సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 387వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవై ఒకటవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి ముంబాయిలో మా ఇంటినుండి మెంతి లడ్డూలు వచ్చాయి. వాటిని కొన్నిరోజులుపాటు వాటిని నియమంగా రోజుకి కొన్ని లడ్డూలే తిన్నాను. కానీ ఒకరోజు నోరు కట్టుకోలేక చాలా ఎక్కువ లడ్డూలు తినేశాను. అలవాటు ప్రకారం ఆ మధ్యాహ్నం బాబా వద్దకెళ్లి అక్కడున్న ఒక వేపచెట్టు వద్ద నిలబడ్డాను. లడ్డూలు మరీ ఎక్కువగా తిన్నందున బాబా నా చెంపమీద లెంపకాయలేస్తారేమోనని భయమేసి అక్కడినుండి ముందుకి కదలకుండా అలాగే నిలబడిపోయాను. అయితే వారేమీ అనకుండా వారి ఆసనం మీదే కూర్చున్నారు. అదేరోజు రాత్రి రాధాకృష్ణమాయి బాబాకి ఉపయోగించే వెండి గంగాళమూ, ఇటుకపొడీ ఇచ్చి, “దీన్ని తీసుకుని తూమువద్ద కూర్చొని బాగా మెరిసేలా తోము” అని చెప్పింది. ఎక్కువగా తినటం వల్ల సాయంత్రం పొట్ట బరువెక్కి బాధగా ఉంది. పైగా గిన్నెలు తోమే అలవాటు నాకు లేదు. అయినా మాయీ ఆదేశానుసారం రాత్రి 11, 12 గంటల వరకూ గంగాళం తోముతూనే ఉన్నాను. రాధాకృష్ణమాయి నిద్ర నుండి తిరిగి మేల్కొనే వరకూ నేను పాత్రలు తోముతూనే వున్నాను. ఇది చూసి, “ఇప్పుడు గిన్నెలు పరిశుభ్రమయ్యాయి. వెళ్ళి పడుకో” అని ఆమె ఆదేశించింది. ఆ రాత్రే ఆమె, "వామన్ గోండ్కర్ చాలా అనారోగ్యంతో ఉన్నాడ"ని చెప్పింది. మరుసటిరోజు తెల్లవారి ఆయన పరమపదించారన్న వార్త అందింది.

ఒకరోజు నేను శేరో, రెండుశేర్లో బెంగాలీ జామపళ్ళు తిన్నాను. అప్పుడు కూడా బాబాకు కోపం వస్తుందేమోనని నేను భయపడ్డాను. కానీ బాబా ఏమీ అనలేదు. ఒకరోజు చక్కెరసంచీలోంచి గుప్పిళ్ళ కొద్దీ చక్కెర తీసుకుని పదేపదే తినసాగాను. అది కండసారి చక్కెర. ఒకరోజు బాబా మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా, "ఒక వ్యక్తి నా దగ్గర నివసిస్తుండేవాడు. వాడు క్షయరోగంతో విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు. అతన్ని తెల్లవారుఝామున లేపి గుప్పెడు చక్కెర అతని నోట్లో వేసి, అతన్నొక గదిలో పెట్టి తలుపేశాను. అతడు నీళ్ళు కావాలని చాలా గొడవ చేశాడు. అయితే నేను వద్దన్న కారణంగా ఎవరూ అతని మాట వినిపించుకోలేదు. మధ్యాహ్నం అయ్యాక అతన్ని గది బయటకు తెచ్చి అన్నం పెట్టారు. దానివల్ల అతను ఆరోగ్యవంతుడయ్యాడు. చక్కెర తినాలని కోరిక ఉంటే కొంచెంగా తినాలి” అని చెప్పారు.

పైన చెప్పిన కథను బాబా నేను రోజంతా చక్కెర తినేముందు చెప్పారో, తరువాత చెప్పారో నాకు గుర్తులేదు. అయితే పిచ్చివాడిలా పగలంతా చక్కెర తినటం తప్ప మరో ఆలోచన వచ్చేది కాదు నాకు. అయితే బాబా ఏమీ అనలేదు. పైన చెప్పిన సంఘటన జరిగిన పదకొండు నెలల తర్వాత నేను శిరిడీ నుంచి బయలుదేరాను. అంతకు ఒకరోజు ముందు మా అక్కయ్య ఎవరి చేతికో లడ్డూలిచ్చి పంపిస్తే, వాటిని నాతోపాటు అలాగే వెనక్కి తీసుకెళ్ళాను.

నాకు రాధాకృష్ణమాయితో ఏదో పూర్వజన్మ అనుబంధం ఉండి ఉండొచ్చు. అందుకే ఆమె మొదటిరోజు నుండీ నన్ను గారాబం చేసేది. ఒకరోజు ఆమె నాతో, “వామన్, నీ కఫ్నీ చాలా మురికిగా ఉంది, దాన్ని నేను ఉతికిపెడతాను, ఈ లోపల నీవు స్నానం చేసెయ్” అన్నది. "రెండు మడతలతో చేసిన ముతక కఫ్నీ ఇది. మురికిపోతే పోవచ్చునేమో కానీ, ఆరటం ఎలా? ఆరతి సమయం కావొస్తోంది కదా” అన్నాన్నేను. “దాన్ని గురించి నువ్వేం బాధపడకు” అని ఆవిడ కఫ్నీ తీసుకెళ్ళింది. నా స్నానమయిన తరువాత నేను ఒళ్ళు తుడుచుకుంటుండగా ఆవిడ కఫ్నీ ఉతికి ఆరబెట్టి, “వామన్! ఇదుగో నీ కఫ్నీ, వేసుకో” అన్నది. కేవలం 10, 15 నిమిషాల్లో ఆవిడ ఆ పని ఎలా చేయగలిగారని నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఆవిడ ఎంతటి సిద్ధురాలో నాకు ఈ రకంగా చూపించారు. ఆవిడ సిద్ధురాలని అప్పుడూ అనుకున్నాను, ఇప్పుడూ అదే నమ్ముతున్నాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo