ఉత్పన్నమైన ప్రశ్నలకు సమాధానాలు సిద్ధాంతానుసారం అనుభవాన్నిచ్చాయి. ఆ రాత్రి విరజానది స్మృతి జాగృతమై, “మృత్యువుకి పూర్వం ఉపాసకుడికి ఉపాస్య వస్తువు సాక్షాత్కరిస్తే పుణ్యపాపాలు పరిత్యజించబడతాయి. వ్రతాదులు, జపము, పునశ్చరణ, ప్రాయశ్చిత్తము ఇత్యాదులు వేర్వేరు పాపాలను క్షయం చేస్తాయి కానీ పుణ్యాన్ని క్షయం చేయవన్న జ్ఞానం కలిగింది.

భగవద్గీతలో 2వ అధ్యాయంలో 50వ శ్లోకం ఇలా ఉంది:

బుద్ధి యుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతౌ ౹
తస్మాద్యోగయా యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ౹౹

(అర్థం - సమత్వ బుద్ధిని కలిగి ఉన్న పురుషులు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే త్యాగం చేస్తారు. అంటే, అవి వారిని అంటవు. ఈ సమత్వ బుద్ధి యోగం కోసమే పనులు చేస్తారు. ఈ సమత్వ బుద్ధి యోగం కూడా కర్మలో చతురతయే. అంటే కర్మ బంధాల నుంచి విముక్తి పొందే ఉపాయమే.)

మోరోపంత్ గారి -

పాపాతే ఘుణ్యాతేజితాచీ బుద్ధి యుక్త్ తో నాశీ౹
హాణ ఉని యోగీ యోజీ కర్మీ కౌశల్య తోచీ యోగ్ ఖరా౹౹

(అర్థం -  పుణ్యక్షయం జ్ఞానంతోనూ, జ్ఞానయోగం వల్లనే అవుతుంది. ఏమేం చేస్తావో, ఏమేం తింటావో, ఏయే హోమాలు చేస్తావో, ఏయే దానాలు చేస్తావో, ఏయే తపస్సులు చేస్తావో అవన్నీ నాకు అర్పణ చేయటంతో సమస్త కర్మబంధనాల నుండీ, శుభాశుభ ఫలముల నుండీ నీకు ముక్తి లభిస్తుంది. ఈ రకమైన యోగయుక్త సన్యాసంతో నీ ఆత్మకు ముక్తి కలిగి నేను ప్రాప్తించి నాలో లీనమౌతావు.) నా శుభాశుభ కర్మలనే ముళ్ళతో కూడిన మార్గంలోని కష్టాలనుండి బయటపడేసి బాబా నన్ను ముక్తుడ్ని చేశారు.

ఒకరోజు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల సమయంలో రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళాను. అప్పుడామె తన ముఖం ముందర ఒక పచ్చిమిరపకాయ పట్టుకుని కూర్చున్నది. నేను కూర్చోవటంతోనే ఆమె, “ఇది తీసుకో'' అన్నది. ఆ మిరపకాయను తీసుకొని నేను నోట్లో పెట్టుకుని నమిలి తినేశాను. అయినా అది నాకసలు కారమనిపించలేదు. ఆ తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచిన తరువాత ఒక యోగసిద్ధుడైన గురువుగారు తన శిష్యునికిచ్చిన మంత్రం గురించిన వ్యాఖ్య నా దృష్టిలో పడింది. అందులో ఆభిమంత్రించిన మిరపకాయను తినటానికిచ్చే ప్రయోగం ఉంది. మాయి ఆ మిరపకాయ ద్వారా నాపై ఏదో ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం యొక్క పరిణామమేమిటో నేను ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయాను. కానీ అనేకమైన అగోచర వస్తువులు చూడగలిగేవాణ్ణి. అలాగే, ఎన్నోసార్లు ఎదురుగా ఉన్న వస్తువు కూడా నాకు కనపడేది కాదు. ఒకసారి దండెం మీదున్న రుమాలును తీసుకురమ్మని మాయి ఆజ్ఞాపించింది. దండెం దగ్గరకు వెళ్ళాక ఆ రుమాలు నాకు కనిపించలేదు. అప్పుడు రాధాకృష్ణమాయి వచ్చి, “ఇదుగో చూడు రుమాలు” అని నాకు చూపించింది. గురుసేవ కూడా గురువు అనుజ్ఞ లేకుండా అసంభవమన్న దానికి ఇది ప్రత్యక్ష అనుభవం.

రాధాకృష్ణమాయి పైకి ఏమీ చెప్పేది కాదు, కానీ నేను అన్నింటినీ త్యజించి శిరిడీలో ఉండాలన్నది ఆమె మనసులోని కోరిక. పదకొండు నెలలు శిరిడీలో ఉండి (1913లో) ముంబాయి తిరిగి వచ్చాను. ఈ విషయంలో ఆమె నాతో, “నీవు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఏడుపొచ్చేది” అన్నది. నా శిరిడీ నివాసం సమాప్తమై నేను తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి ఆమె, "నేను నీకోసం కార్చిన కన్నీళ్ళన్నీ వ్యర్థం” అన్నది. ఇలా ఆమె ఖచ్చితంగా అంటున్నప్పటికీ నా నివాసానికి మాత్రం ఎటువంటి ఏర్పాట్లు చేయటం గానీ లేదా చేయించటం గానీ చేసేది కాదు. అందువల్ల నాకు చాలా ఆశ్చర్యం కలిగేది..

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 449వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మనసుకు సాంత్వన చేకూరుస్తున్న బాబా
  2. బాబా కృప

మనసుకు సాంత్వన చేకూరుస్తున్న బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నమస్తే! సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! గతంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అన్నయ్య క్షేమసమాచారాన్ని బాబా తెలియజేసిన అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పులు లేవు. అతనింకా కష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ జన్మలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉండదేమోనని ప్రస్తుతానికి నాకనిపిస్తోంది. ఏ బంధమైనా ఈ జన్మ వరకే, బాబా ఒక్కరే చివరివరకూ ఉండే తోడు అని తెలియజేయడానికి బాబా నాకీ పరిస్థితి కల్పించారేమో! అనిపిస్తోంది. ఏదేమైనా అన్నయ్య క్షేమసమాచారాన్ని తెలిపినందుకు, ఈ కొరోనా సంకట పరిస్థితుల్లో కూడా మా కుటుంబాన్ని, ఆత్మీయుల క్షేమాన్ని చూస్తున్నందుకు బాబాకు అనంతకోటి ప్రణామాలు.

ఆర్థిక బాధలు, ఆత్మీయులతో విభేదాలు తట్టుకోలేక ఏడ్చిన ప్రతిసారీ బాబా నాకు సాంత్వన చేకూరుస్తున్నారు. కుటుంబ పరిస్థితులు చక్కబడాలి, ఆత్మీయుల మధ్య పట్టింపులు తొలగి మామూలు స్థితికి రావాలని నేను సాయి దివ్యపూజ, నవగురువార వ్రతం, సచ్చరిత్ర, గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను. బాబా కృపవల్ల సాంత్వన కలిగే అనుభవాలు ఈ రెండు నెలల్లో లెక్కలేనన్నిసార్లు కలిగాయి. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

మా అన్నయ్య(పెద్దమ్మ కొడుకు) విశాఖపట్నంలో ఉంటారు. ఇటీవల గ్యాస్ లీక్ ప్రమాదం సంభవించిన ప్రదేశానికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. ఆ ప్రమాదం గురించి తెలిసి అన్నయ్య క్షేమసమాచారం తెలుసుకుందామంటే సాయంత్రం వరకు అతని ఫోన్ కలవలేదు. మనసులో ఆందోళనగా ఉంది. రాత్రి ఎనిమిది గంటల తరువాత నేను బయట కారిడార్‌లో కూర్చుని బాబా పారాయణ చేసుకున్నాను. పారాయణ ముగించి పుస్తకం మూస్తూనే ఆకాశంలోకి చూశాను. అప్పుడే మబ్బులు వీడి చందమామ కనిపించాడు. ఆరోజు వైశాఖ పూర్ణిమ. పది నిమిషాల్లో అన్నయ్య, 'అంతా క్షేమం. వేరే మిత్రుల ఇంట్లో ఉన్నందువలన ఫోన్ చేయలేదు' అని మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చూశాక మనసు కుదుటపడి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం:

2020, జూన్ 4, శుక్రవారం నాటి సాయంత్రం నా స్నేహితురాలు వెన్నెలలో లలితా సహస్రనామం చదివితే మంచిదని చెప్పింది. అయితే ఆరోజు పలురకాల ఆలోచనలతో చదివే మనఃస్థితి నాకు లేదు. అయినప్పటికీ స్నేహితురాలు చెప్పిందని స్నానం చేసి దీపారాధన చేశాను. కానీ రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆకాశంలో మబ్బుల కారణంగా వెన్నెల జాడే లేదు. పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత బయటకు వెళ్లి చూస్తే, వెన్నెల వచ్చింది. గబగబా పాలు కాచి, అమ్మవారికి పెట్టి, బయటకు వచ్చి ఇరవై నిమిషాల్లో లలితా సహస్రనామ పారాయణ పూర్తి చేశాను. తరువాత మనసారా అమ్మవారికి నా బాధ చెప్పుకొని హారతి ఇవ్వగానే మళ్లీ మబ్బులు కమ్ముకున్నాయి. చిన్న జల్లు కూడా పడింది. అదే సమయంలో నేను ఫోన్లో మహాపారాయణకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ తెరచి చూస్తే ఆకుపచ్చరంగు శాలువా ధరించి ఉన్న బాబా ఫోటో దర్శనమిచ్చింది. ఆవిధంగా బాబా తమ ఆశీస్సులు తెలియజేశారని అనుకున్నాను. మర్నాడే ఒక చిన్న సమస్య పరిష్కారమైంది. అంతా బాబా దయ.

చివరిగా మరో అనుభవం:

నేను ప్రతిరోజూ బాబాకి, మిగతా దేవుళ్ళకి పూజచేసి మా కుటుంబం, అమ్మ, తమ్ముడు, ఇంకా బాబా ఇచ్చిన అన్నయ్య బాగుండాలని, తను నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. బాబా చిన్న చిన్న సానుకూల సందేశాలు ఇస్తున్నప్పటికీ ఒక సగటు మానవమాత్రురాలిగా నా మనస్సు చాలావరకు సందేహపడుతూనే ఉంటుంది. 2020, జూన్ 7 సాయంత్రం ఆరు గంటలప్పుడు నేను, మావారు కూరగాయలకు వెళ్లి వస్తున్న సమయంలో కూడా నా మనసు అవే ఆలోచనలతో దిగులుపడుతూ ఉంది. ఆ దిగులుతో నేను స్కూటర్ మీద ఎలా కుర్చున్నానో ఏమోగానీ, డ్రైవ్ చేస్తున్న మావారు, "బ్యాలన్స్ చేసి సరిగ్గా కూర్చో!" అని కోప్పడ్డారు కూడా. ఆ సమయంలో ఆంజనేయస్వామి ఆలయం నుండి "సాయినాథ్ తేరే హజారోం హాత్..." అన్న పాట వినపడింది. సాధారణంగా ఏ దేవుడి ఆలయమైతే, ఆ దేవుని పాటలే వేస్తారు. కానీ మారుతి ఆలయం నుండి బాబా పాట వినపడేసరికి అది నా కోసమే అని అనిపించింది. కానీ కాస్త కోపంగా, "ఇలాగే కంటితుడుపు పనులు బాగా చేస్తావు బాబా" అని తిట్టుకున్నాను. మళ్ళీ మరుక్షణమే, "ఆర్థికంగా, మానసికంగా పడుతున్న బాధలు తట్టుకోలేక ఏదో అనేశాను, నన్ను క్షమించండి బాబా" అని అనుకున్నాను. మరుక్షణంలో సందు మలుపు తిరిగేసరికి ఒక సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ దగ్గర ఆకుపచ్చని శాలువా ధరించి ఉన్న పెద్ద బాబా పటం దర్శనమిచ్చింది. ఆ క్షణంలో నా మానసికస్థితి ఎలా ఉండి ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా ఎన్నో నిదర్శనాలు ఇస్తూ నా మనసుకు సాంత్వన చేకూర్చడానికి బాబా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన దయ అటువంటిది.  

ఏ బాధ ఉన్నా బాబాకి చెప్పుకుంటే తగ్గుతుందని మా అమ్మ చెప్పేవారు. అదే భావంతో నేను నా బాధలను బాబాకి చెప్పుకుంటూ ఉంటాను. ఒకటి మాత్రం నిజం, మనం ఎంత ద్వేషించినా, పట్టించుకోకపోయినా మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండే ఒకే ఒక్క తోడు - దైవం. ఆ దైవాన్ని ఏ పేరుతో పిలుచుకున్నా సరే. "ఈ ప్రపంచాన్ని కొరోనా వైరస్ నుండి కాపాడండి బాబా!".

లోకాః సమస్తాః సుఖినోభవంతు.

ఓం సాయిరామ్!

బాబా కృప

నా పేరు సురేశ్. కటిక పేదరికంలో పుట్టిన నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగం మాత్రం రాలేదు. చివరికి విసిగిపోయిన నేను బాబాను ప్రార్థించి, "మీరు నాకు ఉద్యోగాన్ని ప్రసాదించినట్లైతే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను, మీకు కానుకలు చెల్లించుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అలా ప్రార్థించిన వెంటనే ఫలితాలు వెలువడి నాకు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత మా ఇంట్లో అందరికీ మంచి సంబంధాలు వచ్చి వివాహాలయ్యాయి. నాకు కూడా సభ్యత, సంస్కారం, చదువు, దైవభక్తి కలిగిన గొప్పింటి స్త్రీ భార్యగా లభించింది. ఇప్పుడు మా జీవితాలలో అసంతృప్తి అనేదే లేదు. ఈమధ్యనే బాబా మందిరంలో చాలామంది బీదవారికి మేము అన్నసమారాధన కూడా చేశాము. ఇన్ని సంతోషాలు ప్రసాదించిన బాబాకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo